మోడీ పాలనలో అన్ని రంగాలు తిరోగమనమే

మోడీ ప్రభుత్వం ఎనిమిదేళ్ల పాలనను పూర్తి చేసుకున్న సందర్భాన్ని బిజెపి, ఆర్‍ఎస్‍ఎస్‍ శ్రేణులు ఘనాతిఘనంగా, ఒక పెద్ద ఉత్సవ సందర్భంగా చెప్పుకుంటున్నారు. మోడీ ప్రభుత్వ పాలనలో దుర్భిణీ వేసి చూసిన ఒక్క మంచిపని కూడ కనిపించదని నిస్సందేహంగా, నిర్భయంగా చెప్పవచ్చు. ఎందువల్లనంటే ఎనిమిది సంవత్సరాల కాలంగా, మోడీ ప్రభుత్వం దేశంలో కార్పొరేట్‍ రంగానికి ఏకపక్షంగా అంకితమై సేవలందిస్తున్నది. పెట్టుబడిదారుల కోసం ఇంత నిస్సిగ్గుగా పనిచేసిన ప్రభుత్వాన్ని బ్రిటిష్‍ వలస పాలకుల నుంచి అధికార బదిలీ జరిగిన తర్వాత మన మెన్నడు చూడలేదు. మోడీ విధానాలతో ఆర్థిక వ్యవస్థ చరిత్రలో చూడనంత వేగంగా పతానవస్థకు చేరుకోన్నది. జిడిపి వృద్ధిరేటు అధఃపాతాళానికి పడిపోయింది. విదేశీ మారక నిల్వలు కరిగి పోతున్నాయి. ద్రవ్యోల్భణం ఎనిమిదేండ్ల గరిష్టానికి చేరింది. పారిశ్రామికాభివృద్ధి చెందలేదు. వ్యవసాయం సంక్షోభంలో ఉంది. నిరుద్యోగం 45 ఏండ్ల గరిష్టానికి చేరింది. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి.

ఎనిమిదేళ్లలో మోడీ ప్రభుత్వం వంద లక్షల కోట్ల అప్పు చేసింది. దేశాన్ని ఇంతగా అప్పుల ఊబిలో దించిన ఆయన పాలన ప్రజలకు ఏమి చేసిందంటే నిజానికి గుండుసున్నాయే కళ్ల ముందు ప్రత్యక్షమవుతుంది. 2016లో అమలు చేసిన పెద్దనోట్ల రద్దు దేశ ఆర్థిక వ్యవస్థలో, సామాన్య జన జీవనంలో ఎంతటి బీభత్సాన్ని సృష్టించిందో చెప్పనలవి కాదు. ఆక్రమ సంపదను వెలికి తీయడానికే పెద్ద నోట్ల రద్దును చేపట్టామని మోడీ చెప్పుకున్న గొప్పల బూటకం నగ్నంగా కళ్లకు కట్టింది. నిజానికి పెద్దనోట్ల రద్దు ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేసింది. జిఎస్‍టి (వస్తు సేవల పన్ను) అమలు చేస్తున్న తీరు విమర్శలకు గురవుతున్నది. కరోనా సమయంలో అమలు చేసిన లాక్‍డౌన్‍ పేదల ఉసురు తీసింది. రైతుల నోట్ల్లో మట్టికొట్టడానికి, వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్లకు అప్పగించడానికి ఉద్దేశించి తెచ్చిన మూడు సాగు చట్టాలు, కార్మికుల హక్కులను హరించే నాలుగు కోడ్స్, వస్తు సేవల పన్ను(జిఎస్‍టి) అమలు వలన ప్రజలకు మేలు కన్నా నష్టమే ఎక్కువ జరిగింది.

మోడీ ప్రజా వ్యతిరేక విధానాల వలన 84 శాతం ప్రజల రాబడి తగ్గిపోయింది. ధనికులు మాత్రం కోట్లల్లో లాభాలు గడించారు. 12 కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోయారు. 60 లక్షల సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమలు, దుకాణాలు మూతపడ్డాయి. కొవిడ్‍ విపత్తుతో ప్రజలు నానా బాధలు పడుతున్నప్పుడు దేశంలో ఆదానీ, అంబానీల సంపద రోజుకు 1000 కోట్లు పెరిగింది. అధిక ధరలతో, ఉపాధులు లేక కొనుగోలు శక్తి కోల్పోయి ప్రజలు అష్ట కష్టాలు పడుతుంటే దేశంలో కుబేరుల సంఖ్య పెరిగింది. 2016లో భారతదేశంలో 100 మంది బిలియనీర్లు ఉండగా, ఆ సంఖ్య 2021 నాటికి 166కి చేరింది. మోడీ అసమర్థతను, ప్రజా వ్యతిరేక విధానాలను కప్పి పుచ్చుకోవడానికి కులాల మధ్య, మతాల మధ్య చిచ్చురేపి, అందులో వారు మాడి మసి అయిపోతుంటే బిజెపి పాలకులు ఫాసిస్టు పాలనను కొనసాగించారు. దళితులు, మైనారిటీలపై కక్ష కట్టి సంఘ్‍ పరివార్‍ అకతాయి మూకలు సాగిస్తున్న దుర్మార్గాన్ని ఆపకుండా మోడీ ప్రభుత్వం మౌనంగా ప్రేక్షక పాత్ర వహిస్తోంది. మరోవైపు, దేశంలో బహుళత్వం స్ఫూర్తికి బిజెపి విఘాతం కలిగిస్తున్నది. ప్రజల మధ్య కుల, మత వైషమ్యాలు రెచ్చగొడుతున్నది. దేశాన్ని ఆర్థిక పరాధీన దిశకు తీసుకువెళ్తున్నది. తమ పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకోవటానికి ప్రజల దృష్టిని భావోద్వేగ, యుద్ధకాంక్షల వైపు మళ్లిస్తున్నది.

