మా వూరి కథ – 4

ప్రజా ప్రతినిధులు మాట్లాడటం అయిపోయిన తరువాత కార్మిక సంఘాల నాయకులు మాట్లాడటానికి అవకాశం ఇచ్చారు… మొదట ఎర్రజెండా యూనియన్‍ నాయకుడు మాట్లాడటానికి లేచిండు. ముందు వరుసలో కూర్చున్న ఆయన అనుచరగణం తమ నాయకుని పట్ల విధేయత ప్రకటిస్తూ హుషారుగా అరిచిండ్లు.

సింగరేణిలో ఎర్రజెండా యూనియన్‍కు సుదీర్ఘ చరిత్ర ఉంది. కాని అది ఇంగువ కట్టిన గుడ్డలా వాసన తప్ప పోరాట స్ఫూర్తి లేకుండాపోయింది. అవినీతి, ఆశ్రిత పక్ష పాతంతో పాటు కుల రాజకీయాలు ట్రేడ్‍ యూనియన్‍లో చోటు చేసుకున్నాయి.
‘‘వీడు కంపెనీ మనిషే’’ ఎవడో జనంలో నుండి అసహనంగా అరిచిండు..

వేదిక మీదికి వచ్చిన నాయకుడు ఒకసారి జనంకేసి, ముందు వరుసలో కూర్చున్న తన అనుచరగణం కేసి చూసి మాట్లాడటం మొదలు పెట్టిండు.
‘‘కంపెనీ మనుగడ సాగించాలంటే, పోటీ ప్రపంచంలో సంస్థ నెగ్గుకురావాలంటే, ఉత్పత్తి ఖర్చులు తక్కువగా ఉండే ఓపెన్‍ కాస్టులే శరణ్యం’’ అన్నాడతను.
‘‘నేను చెప్పలే వీడు కంపినితొత్తు అని’’ ఇందాకటి యువకుడే మళ్ళీ అరిచిండు’’.
‘‘అండర్‍ గ్రౌండ్‍ బావులు మూతపడ్డాయి. అట్లా మూతపడిన బావుల్లో మూడో వంతు బొగ్గును వదిలేశారు. అట్లా వదిలేసిన బొగ్గును తీయాలంటే ఓపెన్‍ కాస్టులు తప్ప మరో మార్గమేమి లేదు’’. అన్నాడు లీడరు.

అంతకు ముందు మాట్లాడిన అదే పార్టీ ఎమ్మెల్యే మాటలకు అదే పార్టీ యూనియన్‍ నాయకుని మాటలకు పొంతనలేదు. పరస్పర విరుద్ధంగా మాట్లాడం విచిత్రం.
కంపెనీ తమకు అనుకూలమని బావించిన నాయకులను మందే చేరదీసింది. వాళ్ళ జేబులు నింపింది. వాళ్ల పైరవీలకు తలలూపింది. దొంగలు దొంగలు ఊళ్ళు పంచుకున్నట్లుగా అందరికీ అందరు ఒక్కటె•ండ్లు. ఒకప్పుడు సరిగ్గా ఇదే బావి మీదికి రావాలంటే వెన్నులో వణుకుపుట్టిన నాయకులకు ఇవ్వాళ అదే బావి మీద తమ కపట నాటకానికి తెరతీసిండ్లు.
నాయకుని మాటలు కొనసాగుతున్నాయి.

‘‘మేం కొత్త ప్రాంతంలో ఓసీపీలను వ్యతిరేకిస్తాం. కాని ఇక్కడ పరిస్థితి వేరు. ఎందుకంటే అండర్‍ గ్రౌండ్‍ గనులు మూసేసిన తరువాత నాల్గింట మూడవంతు బొగ్గు ఇంకా మిగిలిపోయింది. దాన్ని అట్లాగే వదిలేస్తే జాతి సంపద నష్టపోతం. అంతే కాదు భూమి పొరల్లో ఆ బొగ్గు మండి కాలుష్యం ఏర్పడుతుంది. విషవాయువులు వెలువడుతాయి. పర్యావరణం దెబ్బతింటుంది. మనుష్యుల ప్రాణానికి ముప్పు కాబట్టి, కళ్యాణి ఖని ఓపెన్‍ కాస్టు రావాలి.. దానిని వ్యతిరేకించటం అంటే అభివృద్ధిని వ్యతిరేకించడమే’’ అన్నాడు అతను గంభీరంగా.
అంతు పొంతులేని వాదనలతో తన విషపు ప్రచారానికి షుగర్‍ కోటింగ్‍ అద్దుతున్నాడు నాయకుడు.

‘‘ఓసీపీలు నడువకుంటే కంపెనీకి నష్టాలు వస్తాయి. కంపెనీకి నష్టాలు వస్తే కార్మికులు ఉద్యోగాలకు భద్రత ఉండదు. కాబట్టి కార్మికుల ఉద్యోగాలకు రక్షణ కావాన్నా ఓసీపీలు రావాల్సిందే’’ అన్నాడు నాయకుడు.
ఆ మాటలకు జనం గోల గోలగా అరిచిండ్లు.

‘‘భయం లేని కోడి బజార్ల గుడ్డు పెట్టిందట. తాము ఏం మాట్లాడినా ఎదురు చెప్పేవాడు లేనప్పుడు ఎంతైనా మాట్లాడవచ్చు. ఏదైనా మాట్లాడవచ్చు’’ అన్నారోకరు.
‘ఆయన ఇవ్వాళ కొత్త ఓసీపీలను వ్యతిరేకిస్తామని పాత బావులను ఓసీపీలుగా మారిస్తే సమర్థిస్తాం అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నాడు. కాని సరిగ్గా నాలుగేండ్ల క్రిందట ఓసీపీ క్రింద రామక్రిష్ణాపూర్‍ సగం పట్టణం మునిగిపోతుంటే’ అక్కడ దాదాపు ముప్పయి ఏండ్లుగా వ్యాపారాలు చేసుకుంటూ బ్రతికే వ్యాపారులు, జనం వీదుల్లోకి వచ్చి ఓసీపిని వ్యతిరేకిస్తూ ఆందోళనకు దిగిండ్లు. పబ్లిక్‍ ఇయరింగ్‍లో తమ వ్యతిరేకతను వ్యక్తం చేయడానికి వస్తే ఇదే నాయకుడు తమ గుండా గ్యాంగులతో వాళ్ల మీద దాడి చేయించిండు. చివరికి ప్రజల తరుపున మాట్లాడటానికి వచ్చిన పర్యావరణ పరిరక్షకులను, హక్కుల సంఘం వాళ్ల మీద జులుం ప్రదర్శించి మాట్లాడకుండా చేసి, పబ్లిక్‍ ఇయరింగ్‍ సజావుగా జరిగిపోయేటట్లు చేసిండు. ఆ ఓసీపీ క్రింద రామక్రిష్ణాపూర్‍ పట్టణం, దొరగారిపల్లి, అమరవాది గ్రామాలే కాదు రాళ్లవాగు, తోళ్లవాగు, పాలవాగును ఓపెన్‍ భూతం మింగేసింది. ఊళ్లు పోయి భూములు పోయిన జనం అన్నమో రామచంద్రా వలసపోయారు.’’ అన్నాడు మరో కార్మికుడు.

