మళ్ళీ జననం… మళ్ళీ మరణం…

పడమటి ఉరికంబం పై వేలాడిన వెలుతురు
నీవు నిద్రలేవక ముందే
తూర్పు కొండలపై కూనిరాగం తీస్తుంది
గతం గుర్తులు గగనానికే వదిలేసి
తన గమ్యాన్ని వెతుక్కుంటూ
వెలుతురులు విరజిమ్ముతూ
వేగంగా వడివడిగా రానే వచ్చింది
రాత్రికి మళ్ళీ పోతుంది
మరణం… జననం
మళ్ళీ మరణం… మళ్ళీ జననం
నీవే జననం నీవే మరణం
నీ నగ్నత్వం ఎర్రగా పరుచుకున్న
పుడమి నుదుట సింధూరం
వేకువ వెలుతురు
వెండి మబ్బుల నాట్యం
కదులుతున్న ఆకాశం
కమ్మని కూని రాగం
బంగారు అంచు చీర
సింగారాలు పోతున్న నీరు
పడమటి ఉరికంబం
పక్కనే ఉంది..
అయినా చెదరని చిరు నవ్వు
ఎక్కడిది ధైర్యం
ఎక్కడిది త్యాగం
రగులుతూ, కరుగుతూ
పరుగులు తీస్తూ
పడమటి ఉరికంబం వైపు
మళ్ళీ జననం… మళ్ళీ మరణం…

ఖమ్మం జిల్లా. కవి, జర్నలిస్టు. చిన్నతనం నుంచి గిరిజన గ్రామాల్లో పెరిగారు. కాలేజీ రోజుల్లో భారత విద్యార్థి సమాఖ్య(ఎస్ ఎఫ్ ఐ)లో పనిచేశారు. తెలుగు యూనివర్సిటీలో ఎంసీజే చదివారు. జర్నలిజంలోకి వచ్చిన కొద్దిరోజుల్లోనే టీవీ 9 స్థాపించిన టీమ్ లో ముఖ్యులైన  అరుణ్ సాగర్ తో కలిసి పనిచేశారు. ప్రస్తుతం టీవీ 9 లో పని చేస్తూ తీరిక సమయాల్లో కవిత్వం రాస్తున్నారు.

Leave a Reply