ప్రజలను మతోన్మాద మత్తులోకి నెట్టి, ప్రజా ఆస్తులైన ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటుకు చవకగా కట్టబెట్టే పనిని చాకచక్యంగా జరిపి వేస్తున్న ఘనత మోడీ ప్రభుత్వానిదే. ప్రజలను కొల్లగొట్టి పండగ చేసుకోవడమంటే ఇదే. సర్వ సమాన హక్కులు అనుభవిస్తున్న ముస్లింలను రెండవ తరగతి పౌరులుగా చేయడానికి మోడీ పాలనలో కరడుగట్టిన హిందూత్వవాదులు చేయని ప్రయత్నమంటూ లేదు. రాజ్యాంగం మీద, ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేని బిజెపి ప్రభుత్వం, సంఘ్‍ పరివారం తమ వ్యతిరేక గళాలను, కలలను అణచి వేయడానికి, తమకు నచ్చని వారిని కష్టాల పాలు చేయడానికి ఎన్ని కుయుక్తులు పన్నుతారో, చట్టాలను ఎలా తుంగలో తొక్కుతారో, చెప్పడానికి కేంద్రంలో మోడీ ప్రభుత్వం, వివిధ రాష్ట్రాల్లో బిజెపి నేతృత్వంలోని ప్రభుత్వాలు అమలుచేస్తున్న బుల్లోజర్‍ రాజ్యమే నిదర్శనం. ఈ విద్వేష విషానికి ఎక్కువగా బలయ్యేది మైనారిటీలే అన్న విషయం ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు. ప్రయాగ్‍ రాజ్‍, సహరన్‍పూర్‍, కాన్పూర్‍లలో ఇదే పరిస్థితి. విద్యార్థి నాయకురాలు అఫ్రిన్‍ ఫాతిమా నుండి, సిఎఎ, ఎన్‍ఆర్‍సి లను వ్యతిరేకించే వారు, ఆర్‍ఎస్‍ఎస్‍ విద్వేష విషాన్ని ప్రతిఘటించేవారు… ఇలా ఎవరైనా సరే బుల్లోజర్లను ఎదుర్కొక తప్పని పరిస్థితి ఏర్పడింది. బుల్లోజర్‍ అంటే ఇప్పుడు యంత్రం మాత్రమే కాదు. అది ఇప్పుడు విద్వేషానికి, విధ్వంసానికి చిహ్నం. హిందు మతోన్మాదుల చేతుల్లో ఆయుధం. ప్రజాస్వామ్యానికి, సమాన అవకాశాలకు, స్వేచ్ఛకు, లౌకికత్వానికి శత్రువు.

ఉత్తరప్రదేశ్‍లోని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‍ ప్రభుత్వం మరిన్ని మందిరం-మసీదు వివాదాలను రెచ్చగొట్టడానికి పథకం వేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. యోగి ఆదిత్యనాథ్‍ లక్నోలో మే 29న బిజెపి రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో మాట్లాడుతూ అయోధ్యలో బ్రహ్మాండమైన రామ మందిరం నిర్మాణం ప్రారంభమైన తర్వాత మన కర్తవ్య నిర్వహణకు మథుర, బృందావన్‍, వింధ్యవాసిని, నైమిష్‍ధామ్‍ వంటివి తిరిగి మేల్కొంటున్నాయని అన్నారు. అంటే వచ్చే లోక్‍సభ ఎన్నికల వరకు నిర్విరామంగా మత కల్లోలాలను రెచ్చగొట్టడానికి బిజెపి కార్యక్రమాన్ని సిద్ధం చేస్తున్నదని బోధపడుత్నుది. ఈ విధంగా ప్రజలను అత్యంత దారుణంగా విభజించి, వారి మెడలకు కోడి కత్తులు కట్టి ఒకరిపై ఒకరిని ఉసిగొల్పి ఆ రక్త ప్రవాహాల్లో స్నానం చేయడమే ప్రధాని మోడీ ప్రభుత్వ గొప్పతనమని భావించి సిగ్గుపడవలసి ఉంది.

