“మల్లక్క” కథ

అక్కంటే… అక్కనే. తోడబుట్టిన దానికంటే ఎక్కువనే!

ఒక తల్లికి పుట్టకపోయిన, ఒక కంచంల దినకపోయిన, ఒక నీడక మెదలకపోయిన, నేను ఆమెకు చిన్న తమ్మున్ని… ఆమె నాకు పెద్దక్కనే. అక్క గురించి మాట్లాడితే పొద్దూకదు, తెల్లారదు. కట్టంలో నట్టంలో, బాధలో, దుక్కంలో అన్నింట్లో అక్క ముందుగుంటది. ముందు నడుస్తదీ. భీరన్నకు అక్క ‘మంకాళి’ ఎట్లనో..? నాకు మల్లక్క గట్లా.. ఎల్లమ్మ తల్లి మల్లన్నకు ఎట్లా ఎరుక చెప్పి చేదోడు వాదోడుగుందో? నాకు మల్లక్క గట్లనే వుంటది.

కులగజ్జి దడిగట్టుకొని ఊరేగుతున్న సమాజం. నిలబడ్డ తావులో నీళ్ళు చల్లుకునే నీచ సంస్కృతిలో మునిగి తేలుతున్న మనుసులు. అంటరానితనం అవమానకరమైన చోట, అంబేడ్కర్ గారి తెల్వికి మెచ్చకొన్న “సాహు మహరాజు” ఎంత గొప్ప మానవతమూర్తో, చరిత్ర మనకు కండ్లకు చూపింది. నా దృష్టిలో మల్లక్క అంత గొప్పదే. ఆమె మహారాణి కాకపోవచ్చు. ఆమె డబ్బుకు మామూలు మనిషే! మనుషులను గౌరవించే గొప్ప మనస్సున్న మహారాణి. మనుస్సులను మనుషులుగా గుర్తించే ఇల్వ తెల్సింది. అచ్చరం ముక్కలు రాకున్న, అంతకుమించిన లోకజ్ఞానముంది. బతుకును అంచనా వేసే ముందుచూపుంది. మనుషుల్లోని మంచి చెడులను ఇట్టే పసిగడుతుంది. కష్టాలను ఎదుర్కొనే కొండంత గుండెబలం ఆమెకుంది. ఆమె ఎన్నింటినో చూసింది. బతుకంటే ఆమెకు తెల్సినంత ఇంకెవలకు తెల్వదు. ఆ బతుక్కు గుండా నడిసివచ్చింది. అక్కకు కులం పట్టింపు లేదు. గుణం మీదనే నమ్మకం. డబ్బులున్న గర్వపాయసితం లేదు.

ఆమె సాదాసీదాతనం. ముక్కుసూటిగా మాట్లాడే తత్త్వం, ఎన్నో సుగుణాలున్నాయి. మాటకు ఇల్వనిచ్చె మనిషి మల్లక్క. మాటంటే తప్పదు. మనం మాట మీద నిలబడ్డమో…?!

“తలగోసి పీఠ ఏస్తది” అంతటి మనిషి. నేను కొలువు జేత్తున్నా ఆమె (ముందు) కంటికి పసిపోరన్నే. కన్నతల్లి జన్మనిస్తే, నాకు మల్లక్క బతుకునిచ్చింది. నా జీవితానికి ఓ దారిజూపిన దేవత. నిజంగానే దేవతలాగే వుంటది. ఆమె బొమ్మల నడుమ రూపాయి బిల్లంత కుంకుమ బొట్టు దానికింద వూబూది దుండ బొట్టు. ఇంతింత కనుగుడ్లు చూస్తే అందరికి పానం జల్లుమంటది. అక్క గుళ్లో ఎల్లమ్మనే తలపిస్తంది. అక్కంటే మా ఇంట్లో అందరికి ఎనలేని (మమకారం) పావురం. ఎక్కడలేని గౌరవ మర్యాదలున్నయి.

ఓ రోజు మల్లక్క ఇంటికి వచ్చింది. నేను కుర్సిలో కూకున్నోన్ని, దిగ్గున లేసి అక్కకు కుర్సి ఇచ్చి, కిందికి దిగి కూసున్న. మాట ముచ్చట ఐనది. మావోలు (నాభార్య) ఇంట్లో నుండి బయటికచ్చి, అక్క బాగున్నవా? అని మందలిచ్చింది. బాగున్న అంది. కొంతసేపు ఆ ముచ్చట, ఈ ముచ్చట మాట్లాడి, మంచి చెడ్డలు అరుసుకొని యింటికి పోయిందక్క. ఇదంతా ఎప్పటినుడో సూత్తున్న మా పిల్లలు “డాడీ ఎవ్వరామె? ఎందుకచ్చింది? నువ్వెందుకు కుర్చి దిగినవు? ఇప్పటికి రెండుమూడు సార్లు చూసినం. ఆమె వస్తే ఎందుకు భయపడ్తావ్? ఇంట్లో అందరు నీకు భయపడ్తరు నువ్వేంది గిట్లా?” అన్నారు.

ఎన్నో అడుగుతుండ్రు. ఆమె నాకు పెద్దక్క మీకు అత్తమ్మ ఐతదన్నాను. ఏ తాత బిడ్డా…? ఎక్కడుంటది? ఎన్నడు మన ఇండ్లళ్ళ కనవడలేదు. ఎప్పుడోసారి వస్తది” అన్నారు.

నేను ఉక్కిరి బిక్కిరవుతున్న ఎట్లా చెప్పాలి, ఏమని చెప్పాలి (నా జీవితం) నా బతుకు గురించి ఏం తెలుసు వాళ్ళకు. ఎన్ని కట్టనట్టాలు ఓర్చుకొని ఇక్కడదాక వచ్చినా, నేను ఏనాడు గిది ముచ్చటని ఎవ్వలకు చెప్పలే. ఆ పరిచితి నాకు రాలేదు. పిల్లలకే కాదు. ఓ… సారి ఇరువై ఏండ్ల కిందికి తిరిగి చూసుకుంటే? ఎన్నో ప్రశ్నలు ఉదయించక మానవు. ఒక్కసారిగా! నాకు నేను ఆలోచనలో పడ్డ, మనుస్సు మనుసుల లేదు. గుండె దడదడ మంటుంది. నిజంగా.. ఎవరీ మల్లక్కా? నాకు ఆమెకు ఏ సంవందం? ఓ రక్తసంబంధం కాదు? ఒక తల్లి పిల్లలం కాదు? తోడబుట్టి కూడా పెరిగినోళ్ళం అసలే కాదు? పోనీ…?! ఒక కులపోలమంటే? అసలే కాదు. అయ్యా తరుపో, అవ్వ తరుపో బంధువు కాదు. ఈ ప్రశ్నలకు ఇప్పటికి నాదగ్గర సమాధానం లేదు. ఒకటి మాత్రం గట్టిగ చెప్పగలను. నేను ఏమవుతానంటే? ఆమెకు నేను చిన్నతమ్మున్నే అనగలను. ఆమె మా పెద్దక్క అని ఊరంత తెలుసు.