నిజంగానే వీరు చెప్పినట్టుగా ఓపెన్‍ కాస్టులు వస్తే కార్మికులు బాగుపడుతాయా!

ఎప్పుడైతే సంస్థలోకి ఓపెన్‍ కాస్టులు వచ్చాయో! అప్పుడే ఉపాధి అవకాశాలను దెబ్బతీసింది. పూర్తి యాంత్రీకరణతో, ప్రవేటీకరణతో నడిచే ఓపెన్‍ కాస్టుల వలన కొత్తగా ఉపాధి రాలేదు సరి కదా, ఉన్న కార్మికులనే సగానికి తగ్గించారు. ఇట్లా తొలగించటం కోసం కంపెనీ ఎన్ని ఎత్తులు ఎత్తింది.. ఎన్ని కుట్రలు పన్నింది. పొమ్మనలేక పొగబెట్టినట్టు కార్మికులకు రకరకాలుగా వేదించి సాధించింది. కార్మికులకు పనులు లేకుండా చేసి వారి ‘సర్‍ప్లస్‍పుల్స్లో పెట్టింది. అక్కడ ఎనిమిది గంటలు ఏ పనులు చెప్పకుండా నిర్భంధించింది. అధికారుల డేగకండ్ల మధ్య పనిపాట లేకుండా కూచోబెట్టడం ఎంత నరకమో అనుభవిస్తే కాని తెలియదు. ఆ విధంగా రోజుల తరబడి కార్మికులను మానసిక హింసకు గురి చేసింది. అది తట్టుకోలేక పిచ్చెక్కిపోయిన వాళ్లను స్వచ్చంధ పదవి విరమణ చేసిండ్లు. చివరికి బొగ్గు బావుల్లో ప్రమాదాలు జరిగి అర్థాంతర చావులతో బ్రతుకు చీకటె•న మహిళలు డిపెండెంటు ఉద్యోగాల్లో చేరి దుఃఖాన్ని దిగ మింగుకొని బ్రతుకు బండిలాగిస్తుంటే, అటువంటి వారిని కనీస మానవత్వం లేకుండా ఉద్యోగాల నుంచి తొలగించడానికి కంపెనీ వారిని అరిగోసం పెట్టింది. ఆపీసుల్లో పనిచేసే వారిని తీసుకుపోయి అధికారులు దగ్గరుండి పాయఖానాలు కడిగించారు. రోడ్లు ఊడ్పించారు. వివిధ డిపార్టుమెంట్‍ హెడ్డులతో కమిటీలు ఏర్పాటు చేసి ‘కౌన్సిలింగ్‍’ల పేర భయపెట్టారు. ఒక్కటేమిటి కార్మికులను పనుల నుండి తొలగించటానికి ప్రపంచంలోని దోపిడిదారుల అన్ని అనుభవాలను రంగరించి సింగరేణిని కార్మికుల మీద ప్రయోగించారు. ఇంకో ఏడాదో, ఆర్నేల్లలో దిగిపోతామన్నవారిని ఏరికొరి దూర ప్రాంతాలకు ట్రాన్స్ఫర్‍లు చేశారు. నలుగురు చేసే పనిని ఒక్కరే చేయాలని నిర్భంధించారు. ఈ బాధలు పడలేక వేలాది మంది కార్మికులు స్వచ్చంధ పదవి విరమణలు చేశారు.

ఒకప్పుడు పోరాటాలు ఉధృతంగా కొనసాగినప్పుడు ఇదే మందమర్రిలో పిడికెడంత మంది కాంట్రాక్టు కార్మికులైన ఎడ్ల బండ్ల కార్మికులను పర్మినెంటు చేయాలని సమ్మెలు కట్టి, మేనేజ్‍మెంటు మెడలు వంచి వారిని పర్మినెంటు చేయించిన చోట.. ఇప్పుడు పర్మనెంటు కార్మికుల ఉద్యోగాలకే భద్రత లేని పరిస్థితి ఏర్పడింది…
అతను మళ్ళీ మాట్లాడ సాగిండు.

‘‘అవును మనది ప్రభుత్వ రంగ సంస్థ కాబట్టి పబ్లిక్‍ ఇయరింగ్‍ జరుపుతుంది. కాని ఇదే కాసిపేట మండలంలోని ఓరియంట్‍ సిమెంట్‍ ప్యాక్టరీ ఏమన్న పబ్లిక్‍ ఇయరింగ్‍ జరిపిందా! ఓసీపీలను వ్యతిరేకించే వారికి ఒక పబ్లిక్‍ రంగ సంస్థను కాపాడుకోవాలనే ఇంగిత జ్ఞానం లేకుంటే ఎట్లా. ఇప్పటికైనా వివేచనతోని ఆలోచించి ఓసీపీని నడువనివ్వాలి. కావున ప్రభుత్వ రంగ సంస్థలను అభివృద్ధిని అడ్డుకోవదు’’ అన్నాడు..

అతని మాటలకు నిరసన తెలియజేస్తూ జనం ‘‘కంపెని తొత్తు కార్మిక ద్రోహి’’ అని అరిచిండ్లు.
తమ నాయకుడిని అంత మాట అనే సరికి, ఆయన వెంట వచ్చిన అనుచరులు ఒక్కసారిగా లేచిండ్లు అందులో ఒకడు కోపంతో రగిలిపోతూ ‘‘ఎవడ్రా వాడు’’ అని అరిచిండు.

‘‘నీ మొగుడు’’ మరొకరు ఎవరో అరిచిండు.
మాట మాట పెరిగి ఘర్షణ వాతావరణం ఏర్పడింది.
కలెక్టర్‍ మైకందుకున్నాడు.

‘‘ఇది ప్రజాభిప్రాయ సేకరణ, ఎవరి అభిప్రాయాలను వారు స్వేచ్ఛగా చెప్పుకునే హక్కు ఉంది. మీ వంతు వచ్చినప్పుడు మీరు మీ అభిప్రాయాలను చెప్పవచ్చు. ‘కావున అందరు శాంతంగా ఉండి సహకరించాలని’’ అంటూ పదే పదే అరవసాగిండు.
నిరసన తెలుపుతూ లేచిన వాళ్లను పోలీసులు లాఠీలు ఆడిస్తూ కూచుండబెట్టిండ్లు.

