పచ్చని పొలాలు. పారే వాగు. అన్నీ కలగలసిన ఊరే బోగరాజుపల్లె. ఊరు చిన్నదైనా ఉపాయం పెద్దది. మొత్తం ఐదువందల యాభై ఓట్లు. సర్పంచ్ ఓట్ల కోసం ఊరు ఉగ్గపట్టి చూస్తుంది. మాదిగొల్లయే ఓట్లు ఎక్కువ. అధికారంతో శాసించేది. కళ్లతో హద్దులు గీసేది ముస్లింలు. ఎనకటి నుంచి తురుకోల్లదే పటాతోపం. వాళ్లని పటేండ్లు అని సంబోధిస్తారు. నప్పత్ గా ఎస్సీ మహిళకు నోటిఫికేషన్ వచ్చింది.
ఓట్లకోసం లేసినోడు లేవనోడు గోసి పెడుతండు. నామినేషన్ కడితె బ్లాక్ మెయిల్ చేయొచ్చు. విత్ డ్రాయల్స్ పెట్టుమని బతిమిలాటలు, బ్యారాలు ఉంటయి. కాలు అడ్డం పెడితే పారే కాల్వలా ఎంతో కొంత లాభముంటది. ఎందుకు ఊకుందాం? ఏద్దాం ఓ గోలి. తాకితే తాకుతది. లేకుంటే లేదు అని వాటం తెలిసినోల్లు గుంటనక్కలా ఎదురు చూస్తుండ్రు.
పుకార్లు సుడిగాలిలా చక్కర్లు కొడుతున్నయి. కుప్పల శంకరయ్య, బొంబాయి రాజుల మధ్య పోటీ నువ్వా నేనా అన్నట్లుంది. కుప్పల శంకరయ్య భార్య సరిత కలెగలుపు మనిషి. ఎవరితో మాట పోనిచ్చుకోదు. డిగ్రీ చదివింది. కొన్నాళ్లు గ్రామంలో పింఛన్ పంచింది. ఫించన్ ఇంటికి ఇంటికిపోయి చిరునవ్వుతో పంచేది. బతుకవోయినోల్లు వొచ్చినప్పుడు ఇచ్చేది. ఇగవటు బిడ్డా కర్సుల కిందికి తీసుకో అని ఓ నోటు ఇచ్చినా తీసుకోకపోయేది. స్త్రీ నిధి బ్యాంక్ లో పనిచేసి మంచి పేరు తెచ్చుకుంది. తనవల్ల చిన్న లోటు రాకుండా మెదిలేది. వెన్నెపూసినట్లు మాట నునుపు. తనదృష్టికి తప్పనిపించింది మొకమ్మీదనే అనేది. నిజాయితితో పాటే ఖచ్చితం అనే పేరు తెచ్చుకుంది.
బొంబయి రాజు డిగ్రీ సదివిండు. ఈయన భార్య ఇంటర్ చదివింది. ఆ ఇద్దరికీ చదివినమని ఇంత పొగరు వగైరా. భర్తంటే మహా అనుమానం. ఆ వాడకట్టు వాళ్లెవరూ మాట్లాడరు. ఆఫీసులపొంటి తిరుగుతడు. కొంతమందికి ఫించన్లు ఇప్పించిండు. పింఛన్ రానోల్లు ఎక్కువ. లాభం కంటే నష్టమే ఎక్కువ. ఉట్టి ఉట్టిగనే మాట పిస్కగొడుతడు. కోపగొండోడని పేరుపోయింది.
అందరికీ సరిత మీదనే గురి ఉన్నది. తొవ్వల, కనవడ్డపుడు “సరితా! నువ్వే సర్పంజిగ ఉండాలి బిడ్డా!” అని పెద్దలు, ఆమె వ్యక్తిత్వం తెలిసినోల్లు అంటున్నారు.
“సరే బాపూ! మీరు ఉండుమంటే ఉంట.” అని వరసలతీరు జవాబిస్తుంది. అన్ని కులాలవాళ్లు సరిత సర్పంచి కావాలని కోరుకుంటున్నారు. నామినేషన్ ఎయ్యకముందే ఇంటింటికి పోయి “నేను సర్పంచికి నిలవడుతున్న. మీరు నన్ను దీవించాలే. నేను ఫోన్ కాలంత దూరంలో ఉంట. అన్నిటికంటే నా మనస్తత్వం మీకు తెలుసు. మీకు కొత్తగా ఏం చెప్పాలే. నేను సర్పంజిగ లేనప్పుడే ఎంతో సాయం జేసిన. చేస్తున్న. నేను పస్తులున్నా పైసకు ఆసపడలేదు. ఎవలను మోసం చేయలే. చేయాల్సిన పని నలుగురు సరే అనేటట్లు చేసిన.” అని చెప్పుక తిరుగుతుంటే అందరికీ నిజమే అనిపిస్తుంది.
శంకర్ తన ప్రయత్నం చేస్తుండు. యూతును కలుస్తుండు. తాగవెడ్తాండు తినవెడ్తుండు. కుల పెద్దమనుషులకు కూడా కలుస్తుండు. “పటేల్ తో పాటు కూడా నామినేషన్ వెయ్యిరా.”అని నైతిక బలమిచ్చి చాలా మంది “ఖచ్చితంగా నువ్వే గెలుస్తవు పో!” అనే ధీమ చెప్పుతుండ్రు.
“బిడ్డా! మేం లేమా పో!! నువ్వేం ఫికరు చెయ్యకు” అని సరితకు శంకర్ కి కొండంత భరోసా ఇస్తుండ్రు.
