మాయపేగు ఏది

ఇయ్యాల మా ఇంటి ముందల నుంచి ఒక ఆమె పోతుంది.

ఆకిలి అరుగుల మీద కూసూన్న మా నాయన అట్లా పోతామెను ఆపి, ఇంట్లున్న నన్ను “లచ్చువమ్మో…. ఓ లచ్చువమ్మో” అని కూతలు పెడుతుండు.

నేను ఇంట్లుండి పలికినా మా నాయనకు వినిపించదు. వెంటనే ఎదురువడితే కనిపిస్తాను. కంటి సూపు తేటగుంది.

నీ యమ్మ గాతొవ్వెంట పోతున్నామెను ఆపి, ఇంటి కప్పు ఎగిరిపోతట్టు బొబ్బలు పెడుతుండు, ఎందుకో ఎమోనని, పచ్చిపులుసుల తాలింపు పెట్టేది ఆడేసి, “ఏంది నాయన నీ కొండ బొబ్బలని”, లంగ నడికట్లకు ఎగజెక్కుకున్న చీర సింగులు, కొంగు దులుపుకుంటా ఆకిట్లకు వచ్చిన.

ఓ బిడ్డా ఇంగో ఈమె అచ్చం మనూరి రచ్చసామి పెండ్లాం అనంతమ్మ లెక్కనే ఉందని నాకు సూపిస్తుండు.

హో అవునా నాయనా, సామన్న పెండ్లాం ఇంత ముద్దుగుందా ??

ఔ…. బిడ్డా! అనంతమ్మ ఇంచుమించు ఇదే వన్నె.

అచ్చం నా లెక్క ఉందెవరామె. ఇంతకు మీదేవూరుల్లా అందామె.

బాపనెల్లంల కాడ అచ్చం నువ్వున్నటే ఒక సాలోల్ల పిల్లుండే. చిన్నతనాన పెండ్లైంది. ఇద్దరు పిల్లలెన్క మళ్లా నీళ్లు పోసుకుంది. సక్కదనాల సంసారం. నూరేండ్ల బత్కవలసిన అనంతమ్మ నకిలీ మంత్రసాని చేతుల అర్ధాయ్షుతో కాలం చేసిందని కంటి నీరును దోతితో తూడ్చుకుండు మా నాయన.

ఇంతలనే కుమ్మరి బాలవ్వా తన మనవరాలు పద్మ స్కూటీ దిగి మా నాయన దగ్గరకు వస్తూనే “బాగున్నవా కొడుకా పిచ్చయ్యా!” అనుకుంటూ ఈమె కూడా అదే అరుగు మీద కూసుంది. మేం ఈమెను ఎట్లున్నవు నాయనమ్మ అని మంచి చెడ్డలు అడిగిన వినేటట్టులేదు. అరుగులకు ఎదురుగున్నామెను సూసి మా నాయనలెక్కనే బిత్తర పోయింది బాలవ్వా.

ఔ పిచ్చయ్యా గీమె సాలోల్ల అనంతమ్మోతిగా ఉంది.

అవును చిన్నమ్మ. ఈమె ఈడంగా పోతుంటే పిలిచి మా బిడ్డె లచ్చువమ్మకు సూపిస్తూన్న, నువ్వు వచ్చినవు అంతే.

ఓ అమ్మా, నీ పేరేందో మీకు బాపనెల్లంల ఎవరన్న సూట్టపోల్లు ఉన్నరా?

ఏం ఉన్నరో తెల్వదవ్వా. కానీ, ఆ ఊళ్లే నుంచి మా నాయనమ్మ, మా బాపు పుట్కల ఎదుల్లగూడానికి పంపకానికి వచ్చిందట.

ఓసి నువ్వు ఈరయ్య బిడ్డవా ఏంది?

అవును అవ్వా!

మీ బాపు ఎట్లుండు?

బాపు కాలం చేసిండవ్వా!

నీ పేరేంది?

రోహిణీ!

ఓహో మీ నాయనమ్మ పేరు రాములమ్మ. నీ అత్తగారు ఎక్కడ?

లింగోటం.

మరి ఇట్లా పోతున్నవు?

