మళ్ళీ మనిషి కోసం…

అవును
ఇప్పుడు, ఇక్కడ
మనుషులు చంపబడతారు
చంపేస్తుంటారు
మనిషి మాయం కావడం, మామూలే
దేవుడు
బాగా బతికే ఉంటాడు
బతికిస్తుంటారు

మనుషులు
చెట్లెందుకు కావట్లేదు
నీడలు పరిచే
మనసెందుకు కలగట్లేదు
ఎందుకో
మనో పరీవాహక ప్రాంతం
అశుభ్రంగా ఉంది
మనుషులు
నదులెందుకు కావట్లేదు

చీకటి
పరచుకున్న రాజ్యం
సరిహద్దులు లేని వాంఛలు
ఏకవర్ణపు కుట్ర
మనిషెందుకు
పక్షి కావట్లేదు
రెక్కల నీడ కింద
చోటెందుకివ్వట్లేదు

ఓ కట్టడం కోసం
కొట్లాట కొనసాగుతూనే ఉంది
మంచు లోయలో స్వేచ్ఛ
బొట్లు బొట్లుగా కరుగుతూనే ఉంది.
అడవిపై
హత్యా ప్రయత్నం
ముమ్మరంగా సాగుతూనే ఉంది.
ఐనా
మనిషెందుకు
అడవి కావట్లేదు
పొదలు పొదలుగా అల్లుకోవట్లేదు

ప్రేమించు, ప్రేమించు
తీరాన్ని సముద్రం ప్రేమించినట్టు
రాతిలో నీటి తడి తగిలినట్టు
నువ్వో ఆకాశమని గుర్తించు
సముద్రమని గుర్తించు
సమస్తమూ నీదే, సర్వమూ నువ్వే

గాయపడు, గాయపడు
గాయం నుండి
ఓ కొత్త ప్రపంచం
మొలకెత్తక పోదు
అప్పుడు భూమి కొత్తగా
ఆకాశం కొత్తగా
మనుషుల చుట్టూ ప్రేమ తెమ్మెర
అప్పుడు
దేవుడు మరణిస్తాడు
మనిషితనం గాలొకటి
చల్లగా వీస్తుంది
దయ, కరుణ, సహనం, ప్రేమ
నాలుగు దిక్కులుగా నిలుస్తాయి
మనిషి
బ్రతుకుతాడు.

పుట్టింది నెల్లూరు జిల్లా, ఓజిలి, రాచపాలెం. కాకినాడలోని పిఠాపురం రాజా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలుగు శాఖాధిపతి. 'నీటిపూలవాన', 'గోరువంకల గానం' అనే రెండు పిల్లల కవితా సంకలనాలు వేశారు. ఎక్సరే, తానా, రంజని, కుందుర్తి వంటి పురస్కారాలు పొంది ఉన్నారు. రాధేయ కవితా పురస్కార నిర్వాహకులలో ఒకరు.

15 thoughts on “మళ్ళీ మనిషి కోసం…

  1. మనిషి బ్రతుకుతాడు ఆరోజుకోసం ఎదురుచుద్దాం …..సుపర్ సర్.👌💐

  2. దేవుడు మరణిస్తాడు
    మనిషితనం గాలోకటి చల్లగా వీస్తోంది

    @నాలుగు దిక్కులు…👌👌👌 మాస్టారు

  3. గోపాల్ మనిషి ప్రకృతి కావాలన్న ని కవిత
    ప్రకృతి అంత స్వచ్ఛమైన భావాన్ని అందిస్తుంది

  4. మనిషి ఒక నది చెట్టు అడవి ఎప్పటికీ కాలేదు మనిషిలోని స్వార్థం అలా మారడాన్ని అడ్డుకుంటుంది

  5. మనిషి- ప్రకృతి రెండూ ప్రస్తుత కాలంలో మార్పు కోసం ఎదురు చూస్తున్న తరుణంలో మంచి కవిత ను అందించారు.మీకు ధన్యవాదాలు

  6. మనం మీరు ఊహించే కొత్త ప్రపంచం కోసం ఎదురు చూద్దాం.. ప్రయత్నిద్దాం.. దేవుని మరణం కోసం ఎదురు చూద్దాం..

  7. గాయం నుండి కొత్తప్రపంచం మొలకెత్తకపోదు….మిత్రమా బాగుంది

  8. కవిత బాగుంది గోపాల్
    మనిషి ఎదిగే క్రమానికి సున్నితమైన మందలింపు.

  9. ఓ కట్టడం కోసం
    కొట్లాట కొనసాగుతూనే ఉంది
    మంచు లోయలో స్వేచ్ఛ
    బొట్లు బొట్లుగా కరుగుతూనే ఉంది.
    …..ఈ నాలుగు వాక్యాలు కవితకు ప్రాణం పోశాయ్ అనడంలో అతిశయోక్తి లేదు సర్..wonderful poem సర్..హృదయ పూర్వక అభినందనలు
    ……ఆది ఆంధ్ర తిప్పేస్వామి

  10. సుపర్ గురువు గారు🙏🏻🙏🏻👍🏻👌🏻👌🏻👌🏻

  11. కవిత చాలా బాగుంది అభినందనలు మిత్రమా

Leave a Reply