‘‘మందబలం వేసుకొచ్చి గుండాయిజంతో మా గొంతులు కోయాలని చూస్తారా!’’ అంటూ ఎర్రగుంటపల్లి వాసి ఒకడు బిగ్గరగా అరిచిండు.
నాయకుడు ఇంకా చాలా చెప్పాలనే బావించిండు. కాని సభలో గందరగోళ పరిస్థితి ఏర్పడే సరికి వెనక్కి తగ్గి, తన ఉపన్యాసాన్ని అర్థాంతరంగా ముగించిండు.
వేదిక నుంచి దిగి వస్తున్న నాయకుడిని స్థానిక జనరల్‍ మేనేజర్‍ ఎదురేగి అభినందించాడు. ఓసీపీలను సమర్థించే మరో నాయకుడు ఉన్న కాన్నుంచి లేచి వచ్చి అదరంగా కౌగిలించుకున్నాడు. వాస్తవానికి ఆ రెండు యూనియన్‍ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గు మంటుంది. కానీ ఓసీపీల విషయంలో వారిద్దరి మధ్య ఎండుగడ్డి వేసి మంట పెట్టినా మండనంత సఖ్యత ఉంది.

కలెక్టర్‍ మాట్లాడటానికి మరో యూనియన్‍ నాయకుడిని పిలిచిండు…..
చలువ చేసిన ఇస్త్రీబట్టలా ఉన్న నాయకుడు చాలా ఉత్సాహంగా వేదికవైపు కదిలిండు. ఆయన తెలంగాణకు వ్యతిరేకంగా పార్లమెంటులో ప్లే కార్డులు ప్రదర్శించిన జగన్‍ పార్టీకి చెందిన వాడు. చాలా మంది ట్రేడ్‍ యూనియన్‍ నాయకుల్లాగా ఆయన కూడా ఒకప్పుడు ఉద్యోగ నిమిత్తమై ఈ ప్రాంతంకు పొట్ట చేత పట్టుకొని వచ్చిండు. తరువాత ట్రేడ్‍ యూనియన్‍ నాయకుడిగా కొంతకాలం చక్రం తిప్పిండు. ఇప్పుడు తొండ ముదిరి ఊసరవెల్లి అయినట్టు ఫాక్షన్‍ రాజకీయాల పంచన చేరిండు. పాపం ఆ పార్టీ పెద్దాయన దుర్మరణం చెందటం వలన కాలం కలిసి రాలేదు. లేకుంటే రాష్ట్ర రాజకీయాల్లో ఒక్క వెలుగు వెలుగాల్సిన వాడే. ఇప్పుడాయన ఆయన పుత్రరత్నం స్థాపించిన పార్టీ తరపున రాష్ట్ర కార్మిక సంఘం అధ్యక్షుడిగా క్షణం తీరికలేని నాయకుడైండు. కంపెనీని ఓపెన్‍ కాస్టు ఆపదను గట్టెక్కించటానికి ఆయన ఇప్పుడు ఆగమోఘాల మీద వచ్చి వాలిండు.

ఆయన వచ్చి మైకందుకొని పెద్దగా గొంతుకతో మాట్లాడసాగిండు. ‘‘ఓపెన్‍ కాస్టులు వద్దంటే బొగ్గు ఎట్లా ఉత్పత్తి అవుతుంది? బొగ్గు ఉత్పత్తి కాకుంటే కరంటు ఎట్లా ఉత్పత్తి అవుతుంది. కరంటు లేక రైతులు కష్టపడుతాండ్లు, పంపుసెట్లు పని చేస్తలేవు. మోటార్లు కాలిపోయి రైతులు ఆత్మహత్య చేసుకుంటాండ్లు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగిస్తామా?’’ అంటూ సభికుల కేసి చూస్తూ ప్రశ్నించాడు.

రైతుల పట్ల ఆ నాయకుడు ఎక్కడలేని ప్రేమ వొలకబోసిండు. కాని నిజంగా జరిగిందేమిటి? నిజాం కాలంలో ఇక్కడ తవ్వి తీసిన బొగ్గు ఒక్కడ ప్రజల అభివృద్ధిలో భాగమైంది. అంతకు వందరెట్లు బొగ్గు తవ్వకాలు జరుగుతున్న తెలంగాణలో రైతులకు కరంటు కొరతలెందుకు? తీసిన బొగ్గు ఎటుపోయింది? ఇంకా ఎన్ని మిలియన్‍ టన్నుల బొగ్గు తీస్తే తెలంగాణ రైతులకు కరంటు కష్టాలు తీరుతాయి? ఇక్కడ సంపద దోచుకొనిపోయి వాళ్ళ ప్రాంతం అభివృద్ధి చేసుకున్నరు. అరకొరగా తెలంగాణలో విద్యుత్‍ ప్లాంట్లు పెట్టిన అక్కడ ఉత్పత్తి అయ్యే విద్యుత్‍ ప్రజలు చెందకుండా కుట్రలు చేసిండ్లు. అట్టి కుట్రలను ప్రశ్నించని నాయకులు ఇక్కడ ప్రజల పట్ల ప్రేమ వొలకబోయటం ఎవరిని వంచించటానికి? నాలుగు కోట్ల మంది ప్రజలు తమ బ్రతుకేదో తాము బ్రతుకుదామంటే లేదు మా కాళ్ళ క్రిందే బతకాలని పార్లమెంటులో ప్లే కార్డులు పట్టుకొని ఊరేగిన నాయకునికి ఊడిగం చేసేవానికి ఇక్కడి ప్రజల పట్ల ఇంత ప్రేమ ఎట్లా పుట్టుకొచ్చింది.

నాయకుని మాటలు కొనసాగుతున్నాయి.
‘‘ఓసీపిని వద్దంటే అభివృద్ధిని అడ్డుకున్నట్టే. కాకుంటే నిర్వాసితులయ్యే ప్రజలకు మంచి ప్యాకేజీలు ఇవ్వాలి? మంచి నష్టపరిహారం ఇవ్వాలి. ఉద్యోగాలు ఇవ్వాలి’’ అంటూ బిగ్గరగా అరవసాగిండ్లు.

మాటల గారడితో ప్రజలను మాయచేసేందుకు ఆ నాయకుడు పడే తాపత్రయం చూస్తే నవ్వు పుడుతుంది.
గత ముప్పయి ఏండ్లుగా ఓసీపీలు నడుస్తూనే ఉన్నాయి. ఓసీపీల క్రింద వందల గ్రామాలు మాయమైపోయాయి. ఇంకా పోతూనే ఉన్నాయి. భూములు ఆక్రమించినప్పుడు కంపెనీ చెప్పిన మాటలు అటు తరువాత నిలబెట్టుకోలేదు. ఇంటికో ఉద్యోగం ఇస్తామన్న మాట నీళ్ళ మీద రాసిన రాతలైనవి. భూములు పోయి బ్రతుకుపోయి రావాల్సిన న్యాయమైన నష్టపరిహారం రాకుండా అరిగోసపడ్డ ప్రజల బాధలను ఇవ్వాళ చిలుక పలుకులు పలికే నాయకులు ఎవరు ఏనాడు పట్టించుకోలేదు. ఇన్నేండ్లుగా నిర్వాసితుల బాధలు పట్టించుకోని వారికి, ప్రజల కష్టాల గురించి మాట్లాడే అర్హత ఎక్కడిది? తమ స్వార్థమే పరమావదిగా బ్రతికేవాళ్ళు, అందుకోసం ఏ అడ్డమైన గడ్డినైనా కరిచేందుకు సిద్దపడే వాళ్లు ఇవ్వాళ కంపెనీకి వంత పాడటానికి వచ్చిండ్లు. ప్రజలను వంచించటానికి మరోమారు మాయమాటలు మాట్లాడుతాండ్లు. ఆయన తన రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వంపై విరుచుకు పడుతున్నాడు.

