మెదడు లేకుండా విశ్వగురువెట్లవుతవ్?

కాషాయీకరణ కాలంలో వస్తున్న కోర్టు తీర్పుల ధోరణి చూస్తుంటే న్యాయమూర్తులకు, హిందూ ప్రవచనకర్తలకు దగ్గరి పోలిక ఉన్నట్లు అనిపిస్తుంది. అదేమిటంటే ప్రవచనకారులు ఈ నేలంతట సనాతన ధర్మాన్ని పునరుద్ధరించాలనీ తాపత్రయపడుతున్నారు. బహిరంగ ప్రకటనలు చేయకపోయినా హిందూరాష్ట్ర స్థాపనే తమ ధర్మాన్ని కాపాడగల మార్గమని విశ్వసిస్తున్నారు. అందుకోసం ఆధ్యాత్మిక, భావజాల, సాంస్కృతిక రంగాలలో మునుపెన్నడూ లేనంతగా పనిచేస్తున్నారు. అందులో బాగా పేరు సంపాదించిన కొందరు తాము చెప్పాల్సిన  విషయాలపై, చెప్పే పద్దతులపై కొత్త మార్గాలను ఎంచుకున్నారు.

దైనందిక హిందూ జీవితంలో జరిగే పొరపాట్లను, మూఢనమ్మకాలను ఎత్తి చూపుతూ హిందూ మతాన్ని “శాస్త్రబద్ధంగా” ప్రక్షాళన చేయాలనే పనిలో వున్నారు. అందుకోసం శాస్త్రాలకు, పురాణాలకు, వేదాలకు, ఉపనిషత్తులకు సరొకొత్త  వివరణలు ఇస్తున్నారు. వాటి సారాన్ని నిత్య జీవితానికి అన్వయిస్తున్నారు. వాటిని ఇంగితజ్ఞానంగా మార్చాలని చూస్తున్నారు. సమాజంలో కుల, మత, లింగ కట్టుబాట్లకు, అణిచివేతకు స్వచ్ఛంద సమ్మతిని కూడగడుతున్నారు.

ప్రవచనకారులు తాము చెప్పేవన్నీ శాస్త్రీయమని, చరిత్రలో జరిగినవేననీ, అవి మరే మతంలోనూ జరగలేదని ఒక సాధికారతను నిర్మాణం చేసే పని చేస్తున్నారు. ఒకవైపు పురాణమంటారు, మరోవైపు అదే చరిత్రంటారు. లౌకికమైన విషయాలు చలోక్తిగా చెబుతారు, వాటి మూలాలను గంభీరంగా వేదభాషలో చెబుతారు. తమ పాండిత్య ప్రతిభతో తన్మయాత్మక వాతావరణం ఏర్పాటు చేసి ప్రేక్షకులను, శ్రోతలను మత్తులో ముంచుతున్నారు. ఆధునిక మానవున్ని వేదకాలపు గుంజకు కట్టేసే పని చేస్తున్నారు.

అదే ఊపులో ప్రజాస్వామిక, లౌకిక విలువలకు, సమతా భావనలకు, స్వేచ్చకు, అధునికతకు తప్పుడు వ్యాఖ్యానాలు చేస్తున్నారు. సమాజంలోని హింసలకు, దోపిడీలకు, పీడనలకు శాస్త్రం, ధర్మం పేరిట ఒక సమర్ధతను నిర్మాణం చేస్తున్నారు. కర్మ సిద్ధాంతాన్ని, పునర్జన్మ అనే భావనను ప్రజల నెత్తికెక్కిస్తున్నారు.  పనిలోపనిగా హేతువాదులను, నాస్తికవాదులను, మహిళాసంఘాలను, మానవ హక్కుల సంఘాలను ఎగతాళి చేస్తున్నారు. మొత్తంగా రాజ్యాంగస్పూర్తికి పూర్తి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు.  