దేశంలో ఆదాయం, సంపద పంపిణిలో అసమానతలు అనూహ్యంగా తీవ్రమవుతున్నాయి. ఆధిపత్య ధోరణులు బలపడుతున్నాయి. లింగ వివక్ష, జాత్యహంకారం, కుల వివక్ష, మైనారిటీల మీద దాడులు వికృతంగా పెరుగుతున్నాయి. అమానవీయత, పెత్తనం, క్రూరత్వం, హింస, నేటి వ్యవస్థ సహజ లక్షణాలైనాయి. ఇవన్నీ అత్యధిక ప్రజల జీవితాలను విధ్వంసం చేస్తున్నాయి. కొవిడ్‍ విలయంతో ఈ సంక్షోభం మరింత జటిలం అయ్యింది. గత మూడు దశాబ్ధాలుగా చేపట్టిన సామ్రాజ్యవాద ప్రపంచీకరణ ఆర్థిక విదానాల వినాశకర క్రమం గురించి చర్చించటాన్ని అభావం చేయడంతో పాటు సంపద సృజన, కేంద్రీకరణ, కుబేరుల సంఖ్య, సంపదలో పెరుగుదలే ముఖ్యం అన్న భావజాలాన్ని కూడా బలంగా ప్రచారం చేస్తోన్నారు. ప్రస్తుతం ఉనికిలో ఉన్న ఆర్థిక నిర్మాణాలే, వాటిని పెంచి పోషించిన ధోరణులే ఈ స్థాయిలో అసమానతలు తీవ్రం కావడానికి కారణం అన్నది అందరికీ తెలిసిందే. మనదేశ స్వాతంత్రోద్యమం బ్రిటన్‍లో వలే భూస్వామ్య శక్తులకు వ్యతిరేకంగా ప్రభవించిన ఉద్యమం వంటిది కాదు. వలస పాలకులతో దేశీయ దళారీ బడా బూర్జువా, బడా భూస్వామ్య వర్గాలు కుదుర్చుకున్న ఒప్పంద ఫలితంగా అధికార బదిలీ ఆగష్టు 15న జరిగింది. అందువల్లనే సంస్థానాదీశులకు రాజ భరణాలు, విదేశీ పెట్టుబడులకు రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చారు. 1935 ఇండియా చట్టం నకలే మన సిఆర్‍పిసి, సివిల్‍ సర్వీసు వ్యవస్థలు. దేశంలో ప్రజాతంత్ర విప్లవం పూర్తికాలేదు.

బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న తప్పుడు ఆర్థిక విధానాలు దేశాన్ని దివాళా దిశగా నడిపిస్తున్నవి. కేంద్ర బడ్జెట్‍ పత్రాల ఆధారంగా చూస్తే 2015-2021 మధ్యకాలంలో మోడీ ప్రభుత్వం 6.15 లక్షల కోట్ల రూపాయలను కార్పొరేట్‍ పన్ను చెల్లింపుదారులకు రద్దు చేసింది. కొవిడ్‍ సమయంలో 6 లక్షల కోట్ల రూపాయల ఉద్దీపనలు పరిశ్రమ యాజమాన్యాలకే అందించింది. ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం ప్రజల కండ్లు గప్పి కార్పొరేట్‍, ధనిక వర్గాల ప్రయోజనాల కోసం సేవలందిస్తూ, పేద ప్రజలను గాలికి వదిలేసింది. బహుశా ప్రజలు గుళ్ళు, మసీదులు, తాజ్‍మహల్‍, కుతుబ్‍మినార్‍ లాంటి సమస్యలు, కశ్మీర్‍ ఫైల్స్, పౌరసత్వ ప్రమాణాలలో మార్పుల వంటి మతపరమైన సమస్యల చుట్టూ తిరుగాలని ప్రభుత్వం భావిస్తున్నట్లుంది. ఈ నేపథ్యంలో నిరుద్యోగ రేటు ఏటికేడు పెరుగుతున్నది. టోకు ధరల ద్రవ్యోల్భణం 18 శాతం కాగా, రిటెల్‍ ద్రవ్యోల్భణం 7.8 శాతం నమోదైంది. ఇది 8 ఏండ్ల గరిష్ఠానికి చేరడం, రూపాయి మారకం విలువ జీవితకాల కనిష్ఠానికి పడిపోవడంపై ఆర్తికవేత్తలు ఆందోళన చెందుతున్నారు.

జాతీయ ఆదాయం, స్థూల దేశీయోత్పత్తి(జిడిపి) తైమాసిక ఫలితాలపై తాత్కాలిక అంచనాలను జాతీయ గణాంకాల కార్యాలయం మే 31న విడుదల చేసింది. ఆ సందర్భంగా విలేకరులతో మాట్లాడిన భారత ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు వి.అనంత నాగేశ్వరన్‍ మాటల్లో ఆర్థిక వ్యవస్థ భవిష్యత్తు విషయమై నిండు ఆశాభావం వ్యక్తమవలేదు. ఆర్థిక వ్యవస్థ ఇంకా గట్టెక్కలేదని ఆయనకు, ఇతర ఆర్థిక వేత్తలకు తెలుసు. కేంద్ర ఆర్థిక విధానాలపై ప్రముఖ వ్యాపారవేత్త, ఎస్‍కే రెస్టారెంట్స్ ప్రైవేట్‍ లిమిటెడ్‍ మాజీ సిఇవో మట్ట ట్విట్టర్‍లో ధ్వజమెత్తారు. 2014 మార్చి నాటికి రూ.53 లక్షల కోట్లుగా ఉన్న దేశ రుణ భారాన్ని నరేంద్రమోడీ సర్కారు గత ఎనిమిదేండ్ల నుంచి దారుణంగా పెంచుతున్నదని, దీంతో 2023 మార్చి నాటికి మొత్తం అప్పులు మరో రూ.100 లక్షల కోట్లు పెరిగి రూ.153 లక్షల కోట్లకు చేరనున్నాయని ఆయన వివరించారు.

