మా పంటను ఊడ్సుకుపోయిన వానదేవుడు!

సరిగ్గ పది దినాల ముందు మా ఆడబిడ్డ సరస మమ్మల్ని జూసే దానికి మా ఇంటికొచ్చింది. ఆయమ్మను ఇచ్చిందేమో పరమట గడ్డన. ఆ సింతకు ఈ సింతకు పుట్టింటికి రాదు. ఆయమ్మి వస్తే మూడు నాలుగు దినాలు ఉండి పోతుంది. వచ్చినా పొద్దు ఎట్లుండారు ఏం చేస్తున్నారు అని మంచిసెడ్డ, బిడ్డ పాప, ఊరు వొగము గురించి ఒగరుకొగరం ఇసారించుకుంటా ఆ పొద్దంతా వంట, వార్పు చేసుకుని తిన్నే సరిపాయ.

ఆ మర్నాడు పద్దన్నే లేసి ఇద్దరం చెరో పని చేసుకొని ఇంట్లో ఉండేది లేంది వండుకొని తినినాము. నామొగుడు రాక రాక చెల్లెలు పుట్టింటికి వచ్చిందని ఆయమ్మకు ఇష్టమైన వంట, వార్పుకు సరుకులు, ఆమెకో చీర తీసుకొని వస్తానని టౌన్కి పాయ.

మా ఆడబిడ్డ సరస ఉండి ”వదినా ఇంటికాడ ఊరికే ఉంటే పొద్దు పోలా, పొలం కాడికిపోదాము పద, చాన్నాలై పొలంజూసి అనె”.
సర్లే పోదాం అని ఇద్దరం మా మడి దావ పడితిమి.

సరస చుట్టుపక్కల పొలాల కల్ల పారజూస్తా ”మీ తొట్టు యాడ జూసినా పంటపొలాలు పచ్చగా ‘సీతమ్మ తానము ఆడతున్నట్టుంది’ వదినా అనె. మేము ఇద్దరం ఆ మాట ఈ మాట చెప్పుకుంట మా మడి దగ్గిరికి పోతిమి.

” మే సరస మీ అన్న గెనుం లోనే పంట పెడదామని రెట్టలావు గెనాలు పెట్టినాడు బలే పాసినోడు, నువ్వు చీర ఎగజెక్కోని సూస్తా నడు అని చెబతా నేను ముందు గెనాలమీద నడస్తా వొరిమడి దానికి చూపిస్తా ఉండా.

ఇంతలొ సరస ”వదినా కార్తీకంలో మల్లు నాటితే కసువాశే గాని వొడ్లాశ ఉండదు” అని పెద్దలు అనేది కాని ఈసారి అట్ల కాదు ఏం పంట పండుండాది ఇపు డు. మన అయాములో ఇట్లాంటి పంట సూల్ల. యాడ సూసిన మల్లు ఇరగ పండినాయి. ఏమి గొలక ఇడిసింది. ఉన్నోడు, లేనోడు అనె తేడా లేకుండ పంటపండింది. ఏమైనా ఈ తడవ మీగ్గూడా యాబై మూట్లపైనే అయితాయిలే అనే ”.

”అవును సరస దేవుని దర్మాన పది దినాల్లొ కోత కొయాలి, మడి కోతలకు కూలీలు డబుల్ రేట్లు అడగతా ఉండారు. మడి కోతలప్పుడు నువ్వు నాలుగు దినాలు ఎగసాయం జెయ్యి. ఇంటికి వొడ్లు యేసుకొని పోదువుగాని” అంటి.

”అట్లనేలే వదిన ఆయాలకు మల్లి వస్తాలే” అని జెప్పె.

పొలమంతా కలయ తిరిగి ఇద్దరం సంతోసంగా ఇంటికి బోతిమి. మావి ఏటి పక్కన బూములు. నీల్లు ఎక్కువైన తక్కువైన పంట సేతికి రాదు. ఈసారి అన్ని కలిసొచ్చె. పంట పండించే పతొకరి నోట్లో తిండి గింజలకు బయం లేదు అనే బింకం కనబడే.

