మాంద్యంలో పెట్టుబడిదారీ విధానం

ఆర్ధిక సంక్షోభం రాబోతున్నాదా! ప్రపంచం మాంద్యం బారిన పడబోతున్నదా! రష్యా – యుక్రెయిన్‌ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధంతో ఇప్పటికే భారీగా నష్టపోయిన ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థకి మరిన్ని చిల్లులు పడబోతున్నాయా! ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఇది నిజమేననిపిస్తుంది. ముంచుకొస్తున్న ఆర్థిక మందగమన మేఘాలు ప్రపంచాన్ని కమ్మేస్తున్నాయి. ఆ దేశం ఈ దేశం అని లేదు.. అగ్రరాజ్యం.. చిన్న రాజ్యం అని లేదు. అన్నింటిని కబళించి వేయడానికి మాంద్యం సునామిలా దూసుకొస్తుంది. ఐఎంఎఫ్‌, ప్రపంచబ్యాంక్‌ తాజాగా హెచ్చరికలు చేసింది. మాంద్యం ప్రభావం ఎలా ఉండబోతున్నది? ”ప్రపంచ వృద్ధి బాగా మందగిస్తోంది. అన్ని దేశాల ప్రజలు వినాశకరమైన దీర్ఘకాలిక పరిణామాలను ఎదుర్కొక తప్పదని” ప్రపంచబ్యాంక్‌ గ్రూప్‌ అధ్యక్షుడు డేవిడ్‌ మల్పాస్‌ అన్నారు.


పెట్టుబడికి పుట్టినిల్లు అయిన ఇంగ్లాండ్‌, అగ్రరాజ్యం అమెరికా, ఇయు దేశాలు ఫ్రాన్స్‌ జర్మనీ, ఓషియానియా (ఆస్ట్రేలియా) ఖండంలోని న్యూజిలాండ్‌, ఆసియా ఖండంలోని చైనా, భారత్‌, పాక్‌, శ్రీలంక, బంగ్లాదేశ్‌ దేశాలతో పాటు ప్రపంచం అంతటా మాంద్యం మేఘాలు ఆవరించాయి. సంపద కేంద్రీకరణ వినాశకర సామ్రాజ్యవాద ప్రపంచీకరణ ఆర్థిక విధానాల వల్ల ఆర్థిక సంక్షోభంతో పలు దేశాలు కొట్టుమిట్టాడుతున్నాయి. కార్పొరేట్‌ కంపెనీలకు వనరులు, శ్రమ, ప్రజాసంపదను దోచిపెట్టే విధానాలను పాలకులు అనుసరించడం వల్ల ఆర్థిక అసమానతలు అనూహ్యంగా పెరిగి, ప్రజల కొనుగోలు శక్తి క్షీణించి సంక్షోభం మరింతగా ముదురుతోంది. పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ కారణంగా పదేపదే ఏర్పడిన ప్రపంచ మాంద్యం వల్ల నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, పేదరికం పెచ్చరిల్లిపోతోంది. ప్రజల జీవితాల్లో మాంద్యం అస్థిరతను సృష్టిస్తోంది. సామ్రాజ్యవాద ప్రపంచీకరణ ఆర్థిక చట్రంలో ఎవరికి ఉద్యోగం ఎప్పుడు పోతుందో, వేతనంలో కోత ఎప్పుడు పడుతుందో, రిటైర్మెంట్‌ తర్వాత పెన్షన్‌ వస్తుందో లేదో… లాంటి అనేక అంశాలతో ప్రైవేట్‌ ఉద్యోగులే కాదు ప్రభుత్వ ఉద్యోగులు కూడ అల్లాడుతున్నారు.


