పనిమనిషిగా మారిన ఒంటరి తల్లి పోరాటం -మెయిడ్ సిరీస్ 

నిద్ర పోతున్న సహచరుడిని తన పెద్ద పెద్ద కళ్లను ఆర్పకుండా అలెక్స్ చూస్తూ వుండటంతో ‘మెయిడ్’ ఆంగ్ల సిరీస్ ప్రారంభం అవుతుంది. అలా చూడటం ప్రేమతో కాదు. అతను నిద్ర పోగానే అక్కడ నుండి పారిపోవటానికి. పార్టనర్ సియాన్ నిద్ర పోయాడని నిర్ధారణ అయ్యాక, పిల్లిలాగా లేచి ‘నాకు నిద్రొస్తుందమ్మా’ అంటున్న రెండేళ్ల కూతుర్ని చంకనేసుకొని ఇంట్లోంచి బయట పడుతుంది. ఇంటి బయట పడివున్న గాజు పెంకుల్ని జాగ్రత్తగా తప్పించుకొని, కారులో పాపనేసుకొని, నిద్ర లేచి వచ్చి చొక్కా లేకుండా అడ్డంగా నిల్చున్న సియాన్ నుండి తప్పించుకొని -ఆమె ఆ ఇంటి నుండి పారిపోతుంది. 

ఇది నెట్ ఫ్లిక్స్ సిరీస్ లన్నిటిలాగా ఏదో సస్పెన్స్, థ్రిల్లర్ అనుకొంటే పొరపాటు. ఆమె పారిపోతుంది గృహహింస నుండి. తన పార్టనర్ నుండి. ఇంకా లెక్కలు తేలని, ఎవరూ తేల్చటానికి పూనుకోని అసంఖ్యాక మహిళలు -ప్రపంచవ్యాప్తంగా అనుభవిస్తున్న బాధ నుండి ఆమె పారిపోయింది. ఈ కథ అమెరికా యువతిది అయినా, ఇలాంటి బాధను చవి చూడని దేశం ఏదైనా వుందా? ఈ  భూమండలం మీద మహిళల మీద హింస జరగని సూది మొనంత స్థలం వుందా?

సియాన్, అలెక్స్ కలిసి జీవిస్తుంటారు. వాళ్లకు లీగల్ గా పెళ్లి అయినా, కాకపోయినా పుట్టిన బిడ్డ మీద ఇద్దరికీ హక్కు వుంటుంది. అమెరికన్ కోర్టులు పిల్లల పెంపకానికి ఆర్థిక స్థితిగతుల గురించి మాత్రమే పంచుకొంటాయి కానీ, తల్లికి బిడ్డతో వుండే భావోద్వేగపరమైన బంధాన్ని పట్టించుకోవు. ‘పాపకు నువ్వే తల్లివనే నిరూపణ ఏదైనా వుందా?’ కోర్టు లాగానే అడుగుతుంది ఒక సంరక్షణాధికారి. ‘నా పొట్ట సాగిన గుర్తులు చూపించమంటే చూపిస్తాను’ అంటుంది అలెక్స్. 

‘నీకు ఏదైనా పనిలో నైపుణ్యం వుందా?’ అని అడుగుతుంది సంక్షేమశాఖ అధికారి అలెక్స్ ను. స్కూలు సమయంలోనే ప్రేమలో పడి, తరువాత పాపను కని, పాపే జీవితంగా బతుకుతున్న తను ఏ రంగంలో నిపుణత సాధించినట్లు? తనకు తెలిసింది ఇల్లు శుభ్రం చేయటమే. అందుకే పనిమనిషిగా మారిపోతుంది అలెక్స్.