బొంబయి రాజు తన లాబీయింగ్ తాను చేసుకుంటుండు. పటేల్ మద్దతి లేకున్నా ఉన్నదనీ చెప్పుతుండు. యూతుకు ఆట వస్తువులు కొనిస్తుండు. తినవెట్టుడు. తాగవెట్టుడు చేస్తుండు. నా శాతనైనంత సాయం జేస్త అంటూ చాకచక్యంగా, ఓట్లను బట్టి, నాడీని బట్టి మాట్లాడుతుండు. కొంతమంది సరితదిక్కు మొగ్గున్నా ఏదో ఒక లాభం లేకపోతే ఎట్లా అనేటోల్లు రాజు శిబిరం వైపు చేరుతున్నారు.
పట్నంల బతుకుతున్న భూమయ్య, పర్శయ్య, నామినేషన్లు కడుతరని గుసగుసలు వినవడుతున్నయి. భూమయ్య తొంబై దశకంలో సర్పంజిగచేసి పట్నం బతుకపోయిండు. పోటీకి వొచ్చిండు. అతనికి ఆగం ఎక్కువ ఆలోచన తక్కువ. పంచాదులల్ల కంటు అయిండు. ఊదుకబుక్కి ఊరుమొకం సూసిండు. ఊరిడ్సి పెట్టి పెంచాల్లం పట్టిండు. పటేల్ ని అడిగిండు. పటేల్ నాకే మద్దతు ఇస్తుండు అని ఊరంత చెప్పుతుండు. సర్పంజికి నేనూ పోటీ చేస్తా అని నామినేషన్ ఎయ్యకముందే ప్రచారం చేస్తండు.
“ఏం లేనపుడు సర్పంజి చేసిన. నేను లాస్ అయిన. నాకొక్క అవకాశం ఇయ్యిండి. దయచేసి, దయచేసి…” అని చిన్నోన్ని, పెద్దాన్ని దయకుదిరెటట్లు బతిమాలుతుండు.
“పటేల్ ఎటుచెప్పితే అటు తప్ప చేసిన బాపతిగాన్ని. నా ముంగట వీళ్లెంత? నన్ను కాదంటడా?” అనే నమ్మకంతో పర్శయ్య.
పటేల్ తన చూపులతో ఊరిని శాసిస్తాడు. రాజుకి పటేల్ కి మాట బెణికింది. రాజుకు మద్దతు ఇయ్యడు అనుకుంటుండ్రు జనం. కానీ రాజకీయంలో శాశ్వత శత్రువులుండరు గదా! పటేల్ ఎవరికీ మద్దతిస్తే వాళ్లు తప్పకుండా గెలుస్తరు.
కొంత మంది వొచ్చి “పటేలా! మమ్ముల ఎవలకు ఓటేయ్యి మంటరు?” అని శేతులు కట్టుకొని అడుగుతుండ్రు.
“ఐతుంటే సూద్దాం దొమ్మర్ల పెళ్లి. మనం ఎయ్యకుండానే కొత్త సర్పంచి వస్తడా?” అని సమాధానం చెప్పుతుండు. తన పలుకుబడితో తిమ్మిని బమ్మి చేస్తడు. ముందుకు తోలి కొంకులు తెగొట్టుట్ల ఆయన్ని మించినోల్లు లేరు. తనకు ఎదురు తిరిగినోల్లను తన కులపోల్లతోటే తన్నించగల నేర్పరి. అవసరాన్ని బట్టి కూడి వున్నోళ్లను కుక్కలను చేస్తడు. ఎరిలేపి ఎగవెఁడు. తోక ఆడిచ్చేటట్లు దువ్వగలడు. పటేల్ మద్దతే కీలకం. ఆలోచిస్తున్నాడు. లోపట్లోపట లెక్కలు ఏసుకుంటున్నాడు. నామినేషన్ వెయ్యక ముందు ఎవరు అడిగిండ్రు. రాజు ఇల్లుదొక్కుకొని వొచ్చినా ఇంట్ల ఉండి లేదనిపించిండు.
‘ముక్కులో ఏ యేలు పెట్టుకున్నా ఎల్లుతది. సర్పంజి ఎవడేతేంది శంకర్ భార్యకు ప్రజల మద్దతి పెరుగుతూవుంది. అందరూ కావలసినోల్లే. ఎవరినీ ఎట్లా తప్పించాలే. ఎవడైతే మనం చెప్పితే ఇంటడో వాడే గెలువాలే. ఇనకపోతే ఇనిపించనా? అయినా నాలాభ మెంతో చూసుకోవాలే’ అని లెక్కలేసుకుంటండు.
మన నియోజకవర్గంలో సర్పంచులు, వార్డు మెంబర్లు అన్ని పంచాయితీలు ఏకగ్రీవం కావాలి. రాష్ట్రంలోనే అత్యధికం మనయే ఉండాలి. రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించిన బహుమానం తీసుకోవడంలో మనమే ముందుండాలి. మండలంలో ఎవరి పలుకుబడి ఎంతుందో మీ మీ ఏకగ్రీవాలే తెలుపుతాయి. రాష్ట్ర మంత్రివర్యులు తన క్యాడర్ కి ముందస్తుగానే ఆదేశాలు జారీచేసిండు.