ప్రపంచంలోని వివిధ దేశాల ఆర్థిక వ్యవస్థల్లో నాలుగు అంశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అధిక నిరుద్యోగం, అధిక ద్రవ్యోల్బణం, అధిక ధరలు, బ్యాంకుల దివాళాలతో దాదాపు అన్ని దేశాలలో ఆర్థిక వృద్ధి నిలిచిపోయింది. ప్రజా ఆందోళనలు పెల్లుబుతున్నాయి. బ్రిటన్‌లో ద్రవ్యోల్బణం కారణంగా రైల్వే, తపాల, విద్య, వైద్య రంగాల ఉద్యోగులు సమ్మెతో వోరెత్తిస్తున్నారు. జూలై 5 నుంచి ఉపాధ్యాయులు పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని నిరవధిక సమ్మెకు వెళ్తున్నారు. ఫ్రాన్స్‌లో పెన్షన్‌ వయస్సును 62 నుంచి 64 ఏళ్లకు పెంచడాన్ని వ్యతిరేకిస్తూ జనవరి 19 నుంచి మిలియన్లలో కార్మికులు అరడజను సార్లు నిరసన ప్రదర్శనలు చేపట్టారంటే ఆర్థిక సంక్షోభ ప్రభావాలు ఎంత తీవ్రంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఆస్ట్రేలియాలో రవాణా కార్మికులు, జర్మనీలో 25 లక్షల ప్రభుత్వ రంగ ఉద్యోగులు మార్చి నుండి పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని సమ్మెలు చేశారు. భారత్‌లో ఏప్రిల్‌ 5న మూడు లక్షల మంది కార్మికులు, రైతులు పెరుగుతున్న ధరలకు వ్యతిరేకంగా ఢిల్లీలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఇజ్రాయెల్‌లో న్యాయ సంస్కరణలకు వ్యతిరేకంగా ప్రజాందోళనలు, స్పెయిన్‌లో కార్మికుల ఆందోళనలు వంటివి ప్రపంచ వ్యాప్తంగా సంపన్న దేశాలను, అభివృద్ధి చెందుతున్న దేశాలను కుదిపేస్తున్నాయి. ప్రజాందోళనలకు కారణం ఆయా దేశాల్లో ప్రభుత్వాలు అమలుచేస్తున్న కార్పొరేట్‌ అనుకూల సామ్రాజ్యవాద ప్రపంచీకరణ ఆర్థిక విధానాలేనన్నది అక్షర సత్యం. అందువల్లనే 170 సంవత్సరాల క్రితమే ‘పెట్టుబడి’ విత్తులోనే సంక్షోభం మొక్క దాగుందని మార్క్స్‌ చెప్పాడు.


రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత జాన్‌ మెనార్డ్‌ కీన్స్‌ ప్రబోధించిన సంక్షేమ రాజ్య విధానాలు అనుసరించిన పెట్టుబడిదారీ దేశాలు. 1980వ థకంలో అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి ప్రయోజనాల కోసం అమెరికా, ఇంగ్లాండ్‌, చైనా (రీగన్‌-థాచర్‌-డెంగ్‌) అధ్యకక్షులు సంక్షేమాన్ని గాలికొదిలేసి మార్కెట్‌ స్వేచ్ఛా సిద్ధాంతాన్ని అమలులోకి తెచ్చారు. ప్రపంచ బ్యాంక్‌, ఐఎంఎఫ్‌ వంటి సంస్థల మాటున రుణాలు ఎరగా చూపి పేద, వర్ధమాన దేశాల నడ్డి విరుస్తూ వస్తున్నాయి. విత్త సంస్థలు విధించిన కఠిన షరతులకు పాలకులు తలొగ్గడంతో శ్రామికులు, కర్షకులు, సాధారణ ప్రజానికం బతుకులు అగమ్యగోచరంగా మారాయి. స్వేచ్ఛా వాణిజ్యం మాటున ద్రవ్య పెట్టుబడి గుత్తాధిపత్యానికి అన్ని ఉత్పత్తి, సేవారంగాలు బలయ్యాయి. సంపన్న పేద వర్గాల మధ్య ఆర్థిక అంతరాలు అనూహ్యంగా పెరిగాయి. ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదల, నిరుద్యోగం పెరిగాయి. మరోవైపు 15 మాసాలుగా యుక్రెయిన్‌-రష్యా యుద్ధం కొనసాగుతోంది. మాంద్యానికి కారణంగా 2020లో వచ్చిన కొవిడ్‌, ఇప్పుడు జరుగుతున్న యుద్ధాన్ని కారణాలు పెట్టుబడిదారీ దేశాలు చెబుతున్నాయి. నిజానికి 2008లో అమెరికాలో మొదలైన ప్రపంచ సంక్షోభానికి ఇప్పటి మాంద్యం కొనసాగింపే తప్ప కొత్తగా పురుడు పోసుకున్నది కాదు.
పెట్టుబడిదారీ దేశమైన అమెరికా 2007-08 ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించడానికి, దివాలా తీసిన బ్యాంకులను రక్షించడానికి ప్రభుత్వ ఖజానాను ఉపయోగించింది. ఆ సమయంలో లేమాన్‌ బ్రదర్స్‌ వంటి ఆర్థిక సంస్థలు అమెరికాలో దివాళా తీశాయి. పోటీ మార్కెట్‌ను చేరుకోవడానికి, వడ్డీ రేటును తగ్గించడం ద్వారా గృహాలను కొనుగోలు చేయడానికి రుణాలిచ్చే విధానాన్ని చేపట్టారు. కానీ ఆ తర్వాత సెంట్రల్‌ బ్యాంక్‌(ఫెడ్‌) వడ్డీ రేట్లను పెంచినప్పుడు, రుణగ్రహీతలు తిరిగి చెల్లించలేనందున ఆ బ్యాంకులు, ఆర్థిక సంస్థలు అన్నీ దివాలా తీశాయి. ప్రభుత్వ సహాయంతో (ప్రజాధనం) బ్యాంకుల పెట్టుబడి మూలధనం ఆదా చేయబడింది. ఆ విధంగా ఆర్థిక మాంద్య ఛాయలను ఎదుర్కొంది.