‘‘కేంద్ర ప్రభుత్వం ఇప్పటికి 147 బోగ్గు బ్లాక్‍లు ప్రైవేటు సంస్థలకు ఇచ్చింది. అందులో ఏ ఒక్క సంస్థ తట్టెడు మట్టి తీయలేదు. కాని కాంగ్రెస్‍ పెద్దలు పది లక్షల కోట్ల కుంభకోణాలకు పాల్పడ్డారు. కాని మన సింగరేణి ప్రభుత్వ రంగ సంస్థ దానిని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఓపెన్‍ కాస్టులు నడువకుంటే సంస్థ నష్టాలలోకి పోతుంది. నష్టాల సాకు చూపి సంస్థను మూసివేస్తారు. అట్లా జరిగితే అందులో పనిచేసే కార్మికుల పరిస్థితి ఏమిటి? కాబట్టి సంస్థ మనుగడ కొనసాగాలన్న, కార్మికుల ఉద్యోగాలకు రక్షణ ఉండాలన్నీ ఓపెన్‍ కాస్టులను వ్యతిరేకించవద్దు. కాకుంటే నిర్వాసితులకు మంచి ప్యాకేజీ ఇవ్వాలి’’ అంటూ అతను తన ప్రసంగాన్ని తొందరగానే ముగించాడు.

జనం ఎవరు పెద్దగా ప్రతిస్పందించలేదు. అరిచి గొంతులు మూగపోయాయి. లేదా ఈ ద్రోహులంతా ఇంతేనని చప్పబడిపోయారా… పబ్లిక్‍ ఇయరింగ్‍ జరుగుతున్న చోట కనీసం తాగటానికి మంచినీళ్లు లేక గొంతులు ఎండిపోయాయా! అప్పటికే కాలాతీతమై ఆకలితో నకనకలాడుతు అలిసిపోయారా!

సింగరేణిలో విప్లవ కార్మికోద్యమానికి అంకురార్పణ జరిగిన చోట… ఇప్పుడు ఒక విధ్వంసం వికట హట్టహాసం చేస్తుంది. దాన్ని సమర్థించే నాయకులకు ఏ అదురు బెదురు లేకుండా పోయింది. సరిగ్గా ముప్పయి ఏండ్ల క్రిందట ఇది కేకే 2 బావి మీద ఎర్రటి ఎండలు నిప్పులు చెరుగుతున్న సమయంలో కార్మిక వర్గం తరతరాలుగా పాతుకుపోయిన విద్రోహులకు వ్యతిరేకంగా సమరశంఖం పూరించారు. నిజాం దొరలను మించిపోయిన బాయి దొరల దొరతనాన్ని నిలదీశారు.

ఈ దోపిడి పీడనలు అణచివేతలు ఇకపై సాగదంటూ బరిగీసి నిలిచిండు. ఆనాటి సంఘటనలు ఇప్పుడే నా కండ్ల ముందు జరుగుతున్నట్టుగానే ఉన్నాయి.

ఒకనాటి మధ్యాహ్నం షిప్టులో… బొగ్గు బాయి ప్రమాదంలో గాయపడిన కార్మికుడికి గాయం పూర్తిగా మానకముందే పిట్‍ చేసి తిరిగి బాయి పనికి పంపిస్తే, ‘‘అయ్యా నా గాయం తగ్గలేదు. ఈ నొప్పితో నేనెట్లా పని చేస్తానంటూ తోటి కార్మికుల ముందు తనగోడు వెళ్లబోసుకున్నడు. అది చూసి కదిలిపోయిన కార్మికులు ‘ఇదేం అన్యాయం’ అంటూ ఊరేగింపుగా పోయి డాక్టర్‍ను నిలదీసిండ్లు.

ఆ మరునాడు ముందు అనుమతి లేకుండా పని బంద్‍ పెట్టినందుకు కంపెని బ్రిటీషు కాలం నాటి మస్టర్ల కోత చట్టం బూజుదులిపి అమలు జరిపింది. కార్మికుల జీతాల నుంచి కోత విధించింది.

అట్లా మొదలైంది మస్టర్ల కోత చట్టానికి వ్యతిరేకంగా కార్మికుల చారిత్రాత్మకమైన సమ్మె పోరాటం.

ఆ పోరాటాన్ని ఆదిలోపే అంతం చేయాలని కంపెనీతో యూనియన్‍ నాయకులు కుమ్మక్కయ్యిండ్లు… పోలీసుల నిర్భంధం తోడైంది.

సరిగ్గా ఇవాల్టీ లాగే మేనేజ్‍మెంటుకు వంతపాడిన నాయకులు అసలు మస్టర్ల కోత చట్టమే లేదంటూ ప్రచారం మొదలు పెట్టిండ్లు.

‘‘ఒకవైపు మస్టర్ల కోత చట్టం తెచ్చి జీతాలు కోతలు విధిస్తుంటే నాయకలేంది అసలు చట్టమే లేదంటారు? ఎవన్ని మోసం చేయడానికి’’ అంటూ కార్మికులు నిలదీసిండ్లు.

‘‘మోసం మాటలతో మళ్ళీ బావుల మీదికి వస్తే పాతబూట్ల దండ మెడలో వేసి గాడిదమీద ఊరేగింపు చేస్తాం’’ అంటూ యూనియన్‍ నాయకులను హెచ్చరించిండ్లు.

అబద్ధపు ప్రచారాలు మోసం మాటలు పని చేయకపోయే సరికి. కంపెనీ దండోపాయానికి దిగింది. సాయుధ బలగాలు మందమర్రిలో మోహరించారు. విచ్చు కత్తుల బోనులాంటి పోలీసు నిర్బంధాల మధ్య సింగరేణి కార్మిక వర్గం. ఇరుకు గుడిసెల్లో రాత్రింభవళ్లు ఆలోచనలు చేసిండ్లు. సమ్మెను ముందుకు తీసుకుపోవడానికి వ్యూహాలు పన్నిండ్లు….

చూస్తుండగానే సమ్మె మందమర్రి బావుల నుంచి రామక్రిష్ణాపూర్‍, శ్రీరాంపూర్‍ ఏరియా గనులకు విస్తరింపజేశారు. పిచ్చెత్తిన పోలీసులు ఇండ్ల మీద పడి అందిన కార్మికుడినల్లా అందుకొని నిర్భంధించారు. అదనపు బలగాలు వచ్చినవి. నిర్భంధపు నీడలోనే మే చివరి నాటికి ఆదిలాబాద్‍ జిల్లా బొగ్గు గనుల నుంచి సమ్మె కరీంనగర్‍లోని గోధావరిఖని పారిశ్రామిక ప్రాంతానికి విస్తరించే క్రమంలోనే’’ సింగరేణి కార్మిక సమాఖ్య అవిర్భవించింది.

