సామూహిక ఆర్తనాదం ‘యాన్ ఫ్రాంక్ డైరీ’

“సైకిల్ తొక్కుకుంటూ స్కూలుకు వెళ్ళాలి, స్నేహితులతో అడుకోవాలి, హాయిగా డాన్స్ చెయ్యాలి, గట్టిగా విజిల్ వెయ్యాలి , గలగలా నవ్వాలి, ఐస్ క్రీం తినాలి… గుండెల నిండా తాజా గాలిని పీల్చుకోవాలి …”
ఎంత చిన్నకోరికలు! పదమూడేళ్ళ ఒక బాలిక జీవితంలో ఎంత సహజమైన ఆకాంక్ష! అవి తీరే దారి కూడా లేక అలమటించి పోయింది యాన్ ఫ్రాంక్. హిట్లర్ పాలన సాగిన ప్రాంతంలో యూదులుగా పుట్టిన పాపానికి బందిఖానాల్లో మగ్గిన, ప్రాణాలు కోల్పోయిన లక్షలాదిమందిలో ఒక బాలిక యాన్ ఫ్రాంక్. అంత మందిలోనూ ఆమెను ప్రత్యేకంగా ప్రపంచం ముందు నిలిపింది మాత్రం ఆమె రచన, ”ద డైరీ ఆఫ్ ఎ యంగ్ గర్ల్” నే!

పదమూడేళ్ళ వయసు దాకా ఆమెది చీకూ చింతా లేని హాయైన జీవితం. ఫ్రాంక్ ఫర్ట్ నగరం లోని సంపన్న కుటుంబం. తండ్రి ఒట్టో ఫ్రాంక్ ది మంచి లాభాలతో నడిచే సొంత వ్యాపారం. ముద్దుగా చూసుకునే అమ్మా నాన్నలు, రెండేళ్లు పెద్దదైన అక్కయ్య మార్గో స్నేహం. ఆట పాటలతో సాగిపోయే అందమైన బాల్యం. ఇంట్లో అందరూ ఆమెను ఆనా, అని పిలిచే వారు.

జర్మనీ లో హిట్లర్ చాన్స్ లర్ గా నాజీ ప్రభుత్వం ఏర్పడింది. యూదుల నిర్మూలన లక్ష్యంగా జాతి విద్వేష పాలన మొదలైంది. ఆంక్షల నడుమ బతుకులు ఈడ్వలేక ఎందరో యూదులు ఇతర దేశాలకు తరలి పోయారు. ఒట్టో ఫ్రాంక్ కూడా కుటుంబాన్ని తీసుకుని నెదర్ లాండ్స్ కు మకాం మార్చాడు . కొంత కాలం ప్రశాంతంగానే సాగింది. నాజీ ప్రభుత్వ దురాక్రమణ నెదర్ లాండ్స్ ను కూడా హస్తగతం చేసుకోవటంతో యూదుల పరిస్థితి మళ్ళీ ప్రమాదంలో పడింది. ఆక్రమిత ప్రాంతాల్లోని యూదుల వివరాలను నమోదు చేసి కాన్సంట్రేషన్ క్యాంపులకు తరలిస్తున్నారు. కొందరు యూదులు దేశం నుండి పారిపోతుంటే మరికొందరు రహస్య స్థావరాల్లో తల దాచుకుంటున్నారు. ఒట్టో ఫ్రాంక్ కూడా కొందరు స్నేహితుల సహకారంతో కుటుంబాన్ని తీసుకుని రహస్య స్థావరానికి వెళ్లి పోయాడు.