2008 మాంద్యాన్ని అధిగమించక ముందే ప్రపంచం మొత్తం కొవిడ్‌ బారిన పడింది. ఒక హెచ్చరికగా, ప్రపంచం మొత్తం గృహ నిర్బంధంలోకి వెళ్లింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మళ్లీ స్తంభించింది. ఆ ఆర్థిక సంవత్సరంలో (2020-21) అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలు(వృద్దిపరంగా) ప్రతికూలతను ఎదుర్కొన్నాయి. ఆ ప్రభావాలను మనం ఇంకా చవిచూస్తూనే ఉన్నాం. ఖర్చు తగ్గింపు, వేతన కోతలు, పెరిగిన పని గంటలు మొదలైన వాటితో పెట్టుబడిదారీ వ్యవస్థ లాభాల బాటలోకి తిరిగి చేరుకుంది. మళ్లీ మాంద్యం చోటు చేసుకోవడంతో ప్రైవేటు బ్యాంకులు, ఇన్సూరెన్స్‌, ఆర్థిక సంస్థలు, బహుళజాతి ఐటీ కంపెనీలు వేల సంఖ్యలో ఉద్యోగులను తొలగిస్తున్నాయని ప్రతిరోజు మీడియా ద్వారా తెలుసుకుంటున్నాం. సహజంగానే, ప్రభుత్వం లేదా ఇతర మార్గాల ద్వారా ఉపాధిని పొందలేని ఈ కాలంలో, నిరుద్యోగిత రేటు పెరుగుతూనే ఉంది.
తాజాగా మళ్లీ బ్యాంకులు కుప్పకూలడం మొదలైంది. స్విట్జర్లాండ్‌కు చెందిన 167 ఏళ్ల స్విస్‌ బ్యాంక్‌ క్రెడిట్‌ సూయిస్సే దివాలా తీసింది. ఆ బ్యాంక్‌ ప్రత్యర్థి అయిన యుబిఎస్‌ ఆ దివాలా తీసిన బ్యాంకును కొనుగోలు చేయవలసి వచ్చింది. దీనికి చెల్లించింది 300 కోట్ల యు.ఎస్‌ డాలర్ల కంటే ఎక్కువ. అయితే, క్రెడిట్‌ సూయిస్సేకి అందుకు అనేక రెట్లు ఎక్కువ ఆస్తులు ఉన్నాయి. అమెరికాలో పక్షం రోజుల్లోనే నాలుగు బ్యాంకులు దివాళ ప్రకటించాయి. సిల్వర్‌గేట్‌ బ్యాంక్‌, సిలికాన్‌ వ్యాలీ బ్యాంక్‌ (ఎస్‌విబి), సిగ్నేచర్‌ బ్యాంక్‌, ఫస్ట్‌ రిపబ్లిక్‌ బ్యాంకులతో సహా కొన్ని మధ్యతరహా బ్యాంకులు పతనం గావడం 2008 ఆర్థిక సంక్షోభం యొక్క భయాన్ని తిరిగి తెచ్చింది. అయితే ఈసారి మాంద్యానికి కారణం రుణాలివ్వడం కాదు… వడ్డీ రేట్లు పెంచడం తాజా సంక్షోభానికి దారితీసింది.


