మనుషులు కూలిపోతున్న దృశ్యము

మా బాపు అవ్వ మంచిర్యాలకి వచ్చి మూడు రోజులు అయింది.

వాల్ల జీవితములో ఇదే మొదటి సారి వరుసగా అన్ని రోజులు మాతో ఉండడం.

సాన్వీ ఆ రోజు సాయంత్రం మందు తాగుతుంటే బాపుని అడిగింది “తాతయ్య నువ్వు చిన్నప్పుడు డాడికి చాలా కథలు చెప్పేవాడివట కదా! ప్లీజ్ మాకొక్క కథ చెప్పు తాతయ్య…, ప్లీజ్!”

“ఓ…, బొచ్చెడన్ని కథలు చెప్పేది, పదం కూడా పాడేది గాని ఇప్పుడు అన్నీ మర్చిపోయినట్లున్నడవ్వ తాత“ మా అవ్వ.

“ ఇగో మా సెప్త గని నువ్వు నీ సదువులనైతే ఉషారుగుoడాలే. క్లాస్ లో ఫస్ట్ రావాలే.“ బాపు.

“సరే మా వస్తా గని సెప్పు“ సాన్వీ.

“సిన్న కథే సెప్తా వినుండ్రి“ బాపు గట్టిగా సరాయించిండు.

శ్రీరామ్ కూడా సదువుతున్న బుక్కు పక్కకి పెట్టి బాపు దిక్కు తిరిగిండు.

“ఇగో ఎనుకట మీ చిన్న మామ అసొంటోడు ఒకడుండేటోడు.“

“హ్మ్మ…, హ్మ్మ“ పిల్లలు.

“ఆయ్నే ఒకనాడు పొలం కాడ గొడ్ల కాసుకుంట దేవుని కోసం పబ్బతి పట్టి మొక్కంగా మొక్కంగా భగవంతుడు శంకరుడు ప్రత్యక్షమైండు.“

“ఒహ్హో“ సాన్వీ.

“తోచిన వరం కోరుకొమ్మన్నడు భగవంతుడు”

ఆయింత అంతట ఆ మనిషి “దేవుడా! నా పుట్టుబడి అంతా కట్టం పుట్టుబడి అయింది. అవ్వ మీద అయ్య మీద ఒక్క రోజు సుఖపడ్డది లేదు. పిల్లలు పెరిగి ఓ ఇంటోల్లు ఐనా గని నాకైతే ఈ కట్టం తప్పలే. ఒక్క రోజు కూడా కడ్పు నిండార తిన్నది లేదు. పన్నది లేదు. నేను సచ్చిపోయినంకనైనా నన్ను కాలు కింద పెట్టకుండా బతికేటట్లు సర్గానికి పంపియుండ్లి!”

“శంకరుడు భోలా మనిషి కదా! అడుగంగానే వరం ఇచ్చిండు.

వయసు మీద పడ్డంకా ఆ మనిషి సచ్చిపోయి సక్కగా స్వర్గానికి పోయిండు. అక్కడ పెద్ద భవంతిలో మంచి పరుపులు, వంద మంది పని మనుషులు, పది మంది భార్యలు, కోరుకున్న తిండి, లడ్డులు, పండ్లు, కోరుకున్న మందు. ఒక్క నిమిషము కూడా పరుపు మీద నుంచి కాలు కింద పెట్టకుండా పని మనుషుల సేవలు. మనిషి బాగా సంబరపడ్డాడు. అట్లా నెల రోజులు గడిసింది.“ బాపు గ్లాస్ లేపి ఒక్క బుక్క మింగిండు

“ఆ తర్వాత ఏమైంది తాతయ్య?“ ఆతృతగా శ్రీరామ్.

“ఏమైతది? అట్టిగుండని పానమాయే. పరుపు దిగి అటు తిరిగత్తా.ఇటు తిరిగత్తా. ఆ సెట్టుకీ నీళ్ళు పోత్తా ఈ కాయలు తెంపుతా అని అనుడు మొదలువెట్టి౦డు ఆ మనిషి. కానీ అది స్వర్గం కదా స్వర్గములో పని సేసుడు ఉండది. సేవకులు అస్సలు ఒప్పుకోలే. ఆకరికి ఎటు మనసున వట్టక మళ్ళా భగవంతుని కోసం పబ్బతి వట్టిండు. భగవంతుడు మల్లచ్చిండు“

“అప్పుడు శివుడు ఏం చేసిండు తాతయ్య“

“శంకరుడు చేసుడు ఎక్కడిది. నీ అక్క నా లెక్కనే పని చేయకుంటే పెయ్యంతా ములములవెడుతది మనిషనెటోనికెవ్వనికైనా…“

“ఐతే…?“ శ్రీరామ్ నోరంతా తెరిసి.

“భగవంతుని రెండు కాళ్ళ మీదపడి నన్ను నరకానికి పంపి ఎంత కట్టపెట్టినా మంచిదే కానీ నాకీ దిక్కుమాల్లే సుఖం నుంచెల్లి బయటపడెయ్యి భగవంతుడా! అని ఆ హరిహర శంకరుడు తిరిగి ఆచ్ఛాయము ఇచ్చేదాకా ఇడ్సిపెట్టలేదు ఆ మనిషి …” బాపు పెద్దగా నవ్విండు.

“ఐతే అతను నరకానికే పోయిండా తాతయ్య“ సాన్వీ.

“నరకం పోకుంటే …! అటున్న పుల్ల ఇటు తీసి ఎయ్యకుంటా సర్గములో బతుకమంటే మనిషి మురిగిపోడు, బుడ్డిపోయి…, పట్టన పల్గి సావడు? కాళ్ళు సేతులింతా సాగితేనే పానానికి ఉషారుగుంటది. సిన్నమెత్తన్నా పని సేయకుంటే మనిషి అట్టిగనే సిటుకు రోగమచ్చి పిడాత ఎగిరి సావడు?“

దూరం నుండి ఆ కథ విన్నంకా నాకు ఆ రాత్రంతా మా అవ్వ బాపు చేసిన కష్టం మరియు మా చిన్నతనం యాదికొచ్చింది.

ముఖ్యంగా మా బాపు. నిజమే మా బాపు ఎంత మొద్దు కష్టం చేసిండనీ.., తన జీవితములో ఎంత కష్టపడ్డాడనీ! మా ఇంట్లో చిన్నోడినైన నా ఎరుకకే ఎన్నో కష్టపు పనులు. తేపకిన్ని అప్పుడప్పుడు యాదికస్తాయి. రాస్తే మహాభారతమైతది.

చెరువు దిక్కు, చెరువు శికం పైన బావి తవ్విన తర్వాత నీళ్ళు కింది నుండి పైకి పొలానికి అందాలంటే పైపు లైన్ వెయ్యాలి. కానీ పైసలు లేక పైపు లైన్ వేయలేక ప్రకృతికి ఎదురొడ్డినట్లు, అందురు ( పల్లానికి ) నుండి మిట్టకు అతి ఎత్తుగా కట్ట పోసి ఆ కట్ట మద్యలో కాలువ నిర్మాణం చేసి పై పొలము దాకా నీళ్ళు పారించి పంటలు తీసిండు మా బాపు. ఆ బృహత్కార్యములో మా కుటుంబ సభ్యులం అందరం పాల్గొన్నప్పటికి మా బాపు పడ్డ శ్రమే అధికం. ఒక్కడే పొద్దు అనక రాత్రి అనక పని చేసేవాడు. నాకు గుర్తు ఎన్నీల ఎల్తురులో మా అవ్వ కొద్ది పనిసేపు చేసి ఒడ్డు మీద కూసుంటే మా బాపు పొలములో పక్కనున్న మట్టి తవ్వుతూ ఆ ఎత్తైన కట్ట మీద పోసేవాడు. మట్టిని చదును చేస్తూ కాలువ నిర్మాణ రూపం చేస్తూ చాలా విషయాలు చెప్తుండే వాడు. మాకు, మా చుట్టూ నిత్యం ఎదురవుతున్న సమస్యలు కష్టాలకు పరిష్కార మార్గాలుగా మహాభారతం, రామాయణం,పురాణాల నుండి తను చదివిన విన్న విషయాలన్నీ చెప్పేవాడు. మనమెలా ఉండాలో,ఎలా నడుచుకోవాలో చెప్పేవాడు. అవి ప్రధానంగా నేను వినాలనే ఆలోచనతో కూడా చెప్పేవాడు. మా బాపు చెప్పే విషయాలలో చాలా సార్లు వచ్చే మాట మనిషికి జీవితములో ఎంత కష్టం వచ్చిన,ఎన్ని సమస్యలు ఎదురైన “దమ్ము ఉండాలే” “దమ్ము కాయాలే” అనేవాడు. ఈ దమ్ము అంటే కొట్లాట కోసం సవాలు చేసే ”దమ్ము ఉందా నీకు?“ అనే వాడుకలోని పదం కాదు. దమ్ము రోగం కాదు. దమ్ము అంటే మహా శాంతం. మహా ఓపిక. మహా విశాలత్వం. జీవితములో ఎన్ని భయంకరమైన కష్టాలు,ఎన్ని దెబ్బలు తాకిన,ఎన్ని అవమానాలు ఎదురైనా,దాదాపు ఒక మహా కష్టము నుండి బయటపడే సమయములో.., ఎంత ఎత్తు నుండి మళ్ళీ పాతాళానికి పడిపోయినా కానీ, ఎంత మాత్రం నిరాశ చెందకుండా మళ్ళీ పని, ప్రయత్నము మొదలుపెట్టడమే ఆ దమ్ము. ఆ కష్టాలను ఎదుర్కోవడమే, ఎప్పటికప్పుడు పరిస్థితులపై గెలవడమే మనిషి యొక్క జీవితం అనేలా ఉండేది ఆయన ఆలోచన. ఆయన కష్టానికి ఏ రోజు ఏడ్సినది లేదు. ఏడిస్తే తన పిల్లలైన మాకేమన్నా ఐతే తప్ప. మా అందరివి చిన్న తట్టలు, చిన్న డబ్బలు ఐతే కట్ట నిర్మాణం తొందరగా కావాలని మా బాపు మాత్రం పెద్ద తట్టలో మట్టి మోసేటోడు. రోజు తనే మట్టి తవ్వుడు, తనే తట్టనిండా మట్టి నింపి ఎత్తుకొని నెత్తి మీద పెట్టుకోలేక తన బొచ్చె మీద తట్ట ఆనించి రెండు చేతులతో మోసుకపోయి కట్ట నిర్మాణం చేసేవాడు. అలా చేయడము వల్ల ఆ కట్టపోసుడు అయిపోయేసరికి మా బాపు బొచ్చె (చాతి) మీద ఉండే గుబురు ఎంటికలన్నీ ఊడిపోయినయి.అలా మా బాపు చేసిన ఆ కట్ట నిర్మాణం మాకు పొలానికి నీళ్ళు పారించే కాలువ కమ్ తొవ్వగా పనికి వచ్చింది. అది అయిపోయినంక మొదటిసారి మోటార్ వేసి ఆ కట్ట మద్యలో ఉన్న కాలువ ద్వారా నీళ్ళు పారుతూ ఉంటే,మేమందరము ఆ కాలువలోనే నీళ్ళ ప్రవాహంలో నడుస్తూ పోతూ.., చివరకు ఆ నీళ్ళు పొలము మడిలో చేరినంకా మేమందరం సంభరపడుతుంటే నెత్తి మీది తువ్వాల తీసి గాల్లో దులిపి “సెబ్బాస్…, దీని అవ్వ కట్టమయ్యకునా వారెత్తు ! మనిషి తల్చుకోవాలే కానీ కానిదిఅంటూ ఉంటదా?” అంటూ మా బాపు కళ్ళల్లో కనిపించిన ఆ తృప్తి తాలూకు ధృశ్యం చిన్నమెత్తు కూడా ఇప్పటికీ నా కళ్ల నుండి చెదిరిపోదు. కాళేశ్వరం ప్రాజెక్ట్ లాంటి పెద్ద అధ్భుతాలకి, అంతకు మించిన కష్టము,ఆనందం మాది.