Maid: Hard Work, Low Pay, and a Mother’s Will to Survive అనే Stephanie Land రాసిన ఆత్మకథ ఆధారంగా ‘మెయిడ్’ సిరీస్ ను తీశారు. 2021 నుండి నెట్ ఫ్లిక్స్ లో ఈ సిరీస్ ప్రసారం అయింది. మెయిడ్ అంటే పనిమనిషి. ఇంటి నుండి బయటకొచ్చిన ఒక యువతి, బతకటానికి ‘పని మనిషి’గా మారుతుంది. ‘వాల్యూ మెయిడ్’ అనే కన్సల్టెన్సీ ద్వారా పనికి కుదిరి ఇంటికి 50 డాలర్లకు ఒప్పుకొని ఇళ్లు శుభ్రం చేయటానికి వెళుతుంది. అందులో 12.5 డాలర్లు కన్సల్టెన్సీకి పోతే  37.50 డాలర్లు ఆమెకు అందుతాయి. అందులోనే ఆమె శుభ్రం చేసే యాసిడ్లు, పౌడర్లు, లిక్విడ్స్, చేతి తొడుగులు కొనుక్కోవాలి. భారీ సైజులో వుండే వాక్యూమ్ క్లీనర్ ను మాత్రం కన్సల్టెన్సీ ఇస్తుంది. 

అమెరికాలోని ఫ్లోరిడాలో మైమా బీచ్ ఉన్న ద్వీపంలో ధనవంతుల నివాసాలకు ఆమెను శుభ్రం చేయటానికి పంపుతుంటారు. ఆ జంబో వాక్యూమ్ ఒక భుజం మీద, ఇంకో వైపు పాపనూ మోస్తూ సినిమా అంతా కనిపిస్తుంది కథానాయకురాలు అలెక్స్. వేషం, రంగు వేరైయుండవచ్చు. పిల్లల్ని నడుంకూ, వీపుకూ కట్టుకొని పనికి వెళ్లే భారతీయ శ్రామిక మహిళలు గుర్తుకు వస్తారు ఆమెను చూస్తుంటే.  

పాప మేడీతో, చేతిలో 18 డాలర్లతో, ఒక డొక్కు కారుతో పారిపోయిన అలెక్స్ ఆ రాత్రి కారులో నిద్ర పోతుంది. ఇంకో రాత్రి ఫెర్రి స్టేషన్ లో నిద్ర పోతుంది. సహాయం కోసం ఆశ్రయించిన సోషల్ వెల్ ఫేర్ సంస్థలు పని వుంటేనే పాపకు ప్రభుత్వ డే కేర్ సెంటర్ లో చోటు వుంటుందని చెబుతారు. పని లేకనే కదా వాళ్ల సహాయం కోరింది? 

‘నువ్వు హోమ్ లెస్ నా?

‘కాదు. మాకో ఇల్లు ఉంది. ఆ ఇంటి నుండే పారిపోయి వచ్చాను’

‘మీ ఆయన కొడతాడా?’

‘లేదు కొట్టడు.’

‘మరి మీ పాపను కొడతాడా’

‘లేదు, లేదు’

‘మరి?’ అన్నట్లు ముఖం పెడుతుంది ఆ సోషల్ వెల్ఫేర్ ఉద్యోగి. 

అలెక్స్ చాలా గందరగోళ పడి పోతుంది. మరి తనెందుకు ఇంటి నుండి పారిపోయి వచ్చినట్లు? డొమెస్టిక్ వయలెన్స్ అంటే కేవలం కొట్టటమే కాదనీ, ఎమోషనల్ వయలెన్స్ కూడా గృహహింస కిందకే వస్తుందనీ  -ఆమెకు అర్థం అవటానికి చాలాకాలం పడుతుంది. తాగి ఇంటికి రావటం, చేతికొచ్చిన వస్తువును విసిరేయటం, పగలకొట్టటం, భార్యా పిల్లల్ని భయభ్రాంతులకు గురి చేయటం కూడా గృహహింసే అనే స్పష్టత ఆమెకు తరువాత కల్పిస్తారు. 