అలా వెళ్ళడానికి కొద్ది రోజుల క్రితమే యాన్ ఫ్రాంక్ పదమూడో పుట్టిన రోజు వచ్చింది. బోలెడన్ని కానుకలు వచ్చాయి. అన్నిటిలోనూ ఆమెను అమితంగా ఆకర్షించింది ఎర్రటి అట్టలున్న ఒక డైరీ ! రెండు రోజుల్లోనే దానిలో దినచర్య రాయటం మొదలెట్టింది. ఐదారు రోజుల తర్వాత దానికి కిట్టీ, అని పేరు కూడా పెట్టింది – తనకు ఇష్టమైన స్నేహితురాలి పేరిట. అలా సరదాగా 14 జూన్ 1942న మొదలైన డైరీ రచన 19444 ఆగస్ట్ 1వ తేదీ వరకూ సాగింది.

“వెళ్లేటప్పుడు ఒక్క బ్యాగ్ లో పట్టేటన్ని వస్తువులు మాత్రమే తెచ్చుకోమన్నాడు నాన్న. మొదట డైరీ ,ఆ తర్వాత దువ్వెన, టవల్, స్కూల్ పుస్తకాలు, కొన్ని ఉత్తరాలు, బట్టలు సర్దుకున్నా “అని రాసుకుంది ఆనా. ఒక్కొక్కరూ ఒకదాని మీద ఒకటిగా మూడేసి జతల బట్టలు తొడుక్కున్నారు. వర్షంలో, మసక చీకటిలోబయల్దేరారు. తండ్రి వ్యాపారంలో భాగస్వామి మైప్ గైస్ వాళ్లను రహస్య స్థావరానికి చేర్చింది. అది ఒట్టో ఫ్రాంక్ ఆఫీసు భవనం లోని పై అంతస్థులో ఏర్పాటు చేసిన రెండు గదుల రహస్య ప్రదేశం. కింది గది లోని పుస్తకాల రాక్ వెనుక పైకి కనబడని ద్వారం గుండా ఆరోజు వెళ్లిన ఆ కుటుంబం రెండు సంవత్సరాల ముప్పై ఐదు రోజుల తర్వాత గెస్టపోలకు పట్టుబడే దాకా అందులోనే మగ్గి పోయారు.

అంత కాలంపాటూ ఆనా రాసుకున్న ఆ డైరీ ఆమె దినచర్య మాత్రమే కాదు _ఆమె భావోద్వేగాల ప్రతిఫలనం. ప్రతి క్షణం భయమే. గట్టిగా మాట్లాడడానికి లేదు, నడవడానికి లేదు, రేడియోలో వార్తలు వినాలన్నా సందేహమే. తండ్రి స్నేహితులు అతి కష్టమ్మీద తెచ్చిచ్చే చాలీ చాలని తిండి. నెలల తరబడి బటానీలూ, చిక్కుళ్లు తిని తిండి మీద విరక్తి. గాలీ, వెలుగూ లేక చుట్టుకున్న జబ్బులు. గట్టిగా దగ్గితే ఎవరికి వినబడుతుందో ననే భయం…ఇన్ని కష్టాలతో ఉన్న ఆ కుటుంబానికి తోడు వీళ్లలాగే తల దాచుకోటానికి వచ్చిన మరొక ఎనిమిది మంది యూదులు కూడా అక్కడే చేరారు. వాళ్ళలోని పీటర్ అనే పదహారేళ్ళ కుర్రాడు ఆనాకు మిత్రుడయ్యాడు .బాల్యం నుంచి తొలి యవ్వనం లోకి అడుగు పెడుతున్న తన మనశ్శరీరాలలో వస్తున్న కొత్త మార్పులను ఆనా డైరీలో. తన దుస్తులు బిగుతయి పోయాయి. మనసు పీటర్ సాన్నిహిత్యాన్ని కోరుతోంది. ఇద్దరి నడుమ అలకలు, కోపాలు, బతిమిలాటలు. ఇదేనా ప్రేమంటే? అని ఆలోచనలో పడింది. సుదీర్ఘ కాలం పాటు ఈ రహస్య జీవితం గడపటంతో అందరిలోనూ మానసిక ఒత్తిడి పెరిగి కలహించుకునే వారు. అది ఎవరికైనా వినబడుతుందనీ వణికి పోతారు. “మేం కలుగులో ఎలుకల్లా బతుకుతున్నాం… ఎక్కడికి పోతుంది ఈ జీవితం ?” ఒక గదిలోంచి మరొక గదిలోకి ఒంటరిగా, నిశ్శబ్దంగా తిరుగుతుంటే ఎలా ఉంటుందో తెలుసా? పాటలు పాడే పక్షిని రెక్కలు కట్టేసి పంజరంలో పెట్టినంత దుర్భరంగా !” అంటూ రాసుకుంది యాన్ ఫ్రాంక్.