2020 డిసెంబర్‍ నాటికి దేశ మొత్తం అప్పు- స్థూల దేశీయోత్పత్తి (జిడిపి) నిష్పత్తిలో 73.95 శాతానికి చేరిందని, మరోవైపు దేశంలో విదేశీ మారకద్రవ్య నిల్వలు 600 బిలియన్‍ డాలర్ల (రూ.46,49,190 కోట్ల) లోపే ఉన్నాయని మట్ట తెలిపారు. ఈ ఏడాది మార్చిలో దేశం నుంచి అత్యధిక ఎగుమతులు జరిగినప్పటికీ దిగుమతులు కూడా 24.21% పెరిగాయని, ఫలితంగా వాణిజ్య లోటు (ఎగుమతులు, దిగుమతుల విలువలో తేడా) 19.76% పెరిగి 18.51 బిలియన్‍ డాలర్లకు (రూ. 1,43,427 కోట్లకు) చేరిందని వెల్లడించారు. దీనితో పాటు ఈ ఏడాది సెప్టెంబర్‍ నాటికి 256 బిలియన్‍ డాలర్ల (రూ.19,83,654 కోట్ల) విదేశీ రుణాన్ని తిరిగి చెల్లించాల్సి ఉన్నదని, ఇలాంటి పరిస్థితుల్లో దిగుమతులు పెరిగితే ఆర్థికంగా దేశం మరింత దిగజారుతుందని హెచ్చరించారు.

దేశీయ బ్యాంకులు 2021 ఆర్థిక సంవత్సరంలో బడా వ్యాపారవేత్తలకు చెందిన రూ.2.02 లక్షల కోట్ల రుణాలను మాఫీ చేశాయి. 2014 నుంచి మాఫీ అయిన మొత్తం రుణాలు రూ.10.7 లక్షల కోట్లకు చేరాయి. వీటిలో 75% ప్రభుత్వ రంగ బ్యాంకులకు చెందినవే. ఈ రుణాలు తీసుకొన్నదెవరో, తిరిగి చెల్లించకుండా తప్పించుకొని తిరుగుతున్నదెవరో మనందరికీ తెలుసు. 2016 మార్చి నాటికీ 8.26 శాతంగా ఉన్న జిడిపి వృద్ధి రేటును ఆ తర్వాత పెద్దనోట్ల రద్దుతో నరేంద్ర మోడీ దారుణంగా దెబ్బతీశారు. ఫలితంగా జిడిపి వృద్ధిరేటు 2017లో 6.80 శాతానికి, 2018లో 6.53 శాతానికి, 2019లో 4.04 శాతానికి, 2020లో మైనస్‍ 7.96 శాతానికి దిగజారింది. 2021లో దీనంతటికీ కరోనా విపత్తు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కారణమని చెప్పడం సరికాదని రాజీవ్‍ మట్ట తన ట్వీట్‍లో పేర్కొన్నారు.

నిత్యావసర వస్తువుల ధరలు ఎనిమిదేళ్లుగా పైకే ప్రయాణం చేస్తున్నాయి. వంట నూనెలు లీటరు 200 రూపాయలకు చేరుకున్నాయి. కేంద్ర ప్రభుత్వ పౌరసరఫరాల లెక్కల ప్రకారమే గోధుమల ధరలు ఐదేళ్ల కాలంలో 24 శాతం, గోధుమపిండి 28 శాతం పెరిగింది. పప్పులు 20 నుండి 30 శాతం పెరుగుదలను నమోదు చేశాయి. బియ్యం 24 శాతం, కందిపప్పు 21 శాతం, పెసరపప్పు 29 శాతం ధరలు పెరిగాయి. వంటనూనెల విషయానికొస్తే ఐదేళ్ల కాలంలో పామ్‍ఆయిల్‍ అత్యధికంగా 128 శాతం పెరిగింది. వనస్పతి 112 శాతం, సన్‍ఫ్లవర్‍ 107 శాతం, సోయా 101 శాతం, ఆవనూనె 71 శాతం, వేరుశనగ నూనె ధర 41 శాతం పెరుగుదలను నమోదు చేసింది. ఇక పెట్రోలు, డీజిల్‍, గ్యాస్‍ ధరల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వంట గ్యాస్‍ ధర ఏడాది కాలంలోనే 76 శాతం పెరిగింది.

ప్రధాని మోడీ ఆర్భాటంగా 2014 సెప్టెంబర్‍ 25 ప్రకటించిన ‘మేర్‍ ఇన్‍ ఇండియా’ ప్రచారంగానే మిగిలింది. ఉపాధి పెంపు, విదేశాలకు ఎగుమతులు, దిగుమతుల తగ్గింపు దాఖలాలు కనిపించడం లేదు. కొత్త పరిశ్రమలు రాలేదు. ఉన్న పరిశ్రమలే మన దేశం నుంచి వెళ్లి పోతున్నాయి. 2022 నాటికి మన పారిశ్రామిక ఉత్పత్తి వాటా జిడిపిలో 25 శాతానికి పెరుగుతుందని ప్రకటించారు. వాస్తవంలో మన పారిశ్రామిక ఉత్పత్తి వాటా జిడిపిలో తగ్గింది. శ్రామికుల సంఖ్య కూడ తగ్గింది. కరోనా విపత్తు కారణంగా కుదేలైన దేశ ఆర్థిక వ్యవస్థను గాడిన పెడుతామంటూ కేంద్రం ప్రకటించిన 20 లక్షల కోట్ల ఆత్మనిర్భర్‍ భారత్‍ ప్యాకేజీ సాధించిందేమీ లేదని తేలిపోయింది. ఆత్మనిర్భర్‍ భారత్‍ను ప్రకటించినప్పుడు ఆర్థిక వ్యవస్థ, మౌలిక సదుపాయాలు, సాంకేతికత, ఉపాధి అవకాశాలు వంటి అన్ని రంగాలు ప్రగతిని సాధించే లక్ష్యంగా ప్రకటించారు. అందుకుగాను దేశీయ పరిశ్రమను తయారీ సామర్థ్యాన్ని పెంచడమే దీని ఉద్దేశమని కేంద్రం గొప్పగా చెప్పుకున్నది.