పది ఎపిసోడుల ఈ సిరీస్ మొత్తం చూశాక అమెరికన్ మహిళా శిశు సంక్షేమ వ్యవస్థ ఎంత లోపభూయిష్టంగా, ఎంత పరిమితంగా ఉంటుందో అర్థం అవుతుంది. అనేక వైరుధ్యాలతో వున్న హృదయ రహిత యాంత్రిక వ్యవస్థ అది. కేపటలిస్టిక్ వ్యవస్థలో అన్నీ అలాగే ఉంటాయి. గృహ దాడులకు గురైన వారి భయం బాధలనే కాదు, సహాయక వ్యవస్థ పేరిట జరిగే గందరగోళపు ప్రహసనం గురించి కూడా ఈ సిరీస్ చెబుతుంది. అలెక్స్, మేడీల గురించి మాత్రమే కాదు -దయగా, మొరటుగా ఉండే రకరకాల సామాజిక కార్యకర్తల గురించి చెబుతుంది ఈ సిరీస్. అలెక్స్ కలిసిన మొదటి సామాజిక కార్యకర్త తనను ‘నువ్వో తెల్లజాతి అధమురాలివి కాబట్టి, నీకు అమెరికన్ ప్రభుత్వం పెద్ద ఎత్తున్న సాయం చేయాలని ఆశిస్తున్నావా?’ అని వెటకారం చేసినట్లుగా అనిపిస్తుంది ఆమెకు. డొమెస్టిక్ షెల్టర్ లో చేరటానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన టాక్సీలో వెళ్లినపుడు ‘హాయ్, బేబీ గర్ల్’ అంటూ ఆదరంగా కారు తలుపు తీసి, దగ్గరుండి గదికి తీసుకెళ్లిన నల్లజాతి సంక్షేమ అధికారి డెనీస్ ఎంతో సాయం చేస్తుంది చివరి వరకు ఆమెకు. డెనీస్ కూడా ఒకప్పటి గృహహింస బాధితురాలే అని తర్వాత తెలుస్తుంది.  

జాతి, లింగ, వయసులకు అతీతంగా, వివిధ సామాజికార్థిక అనుభవాలున్న వాళ్లు గురైన డొమెస్టిక్ వయలెన్స్ గురించి ఈ కథ చెబుతుంది. భర్త ఎంత క్రూరుడైనా, అమెరికాలాంటి అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా, అతనితో కలిసి వుండటానికి భార్య ఏడు సార్లదాకా ప్రయత్నాలు చేస్తుందని ఈ సిరీస్ అర్థం చేయిస్తుంది. గృహహింసకు పేదరికం తోడైనపుడు, ఆదుకొనే తలిదండ్రులు లేనపుడు, బిడ్డ తల్లులు పడే సంఘర్షణ గురించి చెబుతుంది. 

ఈ సిరీస్ లో అలెక్స్ తల్లి పౌలా పాత్రం విభిన్నమైనది. ఇంటి నుండి వచ్చేసిన అలెక్స్ మొదట తన తల్లి దగ్గరకే వెళుతుంది. ఆర్టిస్టు అయిన పౌలా బై పోలార్. (ద్వంద్వ ప్రవృత్తితో ఉంటుంది). దానికి తోడు మొదటి రెండు వివాహాలు విచ్ఛిన్నం అవుతాయి. ఆమె ఎన్నుకొన్న మూడో బాయ్ ఫ్రెండ్ మోసగాడనే స్పృహ ఆమెకు వుండదు. కూతురిని స్నేహితురాలిగా భావించి తన భావోద్వేగాలను పంచుకుంటుంది కానీ -ఆమెకు ఎమోషనల్, మెంటల్, ఫిజికల్ సపోర్ట్ ఇవ్వలేదు. తల్లి ఆధారపడదగ్గ వ్యక్తి కాదని అలెక్స్ కు కూడా తెలుసు. కూతురి మీదా, మనవరాలి మీద ప్రేమ వ్యక్తం చేయాలంటే, పౌలాకు తెలిసిన ఒకే ఒక విద్య -వాళ్లకు బొమ్మలు వేసి పెట్టటం.   

అంతా మర్చిపోయి మళ్లీ రమ్మని పిలుస్తున్న సహచరుడితో ‘పాప జుట్టు నుండి నువ్వు పగలగొట్టిన గాజు పెంకులు ఏరలేన’ ని చెబుతుంది అలెక్స్. అతని రాజీ ప్రతిపాదనలను తిరస్కరించినందుకు, పాప మేడి కోసం కోర్టుకు వెళతాడు సియాన్. ‘పాపకు రెండు సార్లు భోజనాలు పెట్టట్టానికి లేని డబ్బు, లాయర్ ను పెట్టుకోవటానికి ఎలా వచ్చింది’ అని అతన్ని కోర్టు ఆవరణలో ప్రశ్నిస్తుంది అలెక్స్. పాప సంరక్షకురాలిగా వుండాలంటే క్రమబద్ధమైన సంపాదన వుండాలనీ, అంతవరకూ సంపాదిస్తున్న తండ్రి వద్దే పాప ఉంటుందని ఘనమైన కోర్టు తీర్పునిస్తుంది. తన తప్పు లేకుండా జరిగిన కారు యాక్సిడెంటు వలన కారూ ఆమె చేతిలో లేకుండా పోతుంది. యాక్సిడెంటు చేసిందని పాపకు సంరక్షకురాలిగా వుండే హక్కును కోల్పోతుంది అలెక్స్. పాప స్నానం సమయంలో మాత్రం వెళ్లి చూడవచ్చునని సెలవిస్తుంది కోర్టు. 