ఇంత నైరాశ్యం మధ్యన కూడా జీవితేచ్ఛను కాపాడుకోడానికి ఆమె పడిన తపన ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆఫీసు లోని మిత్రుల సాయంతో లాటిన్, షార్ట్ హాండ్ నేర్చుకునేది. తమ గదులకు పైనున్న ఒక చిన్న అటక మీద కూర్చుని పుస్తకాలు చదువుతూ, డైరీ రాస్తూ గడిపేది. రేడియో వార్తలు వింటూ రాజకీయ పరిణామాలను అర్థం చేసుకునేది. ప్రకృతిలో గడపటాన్ని ఇష్టపడే ఆనా, ఈ స్థితిలో సైతం తన సౌందర్య స్పృహను పోగొట్టుకో లేదు. అటకపైనున్న చిన్న వెంటిలేటర్ గుండా ప్రకృతి దృశ్యాలను చూస్తూ, “వినీలాకాశపు కాన్వాస్ మీదికి అప్పుడప్పుడూ సీగల్ లూ, ఇంకేవో చిన్ని పక్షులూ వచ్చి పోతాయి. మబ్బు తునకలు బధ్ధకంగా నడిచి పోతాయి. సాయం సంధ్యలో సూర్యుడు బంగారు కిరణాలు వెదజల్లి పోతాడు. రాత్రి వేళల్లో చంద్రవంక చిరునవ్వు చిందిస్తుంది .”అంటూ అందమైన శైలిలో వర్ణిస్తుంది. కిటీకీ పక్కనున్న చెస్ట్ నట్ చెట్టులో వచ్చే మార్పులను చూస్తూ రుతువులను అంచనా వేసేది .

“ఈ ప్రపంచం క్రమంగా క్రూరంగా మారి పోతోంది. అది పిడుగుపాటులా అందరినీ ధ్వంసం చేస్తుంది . కానీ అలా ఆకాశం వైపు చూస్తుంటే, ఇదంతా మారి పోతుందని ఆశ కలుగుతుంది. ఈ క్రూరత్వం అంతమై దయ, శాంతి నెలకొంటాయి. ఆ రోజును నా కళ్ళతో చూస్తాననే ఆశ “. అని రాసుకున్న ఆనా ఆశ నెరవేర లేదు. 1944 ఆగస్ట్ 4 న నాజీలు వాళ్ళను అరెస్టు చేసి కాన్సంట్రేషన్ క్యాంపుకు తరలించారు. అక్కడే ఆమె మరణించింది. రెండవ ప్రపంచ యుధ్ధం లో జర్మనీ ఓడిపోయాక, నాజీల నిర్బంధ శిబిరాల నుండి యూదులు విడుదలయ్యారు. అలా బయట పడిన ఒట్టో ఫ్రాంక్ కు తన కుటుంబమంతా మరణించిన వార్త తెలిసింది. తమ స్థావరంలో దొరికిన ఆనా డైరీని కూడా ఆయన భద్ర పరిచాడు. డచ్ భాషలో ఆమె రాసిన ఆ రచన 1847 జూన్ 25న, అంటే సరిగ్గా 75 ఏళ్ళ కిందట మొదటి సారిగా ప్రచురితమైంది. ఆ తర్వాత 70కి పైగా భాషల్లోకి అనువాదమై ప్రపంచమంతటా లక్షల కాపీలు అమ్ముడు పోయింది. తమ అటక మీది కిటీకీ గుండా ఆనా చూసి వర్ణించిన ఆ చెస్ట్ నట్ చెట్టును నెదర్లాండ్స్ ప్రభుత్వం తమ జాతీయ సంపదగా గుర్తించి సంరక్షించింది. ఆ కిటీకీ నుండి ఆమెకు వెలుగునూ, వెన్నెలనూ పంచిన ఆకాశపు ముక్కను యాన్ ఫ్రాంక్ కు ఆ ప్రభుత్వం అంకితం ఇచ్చింది. రెండు సంవత్సరాలకు పైగా ఆమెకు ఆశ్రయమిచ్చిన ఆ భవనం యాత్రా స్థలమైంది.