ఆత్మ నిర్భర్‍ ద్వారా స్వావలంబన సాధించి ఏదేశంపై ఆధారపడకుండా స్వయం ఆధారితంగా ఎదగడమే ధ్యేయంగా ప్రకటించారు. ఈ ప్యాకేజీ ఉత్పత్తిదారులకు ప్రోత్సాహకాలు ప్రకటించింది కానీ వినియోగదారులను పట్టించుకోలేదు. ఫలితంగా ప్రజల కొనుగోలు శక్తి ఏమాత్రం పెరుగలేదు. ఎగుమతులు, దిగుమతులపై ఇటీవల కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నివేదిక ప్రకారం దేశంలోని అన్ని రంగాలూ తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయాయని స్పష్టమవుతున్నది. సహజంగా ఆర్థికాభివృద్ధితో ఉత్పాదకత పెరిగి ఉద్యోగాలు లభిస్తాయి. దీనిపైనే దేశ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం దేశ ఆర్థికవ్యవస్థ తిరోగమనంలో ఉండగా, కేంద్రం మాత్రం ఆత్మనిర్భర్‍ భారత్‍ నినాదంతో ప్రజలను బురిడీ కొట్టిస్తున్నదని ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు.

భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్య చరిత్రలో ఎన్నడులేని చీకటి అధ్యాయం నేడు కొనసాగుతున్నది. కేంద్రంలో మోడీ నేతృత్వంలో అతి జాతీయవాద, చాందసవాద బిజెపి అధికారం చేపట్టి ఎనిమిదేండ్లయింది. ఈ కాలంలో బిజెపి చేసింది విద్వేష రాజకీయాలు, పొరుగు దేశాలతో ఘర్షణలు, కార్పొరేట్లకు దేశ సంపదను దోచిపెట్టడం, ఉద్దేశపూర్వక వివాదాల్లో ప్రజల భావోద్వేగాలను రెచ్చగొట్టడం తప్ప ప్రజలకు చేసిన మేలు ఏమిలేదు. ‘ఆక్స్ఫామ్‍’ సంస్థ నివేదిక ప్రకారం భారత్‍లో 10 శాతంగా ఉన్న ధనవంతుల వద్ద 77 శాతం జాతీయ సంపద ప్రోగుపడింది. 13.6 కోట్ల ప్రజలు 2014 నుంచి అప్పుల పాలై దుర్భర దారిద్య్రాన్ని అనుభవిస్తున్నారు. భారత్‍లో బిలియనీర్ల సంపద ఏటా 39 శాతం పెరుగుతున్నది. ప్రజాస్వామ్య స్ఫూర్తిని ఆచరిస్తున్న లాటిన్‍ అమెరికా దేశాలు, ఆగ్నేయాసియా దేశాలు ఆర్థికరంగంలో స్వావలంబన కోసం ప్రయత్నిస్తున్నాయి. ప్రభుత్వ ఆధీనంలోనే కీలక పరిశ్రమలను స్థాపిస్తున్నాయి. దేశ, విదేశీ పెట్టుబడుదారుల ఆధీనంలో ఉన్న పరిశ్రమలను జాతీయ చేశాయి. సంపన్నులపై అధిక పన్నులు విధించడం ద్వారా వచ్చిన ఆదాయంతో తమ ప్రజల జీవన ప్రమాణాలను పెంచుకుంటున్నాయి. బ్రిటిష్‍ వలస పాలకుల నుండి అధికార మార్పిడి జరిగిన తర్వాత ప్రభుత్వరంగాన్ని బలోపేతం చేసే లక్ష్యంతో గత ప్రభుత్వాలు స్థాపించిన పరిశ్రమల నుంచి పెట్టుబడుల ఉపసంహరణ కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసిన ఘనత బిజెపి ప్రభుత్వానిదే.