యాపాకు యాదవరెడ్డి, ఇగురం నారాయణ రెడ్డిలు నంగునూరు మండలంలో నాయకులు. ఒకరు జడ్పీటీసి, మరొకరు ఎంపీపీ. ఒకరు కుడికి మరొకరు ఎడమకు అన్నట్లుంటరు. ఇద్దరి మధ్య పచ్చిగడ్డి వెయ్యకముందే భగ్గుమంటది. ఎవరి గుంపు వాళ్లదే. సర్పంచులు తమ వాళ్లను చేసుకుంటే మండలంల పలుకుబడి పెరుగుతదని ఇద్దరూ పోటీపడి ఏకగ్రీవం చేయాలని ప్రయత్నిస్తున్నారు.
ఊరు ఊరంత సరిత ఉంటేనే బాగుంటదని ఆనోటా ఈనోటా వినవడుతుంది. పటేల్ కి కూడా ఇష్టమే కానీ పెట్టుబడి లేదు. చాలా గరీబ్ లు. అయ్య అయ్య అంటే కడుపు నిండుతాది? పెట్టెకాడ పెట్టాలే. తినే కాడ తినాలే. తినడు. పెట్టడు. ఒక్కొక్కరూ ఒక్కో విధంగా అనుకుంటున్నరు.
నామినేషన్ కట్టెతందుకు ఒగరిని మించి ఒకరు ఖర్చు పెట్టుకున్నరు. తిన పెట్టుడు. తాగవెట్టుడు. తీర్థం సాగిస్తుండ్రు. కొంత మందైతే ఎటూ మాట పోవొద్దని అనుకొని ఇద్దరివైపు వెళ్లారు. విత్ డ్రాయల్స్ పెట్టుకొనే సమయం వొచ్చింది. పాలి బలగం ఓట్లను లెక్కపెట్టుకుంటుండ్రు. రాజుకు పాలివాల్లు ఎక్కువ. దానికి పై సబలమూ తోడైంది. కుప్పల సరితా శంకర్ కి పాలివాళ్లు లేరు. ఒక్కటే ఇల్లు. భూమయ్య పట్నంల ఉంటుండు. ఇప్పుడు ఏమన్న లాభముండకపోతదా? గోడమీది పిల్లిలా ఉన్నడు. ఇగ పర్శయ్య, రాజుకు చిన్నాయిన. రాజు చెప్పితే వింటడు. విత్ డ్రాయలు ఒప్పుకుంటడు. అంటే త్రిముఖ పోటీ అన్నమాట. సరిత, రాజు, భూమయ్యలే. ఊల్లె ప్రభావితం ఎట్లాచేయాలని ఆలోచిస్తున్నారు.
ఎస్సీ, ఎస్టీ రిజర్వు కేటగిరిలల్లోనే ఏకగ్రీవం చేయాలనుకుండు. ఎందుకంటే ఖర్చులు తక్కువ పెడుతరు. పటేల్ ఆ గ్రామ తాజా మాజీ సర్పంచ్. పటేల్ కి యాపాకు యాదవరెడ్డి ఫోన్ చేసి “భయ్యా! నేను రేపు ఏడు గంటలకు వొస్తున్న. అందరి అభిప్రాయం మేరకు కావలసిన వాళ్లను ఏకగ్రీవం చేద్దామన్నడు.”
“సరే భయ్యా, ఓకే, ఓకే” అని ఫోన్ పెట్టిండు. అందరినీ పిలిపించిండు. కర్సులు పెట్టుకొని అప్పుల పాలు కాకుండి. ఆలోచించుకోండి” అని దేవినట్లు పటేల్ మాట్లాడుతండు.
“అభ్యర్థులందరినీ ఫోన్ చేసి పిలిచిండు. గంటసేపట్ల అందరు జమకూడిండ్రు. “నేను చెప్పుతున్నానని కాదు మీరూ ఆలోచించండి. ఇప్పుడు చెప్పినా సరే! రేపు చెప్పినా సరే! నామినేషన్ కట్టినోల్లందరు సర్పంజి అయితరా? కారు. సోచాయిండి. పోటీదారులు నేనంటే నేనుంట అంటన్నరు. మీరు ఆలోచించండి. మీ కర్సులు ఎంతయినయి ఎంత ఇస్తే తప్పుకుంట. అనే విషయాల మీద ఒక నిర్ణయం తీసుకోండి” అని చెప్పిండు.
అందరిలో కొన్ని ఆలోచనలు పుట్టినయి. ఇంటికి వెల్లిండు. రాత్రిల్లు చర్చల మీద చర్చలు జరుపుతున్నారు. బలపరిచేటోల్లతోటి యిసార చేస్తుండు. ప్రజాబలాన్ని నమ్ముకునేటోల్లు ఎట్లైనా గెలుస్తమనీ పోటీకి పోదామనుకుంటుండు. అనుమానమున్నోల్లు అడిగినకంటే ఎక్కువ ఇత్తమని చెప్పుతుండ్రు. రాయబారాలు కడుతుండ్రు. భూమయ్య, పర్శయ్య మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ మేమూ పోటీలో ఉంటనని ఎవరికి వారే బీరాలకు పోతండ్రు.
చీకట్ల ఫోన్ రాగానే జేబంత వెలుతురుతో మెరుస్తున్నది శంకరి ఫోన్ ఎత్తి “అరేయ్ శంకరీ! పటేల్ కి రెండు లక్షలు ఇస్తే నీకు మద్దతిస్తడట? నువ్వు పైసలు పట్టుకొనిరారా. ఎవరిస్తే వాళ్లకే మద్దతట. ఇంటన్నవా? జల్దిరా!” అని ఒక తెలిసిన గొంతు ఫోన్ లో పలికింది.