ఆ మూలమీది ఇంట్లకు మెున్ననే కిరాయికి దిగినం అవ్వా. ఊళ్లే ఎద్దు ఎవుసం ఇసిపెట్టి, పిల్లల సదువు కోసం వచ్చినం. నాకే ఇంట్ల మూడు కాళ్ల ముద్దోలే కూసోబుద్దికాక ఇడంగపోతున్న ఈ తాత పిలిసిండవ్వా. ఇంతలనే నువ్వొచ్చినవు.

ఐతే, ఇట్లా మా లచ్చువమ్మ పొంటి కూసో రోహిణీ.

కూసుంటగానీ అవ్వా, ఆ అనంతమ్మ మంత్రసాని చేతుల ఎందుకు సచ్చిపోయిందో చెప్పవా అవ్వా.

వినేటోల్లకు ఇగురం – చెప్పేటోల్లకు ఓపిక ఉంటే మా బాలమ్మ చిన్నమ్మ ఎంతైనా చెప్తదని, రోహిణీనితో అన్నడు మా నాయన. నేను ఇది వరకే మా అమ్మ చెప్పంగ విన్న. ఇప్పుడు రోహిణీ కారణంగా నేను, నాయన, బాలమ్మ నాయనమ్మ, పద్మలతోపాటు అనంతమ్మ పేగుల ముల్లేలోకి పోదాం. ఇగ నువ్వు చెప్పు నాయనమ్మ.

ఓ లచ్చువమ్మ చెప్పతాగానీ, నడిమిట్ల కల్కెయోద్దు అట్లయితే చెప్పతా సూడంది. నాయనకు, బాలవ్వాకు ఎప్పుడైతే ఈ రోహిణీ కనబడిందో అప్పుడే అనంతమ్మ రూపు గుండెల నుండి కండ్లల్ల జ్ఞాపకాలు ఎతం తోడినట్టు వీళ్ల కళ్ళు తడిసినవి. ఈ తడిసిన కళ్ళ నుండి అనంతమ్మ జీవితాన్ని ధారగా చెప్పుతుంది.

రచ్చసామి మగ్గం నేసేది. అనంతమ్మ కండెలు పట్టేది. అనంతమ్మ మోతాదు ఎత్తు. పచ్చి పసుపు కొమ్ము సాయ. రచ్చసామి,అనంతమ్మల దంట మన ఊళ్ళే కల్లా బాగుండే. లచ్చర్సు,అప్పయ్యల వెనుక మళ్లీ నీళ్లు పోసుకుంది. పొద్దులు పడ్డాయి. రేపో మాపో నీల్లాడ్తాది. మెుదటి రెండు కాన్పులు మనూళ్లేనే అయినవి. ఏట్లా మెుదటి రెండు కాన్పులకు తల్లిగారింటి మెుకం ఎరుగలేదు అనంతమ్మ. ఎప్పటోలే కాకుండా,ఈ మూడో కాన్పుకైనా నా ఇంటికి వెంటబెట్టుకొని పోతిని మెుండేత్తుగనే వచ్చింది అనంతమ్మ తల్లి. అల్లున్ని కోరింది. ఇందుకు రచ్చసామి ఒప్పుకోలేదు. ఐనా సరే తల్లి పానమాయే, బీడువడి పది రోజులు అడిగి, అడిగి విఫలం చెందింది అనంతమ్మ తల్లి.

తోల్సూరు,మల్సూరు కాన్పులు ఇక్కడనే నీల్లాడింది. మూడోది నాకేం బరువు కాదన్నడు. పైగా మా ఊరి మంత్రసానిని మించినోళ్ళు ఇంకే ఊళ్లే ఉండరు అని ఆమెను మించిన మెుండేత్తు ఎసిండు రచ్చసామి. ఇగ చేసేదేంలేక నిండు పొద్దుల బిడ్డను వదలలేక తల్లడిల్లింది అనంతమ్మ తల్లి. ఈమె ఇంట్లో పుట్టెడు సన్న పిల్లలు. బువ్వకరువు. మెుగడు తాగుబోతు. చేసిన కష్టం గుంతలపోసినట్టే ఉండేనట. అల్లుడు నా దేవ్వులాటలు కనిపెట్టుకొని ఈ మాట అడ్డం వేసి ఉండొచ్చని అనంతమ్మ తల్లి మనస్సుకు నచ్చజెప్పుకునే రకం కాదు. తీగకు కాయ బరువా ఎట్లాంటది.