పాపను తండ్రితో పంపించి, తన షెల్టర్ కు వచ్చి కార్పెట్టు మీద పడి ఏడుస్తున్న అలెక్స్ తో తోటి బాధితురాలు డేనియా ‘ఈ కార్పెట్ల గురించి నాకు తెలియదనుకొంటున్నావా? ఇలాంటి కార్పెట్లను ఎన్నిటినో తడిపేశాను. లే. లేచి పోరాడు’ అని చెబుతుంది. తనలాంటి బాధను చాలామంది అనుభవిస్తున్నారని అర్థం అయ్యాక అలెక్స్ కు ధైర్యం వస్తుంది. గంటల కొద్దీ క్యూలో నిలబడి, పుంఖానుపుంఖాల దరఖాస్తులను పూర్తి చేసి ఇస్తుంది. షెల్టర్ హోం వాళ్లు నిర్వహించే క్లాసులకు హాజరయ్యి ‘పిల్లలకు మూడు పూటలా భోజనాలు పెట్టాలి, పిల్లలు మానసికంగా స్థెర్యంగా వుండాలంటే తల్లిందండ్రులు కలిసి వుండాలి’ లాంటి పాఠాలను నిర్వేదంగా వింటుంది. ఆ తరగతులకు హాజరైతే వచ్చే సర్టిఫికేట్ తనకు అనుకూలంగా కోర్టులో పని వస్తుందనే ఆశతో ఆ క్లాసుల్లో కూర్చుంటుంది కానీ, షెల్టర్ హోముల్లో ఉండే నిస్సహాయుల సామాజిక ఆర్థిక పరిస్థితులను పరిగణలోకి తీసుకోకుండా వాళ్లు చేస్తున్న ప్రవచనాలు విరక్తి కలిగిస్తాయి ఆమెకు. 

తన అరాచక జీవితంలో మేడిని పెంచటం కుదరదని గ్రహించి పాపను అలెక్స్ కు ఇచ్చేస్తాడు సియాన్. తనూ పాపా జీవించటానికి ఒక ఇల్లు కావాలి. పాప మేడిని ఒక మంచి డే కేర్ సెంటర్ లో చేర్చాలి. ఇవి లక్ష్యాలుగా పెట్టుకొని అలెక్స్ రాత్రింబవళ్లు పని చేస్తుంది. మురికి పట్టిన ఇళ్లను అద్దంలా తయారు చేస్తుంది. గార పట్టిన టాయిలెట్లను వాంతి ఆపుకొంటూ కడుగుతుంది. జిడ్డు పట్టిన కిచెన్ ప్లాట్ ఫామ్ లను పడీ పడీ రుద్దుతుంది. ఇళ్లను శుభ్రం చేసి కంపు బట్టలతో పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ లో వెళుతున్న ఆమె నుండి జరిగి దూరంగా కూర్చుంటుంది ఒక మహిళ. ఆకలి కడుపుతో, ఉసూరుమంటూ కూడా యజమానుల ఆదేశం ప్రకారం ఫ్రిజ్ లోని పళ్లనూ పాలనూ గార్బేజీ సంచుల్లో పడేస్తుంది. ఒక పక్క వ్యర్థం అవుతున్న ఆహారం, ఇంకోపక్క బుక్కెడు బువ్వ నోట్లోకి పోవటానికి ఆమె చేస్తున్న చాకిరీకీ వున్న వైరుధ్యాన్ని అద్భుతంగా చిత్రీకరించారు డైరెక్టర్ Molly Smith Metzler. 

