దండాలూ ఆర్కే నీకూ ఎర్రెర్ర దండాలూ

అడవి తల్లీ ఒడి అమ్మయి లాలించీనాదా
ఆకులు రాల్చిన నీళ్లూ జీవగంజయ్యీనాయా
చుట్టూ ఇనుప కంచె పక్కన జనసేన
పక్షుల జోహార్లూ ప్రకతి రాల్చే పూలూ
దండాలూ ఆర్కే నీకూ ఎర్రెర్ర దండాలూ
ఆకాశమెర్రాబారీ కప్పేనా జెండాలూ – || దండాలు ||

అడవి తల్లీ ఒడి అమ్మయి లాలించీనాదా
ఆకులు రాల్చిన నీళ్లూ జీవగంజయ్యీనాయా

కటిక చీకటిలోనా మెరిసే తారల గుంపూ
నిండూ అమాసపైన పండు వెన్నెల పోరూ
గుంట నక్కల వేట పైడికంటెల పాట
గాలి పలికే హోరు ఘనమైన జోహారూ
దండాలూ ఆర్కే నీకూ ఎర్రెర్ర దండాలూ
ఆకాశమెర్రాబారీ కప్పేనా జెండాలూ – || దండాలు ||

అడవి తల్లీ ఒడి అమ్మయి లాలించీనాదా
ఆకులు రాల్చిన నీళ్లూ జీవగంజయ్యీనాయా

కండ్లల్ల ఎర్రజీర భళ్లున తెల్లారీనాదా
కన్నీటి ధార కదిలీ కర్తవ్యం గీసీనాదా
కొలువూదీరిన చెట్లూ బారులు దీరీవుండా
కొండాలెనుకా పొద్దూ ఎరుపెక్కీ కుంగీనాదా
దండాలూ ఆర్కే నీకూ ఎర్రెర్ర దండాలూ
ఆకాశమెర్రాబారీ కప్పేనా జెండాలూ – || దండాలు ||

అడవి తల్లీ ఒడి అమ్మయి లాలించీనాదా
ఆకులు రాల్చిన నీళ్లూ జీవగంజయ్యీనాయా

కాపాడిన అడవి తల్లీ వీడ్కోలూ పలికీనాదా
జింకాలేళ్లూ అలసీ పరుగూ మానీనాయా
అమ్మూ విల్లూలన్నీ అవనతామయ్యీనాయా – 2
అదనూ జూసీ అడవీ కదనామయ్యీనట్లూ
అమరూడయ్యీ ఆర్కే సమరమయ్యీనాడా
త్యాగంతో నింగీ నేలను సింగీడై కలిపీనాడా || త్యాగంతో – 2 ||

(విప్లవోద్యమ నాయకుడు కామ్రేడ్ ఆర్కే స్మతిలో…. )
……………………………………………………………….

మున్నా మున్నా మున్నా
నా చిన్నారి పొన్నారి కన్నా || మున్నా || – 2

నాన్న తీగకు నువు వారధివీ
నా కలల ప్రపంచం సారధివీ
అడిగి అడిగీ ప్రశ్న ఆకాశం
నడుమ అడివే తీర్చిందా సందేహం… మున్నా… || మున్నా ||

నీ తండ్రి భుజం మీద బందూకురా
నిన్నెత్తుకునే జాగ యాడుందిరా
నీలాగె చుట్టూర జనసేనరా
కొడుకైన జనమూలో భాగమేరా
పొద్దంత మీ నాన్న సూర్యుడైతె
రాత్రంత ఎన్నెలై సెంట్రీగాస్తివా మున్నా… || మున్నా ||

నిన్ను పొమ్మంటు దీవించలేనైతిరా
నిన్ను వద్దంటు నేచెప్పలేనైతిరా
నువు మెచ్చిన వనమంత జానమేరా
నీకిచ్చిన ఆస్తంత త్యాగమేరా
నిన్ను చుట్టుముట్టిందో పద్మవ్యూహం
నువు అభిమన్యుడైనావ ప్రజలకోసం మున్నా… || మున్నా ||

పథ్వంటు ఒకపేరు పెడితేనురా
పుడమి తల్లిగ నన్నె చేశావురా
ఎంత కడలైన అడవైన నీలోనరా
కొంత కాలంకి నేనైతె అంతేనురా
సొంత వూరిని నీవింక విశ్వమేరా
లోకమే మీ నాన్న వూసుకదరా మున్నా… || మున్నా ||

నాన్న దారిలో నువ్వే పోయావురా
నీ దరికే మీ నాన్న వచ్చాడురా…. 2

( 24 అక్టోబర్ 2016న రామగూడ బూటకపు ఎన్కౌంటర్ లో అమరుడైన కామ్రేడ్ ‘మున్నా’ స్మతిలో…)

పుట్టింది కరీంనగర్ జిల్లా వేములవాడ. కవి, రచయిత, గాయకుడు. విప్లవోద్యమ నాయకుడు. అసలు పేరు కూర దేవేందర్. కలం పేరు మిత్ర. అమర్ పేరుతో సీపీఐ(ఎం.ఎల్.) జనశక్తి రాష్ట్ర కార్యదర్శిగా పనిచేశాడు. రచనలు : 1. మిత్ర తెలంగాణ పాటలు, 2. పొదుగు, 3. వరుపు, 4. మిత్ర జనం పాటల సవ్వడి (పాటలు); 5. చితాభస్మంలోంచి...(కవిత్వం); 6. తెలంగాణ డప్పు దరువు, 7. తెలంగాణ ధూం ధాం, 8. తెలంగాణ కోలాటం పాట, 9. ముంబై తెలంగాణం, 10. బహుజన బతుకమ్మ, 11. వీరతెలంగాణ (నృత్యరూప గానాలు).

Leave a Reply