మానేరు

మానేరు యాదులు
అలాగే తడి తడిగా ఉండనీ
కాలమా! చెరిపేయకు

మానేరు నది ఒడిలో కూర్చుంటే
చల్లని గాలితో పాటు జ్ఞాపకాలు
ముట్టడిలో ఖైదీ అయిపోతాను

దాహం తీర్చిన చెలిమెలు
ఇప్పుడు ఇంకిపోయి
కన్నీళ్ల తుఫాన్లను రేపుతున్నాయి

అటు ఇటు ఒడ్డునున్న
పొలాల నీళ్లపై సూర్యకిరణాల పడి
జరీ అంచు పచ్చని పట్టుచీర
గాలికి పైరును ఊయలలో వేసి
ఊపుతున్నట్టు వుండేది

మానేరు ఇప్పుడు ఎండిపోయింది
వ్యవసాయం బీడు పడి
అసహాయం అయిపోయింది

రాత్రి గ్రామంలో పొద్దూకుతుంది
ఉదయం పట్టణంలో తెల్లారుతుంది

తప్పు ఎక్కడ జరిగిందో తెలియదు
ఎట్లా తప్ప తీసిండ్రో తెలవదు
రైతు కూలీ అయిపోయిండు
కూలి నిలువునా కూలిపోయిండు

బడి చదువు వెలుగు పంచేసరికి
అంతకన్నా ఎత్తు గుడి లేచి
అమాయకులకు భక్తిని పంచింది

నాకు వాగు నీళ్ల స్పాంజిలా కనబడితే
వాడికి ఉసీకెలో రూపాయల
ఫెళఫెళలు వినిపిస్తున్నాయి

నడిచే కాళ్లును ఎవరో విరగొట్టారు
మానేరు కుక్కి మంచంలో పడి
విలవిలా విలపిస్తున్నది

ఆర్థోపెడిషన్లకు చూపించినా
చికిత్స లేదని చేతులెత్తేశారు

నది అంగవైకల్యం పెన్షన్ కోసం
ఆన్లైన్లో అర్జీ పెట్టుకుంది

వాగును దాటుతున్నప్పుడల్లా
కయ్యలు ఉన్న దగ్గర
కాళ్లకు చూపు వచ్చి
ఒడ్డుకు నడిపించేవి

ఎండాకాలంలో మోకాళ్ల వరకు
వానాకాలంలో బొండిగెల వంటి
చలికాలంలో నడుముల వంటి
మానేరు ఉరికేది
ఇప్పుడు ప్రవాహం లేకున్నా
ఇసుక వ్యాపారులు మందిని
నిలువునా ముంచి ఉసురు తీస్తున్నారు

అప్పుడు బుడ్డి దీపం కాంతిలో
ఊర్లు చీకట్లో వెలిగిపోతుండేవి
ఇప్పుడు విద్యుత్తు ఉన్నా
ఊరుపై మెరుపు దాడికి
చీకట్లు సిద్ధంగా ఉన్నై

పుట్టింది కరీంనగర్ జిల్లా తంగళ్ళపల్లి గ్రామం. కవి. కోపరేటివ్ విద్యుత్ విభాగంలో సూపరింటెండెంట్ గా పనిచేసి పదవీ విరమణ చేశారు. రచనలు: చిలుక రహస్యం, తారంగం, ఒకరోజు పది గాయాలు, పిడికెడు కన్నీళ్లు దోసెడు కలలు, పాతాళ గరిగె, ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, గంగడోలు, వాస్కోడిగామా డాట్ కామ్, బొడ్డుతాడు, తల్లి కొంగు, రాజపత్రం, చెట్టుని దాటుకుంటూ, పస, ఊరు ఒక నారు మడి.. 14 కవితా సంపుటాలు, 'వైఫణి'( నైపుణ్యం) కథల సంపుటి ప్రచురించారు.

Leave a Reply