ఇదే రాత్రి నడి జామున మెల్లగా అనంతమ్మకు నొప్పులు సూరువైనాయి. రచ్చసామికి తల్లిలేదు. కానీ, రచ్చ ఎషమ్మ, కుమ్మరి ఈశ్వరమ్మ, మిర్యాల రాధమ్మలే, వీళ్లఇంటి పక్కన ఉండే పెద్ద దిక్కులు. వీళ్లంతా కలిసి మంత్రసాని మంగలి గౌరమ్మవ్వను పిలువనంపి, అనంతమ్మకు పొద్దులు పడ్డయి. అందాదా ఎప్పుడు నీల్లాడ్తదో ఓసారి సూడమన్నరు. సూసింది. పొట్టజారింది. పక్కలు గుంతలు పడ్డయి గానీ, ఇప్పుడు వచ్చిన నొప్పులు వాతం నొప్పులు. ఇంకో నాలుగు ఐదు రోజులలో ఎప్పుడైనా నీల్లాడ్తదని చెప్పింది గౌరవ్వా.

ఓ గౌరవ్వో, మీ మనువరాలు నీల్లాడి, పురుడు అయ్యేదాకా మమ్ముల కాదని ఎటుపోకు, నేను ఒక్కతీరుగా చెప్పుతున్న.

హే నేను ఎక్కడ పోను సామి.

తల్లిలేనోన్ని. నువ్వు, ఈశ్వరవ్వా, ఎషవ్వా, మా రాధమ్మొదినే నాకు తల్లులని కంటనీరు తీసిండు సామి.

ఓ మనువడా నాకు అంత మాత్రం తెలువదా నువ్వేం బాధపడకు.

నువ్వు ఉన్నంక నాకేం దేవ్వులాటలేదవ్వా!

ఐతే సరే సామి, పిల్లెప్పుడు ఆయాసపడ్డ నాకు మతులావు చేస్తే సాలు. నేనేడున్న బుడుగుంగోలే నీ పెండ్లాం ముందల తేల్తా. నువ్వింతగనం పట్కపడొద్దు. నువ్వు నేసిన బట్టలే కడుతున్నం. దుప్పట్లు కప్పుకుంటున్నం సామి. నా ఇమానమ్ తప్పకుంటా వస్తా అని తన ఇంటి తొవ్వ పట్టింది మంత్రసాని గౌరవ్వా.

ఈ మాట చెవులేసుకున్న అనంతమ్మ తల్లి బట్టబాతలు పిండింది. పొక్కిలైనా జయిండ్లు అలికి సున్నం సుక్కలు పెట్టింది. మాడ్సినకారం నూరింది. అనంతమ్మ నెత్తిని గంజితోటి పులిమింది. ఒంటేలు సాపుగా రావాలని దన్యాల కషాయం కాసి నిచ్చే తాపుతుంది ఆ తల్లి.

అయ్యాల బేస్తారం నల్గొండ అంగడి. నెసిన బట్టలను తంతెలు పడ మూటలు కట్టుకొని అమ్ముకరాపోయిండు రచ్చసామి. ఇగ చిన్నగా నొప్పులు మెుదలైనవి. ఊళ్లె రచ్చసామి లేడు. మంత్రసాని గౌరవ్వా పొరుగు ఊళ్లెకు పోయిందని ఈ పెనిమిటి సాయిలు ఎషమ్మ తోటి అన్నడట.

ముల్లె గట్కపోయిన బట్టలు అమ్మినకాడికి అమ్మి వూరపొద్దున్నే ఇల్లు చేరిండు రచ్చసామి. పెండ్లాం అపతి పడుతుంది. గౌరవ్వ రావొచ్చు వెంటబెట్టుకొని వస్తనని పోయిండు. గౌరవ్వ అలికిడి లేదు. ఈ సాయిలు సుట్టపొగ చిన్నపాటి గడ్డాం తల్గబడుతున్నట్టు వస్తుంది ఏడున్నవు! తాతో ఓ సాయిలు తాతో…

ఓవూ..వస్తున్న, ఎవరుల్లా!?