“నకర గొమ్ముల మల్లవ్వంటే? సాలు ఊరంత పేరెల్లింది. పదిచ్చుడు పుచ్చుకొనుడు ఎవ్వారం అందరికి తెలుసు. ఏదైన ఆమె కనుసైగలోనే జరుగుతుంది. గట్లాంటి ఆమె గుణగణాలు రాయాలంటే పొద్దంత చెప్పిన ఒడువని కథనే. నా బతుకును తవ్వినాకొద్దీ, ఆమె సహాయం కనవద్దదిగానీ నా ఎదుగుదల గాదు. కట్టంలో బాధలో, బతుకులో నన్ను ఆదుకొన్న కన్నతల్లి. ఎండలో పోయేటోన్ని నీడకు దీసిన మమతల ఒడి. ఏమిలేని నేను నలుగురిలో తలెత్తుకొని నడుస్తున్నానంటే? నాలుగు మాటలు మాట్లాడున్నానంటే? ఆమె పెట్టిన బిచ్చమే. ఇవ్వాల్ల నేను నాలుగు మెత్కులు తింటున్నానంటే? పోంటీను బట్టి రాతున్నంటే? ఆ తల్లీ చల్లని చూపు. గట్లాంటి గా తల్లి ఈ యింటికి ఇలవేల్పు నేను మూడోది ఎల్లి నాల్గోది పడుతున్నా..

ఎండకాలం ఎండలు దంచుతున్నయి… మాడలు పలిగిపోతున్నయి.. రోణి ఎండల రోళ్ళ పగిలేల కొడ్తయ్” అంటారు. రోణిల “కులపోళ్ళు” సాతలు మర్లుతుండ్రు.

సాతంటే? వ్యవసాయదారునికి తాడు తల్లులిచ్చి రాతం పనికిపోవాలి. చెప్పులకు ఉంగుటం ముకువారులు పెట్టాలి. తొండం ముడువాలే, ఇట్లా అరొక్క పచేయాలి. పనికి కావల్సిన ఇసిరెలు జేసియ్యాలే… ఎవుసాయ దారుడు సాతజేసినందుకు, కారుకింత బిచ్చం వెళ్తాడు, కల్లం జెపత్తడు. ఎవుసంల ఎన్నో పనులుంటయో గన్నీ పనుల్టేయాలే. కోతకు మోతకుపోవాలే. గివ్వన్ని పనులు ఎవుసం జేసేటోళ్ళతో సమంగా మాదుగులు చేయాలి. మన్నులో మన్ను గావాలే. కులపోళ్ళు మంచి సాతలు రావాలే నాలుగిత్తులు దొరకలేనని అనుకుంటారు. ఆస్వామి కోపగొండోడయితే గంతే సంగతులు.

సాతలు మర్లడంతో మాకు పెంటమీది రాయమల్లుది (పేరుమోసిన గౌడ్ ఆస్వామి) (నకరగొమ్ముల మల్లవ్వ) మల్లక్క సాత వచ్చింది. మల్లక్క సాతంటే ఇంట్లో అందరికి భయమేసింది. ఇంట్లో మోగయిన లేడు. జెరకటువుగా మాట్లాడుతది. ఆడమనిషితో ఎట్లా మాట్లాడాలో కట్టమే అనుకుండ్రు. అందులో మా అయ్యకు ఎక్కువగా నడువరాదు. కట్టెవట్టుకొని (ఇటు అటు తిరుగుతడు) అవతలికి ఇవుతలికి పోవుడు మందమే. ఎడమ చెయ్యి సరిగ పన్డేయదు. ఇంట్లో ఎదిగినోళ్ళు ఎవ్వరు లేదు.

అన్నలిద్దరు దేశాలు తిరుగుడే. సాత చేయడమంటే కట్టమే. సాత చేయకుంటే పొట్టకు నడువదు. నాలుగు గింజలు కనవడాలంటే సాత చెయ్యక తప్పదు. గీ సాత ఇందాక మా నడిపి పెద్దయ్య సాత జేసిండు. గిప్పుడు మావంతుకు వచ్చింది. ఏదో అంతకు కాలాడిచ్చుడు కాదు. సాతజేసుడు చెమట మింగి చెమట కక్కలే.

అయ్య వాళ్ళు పట్టిచ్చిండు. కరిపడలేదని తాళ్ళు ఇచ్చుక పోతున్నయని అక్క కొడుకు, నడిపాయన తాళ్ళు దెచ్చి కోపంగా ఇసిరేసిండు. నీకు చేతగాకుంటే సాతజెయ్యకు ఎవ్వలన్న జేస్తరన్నడు. మా నడిపి పెద్దయ్య దగ్గర తాళ్ళు తీసుకపోయిండు. సంగతీ తెల్సి అయ్య అవ్వ పెద్దయ్యతోని లొల్లి జేసిండ్రు. నువ్వెట్రైస్తవు తాళ్ళు. ఇస్తే నేనే ఇయ్యాలే.. లేదంటే మంచిగుండదని చెప్పిండ్రు. పెద్దయ్య గూడ నువ్వె జేసుకో నాకెందుకని తలబిరుసుగా అన్నడు.

మా సొంత అక్క(ఎల్లవ్వ) ఇంట్లో… నెల పదిహేనురోజుల బాలింత. అవ్వ పొద్దుగాల్నే, తాళ్ళు గంపలేసుకొని, నన్ను అక్కను తీసుకొని, మల్లక్క ఇంటికి పోయింది. అవ్వ అరుగుమీద తాళ్ళేసింది.

మల్లవ్వ… ఓ .. మల్లవ్వ అని పిల్సింది. ఇంట్లో వంట జేస్తున్నా ఎందే?… అంటూ కోపంగా గల్మలకు అచ్చింది.
ముసలోనికి చేతగాదు.. నువ్వేం జేస్తవు పో! నీ తాళ్ళు వద్దు కరివడవ్ అట్టిగానే తెగిపోతున్నయట… అంటూ కసిరినంత పనిజేసింది. నేను మొదటిసారిగా.. (అక్కను) గప్పుడే చూసిన మల్లక్కను.

అటు చూసేసరికి మా అక్క (సొంత) ఎల్లవ్వ కనవడ్డది.

“అగ్గి మీద గుగ్గిళమైన గామే” అక్కను చూసేసరికి ఏమనుకుందో ఏమోగానీ! చల్లబడి పోయింది. అక్కను అన్నమాటలు నాకిప్పటికి గుర్తున్నాయి.

ఏందే గింత పొద్దుగాల నువ్వెందుకు వచ్చినవే? ఆ.. ముసలంజ కొడుకు తాళ్ళిచ్చి నిన్ను దోలిండా.. అంది.

కాదక్క నేనే వచ్చిన, నీవు సాత వద్దంటున్నావనీ…. అయ్యకు సాతగాదంటున్నవటా? నాకు తాళ్ళు పేనపదక్క కమ్మగొయ్యస్తది. నేను తాళ్ళు పేనిస్తానక్క అంది. మా అక్క ఎల్లవ్వ. కాస్త ఆలోచన పడ్డామే … నువ్వెన్ని రోజులుంటవే? ఇక్కడా…! అత్తగారింటికి పోవా? అంది. పోతక్క! ఆరేడునెల్లు ఇక్కడనే ఉంటా. నీకేం బాధ లేదు నేను తాళ్ళిస్తన్నది అక్క.

మల్లక్క కొద్దిగంత సల్లవడ్డది. కోపం సాంతమయ్యింది. నువ్వుపోతే? ఎవలిసరే అన్నది. అప్పటివరకు తమ్ముడు నేర్సుకుంటడు. నేను నేర్పుతాను.