అప్పుడే టీవిల్లో, సెల్లులో నివారు తుపాను వస్తందంట. చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లొ బారీగ వానలంట అని ప్రచారం అవుతా వుంది. దినాము తొలి కోడి కూసినప్పుడు నాకు మెలకువ వస్తుంది. అయినా నేను తొలికోడి కూతప్పుడు లేయను. ఎందుకంటే అప్పుడు టైం మూడున్నర అయి వుంటది. మల్ల మూడో కూతకు ఐదున్నర అవుతుంది. అప్పుడు లేస్త. ఆపైన కోడి కూడా కూసేది ఆపేస్తుంది. బేస్తవారం పద్దన్నే నేను నిద్ర లేసి దొడ్లోని ఆవును బయట కట్టేద్దామని బయటకు వచ్చేలోపల తుంపర్లు జల్లులు పడతుండాయి. ‘పొద్దున్నే వచ్చేసుట్టం, పొద్దున్నేవచ్చే వాన చాన్చేడి ఉండరులే’ అనుకొని ఇంట్లో పన్లు పూర్తి జేసుకొని, నేను నా తోడికోడలు ఇంగా ఒగ నాలుగై దు మంది కలిసి గొడుగులు ఎత్తుకొని ఆవులు తోలుకొని గుట్టకు పోతిమి. తుంపర్లు రాలతానే ఉండాయి.

మా నాగరాజన్న ఉండుకొని ”ఎవరిని బతికించను ఈ వాన పడతాండేది గొర్రెలకు, గొడ్లుకు మేత లేకుండ సేస్తాంది” అనే. నేనుండు కొని ”తుపాను లేసిందంట మనకు బారీగ వానలు పడతాయని జాగర్తగా ఉండమని జెప్తా ఉండారంటి”. మనం వానలు లేక సాయాల్సిందే గాని వానలు పడి ఎబుడూ సాయము. మనది రాయలసీమ” అనె.

ఆ మాటకు అందరం నవ్వి నిజమేన్నోవ్ అంటిమి . ఆవులు, గొర్రెలు ఆ చినుకులకు తడస్త తల ఎత్తకుండ మేస్తా ఉండాయి. మేము గొడుగులు బట్టుకొని పొద్దుగుంకేదంక వాటి ఎనకాల నిలబడి, నిలబడి నిలువు కాల్లు పడినాయి. సలికి వనకత ఇంటికి వస్తిమి. ఆవులు గాటికి కట్టేసి,అన్నాలు జేసుకొని తిని వానకి కరెంటు యాడ దీస్తారో అని దీపాంతులకు నూనె పోసి రెడీగ పెట్టుకున్నాం.

ఎనిమిది గంటలకు గట్టిగా మొదలైంది వాన గాలి. పోటా పోటీగ ఎత్తు కున్నాయి. ఒక్క నిమిషం కూడ తెరప వదల్లేదు. కుండపోత వాన. ఏమి జెయ్య లేని పరిస్థితి. ఆ రాత్రంత ఒగ నిమిసం కూడ నిలస కుండా వాన కురుస్తానే ఉంది. ఆ రాత్రి ఆవులు గొర్రెలు, మేకలు తడవకుండ పట్టలు కడితిమి. తెల్లారితే నిలుస్తుందిలే అనుకుంటా వుండాము. ఈ వానకు తోడు గాలి. ఈ వాన గాలికి మా కడుపులొ పేగులు కూడ అదరతాండాయి. మాకే అట్లుంటే అడ్డు, ఆపు లేని నోరులేని జంతువులకి ఎట్లుంటుంది.

నిద్రలో ఉలిక్కిపడి లేసి సూస్తే నాలుగు దిక్కుల నుండి వాన, గాలి చుట్టు మల్లుకొని కురస్తానేవుంది. ఆ రెయ్యి రాతిరికి సరిగ్గ కంటిమీద రెప్ప యేసిండ్ల ఎవరూ. తెల్లారింది. అయినా కురిసే వాన గాల్లో ఏమాత్రం తగ్గుమొకం లేదు. రోజు కూసే కోళ్లు గూడా ఆరోజు సలికి ముదరక పొయినాయి. పైన ఎగిరే పక్షులకు అయితే రెండు దినాలు ఉపవాసమే. కడుపు వడగట్టుకుని యాడ ముదురుకొని ఉన్నాయో తెలీదు.

మేము ఇండ్ల నుండి కనీసం బయట రావాలంటే గొడుగు ఉండాల్సిందే.పక్కింటికి పోయే పరిస్థితి కూడ లేదు. మనుషులకి తప్ప ఏ జీవికి గాని కడుపు నిండ తిండిలేదు. మనుషులు గ్యాసు మింద వొండుకొని తింటా వుండారు. అదే కట్లపొయ్యి అయితే ఎంత కష్టమైయ్యేదో. కాలాన్ని బట్టి మారేది కూడా ఒకందుకు మేలే. మేము యాడో ఒకసోట అప్పో సప్పో జేసి అయినా కడుపుకి తింటుండాము. కాని ఆవులు, గొర్రెలు, మేకల బాద అంతా ఇంతా కాదు. పైన నానడం కింద పేడ, గంజరాలు ఏసి తొక్కి రొచ్చులో అట్లే నిలబడి, నిలబడి నిలువు కాల్లు పడిపోయినాయి ఆటికి.