అలాంటివెన్నో పనులు…, మొత్తం జీవితాంతం కష్టపడ్డ మల్లెపూవసొంటి మరకలేని జీవితం బాపుది. బనీను ఐనా అంగీ దోతీ అయినా పండుగలకైనా బురద పనికైనా బాపు ఎప్పుడు తెల్ల మల్లెపూవసొంటి బట్టలే వేసుకుంటాడు.తెలుపు బాపు డ్రెస్ కోడ్. బహుశ అది వ్యవసాయము చేసే కొన్ని కులాలకి ప్రత్యేకమైన విషయమేమో!

బాపు పెద్ద ఎత్తు మనిషి కాదు. పొట్టి మనిషి కూడా కాదు. ఖచ్చితంగా చెప్పాలంటే మనలాంటి వారి భాషలో, మనసులో ఏదున్న అనగలిగే స్వేచ్చ కలిగిన ఊల్లోని ఆధిపత్య కులాల భాషలో చెప్పాలంటే పొట్టోడే. కానీ ఊల్లోని మా అవ్వ లాంటి నిత్యం జాగర్తగా బతికే, చిన్నమెత్తు మాట జారనీ, భాషకొక సౌందర్యాన్నిచ్చే,సాత్వికతనిచ్చే, సరళ పదాలు వాడే, పలుకు పలుకులో నాలుక దంతాలు తాకుతూ పెదాలు విచ్చుతూ ముఖమంతా చాటంతా వెడల్పు చేసుకొని ఎదుటి వారిలోని సమస్త దుర్మార్గపు చూపులని ఆదిలోనే చల్లపరిచే, ఆధిపత్యపు, అహంకారపు మూర్ఖపు ఆహార్యాన్నిఆదిలోనే గుర్తించినట్లు చేసి తుంచివేసే, ఫ్యూడల్ మనుషులలో తిష్టా వేసి పొంగువారే మహా చెడ్డతనాన్నంతా మెల్లగా తగ్గించే భాషలో చెప్పాలంటే.., శ్రమజీవుల భాషలో చెప్పాలంటే.., ఇంకా చెప్పాలంటే మాల మాదిగ అవ్వల భాషలో చెప్పాలంటే – మా బాపు ”గోంత కుర్సగనే“ ఉంటాడు.

అతని అడుగు బలంగా పడేది. అతని మాట ఘనంగా ఉండేది. అతని చూపు టార్చ్ లైట్ లా ఉండేది. అంతా కష్టం చేసి తానం చేసిన తర్వాత తన శరీరం చూడాలి. మంచు గడ్డ మీద నీళ్ళు పోసినట్లే, పారినట్లే. మనం చూసే బాడీ బిల్డర్స్ లా కాకుండా సహజమైన సిక్స్ ప్యాకులా ఉండేది. ఎక్కడ వెతుకుదామన్న కొవ్వు తాలూకు ఆనవాలు ఉండకపోయేది. ఆయన శరీరం నుండి వచ్చే ఆ ఆరోగ్యకరమైన వాసనని మేము తన తువ్వాలని మొఖానికి తుడ్సుకునేటప్పుడు అనుభవించేది.

ఎంతటి ఆరోగ్యకరమైన మనిషి? కటుక్కున పెద్ద పెద్ద తాళ్లని సైతం ఒక్క కాటుతో కత్తిరించగల వేప పుల్ల,ఉత్తరేణి పుల్లలతో తోమే గట్టి తెల్లని పళ్ళు. తన అరచేతిలోనే ఇంకో అరచేతితో నలిసి పిరికెడు వడ్లని క్షణములో బియ్యము చేసేవాడు. రెండు ఎల్లిగడ్డలని దోసిట్లో నశము చేసెటోడు నీసు కూర కోసము. వరి మెదని, వడ్లని, గడ్డిని, పెంటని ఎడ్ల బండి మీద జారగొట్టేటప్పుడు మడిమడికి అడ్డమచ్చే ఒడ్లని (ఒడ్డు)ని తన మడమ పాదం (చీలమండలం)తోని తన్ని పడకొట్టేవాడు. ఎన్నడూ దువ్వెనకి పూర్తిగా వంగని నిటారు తల వెంట్రుకలు. డెబ్బై ఏండ్ల దాకా ఒక్క ఎంటుక కూడా ఊడని, నడువని(తెలుపు కాని) తల, గడ్డం మీసాలు. కట్టెలసొంటి చేతివేళ్లు. పశువుల కట్టేసే కట్టుగొయ్య మొట్లసొంటి మోకాలు కింది పిక్కలు. చపాతి కోసం పిసికి పిసికి చరిసి చరిసి డబ్బాలో వేసిన సాగిన పిండసొంటి దండచేతులు. అదిగో.., అటువంటి గట్టి మనిషికి పుట్టిన వాడిని నేను. అటువంటి మట్టి మనిషి పెంపకములో పెరిగినవాడిని నేను.

అంతే కాదు. అధ్భుతమైన ప్రేమగల్ల మనిషి తను. తనకెప్పుడూ తిండి మీద ధ్యాస ఉండేది కాదు. ఎప్పుడైనా చికెన్ మటన్ లేదా ఎగ్ కూర వండినా కానీ తినేటప్పుడు తన పల్లెములోని ముక్కలు తీసి లేదా గుడ్డుని తీసి మాకు వేసేవాడు ఎదిగేటోల్లమని “తిను బిడ్డా!” అనుకుంటూ.

ఏదైనా ప్రభోజనానికి పోతే అక్కడ లడ్డు కార జిలేబి లాంటిదేదైనపెడితే తువ్వాలలో ముడేసుకోని తెచ్చి మాకు ఇచ్చేటోడు. ఏదైనా ఊరికి పోతే నన్ను జబ్బ మీద కూసుండవెట్టుకొని నడిసెటోడు ఎంత దూరమైనా. ఎవ్సమ్ పని లేకుంటే, బదలో లెదా కైకిలి కింద ఎవరికి పోవుడు లేకుంటే ఇంటి సదిరే పనులు పెట్టుకునేటోడు. కొబ్బరి బూరుతోని,కోసిన మందు (ఎరువు) బత్తాలతోని తాళ్ళు పేనేటోడు. మంచాలకు నులక అల్లడము, నవారు అల్లడము, ఇంటి తలుపులకో దర్వాజలకో విరిగిపోయిన, పలిగిపోయిన కాడ పేడులు కొట్టడం, ఎడ్ల బండి సదురడము, పొయిల కట్టెల కోసం చెట్లెక్కి కొమ్మలు కొట్టడము, దడి కట్టడము, గొడ్డు గోదకి తానం పొయ్యడం, అలంకారం చెయ్యడం…,

బాపు చాలా ఇగురం గల్ల మనిషి. ఏ ఒక్క చిన్న ఇసిరే ని కూడా అట్టిగా పోనిచ్చెటోడు కాదు. చెత్త చెదారం తప్ప ఏ వస్తువు దాని కాలం అయిపోయి గాని, ఖరాబ్ అయిపోయి గాని మా పెంట కుప్పలోకి చేరిన వస్తువుని నేను చూడలేదు. కాలు కింది తొక్కుడు బండని కూడా తను వీలైనపుడు బురద మట్టితో చిన్న రాళ్ళతో సరిగా ఉంచేవాడు. మా పొలము నుండి వచ్చే తొవ్వని వచ్చిపోయే వాళ్ళకోసం ఎప్పుడూ సిత్తడి లేకుండా,పొదలు లేకుండా ముండ్లు లేకుండా ఉంచేవాడూ. చివరకు మా ఇంట్లో ఎవరి చెప్పులు తెగినా కూడా బాపునే వాటిని తీగెతోని సరిచేసెటోడు. అసలు ఏ రోజన్న పని లేకుంటే ఆ రోజు అంతా పిచ్చిలేసినట్లవుతాంది అనేవాడు. అట్టిగా తిని ఊరుకుంటే కడుపంతా ఉబ్బరపోసినట్లు అవుతాంది అనేటోడు. అందుకే ఏదో ఒకపని ముందటేసుకొని చేసేటోడు. అసలు మనిషి పని చేయకుండా,పని లేకుండా ఉండడమంటే ఏదో పాపము చేసినోనిలాగా ఫీలయ్యేవాడు. పని చేయనిది కడుపులకు ఎట్లా వస్తాది? అట్టిగా ఎట్లా తినుడు అని బాధపడేవాడు.

పని అంటే తనకి చాలా ఇష్టమని కాదు. పని చేయడము మనిషి సహజ లక్షణం అని నమ్మే, భావించే,ఆచరించే మనిషి అతను. నిజాం,హైదారాబాద్ స్టేట్ లో చదివిన ఐదో తరగతి చదువుకి ఎప్పుడన్న ఎక్కడైనా చిన్న పుస్తకం దొరికిన, పెండలో పెంటలో పేపర్ ముక్క దొరికిన తీసి పూర్తిగా చదవకుండా వదిలిపెట్టెటోడు కాదు. దానిని దాసేటోడు.

కాలక్రమములో మేము ఎదిగినము. మా అన్న తన పెళ్లి అయిన నుండి వ్యవసాయముతో పాటు ఫోటో స్టూడియో, వీడియో గ్రాఫర్ గా, ట్రాక్టర్, హార్వెస్టర్స్,కరీంనగర్ లో భూమి కొని అమ్ముడు…, రకరకాల పనుల ద్వారా ఇప్పుడు తను వాహనాలకి ఒక డ్రైవర్, పొలము పనులకి ఒక పాలేరుతో పని చేసుకునే స్థాయికి ఎదిగిండు. నేను మొదట్లో టీచర్ నౌకరీ చేసి అందులోకెళ్లి మళ్ళీ గ్రూప్స్ రాసి తహసిల్దార్ గా ఎదిగిన. ఇద్దరము మంచి స్థాయిలో ఉన్నాము. అలాగే మా ఇద్దరు అక్కలు కూడా వ్యవసాయమైనప్పటికి మంచిగానే బతుకుతుండ్రు.