అంత బిజీ జీవితంలో కూడా, తను పని చేస్తున్నఇళ్లల్లో భార్యాభర్తల జీవితాలను పరిశీలించి డైరీ రాయటం మొదలు పెడుతుంది అలెక్స్. ‘కన్ ఫెషన్స్ ఆఫ్ మెయిడ్’ పేరుతో ఆమె రాసుకొనే డైరీలో ఆమె ‘విలాసవంతమైన ఈ ఇళ్లల్లో ఏదో లోటు కనిపిస్తుంది. పెద్ద హాళ్లు, గదులు వాళ్ల బాధలను దాచిపెట్టటానికే. ఆ గ్లాసు తలుపులు ఇంటివారి ఒంటరితనాన్ని బయట ప్రపంచానికి తెలియనీయకుండా వుంచటానికే’ అని రాస్తుంది. ఆ డైరీలో ఆమె రాసుకొన్న రాతలే తరువాత ఆమెకు ‘క్రియేటివ్ రైటింగ్’ కోర్సులో మిజులా యూనివర్సిటీలో సీటు రావటానికి ఉపయోగపడతాయి.  

అలెక్స్ ఒక బాధ్యత కలిగిన తల్లి మాత్రమే కాదు. ఒకప్పుడు సియాన్ కు ప్రేమను పంచి, అదే ప్రేమను తిరిగి పొందిన ప్రియురాలు కూడా. అతను హింసాత్మకంగా మారిన తరువాత కూడా వివిధ సందర్భాలలో అతన్ని పట్టించుకొంటుంది అలెక్స్. ప్రపంచం తెలియని తల్లిని అర్థం చేసుకొంటుంది. తన బయలాజికల్ తండ్రి నుండి తన కోసమే తల్లి బయటపడిందని అలెక్స్ గ్రహిస్తుంది. తల్లి చేసుకొన్న పెళ్లిళ్లలనూ, ప్రేమ వ్యవహారాలను ఓపెన్ మైండ్ తో అర్థం చేసుకొని, ఆమె సంతోషంలో పాలు పంచుకొంటుంది. ఆమె బాధలో ఓదారుస్తుంది. వాళ్లకు పూర్వీకుల నుండి వచ్చిన ఒకే ఒక ఆస్తి అయిన ఇంటిని తెలివితక్కువగా ప్రియుడి పాలు చేసినపుడు కూడా తల్లిని ఒక్క మాట కూడా అనదు. చివరకు తనతో పాటు మిజులా యూనివర్సిటీకి వచ్చి పాపను చూసుకొంటానని తల్లి ఇచ్చిన మాటను కొత్త ప్రేమలో పడి తప్పినా, ఆమె కోసం ఆందోళన పడుతుందే తప్ప -నిష్టూరపడదు. తనే తల్లై పౌలాను, మేడితో బాటు ఎల్లవేళలా పట్టించుకొంటుంది అలెక్స్. సర్వం కోల్పోయి, కారులో నిద్ర పోతున్న తల్లికి ఏదైనా ఆశ్రయం దొరుకుతుందా అని వాకబు చేస్తుంది. 

తల్లినే కాదు -వివాహ సంక్షోభంలో పడి, ప్రేమరాహిత్యంలో వున్న తన ధనిక కష్టమర్ లాయర్ రెజీనాను కూడా అంతే పట్టించుకొంటుంది. తల్లిగా తనకున్న అనుభవాన్ని కొత్తగా అమ్మ అయిన ఆమెకు పంచి ఇస్తుంది. అనివార్య పరిస్థితుల్లో మళ్లీ తన అబ్యూసివ్ భర్తతో వెళ్లిపోయిన సహ బాధితురాలు, స్నేహితురాలు డేనియా గురించి ఆందోళన పడి, ఆమె బయట పడటానికి సహాయం చేయాలనుకొంటుంది. శుభ్రం చేయటానికి వెళ్లిన ఒక ఇంట్లో -తల్లిని హత్య చేసి పారిపోయాడనీ, సీరియల్ కిల్లర్ అనీ అందరూ అనుకొంటున్న పిల్లవాడికి నిజానికి విపరీతంగా స్నాక్స్ తినే జబ్బు మాత్రమే వుందని అర్థం చేసుకొని, అతని కోసం ఒక చిప్స్ పాకెట్టుని వుంచి వస్తుంది. 