మల్లక్క పూర్తిగ సల్లవడ్డది. అక్క నేను పోతున్న అని అక్క అరుగుమీది కేలి లేసింది.

ఇంతలో… మల్లక్క, ఆగవే!? అట్టిదానివన్న గాదు. పసిపిల్లతల్లివి తొట్టతొలిసారిగ ఇంటికి వచ్చినవు. ఉత్త చేతుల ఎట్లవోతవు జేరాగంది. మా అక్కకు పసుపు కుంకుమ పెట్టి ఐదుసాల్ల బియ్యం ఒడిలో బోసింది. రేపు.. ఇంటికి రాయే చిన్నవ్వా ! మూడు బుడ్ల వడ్లిస్తనన్నది.

భయం భయంగా ఇంటికి పోయిన మాకు. ఇది కొండంత ఊరటనే. ఓదార్పు మాటనే మనుస్సుకు సంబరం కల్గించేదే. పక్కలకేలి లేసిపోయిన మేం మెల్లగా ఇల్లు జేరుకున్నం. అయ్య ఎదిరి సూత్తండు. ఏమంటుదోనని ఆతుర్తగా… ఏమయ్యింది బిడ్డా! అని అక్కను మందలిచ్చిండు. అక్క ఏంకాలేదు. తాళ్ళు తీసుకుంది. బియ్యమిచ్చిందని చెప్నిం. గప్పటినుండి ఏర్పడిన అనుబంధం ఇప్పటివరకు కొనసాగుతనే వుంది. గా ఇల్లే నాకు ఇల్లెంది. గామే తల్లైంది. నేను మెల్లమెల్లగా మా అక్క ఎల్లవ్వతోటి కుల ఇర్తిపనుల్టేసుడు ఒక్కొక్కటి నేర్చుకున్నా. కమ్మగోసుడు, వొత్తెసుడు, నారజీరుడు, పురుడు, నల్లుజీరుడు, నడిగట్టుడు, మల్క లేసుడు, మల్లేసుడు, కలేసుడు. ఇట్లా అరొక్క పన్డేసుడు సురువైంది.

అయ్యా తాడు పురి పెట్టిస్తే, నేను అల్లేటోన్ని, ముడులేసేటోన్ని. నేను గోసిన పిల్లకమ్మను మా పెద్దమనిషి మెచ్చుకునేటోడు. కమ్మగోయ్యడంలో నాకు తిరిగేలేదు. గిట్ల సాలు గడిసింది. ఒక్కరోజు కూడా మీ తాళ్ళు తల్లులు మంచిగా లేవని మర్లగొట్టలేదు. ఏడాదికి “మల్లక్క”నే మనసులోని మాట చెప్పింది. నడిపి చిన్నయ్యనే అన్నడే. మా తమ్మునికి చేతగాదు, చెయ్యి పచేయదు. నీకెట్లా తాడు తల్లు ఇస్తడని. అసలు సంగతీ కుండబద్దలు గొట్టింది. నేనెందుకంటనే ఎవ్వలు తాళ్ళిచ్చిన ఏముందే చిన్నవ్వ, మంచిగుంటే సరిపాయే అంది.

మల్లక్క చెప్పిన ముచ్చటను అవ్వ అయ్యతో పొద్దూకి తినేటప్పుడు జెప్పింది. అయ్య ఏమనలేదు. ఎవ్వల పాపాన వాళ్ళు బోతరు. లొల్లెందుకు మనకన్నడు. “చాటు మాటలు చెప్పినోల్ళు చాటుకే బోతరు” ఇటు పొడిసేటోడు అటు గూకెటోడు సూతే సరిపాయే” అన్నాడు అయ్య! ఇంతలో అక్క (ఎల్లవ్వ) బొంబాయి పోయింది. నేను హాస్టల్ పోయిన, సాతకు లోటు రాకుండా చూస్తున్నాం. కాలం గడుస్తుంది.

అయ్యా! మల్లక్క గురించి చాలా విషయాలు చెప్పిండు. గప్పటిసంది తెల్సింది మల్లక్క అంటే? ఏందో… ఏమిటి?

మల్లక్క ఇంటి పేరు ఎన్గుల, భర్త పేరు ఎల్లయ్య. మల్లక్క భర్తకు అందరు ఎడ్డయ్య అనేటోళ్ళటా…! ఇంటి ఎవ్వారం ఈమెనే చూసుకునేది. ఆయన (భర్త) పిల్లలు చిన్నగున్నప్పుడే కాలం జేసిండట. మల్లక్కకు ముగ్గురు కొడుకులు. ఇద్దరు ఆడవిల్లలు. మొత్తం ఐదుగురు పిల్లలు పెద్ద కుటుంబమే. ఆ రోజుల్లో (బతుకు) ఒక్కపూట గడవడమే కష్టమంట.

పిల్లలను సాదుకొను నడుముకు కొంగు కట్టుకొని ఎదురైనోళ్ళకు కూలికి నాలికి పోయేదట. పనిరాకసి లెక్క జేసేదట. బతకడానికి నాల్గు మెత్కులు కావలంటే? కులం తక్కువా, ఎక్కువని గిరిగీసుకుని కూసోలేదామే. ఎక్కువ కులమైన తక్కువ కులమైన ఎవ్వరికైన పన్డేసదట. కాకులు గద్దలు గొట్టకుండా పిల్లలను కాపాడుకొని సాదుకుందని అయ్య చెప్పిండు. ఆమె కష్టమిటుంటే కండ్లల్ల నీళ్ళు (తిరుగతయి) తిరిగినయి. ఆమెకు కన్నమ్మ కట్టమే. సీతమ్మ సెరనే. జీవితంల అరిగోసవడ్డది. ఆకలికి ఆవుగోలిచ్చింది. ఆ కాలం ఆమెకు పరీచ్చ పెట్టింది. కాలానికి ఎదురీది నిలబడ్డది. అయ్యా ఆమె బతుకు చిత్రంను పూసగుచ్చినట్టు చెప్పిండు. సనిపోయే ముందర. ఇప్పుడామె కొడుకులు పెదాలైనరు. నాలుగు పైసలు సంపాదిస్తుండ్రు. నాలుగేళ్ళు నోట్లక పోతున్నయి. జెర మంచిగున్నరు. మా అయ్య గురించి కూడా ఆమెకు అంత తెలుసు.