అయితే తమ ప్రవచానాలలో ఒకటో, అరనో అసందర్భ అభ్యుదయ ప్రకటనలు చేసి  మిగిలినదంతా మధ్యయుగాలకు దారి వేసే ప్రయత్నమే చేస్తున్నారు. ఒక్క నిజాన్ని చెప్పి తొంభైతొమ్మిది అబద్దాలను, అభూత కల్పనలను వండి వడ్డిస్తున్నారు. ఇక ఇప్పుడు సంఘ్ పరివార్ ముందుకు తెచ్చిన మరో భ్రమ పదార్థం “విశ్వగురువు”ను అందరిచేత స్వచ్ఛందంగా భజన చేయిస్తున్నారు. దైవజ్ణానం పేరిట విషం కక్కుతూ సద్గురువులమని కొందరు భుజకీర్తులు తగిలిచుకుంటే, అశాస్త్రీయతను ప్రచారం చేస్తూ ప్రపంచానికి విశ్వగురువు ముసుగు తొడగాలని చూస్తున్నారు ఇంకొందరు.

నిజానికి “విశ్వగురువు” అనేది ఒక ఆధిపత్య భావన. అది ఒక సామ్రాజ్యవాద కాంక్షను బయటపెడుతుంది. అయితే సంఘ్ పరివార్ శక్తులు దానిని కేవలం తమ బ్రాండ్ ఇమేజ్ కోసం, తమ పూర్వ వైభావానికి మళ్ళీ పట్టం కట్టుకోవడానికి,  తమను హేతుబద్దత లేకుండా సమర్థించే మందకు మత్తుమందుగా వాడుకుంటుంది. దాని మూలంగా దేశానికి, ప్రజలకు ఒరిగేది ఏమి లేదు.  ఇదంతా బ్రాహ్మణీయ ఆధిపత్యాన్ని స్థాపించి మొత్తం సమాజాన్ని (రాజకీయార్థిక, సామాజిక, సాంస్కృతిక వ్యవస్థలను) తమ నియంత్రణలో ఉంచుకోవడం కోసం సంఘ్ పరివార్ శక్తులు భావజాలరంగంలో చేస్తున్న దాడిలో భాగం.

ఈ కమ్ముకుంటున్న కారు చీకటి కాలంలో న్యాయస్థానాలు కూడా మిణుగురు పురుగుల్లా అప్పుడప్పుడు మెరుస్తూ ఒకటో, రెండో కాంతిరేఖలాంటి ఆశావాద తీర్పులు ఇస్తున్నాయి. వాటితో ఉత్తేజితులం అవుతుండగానే మళ్ళీ తనలోని చీకటి కోణాన్ని బహిరంగ పరుస్తున్నాయి. కనీస సహజ న్యాయసూత్రాలను, రాజ్యాంగ విలువలను పట్టించుకునే స్థితిలో లేవు. న్యాయమూర్తులందరిని ఒక్కటే గాటికి కట్టలేము కాని మొత్తంగా న్యాయవ్యవస్థ తీరు ఆందోళనకరంగానే వుంది. తన అస్తిత్వాన్ని తానే రద్దు చేసుకుంటుంది.”నువ్వు న్యాయమూర్తుల బెంచ్ పేరు చెప్పు, నేను వాళ్ళు చెబ్బబోయే తీర్పు ముందే చెబుత” అనేంతంగా పరిస్థితి వచ్చింది.

ఫాసిజం ముదిరేకొద్దీ అది తెరిచిన పుస్తకంగానే పనిచేస్తుంది. దానికిక దాపరికాలు అవసరం లేదు. దుర్మార్గాన్ని బహిరంగంగా ప్రకటించడం ద్వారానే ప్రజల్లో భయాన్ని నెలకొల్పొచ్చు అని భావిస్తుంది. తాను ఏదైనా చెయ్యగలననే  సందేశాన్ని పంపాలనుకుంటుంది. ఏది చేసినా “ధర్మం కోసం, దేశం కోసం” అని ప్రజలను నమ్మించగలిగే శక్తి, సాధనాలు వుంటే చాలు అన్ని విలువలను, వ్యవస్థలను బుల్ డోజ్ చేయగలదు. ఇప్పటి పరిస్థితుల్లో మీడియా, న్యాయవ్యవస్థ ఆ సాధనాలుగా పనిచేస్తున్నాయి.