ఆ తాత నేను రచ్చసామిని, గుడిశెలకెల్లి పొగ అట్లొస్తుంది. సూట్టేనా ఇంకేమన్న అంటువెట్టినవా.

ఇంకేముంది మనువడా. ఊరు దూరం – కాడు దగ్గర అయితుంటే. ఇది సరేగానీ, మనువడా ఏమో ఇట్లొచ్చినవు.

మీ మనువరాలకు నొప్పులు వస్తున్నయి తాత. అవ్వను తీస్కపోనొచ్చిన.

ఎట్లా సామి, మీ అవ్వ మా మేనకోడలకు కాన్పు చేయపోయింది!

ఎప్పుడు వస్తది తాత!?

ఇగ అప్పుడో – ఇప్పుడో వస్తది!

గౌరవ్వ రాంగనే మా యింటికి పంపమని, ఏదో గడియల వస్తది, అనే నమ్మకంతో ఇల్లు చేరిండు సామి.

అనంతమ్మ తల్లి మంత్రసాని కోసం వేయి కండ్లు ఎదురుచూస్తుంది. అసలు ఊళ్లె గౌరవ్వ లేదని, పక్క ఊరు ఔరొండిలో మేనకోడలకు కాన్పు చేయపోయింది. ఇప్పుడు ఎట్లాని, ఈ మతులావు ఇరుగు పొరుగోల్లకు చెప్పింది. ఈ సంగతి చెవులేసుకున్నోలంతా అనంతమ్మ ఇల్లు మూగిండ్రు.

అనంతమ్మ ఒక పగలు, ఒక రాత్రి అంతా ఆపతి పడుతూనే ఉంది. సడుగుల్ల నొప్పి వచ్చినప్పుడల్లా, అనంతమ్మ బొబ్బలు ఆ మూలసామి గుట్టకు వినొస్తున్నయి. కోడికి ఆమెకు తెల్లారుతుంది. చెడ నొప్పులు వస్తున్నయి. పొద్దు పొడిచింది. ఐనా ఏం పాయిదలేదు. ఎందుకు అంటే మంత్రసాని గౌరవ్వ రాలేదు.

అనంతమ్మ పక్కన కూసొని కూసొని ఆమె ఆయాసం చూడలేక ఈశ్వరమ్మ సామి దగ్గరకు వచ్చింది.

మంగలి గౌరవ్వ వచ్చిందా సామి??

రాలేదు అవ్వా. ఆ ఇంటికి ఈ ఇంటికి ఆసుపోసినట్లు ఓ పదిమాట్లకు ఎక్కువ తిరిగిన!

ఇట్లు కాదు సామి?

మరె ట్లవ్వా!! పెద్దపానానికి ఏం ముప్పువస్తదో. నేను నా పసి పిల్లల గతేంది!.

నెత్తికి చేతులు పెట్టుకొని అట్లా ఇడ్పుకు కూసునేబదులు ఏడ్చే బదులు ఆ సౌడంపెల్లికాడ ఓ మంత్రసాని రాజమ్మ ఉంటది ఎంటబెట్టుకరాపో అంది ఈశ్వరమ్మ.

సౌడంపెల్లి దగ్గరుందా, దాయుందా అవ్వా?

కంటికి దూరం కాలికి దగ్గర సామి, ఓ పోంటె సేపట్లో వస్తవు!!

ఎట్లా అవ్వా నా కాళ్లు కదుల్తలేవు. చేతులు ఆడ్తలేవు. తొల్సూరు, మల్సూరు కాన్పులు కన్నప్పుడు మూడో కంటికి, నేను పురుడు అని చెప్పేదాకా ఎవరికి తెలువదు. ఇప్పుడు ఏంది ఇంత కస్తీ అవ్వా??