కాబట్టి 70 యేండ్లు దాటినంక మా బాపుని ఎవ్సమ్ బంజేయమన్నాము. ఎందుకంటే ఎక్కడన్న ఒడ్డు మీడికెళ్లి పడినా, పొలములో పురుగుబుసి పామో తేలో కుట్టి, కరెంట్ షాక్ లేదా ఇంకేదైనా జరిగి ఆయనకేమన్నా అయితే అందరూ మమ్మల్ని తిడుతరని భయం. దుబ్బులోన్ని పిలిచి పెద్దేవున్ని కొలిచి గొర్రెపోతుని కోసి మా అందరిని పిలిచిండు. తెల్లకల్లు తాగుకుంటా బొక్క కూర గుడాలు బుక్కూకుంటూ –

“బాపూ! రేపు నీకేమన్నా ఐతే లోకం నవ్వుతది మమ్ముల్ని చూసి. మా ఇజ్జతి పోతది.నువ్వు ఈ పంట లాస్ట్ ఇగ బంజెయ్యాలే నీ ఎవ్సము“ అని అన్నాము.

కానీ ఆయన ఒప్పుకోలే. పని బందు చేయలేదు.

మా బాపు అడిగేది ఒక్కటే బేసిక్ ప్రశ్న “పని చేయనిది కడుపులకి తిండి ఎట్లా వస్తాది?“ అలా ఆయన అన్నప్పుడల్లా నాకైతే తిక్కరేగుతది ఒక్కోసారి. మమ్మల్నేదో దొంగల్ని చేశి మాట్లాడినట్లు అన్పిస్తది.

ఆయన ఇంకా ఇలా అంటాడు. “మనిషి రోజు ఏదన్నా సార్గం చేయకుండా, సారెడన్న చెమటడపకుండా తింటున్నవంటే అది మంది కట్టంతోని తయారైన తిండి తింటున్నట్లే లెక్కా. ఒక్క పూట కసికెడన్న చెమట కారనిది నాకైతే పెయ్యి అంతా ములముల పెడుతది. రాత్రి అంతా నిద్ర పట్టక పొద్దందాకా కాళ్ళు రెక్కలు గుంజుతాయి. మనసున మనసు పట్టదు. చెమటడిపి కట్టం చేయకుంటే ఈ అన్నం,కూర,ఈ బట్ట ఈ నీడనిచ్చే ఇల్లు చల్లగా గాలినిచ్చే ఈ ఫ్యాన్, వెలుగిచ్చే ఈ కరెంట్ అంతా అట్టిగానే గాల్లోకెళ్లి పుడుతుందా? ఎవడో ఒకడు కట్టపడితేనే తయారైతది కదా ? అట్లా బతుకుడు నాతోనైతే కాదు. నిజమే నాకు పూర్తిగా సాతకానప్పుడు,అప్పుడు నాకు కూసుండపెట్టి మీరు తిండి పెడుతరా లేదా అనేది మీ దయ ధర్మం.నేను మిమ్ముల్ని సాది పెద్ద జేసినందుకు మీ బుద్ది, మీ మంచితనం. అంతే కానీ సాతనైనప్పుడు నన్ను కూసుండి తినమని నన్ను ఐతే ఆ పాపములో పడెయ్యకుండ్రి.“

అలా బాపు తన ఎవ్సము గాని పని గాని బందు చేయలేదు. పైగా ప్రతి రెండు మూడు నెలలకొక్కసారి, లేదా పండుగలకు మా కుటుంబం అందరినీ పిలిపించి పండుగలా ఇంతా ఏదైనా యాటని కోసి కళ్ళు తెప్పించి ఉంటే ఒకటో రెండో డబ్బులు ఇచ్చి అందరినీ సంతోషంగా పంపిస్తాడు.మా అందరి పిల్లలకేమైనా కొనిస్తాడు. డబ్బులిస్తాడు. అట్లానే తన తోడబుట్టిన అక్కచెల్లెండ్లని,సుట్టాలని ఊళ్ళో సాయేతని దోస్తులని కూడా. మా ఇంటి దగ్గరి పోద్దాడు కళ్ళు పారినన్ని రోజులు మునుపు రోజో సోపతిని పిల్సుకోని తాగేటోడు సాయంత్రం పూట. ఎప్పుడూ ఒంటరి జీవితాన్ని అతడు ఇష్టపడలేదు.

            *************

కానీ క్రమక్రమంగా బాపు శ్రమకి దూరము అయిపోయిండు. మనుషులకి,మానవ సంబంధాలకి దూరం అయిపోయిండు. తనకున్న మూడెకరాలలో వరి మొక్క జొన్నవేరుశెనగ నుండి అన్నీ రకాల పంటలు పండించే బాపుకి క్రమ క్రమంగా ఎవ్సములో పంటలన్నీ పోయి వరి పంటే మిగిలింది. ప్రతి పని మిషనుతో నడువడం మొదలు కావడముతో తనకున్న ఎడ్లు మరియు కచ్చురంతోనేమి పని అని వాటిని అటకెక్కియ్యాల్సి వచ్చింది. అమ్మేయాల్సి వచ్చింది. తను ఎక్కడ ఉన్న రోజు అంతా పొద్దుగాల నుండి రాత్రి వరకు కుడుము అంటే పండుగ అన్నట్లు ఎప్పుడూ పది మంది మద్య ఉండేవాడు. ఇంకా ఇప్పటికీ అదృష్టవశాత్తు ఒక్క నాటు మిషన్ సక్సెస్ కాకపోవడం వల్ల ఆ ఒక్కరోజే బాపుకి ఓ పది మంది మనుషులు కనిపిస్తారు తప్ప మిగతా రోజుల్లో ఎవరి అవసరము లేదు. పది మంది కలుపుతీత కూడా ఇప్పుడు ఒక్క రోజు ఒక్క పూట ఒక్క మనిషి డబ్బా భుజాలాకేసుకొని మందు కొడితే అయిపాయే. దున్నుడైనా,కోతలైన అంతే మిషన్ చేస్తాంటే మనిసొక్కడు ఒంటరిగా మా బాపు ఉట్టిగా నిలబడి చూసుడే. మాల మాదిగ సాకలి మంగలి కమ్మరి కుమ్మరి తెనుగు…, ’ ఆ సమస్త మనుషులు చేసే పనిని ఆ మిషనులు చేస్తున్నయి.ఆ కూలీలకు చెందాలిసిన ఆ శ్రమ ఫలితం మొత్తం డబ్బులు ఆ మిషన్ యజమానికి ముడుతున్నయి. బాపు అపుడపుడు హార్వెస్టర్లు వచ్చిన కొత్తలో ఈ మిషినులకి ఎవడన్న గింత అగ్గిపెడుతలేదురా అనెటోడు. కానీ తర్వాత రోజుల్లో మా స్వంత అన్ననే హార్వెస్టర్ మిషన్ కొన్నాడు.

మా ఊరి అన్నీ వృత్తి కులాల వాళ్ళలో, కూలీలలో ఒక్కొక్కరు చనిపోయినారనీ,ఊళ్ళో నుంచి వెళ్ళిపోయినారని, వాళ్ళ జాడే తెలియదని ఆ మనుషులని గుర్తు చేసుకొని ఒక్కోసారి బాధపడుతాడు. ఊరు సగము ఖాళీ అయింది. మహా అధ్భుతమైన ఆ నాగరిక చారిత్రక మనుషులు వాళ్ళ చేతులతో నిర్మించిన వారి ఇండ్ల మట్టి గోడలు కూలిపోయి ఉన్నాయి. ఆ జాగల్లో చెట్లు మొలిసినయి. పాత కూలిన ఇండ్ల వలె వాళ్ళ వాళ్ళ గురించిన ముచ్చట వస్తే – గట్టిగా సరాయించి,కాండ్రకించి ఊంచి “ఏడ నాశడమైపోయిండ్రో…“ అంటాడు బాపు నిర్వేదముతో, బాధతో.

తన కంటే చాలా చిన్న వాళ్ళు తన ముందు పుట్టి పెరిగిన వాళ్ళు అందరూ సచ్చిపోయిండ్రు. మచ్చుకు తనకు ఎంతో దగ్గరైన తెనుగు (ముధిరాజ్ ) కుటుంబం ఒక్క కొలిపాకొల్ల ఇంట్లోనే పెద్ద కొడుకు తన కంటే ఇరవై ఏండ్లు చిన్న కొలిపాక రాజయ్య,రాజయ్య పెండ్లాము, వాళ్ళ నలుగురు కొడుకులు,బిడ్డా అందరూ చనిపోయిండ్రు. ఒక కొడుకు మాత్రమే ఏదో ఊరికాడా బ్రతుకుతున్నట్లు రెండేండ్ల కిందటి ముచ్చట. మిగతోల్లు అందరూ సచ్చిపోయిండ్రు. రాజయ్య తమ్ముడు రెండోవాడు లింగడు,మూడోవాడు రాజయ్య అందరూ సచ్చిపోయిండ్రు. అట్లా తనకు తన పుట్టుకతో తెలిసిన పెద్దవాళ్లే కాకుండా తన దగ్గరి వయసోళ్ళు పది ఇరవై ఏండ్లు చిన్నోల్ల తరం కూడా ఇత్తుకు లేకుండా పోయిండ్రు వాడ పొంట. తనేదన్న పని చేద్దామంటే ఇంటి దగ్గర కూడా పని లేదు. మా బాపు వాళ్ళ నాయిన్న, మా తాత రేపు సచ్చిపోతాడు అనే రోజు ముందు దాకా రోజు పొద్దుగాల లేచి మా ఎడ్ల బర్ల కొట్టం శుభ్రంగా ఊడ్చేవాడు. వాటికి గడ్డాము నుండి ఎండుగడ్డి పీకి వేసేటోడు. కుడిది పెట్టేటోడు. నీళ్ళు పోసేటోడు. పొద్దుగూకంగా పొలము కాడికెళ్లి పచ్చిగడ్డి కోసుకొని తనకి సాతనైనంతా మోసుకొచ్చేటోడు. ప్రస్తుత పరిస్థితులు మా కుటుంబాల దూరము మా నిరుత్సాహపరిచే గుణం ఇవన్నీ కలిసి మా బాపు అటువంటి చిన్న చిన్న పనులకి కూడా దూరము అయిండు. ఈ మధ్య కొంత కాలంగా బాపు అసలు మనుషులతోని మాట్లాడిందే తక్కువ. శ్రమ చేసే మనిషికి, శ్రమతో కూడిన బ్రతుకులకి,శ్రమ సంబంధాలలో మాత్రమే కష్టం సుఖం రకరకాల అనుభవాలు ఉంటాయి. వాటి తాలూకు భావోద్వేగాలు ఉంటాయి. ఇప్పుడు ఆ సంబంధాలు మాత్రమే కాదు ఆ జ్ఞాపకాలు కూడా కరువైనాయి పంచుకునే మనుషులు లేక. దాదాపు పాతబడిపోయి స్మృతిపథములో నుండి మాయమైపోయినాయి. ఏ కొద్దిపాటి మా కుటుంబ సభ్యుల కలయిక ఐనా ఆ సమయములో కష్టము సుఖము మానవ సంబంధాల పరిమళం లేని మా మాట ముచ్చట,మా మొబైల్స్ తో జీవితం అతనిని మరింతా గందరగోళములో పడేసినయి. శ్రమతో,మనుషులతో, భావోద్వేగాలతో దూరమైన మనిషి –బాపు ఏ పలుకు, ఏ వ్యక్తీకరణ లేని మిషన్ లాగా అయిపోయిండు. నడక స్లో అయింది. ప్రతి ముచ్చటకి వక్కడ వక్కడ నవ్వే ఆ మనిషి నవ్వు మాయమైంది. బావిలో చిన్న కోడిపిల్ల పడితే కూడా ఎంత శ్రమనైనా తీస్కోని బొక్కెనేసి అవసరమైతే బావిలోపలికి దిగి దానిని కాపాడే మనిషిలోని ఆ నెనరు, బాధ మాయమైంది. అసలు మా బాపుకి ముసలితనం వస్తదా అనే అనుమానము ఉండేది మాకు.

