మహిళలపై ఆధిపత్య హింసను ఎత్తిచూపిన అలిశెట్టి

అలిశెట్టి యువకుడుగా ఎదిగే సమయంలోనే సిరిసిల్లా, జగిత్యాల రైతాగంగా పోరాటాలు జరిగిన మట్టిలో భావకుడుగా,కళాత్మక దృష్టితో ప్రభాకర్ కవిగా, చిత్రకారుడిగా ముందుకు రావటం, ఈ రైతాంగ పోరాటాలు కలానికి కుంచెకు కొత్త దృష్టిని, పదునునూ నిత్యనూతన చైతన్యం అందించాయి. పొట్టి పొట్టి కవితలతో గట్టిగా చెప్పినవాడు అలిశెట్టి ప్రభాకర్. ప్రారంభంలో బొమ్మలు వేస్తూ ఆర్టిస్టుగా ఎదిగాడు.
నిబద్ధత కలిగిన పీడిత ప్రజల రచయితగా ప్రకటించుకున్నాడు. పీడిత ప్రజలలో అత్యంత పీడితులు స్త్రీలుగా గుర్తించాడు.ఈ వ్యవస్థ మీద కసితో ఆయన పదునెక్కిన కవిత్వం మనకు నిరంతరం స్పృశిస్తుంది. జగిత్యాల సాహితీ మిత్రదీప్తి సంస్థ పరిచయంతో సాహిత్యరంగంలోకి ప్రవేశించాడు. 1974 లో ఆంధ్రసచిత్ర వారపత్రిలో ‘పరిష్కారం’ మొదటి కవిత అచ్చయింది.

తన కళ ప్రజల కోసమే అని చివరివరకు నమ్మినవాడు.ఎర్రపావురాలు(1978)మొదటి కవితా సంపుటి. మంటల జెండాలు, చురకలు(1979), రక్తరేఖ(1985), ఎన్నికల ఎండమావి (1989), సంక్షోభ గీతం (1990), సిటీలైఫ్ (1992) ముద్రించిన కవిత్వ సంపుటాలు. అలిశెట్టి ప్రభాకర్ స్త్రీల కోణంలో రాసిన కవితలకు పరిమితమై ఈ వ్యాసం రాయదల్చుకున్నాను. 1978 నుండి 1992 వరకు స్త్రీ కోణాన్ని ఆవిష్కరిస్తూ రాసిన కవితలు మొత్తం ముప్పై. అలిశెట్టికి జీవితం పట్ల, సమాజం పట్ల ఖచ్చితమైన భౌతికవాద దృక్పధం ఉన్నది.

ఒకవైపు అనుభూతి కవిత్వం, మరోవైపు వ్యక్తివాద కవిత్వం పోటీపడుతున్న సమయం.అభ్యుదయ కవిత్వం, మరోవైపు విప్లవ కవిత్వం రావటం. ప్రజలు పోరాటం చేస్తుంటే వాళ్ళ కుటుంబాలు అనూహ్యమైన బాధలకు గురవుతున్న సమయం. అలాంటి కాలంలో తగినంత భావశక్తి,సరైన భావజాలం ఉన్నవాడు అలిశెట్టి ప్రభాకర్. అదే భావజాలాన్ని పాఠకులకు సులభంగా అందించే సంక్షిప్త భాషా పటిమ కలిగిన వ్యక్తి ఫ్రభాకర్. తన బలం కవిత్వమే అని నమ్మినవాడు. దానినే ఆయుధంగా చేసుకున్నవాడు. సుప్రసిద్ధ గాయని బెల్లి లలితను రాజ్యం పద్నాలుగు ముక్కలు చేసినప్పుడు

గొంతు కోస్తే/పాట ఆగిపోదు/
అది—ముక్తకంఠం/
గొలుసు వేస్తే/పోరు నిలిచిపోదు/
అది–ప్రజాయుద్ధం అని రాయగల్గిన కవి.

చిన్న కవితలతో ఎంత ముద్ర వేశాడో పెద్ద కవితలు కూడా అంతే బాగా రాశాడు. నేలమీద పురుగులతో సమానమైన,జనాభాలో సగం అయిన స్త్రీల గురించి కవికి చాలా గౌరవం. చాలా కవితల్లో వారి గురించి రాశాడు. “వేశ్య”కవిత తెలియని కవి ఉండడంటే అతిశయోక్తి కాదు.