ఓ సామి కస్తీ లేదు, గిస్తీలేదు. ధైర్నం చెడకు. కమ్మరి బిచ్చమయ్య ఆకిట్ల మా ఎడ్ల బండి ఉంది. ఆడికిపోయి నువ్వు, మా చిన్నోడు లింగయ్య, బండి కొట్కరాపోరి. అనంతమ్మను నార్కేంపెల్లి దవఖానకు ఎస్కపోదాం అని బానే చెప్పింది.
కానీ, అక్కడ ఉన్న గుమ్మాయి – జక్కాయి జనమంతా నిన్నియ్యాల రాత్రి నుండేనాయే నొప్పులొస్తుంది. గింతదానికే ఇచ్చేంత్రపడుతున్నరు. ఒక్కొక్కరైతే మూడు, నాలుగొద్దులు ఆపతిపడి కంటరు. వాళ్లేం నార్కేంపెల్లికి, ఏం దవఖానకు పోతున్నరు. ఒకయాళ్ల దవఖానకే అంటే, మనూళ్లే సిస్టర్ ముత్తమ్మను పిలువమన్నరు. సామికి తొయ్యకుండా మంది తాకిడి ఎక్కువైంది. ఈశ్వరమ్మ మాట పొల్లు పోయింది.

అమ్మెటాళ్ల కావస్తుంది. గౌరవ్వా తొవ్వకు ఏ పాడు పల్లేర్లు అడ్డం అయినవో, నా బిడ్డ సుతి ఏ దేవుని ముడుతలేకుండొచ్చునా అని అనంతమ్మ తల్లి శకలమైపోతుంది. ఏదో దగడు ఈమె కడుపుల జోరపడ్డది. తల్లి తండ్లాట కట్టలు తెంచుకుంటుంది. ఈమె తీరును ఈశ్వరమ్మ పసిగట్టి ఏంది అవ్వా అట్లా ఒడిపడుతున్నవు!?

సూస్తనేవున్నవు కదా బిడ్డా!

నీయమ్మా నువ్వే ఇట్లంటే ఎట్లా పెద్దమ్మా??

నాకు ఏందుకో భయం అయితుంది ఈశ్వరమ్మ!!

భయపడకు పెద్దమ్మా, నీ బిడ్డే అనంతమ్మ తేటగుంది. తల్లి పిల్లలు నిమ్మళంగా బైటపడ్డంక, తల్లి నలుగురిని మీ ఊరుకు వెంటబెట్టుకొని పోదువు.

అనంతమ్మ తల్లి ఈశ్వరమ్మ మాటలకు తేరుకుంది. కానీ, అనంతమ్మ తల్లి మాటలలోని శంక ఈశ్వరమ్మకు కూడా ఉంది.

ఇగ మంత్రసాని గౌరవ్వ రాకకు నీళ్లు ఒదులుకున్నరు. కాకి కబురు అందుకున్న సిస్టర్ ముత్తమ్మ ప్రత్యక్షం అయ్యింది. ఆమె ఆ ఊరికి వచ్చి ఐదు ఆరు సంవత్సరాలైనా, ఒక కాన్పు చేసి ఎరుగదు. కానీ, ఇప్పుడు తప్పని పరిస్థితిలో ఈ సిస్టర్ అవసరం వచ్చింది. వస్తువస్తునే అందరినీ, బయటికి పొమ్మంది. కొందరు బయటి పోయిండ్రు. ఇంకొందరు కటానకట్టుగా ఉన్నరు జనమంతా.

అక్కడ ఉన్నవాళ్లలో ఈశ్వరమ్మ పిల్లొచ్చినా, పిడుకొచ్చినా పట్టడానికి తయారుగా ఉంది.

అనంతమ్మ సడుగుళ్ల పెద్ద గడ్డపార మేండింపు అస్సోంటి నొప్పులు వస్తున్నయి. అరె ఇంతకు బొడ్డు కోసే కత్తి లేదు. అడుక్కరమ్మని కమ్మరి పిచ్చయ్య ఇంటికి ఎషమ్మను తోలింది ఈశ్వరమ్మ.

పరుగున ఎషమ్మ మన కొలిమి కాడికి ఒరిగిచ్చుకుంటా వచ్చి ఓ…పిచ్చయ్య చిన్నాయన ఫలానా సంగతి అని చెప్పింది. ఆ కత్తి సామాను ముందలి ముంతగూట్లెనే ఉందట. కానీ, ఆయన అక్కడిక్కడ దేవ్వులాడిన ఆత్రానికి ఎల్లెం దొరకలేదట. ఎందుకైనా మంచిదని మళ్లీ ఆ ముంతగూట్లే తారాడితే చేతికి చిక్కింది. ఎషమ్మ మబ్బు తెప్పొలే కదిలి పోయింది.