అయ్య మంచిగ బతికినోడే. జీవితం ఎప్పుడు ఒకలెక్క ఉండదు కదా! ఈ విషయం అక్కవాళ్ళ ఆడబిడ్డలకు ఇంకా బాగ తెలుసు అయ్యంటేందో? మంచి మర్యాద అప్పడంతగా తెల్వదు. అయ్య చెల్లిపోయిన తరువాతనే తెలిసంది. నాకు జీవితమంటే? ఏమిటో మెల్లగా అర్థం కావడం మొదలైంది. ఇంట్లో మనుషుల గురించి, వాళ్ళ మాటల గురించి, బోధ పడుతుంది. కానీ! అయ్య చెప్పిన గుణగణాలన్ని నేను అక్కలో జూసినా…

అయ్యా! సావకముందు సాతజేస్తున్నప్పుడు నేను ఆరు సద్వుతున్నప్పుడు అప్పుడప్పుడు ఇంటకి పనిమీద వచ్చిపోయేదక్క. ఒకరోజు మల్లక్కకు బగ్గ జ్వరం వచ్చింది. చచ్చిపోయేది బతికింది. ఈ సంగతి ఇంట్లో ఎవ్వరికి తెల్వదు. అక్కనే జెప్పింది. వాళ్ళ పెద్దకొడుకు కొంరయ్య ఎడ్లబండి కట్టుకొని దవాఖానకు తీసుక పోతుండు. మా అన్న దొరగారి బాయిల తానం జేసివస్తండు. బండికి ఎదురుంగ పోయి ఏమయ్యిందని అడిగిండు. అవ్వకు బగ్గ జ్వరం వచ్చింది. చేతుల పైసల్లేవు అబ్బయ్య డాక్టర్ దగ్గరికి పోతున్నా, యాబై రూపాయలే ఉన్నాయని కంటనీరు తీసిండు. కొద్దిగాగు నేనిప్పుడే వస్తానని, అన్న ఇంటికి ఉరికి వచ్చిండు. అన్న బొంబాయి నుండి మూడు కావచ్చు రెండు వందల రూపాయలు తీసుకెళ్ళి చేతుల వెట్టిండు. అవ్వి పట్టుకొని బోయి చూపెట్టిండు. జరం తగ్గింది. మేము ఎవ్వలం పైసలు అడగలేదు. ఆమె ఇచ్చిన్నాడే తీసుకున్నం. మా అయ్య అనేటోడు “నీతి తప్పదు, మాట జారదు” “అరచేతిలో కూరబెడితే ఆర్నేల్ల గురత్యాముండాలే” “నియత్తు నీళ్ళలేసిన చెడదు” నాకీ (సంగతి) ముచ్చట్లు ఇప్పుడిప్పుడే అయ్యపోయినంక ‘బోధ’ పడుతున్నవి. నిజంగా మల్లక్క అక్షరాల అట్లజేసి చూపినట్లు నాకిప్పుడన్పిస్తుంది.

కులానికి మేము మాదిగోళ్ళమైన, ఆమె కూర్మంఐన తమ్ముళ్ళులేని ఆమె మేము తమ్ముళ్ళమైనం. మా అయ్య చిన్నయ్య, మా అవ్వ చిన్నవ్వ, మా అక్క(ఎల్లవ్వ) చెల్లె అయిపోయింది. తోడబుట్టినోళ్ళుగా, కూడ పెరిగినోళ్ళుగ మమ్ముల్ని మల్లక్క చూసుడు మొదలైనది. అయ్య సచ్చిపోయిండు. దగ్గరోళ్ళు ఎందరున్న సావు చేయటానికి దూరంగనే వున్నరు. అయ్యకంటే ముందురోజే మా చిన్నయ్య (మారెండో చిన్నవ్వ భర్త) సనిపోయిండు. నేను సావుకు పోయివచ్చిన. నాకు గింత తెల్విలేదు. ఇది పదిసద్వంగ జరిగింది.

వానలు ఎల్లినయి. సలి మొదలైనది. పందిట్ల పీనుగును ఏసినం. చింతకింద నలుగురు ఐదుగురున్నరు. ఏమి వాడు (నన్ను ఉద్దేశించి) పసిపోరడు ఏంజేస్తడు. ఎదిగినోళ్లు ఒక్కడు ఇంటిపట్టున లేరయ్యే సావు జేసుడంటా? కథలు, కార్యం ఎట్లా జరుగాలే. అన్ని మల్లగుల్లాలు పడుతుండ్రు. అయ్యవాళ్ల మేన బామ్మర్దులు. తట్ట, గడ్డపార, పార దీసుకుండ్రీ, పొరడున్నడు కట్టేయిస్తాం. బొందదీసి సందం జేస్తం. ఎవ్వన్ని కొడుకులు ఎవ్వని బిడ్డలు. సచ్చిననాడు లేనోళ్లు. ఆకటి అందనోళ్ళు అంటుండ్రు. నాకు ఏమి దోస్తలేదు. సంగతీ మల్లక్క కు తెల్సింది (దభదభ) దబదబ ఇంటికి వచ్చింది. అరే! మల్లయ్య సావు మంచిగ చెయ్యాలే (నడి పెద్దయ్య కొడుకు) ముసలోడు బహుగ బతికినోడు. నువ్వు ఎనుక ముందాడకు నేను పైసలిస్తా! తమ్మునితో రాయించు లెక్కా. నాకు తండ్రి అసొంటోడు అని, (400-00) నాలుగువందల రూపాయలు బొడైకెల్లి దీసి ఇచ్చింది. సందమయ్యేదాకుంది. వాడు చిన్నోడ వానికేం దెల్వదు దినాలు దాక జెర మంచిగ జూసుకో అంది.

సందమయినంక ఎక్కడోలు అక్కడ పోయిండ్రు. ఇంట్లో అవ్వ నేను. కనీసం పిడిసే దీపమంటే కూడా “కుండల్లో మెత్కులు లేని బతుకు” అగ్గిపెట్టినోడు బయటికి తిరగద్దు. ఎట్లనో గట్ల ఉపిడో ఉపాసమో పదిరోజులు గడిసిన. ఎప్పుడు రానోళ్ళు వస్తండ్రు, పోతండ్రు. “నీతో పాటు నేనట్లుగా – అయ్యతో పాటు అయ్యేసిన నీడ పోయింది. ఇప్పుడు నాకు నిల్వనీడ లేదు. ఇంటి ముందు చింతచెట్టు, కూలిన గోడలే ఆస్తులు పాస్తులు. రెక్కలే చుట్టాలు. నా బాధలు వినడానికి గోడలను చెవులు వచ్చినయేమో? చెట్టె గొడుగు అయ్యింది.

అసలుకథ గిప్పుడే మొదలైనదని నాకేందెల్సు. ఇంట్లో బాగోతానికి తెర దీసిండ్రని. ఏషాలేస్తుండ్రని, ఎక్కడోల్లు అక్కడ మెల్లమెల్లగ జారుకుండ్రు. చేతులు దుల్పుకుండ్రు. బాధ్యతలు మరిసిండ్రు. మాటల పోరు బెట్టిండు. (కొన్ని మాటలను ఇక్కడ తీయలేకున్నాను). ఎవ్వల మందం వాళ్లు సర్దుకున్నారు. తొవ్వ జూసుకున్నరు. నా జీవితమే దారంలేని (గాలిపటం) పతంగైంది. కనీసం మర్యాదగ మాట్లాడినోళ్లు లేరు. చుట్టు అందరున్నట్టే ఉంటంది. అయినా అనాథ బతుకే. ఒకరిపైన ఆధాపడని బతుకే. ఇంట్లో ఎన్నో సూటిపోటి మాటలు ఏంజేస్తండు. తినుడు తిరుగుడు. ఓ! ఈయన గాంక సద్వుతుండు. సద్వు… కొల్వు ఎలగబెడ్డులే? తూటాలు పేల్చినట్లు మాటలు పేల్చుడే. ఇగ ఓతల్లి అంటది. పైస ఇల్వేం దెల్సత్తది. బొంబాయికి పోయి తటమోస్తే తెలుస్తది. బొటనేళ్ల రగుతం సుక్కబొట్లకు సుక్కబొట్లది బొటనేళ్లకు వస్తే తెలుస్తది” సుక్కసుక్క చెమట దీస్తన్నాం అంటుంది. మాటలకేముంది ఎన్నై మాట్లాడయంటది. నన్ను పనికిమాలినోన్ని, పనొంగన్ని జేసిండ్రు. నాకు కూడే దండగ అన్నట్లు ప్రచారం జరుగుతుంది. కొందరు ఇరుగు పొరుగోళ్ళు మొకంమీద గుద్దినట్లే జెఫ్రండ్రు. మొత్తంగా నన్నో ఇలనుగా చిత్రీకరించి సమాజంలో నిలబెట్టిండ్రు. మాట ఇంటలేడు. మోరబాగుంది. ఎం దింటడో తిననియ్యి, ఇగ బగ్గ తింటడు అనుడు, వీడు చిన్నోడు కనీసలో కజ్ఞానం కూడా లేదనే మతిగూడ లేదు వాళ్ళకు. కరుణజాలి, దయ గింతకూడ లేదు. కనీసం మొక్క జూసినోళ్ళంటే ఒట్టు. అవ్వ ఓదార్పు మాటలు దప్ప ఏంజేస్తది.