ఒక సందర్భంలో ఆమె ఎలాంటి బంధనాలు లేని ఒంటరి స్త్రీగా చెప్పుకొని అపరిచితుడైన మగ స్నేహితుడిని ఆహ్వానించినా, మరు నిమిషంలోనే ఈ ప్రపంచంలోకి వచ్చి పడి అతనికి నిజం చెప్పి క్షమాపణ అడుగుతుంది. ఒంటరి తండ్రి అయిన చిన్ననాటి స్నేహితుడు నేట్ అలెక్స్ ను పాపతో సహా స్వీకరించటానికి సిద్ధంగా ఉన్నా -ఆమె చుట్టూ వున్న సంక్లిష్టత ఆమెకా అవకాశాన్ని ఇవ్వదు. 

తన చిన్ననాటి జీవితంలాగా తన పాప జీవితం ఉండకూడని దృఢనిశ్చయంతో బయటకు వచ్చినా -కొన్ని అసహాయ పరిస్థితుల్లో ఆమె మళ్లీ సియాన్ కు చేరువౌతుంది. చేతిలో పైసా లేకుండా, ఫోన్ రీఛార్జ్ కి కూడా అతని మీద ఆధారపడి బతకటం ఆమెకు దుర్లభంగా ఉంటుంది. అతను ఏమీ మారలేదనీ, మారినట్లు నటించాడనీ త్వరలోనే అర్థం అవుతుంది ఆమెకు. రెండోసారి పారిపోయి రావటానికి ఆమె ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. ఆమె కోసం, డొమెస్టిక్ వయలెన్స్ షెల్టర్ తలుపులు మళ్లీ తెరుచుకొంటాయి. ‘బేబీ గర్ల్’ అంటూ డెనీస్ ప్రేమగా, ఎలాంటి సంజాయిషీలు అడగకుండా ఆహ్వానిస్తుంది. ఆ షెల్టర్ అలెక్స్ లాంటి వాళ్ల కోసం ఎన్నోసార్లు తలుపులు తెరిచి మూస్తూ వుండి వుంటుంది.   

రెండోసారి పాప కస్టడీ కోసం భర్త వేసిన కోర్టు కేసును ఎదుర్కోవటానికి ఆమెకు అనుభవం వస్తుంది. ధైర్యం వుంటుంది. లాయర్ రెజినా సహాయం చేస్తుంది. ఆత్మవిశ్వాసంతో కోర్టుకు వెళ్లిన ఆమెకు సియాన్ మళ్లీ సరెండర్ అవుతాడు. అతనికి తెలుసు, ఇగోతో తను కోర్టుకు వెళుతున్నాడు కానీ పాప బాధ్యత తీసుకొనే శక్తి తనను లేదని.  

ఈ సిరీస్ లో అమెరికన్ అధో జీవితాలను కళ్లకు కట్టినట్లు చూపించారు. అమెరికా అంటే భూలోక స్వర్గం అనే సాధారణ అభిప్రాయానికి భిన్నంగా, అక్కడి తెల్ల ప్రజలే ఎలాంటి దీన పరిస్థితుల్లో జీవిస్తున్నారో ఈ సిరీస్ ద్వారా అర్థం అవుతుంది. రిక్రియేషన్ వెహికిల్స్ ను ఎక్కడో ఆపుకొని అందులోనే జీవించే కుటుంబాలు కనబడతాయి. రోజుకి రెండు మూడు చిరుద్యోగాలు చేసినా కటకటాగా గడవటం అమెరికాలో పెరుగుతున్న ఆర్థిక మాంధ్యాన్ని సూచిస్తుంది. అమెరికా లాంటి పెద్ద పెట్టుబడిదారి వ్యవస్థలో పిల్లల పెంపకాన్ని ప్రభుత్వ బాధ్యతగా, సామాజిక బాధ్యతగా కాకుండా -ప్రైవేటు సంస్థలకు అప్పగించటం వలన పిల్లల సంరక్షణాలయాలు అందని ద్రాక్షాపండ్లలాగా అధిక రేట్లను వసూలు చేస్తుంటాయి. అందులో పని చేసే టీచర్లకు సరైన జీతాలు అందవు. ఒంటరి తల్లులు పని చేయాల్సి వచ్చినపుడు ఈ పరిస్థితులు వాళ్ల ముందు కాళ్లకు బంధనాలు అవుతుంటాయి. ఈ డైనమిక్స్ అన్నీ మనకు అర్థం అయ్యే పద్ధతిలో తీశారు.