కానీ బాపెందుకో గుంభనమైపోయిండు ఈ నడుమ. వయసు పెరుగుతుంది కాబట్టి వయసు మీద పడి అనారోగ్యం అనుకున్నాము కానీ బండసొంటి తనకి తనలో ఏదో జరుగుతుందనే విషయాన్ని మేము గుర్తించలేకపోయాము. బాపు తనెప్పుడైతే పనికి దూరమయిండో, అతను మిగతా మనుషులకి సమాజానికి దూరమైపోయిoడు. శ్రమలో,శ్రమ సంబంధాలలో ఉండే కష్టము సుఖము హాస్యం మాట పాట సకల కళలకి తన బ్రతుకు దూరమైంది.తానొక యంత్రమైపోయిండు. ఆ యాంత్రిక జీవన శైలిని ఆ హృదయం తట్టుకోలేకపోయింది. ఆ మేధస్సు ఇమడలేకపోయింది.

ఇవన్నీ పార్కింసన్స్ అనే ఒక వ్యాది లక్షణాలు అని డాక్టర్ కి చూపిస్తే కాని మాకు తెలిసి రాలేదు. బాపుకి ఈ మద్య ఆపరేషన్ జరిగింది. పార్కిన్షన్ కి డాక్టర్ కారణం చెప్పిండు. తన జీవిత కాలములో స్థాయికి మించి శ్రమ చేయడము వల్ల అప్పుడు నరాలమీద కలిగిన ఒత్తిడి ఒక కారణం మరియు కొంత కాలంగా ఇప్పుడు శ్రమకు, ఆలోచనలకు మనుషులకు దూరం కావడం, మెదడు కి ఆలోచించే పని లేకపోవడం ఒక కారణం అని చెప్పిండు. ఈ ప్రపంచములో పని చేస్తే , వాడితే -తరిగిపోకుండా నిలిచి ఉండే మరియు మరింతా ప్రతిభావంతంగా మారేది మరియు వాడకుంటే తరిగిపోయే ఏకైక పధార్థం మానవ మెదడు మాత్రమే అని డాక్టర్ నాకు చెప్పిండు. బహుశా మనిషి కూడా అంతేనేమో.

శ్రమ సంభంధాలతో ఉండే మనిషి మాత్రమే మనిషిగా నిలబడుతాడు లేకుంటే కూలిపోతాడు.

మా బాపు ఎటువంటి అద్భుతమైన జీవితానికి దూరం అయిండు. ఎంతటి హేతుబద్దమైన, మానవీయత సృజనాత్మకత కల బ్రతుకుకి దూరమైండు! ఇప్పుడు అతని మెదడుకి పనే లేదు. మనుషులతో కలయిక లేదు. అతను పనికి దూరము అవుతుండూ గత కొద్ది రోజులుగా. మనిషి ఎటు తిరిగేది లేదు. ఎప్పుడైతే మనిషి పనికి దూరమైండో మిగతా సమాజముతో తనకి బంధాలు తెగిపోయినవి. బహుశా అందుకే ఈ పరిస్థితి. మొదటి దశలో మందులు వాడినా గాని ఆపరేషన్ తప్పలేదు బాపుకి. ఐతే ఇదేదో పరిష్కారం కాదు. ఒక విరామం మాత్రమే.

మా ఇంటికి మంచెర్యాల్ కి తీసుకువస్తే ఒక రెండు రోజులు మంచిగానే ఉంటాడు.మూడో రోజు నుండి మా అవ్వ బాపు ఇద్దరు ఇగ పోతమని సంచి పడుతరు. ఆ ఉన్న రెండు రోజులు కూడా పొద్దున్నే ఎక్కన్నో గురిజూసీ దొరకబట్టుకొని పండ్ల పుల్ల (వేపపుల్ల ) వేసుకొని వాడంతా తిరిగి వస్తడు. అనేకమైన ప్రశ్నలు వేస్తడు.ఆ ప్రశ్నలకి సమాధానము చెప్పే ఓపిక ఉండదు మాకు. వాటికి జవాబులు కూడ మాకు తెలియవు. ఇక ఊళ్ళో ఇంటి దగ్గర మునుపటి ముచ్చట్లు మాయమైనవి. ఆ మునుపటి మనుషులు, మట్టి మనుషులు, అర్వ కట్టం చేసి ఏ పూటది ఆ పూటకి తినే మనుషులు దూరం అయిండ్రు. మాయమైండ్రు. ఇప్పటి మనుషులు ఆయనతో పంచుకునేదేమీ లేదు. టీవీ చూస్తే ఆయనకేం అర్థం కాదు. చూడడు. కష్టాలు ఎల్లవోసినోళ్ళకి మనుషుల బాధలు చూస్తే ఎమోషన్ ఆవుతారు. అవి తెలియని వాళ్ళకి ఎదుటోల్ల కష్టాలు కూడా నవ్వులాట లాగానే ఉంటాయి. అందుకే జబర్ధస్ట్ లాంటి ప్రోగ్రామ్స్ కి నవ్వుతున్నాము. ఆ పాత కష్ట సుఖపు ముచ్చట్లు ఇప్పటి మనుషులలో పంచుకునే గుణము లేదు. శ్రమైక జీవన సౌందర్యపు, కలిసిమెలిసి పనిజేసి కష్టసుఖాల్లో తన్నుల్లో దెబ్బల్లో నొప్పుల్లో బాధల్లో పంచుకున్న మనుషులు దూరం అయిండ్రు. చనిపోయిండ్రు. మా చిన్నతనములో ఏ పూటది ఆ పూటకి అండుకుని తినే రోజుల్లో, దెంగులకి దెబ్బలకి లొల్లి కొట్లాటల మాల్యెములో కూడా అందరం రాత్రంతా ముచ్చట్లు చెప్పుకుంటూ బ్రతికేది. ఆ ముచ్చట్లలో నవ్వులు, ఏడ్పులు అన్నీ ఉండేవి.

బాపు ఎవలితోనైనా మాట్లాడినంక వాళ్ళని లబ్బరు బొమ్మల లెక్క, లట్టగువ్వల లెక్క, గుడపిత్తుల లెక్క ఉన్నరు మనుషులు అని పోలూస్తాడు. ఏమైనా ఆశ ఉందా మనిషిలో అని వాళ్ళని చూసి ఆవేధన చెందుతాడు.

అటువంటి బాపుని ఈ మద్య ఒకటి రెండు రోజులుంచుకుందామని మా ఇంటికి మంచెర్యాల్ కి తీసుకొచ్చిన. బాపుకి పార్కింసన్స్ తో వెన్నెముకకి భాగములో చేసిన ఆపరేషన్ కి ముందు టెస్ట్ చేస్తే ఈ ఎనబై ఏండ్ల వయసులో కూడా బీపీ సుగర్ లేవు.

కానీ ఆ మద్య జ్వరం వస్తే డాక్టర్ నాకు బీపీ ఉందని చెప్పిండు డాక్టర్. కారణం మళ్ళీ అదే శరీరానికి మినిమమ్ హార్ద్వర్క్ లేని కూర్చొని చేసే నౌకరీ, టెన్షన్స్ అని చెప్పిండూ. నలబై ఏండ్లు నిండక ముందే ఈ రోజు బీపీ రేపు సుగర్. చాలా పెద్ద తాత్వికతలోకి వెళ్ళిపోయినాయి నా ఆలోచనలు.

శ్రమకి దూరమై, ఆ సౌందర్యాత్మక జీవనానికి దూరమై, చదువుకొని ఈ దోపిడి వ్యవస్థలో మిడిల్ మ్యాన్ గా ఉద్యోగం సంపాదించి ఈ పదేళ్ళ నా సుఖ (?) జీవనములో నేనేమీ కోల్పోయినానో నాకు అర్థమైంది.

నేను రోజు వాకింగ్ చేస్తున్నాను. నాకే గిట్ల ఐతే నా కొడుకు బిడ్డల నా గురించి మాత్రమే కాదు రేపటి నా పిల్లల బ్రతుకేంది అని నాలో అంతర్మథనం మొదలైంది.బాగా రంధిల పడ్డ. పిల్లలు ఇంట్లో పనులల్లో వాళ్ళ అమ్మకి సహాయపడుతారు.కానీ ఊర్లోకి తీసుకుపోయిన. ఊళ్ళో వ్యవసాయం పని చేయించిన. కానీ ఎన్ని రోజులు ఉంచుతా ఊరిలో! “ఈ కిషన్న కి ఏమన్నా పిస్సనా? బడి పోగొట్టి పిల్లలు గీ ఊల్లే పనులకి పంపిత్తండు“ అన్నరు అందరూ.అసలు పిచ్చోళ్ళు వాళ్ళు అని నేను అనుకున్న. కానీ ఎవరైనా నా మాట ఒప్పుకుంటారా? అలా నేను వాకింగ్ కి వెళ్తూ పదహారేళ్ళ నా కొడుకుని కూడా తీసుకపోయిన రాముని చెరువు కట్టకి. నా బార్య కూడా నాలుగెండ్ల కింద నుండే వాకింగ్ చేస్తుంది. ఈ మద్య యోగా కోర్సులో డిప్లొమా చేసి ఇంట్లోనే యోగా చేస్కుంటుంది. మా బిడ్డ చిన్నది పదమూదేండ్లు కాబట్టి ఎప్పుడైనా తీసుకెళ్తా వాకింగ్ కి.