నాకంటే ముందుబుట్టి సంపాదించటం నేర్చుకున్నోళ్లు, నాపై వాళ్ల ప్రతాపం జూపుతుండ్రు. కారాలు మీరాలు నూరుతుండ్రు. ఇంక దిగజారి వాళ్ళకే బరువు బాధ్యత తెల్సినట్లుగా గప్పాలు గొడుతుండ్రు. రాజ్యాలు దిరిగి మాటలు నేర్పిండ్రు. నలుగురిలో ఒకరీతిగా, ఇంట్లో ఒకరీతిగా నడుస్తుండు. చేతులు చేస్తండు. అందరందరే తోడు దొంగలు. ఒగలమీద ఒగలు నిందలేసుకొనుడు. సాది సవరించినట్లు పోజులు గొట్టుడు. కనీసం! ఉండడానికి కూడా నీడ ఎయ్యలేదు. అయ్యకు సనిపొయ్యే ముందుకు ఇపుకు జానడే అంగిలేదు. కడుపునిండ తిండిలేదు. కంటినిండ నిద్దుర లేదు. కనీసం కర్మ చెయ్యటానికి ఎవ్వరు ఇంటి వద్దలేరు. గిట్లాంటివాళ్లు నన్ను మాట్లాడుతుండ్రే..! అన్పించింది. నేను జేసిన తప్పేందో చెప్పినోడు లేడు. నాకేం అర్థం కాలేదు. నన్ను దోషిగ నిలబెట్టి ఎవ్వల జాగల వాళ్ళు దేశాలు దిరగబోయిండ్రు.

నేను ఎంజెయ్యాలే! ఎట్లా బతుకాలే! భూమిలేదు ఎద్దులేదు ఎవుసం లేదు. చేస్తే కూలి చెయ్యాలే! లేదంటే ఉపాసముండాలే? బతుకంత నాకిప్పుడు శివరాత్రి అమాసనే. ఎన్కటికి అయ్య మంచిగ బతికినోడని అందరు జెప్తరు. నాకెం పనికస్తది. ఇప్పుడు గా అయ్య వదిలిన కమ్మ కత్తే నా జీవనాధారం. రెండోది సద్వుకోవాలే. వీళ్ల మొకం మీద గొట్టినట్లు సద్వుకొవాలే. గట్ల గట్టిగ నిర్ణయించుకున్న. కానీ! పైసలు గావాలే! ఎవరిస్తరు? ఎట్లా తీర్చాలే! ఇవ్వన్ని మదిల మెదలుతున్నయి. ఏదైయితే గదైయితే. సచ్చిదొక్కటి పుట్టిందొక్కటి. అప్పుచేసి సద్వుకోవాలే.. గట్టిగ అనుకున్న! అవ్వను పైసలు అప్పు తెమ్మని ఏడ్సిన, బాధపెట్టిన. ఏడిచిన నా దగ్గరేమున్నయ్, నాకెవలిస్తరు. ఎవ్వరు నామీదున్నరు, నా మాట ఇంటరు. నువ్వు సద్వుకోకు పట్నం బో, చిన్నవ్వ కొడుకులున్నరు పని నేర్చుకో…? పైసలు కూడబెట్టుకో వాళ్ళ మొకం మీద కొట్టినట్లు బతుకు. నా సావేదో నేను సత్తా అంటది అవ్వ! లేదు లేదు ఆల్లకు ఎట్లా.. పైసలు బాకీ తెచ్చి ఇచ్చినవో! నాకు గట్లనే ఇయ్యిమన్నాను.

వాళ్లు దేశం పోతే … ఇచ్చిండు. నీకెట్లా ఇస్తరు? ఏమని జెప్పాలే అన్నది.

సద్వుకుంటనని జెప్పు అన్న. నేను తిండి తినుడు మానేసిన, ఒకరోజు రెండు… ఐదులు అన్నం దినలేదు. మంచినీళ్ళే నాకు అన్నమైనయి. అవ్వ మల్లక్కకు పనికి పోతుంది. నాకు మొండితనం మొదలైనది, పైసలు గావలని జిద్దు జేసినా, నేను గెలుస్తనో, ఓడుతనో తెల్వదు. కొల్వు వస్తదో రాదో తెల్వదు. గీళ్ల మొకం మీద కొట్టినట్టుండాలే అనుకున్నా. ఎంతైన తండ్రి మీద ఉన్న “జులం” పిల్లలకు పరాయోళ్ళ మీదుంటదా? అందున్న అన్నలు పాలికులం లెక్క వీల్లను అడుగుడు దండుగ. వీళ్ళు మంది మాటలు పట్టుకొని ఎగిరెటోళ్లు. నా గురించి తెల్వదు. నేను జెప్పిన ఇనేటోళ్లు గాదు.

“చెడగొట్టడానికి -బాటపేడుసాలు” నా గురించి ఎన్నోరకాలు చెప్పిండ్రు. స్వార్థం నిలువున వాళ్ళను ముంచెత్తినయి. (అక్క ఉన్నది, ఒక ఇంటికి పోయినది ఆమెనేమంటం) ఈ ముచ్చట్లే అవ్వతోని చెప్పిన. మల్లక్కను పైసలు అడిగి ఇవ్వమన్న.

ఐదురోజులకు అవ్వ బాధను జూసో, నా బాధను వినో మలక్కబాయి నుండి సరసర ఇంటికి వచ్చింది. ఏమైందిరా? ఎందుకు తింటలేవు? అవ్వనెందుకు గోస పెడున్నవంది.

అట్టిగనే తినలేదు. అట్టిగెందుకు… అట్టిగే! అవ్వ నాకు ఇంట్లోని ముచ్చటంత చెప్పింది. నాకంత తెలుసు! లే… అన్నం తినుమన్నది. ఎందుకు తింటలేవో చెప్పుమంది. నేను మెల్లగా సద్వుకుంటా! నాకు పనిరాదు. సద్వుకోవడమే తెలుసు. పదిగేను దాక సద్వుకుంటా… పైసలు గావాలే? ఎన్ని పైసలు గావాలే? పద్దెనిమిది వందలు. ఎట్లా తీర్చతావు? నాకు సర్కారు పైసలిస్తది, అవ్వి దెచ్చి నీకిస్తా. నిజంగానేనా? నిజమే… నాతోడక్క ఇగో! ఇప్పుడు బువ్వతిను నేను పొద్దుగాల పైసలు దెచ్చి ఇస్తా… పికర్ జెయ్యకు. ఎవ్వరు సద్వించకున్నమాయే? నేను సద్విస్త. గీదానికి బువ్వదినకుంటుర్రా! బుద్ధిలేదు నీకంది. సరే! అక్క తింటనని లేసిన, గట్ల ఐదు రోజులు బువ్వలేని నా కడుపుకు నాలుగు మెత్కులు కడుపులోకి జారినయి.

