మన ముచ్చట కోసం కాలం చెల్లిన దేన్నీ ప్రోత్సహించలేం

తన కాలపు వ్యవహారాల్నీ, పరిసరాల్నీ, పుట్టుక ద్వారా పొందిన కుల, మత, లింగ హోదాల తాలూకు అపసవ్యతలనీ, రాబడినీ పోబడినీ, మొత్తం తన భౌతిక మానసిక స్థితిగతుల్నీ, వివిధ ఆవరణాల్నీ మినహాయించి ఏ రచయితా కవీ రాసేదేమీ లేదు. కవిత్వాన్ని వీటితో సంబంధం లేని సౌందర్య సరుకుగా భావించే వాళ్ళు కూడా ఏదో ఒక రూపేణా గతమూ, వర్తమానమూ ఇస్తున్న ప్రేరణకో భవిష్యత్తు చేసే వాగ్దానాలకో తమదైన మానసికత నుంచి స్పందిస్తూ వుంటారు. ప్రేరణ ఏదైనప్పటికీ అది ఎంత వివిధంగా విభిన్నంగా ఉన్నప్పటికీ దానినుంచి కవి నిర్మించే కవిత్వం తనదైన మనో వైఖరినీ, గొంతునీ సాంస్కృతికతనీ , కళా నైపుణ్యాలనూ వ్యక్తం చేయగలగాలి. అప్పుడే ఆ కవి విశిష్టత బయటపడుతుంది. ఆమె కవిత్వాన్ని ఇతరుల కవిత్వం నుంచి వేరుచేసి చూపటంలో తను వాడిన వస్తువు ఎంత కారణమౌతుందో సంవిధానమూ స్వర సంస్కృతి కూడా అంతే కారణమౌతాయి. ఒకోసారి సంవిధాన స్వర సంస్కృతులే ప్రధాన కారణమౌతాయి.

ఇదంతా ఇప్పటివరకూ తెలియనిదని కాదు. తెలిసిన కనీస విషయాలనే ఎల్లప్పుడూ పునశ్చరణ చేసుకుంటూ ఉండటంలో ఇప్పటికీ అవి తెలియనివారికీ, వాటిపట్ల సవ్య స్పృహ లేనివారికీ పనికొస్తాయనే ఉద్దేశమే మళ్లీ మళ్లీ వాటిని స్పృశించటానికి కారణం.

అయితే కవులు కవిత్వాన్ని నిర్మించే క్రమంలో కొంత కాల్పనికతనూ, సెంటిమెంటల్ ధోరణినీ ప్రదర్శిస్తూ వుంటారు. అవసరం మేరకు ఉపయోగించినంత వరకూ ఇవి ఓకే. కొన్ని సార్లు ఇవి మితిమీరి మారిన పరిస్థితినీ, వాతావరణాన్నీ మరుగుపరుస్తూ ఉంటాయి. మారిన వాస్తవం వెనుక ఉన్న వాస్తవాన్నీ దాని సానుకూలతని కూడా గుర్తించ నిరాకరిస్తాయి. వాడుకలో లేని మాటల్నీ, పదాల్నీ ఉపయోగిస్తూ భాష పట్ల వారికున్న భావోద్వేగ అనుబంధాన్ని చాటుతూ వుంటారు. నేనొక సారి ‘గాబు’ అని వాడాను. అంటే ఏంటని పల్లెటూర్లో వుండే మా బాబాయి మనవరాలే అడిగింది. మరొకరు ‘గూడ’ అని వాడారు. ‘ఒంపులు తిరుగుతు వయ్యారంగా/ ఊపుతు విసురుతు గూడేస్తుంటే’ అని ఆత్రేయ వాడిన రోజుల్లో ‘గూడ’ కు భౌతిక ఉనికి ఉంది. ఇప్పుడు దాని బదులు మరలు వచ్చాయి. అవసరం తీరిపోయిన విషయాలు వాడుకలోంచి నిష్క్రమిస్తాయని వేరే చెప్పక్కర్లేదు. పాత పనిముట్లు ఎన్నో కనుమరుగయ్యాయి. కారణం వాటి అవసరం తీరిపోవటమే. ఏమీ పోకుండా ఏమీ రాకుండా ఈనాటి సంస్కృతి గానీ నాగరికత గానీ లేదు. భవిష్యత్తుకు కూడా ఇదే వర్తిస్తుంది. భాష, సంస్కృతి అనేవి అన్నిటిలాగే నిరంతర పరిణామంలో, ప్రవాహంలో ఉంటాయి. మనకు తెలుసు గాబట్టి ఉనికిలో లేని పురాతన మాటల్ని వాడటం కవిత్వానికి కొంత వింత శోభను ఇస్తే ఇవ్వవచ్చునేమో కానీ ఆ శోభ వల్ల కవితా ప్రయోజనం దెబ్బతినే అవకాశం ఉంది. ఆంగ్లంలో కాలరిడ్జ్ రాసిన కవిత్వంలో ఈ నిర్మనుగడతో కూడిన మాటలు ( archaic words)ఎక్కువగా ఉండేవి. ఆయన సమకాలీనుడైన వర్డ్సవర్త్ అమలులో ఉన్న సాదాసీదా భాషనీ, పలుకుబడినీ, నుడినీ ఉపయోగించాడు. వర్డ్సవర్త్ కవిత్వం ముందు కాలరీడ్జ్ కవిత్వం తేలిపోవటానికి ఇదీ ఒక కారణం. పల్లెల్లో ఉనికిలో ఉన్న ఎన్నో మాటలూ, పదాలూ కవిత్వంలోకి రావాల్సి ఉంది. మునాసు వెంకట్, వనపట్ల సుబ్బయ్య, అన్నవరం దేవేందర్, గుడిపల్లి నిరంజన్, తగుళ్ల గోపాల్, పల్లిపట్టు నాగరాజు, నగిళ్ళ రమేష్, బండారు రాజ్ కుమార్, దయాకర్ వడ్లకొండ, తంగిరాల సోనీ లాంటి కవులు గ్రామీణ బహుజన జీవితంలో అమల్లో ఉన్న అసంఖ్యాక మాటల్నీ, పదాల్నీ కవిత్వంలోకి తేవడం ద్వారా భాషను సుసంపన్నం చేస్తున్నారు. తోట సుభాషిణీ, మెర్సీ మార్గరెట్, సరసిజ, అనిల్ డానీ, అరుణాంక్ లత, ఇబ్రహీం నిర్గుణ్, శ్రీనివాస్ సూఫీ, కాశీ రాజు మొదలైన కవులు నగరంలో వాడుకలో ఉన్న భాషను వాడుతున్నారు. ఇండస్ మార్టిన్, నరేష్ కుమార్ సూఫీ, చల్లపల్లి స్వరూప రాణి, నంద కిషోర్, బూర్ల వెంకటేశ్వర్లు, గాజోజు నాగభూషణం, కృష్ణా గుగులోత్ లాంటి వాళ్ళు అమలులోని అర్బన్, రూరల్ భాషా వ్యవస్థల్ని నేర్పుగా కలగలిపి వాడుతున్నారు. ఇంకా ఔట్ డేటెడ్ సంస్కృత పదబంధాల్ని వాడుతున్న వాళ్ళూ చాలామంది ఉన్నారు. మారిన డిజిటల్ భాషను వాడుతున్న వాళ్ళు కూడా ఉన్నారు.