తను శవమై/ఒకరికి వశమై
తనువు పుండై—ఒకడికి పండై
ఎప్పుడూ ఏడారై—ఎందరికో ఒయాసిసై

వేశ్య దుర్భర జీవితాన్ని,హింసను చిన్న కవితలతో చెప్పిన పద్ధతి మనకు కన్నీళ్లు తెప్పించక మానదు.
“ఆమె యవ్వనం రాయని వీలునామా” కవితలో
ఆమెది ఉరి బిగించుకున్న జీవితం అంటాడు. అంటే విలవిల్లాడటం. మూగబోయిన గొంతైనా పాడక తప్పదంటూ రోజుకో పదిమంది కీచకులకి స్వాగతం పలకటంగా అభివర్ణించిన తీరులో ఒక మనోవేదన కూడా
కనిపిస్తుంది.
సినిమాలో ఒక అమ్మాయిని నల్గురు కలిసి బలవంతంగా అత్యాచారం చేసే సీన్ ని కొందరు ఆవురావురు మంటూ చూస్తారని చురక వేస్తాడు “రేప్ సీను”కవితలో.

“పెళ్లి చూపులు” కవితలో కన్యపిల్ల పెళ్లి చేయడానికి గంగిరెద్దులా అలంకరించి అంతమందిలో బెరుకుగా భయంతో లేడి పిల్లలా బెదురుగా కూర్చునే విషయాన్ని చెప్పాడు.

జల్సాల కోసం కష్టం లేకుండా అన్ని అవసరాలు తీర్చుకోడానికి కట్నం పేరుతో స్త్రీలను హింసించే అంధకారాన్ని తొలగించడానికి ఒక ప్రయత్నం మొదలవుతుందని స్త్రీ చైతన్యాన్ని వ్యక్తపరుస్తాడు.”పోరాటం” కవిత లో.

నాగరిక ప్రపంచం అంటూ అనాగరికంగా స్త్రీల పట్ల ప్రవర్తిస్తున్న లోకంలో సోయితో ఉండాలని చెప్తాడు. సినిమాలోనే కాకుండా వాణిజ్య ప్రకటనలలో కూడా స్త్రీలను అసభ్యంగా చూపించే తీరును ఎండగట్టాడు. చీర,పైట,ప్రేమలు ఈ మూడింటితో జాగ్రత్తగా ఉండాలని “ఎవరమ్మా నువ్వు” అనే కవితలో సూచించాడు.అంతే కాకుండా రాతి హృదయంలో ఇమడని కన్నీటి పువ్వులా జాతి గుండెల్లో రగిలే శోక దీపంలా ఎవరమ్మా నువ్వు అని ప్రశ్నించాడు.

విషాదం మూర్తీభవించిన జీవితం స్త్రీది. అభాగిని, మానభంగం శీర్షిక కింద,ర్యాగింగ్ పేరుతో, అక్షరాన్ని వివస్త్రను చేసే అశ్లీల సాహిత్యం, మోడల్ పేరుతో విష సంస్కృతి, అందాల పోటీ ప్రలోభం, కట్నం పేరుతో హింస నగ్నంగా స్త్రీలను ఊరేగించినంశం, బ్లూఫిల్మ్ లో కామకేళి చిత్రాలు, ఇలా అనేక రకాలుగా స్త్రీలకు ఏడుపులే ఉన్నాయి. ఆధునాతనంగా ఎదగాలని గొప్పలకు పోయే ఈ నాగరిక ప్రపంచంలో అశ్రు బిందువు నుంచి స్త్రీకి విముక్తి లేదంటాడు కవి. బాధను వ్యక్తపరిచి ఊరుకోడు. కన్నీరు సముద్రంగా మార్చి,సముద్రమంత ఆవేశంతో ఉద్యమాలు చేస్తే గాని దోపిడీ దౌర్జన్యాలతో కూడిన భూభాగాన్ని ముంచెత్తలేవని ప్రోత్సహిస్తాడు. స్త్రీల బాధ్యతను గుర్తుచేస్తాడు. “విషాదం సాక్షాత్కారం” కవితలో.