అట్లా ఉద్యమంలో పుట్టి ఉద్యమాల్లో పెరిగి ఉద్యమమే ఊపిరిగా దాదాపు రెండు దశాబ్దాల పాటు కార్మికులకు ప్రీతిపాత్రమైంది సింగరేణి కార్మిక సమాఖ్య.

అదిగో అటువంటి విప్లవ కార్మికోద్యమానికి జన్మనిచ్చిన కళ్యాణిఖని 2 ఇంక్లయిన్‍ మీదనే విధ్వంసకర అభివృద్ధి వికటహట్ట హాసం చేస్తుంది. ఎప్పటిలాగే అవకాశ వాద నాయకులు మేనేజ్‍మెంటుకు వంతపాడుతూ తమ విద్రోహ బుద్ధిని మరోమారు చాటుకున్నారు.

వేదిక మీద కలెక్టర్‍ గారు మరో నాయకుడిని పిలిచినట్టుంది. జనం అల్లరి మధ్య ఆయన పేరు సరిగా వినపడలేదు. ఆయన వచ్చి మైకందుకున్నాడు. ఆయన రెచ్చిపోయి ఓపెన్‍ కాస్టులను వ్యతిరేకించే వారిపై విరుచుకుపడసాగిండు.

అంతవరదాక సద్దుమణిగిన లొల్లి ఒక్క సారిగా గప్పుమన్నది.
‘‘మీరు ఎంత లొల్లి పెట్టిన నేను చెప్పాల్సింది చెప్పుడే, మీరు ఎంత అరచి గీపెట్టినా ఓపెన్‍ కాస్టులు వచ్చేటివి ఆగవు. ఆగేదుంటే నా చెవ్వి కోసుకుంటా’’ అన్నాడు ఆ నాయకుడు.
‘‘ఎప్పుడు కోసుకుంటావు, ఒకటా! రెండా!’’ అంటూ ఎవడో అరిచిండు…
ఆ మాటలకు ఆ నాయకుడు మరింత రెచ్చిపోయిండు.

‘‘నేను నలబై ఏండ్లు బాయిలో పని చేసినా, యూనియన్‍లో పని చేసినా… ఇటువంటి అల్లర్లు చాలా చూసినా… గీ మాటలకు భయపడే వాన్ని కాదు. మీరెంత మొత్తుకున్నా నేను చెప్పాల్సింది చెప్పుతా’’ అంటూ అరవసాగిండు.

జనం అల్లరి పెరిగింది…. ఆయన అవస్థ చూసి వేదిక క్రింద ఉన్న వాళ్ళే కాదు వేదిక మీద ఉన్న పెద్దలకు నవ్వాగడం లేదు. జనం లొల్లి ఎంతకు సద్దుమనకపోవడంతో ఆ నాయకుడు అర్థాంతరంగా తన ఉపన్యాసాన్ని ముగించక తప్పలేదు.

కలెక్టర్‍ మరోసారి జోక్యం చేసుకున్నాడు.
‘‘మీరంత సైలెన్సుగా ఉండాలి. ఇక్కడ ఎవరి అభిప్రాయం వాళ్లు స్వేచ్చగా చెప్పుకోవచ్చు. మీ అభిప్రాయం మీరు చెప్పుకోవడానికి ఎంత స్వేచ్చ ఉందో. ఇంకొకరు తమ అభిప్రాయం చెప్పడానికి అంత స్వేచ్చ ఉంటుందని గ్రహించాలి. ఇంకొకరు మాట్లాడుతున్నప్పుడు సంయమనం పాటించడం సభ్యత అవుతుంది’’ అంటూ అదే పనిగా అరవసాగిండు.

8

ఎట్టకేలకు నిర్వాహకుల నిర్వాసిత గ్రామాల ప్రజలు మాట్లాడటానికి అవకాశం ఇచ్చారు. అప్పటికి మధ్యాహ్నం మూడైంది. వేదిక మీదున్న అతను ‘కుదురుపాక శంకరయ్య’ అన్న పేరును పిలిచాడు. సగం నెరసి నెరియని జుట్టుతో అరువై ఏండ్ల కుదురుపాక శంకరయ్య వ•చ్చిమైకందుకున్నాడు.

‘‘అయ్యా, నాది బెల్లంపల్లి, నేను ఇదే సోమగూడెం బావిలో మైనింగ్‍ సర్దార్‍గా పనిచేసి రిటేరైన ఇయ్యాల నా పొల్లగాండ్లకు ఎవరికి బొగ్గుబాయి పనిలేదు. ఏదో కూలి నాలి చేసుకొని బతుకుతాండ్లు. నేను మొట్టమొదటి సారి బొగ్గు బాయి పనికి వచ్చినప్పుడు ఎవ్వరికి బాయి పనంటే ఇష్టం ఉండేది కాదు. తాళ్ళకు పోయిన గౌండ్లోడు, బాయిపనికి పోయినోడు ఇంటికి వచ్చేది నమ్మకం లేదని భయపడేటోళ్ళు. అదిగో అటువంటి కాలంల బాయి పనికి వచ్చి నలభై రెండు సంవత్సరాలు పనిచేసి. ముప్పయేండ్లు తట్ట మోసిన. నాతో పని చేసినోళ్ళు చాలామంది బాయిల ప్రమాదంలో సచ్చిండ్లు. అంతవరదాకా మా తోని ఆడుతూ పాడుతూ పని చేసినోళ్ళు మా కండ్ల ముందే ప్రమాదం జరిగి పుట్టెడు బండ కింద ఆనవాలు లేకుండా నలిగిపోతే మాంసం ముద్దలుగా గంపల్లో ఎత్తుకొని వచ్చినం’’ అన్నాడు.

వేదికమీదున్న కలక్టర్‍ గారికి ఆయన మాటలు అసహనం కల్గించినట్టుంది. దీంతో ఆయన తన కుర్చీలో ఇబ్బందిగా కదిలి… చేతిలోని మైకును టకటకలాడించి ‘‘రాబోయే ఓసిపి మీద అభిప్రాయం చెప్పాలి కాని.. ఇక్కడ వేరే విషయాలు మాట్లాడవద్దు’’ అన్నాడు అసహనంగా….

దాంతో శంకరయ్య కలక్టర్‍కేసి చూసి… ‘‘అయ్యా గా విషయం చెప్పటం కోసమే వచ్చిన దాని గురించి మాట్లాడుతున్న’’ అన్నాడు.