భారత్‍లో 47 కోట్ల మంది శ్రామికుల్లో కేవలం మూడు కోట్ల మందే సంఘటిత రంగంలో పనిచేస్తున్నారు. మొత్తం శ్రామికుల్లో 47 శాతం స్వయం ఉపాధి పొందుతున్నారు. 33 శాతం సాధారణ కార్మికులు, 17శాతం సాధారణ ఉద్యోగులు, మూడు శాతం ఒప్పంద శ్రామికులు, ఈ సంఖ్యలు దేశంలోని ఉపాధి అవకాశాల్లో డొల్లతనాన్ని పట్టి చూపుతున్నాయి. ఆర్థిక నిపుణులు భారతదేశ ఆర్థికవృద్ధిని ‘ఉపాధి రహిత వృద్ధి’గా అభివర్ణిస్తున్నారు. మన దేశ శ్రామికశక్తిలో కనీసం పదిశాతానికైనా సంఘటిత రంగంలో సామాజిక భద్రత కల్పించే ఉద్యోగాలు లేవు. తక్కిన ఎన్నో ఆసియా దేశాలతో పోలిస్తే భారత్‍లో పనిలో స్త్రీల భాగస్వామ్యం తక్కువగా ఉంది. రాష్ట్రాల మధ్య ఈ అసమానత కనిపిస్తుంది. అత్యధిక జనాభా కలిగిన ఉత్తరప్రదేశ్‍లో ప్రతి వంద మంది పురుషులకు కేవలం 20 మంది మహిళలే వేతనంతో కూడిన ఉపాధి పొందుతున్నారు. సంపాదనకు సంబంధించి లింగ దుర్విచక్షణ కంటే కులాల అంతరం ఎక్కువగా ఉంది.

స్వపాలన వచ్చి 75 ఏళ్లు గడిచినా..దళితులు, ఆదివాసులు తక్కువ జీతాలు పొందే వృత్తుల్లో ఎక్కువగా ఉన్నారు. వారి సంపాదన అగ్రవర్ణ కార్మికుల వేతనాల్లో సగమే! వ్యవస్థీకృత రంగంలోనూ పరిస్థితి ఏమంత అశాజనకంగా లేదు. తయారీ రంగంలో కార్మికుల ఉత్పాదకత 30 ఏళ్ల క్రితంతో పోలిస్తే ప్రస్తుతం ఆరు రెట్లు పెరిగింది. అదే సమయంలో నిర్వాహకులు, పర్యవేక్షకుల జీతాలు మూడు రెట్లు అధికమయ్యాయి. కార్మికుల వేతనాలు కేవలం 1.5 రెట్లు మాత్రమే పెరిగాయి. ఇక దేశ జిడిపిలో వ్యవసాయ రంగం వాటా 1950-51లో 57 శాతం ఉంది. 60 శాతం ప్రజలకు ఉపాధి కల్గించేది. 2021-22 వచ్చే నాటికి అది జిడిపిలో 16 శాతానికి తగ్గింది. అయినా ఇప్పటికి 55 శాతం మందికి వ్యవసాయమే జీవనాధారంగా ఉంది. దేశంలోని రైతుల స్వల్ప ఆదాయాలకు, పడిపోతున్న జీవన ప్రమాణాలకు ఈ స్థితి అద్దం పడుతోంది. వ్యవసాయంపై ప్రభుత్వ వ్యయం క్రమంగా తగ్గుతోంది.

ఇవాళ భారతదేశం అన్ని అంశాల్లోనూ తిరోగమన దిశలో ప్రయాణిస్తున్నదని పలు అంతర్జాతీయ సర్వేలు వెల్లడించాయి. ప్రభుత్వం మాత్రం అంత బాగుందని గొప్పగా ప్రచారం చేసుకుంటున్నది. అదే సమయంలో ప్రతికూలంగా ఉన్న సర్వేలను తిట్టి పోస్తున్నది. ప్రగతికి కొలమానాలుగా భావించే పలు జాతీయ, అంతర్జాతీయ సూచీల్లో మన దేశ పురోగమనం నేలచూపులు చూస్తున్నది. ఐరాస ప్రతియేటా విడుదల చేసే మానవాభివృద్ధి సూచికలో భారత్‍కు 131వ స్థానం లభించింది. ఆదాయం, ఆరోగ్యం, విద్య ప్రాతిపదికగా ఈ సూచికను రూపొందిస్తున్నారు. ‘ఇంటర్నేషనల్‍ ఫుడ్‍ పాలసీ రీసెర్చ్ ఇన్‍స్టిట్యూట్‍’ వెలువరించిన ప్రపంచ పోషకాహార సూచీ-2021 ప్రకారం పోషకాహార లోపంతో ఎత్తుకు తగిన బరువు లేని 2.5 కోట్ల మంది బాలలకు భారత్‍ నిలయంగా మారింది. అవర్‍ వరల్డ్ సంస్థ 2017లో విడుదల చేసిన నివేదిక ప్రకారం దేశంలో 57 కోట్ల మంది కనీస పోషకాహారాన్ని కొనుగోలు చేయలేని స్థితిలో ఉన్నారు. 2021 డిసెంబర్‍ నాటికి ఈ సంఖ్య 100 కోట్లకు చేరింది. సెంటర్‍ ఫర్‍ సైన్స్ అండ్‍ ఎన్విరాన్మెంట్‍ తాజా నివేదిక దేశంలో ఏటా 17 లక్షల మంది పోషకాహారం అందక మరణిస్తున్నారని తెలిపింది. పోషకాహార లోపం మనిషిని బలహీనం చేయడమే కాదు… అనేక వ్యాధులకు (క్యాన్సర్‍, హృద్రోగం, శ్వాసకోశ, మధుమేహాం) కారణమవుతున్నది.