తెల్లారి అన్నమాట ప్రకారం పన్నెండు వందలు దెచ్చి ఇచ్చింది. ఎన్ని రోజులు జేసుకుంటవంది. మల్లి ఆమెనే ఆర్నెల్లు జేసుకో… నెలకు రెండువందల లెక్క(చొప్పున) అప్పటిదాక పైసలు దొరకవంది. సరేనని! తల ఊపిన. గట్ల అక్కగానీ అక్క నాకు పైసలిచ్చి పై సదువులకు పంపింది. సద్వించింది. ఏ బంధంలేని ఆమె నా బతుక్కు భరోసానిచ్చింది. ఏమిలేకున్న నాపైన, నా మాటపైన నమ్మకముంచింది. ఆమె మాటను నిలబెట్టుకోవాలె. అక్కపేరు నిలబెట్టాలనే గట్టి (పట్టు) అనుకొన్న. అక్కకు ఇచ్చిన మాట తప్పకుండా నాకు వచ్చిన “మెస్ చార్జీ” పైసలు తెచ్చి మిత్తితో సహా కట్టిన. గట్ల అక్కకు నేను నమ్మిన బంటువైపోయిన. నేను ఏదడిగిన లేదనకుండా ఇచ్చింది. నా కడుపును ఇసరిచ్చి తల్లిలా కూడు బెట్టింది. తాగడానికి నీళ్ళు ఇచ్చింది. ఆ ఇంట్లో నేను ఒక మనిషినై పోయినానుకోండీ. ఈ రోజింత నీడ వుందంటే అంత ఆ తల్లి చల్లనిచూపే. ఆమె దీవెనలే, నాదేముంది నేనో నిమిత్తమాత్రున్ని ఒక రకంగ కర్త, కర్మ, క్రియా అంతా తానే.

నా డిగ్రీ అయిపోయింది (పెళ్ళి సంబందాలస్తున్నాయని ఇల్లు కట్టించినది) నాకు టీచర్ ట్రైనింగ్ వచ్చింది. పైసలు కావాలే? అక్కను అడుగుదామా! ఏమంటదోనని భయమేసింది. సద్వుకున్నమంచిదే అనుకున్న. కొడుకులు ఏరువడ్డరు. అక్క దగ్గర పైసలు ఎక్కడుంటయి. నాలోనేను మల్లగుల్లాలు పడుతున్నా. ఎన్కతొక్కలు తొక్కినా, అక్కకు ఎవ్వరో జెప్పిండ్రు. నా గురించి తెల్సినోళ్ళు. అందర్ని తెలుసుకుంది. బాగ సద్వుకున్నోలను. (మధ్యాహ్నం) పగటీలి మూడుగంటలకు సటసట వచ్చింది. తమ్మి తమ్మంటు పిల్చింది. నీకేమో అచ్చిందంట్రా? ఏమయిందిరా? నౌకరి వచ్చిందా? సంబురంగా అడిగింది. నౌకరి కాదు గనీ! ట్రైనింగ్ చెయ్యాలే. ఇది జేస్తనే కొలువస్తదన్నాను. అందుకే చెప్పలేదు పైసల్లేవు. ఇప్పటికి ఇచ్చేది ఉందని నసిగాను. నిన్ను పైసలు అడిగినార్రా…? నేను సచ్చిపోలేదు రా!? అక్కను బతికే ఉన్నాను ఇంటికిరా అంది.

ఉండుండు మల్లవస్తానని అట్లపోయి ఇట్ల వచ్చింది. వొల్లెకేళి ఐదువేలు తీసి ఇచ్చింది. బట్టలేసుకొని పో… సీటు ఎందుకు పొడగొట్టుకుంటవంది! నాకు కండ్లపొన్న నీళ్ళు కారుతున్నయి. నోటమాట రాలేదు. పైసలిస్తూ దూరం పోతున్నవు. మంచిగుండు. తినే కాడ తాగే కాడ జెర సూచి తినాలే. దినాలు మంచిగలేవు. దునియ మంచిగలేదు. మనుషులందరు మంచోళ్ళు గారు. ఎవల్ని భగ్గనమ్మరాదు. చూసుకుంటు తిరుగాలే, నీ పనేందో నువ్వె జూసుకోవాలె. మందిజోలికి పోవద్దని బుద్ధిమాటలు చెప్పింది. నాకు అవ్వగూడ ఎన్నడు గన్ని మాటలు చెప్పలేదు. అయ్య తర్వాత ఇంతగా మనసు ఇప్పి చెప్పింది మల్లక్కనే. అక్క నీ మాట జవదాటను సక్కంగ సద్వుకొని (వస్తనన్నాను) అత్త. చివరగా గుర్తుపెట్టుకో నేను సద్వించిన పేరు రావాలే! నువ్వు నలుగురిలో తెల్లగా బతుకాలే. నేనే సరేనన్నట్లుగా మెడలూపిన.

ట్రైనింగ్ పూరి జేసుకున్న, పెళ్ళిల పెళ్ళి చూపులు జరుగుతున్నయి. పిల్లోళ్ళకు ఆస్తులు పాస్తులున్నయి. వాళ్ళ ఎవ్వారం జోర్దారుగుంది. నా సద్వు ఇల్వ వాళ్లకు తెల్వదు. ఏముందని పిల్లనిస్తం అన్నరు. పిల్లను ఇయ్యమంటే నీ పిల్లెలేదు దునియాలో…. మస్తుమంది వున్నారా… కో అంటే కోటిమందిని దెస్తరా..! మామ. మా తమ్మునికంటే, మంచి మొగున్ని దెస్తవ నీ బిడ్డకు అని!

పిల్లనిచ్చెటోనితో కొట్లాడింది. కట్నం తక్కువిస్తుండు. నా మాట ఇంటలేవని, నువ్వెట్లన్న పెళ్ళి జేసుకోరా… అని అలిగిపోయిందక్క “భీరన్న కామరథి” కోసం ఎంత కష్టపడ్డాడో అక్క మంకాళి ఎట్లా కోపగించుకుందో గట్లనే అయ్యింది నా కథ.

అక్క అలిగిపోతే ఆమె పెద్దకోడలు (పెద్దల్లుడు కొమురయ్యను) ఆమె భర్తను పిల్చి, వాడు బుద్దెరిగినసంది మనింటికే వచ్చిండు పోయిండు. మన వాకిళే తొక్కిండు. మనం పెండ్లి ఆగం జేస్తమా! ఏంది? మీ అవ్వ అలిగి పోయింది. లే. గా ఎరుకలోనింటికి పోయి మేకపోతును మాట్లాడి రాపో అన్నది. నా పెండ్లికి యాటను మాట్లాడించిండ్రు. గిట్ల నన్ను కుటుంబపోన్ని జేసి మందిల కల్పిండ్రు.