ఐతే ఆ రోజు బాపుకి ఇంట్లో బోర్ కొడుతుందని,మళ్ళా రెండు రోజులకే ఇంటికి,మా ఊరికి పోతనని జాడ తీసిండు. నేను అతన్ని ఎలాగైనా కొంచెం ఆపాలని పొద్దున్నే లేపి కారులో రాముని చెరువుకి తీసుకుపోయిన. వెంబడి నా కొడుకు కూడా వచ్చిండు.

రాముని చెరువు పార్కులో వందలాది మంది నడుస్తున్నారు. బాపుని బెంచ్ మీద కూసోబెట్టిన.

బాపు వాళ్లందరిని తీక్షణంగా చూస్తుండు. బాపుకి దగ్గరగా చాలా మంది వాకింగ్ చేస్తూ దగ్గరగా దూరము వెళ్తున్నారు. కొందరు అక్కడే ఆగి వామప్ చేస్తున్నారు. యోగా ఆసనాలు వేస్తున్నారు. ఓపెన్ జిమ్ లోఐటెమ్స్ అణ్ణి చేస్తున్నారు. బాపు వాళ్లందరిని మంచిగానే అబ్జర్వ్ చేస్తుండు. నేను వాకింగ్ లో ఒక్కో రౌండ్ కి దగ్గరగా వస్తూ హమ్మయ్య మంచిగా ఉన్నాడు అని సంభరపడిన. కార్ లో వస్తుంటే బాపులో ఏదో తెలియని గాంభీర్యత చోటు చేసుకుంది.

చాయే తాగినంక “అంత మంది ఏం సేత్తార్రు బిడ్డా!” అని అడిగిండు తాపీగా. నాకు చిర్రెత్తుకొచ్చింది. కోపముతో “తిన్నది అరుగకా అందరూ నడుస్తార్రు. ఎక్షర్సైజు చేస్తార్రు“.

“నీ అవ్వ నువ్వు రాను రాను సిత్రమైన మనిషివి తయారవుతున్నావు. అవ్వ అందుకనే అంటుంది నీతోని దానికి వశపడుతలేదనీ…“

“లేదు బిడ్డా! నిజంగానే నాకంతా సిత్తుబొత్తైంది. పోయేటపుడు తొవ్వపొంట కూడా చూసిన కదా. గంత వందల వేల మంది ఉట్టిగనే మబ్బుల పూట నడుత్తార్రు. ఉరుకుతార్రు. పెయ్యంతా ఇరుత్తార్రు. కట్టంగా పిత్తుతార్రు. నీ అక్క ఇదేందిరో!“ మనిషి నోరు తెరిసి రెండు సేతులు దగ్గర అనుకోని గాల్లోకి చూస్తాండు.

“ఎవడన్న సూత్తే నవ్వుతరు. పిచ్చి లేసినోళ్ల లెక్క ఉత్తగా నడ్సుడేంది? ఆ ఉరుకుడేంది? ఇక్కడ ఎవనికి పని పాట లేదా? లేనిది ఈ ఊరగల్ల జనమంతా ఎట్లా బతుకుతార్రు? వీళ్ళకు తిండి ఎక్కడ నుండి వస్తుంది?

ఏమో బిడ్డా,నాకైతే ఏం అర్థం ఐతలేదు. మీకు ఎట్లా సయించుతుందోకానీ..,“

“ఓ అవ్వా! ఓ ఓ ఓ…,“

నెత్తి నోరు కొట్టుకుంటూ “గంత మంది ఉత్తగనే మబ్బుల మబ్బుల తిన్నదరుగక నడుత్తంటే ఎవ్వడు ఏం అనేటోడు లేకుంటే ఇది అడవా,అన్నాలమా? సర్కారోడు ఏం జేత్తండు సూస్కుంట?“ తనకు తానే.

“అరె బాపు! నీకు తెల్వదు. ఇప్పుడు లోకము మీద ఏం నడుత్తుందనేది.మీరంటే మొద్దు కట్టం, చేసి బతికిండ్రు. అందుకని మీకేము రోగాలు రాలే. ఈ కాలాన మాకు ఆ కట్టం ఎక్కడిది? నాకే సూడలేవు ఈడికి పదిగేను ఏండ్లు దాటినాయి.ఇటున్న పుల్ల తీసి అటేసిందిలేదు. నా లెక్కనే ఈ మంచెరాల అంతటా మూడు వంతుల మనుషులుంటారు.”

“మరి ఏ కట్టం జేయంది ఇంత మందికి తిండెట్లా అత్తది?“

“ఎట్లా అత్తది అంటే. మేం ఎందుకు జేత్తమ్. చేసెటోడు చేస్తడు. మేమేమన్న అట్టిగా ఉంటున్నమా? మేం చేసే పని మేం సేత్తన్నం. ఊళ్ళో నువ్వు అవ్వ అన్న అక్క సేత్తార్రు కదా! మీరు పంట పండిస్తరు. ఇక్కడ కూలోల్లు ఇండ్లు కడుతరు.కడుగుతరు.ఊడుత్తరు. బట్టలు పిండుతరు. అన్నీ సేత్తరు.”

“ఐతే మీరందరు సెమటడవకుండా దోపుకం తిండే తింటార్రు “అన్నాడు బాపు తెచ్చిపెట్టుకున్న నవ్వుతో నేనెక్కడ ఫీల్ అవుతానేమోనని.

బాపుకేం మనసున పట్టలేదు.రేపు పోతా ఇంటికి అన్నాడు.ఒక రోజు అంతా బతిమిలాడినా ఉండమని. అస్సలు ఉండనన్నాడు.సరే రేపు పొద్దుగాల డ్రైవరు ని ఇచ్చి లేదా నేనే ఇంటికాడ దించి వస్తా అన్న.

బాపు “ఎందుకులే దానికి కార్ ఎందుకు బిడ్డా! రైలెక్కియ్యి ఇక్కడ ఆడ దిగుతా“.

పొద్దున్నే అవ్వ బాపుని ఆరింటికి భాగ్యనగర్ ట్రైన్ ఎక్కియ్యడానికి స్టేషన్ కి పోతుంటే – స్టేషన్ చుట్టుపక్కల లానులో, ఓపెన్ ప్లేసులో పండుకున్న వాళ్ళందరూ అప్పుడే లేస్తున్నారు.కొందరు ప్లాట్ఫారమ్ మీద మొఖాలు కడుక్కుంటుండ్రు.మరి కొందరు ప్లాట్ ఫార్మ్ ని అనుకుని ఉన్న ఇవతలి దిక్కు నల్లాల దగ్గర స్నానాలు చేస్తుండ్రు.నిజానికి అంతకు మునుపు వాళ్ళు అంత మంది ఉండేవారు కాదు. శ్రీపాద యెల్లంపల్లి ప్రాజెక్ట్ కింద, ఓపెన్ కాస్ట్ మైన్సు కింద ఊళ్ళు, భూములు కోల్పోయిన ప్రజలు,చేతి వృత్తి కులాల వాళ్ళలో చాలా మంది హైదారాబాద్, దుబాయి వేరే దిక్కు పోంగా మిగిలినవారు. ఈ మద్య మంచిర్యాల పట్టణముపై వీరి ఒత్తిడి పెరిగింది.

బాపుని కార్ ఆపి దిగమన్నాను.దిగినంకా లోపలికి వెళ్తుంటే బాపు ఆగుతూ వాళ్లందరిని చూస్తుండు. అదో పెద్ద జాతరలా ఉంది.కోలాహలం

.”వీళ్ళందరూ ఎవలు? బిచ్చగాళ్ల?“ బాపు.

“కాదు. బిచ్చగాళ్ళు అటు దూరంగా ఉంటారు.వీళ్ళు కూలీలు. నువ్వన్నావు కదా! ఏం కట్టం చేయకుండా మేమందరం ఎట్లా బతుకుతున్నామని. మాకు తిండి ఎట్లా వస్తుందనీ. వీల్లే ఆ మొద్దు కట్టం చేసే మోటు మనుషులు. కొద్ది సేపట్లో వీళ్ళందరూ తయారై,వీళ్ళసొంటోల్లు వాడలల్లా ఉండేటోల్లు పాత పాడుబడ్డ సింగరేణి కోటర్లల్లో ఉండేటోల్లు,దగ్గరపట్ల ఊరోళ్ళు అందరూ పోయి లేబర్ అడ్డా దగ్గర జమైతరు. అక్కడ కూడా చాలా పోటీ. కూలి దొరికితే ఆ రోజుకి తిండి. లేదంటే లేదు. ఆ లేబర్ అడ్డా దగ్గర కనీసం తాగడానికి మున్సిపాల్టీ నల్లా ఉండదు. కూలి పోను దూపైతే నీళ్ళ బాటిల్ కొనుక్కొని తాగాలే. సాత కాక కూసుందామంటే ఇంత ఆరామ్ జాగా, బండలో,బెంచులు ఉండవు. ఇక్కడే కాదు దేశమంతా ఇదే ముచ్చట నడుస్తంది.“ కాస్తా కోపంగానే చెప్పిన బాపుకి.

బాపు ముఖమంతా ధుఖ్ఖసిల్లినట్లై౦ది.

ప్లాట్ ఫార్మ్ వైపు అడుగులు భారంగా కదిలినాయి.నాకెందుకో వాళ్ళని రైల్లో కూసోబెట్టి టాటా చెప్పే దైర్యం లేదు. కానీ ఉండాల్సి వచ్చింది.

         *************************************

2020 మార్చ్ నాటికి కరోన వ్యాధి లక్షణాలతో భారత దేశములో కొందరు భాధపడుతున్నట్లు ఆరోగ్య పరీక్షల్లో తేలింది. ఈ వ్యాధి గాలి ద్వారా కనీసం మీటర్ దూరం ఉన్న వ్యక్తుల మద్య, తాకిడి వల్ల వస్తుందనీ భారత ప్రభుత్వం లాక్ డవున్ ని ప్రకటించింది. ప్రజలు ఎవ్వరూ కూడా వాళ్ళ ఇండ్లళ్ళకెళ్లి బయటకి రాకూడదు. రాష్ట్ర ప్రభుత్వం రేషన్ పొందే ప్రతి కుటుంబానికి ఐదు వందల రూపాయలు మరియు బియ్యం ప్రకటించింది. ఐతే మొదటి వారములోనే ఈ లెక్కల్లోకి రాని వేలాది బిచ్చగాళ్ళు దేశమంతా ఆకలి చావులకి బలైపోయిండ్రు. కనీసం తాగే నీళ్ళు దొరకక్ వేలాది మంది చనిపోయిండ్రు. లక్షలాది వలస కూలీలు ఎక్కడికక్కడే చిక్కుకుపోయిండ్రు.ఈ వైపరీత్య, సంక్షోభ కాలములో కొన్ని చోట్ల స్వచ్ఛంధ సంఘాలు, సమాజ సేవకులు కలిసి ఈ వలస కూలీలకి ఒక పూటనైనా భోజనం పెట్టే ప్రయత్నం చేసిండ్రు. కానీ అది కేవలం ఉదాహరణకి మాత్రమే చెప్పుకోవచ్చు.