కరోనాతో దెబ్బతిన్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ధరల భారంతో పెనం మీంచి పొయ్యిలో పడినట్లయింది. యుక్రెయిన్‌పై రష్యా యుద్ధంతో యూరప్‌, అమెరికా దేశాల్లోనే కాదు ఆసియాలోని చాలా దేశాల్లోనూ చమురు ధరలు పెరిగాయి. దానివల్ల ద్రవ్యోల్బణ ఒత్తిడి తగ్గించేందుకు అన్ని దేశాల సెంట్రల్‌ బ్యాంకులు వడ్డీరేట్లను పెంచాయి. చైనాలో మళ్లీ కరోనా భయాలతో అంతర్జాతీయ వాణిజ్యం మందగించడం, రష్యాపై పశ్చిమ దేశాల ఆంక్షలతో చమురు, గ్యాస్‌ రేట్లు పుంజుకోవడం వంటి అనేక పరిణామాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను మాంద్యం కోరల్లో చిక్కుకునేలా చేశాయి. ఈ నేపథ్యంలో తాజాగా యూరప్‌ మీద మాంద్యం నీడలు అలుముకున్నట్టు సంకేతాలు పంపుతోంది.


మాంద్యంలో చిక్కుకున్న పలు దేశాలు :
అమెరికా :
అగ్రరాజ్యం అమెరికా సంక్షోభం అంచుకు చేరుకుంది. మొత్తం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను శాసించే అమెరికా కరోనా మొదలుకొని తాజా బ్యాంకింగ్‌ సంక్షోభం వరకు అనేక పరిణామాలతో మాంద్యం ముప్పును ఎదుర్కొంటోంది. ఇప్పటికే పలు రేటింగ్‌ ఏజెన్సీలు, పెట్టుబడి సంస్థలు మాంద్యం ముందు ఉన్నామని హెచ్చరిస్తున్నాయి. ఇటీవలే అమెరికా ఫెడ్‌ సభ్యులు సైతం తీవ్ర మాంద్యం గురించి ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు, రానున్న ఏడాదికాలంలో అమెరికాలోని కార్పొరేట్‌ రుణాల ఎగవేతలు మాంద్యం తీవ్రతకు కారణమవుతాయని క్రెడిట్‌ పోర్ట్‌పోలియో మేనేజర్‌లు అంచనా వేస్తున్నారు. రానున్న 12 నెలల కాలంలో రుణ ఎగవేతలు పెరుగుతాయని 80 శాతానికి పైగా ఫండ్‌ మేనేజర్లు భావిస్తున్నారు. తద్వారా బ్యాంకుల లిక్విడిటీ క్షీణించడం, ఆర్థిక అంశాలపై క్రెడిట్‌ రిస్క్‌ అమెరికాలో పరిస్థితులు రోజు రోజుకు బలహీనమవుతున్నాయి. అందుకనుగుణంగానే అమెరికా దిగ్గజ కంపెనీలు ఉద్యోగుల తొలగింపులు చేపడుతున్నాయి. ఇప్పటికే గోల్డ్‌మన్‌ శాక్స్‌, మోర్గాన్‌ స్టాన్లీ, అమెజాన్‌, మైక్రోసాఫ్ట్‌, మెటా సహా అనేక దిగ్గజ సంస్థలు భారీ లేఆఫ్స్‌ చేపట్టాయి. గతేడాది నుంచి ఇప్పటివరకు అమెరికాలోని టెక్‌ కంపెనీలు దాదాపు 3 లక్షల మంది ఉద్యోగులను ఇంటికి సాగనంపాయి. ఈ ఏడాది మరిన్ని తొలగింపులు ఉంటాయని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. గత రెండు నెలల్లోనే సుమారు 2 లక్షల లేఆఫ్స్‌ను కంపెనీలు ప్రకటించాయి.


జర్మనీ :
యూరప్‌లోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ జర్మనీ మాంద్యంలోకి జారినట్లు గణాంకాలు వెల్లడించాయి. ద్రవ్యోల్బణం ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయడంతో జర్మనీ మాంద్యంలోకి చేరుకుంది. జర్మనీ ద్రవ్యోల్బణం ఏప్రిల్‌లో 7.2 శాతం చేరుకుంది. జర్మనీ జిడిపి ప్రతికూల సంకేతాలను చూపించింది. జర్మనీ ఆర్థిక వ్యవస్థ వృద్ది సామర్థ్యాన్ని కోల్పోతుందని ఆర్థికమంత్రి క్రిష్టియన్‌ లిండ్నర్‌ అంగీకరించారు. రష్యా గ్యాస్‌ సరఫరాలు నిలిచిపోవడంతో జర్మనీ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమైంది. అధికంగా ధరల పెరుగుదల కొనసాగడంతో ఈ ఏడాది ప్రారంభంలో జర్మన్‌ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం తీవ్రంగా ఉందని ఫెడరల్‌ స్టాటిస్టిక్స్‌ ఏజెన్సీ(ఎఫ్‌ఎన్‌ఓ) ఓ ప్రకటనలో తెలిపింది.