అనంతమ్మ పక్కటెముకల కిందికి కడుపు జారుతుంది. సడుగుల్ల ఈ నొప్పికి పిండం బయట పడుతట్టుంది. ముత్తమ్మా నువ్వు నడుం జెర బిగ్గరగా పట్టు. అనంతమ్మా నీ చేతులు నెత్తి కింద పెట్టుకో. కాళ్లు ఎడంజాపుతలేదు. ఓ కేతమ్మ, నీలమ్మ కాళ్లు పట్టుండ్రి పట్టుండ్రి. . . అంటనే ఉంది, అనంతమ్మ సడుగుళ్ల గడ్డపార మేండిచ్చినట్టు వచ్చిన నొప్పికి యేసి బయటపడుతున్న పిండం పట్టింది ఈశ్వరమ్మ. పిల్లగాని బొడ్డు కోసింది. ఇగ తక్కిన పనిని సిస్టర్ ముత్తమ్మకు వదిలింది ఈశ్వరమ్మ.

ఈ కాన్పుల కూడా మళ్లీ పిల్లగాడేనా, ఆడిపిల్ల నావంతున లేదా అమ్మాని అనంతమ్మ అంటుంటే, “ఇప్పుడు పోతును పెట్టినవు, నాల్గో కాన్పుల మరకను కందువులే” అని కేతమ్మ, ఎషమ్మాలు నవ్వుతున్నరట.

ఓ నీయక్కా…ఓ కేతమ్మా, నీ జీవాల బాసేల ఐటెంన్కా ఇగిలిద్దువు గానీ, ముందుగాల ఐతే అనంతమ్మ రెట్టల కింద చేయేసి నిలబెట్టి రొండ్లమీద ఉడుకు నీళ్లు గుప్పి మైలకాశె పెట్టుండ్రి. అట్లనే బట్టాబాత కట్టుండ్రి, అని ఈశ్వరమ్మ పటపట పండ్లు కొరుకుతుందట. ఓ పెద్దమ్మా అక్కడిక్కడ ఏం నుసుల్తావు, తల్లి పిల్లలను పండుకొపెడ్తానికి మంచమో, గడమంచో ఎయ్యి.

దిడ్డి ఇడ్పుకు ఉన్న నుల్కమంచాన్ని లేవట్కొచ్చి, మెుగ్గం గుంతకు ఎడమ పక్కన వేసింది. కొంగరెక్కోలే తెల్లగా పిండిన ఓ పాత చెద్దురును పక్కపరిసింది. ఇట్లనే కప్పుకుంటందుకు దుప్పటిని ఇదే మంచంపై ఒక పక్కకు పెట్టింది. అనంతమ్మ తల్లి.

చాట్ల వడ్ల మీద పిల్లగాన్ని ఏసి తీసి పాత బట్టలలో ఎచ్చగా కప్పి అడ్డబాప ఎత్తుకుంది ఈశ్వరమ్మ.

అరె ఆ మనిషికాడ ఇంకేం చేసుండ్రు. ఆముడాల పిల్లలను కంటే కూడా ఇంతసేపు కాదు. ఇంకేం చేస్తూన్నవు సిస్టరమ్మ?

అయ్యో నేను ఏం చేస్తానో తెలువదా!

తెలుస్తనే ఉంది కానీ, సామి ఇంటెన్క గుంత తోడిండు. మాయపేగును ఆ ముంతలేయ్యి సిస్టరమ్మ.

ఓ అవ్వా! నీ పేరేందో, నువ్వు నన్ను మెస్లనిస్తలేవు.

వచ్చిన పని చేసి పోతాన్కి, నా పేరుతో ఏం పని. ఇప్పటికే పొంటే సేపైంది సిస్టరమ్మ.

అనంతమ్మ… ఓ అనంతమ్మ… ఏంది బిడ్డా, భూమి అంతెత్తు ఏగురుతున్నవు. అని ఈశ్వరమ్మ మోత్కుంటా, ఆడ్డపాపను అనంతమ్మ తల్లి చేతుల పెట్టి రైయ్యిన ఆమె దగ్గరకు పోయి సూస్తారకు కడుపుల పేగులన్ని ఇతలనే ఉన్నయి.