‘‘ఓసీపి మీద నీ అభిప్రాయం చెప్పాలి. వేరే విషయాలు మాట్లాడవద్దు’’ అన్నాడు మరోసారి కలెక్టర్‍.
‘‘అయ్యా అదే చెపుతున్నా’’అంటూ మళ్ళీ అందుకున్నాడు.

‘‘బొగ్గు బాయిల మేం పడ్డ కష్టాల గురించి చెప్పుతాంటే కలెక్టరయ్య దాని గురించి వద్దంటాడు కాబట్టి నేను ఆ విషయం చెప్పుతలేను. మేం బొగ్గు బాయిలో మా బ్రతుకంతా రక్తం నీళ్ళు చేసుకుని….ప్రాణాలు ఫణంగా పెట్టి తల్లి తీసిన బొగ్గు ఎటు పోయిందో? నాకైతే తెల్వదు. ఒకప్పుడు పద్దెనిమిది మిలియన్ల టన్నుల బొగ్గు తీసినప్పుడు లక్షా పదహారు వేల మంది కార్మికులుండే ఇప్పుడు యాడిది అరవై మిలియన్‍ టన్నుల బొగ్గు తీస్తాండ్లు. కార్మికులేమో సగానికి తగ్గిండ్లు. తీసిన బొగ్గు ఎటుపోయింది. అన్న సంగతి అట్లపెట్టు. మా భూములోని బొగ్గు మాకు చెందకున్నా కనీసం మాకు బొగ్గు బాయి పనన్నా దొరికింది ఎట్లనో అట్ల బతికినం. ఈ సంబరం కూడా లేదు’’ అంటూ క్షణమాగి జనాలనేసి చూసిండు.

‘‘అప్పుడంత అండర్‍గ్రౌండ్‍ బావులు కాబట్టి… కింది కేలికంపినోడు బొగ్గు తవ్వకున్న భూమి భూమి లెక్క ఉండేది. దేవుని మీద భారం వేసి వ్యవసాయ చేసుకున్నారు. ఏవో నాలుగు గింజలు రాలితే ఊపిరిపోకుండా కలోగంజో చేసుకుని తాగి బతికిండ్లు. భూమి మీద గొర్లు, బర్లు మేపుకుని బతికేటోళ్ళు బతికిండ్లు. తాళ్ళు ఎక్కెటోళ్ళు ఎక్కి బతికిండ్లు, కూలినాలి చేసుకొన్నరు. అటువంటిది ఇప్పుడు కంపినోడు అసలు ఆ భూమి లేకుండా చేస్తామంటాండ్లు. భూమి లేకుంటే మనుషులు ఎట్లా బతుకుతరు’’ అంటూ సూటిగా ప్రశ్నించిండు.

వేదిక మీదున్న అధికారులు ఇబ్బందిగా కదిలిండ్లు. కలక్టర్‍ మళ్ళీ ఏదో మాట్లాడబోయిండు. కానీ శంకరయ్య అదేమీ పట్టించుకునే స్థితిలో లేడు.

‘‘ఇయ్యాల ఇక్కడికి వచ్చిన నాయకులు కొందరు ఓసిపిలు రావాలి, ఓసిపిలు వస్తేనే కంపెనీ బాగుపడుతది.. లాభాలు వస్తాయి… కంపెనీ బాగుంటే కార్మికులు బాగుపడ్తరు అని చెప్పుతాండ్లు.’’ అంటూ ముందు వరుసలోని నాయకులకేసి గుచ్చిగుచ్చి చూసిండు.
వాళ్ళు ఇబ్బందిగా కదిలిండ్లు.

‘‘నేను బొగ్గు బాయిల పని చేసినప్పుడు అన్ని యూనియన్‍ జెండాలు మోసిన. ఇయ్యాల యూనియన్‍ నాయకులుగా కడక్‍ బట్టలు వేసుకొని ఖరీదైన కార్లల్ల వచ్చిండ్లు. వీళ్ళంతా ఒకప్పుడు పొట్ట చేత పట్టుకొని కాలరీకి వచ్చినోళ్ళే. ఉద్యోగానికి వచ్చినప్పుడు వాళ్ళు ఎట్లుండే? అటు తరువాత లీడర్లయి ఇప్పుడెట్లున్నరో అని నేను అడుగుతలేను? కానీ వాళ్ళను ఒక్కటి అడగదలుచుకున్నా! ఓసిపీలు వస్తే అభివృద్ధి అయితదా! మరి ఓసిపిలు వచ్చిన తరువాత ఉన్న కార్మికులే సగానికి సగం తగ్గిండ్లా లేదా! ఇదెట్లా అభివృద్ధి అయితది?’’ అన్నాడు.

అతను గొంతుపెంచి
‘‘ఓసిపిలు కావాలని నాయకులు ఇవ్వాళ్ళ చిలక పలుకులు పలుకుతాండ్లు. ఓసిపిలు పుటుకొచ్చి ముప్పయి యేండ్ల నుంచి భూములు కోల్పోయిన వారికి సరైన నష్టపరిహారం ఇవ్వక ఏండ్లకు ఏండ్లుగా కేసులు నడుస్తానే ఉన్నాయి. ఇన్నేండ్ల నుంచి ఈ లీడర్లు వాళ్ళ బాధలు పట్టించుకోలేదు.. ఇవ్వాళ కంపెనోనికి ఆపద వచ్చిందని ఆగమేఘాల మీద ఊరికి వచ్చిండ్లు. ముసలికన్నీరు కారుస్తూ మమ్ముల్ని నమ్మించి గొంతుకోయాలని చూస్తాండ్లు’’

కలెక్టర్‍ సహనం కోల్పోయిండు ‘‘ఎవరి అభిప్రాయాలు వారివి. ఇక్కడికి వచ్చి ఒకరిని విమర్శించడం కాదు. నీ అభిప్రాయం నువ్వు చెప్పి పోవాలి.. నీ అభిప్రాయం చెప్పటానికి నీకెంత స్వేచ్చ ఉందో ఆయనకు ఆయన అభిప్రాయం చెప్పటానికి అంతే స్వేచ్చ ఉంది’’ అన్నాడు కటువుగా.

‘‘అయ్యా అదే విషయం చెప్పుతున్నా’’ అన్నాడు శంకరయ్య. ‘‘అయ్యా లీడర్‍గిరి చేసి కోట్లు సంపాదించుకున్న నాయకులకు ఇయ్యాల ఇక్కడ ఏదీ ఎట్లా నాశనం అయిపోతేంది. సంపాదించుకున్న డబ్బులతో ఏ హైదరాబాద్‍కు పోయి హాయిగా బతుకుతారు. కానీ ఇక్కడ పుట్టి పెరిగి.. ఇక్కడే సచ్చేటోళ్ళం.. మేం ఎక్కడికి పోయి బతుకుతం.. ఎట్లా బతుకుతం.. ఈ భూమి ఉంటనే కదా మా బ్రతుకు. అటువంటి భూమిని లేకుండా చేస్తామనటం మీకు న్యాయమెట్లా అయితది?’’ అన్నాడు.

