ఇప్పుడిదే సరైన సమయం
నిన్నూ నన్నూ మతాలుగా విడగొట్టే
దేవుడు లాక్డౌన్ లో వున్నాడు
మతం గట్లులేని సువిశాల మైదానమొకటి
మనకోసం ఎదురుచూస్తోంది
రా… దమ్ముచేసి
మనిషిని విత్తుదాం!
ఆ గ్రంథాలన్నీ పట్టుకురా
ఆ చెట్టు కింద కూర్చుద్దాం
మనం పాయలు పాయలుగా
విడిపోవడానికి కారణమైన విషయాలన్నీ
కుప్పగాపోసి తగలెట్టేద్దాం
నీకూ నాకూ
ఆ మూడోవాడికీ
కామన్ గా మిగిలిన వాక్యాలేవో
అండర్లైన్ చేసుకుందాం
మనుషులుగా బ్రతకనిచ్చే వాక్యాలు
మనుషులుగా ఎదగనిచ్చే వాక్యాలు
మనుషులుగానే చావనిచ్చే వాక్యాలు
వాటినే పాటలుగా రాసుకుందాం
పండగలన్నీ రద్దుచేద్దాం
ఆనందతీరాన అందరం కలవడమే పండుగ
బతుకు బాటలో ఎదురుపడ్డప్పుడు
పెదవులు మీద నవ్వుపూలు పూసిన రోజే
సంబరం అని చాటింపేద్దాం
కొత్త కొత్త పండుగల్ని కనిపెడదాం
శాస్త్రం పండుగ
సత్యం పండుగ
శాంతి పండుగ
మనిషి పండుగ!
ఇదే అనువైన కాలం
వాళ్ళు మళ్లీ దేవుణ్ణి మేల్కొలిపి
మన మీదకు ఉసిగొల్పే లోపే
అతడితో మా ఒప్పందకాలం ముగిసిందని
బహిరంగంగా ప్రకటిద్దాం
కరోనా కనుమరుగయ్యేలోగా
మహా ప్రకటన వెలువడాలి!