న్యాయవ్యవస్థ పతన స్థితికి ప్రొ. సాయిబాబ కేసు ఒక ఉదాహరణ. ఆయన మీద పెట్టింది దొంగ కేసు. దానికి దొంగ సాక్ష్యాలు చెప్పింది పోలీసులు. నేరాన్ని నిరూపించడానికి ఏ ఆధారం లేకుండానే 827 పేజీల తీర్పుతో జీవితఖైదు విధించాడు సెషన్స్ కోర్టు న్యాయమూర్తి. వందల పేజీల తీర్పు అనేసరికి ఏ నేరం చెయ్యకపోతే అంత పెద్ద తీర్పు జడ్జ్  ఎలా రాస్తారు అనే అనుమానం రావడం సహజమే. అయితే ఆ తీర్పును చదివితే తెలుస్తుంది అది ఎంత గందరగోళపు కలగూరగంపనో. అది ఒక్కరు రాసినట్లుగా వుండదు. అందులో నేరారోపణలే తప్ప ఆధారాలు ఉండవు. దానిలో అంతా డిజిటల్ పరికరాల వివరాలు, అక్షర విన్యాసాలు, కేసుతో సంబంధంలేని రెఫరెన్స్  వివరణలు. నేరం నిరూపణ కాకుండానే “నేను శిక్ష వేయాలనుకుంటున్నాను కాబట్టి వేస్తున్న” అన్నట్లుగా జీవితఖైదు విధించారు.

కేసులో విషయం (matter) లేకపోవడమే కాదు రాజ్యం ఒక కేసు విచారణ కోసం తానుగా ఏర్పాటుచేసుకున్న ప్రాథమిక అడ్మినిస్ట్రేటివ్ పద్దతులను కూడా పాటించలేదు. అంటే దొంగ కేసు పెట్టినప్పటికి అది అసలు విచారణ చేయగల కేసే కాదు. ఎందుకంటే కేసు విచారణకు  తీసుకోవాల్సిన ప్రాథమిక అనుమతులు తీసుకోలేదు కాబట్టి. ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకోని ఐదేండ్లుగా జైలులో ఉన్న సాయిబాబను, అదే కేసులో నిందితులుగా పేరుకున్న మరో అయిదుగురిని బాంబే హైకోర్ట్ – నాగపూర్ బెంచ్ నిర్ధోషులుగా ప్రకటించింది. (ఐదుగురిలో ఒకరు పాండు నరోటి అనే ఆదివాసి యువకుడు. జైలు అధికారుల నిర్లక్ష్యం మూలంగా అనారోగ్యంతో రెండు నెలల క్రిందటే చనిపోయాడు. వాస్తవానికి ఈ కేసుపై తీర్పు ప్రకటించిన జడ్జ్ వీళ్ళకు కేవలం జీవిత ఖైదు విధించాల్సి రావడం గురించి చాలా మథనపడిపోయాడు. “చట్టం నా చేతులు కట్టేసిందని” బాధ పడిపోయాడు. ఎందుకంటే ఆయన వీళ్ళకు జీవిత ఖైదుకు మించిన — అంటే మరణశిక్ష — విధించాలని భావించాడు. ఇప్పుడు పాండు మరణంతో జడ్జ్ గారి అమానవీయ కోరిక తీరినట్లే అయ్యింది!)

అసలు హైకోర్ట్ ఆ కేసులో విషయం లేదని కొట్టివేయాల్సింది కాని ఆ కేసుకు సంబంధించిన ముఖ్యమైన టెక్నికల్ అంశం ఆధారంగా నిందితులందరిని విడుదల చేయాలని తీర్పు ఇచ్చింది. ఇది ఆశాజనకమైనది. ఆహ్వానించదగినది. కాని తీర్పు వెలువడిన కొన్ని గంటల్లోనే చీకటి కమ్మడం మొదలయ్యింది. మహారాష్ట్ర ప్రభుత్వం సాయిబాబ, ఇతరుల విడుదలను ఆపివేయాలని సుప్రీంకోర్టుకు వెళ్ళింది. వారాంతం దాటితే భూమి బద్దలయిపోతదన్నట్లు శనివారమే ప్రభుత్వ అప్పీల్ ను విచారించడానికి సుప్రీంకోర్ట్ సిద్దమయ్యింది. ఆ బెంచ్ లో ఉన్న జడ్జుల పేర్లు తెలియగానే రాబోయే జడ్జుమెంట్ ను ఊహించారు ఎందరో న్యాయ నిపుణులు, ఉద్యమకారులు. అదీ ఆ జడ్జుల ఘనకీర్తి!