అనుభవంలోది రాయటం, అనుభవం బయట ఉన్నదాన్ని తెలుసుకొని రాయటం ఎప్పటికీ ప్రోత్సహించదగిందే. సెంటిమెంట్ కారణంగా ఏర్పడే గుడ్డి అనుబంధం వల్ల రాయడంలోనే పేచీ ఉంది. ‘పల్లె కన్నీరు పెడుతుంది’ అని గోరటి వెంకన్న రాసిన పాటలో పల్లె జీవితాన్నీ, దాని నుంచి మాయమైన విలువల్నీ సెంటిమెంటలైజ్ చేయడం ఉంది. పోయిన విలువల్లో పోవాల్సిన విలువలు కూడా ఎన్నో వున్నాయి. ఉదాహరణకు కుల వృత్తులు. ఒక పక్క కులాలు పోవాలంటూ కుల వృత్తులు మాయమౌతున్నందుకు బాధపడటంలో అర్ధమేముంది? పల్లెల్లో మనం అందమైన విషయాలుగా చెప్పుకునే వాటి వెనుక భూస్వామ్య విలువలూ, బ్రాహ్మణ వాద ఆధిక్యతా విలువలూ ఎన్నో వున్నాయి. పల్లె సంస్కృతి ని మొత్తంగా సెంటిమెంటలైజ్ చేయడంలో, సుందరీకరించడంలో కాలం చెల్లిన, చెల్లాల్సిన విలువల్ని తెలియకుండానే ఉన్నతీకరించడం ఉంది. గోరటి వెంకన్న పాటలో గొప్ప సాహిత్య విలువలున్న మాట నిజమే. అందులోనుంచి నిఘంటువుల్లో కి ఎక్కదగిన గ్రామీణ పద పరిమళాలు పలకరించే మాట నిజమే. అంతమాత్రాన ఆ పాట లోని తిరోగామీ ధోరణినీ, యధాతధ వాద తత్వాన్నీ విమర్శించకుండా వుండలేము. ఒక్క గోరటి వెంకన్నే కాదు ఇంకా అలాంటి ధోరణిలో నడుస్తున్న కవులు వున్నారు.

కవి, సాహిత్య విర్శకుడు, సామాజిక విశ్లేషకుడు, దళిత బహుజన సాహిత్య ఉద్యమకారుడు. తెలుగు దళిత బహుజ సాహిత్య సిద్ధాంతాన్ని రూపొందించి, పెంపొందించడానికి కృషిచేశారు. 'చిక్కనవుతున్న పాట'(1995), 'పదునెక్కిన పాట'(1996) కవితా సంకలనాలు తీసుకురావడానికి కృషిచేశారు. దళిత బహుజన కవిత్వంలో అంబేద్కరిజం వ్యక్తమైన తీరును విశ్లేషిస్తూ దళిత బహుజన సాహిత్యం దృక్పథం రాశారు. 'The Essence of Dalith Poetry' అనే ఆంగ్ల గ్రంథాన్ని ప్రచురించారు. ఇటీవలే 'కవితా నిర్మాణ పద్ధతులు', 'సామాజిక కళా విమర్శ' అనే పుస్తకాలు ప్రచురించారు. తెలుగు సాహిత్య అకాడమీ అవార్డు(1995), ఇటీవల కలేకూరి, శంబూక, గిడుగు రామ్మూర్తి అవార్డులు వచ్చాయి.

Leave a Reply