శుక్రవారం మూడు గంటలకంతా చుట్టుపక్కల చెరువులు నిండి నిబ్బాలాడతా మరవలు పోతా వుండాయి. మా ఊరి కింద రెండు ఏరులు కలిసి నేరుగా బహుదా పాజెట్టుకి పోతాయి. మద్దానానికంత రెండేర్లు ఇరవై అడుగుల ఎత్తున వస్తాండాయి. మాకంటే పెద్దోల్లు” మేము పుట్టినబ్బుడు నుండి ఇట్ల ఎడతెరప లేని వాన కురిసింది సూడనే లేదు” అంటుండారు.

మా ఊరి జనాలు బయట పోవాలంటే ఆ ఏరు దావ తప్ప ఏరే దావ లేదు. ఏరు దాటలేక అక్కడోల్లు అక్కడే, ఇక్కడోల్లు ఇక్కడే నిలిచి పోయినారు. ఆ గంగాదేవి ఎర్రగ వుదృతంగ వస్తాంటే ఆయమ్మ వుగ్రాన్నిజూసేకి మా ఊరి జనాలు బార్లుతీరినారు. ఆ నీల్లు జూసేకి రెండు కండ్లు సాల్లేదు.

మా ఊరోళ్ళకి ఏరు పక్కన బూములుండాయి. వాటిల్లో మల్లు, టమాటా కాయలు, కాలీపవరు, అనపసెట్లు, జొన్నకర్రలు, రాగులు ఎవురికి తగిన సేద్యం వాల్లు సేసుకున్నారు. ఏట్లొ మోటర్లు యేసి సేద్యానికి నీల్లు పారగడతా ఉండేవాల్లు.

మా బూముల్లోని పంటనంతా ఈ వానాగాలి పరకబట్టి ఊడ్సుకొని బోయినట్లు ఊడుసుకొని పోయింది. పంట్లపైన బురదతో పుడక నిండిపోయింది. రెండు దినాలు ముందు కలకలలాడుతున్న మల్లు కుప్పకూలి పాయ. రోగం వచ్చిన మనిషి లేయలేక సాపకు కర్సక పోయినట్లు మల్లు అన్ని ఒక్క సారిగా బూమ్మింద పండు కొనేసినాయి. వాటి కల్ల సూస్తే తినే కూట్లొ రాళ్ళు పోసినట్లుంది.

ఈ వాన వల్ల నట్టం జరగని ఇల్లంటూ లేదు. శనివారం పద్దన్నే రొవ్వ తెరప వొదిలింది. మొబ్బులు వొదిలి నీలిరంగు ఆకాశం కల్ల సూస్తే మల్ల మా పానాలకు కొత్త శక్తి వొచ్చినట్లు అయింది. అందరం ఒకరి మొగాలు ఒకరం సూసుకున్నాం. అందురు గుంపులు, గుంపులుగా కూడి వాల్ల గోడు ఎలబోసుకుంటా ఉండారు.

ముందుగా మా రాజసిన్నమ్మ ఉండి ”మా నాయన నాటిన పదేల్ల నాటి మునగ సెట్టు సంవత్సరానికి మూడు కాపులు కాసేది, వొగోక్కాయి చెయ్యి పొడుగు కాసేది. ఆ సెట్టు కాయలు ఏమి రుసిగా ఉండేదొ. నేను దీన్ని నా బిడ్డలకు ఇచ్చి, అడిగిన వాల్లకు ఇచ్చి, పైగా అమ్ముకుంట ఉంటి. అట్ల సెట్టు ఏర్లుకాన తెగి ఇరిగిపాయింది . ఆ మాన్ను సూస్తానే నా కడుపు సెడినిట్లు అయిపాయ ఇన్నేండ్లు కాపాడిందానికి మాకు రుడం తెగిపాయ అని బాదపడె.

ఆ మాటకు మా ఆడబిడ్డ నాతొ సిన్నగా ”కాదు వదిన ఆయమ్మ ఆ సెట్టు కాయిలు అమ్ముకొని తినిందే గాని ఏబ్బుడన్న ఈడ వుండేవాల్లకు ఎవురికన్న రెండు కాయలు ఇచ్చిందా, ఇరిగి పానీలే ” అనె.

