-పర్వీన్ ఫజ్వాక్
(Daughters of Afghanistan నుండి)
(అనువాదం – ఉదయమిత్ర)
వొద్దు…
ఎడతెగని నాకన్నీటిపై
నీ సానుభూతి వచనాలొద్దు
నా కన్నీరంటే నాకే కోపం…
నీ ముందు
బేలగ నిల్చొని, బలహీనతల పంచుకొని
చరిత్ర హీనగ మిగలలేను
వొదిలెయ్…
ఒక్క అవకాశమియ్యి
ఈ రాతి గోడల్ని బద్దలు గొట్టుకు వొస్తా…
శతాబ్దాల
ఘనీభవించిన నిశ్శబ్దాల దాటి
మతమౌఢ్యాల వైతరణులదాటి
నిరర్థక రణరంగాల గాయాల్ని తుడిచి
నీలిబురఖా విడిచి
నీలాకాశం వైపు
పక్షి నై ఎగురుతా…
పాటనై పల్లవిస్తా…
ఆఫ్ఘాన్ మహిళ
ఆత్మ విశ్వాసాన్ని
రేపటి చూపుగా
ప్రపంచం గుండెలపై నాటుతా…