అందుకు భార్య భర్తలు సిద్ధపడ్డారు. పోటీలో నిలవడితే మూడులక్షలు అయితయని ముందే అంచనాకొచ్చిండు. అవ్వే పటేల్ కిస్తే
మూడు గుడిసెల పల్లె ఒక్క చిత్తమనుకున్నరు. పోదామని బయలు దేరిండ్రు.
చీకట్లు కైనీడల్లా నిలవడుతున్నయి. పగలు కాని పనులు కొన్ని చీకట్లనే అయితయి. నడిమింటి నర్సయ్య శంకర్ ఆకిట్లకి వొచ్చి నిలవడడు. గమనించిన శంకరయ్య ‘వీడు ఆ పాలోడు. రాజుకు మద్దతిస్తండు ఇల్లు సొచ్చుకొని వొచ్చిండు. ఎందుకు?’ అని ఆలోచిస్తండు.
“అన్నా నమస్తే! చీకట్ల ఏమో వస్తివి. కూసో” అని అడుగుతూ కుర్సీని సూపెట్టిండు శంకర్. కూసున్నడు. ఫ్యాన్ ఒంటరిగా తిరుగుతుంది. గోడకు క్యాలెండర్ గాయపడ్డ పక్షిలా కొట్టుకాడుతుంది. సగం దుప్పటి కప్పుకొని నేల మీద పిల్లలిద్దరు ఆదమరిచి పడుకున్నారు.
“ఏమీ లేదు తమ్మీ! సర్పంజి అంటే ఒట్టి ముచ్చట కాదాయే. కాయేత ఇద్దరు ఆడపిల్లలు అయిరి. గాచారం తక్కువై ఓడిపోతే ఎట్లా? బాకీలు మీదపడుతయి? బరిస్తవా?” అని చెప్పుతుంటే శంకర్ తల్లి విని కోడలు మీది కోపంతో ఉన్కమీది రోకలోలే ఉరుకొచ్చింది.
“నేను గదే అంటున్న బిడ్డా! ఆనాడు లేదు. ఈనాడు లేదు. ఇయ్యల్ల రాజిర్కం ఎందుకయ్య. ఎనుకటెవడో కత్తి ఆరే లేని మాదిగోడు ఏడూల్ల మాయితనం అడిగిండట” అని కొడుకు కోడలు మీద కారడ్డమాడుతుంది.
కొరకొర చూపులతో సరిత వేగంగా మొసదీస్తుంది. అయినా “ఇగో సరితవ్వ! ఇంటనేమో ఇను? లేకపోతే మీ ఇష్టం. మీరు సర్పంచ్ పోటీనుంచి తప్పుకుంటే లక్షరూపాయలు రాజు ఇస్తాన్నడు. కాదు పోదంటే ఇంకో మాట మాట్లాడుదామన్నడు.” అని చెప్పిండు
“నర్సయ్య బావా! మేం లక్షరూపాయలు, కర్సులు, ఉపసర్పంజి ఇస్తం. ఆయన్నే ఊకుండుమని చెప్పు. ఈడ రవదూలకు. తలుపు పెట్టి చెప్పితే కొలుపు పెట్టి ఇనకు. వొచ్చిన తొవ్వంటిపో” అని సరిత, శంకర్లు ఇద్దరు చెప్పిండు.
అప్పటికే పటేల్ కి ఫోన్లో నమ్మకంగా డీల్ కుదిరింది.
గేటు ముంగట బండాగింది. గేటు తీసుకొని లోపటికి పోయేవరకు అప్పుడే తిని, పటేలు పటేలవ్వ సోఫాలో కూసుండి టీవీ చూస్తండ్రు. పోత పోతనే పటేలవ్వ కాల్లమీద సరితపడ్డది. “నా అక్క ఎక్కువరాలే. నువ్వు తక్కువరాలే. మీరు దీవించాలే.” అని వేడుకుంటంది.
శంకర్ కూడా “నీకు దండం పటేలా! నువ్వే బతుకసూడు. దస్తిల కట్టి ఉన్న మడతను ఇస్తూ ఇగో ఇవ్వి లక్ష. ఇంకో లక్ష రేపు ఇస్త. మీరే నడిపించండి. మల్ల మీరే సర్పంజనుకోండి. ఎప్పుడైనా, ఎవ్వడొచ్చినా నేనే కాదురా సర్పంజిని’ అని మతిలో అనుకుంటున్నపుడు మీకు తెల్వకుంట మేం ఏం చెయ్యం. సీమ సిటుక్కుమనది. మమ్మల్ని బతుక సూడుండి.” అని పటేల్ ను ఒక్క తీరుగ బతిలాడుతుండు.
“శంకరీ! నాకెందుకురా! నేను పైసలు తీసుకుంటానురా? ముందుగాల ఈ పైసలు తీసుకోండి. నా మద్దతు మీకే ఉంటది పోండి” అని నమ్మకంగా కుదిరిచ్చిండు.
రాత్రంతా వ్యూహాలు. ప్రతివ్యూహాలు, ఎత్తుకు పై ఎత్తులు. ఆలోచనలన్నీ అధికారమే పరమావధిగా సాగుతున్నయి.