అత్యాచారం చేసి లేదా పెళ్లి చేసుకుంటానని అమ్మాయిని శారీరకంగా వాడుకొని మొహం చాటేస్తారు. ఇలాంటి వాటిని కొన్నిచోట్ల పెద్దమనుషుల్లో పెట్టి పంచాయతీ అని చేసి కొంత డబ్బులు ఇచ్చే ప్రయత్నం చేస్తారు.ఇలాంటి వాటిని ఖండిస్తూ శీలం విలువను కొలువడానికి, కుమిలి పోడానికి కవి హృదయం లేదంటాడు. స్త్రీకి జరిగిన అన్యాయం గురించి ఆలోచించకుండా, జరగడానికి ఏర్పడిన పరిస్థితులు గమనించకుండా, డబ్బుతో ముడిపెట్టి చూడటం బాధపెట్టే అంశం.”వీరుడితో కరచాలం”అనే కవితలో ప్రస్తావించబడింది.
అందుకే “అశ్రుకావ్యం” కవితలో
ఆమె నెత్తుటి గాయాల సంపుటి/
రగిలే బాధల కుంపటి అని నిర్ధారించాడు.
అంతేగాక కర్కశ పాదాల్ని మోస్తూ/
కఠోర తపస్సులా— శకలాలుగా మిగిలిన రాత్రుళ్ళపై శవాసనం వేసే విషాద భరిత చిత్రంలా
ఆమె అగ్ని సముద్రం మీదే అందాల పడవ అంటాడు.
ప్రసవం స్త్రీకి పునర్జన్మ అంటారు.ఆ సమయంలో నొప్పుల బాధ తట్టుకోలేకపోతుంది.స్త్రీ ప్రసవ వేదనను గావుకేక,చావుకేకగా నిర్ధారించాడు.

స్త్రీని సూటిగా శరీర సౌందర్యాన్ని బయర్గతం చేసే ఉల్లి పొర లాంటి చీరనా?వెండితెరనా?ప్రశ్న తలెత్తటం కన్పిస్తుంది. నాగరిక ప్రపంచంలో స్పృహకు వచ్చి కోల్పోయిన కాలంలో ఏది ప్రేమ రాసలీల ప్రకటనల కాన్వాసుగా మారిందనేది కూడా కవి ప్రశ్న.
ముక్కు మొహం తెలియని వ్యక్తి పెళ్లి చేసుకోడానికి రావటం, కట్నం డిమాండ్ చెయ్యడం. అలాంటి ఆగంతకున్ని సునిశితంగా పరిశీలించాలనే ధోరణి కనిపిస్తుంది. మార్కెట్ లో వస్తువును తీసుకున్నప్పుడు రేటు కట్టడం లాంటిది.ఖరీదు కట్టి తెచ్చుకున్న వస్తువు మనింటికే వస్తుంది. ఉపయోగించుకుంటాం.కానీ ఇక్కడ రివర్స్ గా కొనసాగుతుంది. అమ్మాయే డబ్బులిచ్చి అబ్బాయి ఇంటికి వెళ్ళి వెట్టిచాకిరి చేస్తుంది. స్త్రీలు వేశ్యా గృహాల్లో బంధించబడుతున్నారు.వెండి తెర అనే విషపు కోరల్లో చిక్కుకుంటున్నారు.అనేక రకాలుగా వెలివేయబడుతున్నారు. మీరెవరంటూ అబలలా? అందాల రాశులా? చిలుకలా? సీతాకోకచిలుకలా? ఏదో తేల్చుకొమ్మనట్టుగా ఉంటుంది ఈ కవిత. స్త్రీల మానభంగంకు పురాణాలు, ప్రబంధాలు వేదికలే. పురుషహంకారం ఉన్నచోటల్లా ఆడది క్షణికమైన కోరికగా మారిందనే ప్రస్తావన కనిపిస్తుంది. పగలూ, రాత్రి విలపించేది కూడా ఎవరు? ఇంకెవరూ—ఆడది మెహందీలా వాడది అనటంలోనే స్త్రీల జీవితాలను అర్థం చేసుకున్న వైనం, సామాజిక పరిశీలన అర్థం అవుతుంది.