హైదారాబాద్ నగరములో వలస కూలీలు ఏమి తోచక అభాగ్యుల వలే ఒక దగ్గర గుమికూడి వారి వారి స్వంత ఊళ్ళకి పోయే ప్రయత్నం చేసిండ్రు. కానీ అలా బయట తిరగడము, వెళ్ళడం నిషేధం కాబట్టి పోలీసులు వారి వారి విధులు నిర్వహిస్తూ కట్టడి చేసిండ్రు.దిక్కు మొక్కు లేని వేలాది వలస కూలీలు హైదరబాద్ నగరమంతా కాపలా కాయబడ్డ, మర్లేయబడ్డ పశువులు,గొడ్ల వలె ఎండాకాలం వేడికి ఓ వైపు నుండి ఇంకో వైపు కి పరుగెత్తుతూ, వగర్చుతూ తిరగసాగిండ్రు. వారంతా అసంఘటిత కార్మికులు.వారికి సంఘాలు లేవు. గుర్తింపు లేదు. వారికి కనీసం అడిగే గొంతు లేదు. పశువులు కాసే బోయిడి దెబ్బలకి భయపడి దారి మరల్చుకున్న దారి తెన్ను తెలియని గొడ్ల వలె అక్కడికక్కడే అటు ఇటు తిరుగుతున్నారు. పరిగెడుతున్నారు. వారు కనీసం ఒక చోట ఆగి వారికి ఏమి కావాలో అడిగిన, నినధించినా,బైటాయించినా కానీ అదో పెద్ద సంఘటనగా మారుతది. తమ రెక్కల కష్టముతో నిర్మించిన చుట్టూ భవంతులల్లో, ఇండ్లల్లో దర్జాగా నివశిస్తున్న ఇండ్లకేసి నడువాలనే వాటిలో ఆశ్రయం తీసుకోవాలనే ఆలోచన కూడా వారికి లేదు. అంతటి భయంకర పరిస్థితుల్లో, ఏ మార్గం కన్పించని స్థితిలో వారున్నారు. పట్టణం కావడం వల్ల వారికి బయటకు వెళ్ళే మార్గం అంతా సులభంగా దొరకలేదు. కానీ పల్లెటూర్ల నుండి మాత్రం చాలా మంది ఊరవతలి తొవ్వల గుండా, ఊరవతలి రైల్వే ట్రాక్స్ వెంటా నడుస్తూ పోలీసుల కళ్ళు గప్పి వెళ్లసాగిండ్రు.

“పిల్ల జెల్ల ఇంటికాడ ఎట్ల ఉండ్రో…,

నా ముసలి తల్లి ఏమి బెట్టి సాదుతుందో…,

బస్సులొద్దు బండ్లు వద్దు అయ్యా సార్

ఇడ్సిపెడితే నడ్సి నేనూ పోత సార్!”

ఆ సమయం లోనే ఆదేశ్ రవి రాసినటువంటి పాట వారి పరిస్థితికి అద్దం పడుతుంది.

వాళ్ళ బాధలని చూసి దేశమంతా ఏడ్సింది.

ఆలస్యంగానైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. వలస కూలీలకి ఎక్కడికక్కడ తాత్కాలిక షెల్టర్స్ ని ఏర్పాటు చేస్తూ వారికి మనిషికో ఐదు వందల రూపాయలు డబ్బులు ఇస్తూ మనిషికి పది కిలోల బియ్యం లేదా భోజన సదుపాయాలు కల్పించింది. దేశములోనే అలా మొదట నిర్ణయం తీసుకున్న రాష్ట్రం తెలంగాణ. ఈ మాత్రం చర్యకి రాష్ట్ర ముఖ్యమాత్రిని “భరోసా కా బాపు“ అని కొందరు సోషల్ మీడియాలో ప్రశంశలు కురిపించిండ్రు.

అలా మంచిర్యాల జిల్లాలో ఏర్పాటు చేసిన సెంటర్ లలో మందమర్రి మండలం క్యాతన్పల్లి సోషల్ వెల్ఫేర్ హాస్టల్ లో ఏర్పాటు చేసినది ఒకటి. మంచిర్యాల మరియు మందమర్రి మండలాల బార్డర్ ఐన ఎంసీసీ సిమెంట్ ఫ్యాక్టరీ అవతల ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ వద్ద మంచిర్యాల మరియు రామకృష్ణాపూర్ ఎస్సైలు ఇద్దరు కలిసి రోడ్ పై నడిచి వెళ్తున్న కూలీలని వేరు వేరు గ్రూపులుగా దొరకబట్టినారు. అంతకు ముందు నుండే పోలీసుల చేతుల్లో దెబ్బలు పడ్డ అనుభవం ఉన్న ఆ కూలీలు మంచిర్యాల పట్టణం కావడం మరియు పెద్ద మొత్తాన పోలీసులు ఉండడం వల్ల తప్పించుకునే పారిపోయే ప్రయత్నం చేయలేదు. అలా దొరికిన మొత్తం అరవై మంది వలస కూలీలని క్యాతనపల్లి సెంటర్ లో ఉంచినారు. వాళ్ళందరూ ఉత్తర ప్రదేశ్, బీహార్, మహారాష్ట్ర, మధ్య ప్రదేశ్ మరియు ఒడిస్సా రాష్ట్రానికి చెందినవారు. అందరూ 18 ఏండ్ల పైవారే. వారిలో పది మంది ఆడవాళ్ళు. మూడ౦తస్తుల విశాలమైన గదులు ఉన్న హాస్టల్ అది. ప్రతి గదికి ఐదుగురి చొప్పున ఉంచిర్రు వాళ్ళని.

మొదటి పది రోజుల వరకు బాగానే ఉన్న వాళ్ళు ఆ తర్వాత నుండి మేం వెళ్తాం విడిచిబెడితే అని మొదలువెట్టిoడ్రు..ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చేవరకు అలాగే ఉండాలి అని ఆ మండల తహసిల్ధార్ తెలియచేసిండు. వారికి ఆ హాస్టల్ లోని ఇద్దరు వాచ్ మెన్, ఇద్దరు వీయార్ర్వో లు, నల్గురు వీయార్యేలు,ఇద్దరు పోలీసోళ్ళు కావలి మరియు భాధ్యులు. గడియ గడియ ఒక గండం లాగా ఫీల్ అవుతున్నారు వలస కార్మికులు. దేశమంతా లాక్డౌన్ ఉండడముతో వాళ్ళ స్వంత ఊరిలో ఉన్న వారి కుటుంబ సభ్యుల గురించి ఆందోళన ఒక వైపు మరోవైపు జైలు లాంటి జీవితం.

ఏ రోజు కష్టముతో ఆ రోజు పొట్ట పోసుకునేటోల్లు, కటిక నేలమీద పడుకునేటోల్లకి మూడు పూటలా మంచి భోజనం కల్పించిండ్రు. కానీ మనిషి ఇంకో మనిషిని దగ్గరగా కలుసుకోలేని పరిస్తితి. బయటకు పోయి తిరిగిరాలేని పరిస్థితి. వాళ్లందరిని ఏదో ఒక జైల్ లో వేసిన నేరస్తులవలే ఉన్నాయి వారి చూపులు. రాష్ట్రమంతా ఉన్న సెంటర్లన్నింటిలో దాదాపు ఇదే పరిస్థితి. వాళ్ళకోసం టీవీ లు పెట్టినా కానీ వారిని ఎంటర్టైన్మెంట్ చేయలేకపోయాయి. ఖమ్మం జిల్లా కలెక్టర్ తెలివిగా వారిలో కొందరి దగ్గ ఉన్న మొబైల్స్ కి నెట్ కనెక్షన్ కోసం వైఫై ఏర్పాటు చేయించిండు. అది చూసి మిగతా జిల్లాలలో కూడా ప్రారంభమైంది. అలా ఈ క్యాతనపల్లి సెంటర్ లో నెట్ వచ్చినా ఒక రోజు మంచిగానే ఉన్నారు. కానీ సోషల్ మీడియాలో వాళ్ళకో విషయం తెలిసింది. ఎక్కడో రాజస్థాన్ లో ఒక స్కూలులో ఆశ్రయం తీసుకుంటున్న వలస కార్మికులు ఆ స్కూలు కి సున్నం వేసిన విషయం సోషల్ మీడియాలో వైరల్ అయింది. అది చూసిన ఈ సెంటర్ లోని కొందరు ఇంచార్జీని అడిగిండ్రు.

ఊరికే తిని కూసుంటే ఏం మనసున పడుత లేదు.మాకు కూడా రాజస్థాన్ లెక్క ఏదైనా పని అప్పజెప్పమని ఆ సారాంశం. కొందరైతే ఏమీ పని లేకపోయేసరికి సరిగ్గా దొడ్డికి వస్తలేదని చెప్పుకున్నారు. అధికారులు జులాబ్ గోలీలు తెప్పించిండ్రు దొడ్డికి సాపు కోసం.

ఒక రోజు కనీసం ఆ హాస్టల్ చుట్టుపక్కల అంతా చెత్త చెదారం ఐనా ఒక పూట సాపు చేస్తామని అడిగిండ్రు ఆ వలస కార్మికులు. ఆ ఇంచార్జీ తహశీల్దార్ తో మాట్లాడిండు. కానీ తహశీల్దార్ – ప్రయోగాలు చేయబోతే ఏదైనా జరిగితే మన నౌకరికే ప్రమాధo ఉంటదని అస్సలు ఒప్పుకోలేదు.

దాదాపు నెల రోజులు చాలా కష్టంగా ఆ సెంటర్ ని నిర్వహిస్తున్నారు.ఎన్ని సౌకర్యాలు కల్పించినా గాని వలస కార్మికులు వదలిపెట్టమనే గొడవని మానట్లేదు. ఇన్స్పెక్టర్, ఆర్డీఓ,ఏసీపీలు వచ్చి వారి వారి ప్రయత్నాలు చేసిండ్రు.

ఒక రోజు అర్ధ రాత్రి మూడు గంటలకి ముందే వేసుకున్న పథకం ప్రకారం ఇరవై మంది వారి వారి అంగీలు, లుంగీలు,చెద్దర్లు కలిపి ఒక తాడు లాగా మార్చి పై మూడో అంతస్తు నుండి దిగిండ్రు. అది చాలా ప్రమాధకరమైన మరియు సాహసముతో కూడిన పని. అలా దిగేటప్పుడు ఇద్దరు మద్యలోనే ఆ తాడు తెగి కింద పడ్డరు.చాలా దెబ్బలు తాకినయి.అప్పటికీ నాలుగైంది. మిగతా వారు చూసిండ్రు కానీ ఆ రోజుకి దైర్యం చేయలే. పెయి మీద అంగీలు లేనోల్లు కొందరైతే,పాంట్లు, లుంగీలు లేనోల్లు కొందరు దిగి అలాగే మిగిలిపోయిండ్రు. దిగిన వాళ్ళు ఆ శీకట్లో దేశ సరిహద్దుల్లో శత్రువుతో యుద్ధం చేసే సైనికుల్లా రోడ్ పై పాకుతూ, దాక్కుంటూ చీమల బారులా పోతున్నట్లుంది పై నుండి ఆ ధృశ్యము.