బారెడు పొద్దెక్కింది. కిరాణ దుకాణాలు అపుడే మొకం కడుక్కున్నట్లు ఉన్నయి. బెల్లం నీళ్లు సల్లకముందే ఈగల్లా జాండను సుట్టుకున్నరు. టైంకంటే ముందే యాపాకు యాదవరెడ్డి ఇన్నోవా కార్లోంచి బ్రాస్లెట్ వెనుకకు జరుపుకుంటూ దిగిండు. కద్దర్ బట్టలు ఒంటిమీద కడక్ గా మడుతలు మడుతలుగా గోడపారులా నిలవడ్డయి. మస్కూరోల్లు, రాజు మద్దతు దారులు, భూమయ్య, పర్శయ్యలు ఎదుర్కుందామన్నట్లున్నరు.
ఊరు ఊరంత కదిలొచ్చింది. వొచ్చిరాగానే సేతుల చెయ్యేసి మాట్లాడుతుంటే నాలుగు ఉంగరపు రాళ్లు తళతళ మెరుస్తున్నాయి.
“అందరొచ్చిండ్రా?” అని అడిగిండు యాదవరెడ్డి.
“వొచ్చిండ్రు” అని పటేల్ జవాబిచ్చిండు.
“మన ఊరు గురించి మన ఎంపీపీ యాదవరెడ్డి మాట్లాడతడు మనము ఇందాం.” అని పటేల్ అన్నడు.
“ముందు వాళ్లని మాట్లాడనిద్దాం. ఎవరికి తోచింది వారు చెప్పుతరు.” అని యాదవరెడ్డి అన్నడు
“ఊరు బాగుకోసం నేనో ముచ్చట చెప్పుతున్న. ఏకగ్రీవం చేసుకుందాం. మన ఊరిని బాగుచేసుకుందాం. ఏకగ్రీవమైతే పది లక్షలు వస్తయి. ఊరు బాగుపడతది. మీరు ఆలోచించండి.” అని ఎంపిటీసి చెప్పుతుండు.
కులానికొక్కలు మాట్లాడుతుండ్రు. “కల్మషం లేంది. అది కోత్కాలు లేని మనిషి. సర్పంజిగా సరితనే ఉండాలే.” నూటికి ఎనభైశాతమ్మంది సరితకే మద్దతు పలుకుతుంటే వొచ్చిన పోటీదారుల మొకాలు నెత్తురు లేకుంట వాడిపోతన్నయి. గెలుపు తథ్యమైంది. సరితతోటి ఎవలు పోటీకొచ్చినా సరితనే గెలుస్తది అని ఊరంతా చెప్పుతనే వున్నరు.
“చూసుకుందామంటే చూసుకుందాం పోటీలో, ఒక్క ఇల్లు ఉన్నోడు గెలుస్తడా? మాయి నలబై ఇండ్లున్నయి ఎనభై ఓట్లున్నయి.
మా రాజుగానికేం తక్కువ? మా వోడూ గెలుస్తడు. సూద్దాం” అని రాజు మద్దతుదారులు లొల్లి చేస్తుండ్రు.
“ముందొచ్చిన చెవులకంటే ఎనుకొచ్చిన కొమ్ములే ఎక్కువున్నయోమయా, మా భూమయ్య సంగతేంది?” అని ఒకరు.
పంచాదిల ఒక్కడు మాట్లాడడు. నోరున్న మా పర్శయ్యను పెడితే మంచిది.” అని మరొకరు.
తాము మద్దతిచ్చే వారిలో ఉన్న మంచి గుణాలు మాత్రమే ఆవిష్కరిస్తున్నరు. లొల్లి అంతకంతకు ఎక్కువైతంది. ఇట్లయితే బాగలేదనుకొని పటేల్, యాదవరెడ్డి బదురుకున్నరు. వేదిక మార్చిండ్రు.
యాదవరెడ్డి, పటేల్ లేవంగనే అందరు ఎంపీపీ ఏమో చెప్పుతడని సప్పుడు కాకుంట మిట్టమిట్ల సూస్తండు. “భోగరాజుపల్లి గ్రామ ప్రజలకు నమస్తే! నా మాట ఇనండి. ఇదంతగాదు. సంయమనం పాటిద్దాం. లొల్లిల ఎల్లి కాటగలసినట్లున్నది. కాబట్టి కులానికి వొక్కలు చొప్పున ఓ పదిమంది. మద్దతుదారులు నలుగురు రాండి. రెండుగంటలకు సిద్దిపేట మా ఇంట్ల. మాట్లాడుదామని” అని చెప్పంగనే..
“ఆ… గంతే, గంతే!” అని పటేల్ కొంత మందితో అనిపించిండు.
మళ్లీ చర్చలు. రాయబారాలు. ఎవరికెవరు వింటలేరు. డీల్ కుదిరితే అక్కన్నే కొన్ని డబ్బులు కట్టి ఓ.కే చేసుకుందామని డబ్బులు జమచేసుకుంటండ్రు. మేమే గెలుస్తున్నమని సాయంత్రానికి ఇంతెజాంకు తయారు చేసుకుంటున్నారు.
బోగరాజు పల్లె మొత్తం కదిలివొచ్చింది. వేదిక మాత్రం యాదవరెడ్డి ఇల్లు. అభిప్రాయాలు చెప్పేది కొంతమందే. ఎప్పటిలాగే యాదవరెడ్డి, పటేల్, గ్రామపెద్దలు, ఇంకొంత మంది ఇంట్ల కూసున్నరు. కులానికి నలుగురు చొప్పున పిలుసుకున్నరు.