మరింత గొంతు పెంచి. ‘‘భూమికి అన్యాయం చేసినోడు ఎవరు బతికి బట్టకట్టలేదు. ఎనకటి భారతంలో కర్ణుడు ఇట్లనే భూమిని కాలితో తన్ని అవమానం చేస్తే.. భూతల్లి కోపానికి వచ్చి నామరూపాలు లేకుండా పోమిండు’’ అన్నాడు.

తన కండ్ల ముందే ఇంత విధ్వంసం జరుగుతుంటే ఏం చెయ్యలేని నిస్సహాయ స్థితిలో అతను అరుస్తున్నడు. ఆయన ఇంకేమి మాట్లాడేవాడో కానీ, కలెక్టర్‍ ఆదేశం మేరకు ఆయన మాట్లాడే మైక్‍ను ఆపరేటర్‍ కట్‍ చేసిండు.

ఒక నిమిషం ప్రాంగణంలో విషాదం అలుముకున్నది. అంతవరదాకా ఓసిపిలను సమర్థించుకుంటూ మాట్లాడిన నాయకుల మొఖంలో నెత్తురు చుక్క లేకుండా పోయింది.

బతుకంతా కష్టం చేసి చేసి బ్రతికినట్టున్న ఒక యాభై ఏండ్ల ఆడ మనిషి లేచింది. పల్లెటూరు తల్లిలా ఉన్న ఆమె ఏమి చెబుతుందోనని అధికారులు, నాయకులు, జనం ఆసక్తిగా చూసిండ్లు.

ఆమె మైకు అందుకున్నది. ఆమె ఏదో మాట్లాడసాగింది. కానీ మైకును సరిగా పట్టుకోకపోవడం వల్ల ఆమె మాటలేవీ దూరంగా ఉన్న వారికి వినపడటం లేదు. మైక్‍ బాయ్‍ వచ్చి ‘‘అమ్మ మూతి దగ్గర పెట్టుకుని మాట్లాడు’’ అంటూ సర్దిచెప్పిండు.

ఇప్పుడు ఆమె మాటలు స్పష్టంగా విన్సిపిస్తున్నాయి.

‘‘అయ్యా కంపినోడు మా భూములు తీసుకుంటామంటాడు. నాకు ఇద్దరు కొడుకులు ఉన్నరు. ఎకరం భూమి సాగు చేసుకుంటూ కూలి నాలి చేసుకుంటూ బ్రతుకుతున్నరు. అటువంటిది భూమి కంపెనీ తీసుకుంటే మా బ్రతుకేమి కావాలి. మేం ఏంచేసుకొని బ్రతకాలి! ఏదో కంపినోడు నష్టపరిహారం కింద పైసలు ఇస్తరట. ఎన్ని పైసలు ఇస్తడు, ఇచ్చిన పైసలతోని ఎన్ని రోజులు బ్రతుకుతాం. భూమి లేకుంటే మాకు బ్రతుకు లేదు. అదిగాక కంపెని భూమి తీసుకుంటే తీసుకోని కానీ భూమికి బదులు మాకు ఎక్కడైనా భూమి చూయించాలి. భూమి ఉంటే దాని మీద ఏదో కష్టం చేసుకొని బ్రతుకుతం. లేదంటే కంపెనీల ఉద్యోగం ఇవ్వాలి’’ అంది.

‘‘ఇక్కడ పెద్ద పెద్ద సార్లు మాట్లాడిండ్లు. అందరికి అందరు కూడబలుకున్నట్లు ఓసిపిలు రావాలి అంటాండ్లు. కానీ వాళ్ళకు మా బాధలు తెలువదు. భూమి లేకుండా రైతు ఎట్లా బతుకుతడో తెలువదు. అయ్యా మా ఊళ్ళల్లకు బొగ్గు బాయిలు ఇయ్యాల రాలేదు. నా చిన్నప్పటి నుండి బొగ్గు బాయిలు నడుస్తనే ఉన్నాయి. ఇన్నేండ్లకాన్నుంచి కూడా మా ఇండ్లల్ల ఒక్క కరెంటు బుగ్గ లేదు. బాయిలకాడ రాత్రంబవళ్ళు కాపలా కాస్తే ఎప్పుడు కరెంటు వస్తదో తెలియదు. వచ్చిన కరెంటూ ఎంతసేపు ఉంటుందో తెలియదు. లోవోల్టేజితో మోటార్లు కాలిపోతానయి. ఇంతవరదాకా ఈ నాయకులు ఎవరూ మా బాధలు పట్టించుకోలేదు. మేం ఎట్లా బతుకుతామో కన్నెత్తి చూసింది లేదు. ఇయ్యాల కంపినోడు చాటుమాటుగా సూట్‍కేసులు ఇవ్వగానే ఆగమేఘాల మీద వచ్చి మాట్లాడుతాండ్లు… ఓసీపీలు కావాలంటుండ్లు. మా ఊరు చుట్టూ అండర్‍గ్రౌండ్‍ బావులు నడిచినప్పుడే తాగేందుకు నీళ్ళు లేక అరిగోసపడ్తానం. సాగుకు నీళ్ళు లేక దేవుని మీద భారం వేసి వర్షాకాలం ఏవో నాలుగు గింజలు పండించుకుని ప్రాణాలు నిలబెట్టుకుంటానం. ఇప్పుడు ఓసిపీలు తెచ్చి అది కూడా లేకుండా చేస్తామంటాండ్లు. గుట్టుచప్పుడు కాకుండా మా గొంతులు పిసికి చంపి అభివృద్ధి చేస్తరంట. మీ అభివృద్ధి మాకు వద్దు. మా బ్రతుకేదో మమ్ములను బతకనియ్యండి.. ప్రాణం పోయినా సరే భూములు ఇచ్చేది లేదు.’’ అంటూ తన జీవతమంత భూమితో పెనవేసుకపోయిన ఒక మట్టి తల్లి ఆక్రోషించింది.

ఆమె రెండు చేతులు జోడించి కలెక్టర్‍కేసి చూస్తూ…..
‘‘అయ్యా కలెక్టర్‍ సారూ… మీరు ఇందాక మాట్లాడుతూ మీరు మా కోసం వచ్చిండ్లని చెప్పిండ్లు. నిజమే అయ్యా మేం నీ బిడ్డలం. నువ్వు మాకు కన్నతండ్రి అటువంటి వాడివి. అయ్యా మీకు మా మీద నిజంగా ప్రేమ ఉంటే. మీ ముందు కొంగుచాపి అడుగుతున్నా! ఆ కొంగులో మన్నే పోత్తవో, అన్నమే పెడుతవో అంత నీ చేతుల్లో ఉంది. భూమి ఉంటేనే మాకు బ్రతుకు. అటువంటి భూమి లేకుంటే మేం ఎట్లా బ్రతకాలో చెప్పాలి’’ అంటూ కలెక్టర్‍కేసి కొంగు చాపింది.