ఆనా వంటి ఎందరో బాలల కలలూ, కోరికలూ అకాలంగా దగ్ధమై పోయిన దారుణం మాత్రం చెరపలేని పీడ కలగా చరిత్రలో నిలిచి పోయింది.

ఐతే, ఇప్పుడు …ఇంత కాలం తర్వాత ఆ డైరీతో ప్రపంచానికి ఉన్న సంబంధం ఏమిటి? అదొక చారిత్రిక పత్రం మాత్రమేనా? మనం దాన్ని చదవటం కాసిని కన్నీళ్లు కార్చటానికేనా?ఎంత మాత్రం కాదు! ఆ నాటి ఫాసిజం వేర్వేరు ప్రాంతాల్లో, వేర్వేరు రూపాల్లో కొన సాగుతూనే ఉంది. యుద్ధోన్మాదం, దురాక్రమణ కాంక్ష బాలల భవిష్యత్తును కాలరాస్తూనే ఉంది. ఇరాక్ లో, ఆఫ్ఘన్ లో, పాలస్తీనాలో, కశ్మీర్ లో అనాథలై, బందీలై బిక్కు బిక్కుమంటున్న బాలలు ఎందరిని చూస్తున్నాం? “బయటికి రా ! మనసారా నవ్వు ! స్వచ్ఛమైన ప్రాణవాయువును గుండెల నిండా పీల్చుకో ! అని నా లోపలి నుంచి ఎవరో పిలుస్తున్నట్టుగా ఉంటుంది “అని రాసుకున్న మాటలు ఒక్క యాన్ ఫ్రాంక్ వేనా? ఎందరు బాలల సామూహిక స్వరమది!

అందుకే ఈ డైరీ మనల్ని ఇంకా కలత పెడుతూనే ఉంది. యుద్ధాలున్నంత కాలం, దురాక్రమణలు సాగినంత కాలం ఆనా రచనకు ప్రాసంగికత ఉంటుంది. ఆధిపత్య రాజకీయాలను నిరసించమని హెచ్చరిస్తూనే ఉంటుంది.

నెల్లూరు జిల్లాలో పుట్టి పెరిగారు. ప్రస్తుతం హైదరాబాద్ లో నివాసం. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో తెలుగు సాహిత్యంలో పిఎచ్.డి చేశారు. సాహిత్యం, సామాజిక శాస్త్రాల అధ్యయనంలో, ముఖ్యంగా సాహిత్య విమర్శలో ఆసక్తి. మిత్రులతో కలిసి "చూపు" పత్రికను కొంతకాలం నిర్వహించారు. సాహిత్య, సాహిత్యేతర గ్రంథాల అనువాదం, రచన వంటి అంశాల్లో కృషి చేస్తున్నారు.

2 thoughts on “సామూహిక ఆర్తనాదం ‘యాన్ ఫ్రాంక్ డైరీ’

  1. యాన్ ఫ్రాంక్ డైరీ ఇంగ్లీష్ కాపీ చదివాను. మీరు చక్కగా క్లుప్తీకరించి రాసారు. ఇది చదివిన వాళ్లకు మూల గ్రంథాన్ని తప్పక చూడాలనే ఆసక్తి కలిగించారు.

Leave a Reply