“ఎవరి తరుపున వొచ్చినమనేది ముక్యంగాదు. ఇప్పుడు మనందరం సమానం. మనం ఊరు గురించి, ఊరుకు ఎవరు ఉపయోగపడుతరో ఆలొచిద్దాం. వీడేం తోడి పెట్టడు. వాడేమి తోడి పెట్టడు తొర్రల పాసు. మనవల్ల మనూరికి మేలు జరుగాలే, ఇప్పటికీ ఊళ్లో బాలవికాస నీళ్లు లెవ్వు. ఇంకొన్ని సమస్యలు ఉన్నయి. ఎవరు తీరస్తరు. ఎవరి వల్ల ఉపయోగాలో ఆలోచిద్దాం.” అని యాదవరెడ్డి నిబంధనలు చెప్పుతుండు.
“ఆలోచించండి. చెక్కగానికి ఏ పెండ్లం నెగుల్తది? దమ్మూ ధైర్యంలేనోనికి ఏం చేసినా దండుగే.” ఒక్కొక్కరు ఒక్కోవిధంగా సామెత చెప్పుతుండ్రు. ఎవరు మంచి, ఎవరు చెడు. ఎవరి వల్ల గ్రామానికి లాభమనీ బేరీజు వేస్తున్నారు. ఇప్పుడు పోటీదారుల గురించి మాట్లాడుదాం.
“రాజు గురించి చెప్పుండి.” యాదవరెడ్డి అడుగుతుండు. “
వొద్దే వొద్దు. గర్వమెక్కువ. చిన్నాలేదు. పెద్దాలేదు. కులం పేరుమీద కేసులు పెట్టిండు. మన దగ్గరనే పైసలు వొసూలు చేసిండు. వాడు పదవిలేకముందే పరేషాన్ చేసిండు. పదవొస్తే మూడు చెర్లనీళ్లు తాపుతడు. వాన్ని ఎన్నుకుంటే తీటది ఉన్నకాడ నిత్తె కయ్యమున్నట్లుంటది.”అని ఒక్క గొంతు.
“భూమయ్య మంచిగనే చేయోచ్చు. కాని వాన్నుంచి ఏడ అయితది? వానికి పూట గడుసుడే తక్లిప్ అయితంది. ఆ మనిషి ఆగమాగం. అడ్వడ్వి. వొద్దేవొద్దు.” అని మరో గొంతు.
“పర్శయ్య మాట నునుపున్నది. తెలివోడే. తెగారం లేనోడు. వాడే అప్పుల పాలైండు. వాడు కోలుకోడు. మండలం పోవాలంటే వాన్నే బసుకిరాయి పెట్టుకొని తీసుకపోవాలే. గసొంటోడు పనిత్తాడు?” అని ఓ పీల గొంతు.
“కులానికి తక్కువైనా గుణానికి ఎక్కువే. మర్యాద మనిషి. సరిత చాలా మంచిది. ఉన్నది ఉన్నట్లు చెప్పాలంటే సరితనే మంచిది.” అందరు సరితకే మద్దతిస్తుండ్రు.
వీటికి నువ్వేమి సమాధానాలు చెప్పుతవు అన్నట్లు యాదవరెడ్డి పటేల్ దిక్కు సూసిండు
“ఏమీ లేదన్నా! రాజుగాడు కేసువెడ్తే. నేనే పెట్టిచ్చిన్నని నన్ను తిట్టిండ్రు. నేనెందుకు వోతా అని పోలేదు. అది కేసైంది. వాడు నా మీదికి తిరుగబడ్డడు. వానికి నాకు మాటల్లెవ్వు. మన ముందట బచ్చాగాడు. మనలదాటిపోడు, పోతడా? ఏ పొమ్మను. కేసుపెట్టుమను నా తడాకా చూపిస్తం” అని పటేల్ అంటుండు.
“మనకు ఎవడైనా సరే! వీళ్లలో సట్టు ఉన్నోల్లు లేరు. అందరు కలిసి ఏడెనిమిది లక్షలు కర్సు పెడితే మహా ఎక్కువ. మనకేం లాభము లేదు. అడుక్కతినెటోడు అన్నం పెడుతాడు? నేను ఒక కథ చెప్పుత వినుండ్రి. ఒకడు సద్ది పెట్టుకొని సంకనాక కైకిలి పోతండట. వానికొగడు తగిలి కైకిలి నేనొస్త నేనొస్త అని అన్నడట. వశపడక రా రా బయి అన్నడట. పోతన్నపుడు సప్పుడు చెయ్యలే. పోయినంక
మూడు గుడిసెల పల్లె
వాడి ముడ్డి నాక వెట్టిండట. గట్లుంటది వీళ్లతోటి.” అని పటేల్ అంటుండంగా అందరి మొకంలో నవ్వులు పూసినయి.
“వీళ్ల వల్ల రేపు రేపు ఊరికి ఉపకారం ఏముండది. నేను ఏ కుక్కతోని పొయితోడించే బాధ్యత నాది. మీరేం పికర్ చేయకుండి. నేనున్న.” అని పటేల్ నమ్మబలికిండు.
“నువ్వేం చెప్పుతవో చెప్పే అన్న” యాదవరెడ్డికి మీద బారమేసిండు.
వారందరు కల్సి ఒక నిర్ణయం చేసిండ్రు. పెద్ద మనుషులు అందరు పోటీదారుల్ని పిలిసిండ్రు. అందరినీ ప్రమాణపూర్వకంగా ఎవరెవరు ఎంతెంత కర్సులు పెట్టిండ్రో అడిగిండ్రు. ఇండెంట్ రాసుకున్నారు. ఇంకో ముచ్చట ఈ నిర్ణయం సిద్దిపేటల జరిగింది. రేపు ఉదయం ఏడుగంటలకు గ్రామ పంచాయితికాడ గ్రామ ప్రజల సమక్షంలో నిర్ణయం చేద్దాం. మొదటి ఛాన్స్ మాత్రం సరితా శంకర్‌లకని చెప్పిండు. తర్వాత భూమయ్యకి, మూడవ చాన్స్ రాజుకు, చివరగా పర్శయ్యకు అని కూడా చెప్పిండు.