న్యూజిలాండ్‌ :
న్యూజిలాండ్‌ దేశ ఆర్థిక వ్యవస్థ వరుస త్రైమాసికాల్లో క్షీణించి సాంకేతికంగా మాంద్యంలోకి జారింది. వ్యవసాయ ఆధారిత దేశమైన న్యూజిలాండ్‌ జిడిపి ఈ ఏడాది మార్చితో ముగిసిన త్రైమాసికంలో 0.1 శాతం క్షీణించింది. అంతకుముందు త్రైమాసికంలోనూ జిడిపి (సవరించిన అంచనాలు) 0.7 శాతం మేర క్షీణించింది. అక్కడి సెంట్రల్‌ బ్యాంక్‌ వడ్డీ రేట్లను పెంచడమే దేశం మాంద్యంలో ఉందని ఆర్థిక మంత్రి గ్రాంట్‌ రాబర్ట్‌సన్‌ వెల్లడించారు. ‘ప్రస్తుత ఏడాది దేశానికి అనేక సవాళ్లు ఉన్నాయి. ప్రపంచ వృద్ధిలో న్యూజిలాండ్‌ వాటా కూడా నెమ్మదించింది. ఈ ఏడాది జనవరిలో వరదలు, ఆ తర్వాత తుఫాను, కార్మికుల సమ్మె వల్ల ఆర్థికవ్యవస్థ మరింత ఎక్కువ దెబ్బతిన్నది’ అని తెలిపారు. మరోవైపు అక్టోబర్‌లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రస్తుత ప్రభుత్వం తిరిగి అధికారంలోకి రావడం సవాలుగా మారింది. వడ్డీ రేట్లను మరోసారి పెంచితే ఓటర్ల ఆగ్రహానికి గురికాక తప్పదని ప్రభుత్వం భావిస్తోంది.


చైనా :
అమెరికా మరియు ఐరోపా ఆర్థిక వ్యవస్థలు మందగించడం వల్ల చైనా వస్తువులకు డిమాండ్‌ తగ్గడం మాంద్యానికి కారణం. 2023 జనవరి-ఫిబ్రవరిలో చైనా వాణిజ్యం కుదించబడింది. అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే ఎగుమతులు 6.8 శాతం క్షీణించగా, దిగుమతులు 10.2 శాతం తగ్గాయి. ఉపాధి కల్పనలో చైనా తీవ్ర సమస్యలు ఎదుర్కొంటుంది. పాలక విధానాలు కార్పొరేట్ల కొమ్ముకాస్తున్నాయి. పేదల స్థితిని, నిరుద్యోగాన్ని, సామాన్యుల కొనుగోలు శక్తిని పట్టించుకోవడం లేదు. చైనా యువత నేడు తీవ్ర పోటీని ఎదుర్కొంటోందని షాంఘై సహాయ ఆచార్యురాలు జియా మియావో అన్నారు. ఉపాధి, జీవితాలతో చైనా యువత నిరాశల్లో మునిగి ఉంది. పెరుగుతున్న నిరుద్యోగం, పరిశ్రమల మూసివేతలు, ఉద్యోగుల తొలగింపులతో, కరోనాతో దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థ అనిశ్చితితో సవాళ్లను ఎదుర్కొంటోంది, సతమతమవుతోంది.