అంతర్జాతీయ సంస్థలు యేటా విడుదల చేసే సూచీలన్నింట్లో భారత్‍ దిగజారుడునే ప్రదర్శిస్తుంది. పర్యావరణ పరిరక్షణ సూచిక-2021లో 188 దేశాలలో భారత్‍కు 155వ స్థానం లభించింది. ప్రజాస్వామ్య పునాదులపై ఏర్పడ్డ దేశంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడంలోనూ కేంద్రం పూర్తిగా విఫలమైంది. ఇందుకు ‘డెమోక్రసీ నౌ’ ఇండెక్స్ తార్కాణం. ప్రజాస్వామ్య సూచీలో ఎనిమిదేండ్లలో ఏకంగా 20 స్థానాలు దిగజారింది. 2014లో 33వ స్థానంలో ఉండగా ఈ ఏడాది 53వ స్థానానికి పడిపోయింది. అవినీతి సూచీలో 2014లో 70వ స్థానంలో నిలిచిన భారత్‍, 2021లో 85వ స్థానం పొందింది. యుఎన్‍ సుస్థిరాభివృద్ధి నివేదికలో భారత్‍ 2015లో 117వ స్థానంలో ఉండగా 2021 నాటికి 139వ స్థానానికి దిగజారింది. పత్రిక స్వేచ్ఛలో భారత్‍ది 142వ స్థానం. మానవ స్వేచ్ఛ సూచీలో 2015లో 75వ స్థానంలో ఉండగా(ఈ సూచీని చట్టబద్ధ పాలన, మతస్వేచ్ఛ, పౌరహక్కులు ఆధారంగా రూపొందిస్తున్నారు) 2021 నాటికి 111వ స్థానానికి పడిపోయింది.

ప్రభుత్వం ఎన్ని రకాలుగా, ఎంత భారీగా పెట్టుబడిదారులకు రాయితీలు కల్పించినప్పటికీ మార్కెట్‍లో స్థూలంగా డిమాండ్‍ పెరగకపోతే (ప్రజల కొనుగోలు శక్తి పెరగకపోతే) ఎటువంటి కొత్త పెట్టుబడులూ రావని, కొత్త పెట్టుబడులు రాకపోతే ఆర్థిక వ్యవస్థ కోలుకోదని వారు అర్థం చేసుకోలేకపోతున్నారు. మార్కెట్‍లో కొనుగోలు శక్తి పెరగాలంటే ప్రభుత్వ వ్యయం పెరగాలి. అందుకోసం అవసరమైన సొమ్మును ద్రవ్యలోటు పెంచడం ద్వారా కాని, పెట్టుబడిదారుల మీద అదనపు పన్నులు విధించి కాని సమకూర్చుకోవాలి బొత్తిగా ఆర్థిక వ్యవహారాలపై అవగాహనలేని ఈ హిందూత్వ నేతలు తమ నాయకుడు మోడీ నడుపుతున్న ప్రభుత్వం కూలబడుతున్న ఆర్థిక వ్యవస్థను తిరిగి నిలబెట్టడానికి చేయగలిగిన అన్ని ప్రయత్నాలనూ చేస్తున్నదని, అయినా ఆర్థిక వ్యవస్థ దుస్థితి కొనసాగుతూనే ఉందని అమాయకత్వాన్ని ప్రదర్శిస్తున్నారు.

బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా దేశాన్ని భ్రష్టు పట్టించింది. అటు కార్పొరేట్‍ సేవలో, ఇటు మతవిద్వేష జ్వాలలను రగల్చడంలో మునిగి తేల్తోంది. తనకు తందానా అనే కార్పొరేట్‍ మీడియా తోడుగా ఉండడంతో ప్రచారార్భాటంతో ప్రజానీకాన్ని భ్రమల్లో ముంచగలనని భావిస్తోంది. ప్రశ్నించే గొంతులను పెగలన్వికుండా నొక్కిపెట్టడమే తమ విధానంగా నిరంకుశ పాలన సాగిస్తోంది. ఇటువంటి సమయంలో ఆ ప్రభుత్వాన్ని గద్దె దించి ప్రత్యామ్నాయాన్ని నెలకొల్పడం అత్యంత అవశ్యం అన్న విషయంలో ప్రజాస్వామికవాదులలో ఎటువంటి భిన్నాభిప్రాయమూ ఉండనవసరం లేదు. బిజెపి ప్రభుత్వాన్ని గద్దె దించాలని వామపక్షాలు, కాంగ్రెసు, ప్రాంతీయ పార్టీలు అన్ని అంటున్నాయి. అయితే వీరి దగ్గర ప్రత్యామ్నాయ ఆర్థిక విధానం లేదు. పరస్పరం దూషించుకోవడం, ఆరోపణలు చేసుకోవడం తప్ప ప్రజల విశ్వాసం చూరగొనే ప్రత్యామ్నాయం చూపడం లేదు.

