మీ స్వేచ్ఛ కోసం యెలుగెత్తి నినదిస్తాం

మేము దుఃఖిస్తున్నాం
మీరు కోల్పోయిన జీవితాల కోసం
నెత్తురోడుతున్న మీ శరీరాల కోసం
కూలిపోయిన మీ ఇళ్లకోసం
విలువైన మీ ప్రాణాల కోసం

మీకూ మాకూ మధ్య వున్న
మహాసముద్రాలకావల నుండి
ఆంతులేని మీ వేదన చూసి
మేము విలపిస్తున్నాం

మేము మా కళ్లముందే
యుద్ధం సాకుతో జరుగుతున్న మారణహోమం
నిజం కాదని
మమ్మల్ని మేము మోసగించుకుంటాం

మాకు పొడిచే పొద్దులున్నాయి
నిద్రపోయే రాత్రులున్నాయి
వాటి మధ్య గీత మీకు చెరిగిపోయింది

ఇక తప్పదు…
మేము మా కోపాన్ని తిరుబాటుగా మలుస్తాం
మా ఆవేదనను చర్చల్లోకి మళ్లిస్తాం
మీ కోసం మా గుండెలు ద్రవిస్తున్నాయి
మా మాటలను మీ కోసం సంధిస్తాం

మా దగ్గర జరిగే దారుణాల్ని కూడా
చూసీ చూడనట్టు మేం తలతిప్పుకుంటాం
సానుభూతి చూపించి అంతలోనే మర్చిపోతాం

ఇక తప్పదు…
ఈ అణచివేత యంత్రాంగాన్ని
ఈ హింసాదౌర్జన్యాల వ్యవస్థను
ఖండాంతరాల నుండి
ప్రతిఘటిస్తాం! ప్రతిఘటిస్తాం!

మీ స్వేచ్ఛ కోసం యెలుగెత్తి నినదిస్తాం
మీ నొప్పిని గుర్తుపెట్టుకుంటాం
మళ్లెపుడూ మర్చిపోకుండా
తిరగబడతాం! తిరగబడతాం!

(తెలుగు: చైతన్య చెక్కిళ్ల)

పుట్టింది, పెరిగింది హైదరాబాద్. అశోక యునివర్సిటీ నుండి లిబరల్ స్టడీస్ లో పోస్ట్-గ్రాజుయెట్ డిప్లొమా పొందింది. ఆర్కిటెక్ట్ గా పని చేస్తోంది. చిన్నప్పటినుండీ చదవడం, రాయడం అంటే ఆసక్తి. 2016 లో తన కవిత్వ సంపుటి 'Quill' ప్రచురించింది.

Leave a Reply