హో అవ్వో… నా పానం పొతట్టుంది. నన్ను బతికియురి. నా దేవుడో ఓ సామి. నా పిల్లలు కూనలు. అమ్మా… అమ్మా ని అనంతమ్మ ఓ పక్కపెడబొబ్బలు పెడుతుంది.

ఇంకో పక్కా అనంతమ్మ నీకేం కాదు బిడ్డా నేనున్నానని మెుండి ధైర్నంతో తల్లి సముదాయిస్తుంది.

వాయమ్మో అప్పటి సంది ఈ కేతమ్మ, ఎషమ్మలు ఏమో చేస్తున్నవని మొత్కుంటనే ఉండ్రు. నెత్తురు బొల్ల – బొల్ల వరద పారుతుందని సిస్టరమ్మపై ఈశ్వరమ్మ మరో పక్కా లొల్లిపెడుతుంది.

బాపనెల్లంల పొలిమేరలనే ఈ సంగతి తెలిసికొన్న మంత్రసాని గౌరవ్వ, సర్రున రచ్చసామి ఇంటికి వచ్చింది.

ఆడేం జరిగిందో సాంతిమి అర్థమైంది గౌరవ్వకు. ఈమెను సూసిన సిస్టర్ ముత్తమ్మ గావరపడుతుంది. చేసిన నిర్వాకం సాలక అనంతమ్మకు విపరీతమైన మైల అవుతుంది. పెద్ద దవఖానకు ఎస్కపోదాం అని బుకాయిస్తుంది.

బొడ్డు పేగేదో, మాయపేగుదో, కడ్పుల పేగులేవో, ఎరుకలేనిదానివి ఈ పని ఎందుకు చేసినవు. అనంతమ్మ కడుపుల పేగులన్ని గుంజి ఇవుతల వేసి ఇంకా మమ్ముల అదురగొడ్తున్నవు. కాన్పంటే రెండు పానల పంట. ఎంత పని చేసినవే… సిస్టరమ్మా?? నీమీద మన్నుపొయ్యా అని నోటికి అందిన కూతలు కూస్తుంది గౌరవ్వ.

మా అనంతమ్మను ఏం చేసినవు లమ్డి. జుట్టు వట్టి గుంజి కొట్టింది ఈశ్వరమ్మ. కేతమ్మ, ఎషమ్మాలు కూడా కొంకుల మీద తనిండ్రు.

అది కాదు ఇది కాదు అని వీళ్లందరిని దబాయించి పరారైయ్యింది సిస్టర్ ముత్తమ్మ.

ఓ సామి…. కమ్మరి బిచ్చమయ్యా ఆకిట్లున్న బండిని కట్కరాపోరి. ఇగనన్న అనంతమ్మను నార్కేంపెల్లికి ఎస్కపోదాం. అని గెదుముతుంది ఈశ్వరమ్మ.

అనంతమ్మ ఒళ్లు చల్లబడుతుంది. ధ్వని లేదు. సూపు పోయింది. వెచ్చని రక్తం కాలువైంది. గౌరవ్వ అనంతమ్మ తలను తొడమీద పెట్టుకొని ఏడుస్తుంది.

ఇప్పుడొచ్చి శోకం పెడుతున్నవు గౌరవ్వా. నువ్విచ్చిన మాటకు పావంది లేకపాయే?

అనంతమ్మ పుట్టివోలే ఉంది. నేను రాను అన్నా అంటే పొంటెల వచ్చిపోదువని బల్మికీ వెంటబెట్టుకొని పోయిండు. మా కోడలు నువ్వు – నేను అన్నంతలనే నీల్లాడింది. ఇగ నేను గోళెంకాడ చేతులు కడుక్కుంటున్న ఎడమ కాలుకు పాము కర్చింది. నిన్న నాకు అట్లనన్నా సావురాదాయే ఈశ్వరమ్మ. ఈ గోస పాడుగాను. సామికి నా మెుకం ఎట్ల సూపెడుదునని గౌరవ్వ నెత్తి నోరు కొట్టుకుంటుంది.