శనివారం వాదనలు మొదలయినప్పటి నుండే ఆ జడ్జుల తీరు అర్థమవుతూనే వుంది. వాళ్ళు సాయిబాబ తరఫు న్యాయవాదిని వేసే ప్రశ్నలు, ప్రభుత్వం తరఫు న్యాయవాదికి ఇస్తున్న సమర్థనలు చూస్తున్నప్పుడే ఆ బెంచ్ ఏం చెప్పబోతుందో తెలుస్తూనేవుంది. ఆ వాదోపవాదాలు సుప్రీంకోర్టు స్థాయిని, గౌరవాన్ని ప్రతిబంబిస్తున్నట్లుగా లేవు. నాకయితే మా స్కూల్ గ్రూప్ లో జరుగుతున్న కొంటె వాదనలా అనిపించింది. విలువలు, నియమాలు, ఆధారాల మీద వాదనలు కాకుండా వైయుక్తిక ఇష్టాయిష్టాల మీద జరుగుతున్నట్లు అనిపించింది. జడ్జులు తాము ముందుగానే అనుకున్న తమ తీర్పును ప్రకటించినట్లుగా అనిపించింది. సాయిబాబ, ఇతరులకు హైకోర్ట్ ఇచ్చిన ఊపిరిలాంటి తీర్పును నిలిపివేస్తున్నాము అని ప్రకటించారు.  

ఆ తీర్పు ప్రకటన క్రమంలో (ప్రవచనకారుల మాదిరిగానే) ఒకటి, అర న్యాయసూత్రాలను ఉటంకిస్తూ ఆ బెంచ్ లోని ఒక జడ్జ్ గారు తన మనసులోని మాట బయటపెట్టారు. “హైకోర్ట్ తీర్పును నిలిపివేస్తున్నారు కదా, మానవతావాద పునాదుల మీదైనా సాయిబాబ జైలు జీవితాన్ని గృహ నిర్బంధంగా మార్చండి. ఎందుకంటే ఆయన 90 శాతం అంగవైకల్యంతో, 19 రకాల వ్యాధులతో బాధ పడుతున్నాడు” అని సాయిబాబ తరఫు న్యాయవాది జడ్జుకు విన్నపించుకున్నాడు. (ఇవే మాటలు కాదు కాని భావం ఇదే) దానికి బదులుగా జడ్జ్ అంటాడు : ఇలాంటి కేసుల్లో “మెదడు చాలా ప్రమాదమైనది. ప్రత్యక్ష్య ప్రమేయం వుండాల్సిన అవసరం లేదు.” అంటే ఆయన భౌతికంగా కదలలేక పోయినా చలనంలో వున్న ఆయన మెదడును నిర్బంధించే వుంచుతాము అని అర్థం.

“మెదడు ప్రమాదకరమైనది” అనే మాట కేవలం రాజ్యాంగవిరుద్దమైనదే కాదు, మానవాళి పురోగతికే అడ్డంకి. సాయిబాబ లాంటి “ప్రమాదకర మెదళ్ళు”గల మనుషులు చరిత్రలో లేకపోయింటే మానవ సమాజం ఇంతగా అభివృద్ది చెందివుండేది కాదు. చరిత్రలో ప్రతి కాలంలో ఇలాంటి ప్రమాదకర మెదళ్ళు ఉన్నాయి. చార్వాకులు, సోక్రటీస్ దగ్గర నుండి, గౌరీ లంకేష్ … ఇప్పటివరకు ఈ ప్రమాదకర మెదళ్ళు సమాజ పురోగతి కోసం పనిచేస్తూనే వున్నాయి. అందుకే వాళ్ళు తమ సార్వత్రిక విలువలతో విశ్వ మానవులయ్యారు.