జీవితాంతం సంసారంలో శక్తి హీనురాలే మొ’గుడి’ ముందు చేతులెత్తి నమస్కరిస్తూ భక్తురాలుగా బ్రతుకీడుస్తుందంటాడు. స్త్రీలు శక్తివంతులుగా మారాలనేది కవి అభిప్రాయం. ఒక్క స్త్రీపై సమూహపు అత్యాచారాలను పిచ్చివాళ్ళ సామూహిక విధ్వంసకాండగా చెపుతూ నీచమైన ప్రపంచం అంటాడు. అందుకే మహిళా కళాశాలలో గానీ, హాస్టల్ గదుల్లో గానీ తాత్కాలికంగానైనా కత్తులు మెరవాలంటాడు. స్త్రీలు తమను తాము రక్షించుకోవాలనే సందేశం ఇందులో కనిపిస్తుంది.

నీతి లేకుండా పోయింది. ప్రేమ లేదు. శరీరాన్ని కాంక్షిస్తున్నారు. ఆత్మసౌందర్యం వదిలి, ఆభరణాలను ఒలుచుకుంటున్నారు. ఇంద్రధనుస్సులా కలలు కన్న స్త్రీల జీవితాలు, కళ్యాణమంటపాల మంటల్లోనే బూడిదవుతున్నాయి. ఇంత దుర్మార్గం కూడా సర్వసాధారణంగా మారిందంటాడు అలిశెట్టి.

అమ్మపాల అమ్మక దేశ ద్రోహం, మానభంగాలు, లైంగిక దోపిడీ, వరకట్నపు చావులు,అత్యాచారాల మధ్య నలిగిపోయి అవశేషాలుగా మిగులుతున్న స్త్రీజాతి అవశేషాలే మళ్ళీ మగ సంతానం కోసం ఉవ్విళ్లూరుతున్నారని అంటాడు. కానీ ఆ మగ సంతానం కోసం కుటుంబాల్లో స్త్రీలపై ఎంత ఒత్తిడి, హింస ఉంటుందో ? తెలియని విషయం కాదు. వంశం కోసం కొడుకే ఉద్దరిస్తాడని పున్నామ నరకం తప్పిస్తాడని మూఢమైన ఆలోచనల వల్ల కూడా స్త్రీలు పుత్ర సంతానం కోసం ఆరాటపడ్డారని చెప్పక తప్పదు.

కవి సహచరి భాగ్యలక్ష్మిని ఉద్దేశించి ఆమెకు ప్రసిద్ధి గాంచిన బెర్నార్డ్ షా,షేక్స్పియర్, చలం,గురజాడ తెలియదు.అడుగంటిన కిరసనాయిలుతో స్టవ్ మీద అన్నం వండటం, గాజు కుప్పెల్లాంటి అతని కళ్ళల్లోనే ఆశల అగరొత్తులు వెలిగించుకుంది. ఎప్పుడూ ఐశ్వర్యం, బంగారం కోరలేదు.ఉన్నదాంతోనే సర్దుకుపోయి, ప్రభాకర్ ని అర్థం చేసుకొని సాధారణమైన జీవితం గడిపినామెను గొప్పగా ఆవిష్కరించాడు. ఉద్యమమే జీవితంగా, నిజం వైపు నిలబడడమే ధేయంగా కొనఊపిరి దాకా జీవించిన కవి అలిశెట్టి ప్రభాకర్. అతని వ్యక్తిగత జీవితం కూడా సాహిత్యాభిమానులందరి ముందు తెరిచిన పుస్తకమే.

పాపయ్యపేట, మండలం చెన్నారావుపేట, వరంగల్ జిల్లా. కవయిత్రి, విమర్శకురాలు, అధ్యాపకురాలు. ఎం.ఏ., పి. హెచ్.డి, ఎం.ఏ, సంస్కృతం చదివారు. కాకతీయ విశ్వవిద్యాలయం నుంచి 'తెలుగు సాహిత్య విమర్శ : స్త్రీల కృషి' (2012)పై పరిశోధన చేశారు. రచనలు: 'తెలుగు సాహిత్యంలో స్త్రీవాద విమర్శకులు' (వ్యాస సంపుటి)-2015, 'వ్యాస శోభిత' (వ్యాస సంపుటి) - 2015, 'తెలుగు సాహిత్య విమర్శ : స్త్రీల కృషి' - 2018. కాకతీయ విశ్వవిద్యాలయం పీజీ మహిళా కళాశాల, వరంగల్ లో అధ్యాపకురాలిగా పనిచేస్తున్నారు.

One thought on “మహిళలపై ఆధిపత్య హింసను ఎత్తిచూపిన అలిశెట్టి

Leave a Reply