బ్రిటన్‌:
బ్రిటన్‌లో ఆర్థిక మాంద్యం తీవ్రమవుతోంది. 20 శాతం ద్రవ్యోల్బణంతో ధరలు పెరగడం, ప్రజల జీవన వ్యయంలో కోత పడటం ప్రధాన సమస్యలుగా ఉన్నాయి. ద్రవ్యోల్బణం అధికంగా ఉండటం, ఇంధన ధరలు అధికమవ్వడంతో పాటు ఇంకా అనేక కారణాలున్నాయి. ఇందులో బ్రెగ్జిట్‌ ప్రభావం, సంప్రదాయేతర ఇంధన వనరుల్లో తక్కువ పెట్టుబడులు, వీటన్నింటికి మించి ఇటీవల కాలంలో పన్నుల కోతపై ఫైనాన్షియల్‌ మార్కెట్ల నుంచి ప్రతికూల స్పందన, తదితర కారణాల వల్ల బ్రిటన్‌ ఆర్థిక వ్యవస్థ తీవ్ర సంక్షోభంలో పడింది. బ్రిటన్‌లో ఆహారం, ఇంధనం ప్రధాన సమస్యలుగా ఉన్నాయి. పేదరికంతో అల్లాడుతున్న కుటుంబాల్లో ఎదిగే పిల్లలు ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుత సంక్షోభం పేద కుటుంబాలపై ఎక్కువ ప్రభావం చూపడమే కాదు, వారిని మరింత అప్పులపాలు చేస్తోంది. చాలా మంది మధ్యతరగతి ప్రజలు తమ ఆస్తులను తాకట్టు పెడుతున్నారు. అత్యంత ధనవంతులు మినహా మిగిలిన అందరూ ఇబ్బందులు పడుతోన్నారు.


భారత్‌ :
వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ ప్రచురించిన కథనం ప్రకారం… సెప్టెంబర్‌ నెలతో ముగిసిన త్రైమాసికంలో దేశ వార్షిక ఆర్థిక (ఇయర్‌ ఓవర్‌ ఇయర్‌) వృద్ధి 6.3 శాతం కాగా, తాజాగా విడుదల చేసిన డిసెంబర్‌ గణాంకాల ప్రకారం 4.4 శాతం వృద్ధి మాత్రమే నమోదైంది. తయారీ రంగంలో క్షీణత కొనసాగుతున్న ఫలితంగానే వృద్ధి రేటు గణనీయంగా తగ్గింది. ప్రజల కొనుగోలు రేటు గణనీయంగా తగ్గడం కూడా వృద్ధి గణాంకాలపై తీవ్ర ప్రభావం చూపిందని, ఇది నిరుద్యోగానికి, ఉపాధి రహితస్థితికి కారణమవుతోందని వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ విశ్లేషించింది. ‘అధిక ధరలతో పాటు వడ్డీ రేట్లు భారీగా పెరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా ప్రజల కొనుగోలు శక్తి పడిపోతుండడం, నిరుద్యోగం పెరుగుతుండడంపై పలువురు ఆర్థిక నిపుణులు కేంద్ర ప్రభుత్వాన్ని కొంతకాలంగా హెచ్చరిస్తూనే ఉన్నారు. ప్రజల కొనుగోలు శక్తి పెంచడానికి చర్యలు తీసుకోవాలని వారు చేసిన సూచనలను కేంద్రం ఏ థలోనూ పట్టించుకోలేదు. ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడానికి వడ్డీ రేట్లు పెంచడమే మార్గం కాదని, ప్రత్యామ్నాయ చర్యలను చేపట్టాలని చేసిన నిపుణుల సూచనలను కూడా కేంద్రం పెడచెవిన పెట్టింది.