హిందూత్వ శక్తుల మత విద్వేష, ఫాసిస్టు ధోరణులకు, కార్పొరేట్‍ సంస్థల విచ్చలవిడి దోపిడీకి నడుమ ఇంత గట్టి బంధం ఏర్పడిందంటే దానికి కారణం సామ్రాజ్యవాద ప్రపంచీకరణ ఆర్థిక విధానాలను ఎలాగైనా కొనసాగించాలనే కాంక్షే. దేశ, విదేశాల శత కోటీశ్వరులకు, వారి వెన్నుదన్నుగా ఉన్న అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడికి, సామ్రాజ్యవాద శక్తులకు ఈ కాంక్ష బలంగా ఉంది. మత విద్వేష వివాదాల దిశగా ప్రజల దృష్టిని మళ్ళించగలిగే హిందూత్వ శక్తుల పట్ల అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి, బడా కార్పొరేట్లు ఇంత సానుకూలంగా వ్యవహరించడానికి ఇదే కారణం. కార్పొరేట్‍ శక్తులకు, హిందూత్వ శక్తులకు మధ్య సమన్వయక కర్తగా మోడీ ప్రభుత్వం పనిచేస్తోంది. తీవ్రమైన ఆర్థిక సంక్షోభం వచ్చినప్పుడు కార్పొరేట్‍ శక్తులు ఆ సంక్షోభం వలన తమ ప్రయోజనాలు దెబ్బతినకుండా ఉండేట్టు, తమ లాభాలను పెంచుకునేందుకు, తమ ఆధిపత్యాన్ని నిలుపుకునేందుకు ఫాసిస్టు స్వభావం కలిగిన శక్తులతో జతకడుతుంది. కొవిడ్‍ కష్టకాలంలో మోడీ నియంతృత్వ పాలన, కుబేరుల సంపద పెరగడం మనం చూస్తునే ఉన్నాం.

మోడీ పాలనలో సామ్రాజ్యవాద ప్రపంచీకరణ ఆర్థిక సంస్కరణలు అమలు చేయడం, మతోన్మాద ఆర్‍ఎస్‍ఎస్‍-కార్పొరేట్‍ శక్తులను ఐక్యం చేయడం ద్వారా దేశ సంపదను కొల్లగొట్టడం, ఆశ్రిత పెట్టుబడిదారీ విధానాన్ని ప్రోత్సహించడం, అవినీతిని చట్టబద్ధం చేయడం, పూర్తిస్థాయిలో హిందూత్వ ఫాసిస్టు నియంతృత్వాన్ని కొనసాగించడం వంటి చర్యల ద్వారా బహుముఖంగా రైతులపై, కార్మికులపై, పేదలపై దాడి చేస్తున్నది. మన దేశంలో బిజెపి, ఆర్‍ఎస్‍ఎస్‍లు ఏనాడు పెట్టుబడిదారీ, భూస్వామ్య విధానానికి వ్యతిరేకంగా వ్యవహరించలేదు. అంతేగాదు అమెరికా సామ్రాజ్యవాదానికి లొంగుబాటు ప్రదర్శిస్తున్నది. మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న సామ్రాజ్యవాద ప్రపంచీకరణ ఆర్థిక విధానాలు ఆర్థిక సంక్షోభాన్ని పరిష్కరించలేవు. కనుక అంతకంతకూ ప్రపంచీకరణ అవుతున్న పెట్టుబడి విధానానికీ, జాతీయ సరిహద్దులకే పరిమితమైన కార్మిక, కర్షక, యువత జీవిత అవసరాలకు మధ్య నున్న వైరుద్యం పలు పోరాట రూపాల్లో వ్యక్తమవుతున్నది. అయితే సామ్రాజ్యవాద అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి ఈ వైరుద్యాన్ని అధిగమించడానికి దేశీయ పాలకవర్గాలను అనుమతించదు. కనుక సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేకించడమే దేశ ప్రజల ముందున్న ఏకైక కర్తవ్యం.

ఇవాళ మోడీ ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలను రైతులు, కార్మికులు, ప్రజాస్వామ్య-లౌకికవాదులు వ్యతిరేకిస్తున్నారు. అయితే మోడీ ప్రభుత్వ విధానానికి ప్రత్యామ్నాయం ఏర్పడాలని కోరుకునేవారు ముందు సామ్రాజ్యవాద ప్రపంచీకరణ విధానాలకు ప్రత్యామ్నాయాన్ని రూపొందించాలి. అదే సమయంలో మతవిద్వేషపూరిత, నిరంకుశ విధానాలకు ప్రజాస్వామ్య ప్రత్యామ్నాయాన్ని కూడ రూపొందించాలి. ప్రజలకు అభివృద్ధిలో భాగస్వామ్యం, అందరికి స్వేచ్ఛ, అభివృద్ధికి అవకాశాలు లభించే ప్రత్యామ్నాయం రూపొందించాలి. ఆ ప్రత్యామ్నాయం చుట్టూ విశాల ప్రజానీకం మద్ధతు కూడగట్టాలి. ఇది కేవలం ఎన్నికల ఎత్తుగడలతోటే సాధ్యమయ్యేది కాదు. అయితే ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని ఎన్నుకోవలసినది సామాన్య ప్రజలు అన్న విషయాన్ని మాత్రం మరిచిపోకూడదు. పీడిత ప్రజల్లో వర్గ చైతన్యం పెంచాలి. సామ్రాజ్యవాద దోపిడీని, పీడనను వ్యతిరేకిస్తామని, ప్రధాన ఉత్పత్తి రంగాలను ప్రభుత్వ యాజమాన్యంలో కొనసాగిస్తామన్న హామీని ప్రజలకు ఇవ్వాలి.

క‌డ‌వెండి, జ‌న‌గామ జిల్లా. ఉపాధ్యాయ ఉద్య‌మ నాయ‌కుడు. సామాజిక‌, రాజ‌కీయార్థిక విశ్లేష‌కుడు.

Leave a Reply