“ఏక గ్రీవం చేద్దాం. మనము ఇంత నిర్ణయించుదాం. ఎవరు సర్పంజికి వస్తరో వాళ్లు వార్డు మెంబర్లకు కర్సుల కింద రెండు లక్షలు. భూమయ్యకు, పర్శయ్యలకు ఇద్దరికి ఒక లక్ష. రాజు గానీ సరిత గాని తప్పుకున్నోల్లకు ఒక లక్ష. బాలవికాసకు రెండు లక్షలు. గ్రామ పంచాయితి ఫండు లక్ష. మొత్తం ఏడు లక్షలుగా నిర్ణయించినం.” అని చెప్పిండు యాదవరెడ్డి.
రాజుకు తనమామ మూడు లక్షలు ఇస్తనని చెప్పింది గురుతుకొచ్చి తాననుకున్నట్లే జరిగిందని రాజు లోలోపల సంతోషపడుతుండు. ఎందుకంటే అన్ని రూపాయలు ఎవరు తేరు. నేనే తెస్తననే నమ్మకం కుదిరింది. మూడు లక్షల్ల ఎన్నికలు అయిపోతయనుకుంటే రెండింతల కంటే ఎక్కువ గావట్టెనని సరితశంకర్లు ఒకరి ఒకరు చూసుకుంటున్నారు. ఎట్లయితేంది? నామినేషన్ వేసినందుకు యాభైవేలయితే వస్తయని లోలోపల భూమయ్య, పర్శయ్యలు చెంగలిస్తుండ్రు.
నిజం ఆకిలి దాటకముందే అబద్దం ఊరు దాటినట్లు గంటలోపల పోన్లల్ల ఊరంతా ఎర్కయింది. శంకర్ కి కీడు శంకించింది. ఆపత్కాలములో ఆశ్రయించేది తన బావమరిది శ్రీనివాసను మరియు కో బ్రదర్ మల్లేశంను. కొంత చర్చ జరిగింది. నోటికాడి బుక్క ఎత్తగొడుతున్నరు. ఏందిది? అని ఆలోచిస్తున్నరు.
బారెడు పొద్దును భుజానేసుకొని సూరుడు మొగులు మీదికి పోతున్నపుడు అందరు జమయిండ్రు. సుట్టాలు, బంధువులు కూడ వొచ్చిండ్రు. వొచ్చె రాకడనే మాట్లాడుతున్నరు. ఒక్కొక్కరినీ పైసలు అడుగుతుండ్రు. మౌనంగా నిలవడ్డ ఊడలమర్రి. మసీదు ముందు ఎనుకటి యాప చెట్టు. నడుమ సున్నమెయ్యక గుడ్డికాయపట్టిన పంచాది ఆఫీసు. ఆ ముందట అందరు జమై ఉన్నరు.
‘నిన్న చెప్పిన కాడ్కి పైసలు కట్టుండ్రి. మీరే సర్పంజీ” అని సరితను ఉద్దేశించి చెబుతుండు పటేల్.
“మేం ఓట్లకే పోతం. ఓడిపోతే ఓడిపోతం. గెలుస్తే గెలుస్తం. ఎట్లయ్యేదుంటే అట్లయితది. మీరు చెప్పినంత ఇయ్యలేం.” అని సరితన్నది.
“ఏకగ్రీవమనుకుంటిమి. నలుగురు నడిసింది తొవ్వ. పదిమంది పాడింది పాట. నీ నుంచి ఐతదా? కాదా? శంకరీ”అనిపటేల్ అడుగుతుండు. శంకర్ స్పందించలే…
‘ఎట్లయిన నేనే కడుతనని ‘ మనుసులో అనుకొని “మీరు కట్టుమంటే నేను రూపాయలు కడుత.” అని రాజు ముందుకొచ్చిండు.
“కట్టుకో! మొత్తం కట్టుకో! నేను విత్ డ్రా పెట్టుకోను?” అని శంకరన్నడు
“పైసలు కట్టి మీరే సర్పంజీగా వుండుర్రి.” ఊరోల్లంతా కూడబల్కొని అంటుండ్రు. సరిత దిక్కు తిరిగినోల్లంత స్థబ్దంగా ఉండిపోయిండ్రు. మహిళా సంఘ అధ్యక్షురాలు తన విశ్వరూపం చూపుతుంది. అంతదాక సరిగాడు అని చెల్లే అని పిలిచేది. అక్కర్లు ఎల్లదీసుకునేది. ఇప్పుడు మాత్రం బద్దవిరోధి అయి మాట్లాడుతంది.
“దానితాడ ఏమున్నయి లొట్టపీసు. దమ్ములేనోడు దుమ్ముల ఏమో చేసిండట. అది విత్ డ్రా పెట్టకపోతే ఊరియి ఏమన్న వొంకర వోతయా? దానియి వొంకర వోతయా? అంత సిపాయి ఆడిదా? సెప్పితె ఇనదా? సేతులుండదా” అని గలీజుగ తిడ్తుంది.