అలెక్స్ గా నటించిన మార్గరెట్ క్యూలే అత్యద్భుతంగా నటించింది. కన్నీటిని కళ్ల కొనల్లో దాచుకొని -ఆత్మ గౌరవంతో బతకటానికి, బతికించుకోవటానికి ఆమె పడే తపన మన చుట్టూ వున్న ఎంతోమంది ఆడవాళ్లను మనకు గుర్తుకు తెస్తుంది. పాప మేడి జబ్బున పడ్డపుడు, పనికీ పాప సంరక్షణకూ లంకె కుదరక ఆమె పడే సంఘర్షణ కళ్లను తడి చేస్తుంది. అలెక్స్ ఎక్కడో అమెరికాలోని ఫ్లోరిడాలో బతుకుతున్న అమ్మాయని అనిపించదు. జీవిక కోసం రెండు మూడు పనులు చేస్తూ, పొద్దున్నే క్యారేజులు కట్టుకొని బయలుదేరి, షేర్డ్ ఆటోల్లో ప్రయాణాలు చేస్తూ మనకు నిత్యం కనిపించే భారత శ్రామిక మహిళ లాగానే అనిపిస్తుంది. అలెక్స్ తల్లి పౌలాగా నటించిన యాండి మెక్ డొవెల్ నటనను కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాలి. (నిజ జీవితంలో కూడా వీళ్లిద్దరూ తల్లీ కూతుళ్లు)

చివరిలో గృహ హింస బాధితులు సమావేశం అయినపుడు అలెక్స్ ‘నేను 338 టాయిలెట్లను శుభ్రం చేశాను. 7 రకాల ప్రభుత్వ సహాయాలను అందుకొన్నాను. ఇంటి నుండి బయటకు వచ్చాక 9 నివాసాలకు మారాను. ఒక రాత్రి ఫెర్రి స్టేషన్ లో కూడా పడుకొన్నాను’ అని చెబుతుంది. మిజూలా యూనివర్సిటీకి వెళ్లి, తన బంగారు తల్లి మేడితో జీవిస్తూ, సృజనాత్మక రచనలు చేయటం నేర్చుకోవాలనుకొంటున్నానని చెబుతుంది. అది అంత చిన్న కలేమీ కాదు. ఇవన్నీ జరగాలంటే ఆమె అక్కడ కూడా టాయిలెట్లను కడగాల్సిందే. తనకు తెలిసిన పని అదే అని చెబుతుంది ఒక సందర్భంలో. 

హింసాత్మక కుటుంబ జీవితాల నుండి పారిపోయిన ఒంటరి తల్లుల గురించి పట్టించుకోని అస్తవ్యస్తమైన చట్టాలూ, వ్యవస్థలూ; ఏ నిమిషాన్నీ ఎవరికీ కేటాయించలేని పరుగులెత్తే బతుకులు -వెరసి ఈ ధనిక దేశంలో ఒక మెయిడ్ కల ఆమె సొంత కష్టంతోనే నెరవేరుతుంది.

స్వస్థలం ఒంగోలు. ప్రస్తుతం గుంటూరు ప్రభుత్వ మహిళా పాలిటిక్నిక్ కాలేజీలో ఎలక్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ బ్రాంచ్ హెడ్ ఆఫ్ సెక్షన్ గా పని చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు. 'మాతృక' బాధ్యతలు చూస్తున్నారు.

3 thoughts on “పనిమనిషిగా మారిన ఒంటరి తల్లి పోరాటం -మెయిడ్ సిరీస్ 

  1. Well written exposing true conditions of women forced to become maids in America.

  2. స్త్రీ విముక్తి శ్రమ విముక్తిలో భాగ మైనప్పటికీ.. అత్యావశ్యకమైనది స్త్రీ విముక్తి. స్త్రీలు అవమానం.. అణచివేతలే కాకుండా సాంప్రదాయ సంకెళ్ళకు కూడా అదనంగా బలైపోతున్న భారత్ లాంటి దేశాల్లో అమెరికా స్వప్న సీమగా విరాజిల్లుతున్నది. అక్కడి స్త్రీల జీవన సంఘర్షణ పై సమీక్షతో గుండెను బరువెక్కించిన రమా సుందరి గారికి కృతజ్ఞతలు.

Leave a Reply