 “మెదడు ప్రమాదకరమైనది” అనే మాటను మరో విధంగా చూస్తే మనందరి మెదళ్ళు ఒకే తీరుగా (పాలకవర్గ ప్రయోజనాలకు అనుగుణంగా) ఆలోచించాలి. అలా కాకుండ సామాజిక న్యాయం, పౌరహక్కుల, హేతుబద్ద దృక్పథాల నుండి అభాగ్యుల తరఫున ఆలోచిస్తే మన మెదడు ప్రమాదకారినే! హిందుత్వ ఫాసిజాన్ని ప్రశ్నించినా, సామ్రాజ్యవాద దోపిడీని నిలువరించే ఆలోచనలు చేసినా, తోటి మనుషుల కోసం మనుషులుగా బతకాలనుకున్నా మన మెదళ్ళన్నీ ప్రమాదకరమైనవే.

చరిత్రలో ఇలాంటి మాటలు ఫాసిస్ట్ కోర్టుల్లో, నాజీ “స్పెషల్ కోర్టుల్లో” విన్నాము. మళ్ళీ అదే చరిత్ర మరో రూపంలో పునారావృతం అవుతుంది. అయితే వేల ఏండ్లుగా అణచబడిన జాతుల, కులాల, లింగాల మీద జరిగిన (జరుగుతున్న) హింసకు శాస్త్రబద్ద, ధర్మబద్ద సాధికారతను ఇచ్చిన, ఇస్తున్న మెదళ్ళు ప్రమాదకరమైనవే అని సదరు జడ్జ్ గారు చెప్పగలరా?!

తమ “ప్రమాదకర మెదళ్ళ” మూలంగా రాజ్య బంధీలయిన వాళ్ళను ఒంటరి గదుల్లోనే ఉంచాలట. కాని రాజ్యం వాళ్ళను భౌతికంగా మాత్రమే బంధీ చేయగలిగింది, వాళ్ల భావాలను కాదు. ఇప్పుడు వాళ్ల భావాలు ప్రపంచవ్యాప్తం అవుతున్నాయి. వాళ్లు విశ్వ మానవులవుతున్నారు. వాళ్ల కోసం ప్రపంచ సమాజం తమ సంఘీభావ హస్తాలను ఖండాలు దాటి చాస్తుంది. అందులో భాగంగానే లండన్ నివాసి అయిన సోఫియ కరీం అనే ఆర్కిటెక్ట్, ఆర్టిస్ట్ భారతదేశంలోని  రాజకీయ ఖైదీల విడుదల కోసం ఒక వినూత్నమైన ప్రచారం చేస్తుంది.  

2018 వరకు సోఫియ ఒక సాధారణ మధ్యతరగతి ప్రొఫెషనల్. ఆమె వృత్తి, కుటుంబ కారణాల మూలంగ ప్రపంచం గురించి ఆలోచించడానికి ఒక్క క్షణం కూడా తీరిక లేకుండా వుండేది. కాని 2018లో తన అంకుల్ షాయిదుల్ అలాం ను బంగ్లాదేశ్ పోలీసులు ఎత్తుకెళ్ళి (సాయిబాబ అరెస్ట్ కూడా ఎత్తుకెళ్ళడంతోనే జరిగింది!) చిత్రహింసలు పెట్టి ఆ తర్వాత “చట్టబద్దంగా” అరెస్ట్ చేశామని చెప్పారు. షాయిదుల్ చేసిన నేరం ప్రజావ్యతిరేక ప్రభుత్వ విధానాలను విమర్శించడం. అతను ఒక ఫోటో జర్నలిస్ట్, టీచర్, ఉద్యమకారుడు. అంటే “ప్రామాదకరమైన మెదడున్న” మనిషే!  అయితే అతని మీద మోపబడిన నేరాలు: “ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలను ఉసిగొల్పున్నాడు,” “దేశం ఇమేజ్ ను బద్నాం చేస్తున్నాడు.”