సరిత అక్క కనకలక్ష్మీ తోకతొక్కిన తాచుపాములా లేసింది. “ఓ సిపాయి ఆడిదాన! ఏమో లావు మాట్లాడుతున్నేమే. నువు ఏమో వొంకర టింకర మాట్లాడుతున్నవ్. వొంకర వోయినోల్లయి ఎంత మందియి సక్కగ చేసుకుంట వొచ్చినవే. ఎన్ని యూనానమస్లు చేసినవే” అని మాస్ కు, మాస్ క్లాస్ ఉండే లక్ష్మీ మరో రూపాన్ని ప్రదర్శిస్తుంది.
“అదెవతో, ఏ వూరుదో వాసి తోసి కొడుతుంది. శిగెంటుకలుపట్టి తంత ముండా…” అని అధ్యక్షురాలు.
“ఏ రాయే ముసల్దాన. రా! కలెక్టర్ కి ఒక్క ఫోన్ చేస్తే పాసుకపోయేటట్టు ఒక్క తన్ను తంతడు. తయారుగుండు. మీ తాత
జాగీరనుకుంటుండ్రా! మీకు సాగొచ్చిన ముచ్చటా ఇది? మీ అసొంటి కూటిగుత్తోల్లు చెయ్యవట్టి పైసకు అమ్ముడుపోయి పరేషాన్ చేస్తుండ్రని, దొంగ యూనానమస్లు చేయొద్దని పేపర్ కిచ్చిండ్రు. ఇగో సూడు?” అని వకీలు మాటలు మట్లాడుతుంది.
“ఇది మూడు గుడిసెల పల్లె. సోడిగాడి ఇల్లు. ఈ తావుల ఇంకొగన్ని నెగులనియ్యరు. ఎచ్చనియ్యరు. ఈ ముండకొడుకులే అంత. బంగారమసొంటి పోరి సరిత. అదైతేనే బాగుండు” అని చూపు ఆనని ఒక అవ్వ ఒక్కటే కలవరింపు మల్లేశం చెవిలో వినవడుతుంది. విందామని దగ్గరికి పోయి ఆరా తీస్తుంటే ఆ అవ్వ మాట్లాడుతూ “బిడ్డా! ఊరిని సేతులపట్టుకుంటడు. వాడు ఆడిందే ఆట. పాడిందే పాట. ఎర్రవచ్చనిపోరి ఎవరికంబ్లెయ్యకుం. దానిమానానదాన్ని బతుకనియ్యిండ్రి” భవిష్యత్తును పోతపోస్తంది.
“ఛల్ ఈ ఆడోల్లను ఎవలు రమ్మన్నరు. ఎవలు లొల్లి పెట్టుమంటురు. మీరే చెయ్యిండి.” అని మాట్లాడుంతుండు పటేల్
లొల్లి సద్దుమనిగింది. “ఓ సరితా! నువ్వైతే సిద్దిపేట ఒట్టు పెట్టుకున్నవ్. నీకు ఇద్దరు ఆడపిల్లలు. రశీదు తప్పితే మశీదు. ఎదురుంగ ఏండ్ల నుంచి ఉన్న మజీద్ ఉన్నది. మసీదు కెదురుంగ మైసమ్మ ఉన్నది. యాపచెట్టుకింద నువ్వన్నవు. చెప్పు నీ ఆలోచన. పైసలు కడుతవా?? లక్షరూపాయలు, కర్సులు తీసుకొని పక్కకు జరుగుతవా? వీళ్లకు ఇవ్వవలసియి యియ్యి. సర్పంజివి నువ్వేగా” అని ఉన్నముచ్చట పటేల్ చెప్పుతండు.
“నువ్వు గట్టిగుంటే నేను ఎలక్షన్ కమీషనర్ కి ఫిర్యాద్ చేద్దాం బావా. పోటీకి పోదాం బావా”అని శ్రీనివాస్ అంటున్నాడు.
“భయపడకు తమ్మీ ఎంతదాకైతే అంతదాక పోదాం. నువ్వు ఊ అను” అని మల్లేశన్న భరోస నింపుతున్నడు.
“సరిత అంటే గౌరవమే. ఇప్పటికీ ఆమేకే విలువ ఇస్తన్నం. పంచాది పెట్టుకున్నాడు బాగుపడినోడు ఎవ్వడులేడు. ఊరంత ఒక కట్టు కట్టినం. ఊరంత ఒకదిక్కు ఊసుగండ్లోడు ఒకదిక్కు గెలుత్తదా సరిత”అని పటేల్ తత్త్వం చెప్పుతండు.
మాకీ రాజకీయమూ వొద్దు, మూడు పూటలకూ ఒక్క పూట తిని బతుకుతం. అందరు కలిసి ధూల్ మిట్టవాగుల దుంకుండ్రి. నాకు ఆ లక్ష వొద్దు. ఏదీ వొద్దు” అని సరిత ఇంటికెల్లుతుంటే యాపచెట్టు పూలు రాల్చుతుంది. రిటైరైన ఆటగానికి వీడుకోలు పలికినట్లు కొన్ని కన్నీళ్లు కొలుకుల నుంచి దూకుతున్నాయి.
శంకర్ ని పక్కకు పిలుసుకొని “నల్లెంటుకలు వాపుతే తెల్ల ఎంటికెలు పీకొచ్చు. రాజుగాన్ని ఈ ఐదేండ్లల్ల అడుక్కతినే తీరు చెయ్యకపోతే నేను పుట్టుపటేల్ ని గాదురా? నీకు, నీ భార్యకెందుకురా ఈ లొల్లి.” అని పటేల్ ముగించిండు.
గుండెపలిగిన డప్పులా మూగవోయిన గొంతుతో శంకర్…