జనమంతా లబోదిబో అనే లోపు అనంతమ్మ ఊపిరి గాలిల కలిసింది. అనంతమ్మ తల్లి కుప్పకూలింది.

అనంతమ్మ దినవారాలు అయినైయి. రచ్చసామి మాత్రం తన పెండ్లాం నడమంత్రపు సావును అరిగిచ్చుకోలేక పోయిండు. కంటి మీద కునుకేస్తలేడు. మెతుకు ముడితొట్టు. కానూలు తేలిసినోడు. సిస్టర్ ముత్తమ్మకు నేనేం పాపం చేసిన. ఇది ఏడనో కిరకాసు ఉన్నాలే, అని ఆరు నెల్లు తిప్పలపడి ముత్తమ్మపై పేచి ఏసిండు. ఈ పేచి ఐనా మల్లా ఆరు నెల్లకు నకిలీ కాయితాలతో సిస్టర్ అయ్యిందని కోట్ల చెప్పిండ్రట.

దీని మీద మన్నబోయ పుక్కడిగా వచ్చే జీతం కొరకు సక్కదనాల అనంతమ్మను సంపిందని, మాతో ఇక్కడికి చెప్పి వశందప్పి వొలవొల ఏడుస్తుంది బాలమ్మ నాయనమ్మ. మా కండ్లు కొనేర్లైనయి.

అయ్యాల మంగలి గౌరవ్వాకు పాము కరువకున్నా, అనంతమ్మ బతుకు అంటున్నాడు మా నాయన.

అంతెందుకు పిచ్చయ్యా….ఈశ్వరమ్మ చెప్పినట్టు నార్కేంపెల్లి దవఖానకు ఏస్కపోయినా బతుకని మారుమాట్లాడింది బాలమ్మ నాయనమ్మ.

బాలవ్వా నువ్వు మాట్లాడేటప్పుడు మమ్ముల నడుమ మాట్లాడొద్దనవని అడగలేదుగానీ, కోర్టు నకిలీ కాయితాల సంగతి తరువాత సిస్టర్ ముత్తమ్మ ఏమైదవ్వానీ రోహిణీలో కెలుకుతున్న శంకను అడిగింది రోహిణీ.

ఓ అదా కొండారం బళ్లె ముత్తమ్మ అనే గొల్లోల్ల పిల్ల ఏడో ఎంతో సదువుతుండగనే ఆ పిల్ల పెండ్లి చేసుకుని పోయిందట. అప్పుడు, ఆ కాయితాల తెచ్చుకొని- – – రెడ్డోల్ల గద్ద సువర్ణ. పైసల కోసానికి గడ్డి తిని, కాయితాలు తయారు చేసుకుందట. దీని మీదనే కొన్ని రోజులు జేలుకు పోయింది.

ఇట్లా ఇంకా మా నాయన, బాలమ్మ నాయనమ్మ, రోహిణీ, పద్మ, మా గిరాకోల్లు దేశంలోని ఆడవాళ్ల, కోతలు, కత్తెర్లు, సావులు, బతుకులు గురించి మాట్లాడుతున్నారు. నేను మాత్రం అనంతమ్మ చిద్రమైన మాయపేగు ఏదని ఏమైంది అని వీళ్లు చెప్పింది విని తట్టుకోలేక ఇంట్లకు వచ్చిన.

ఇది అనేక మంది అనంతమ్మల మాయపేగుల యత.

One thought on “మాయపేగు ఏది

  1. కథ చెప్పడానికి ఎత్తుకొన్న విధానం బావుంది. ఊరికి కొత్తగా వచ్చిన ఆడపడుచు చనిపోయిన అనంతమ్మలాగే ఉందని మొదలెట్టి కథలోకి పోవడం మంచి టెక్నిక్.

    ప్రతి పదంలో, వాక్యంలో తెలంగాణ గ్రామీణ వాతావరణం, సంస్కృతి తొణికిసలాడింది. పాతకాలంలో ఊర్లలో జరిగే కాన్పులు గురించిన సమాచారం వివరంగా ఉంది.

    ఇలాంటి కథల వల్ల భాషా సౌందర్యం, పదజాలం కొంతకాలం నిలబడే అవకాశముంటుంది.

Leave a Reply