షాయిదుల్ అరెస్ట్ వార్త టీవీలో చూసిన సోఫియ భద్రప్రపంచం ఒక్కసారిగా ముక్కలయిపోయింది, ఎందుకంటే తన అంకుల్ అంటే ఆమెకు అమితమైన ప్రేమ, గౌరవం. ఆయనను ఒక నేరస్తుడిగా జాతీయ మీడియా పతాక బ్యానర్లు పెడుతుంటే తట్టుకోలేక పోయింది. హుటాహుటిగా బంగ్లాదేశ్ ప్రయాణమయి పోయింది. అక్కడకు పోయింది కాని ఏం చెయ్యాలో, ఎట్లా చెయ్యాలో తెలియదు. చాలాసార్లు బెయిల్ నిరాకరించారు. అంతా నిరాశావదమే నిండుకోని వుంది.

అయితే ఒకరోజు షాయిదుల్ ను కోర్ట్ కు తీసుకొస్తున్నారని తెలిసి అక్కడ అతన్ని కలిసే వీలుంటుందేమో అని వెళ్లింది. అంకుల్ ను కనీసం దూరం నుండైనా చూడొచ్చనే ఒక ఆశతో నాలుగు గంటలు కోర్ట్ గేట్ దగ్గరే వేచివుంది. కాని ఇంకా తీసుకు రావడం లేదు. ఒకవైపు ఆకలవుతుంటే కోర్ట్ గోడను ఆనుకోని వున్న సమోసా బండి దగ్గరకు వెళ్ళి రెండు సమోసాలు ఆర్డర్ ఇస్తే వాటిని పాత న్యూస్ పేపర్లతో చేసిన చిన్న బ్యాగ్ లో వేసి ఇచ్చాడు ఆ బండి అతను. తాను ఆ సమోసాలు తింటూ ఆ పేపర్ బ్యాగ్ ను పరిశీలించింది. దాని మీద చిన్న చిన్న నేరాలు చేసిన వ్యక్తుల వివరాలు కనిపించాయి. దానితో తన ఆర్కిటెక్ట్, ఆర్టిస్ట్ మెదడుకి ఒక ఆలోచన వచ్చింది. తన అంకుల్ రాజకీయ విశ్వాసాలను, అతని అరెస్ట్ తీరును కళాత్మకంగా చిత్రించి సమోసా బ్యాగుల ద్వార ప్రచారం చేయాలని నిర్ణయించుకుంది. ఆ ప్రచారాన్ని లండన్ కేంద్రంగా మొదలు పెట్టింది. ఆ సమోసా బ్యాగ్ ఉద్యమం ప్రపంచ వ్యాప్తమయ్యింది. చివరికి 107 రోజుల తర్వాత షాయిదుల్ జైల్ నుండి విడుదల కాగలిగాడు.       

షాయిదుల్ విడుదల తర్వాత తన మానవ హక్కుల చూపును కోల్పోదల్చుకోలేదు. ఇప్పుడు రాజకీయ విశ్వాసాల మూలంగా బంధీలయిన అందరి విడుదల కోసం పనిచేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆర్ట్ ప్రదర్శనలో సమోసా బ్యాగులను, సాహిత్యాన్ని ప్రదర్శిస్తుంది. అందులో భాగంగానే అరుణ్ ఫెరైరా (Colours of the Cage) రచన స్పూర్తితో “లాల్ గేట్” అనే ప్రదర్శనను లండన్ లో నిర్వహించింది. అరుణ్ ఫెరైరా తన పుస్తకంలో ఖైధీలు విడుదలయితే బయటకు వెళ్ళే గేట్ ఎర్ర రంగులో వుంటుంది, ఆ ఎర్ర గేట్ వైపు అందరూ ఆశా, నిరాశల మధ్య కొట్టుకుంటూ చూస్తుంటారు అని రాస్తాడు. దానిని ఒక అంశంగా తీసుకోని “లాల్ గేట్” అనే ఒక ప్రదర్శనను చేశారు.