పోలీసులు కొడుతారనే భయముతో మిగిలి ఉన్నవారిలో ఒకడు కిందికొచ్చి ఒక గంట తర్వాత వాచ్ మెన్ కి జరిగిన కథ సెప్పిండు. ఇమ్మీడియెట్ గా మొత్తం యంత్రాంగం అప్రమత్తమైంది. రామకృష్ణాపూర్ ఎస్సై మరియు కానిస్టేబుల్సు ఓక వెహిక్ల్ లో తహసిల్దార్ మరియు వీయార్యోలు ఇంకో వెహిక్ల్ లో బయల్దేరిండ్రు. వీయర్యెలు బైక్స్ పై. ఎక్కడికక్కడ చెక్ పోస్టులకి సమాచారం వెల్లిపోయింది.

కర్ఫ్యూ లాంటి ఆ రోజుల్లో, హాస్టల్ దిగి ఆ చీకట్లో రోడ్ కి దూరంగా నక్కుతూ వెళ్ళిన వలస కార్మికులకి బెల్లంపల్లి దగ్గరలో దూరం నుండి వస్తున్న ఒక ట్రాలి కనిపించింది.ఆ ట్రాలి ఆసిఫాబాద్ లో చుట్టాల ఇంటి దగ్గర చనిపోయిన ఒక ముసలావిడ శవముని తెల్లారేసరికే ఎవరు పెద్దగా తీసుకురావడం కోసం వెళ్తుంది. ఆ ట్రాలిని కార్మికులు ఆపి కొంత డబ్బిస్తామని చెప్పి ఎక్కిండ్రు. ఎక్కడ మద్యలో దించినా సరేనని వారి ఒప్పందం. అటువంటి ఆ ట్రాలి ఒక కిలోమీటర్ దాటిందో లేదో బెల్లంపల్లి ఓవర్ బ్రిడ్జి మీద అడ్డగించి పట్టుకున్నారు పోలీసులు. చాలా సతాయించిండ్రు.ఒక దశలో తిరగబాదుతారేమో అనే పరిస్థితి. కానీ ఎక్కువ మంది పోలీసులు చేరుకోవడముతో తిరిగి పోలీసోల్ల వ్యాన్ ఎక్కిండ్రు.

తిరిగి వచ్చినంకా వాళ్ళు మునుపట్లా ఉండట్లేదు. దెబ్బలు తింటామని తెలిసినా ఒకే దగ్గర చెరీ మాట్లాడుకుంటుర్రు. పదే పదే అప్పీల్ చేస్తుండ్రు పోతామని. చివరకు వాళ్ళ బాధ చూడలేక వీయార్వో భూమయ్య పేక కమ్మలు తెచ్చి ఇచ్చిండు. కానీ వాళ్ళు బయట కబడ్డీ ఆట ఆడుతము అటు ఇటు నడుస్తాము,తిరుగుతాము అని రెక్వెస్ట్ చేసిండ్రు. కానీ అనుమతించబడలేదు.

ఒక రోజు మాకు తిండి సరిగా అరుగుటలేదు.ప్రాణామంతా సుస్తుగా ఉంటుంది.మేమిక్కడ బ్రతకలేము. మమ్ములని విడిచిబెట్టకుంటే మేం తిండి ముట్టము అని భోజనం బంధు చేసిండ్రు. ఎవ్వరూ ఎంత ప్రయత్నించినా మూడు రోజుల దాకా తిండి ముట్టలేదు. ఆఖరి అస్త్రంగా జిల్లాకి కొత్తగా అలాట్ అయిన ఉత్తర ప్రదేశ్ కి చెందిన అసిస్టెంట్ కలెక్టర్ ని రంగములోకి దించింది జిల్లా యంత్రాంగం. ఆమె వాళ్ళ భాషలో మాట్లాడి,మనమంతా ఒక కుటుంబం లాంటి వాల్లమని మెల్లగా ఒప్పిస్తూ వాళ్ళ ఇంటి వాళ్ళతో,వారి వారి జిల్లా కలెక్టర్స్ తో మాట్లాడి సర్ధిసెప్పింది. ప్రభుత్వం నుండి పర్మిషన్ రాకున్న వారం రోజుల్లో నేను వదిలిపెడుతాననే మాటతో చివరకు ఆ మూడో రోజు రాత్రి తిరిగి వాళ్ళని తిండి ముట్టెలా చేసింది.

అదే సంఘర్షణపూరితమైన రోజుల మద్య కొద్ది రోజులకి వారిని ఆ సెంటర్ వాళ్ళు పొమ్మని పర్మిషన్ ఇవ్వలేదు. వాళ్ళు వీళ్ళ ధృష్టి పథంలో లేకుండానే వెళ్లిపోలేదు. దేశమంతా రహదారుల వెంట వలస కార్మికులు కొద్దిరోజులు చీమల బారులు కట్టిండ్రు రక్తపు మరకలు నేలపై ముద్రించుకుంటూ వెళ్తూ.

       *************    2020 జూన్ మొదటి వారము లాక్ డౌన్ కొంత సడలింపు ఉన్న రోజుల్లోనే మేము మా మంచిర్యాల పక్కనే కలిసినట్లు ఉన్న వేంపల్లి లో స్వంత ఇల్లుని కొనుక్కొని షిఫ్ట్ అయినాము. మంచిర్యాలలో ఉన్నప్పుడూ ప్రతి రోజు ఉదయం రాముని చెరువు పార్క్ లో వాకింగ్ చేసేది నేను. వేంపల్లిలో అలా పార్క్ లేదా గ్రౌండ్ లేకపోవడము వల్ల మా ఇంటి నుండి గతములోనే ఇండ్ల భూములుగా మార్చి ప్లాటింగ్ చేసి అమ్ముడుపోని,అమ్ముడుపోయినా కానీ ఇంకా ఇండ్ల నిర్మాణం జరగని భూములని దాటి - ఆ తర్వాత వచ్చే పంట పొలాలని దాటి - ఆ ఊరికి ఉత్తరాన ఉండే గుట్ట వరకు నడుసుకుంటూ పోతున్నాను. నేను నాతో పాటు మా ఆవిడ కూడా. పల్లెటూరు అయినప్పటికి ఎప్పుడన్న ఎవరో ఒకరు ఆ తొవ్వలో పోయే వాళ్ళు కనిపించేవారు. 

కానీ జూన్ నెల చివర మరియు జూలై మొదటి రోజుల్లో “గ్రామీణ ఉపాధి హామీ పథకం“ కింద ఊల్లోని జాబ్ కార్డ్ హోల్డర్స్ కి పనులు కల్పించడం మొదలైంది. వ్యవసాయ భూములని అభివృద్ధి చేసే పనులని ఈ కార్యక్రమములో భాగంగా చేస్తున్నరు.జనం అందరూ ఉదయం 7 గంటలకే తట్టబుట్ట పలుగు పార తీసుకొని నడుస్తూ కొందరు, సైకిల్ల మీద కొందరు, బైకులపై ఇంకొందరు పొలాల దిక్కు వెళ్తున్నారు. నేను నా బార్య ఆ ఊరికి కొత్త. మేము ఇద్దరము కలిసి ఆ పొలాలకెల్లే దారిలో నడుస్తూ పోతుంటే – మాకు వాళ్ళకి తేడా వేరు వేరు గా సులభంగా అందరికీ కనిపిస్తుంది. మమ్మల్ని విచిత్రంగా చూసేవాళ్ళు కొందరైతే మమ్ములని దాటిపోయి గుసగుస పెట్టుకునేవాళ్లూ కొందరు. నాకు చాలా ఇబ్బందిగా,ఏదో అర్థం కానీ సిగ్గుగా అనిపించింది. మేము ఇంకా ముందుకి వెళ్తుంటే – అంతకి ముందే వచ్చి ఆ భూములల్లో పని ప్రారంభించిన వాళ్ళు చాలా మంది ఉన్నరు. వాళ్ళలో నాకు కొందరు ముఖ పరిచయమే. కొంత మంది మేం వెళ్ళే తొవ్వకి దూరంగా పని చేస్తుంటే ఇంకొందరైతే ఆ తొవ్వ పక్కనున్న పొలాలలోనే పని చేస్తున్నరు. దూరమున్నోళ్లతోని బాధ లేదు. కానీ ఈ దగ్గరి వాళ్లతోనే సమస్య వచ్చి పడింది. మా ఆవిడకి నా లెక్క పెద్ద ఇబ్బంది లేదు. కానీ నేను ఇబ్బంది పడుతున్నట్లు ఆమె గమనించింది.

“వెల్ధామా వెనక్కే మరి?” ఆమె అడిగింది.

తిరిగి వెళ్దామని అనిపించింది. కానీ తిరిగి వెళ్తే ఇంకా ఊరి నుండి వస్తున్న వాళ్ళని ముఖాముఖీ ఎదుర్కోవాల్సి వస్తది అని వద్దులే అన్నాను నేను.

ఇంకొంచెం ముందుకు వెళ్తుంటే తొవ్వకి కొంత దూరములో పని చేస్తున్న గ్రూప్ లో నుండి నాకు తెలిసిన వ్యక్తి నన్ను విష్ చేస్తూ పిలిచిండు.

”ఇక్కడే ఉంటున్నారా సర్?”

“అవునవును. ఈ తోట రాజం కట్టించిన ఇండ్లల్లో ఒకటి తీసుకున్నాము.“

“మంచి పని జేసిండ్రు మా ఊరికొచ్చి“

చిన్నగా ఇకిలించినట్లు తల ఊపుతూ నేను నడుస్తూ పోతుంటే…,

వాళ్ళలో ఒకరు మేం దూరం అయినము మాకు వినపడదు అనుకోని-

“తిన్నదరగకా బాగా బలిసున్నరువాళ్ళు. తట్ట పారందుకోని వంగబడి మన లెక్క ఓ గంట సేపు చేస్తే అన్నీ రోగాలు పోతాయి.“

“నీ అక్క ఓ వాకింగ్ అట వాకింగ్…, అన్నీ పనిలేని వేషాలు.“

“దెహే…,మెల్లగా మాట్లాడు.ఆగలేవు.“

చిన్న చిన్న ఆగిపట్టిన నవ్వులు.గుసగుసలు ఆ ప్రశాంత వాతావరణములో నా చెవులకి తాకుతూనే ఉన్నాయి. నా పాదాలు ఎటుదిక్కు పడుతున్నాయో నాకే అర్థం కావట్లేదు. నా చెవులు కాళ్లుగా మారి వాళ్లదిక్కే చూస్తున్నాయి. వారిలో ఎవరో కాండ్రకించి తుపుక్కున ఊంచిండ్రు.అది సహజంగానే అయ్యు౦డొచ్చు. కానీ నాకు ఆ సమయములో అది నన్ను ఉద్దేశించే నా ముఖం మీదనే ఊంచినట్లు అన్పించింది.