ఆర్థిక సంక్షోభాలు ఎందుకు వస్తాయి? :
పెట్టుబడిదారీ వ్యవస్థ ఉత్పత్తి, పంపిణీ, వినియోగం, వినిమయం గురించి విశ్లేషించే క్రమంలో కారల్‌ మార్క్స్‌ మాంద్యం గురించి సూత్రీకరించాడు. పెట్టుబడిదారీ వ్యవస్థ జీవకణం సరుకుల ఉత్పత్తి. సమస్త సరుకులు శ్రమ జనితాలే. సరుకు అమ్మడంలో వచ్చే లాభాలే పెట్టుబడిదారీ వ్యవస్థకు ప్రాణం. లాభం కోసమే ఉత్పత్తి, లాభం కోసమే అమ్మకం. లాభం ఎక్కడి నుండి ఎలా వస్తుంది, అది ఎలా పెరుగుతుంది, చివరకు ఆ లాభమే ఈ వ్యవస్థ పతనానికి ఎలా కారణమవుతుందో మార్క్స్‌ కులంకుషంగా వివరించాడు. ఉత్పత్తి క్రమంలో లాభం ఏర్పడి, మార్కెట్‌లో విక్రయం ద్వారా చేతికి వస్తుందన్నాడు. కార్మికులకు ఇచ్చే వేతనాల కంటే అదనంగా పని చేయించుకోవడం ద్వారా అదనపు విలువ లేదా లాభం పొందుతాడు. లాభం మరింతగా పెంచుకోవడం కోసం అధునాతన యంత్రాలను ఫ్యాక్టరీలో ప్రవేశపెట్టి, కార్మికుల పని వేగం (ఉత్పాదకతను) పెంచి తక్కువ మంది కార్మికులతో ఎక్కువ ఉత్పత్తిని, ఎక్కువ లాభాన్ని పొందుతాడు. పని గంటలను పెంచడం, కాంట్రాక్టు అవుట్‌ సోర్సింగ్‌, పీస్‌ రేటు, వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ ఇలా అనేక రకాల మార్గాల ద్వారా అధికోత్పత్తిని పెంచుతారు. దీనివల్ల కార్మికుల తొలగింపు, చిన్న పరిశ్రమల మూత పెరుగుతాయి. అప్పటికే ఉన్న నిరుద్యోగులకు ఉపాధి కోల్పోయిన వారు తోడవుతారు. వీరందరి కొనుగోలు శక్తి తగ్గిపోతుంది. ఇది సంక్షోభాన్ని తీవ్రం చేస్తుంది. పెట్టుబడిదారీ వ్యవస్థలో ఆర్థికాభివృద్ధి రంగం మందగించడమే కాదు, సరుకుల ఉత్పత్తి సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. తన గొయ్యిని తానే తవ్వుకుంటాడు. ప్రపంచీకరణ విధానాల వల్ల సంక్షోభం కూడా ప్రపంచ వ్యాప్తమైంది. సంక్షోభానికి శాశ్వత పరిష్కారం పెట్టుబడిదారీ వ్యవస్థ స్థానంలో సోషలిస్టు వ్యవస్థను నిర్మించడం. అందుకోసం నూతన సమాజ నిర్మాణానికి ఆచరణలో కృషి చేయాలి.


ముగింపు :
ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఈ ఏడాది మూడు శాతం కన్నా తక్కువే వృద్ధి చెందుతుందని భావిస్తున్నట్లు అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్‌) మేనేజింగ్‌ డైరెక్టర్‌ క్రిస్టలినా జార్జివా తెలిపారు. దీనివల్ల ఆకలి, దారిద్య్రం ముప్పు పెరుగుతుందని హెచ్చరించారు. గతేడాది ఈ వృద్ధిరేటు 3.4 శాతంగా ఉండగా, ఈ ఏడాది వృద్ధి రేట్‌ 2.9 శాతం ఉంటుందని అంచనా వేశారు. వచ్చే ఐదేళ్ళ పాటు వృద్ధిరేటు దాదాపు మూడు శాతంగానే ఉంటుందని భావిస్తున్నట్లు చెప్పారు. 1990 నుండి ఇప్పటివరకు ఇదే అత్యంత తక్కువైన మధ్యకాలిక వృద్ధి అంచనాగా ఆమె పేర్కొన్నారు. తక్కువ ఆదాయం కలిగిన దేశాలను ఈ పరిస్థితి తీవ్రంగా దెబ్బతీస్తుందని హెచ్చరించారు. ”కొవిడ్‌ సంక్షోభం వల్ల ప్రారంభమైన ప్రమాదకరమైన ధోరణి దారిద్య్రం, ఆకలి మరింత పెచ్చరిల్లుతాయి” అని క్రిస్టలినా పేర్కొన్నారు. నిజానికి ప్రపంచ పెట్టుబడిదారీ వ్యవస్థ ఒక మార్గాంతరం లేని స్థితిలో పడిపోయిన వాస్తవ పరిస్థితిని ఇది సూచిస్తోంది. ఇది ప్రపంచ పెట్టుబడిదారీ వ్యవస్థ ఎంచుకున్న మార్గమే. ఇందులో ఆశ్చర్యపడవలసినది ఏమీ లేదు. దానిని ప్రతిఘటించడమే బాధితుల ముందున్న కర్తవ్యం.

క‌డ‌వెండి, జ‌న‌గామ జిల్లా. ఉపాధ్యాయ ఉద్య‌మ నాయ‌కుడు. సామాజిక‌, రాజ‌కీయార్థిక విశ్లేష‌కుడు.

Leave a Reply