Lal Gate

అలాగే జర్మనీలో అనేక మంది రాజకీయ ఖైదీల రచనలతో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆర్ట్ ప్రదర్శనను 100 రోజులు నిర్వహించారు. రాజకీయ ఖైదీల విడుదలకు మద్దతుగా సందర్శకులతో ఉత్తరాలు రాయించారు. వంద రోజులు నడిచిన ఆ ప్రదర్శనలో 1500 ఉత్తరాలు వస్తే అందులో 870 ఉత్తరాలు సాయిబాబ కోసం రాశారట. ఆ ప్రదర్శన చివరి రోజు 1500 ఉత్తరాలను నేలంత పరిచి మరో కొత్త ప్రదర్శనతో సంఘీభావం ప్రకటించారు. వాటిని రేపటి చరిత్ర కోసం ఆమె భద్రపరుస్తుంది. ఆ ప్రదర్శన జరిగిన మొదటిరోజు సోఫియాతో పాటుగా ఆమె అంకుల్ షాయిదుల్ కూడా పాల్గొన్నాడట.

అయితే ఆ మొదటి రోజే సాయిబాబ గురించి చెబుతుంటే, ఆయన కవిత్వం చదువుతుంటే అక్కడికి వచ్చిన ఒక పద్దెనిమిది సంవత్సరాల అమ్మాయి కన్నీళ్ల పర్యంతమయ్యిందట. అంతేకాదు ఆ అమ్మాయి తాను మొదటి రోజు విన్నది, ఆ తర్వాత తానుగా చదివినది అందరికి చెప్పడానికి మిగితా 99 రోజులు ప్రదర్శనలో స్వచ్చందంగా పనిచేసిందట. ఆ వంద రోజుల్లో ఆ అమ్మాయి ఎన్నిసార్లు కన్నీళ్లు పెట్టుకుందో, ఎందరి కన్నీళ్లకు సాక్షిగా మిగిలిపోయిందో. ఒకప్పుడు నాజీలు కావాతు చేసిన నేలన సాయిబాబ లాంటి ఉద్యమకారుల కోసం ప్రజలు కన్నీరు పెడుతుంటే, గాంధీ నడియాడిన నేలన ఆయన ఆలోచనలు అత్యంత ప్రమాదకరమని అతున్నత న్యాయస్థానం ప్రకటిస్తుంది.    

సోఫియ తన ప్రదర్శనలను లాటిన్ అమెరికా, అమెరికాలో కూడ జరుపబోతుంది. ఈ రాజకీయ ఖైధీలు తనకు “కొత్త రంగులను కలగనడం నేర్పారు” అని గర్వంగా చెబుతుంది. ఇప్పుడు తన ఆర్కిటెక్చర్ వృత్తిపై కూడా ఆ కొత్త రంగుల ప్రభావం వుందని చెబుతుంది. 

నిజమే మెదడు ఎంత ప్రమాదకారి! బంధీని చేసినా భయపడటం లేదు. మృత్యువు నిత్యం గుసగుస లాడుతున్నా బెదరడం లేదు. భౌతికంగా చిధ్రమవుతున్నా కొత్త ఆలోచనలను చిగురింపకుండా ఉండటం లేదు. ఆ ఆలోచనలు ఖండాంతరాలు దాటిపోయాయి. కాని రాజ్యం ఇంకా వాటిని బంధీ చెయ్యొచ్చని భ్రమ పడుతూనే వుంది. మెదడును నియంత్రిస్తూ విశ్వగురును కావాలనుకుంటుంది. మెదడు లేకుండా విశ్వగురువు కావడం ఎట్లా సాధ్యం!

పుట్టింది చారకొండ (పాలమూరు). పెరిగింది అజ్మాపూర్ (నల్లగొండ). సామాజిక శాస్త్ర విద్యార్థి, ప్రజా ఉద్యమాల మిత్రుడు. అమెరికాలో అధ్యాపకుడిగా, పరిశోధకుడిగా పనిచేస్తున్నాడు.

Leave a Reply