అక్క నిస్వార్ధమైన త్యాగం ఫలితంగనేమో నాకింత నౌకరి వచ్చింది. నా బతుకులో జరిగిన ప్రతిదానికి అక్క తల్సినకాడ మొలకై మొలిసింది. ఎన్నుదన్నుగ నిల్సింది. మండుటెండల వున్న నా మాడుకు మల్లెల గొడుగు వట్టింది. నాకు పిల్లలు పుడితే పురుల్ల-పుణ్యాలకు, కథల కార్యాలకు అత్తగారికి చెయ్యి సాపకుంట – అన్ని తానై జూస్తుంది. (జూసింది) కొలువురీత్యా దూరం పోవల్సి వచ్చింది. అక్కను కలుసుడు తక్కువైనది. ఆమెకు బుద్ధి పుట్టినపుడు వచ్చి చూసిపొయ్యేది. జీతం ఎంతని అడిగేది. మంచిగ బతుకుమని, పిల్లజెల్లతో సల్లగా ఉండాలని జీవిస్తది. నేను అప్పుడప్పుడు ప్రేమపూర్వకంగా కలుదాగువని ఐదువందలు చేతుల బెట్టేటోన్ని అక్క సంతోషంగా తీసుకునేది. మా అనుబంధం చూసిన ఓర్వలేని కొందరు చిచ్చులు పెట్టి “అక్క”ను ఇంటికి రాకుండా జేయాలనుకున్నరు. కానీ! కుట్రలు (ఫలించలేదు) సాగలేదు.

అక్కకు నామీద ఏదేదో ఒకటికి రెండు ఎక్కించి చెప్పిండ్రు. నేను లేని రోజున ఓసారి యింటికి వచ్చి ఎట్లవడితే అట్ల తిట్టింది. నా పైసలు నాకియ్యమను ఇయ్యబుద్ది గాకుంటే వాకిట్లో ఇసిరిగొట్టుమను, చేతి కియ్యకుంటె కిందేయ్య మని గిట్ల ఎన్నడు కోపానికి రాని, అక్కకు కోపం కట్టలు తెంచుకవచ్చింది. ఇట్లా…!! అన్నదో లేదో అదేరోజు మా చిన్నదానికి దెబ్బతగ్గింది. నాలుగైదు రోజులకు ఇంటికచ్చింది. నేను కూర్చోమన్నాను. మెల్లగా మాట్లాడుతున్నా. నీవు ఇంటికి వచ్చినవని మరుదలు చెప్పింది.

నీవు మొన్న ఎందుకట్ల మాట్లాడినవో నాకు అర్థం కాలేదు. పని వొత్తిడిలో నేను ఇంటికి రాలేకపోతున్న. పైసలు కిండ పడేయ్యమన్నవట. గిది మంచిగా లేదు. అక్క గీ మాటలు నీ వొంట పుట్టినయి కావు. ఎవ్వరో చెప్పితే అన్న ముచ్చట్లే! నువ్వంటే నాకు తలుగుతది. నువ్వు కంట నీరు తియ్యదు. నీ పైసలు పువ్వులో పెట్టిస్తను. ఇప్పుడే పైసలు నీకిస్త, పైసలిస్తే నువ్వింటికి రావు కదా! గందుకే పైసలియ్యలేదు. పైసల కోసమన్న ఇంటికి వస్తవని. నిన్ను చూసినట్లు ఉంటదనే చిన్న స్వార్థం నాది. అంతేగాని మరేం లేదు. నాకు తెల్వక అడుగుతున్నా అక్కా…! ఏమి లేనప్పుడు దగ్గరికి దీసి నా(మాటల) మీద నమ్మకముంచి సద్వించి పెద్దజేసినవు. అప్పుడు (నేను) తమ్ముడు ఇచ్చేటోడు అయిండు కదా! అన్ని ఉన్న ఇయ్యాల నేను నీకు పైసలియ్యనోన్ని అయ్యిన్నా…!

అక్క ఆలోచనల పడ్డది…. నేను ఇంక మాట్లాడుతూనే వున్నా, అక్కకు కండ్ల వెంట నీళ్ళు వస్తున్నయి. ఏమోరా నోరు పాడుగాను గారోజు గట్ల వచ్చింది. నిన్ను తిట్టినరా! నన్నే అనుకుంటి? ఎవ్వలతో అన్నరా! ఇంటికాడనే కదా! అయినా నిన్ను అనే హక్కు లేదురా నాకు! అవే పిల్ల, నేను అన్న ముచ్చట్లు ఆనికి చెప్పాల్నా ఏందే? మంచిగనే ఉంది సింగారం. నేను ఎమంటలేనక్క.! నీకు గాకుంటే నన్ను అనే హక్కు ఎవ్వలకుంది చెప్పన్న. మొన్న నువ్వచ్చి పోయినంకనే చిన్నదానికి దెబ్బ తలిగింది. గందుకే గిట్లన్న. అయ్యో నానోరు పాడుగాను ఎక్కడ తలిగిందిరా అంటు కుడితిలవడ్డ ఎలుక లెక్క గిలగిల కొట్టుకుంది. దవాఖాండ్ల చూపెట్టినవా! ఆ…హా… చూపెట్టిన, మంచిగనే ఉంది. ఏం పర్వాలేదు. సరే నీ బుద్ధి నీకు ఎప్పుడు పైసలియ్య బుద్దయితే గపుడే ఇయ్యి. కుర్చిలో కెల్లి లేసింది. ఆదివారం ఇంటికిరా..! పైసలిస్తా అన్నాను. మనం పెన్నువట్టి లెక్క జేసింది ఎంత ఉంటదో, గామె నోటికి జేసుకుంది గంతే వుంటది. అసలు మిత్తి ఇరువై ఒక వెయ్యి అయింది. అక్క ఎంతియిమంటవు. నాకెందుకురా… ఎక్కువ పైసలు ఏంజేసుకుంట నీ దగ్గర తీసుకొని, నువ్వేమన్న పరాయోనివా? పదిహేడు వెయ్యిలియ్యి అన్నది. నేను అక్క చేతిలో పదిలంగా పైసలు పెట్టిన. అక్క సంబరంగా పైసలు దీసుకొని, ఇగోరా.. నీ జేబులో పైసలున్నయ్యో! లేవో… ఈ ఐదువందలు తీసుకొమ్మని నాకిచ్చింది. పదిలం, మంచిగా బతుకాలే.

పిల్లలు జెల్లలు నువ్వు సల్ల గుండాలే? ఏ ఆపతి వచ్చిన నా చెవుల ఎయ్యాలే. నేనున్నాని నువు మరిసిపో(వద్దు) కంది. మురుసుకుంటు ఇంటితొవ్వ బట్టింది. సరే! గానీ అక్క నన్ను గింతగనం పైసల గోసవెట్టినవు కదా! ఎవ్వలకిస్తవు పైసలు అన్నాను. మంచోళ్ళకే ఇస్తను. నాకు తెల్వదురా. నీకు జెప్పన్న నేనని మనసులోని మాట చెప్పింది. అక్కకు నేనంటే గంతగురి, నమ్మకం, ప్రేమ, అభిమానం.