అది నిజిమే! ఆయమ్మకు, బిడ్డలకు అయ్యి మిగిలితె అమ్ముకోను తప్పితే ఎవురికీ వొగ కాయి ఇచ్చింది కాదు. ఆయమ్మ సెట్టు ఇరిగిందానికి ఎవురికి బాద లేదు ఆ యమ్మకు తప్పితే, పైకి అందరూ పోనిలే ఏంచేద్దాము అంటిమి.

మాయక్క ఏమన్నంటే ”నాయనా ఈ వానకు మా మిద్ది గోడలు మోల్డింగ్అంత నెమ్ము ఎక్కి పోయి గోడల్లో నీళ్లు వస్తాండాయి. నిద్ర పొద్దులో యాడ నెత్తిన పడతాయో అని కంటి మింద రేప్పేసిండ్ల .ఇట్లా వాన ఎబుడూ వచ్చిండ్ల అనే. మా అక్క ఎనకాలే మా పెద్దమ్మ ”నాయనా మాకు లెటిన్ రూమ్ లేదు. ఈ వానకు బయటపొయి కుస్సో లేక రెండు దినాలు నుండి అన్నం,నీళ్లు సూపడానికి తిని అదంబట్టుకొని కడుపునొప్పి వొచ్చేసింది” అనే .

ఆ మాటకు నేను అందుకే లెటిన్ రూములు వుండల్ల మాకేమి అవసరం అంటిరి. సూస్తిర ఎట్ల ఇబ్బంది వొచ్చిందొ అంటి.

మా యంకటప్ప నాయన చానా దిగులుగ అయిపోయినాడు. ఏం నాయన అంటే ” మీ యమ్మవి బంగారు సొమ్ములు బ్యాంకులొ పెట్టిలచ్చ రుపాయలు తెచ్చి పెట్టుబడి పెట్టి టమాట పంట సేద్యం జే స్తి. ఇబుడిబుడే రేట్లు కూడ బాగున్నాయి. ఈ రేట్లొ ఎంత లేదన్న పెట్టుబడులన్ని పాను నాలుగు లచ్చలన్న మిగులుండేది, ఈ వానతో ఏరొచ్చి దాని కేసిన డ్రిప్పు కట్లు, నీల్ల పైపులు, చెట్లు ఏర్లతొ సహా ఏట్లో కొట్టుకొని ఎల్లి పాయ. ఆ కొట్టకపోయిన టమాటా సెట్లు ఏటి పొడువుకు ఆడాడ తెండ్లు తెండ్లుగా తగులుకొని వుంటే వాటిని సూస్తానే నా కడుపు కాలింది. నేను ఎబుడు కోలుకునేది. ఆ బాద నా కడుపులో పడి కడుపుకి కూడు దిగదు. ఎంత మర్సిపాదాం అన్నా మరుపు రానే రాదు అని బాద పడే. ఆయన్ని సూసి మేము కూడ బాదపడితిమి. అందరం పోతే పోనిలే పానం అనేది వుంటే మల్ల సంపాదించుకోవచ్చు అని దైర్నం సెపితిమి.

దానికి మా నాగన్నమాట్లాడతా ”మా ఇంట్లో యాబైగొర్రెలు ,యాబై మేకలున్నాయి. వాటిల్లొ నిండు గర్బంవి ఇరవై. నిండు బొట్టేల్లాగ ఈ పొద్దో రేపో ఈనేదానికి వుండాయి. బిడ్డ తల్లులు ముప్పై వుండాయి. గొర్లు, మేకలకు రేయి మేత లేదు. పొగులు మేస్తాయి రాత్రి ఖాలీగ అట్లే వుంటాయి. వాటికని మేత ఎబుడూ ఎత్తి పెట్టరు. అందుకే పెద్దోల్లు అనే వుండారు గొర్లు, మేకలు వుంటే ఇంట్లో శవం ఉన్నా వాటి కాటికి పోవాల్సిందే అని. వొగ పొగులు, రేయి అవి గొర్ల దొడ్లొ జరోని వానకి నిలబడు కోనుండాయి. ఆకిలి అని అవి సెప్పలేవు. అవి మేసిన మేతకు పిసుకులు ఏసేసి నాయి. మ్యామ్ మ్యామ్ అని ఒకటే అరుపులు. దినాము బాగా మేసి పుట్టసెండే గతం వాటి కడుపులు నిండుగ వుండేవి. ఇబ్బుడు ఆదొక్క, ఈదొక్క జోగా డతావుండాయి. ఈ బిడ్డతల్లుల కర్మ ఇంతా అంతా కాదు. వాటి బిడ్డలు అరస్తా రొమ్ములకు మూతి పెట్టి గుద్దతా వుంటే పాలు రాక అవి కన్నీల్లు కార్సినాయి. వాటిని సూసి నేను గిన్నిలో అన్నం పెట్టుకుంటే నోటి కాటికి సేయిపోదు అరకడుపు తిని లేసేది” అని బాద పడే.