‘‘ముసలిది గుడసుదే’’ అంటూ ముందున్న యూనియన్‍ నాయకులు గుసగుసలాడిండ్లు.

కలెక్టర్‍ ఇబ్బందిగా కదిలిండు. ఆ ప్రశ్నకు జవాబు ఆయన దగ్గర లేదు. ప్రభుత్వ నిర్ణయాలను అమలు చేయడం తప్ప ప్రజల సమస్యలను పరిష్కరించే అధికారం ఆయనకు ఎక్కడ ఉంది? ప్రజాభిప్రాయ సేకరణ ఒక మొక్కుబడి కార్యక్రమమని, చివరికి ప్రభుత్వం ముందే నిర్ణయించిన దానికి అనుగుణంగా నిర్ణయం చేయడం తప్ప కలెక్టర్‍ మరేమీ చేయలేడని ఆమెకు తెలియదు పాపం.

‘‘అమ్మా నీవు మాట్లాడేది అయిపోయిందా’’ వేదికమీదున్న కంపెనీ అధికారి ప్రశ్నించిండు.
‘‘అయ్యా గింతే. మేం ఎట్ల బతకాలో చెప్పాలి’’ అంది మరోసారి.

‘‘కలెక్టర్‍ గారు ఆ విషయం ఆలోచిస్తారమ్మ’’ అంటూ ఆమె ముందు నుండి మైకు తీసుకున్నారు.
‘‘దుబ్బగూడెం నుంచి అయిలయ్య’’ అంటూ మరో పేరు చదివిండు.

నీటుగా దువ్వుకుని, తెల్లబట్టలు వేసుకున్న నలభై ఏండ్ల పైబడిన వాడు చాలా హుషారుగా వచ్చి మైకందుకున్నాడు.
ఆయన పేరు పేరున వేదిక మీదున్న కలెక్టర్‍గారిని, పర్యావరణ అధికారిని, స్థానిక జీఎంలకు, తదితర అధికారులను సంబోధించి, ముందు వరుసలో కూచున్న నాయకులకేసి చూసి హుషారుగా మాట్లాడడం మొదలు పెట్టిండు.

‘‘నాది దుబ్బగూడెం…… దుబ్బగూడెంల నాది నాలుగు ఎకరాల భూమి ఉంది. ఇక్కడ చాలా మంది మాట్లాడుతూ ఓసీపీలు వద్దు అంటాండ్లు. ఓసీపీలు వద్దయితే బొగ్గు ఎట్లా వస్తది. ఆ బొగ్గు లేకుంటే కరెంటు ఎట్లా ఉత్పత్తి అయితది. ఇక్కడ మనమంతా ఫ్యాన్ల కింద కూచున్నం. కరెంటు లేకపోతే ఫ్యాన్లు తిరుగుతాయా? ఒక నిముషం కరెంటు లేకుంటేనే మనం ఆగం ఆగమౌవుతాం. రైతుల పంపుసెట్ల నడువాలంటే కరెంటు కావాలి? మరిబొగ్గు వద్దంటే కరెంటు ఎట్ల వస్తది. రైతులు ఇప్పటికీ కరెంటు సరిగా లేక అవస్థలు పడుతాండ్లు. వాళ్ళకు మరింత కష్టాల పాలు చేస్తామా’’ అంటూ పంతులుకు పాఠాలు అప్పజెప్పే బట్టీపట్టిన విద్యార్థిలా అతను మాట్లాడసాగిండు.

జనంకు ఆయన మాటలు మింగుడుపడటం లేదు. అసహనంగా ఎవరికి వారు మాట్లాడటంతో కలకలం రేగింది.
కలెక్టర్‍ గారు అందరిని శాంతిపర్చడం కోసం గాల్లోకి చేతులు ఆడిస్తూ ‘‘సైలెన్స్గా ఉండాలి. సంయమనం పాటించాలి. అంటూ అరవసాగిండు.
పోలీసులు జోక్యం చేసుకొని గోల చేస్తున్న వారిని సముదాయించ సాగిండ్లు.
జనం అల్లరికి మాట్లాడే వాడు కాస్త ఖంగుతిన్నడు. లొల్ల సద్దుమనిగే సరికి మళ్ళీ మాట్లాడసాగిండు.

‘‘అయ్యా నేను ఒక్కటి చెప్పుతున్నా… దేశ అభివృద్ధి కోసం నావి నాలుగు ఎకరాల భూమి అప్పగించడానికి నేను సిద్ధంగా ఉన్న కానీ నష్టపరిహారం న్యాయంగా ఇవ్వాలి’’ అన్నాడు.
దుబ్బగూడెం ఊరోళ్ళకు ఆయన మాటలు అర్థం కావటం లేదు. ఊరంత ఒక్కదారి అయితే ఉలిపికట్టేది మరోకటి అన్నట్టు.. ‘‘వీడెవ్వడు వీన్ని ఎప్పుడు మన ఊర్లో చూసింది లేదు’’ అంటూ ఓ పెద్దమనిషి ఆశ్చర్యపోయిండు.

‘‘వానికి నాలుగు ఎకరాల భూమి ఉందటనా! ఎక్కడుంది… ఎవడు వీడు’’ మరొకరు ప్రశ్నించిండు.

‘‘అసలు వీడు మన ఊరోడే కాదు దుబ్బగూడెం వాసినంటూ అందర్ని మోసం చేస్తాండు’’ అంటూ మరొకరు అరిచిండు.

‘‘ఇదంతా కంపినోడి ఎత్తుగడ. ఎవడో ముక్కు మొఖం తెలియని వాన్ని తీసుకవచ్చి మన ఊరోడని చెప్పించి మన గొంతులు కోయ్యాలని చూస్తాండు’’ అన్నాడు మరొకడు ఆవేశంగా

‘‘అయ్యా ఆయన మా దుబ్బగూడెం వాడే కాదు.. అటువంటి వాన్ని తీసుకొచ్చి మమ్ముల్ని మోసం చేయాలని చూస్తాండ్లు’’ అంటూ యువకుడు ఒకడు అరిచిండు.

రచయిత. తెలుగు సాహిత్యంలో పి.చందు గా సుపరిచితుడు. అసలు పేరు ఊరుగొండ యాదగిరి. వరంగల్ ఉర్సులో 1954 సెప్టెంబరు 24 న వీరమ్మ, మల్లయ్య దంపతులకు జన్మించారు. ఎల్.బి. కాలేజీలో బి.కాం చదివారు. సింగరేణిలో ఉద్యోగ విరమణ చేశారు. "శేషగిరి", "నల్లమల", "భూదేవి", "నెత్తుటిధార", "శృతి", "బొగ్గులు" తదితర పదిహేను నవలలు రాశారు. సుమారు వంద కథలు రాసి "భూ నిర్వాసితులు", "జులుం", "గుమ్మన్ ఎగ్లాస్ పూర్ గ్రామస్థుడు", "సమ్మె కథలు" కథా సంపుటాలు ప్రచురించారు.

Leave a Reply