నేను సట్టి సంకురాత్రి మధ్య పట్నాలు వేసుకుంటున్నా.. అక్కకు చెప్పి వచ్చిన. ఆమె పొద్దున్నే తానం జేసి వచ్చింది. నేను మావోళ్ళు కలిసి అక్కకు నీళ్ళించ్చి కూర్సేసి కూర్చోబెట్టినం. మా ఆవిడ పసుపు కుంకుమ పెట్టి కంకణం కట్టింది. అన్ని పనులు (చెపుతుంది) సూచిస్తుంది. తెల్వని ముచ్చట్లు తెలియజెప్పుతుంది. ఒగ్గుగాయనతో మాట్లాడుతుంది. దాని పానం, దాని పానం మంచిగుంటలేదు. పట్నం జెర మంచిగా గట్టు(అచ్చయ్య) చిన్నయ్య అంటుంది. పొద్దుగాల నుండి సాయంత్రం మొక్కులు చెల్లించేదాక వున్నది. అదే రాత్రి కొడుకు పండగ జేసుకుంటుండు. ఆ ముచ్చటే మరిసిపోయిందక్క. నేను చీరదెచ్చిన “ఓడిబియ్యం పోసినా” అక్క ఇంటికి పోయినది. నేను మెల్లగా అక్కవాళ్ళ ఇంటికి (కుర్మవాడకు) పోయిన, నన్ను ఎవ్వలు గమనించలేదు. ఎవ్వల పనుల్లో వాళ్ళున్నరు. అక్కకు, అక్కవాళ్ళ చెల్లెకు జరిగిన ముచ్చట్లేని నేను కిన్నునైన. నోటమాట రాలే? వారి మాటల్లోనే సంభాషణ. ఏందక్క ఎటువోయినవే? ఇక్కడ పోరడు పొద్దుగాలసంది కట్టవడుతండు. నీవేమో గా మాదిగోళ్ళ ఇంటికిపోయి జెండేసినవు. నీకు గీళ్ళ కంటె గాళ్ళే ఎక్కువయిండ్రా అన్నది.

ఎంటనే మల్లక్క ఏందే ఏమయ్యిందిప్పుడు మంచిగనే ఉంది కదా…? మాదిగోడు అంటవేందే? ఆడు మాదిగోడు గాదు. ఆ ఇల్లు (నాకు) మాదిగోళ్ళ ఇల్లు గాదు.

మన అవ్వగారి ఇల్లే, వాడు నాకు తమ్ముడే, మనోళ్ళ కంటే ఎక్కువనే, తోడబుట్టినసొంటోడు. మల్లనేవు గామాట మాదిగోడు గీదిగోడని. మంచిగ జెప్తున్న.

ఇంగో…! ఇటుచూడు, ఏ కొడుకు తెచ్చిండు. ఇంత పెద్దపండుగ జేసుకుంటుండ్రు. పసుపేసిన బట్ట తేలేదు. మనోళ్ళుగానీ, కొడుకులు గానీ. అదే నువ్వన్నా “మాదిగోడు” తెచ్చిండే!? మూడువేల చీర నేను ఏమైతనని, ఇంకోసారి నువ్వు మాట్లాడకున్నా మాయే అన్నది. అవ్వ తప్పయిందే! బుద్ది తక్కువయ్యి మాట్లాడిన అన్నది. అక్కవాళ్ళ చెల్లె…! గీ మాటలిన్న నాకు మతి పోయింది. అవును గదా! అక్కకు నేనంటే ఎంత నమ్మకం. నేను ఏమిచ్చి ఋణం తీర్చుకోను.

ఆమె చేసిన త్యాగం ముందు నా చిరు కానుకెంత? ఒక్కింట్లో పుట్టి పెరిగినోళ్ళు కుక్కలోలే కీసులాడే మనుసులున్న రోజుల్లో….! ఏ స్వార్థం లేకుండా నన్ను సద్వించి పెద్దోణ్ణి జేసి ఇంతవాన్ని జేసిన అక్కను ఎట్ల మరిసిపోను. ఏమిచ్చిన ఋణం తీరుతుంది. ఆమె మానవత్వానికి మరోరూపం. నీతి నిజాయితీల కల(యిక) బోత. జన్మనిచ్చిన అయ్య అవ్వెంతనో నాకు నా తోబుట్టువుల కంటే ఆ మల్లక్కనే ఎక్కువ. ఆమె లేకుంటే ఈ మందిల తలెత్తుకొని నడిసేటోన్నా…? నేను ఏమైపోయేటోన్నో? ఇప్పటికి ఊహకు అందని ప్రశ్న. ఆ తల్లి పదికాలాల పాటు మంచిగుండాలని కోరుకోవడం తప్ప నేను చేసేదేమి లేదు. ఈ రెండు ముచ్చట్లు నా జీవన ప్రయాణంలో జరిగిన యదార్ధ సంఘటనలో పాత్ర ఐన “అక్క”ను దృశ్యమానంగా చిత్రీకరించడం దప్ప ఇంకేమి చెయ్యగలను. అవును, ఇప్పటికీ నాకు తీరని శంక వుంది. ఆమె ఎవరు? నేను ఎవరు? ఆమె కులమేది, నా కులమేంది? అనుకుంటే ఎన్నో ప్రశ్నలు పుడ్తూనే వున్నయి. ఏమీ సద్వుకోని ఒక కుర్మ కులానికి చెందిన గామే కులం గోడలు బద్దలు కొట్టింది. “నన్ను చేరదీసింది” ఇప్పటి మాటల్లో చెప్పాలంటే నిజమైన సంఘ సంస్కర్త (ఏ స్వార్ధంలేని నిస్వార్థం మనిషి) ఏ కుటిల్లం లేని కుల్లంకుల్లం మనిషి.

ఆమె గుణమెంత సక్కన్నో… మనసెంత మెత్తన్న… గిన్ని ముచ్చట్ల నన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నా… నేను గట్టిగ అనుకున్నా… అక్క అన్నట్లుగా నేను ఆమెకు తోడబుట్టిన తమ్మున్నే… ఎప్పటికి అక్కకు తమ్మునిగా పుట్టాలె.

ప్రభుత్వ ఉపాధ్యాయులు. గ్రామం - దాచారం, మం. బెజ్జంకి, జిల్లా - సిద్దిపేట( కొత్తది) కరీంనగర్ (పాతది)

6 thoughts on ““మల్లక్క” కథ

  1. చదువు తోడుంటే దుఃఖము పొంగుకొచ్చింది. గొప్ప కథ. మానవతా విలువలు ఆవిష్కరించారు. ఓదన్న కు అచ్చు వేసిన కొలిమి సంపాదకులకు కృతజ్ఞతలు.

  2. ఓదయ్య సార్…. మీ మనసులెక్కనే మీ కథ ఉన్నది…. మల్లక్క మీద మీకున్న గౌరవం, ఆమెకు మీమీద ఉన్న నెనరు గొప్పది…. కులాన్ని దాటి వచ్చి మనిషిగా ఆమె చూపిన మానవత్వం గొప్పది….

  3. మల్లక్కది గొప్ప మనసు.మీరు ఆమెను ఆదరించిన తీరు గొప్పగా ఉంది

  4. మిత్రమా అక్షర దోషాలు ఎక్కువున్నయి. సంతోషం మొత్తానికి దళిత-బహుజన వాడల మధ్యన వారధి గట్టినవ్.. అభినందనలు..

  5. odanna neekatha kulam addugoodalanu kulcivesindi.kataloo akka athemeeyathanu chitrinchina teeru adubutham . great story aan inka inka rayali. anna padiveela shanarthulu.

Leave a Reply