మా రామన్న” నా బాదసూడు నాయన మాకు వానొస్తే ఆవులకి సోటు లేదు.వాటికి సాటు సెయ్యాలంటే ముపైవేలు వుండల్ల. ఇబుడు లేదులే నిదానంగా చేద్దం అనుకుని వుండిపోయిన. ఈ వానకు రెండు దినాలూఆవులు తడుస్తానే నిలబడుకొని నేల పడుకోక కాల్లు పట్టకపోయినాయి. పద్దన్నె ఇప్పి తోలితే నడసలేకపోయినయ్. వాటి కడుపులో పేగులు కూడ అదరత వుండాయి. వాటి సంపాదనతో మనం తిని ఎచ్చగ పండుకుంటా వుండాము వాటికి సోటు లేదు. మనకు లేకున్నా పరవలేదు వాటికి ఉండల్ల అనిపిచ్చింది. అప్పో సప్పో జేసి సాటు ఏర్పాటు జేయాలని తెగించేసిన ”అనె ఆయన్న.

ఆ మాటకు మా నాగన్న ”ఏది ఏమైన కాని తొట్టతొలిత మన ఊరు గునార్థం ఏసినోడు ఏవడో గాని శాన పగడబందీగ సేసినాడు. ఎన్ని వరదలొచ్చిన ఊరుకి దెబ్బ రాలేదు. ఊరు సుటకారం సెరువులు, ఏర్లు, మద్దిలో ఊరు. నీల్ల వాటం ఎట్లుంది అని సూసి ఇల్లు కట్టినాడు. అది మనకు ఒకమేలు .ఆ దైర్నంతో బతకొచ్చు” అనె. ఆ మాటకు అందరం అవును అది నిజమే ఇండ్లు కొట్టుకు పోతాయి అనే బయం అయితే లేదు మనకు అనుకున్నాం.

మా యంగటమామ ఉండుకోని ”అయిన ఎబుడూ టీవిల్లో, పేపర్లో, సెల్లులో సుట్టుపక్కల దేశాలోల్లకు వాన్లు వరదలొచ్చి మనుసులు సచ్చిపోయినారు, ఇండ్లు కొట్టకపోయినాయి. పంటలు మునిగిపోయినాయి అని సూసినప్పుడల్లా అయ్యో పాపం అని బాదపడతా వుంటిమి. మనకు ఆ పరిస్థితి రాదులే అని బతికేస్తా ఉంటిమి కాని అది అపద్ధం. ఈ కష్టం మనకు రాదులే అని ఎబుడూ అనుకోకూడదు. ఏదొచ్చినా ఎదురీదాల్సిందే” అనే .

ఆ మాటతో అందురూ అంతేలే ఏదొచ్చిన పడాల్సిందే అంతకు మించి మన సేతుల్లో ఏముంది అనుకోని గెట్టి మనసు చేసుకొని ఇండ్లకుబోతిమి.

** **

(అర్థాలు )
ఒగము = ఊరు జనాలు
ఆ సింతకు ఈ సింతకు = ఆ చింతకు ఈ చింతకు
ఎగసాయం = సహాయం
సాయము = సావము, సచ్చిపోము
ముదరక = ముడుసుకు
గంజరాలు = పంచితాలు
నిబ్బాలాడతా = నింపుగా
మరవలు = పొర్లతా
మల్లు = వరి మడి
రుడం = రుణం
సూపడానికి = కొంచెంగా
సాటు = షెడ్డు

పుట్టింది చిత్తూరు జిల్లా మదనపల్లె దగ్గర  బురుజు మాదిగపల్లె. కథా రచయిత్రి. వ్యవసాయ కూలీ కుటుంబం. ప్రధాన వృత్తి వ్యవసాయం. రచనలు వీరి వ్యావృత్తి. ముప్పై కథలతో 'ఎదారి బతుకులు' కథా సంపుటి ప్రచురించారు. ఇప్పటివరకు అరవై కథలు రాశారు. గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో 'నవోదయం' మాస పత్రిక నిర్వహిస్తున్నారు.

Leave a Reply