తిరిగి ఇంటికి ఎలా వచ్చానో ఏమో! ఒక పెద్ద దొంగతనం చేసి దొరికిపోయిన వాడి వలె ఉంది నా పరిస్థితి. శరీరమంతా వేడెక్కి జ్వరమొచ్చిన ఫీలింగ్. కొన్ని రోజులు వాకింగ్ మానేసిన. మా ఆవిడకి ఇంటి పనుల్లో సహాయం చేస్తానని కొంచెం ఎక్కువ పనులు చేయడం మొదలుపెట్టిన. కానీ నాకు ఆ పనుల్లో కొంతవరకే ఆమె ఒప్పుకుంది. ఉదాహరణకి ఆమె గిన్నెలు తోమితే నేను లోపల పెట్టడం వరకు సరే.. కానీ నేను గిన్నెలు తోమడాన్ని ఆమె ఒప్పుకోలేదు ముఖ్యంగా చుట్టుపక్కల వాళ్ళు చూస్తే ఏమనుకుంటారేమోనని. ఆమె ఇల్లు కడుగుతుంటే నేను నీళ్ళు పోయడము వరకు ఓకే. కానీ నేను కడుగలేకపోయాను. నేను కూరగాయలు కట్ చేయడం వరకు ఓకే. కానీ వండడం ఆమెనే. ఐనా ఇంట్లో బాత్రూమ్ కడగడం లాంటి పనులు ప్రయత్నాలు చేసిన. ఐనా కానీ ఈ శ్రమ ఏదో తినడానికి,తిన్నది అరిగించుకోవడానికి సరిపడేదిగా అన్పించలేదు. అప్పుడప్పుడు సాయంత్రాలు వాకింగ్ పోవడం, ఇంటిదగ్గరే చేయడం లాంటి ప్రయత్నాల తర్వాత మనుషులు కలువని వేరే మార్గములో వాకింగ్ వెళ్ళడం మొదలుపెట్టిన. కానీ నాలో ఈ నడక ఒక పని లేని పని అని,నేనో పని లేని, శ్రమ చేయని వాడినని నాలో కలిగిన ఆ ఎరుక నాకు చాలా ఇబ్బందిగా ఉంది.

           *************

 ఆ రోజు తాండూర్ మండలములోని గోపాల్రావుపేట కార్యక్రమములో భాగంగా కలెక్టర్ గారు ఆ ఊరికి వచ్చిండ్రు. ఈ కార్యక్రమములో “పరిసరాలు - పరిశుభ్రత“ అనేది చాలా ముఖ్యమైన అంశము. కలెక్టర్ గారి రాకతో ఊళ్ళో హడావుడి మొదలైందీ. ఈ కలెక్టర్ బాగా స్ట్రిక్ట్ కలెక్టర్ అని పేరు. అధికారులు, ఉద్యోగులు, ప్రజలనైనా వణికిస్తారు తనకి కరెక్ట్ అన్పించకపోతే. 

దేశ ప్రధానమంత్రి అంతటి వ్యక్తే స్వయంగా “స్వచ్చ్ భారత్“ ప్రోగ్రామ్ ప్రమోషన్ లో భాగంగా గోవా బీచులో చెత్తని ఏరి పోసి ఆదర్శంగా నిలిచినకా –ఇక దేశములో ఎవడి చుట్టూ వాడి పరిశుభ్రత, అనారోగ్యం వాడి నెత్తిలో పెట్టినట్లైంది.

కలెక్టర్ గారు వాడపొంటా నడుస్తూ తొవ్వ వెంబడి ఉన్న చెత్తని చూపిస్తూ ఎంపీడీవో, పంచాయత్ సెక్రెటరీ మరియు ఆ విలేజ్ దత్తత అధికారి ఐనా మండల అగ్రికల్చర్ ఆఫీషర్, సర్పంచ్ మరియు ఆ వార్డ్ మెంబర్ ని చెడామడా తిడుతుంది.

“మీరు చెయ్యరు.ప్రజలతో చేయించరు. వాట్ ఈజ్ దిస్ నాన్సెన్సు. సీసీ గారు ఏఓ గారికి చెప్పి అగ్రికల్చర్ ఆఫీషర్ కి మెమో పెట్టమను.”

ఆ అగ్రికల్చర్ ఆఫీషర్ బతిమిలాడుతుండు నేను చూసుకుంటాను మేడమ్ అని.

“ఏం చూస్కుంటావయ్య? ఇదేనా నీ పని తీరు.” అని ఒక క్షణము ఆగి గద్దించినట్లు చూసింది.

అలా వెళ్తుంటే ఒక ఆసామి ఇంటి ముందు తొవ్వ పక్కన కట్టేసిన బర్రె పెండకడులని ఇంకా తీయలేదు. బర్రె మూత్రం,గడ్డి మరియు పెండ కలిసినదానిని కలెక్టర్ చూసి

“నేను ఏమి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను మీకు మీటింగులో ఇటువంటి ఇస్స్యూస్ మీ నోటీసుకి వస్తే…“

వెంటనే అందరూ ఆమె ఆదేశాలు గుర్తుకొచ్చి ఆ బర్రె దగ్గరికి వచ్చిండ్రు. కానీ ఎవరికి ఏం చేయాలో తోచట్లేదు. ఇంతలో పంచాయత్ సెక్రెటరీ ఆ ఊరి సఫాయి మనిషి మైసులుని పిలిచి ఆ బర్రె మూత్రం,గడ్డి మరియు పెండ కలిసిన దానినంతా రెండు చేతులతో పట్టుకొనిపోయి ఆ ఆసామి ఇంటి ముందు గడప దగ్గర పోయించిండు.

“గుడ్. ఇది కదా నేను చెప్పింది. లేకుంటే ఎవరు వినరు. మనం ఎక్కడి నుండో వచ్చి వాళ్ళ పని చేయవలెనా? డోంట్ దే హవ్ రెస్పాంసిబిలిటీ.“ అని విజయం సాధించించినా దాని వలె ఫీల్ అయిండ్రు కలెక్టర్.

ఆ ఇంటి ఆసామి ఆకుల సత్తయ్య ఇంటి ముందు ఏదో గల్లర గల్లర సప్పుడు విని బయటికొచ్చిండు.

అప్పటికే కలెక్టర్ మరియు ఇతర ఉద్యోగులు వేరే ఇండ్లకి పోతున్నరు.

సత్తయ్య ఊళ్ళో ఒక రకంగా చెప్పాలంటే పెద్ద మనిషి తీరే. వయసు 65 నుండి 70 మద్య ఉంటది. ఆ రోజుల్లో ఏడో తరగతి వరకు చదువుకున్న మనిషి. కానీ పంచాయితీలు చెప్పే పెద్ద మనిషి కాదు. తెల్లారి లేస్తే తన ఎవ్సము తను చేసుకునే మనిషి. తన ముందు ఏదైనా తప్పు జరిగినా చూసుకుంటా ఉండడు. తననెవరైనా సహాయమాశించి వచ్చినా ఉన్నదున్నట్లు, ముక్కుసూటిగా చెప్పే మనిషి.మొదటి నుండి అతను అంతే. కానీ పదే౦డ్ల కింద అన్నలకి భోజనము పెట్టిండని పోలీసోల్లు పట్టుకపోయి విచారణలో కరెంట్ పెట్టిండ్రని అప్పటి నుండి ఇంకా కొంచెం ఎక్కువ పిచ్చిలో పడ్డడని అతను నచ్చని ఊళ్ళో వాళ్ళు అనుకుంటారు.

ఇంటి నుండి బయటికి అడుగు బయటకు వేయంగానే ఇంటి గడప కాడ ఉన్న పెండ చెత్త చెదారం చూసి అప్సోపు అయి౦డు. ఎదురింటి మనిషి జరిగిన విషయం చెప్పిండు. సత్తయ్యకి ఎక్కడలేని కోపం వచ్చింది.

“ఏయ్ ఎవరయ్యా! ఈ పని జేసింది? ఏందిది? నాకైతే ఈ మత్లాబేం అర్థమైతలేదు.“

ఎదురింటి మనిషి చెప్పిండు జరిగిన కథ.

సత్తయ్య రాక చూసిన వెంటనే సర్పంచ్, ఆ వాడ వార్డ్ మె౦బర్ ని ఎగేసిండు అతనిని సముధాయించమని. పైగా ఆ వార్డ్ మెంబర్ సత్తయ్య కి బావ అయితడు.

సత్తయ్య వీరుని లెక్క నడుసుకుంటా వస్త౦డు.

“ఒయ్ బావ ఆగు.నేను చెప్త కదా.గీ కలెక్టర్ మేడమ్ పోనైతే పోనీ…“

“అది కాదు. మీకు గుద్ధ లేవదు. గుడిసె కప్పరాదు.మాకే సెప్తారా నీటుకము గురించి. నేను రైతునే ఐతిని. నా ఇంటి ముందు ఆవు బర్రె గొడ్డు గోధా ఉండకుంటే గాడుదులు పంటయా?

మీకేం తెల్సు నా పొట్టు“ ఆఫీసర్సుని ఉద్ధేశించి అంటుండు సత్తయ్య.

మద్యలోకి గొల్ల మల్లయ్య సెప్పడానికి పోయిండు.

“ఏయ్ మల్లయ్య మామ! మర్యాధ దక్కదు నాకు తిక్క రేగితే…, వాడె౦తా పెద్దోడన్న కానియ్యి“

ఇక సత్తయ్య కి ఎవరు అడ్డము పోలేదు. అడ్డము పోతే ఇంకా ఎక్కువ చేస్తాడని. కోసేపు ఒర్రుకొనియ్యని వదిలేసిండ్రు.

కలెక్టర్ గారు మిగతా అందరూ వేరే ఇంటి ముందు ముందు ఉన్నారు. సత్తయ్య అక్కడికి చేరి మొదలువెట్టిoడు.

“మీరో సదువుకున్నోళ్ళు,మీరో పెద్ద సార్లు మేడములా?

మీకు సక్కగా సక్కులము ముక్కులము పెట్టుకొని కూసుoడి తినరాదు. సక్కగా మోకాళ్ళ మీద కూసోని దొడ్డికి పోరు. అసలు తినుడు ఏరుగుడే సక్కగా తెల్వని మీరు మాకు సెప్పెటోల్లా ?

సెప్తే సెప్తిరి గాని దానికో రీతి రివాజ్ ఉండాలే. గింత అధ్వానమా?

నీ అవ్వ నీ ఏషము…“

అలా అనుకుంటా వాళ్లెంబడే పోతుండూ.

కలెక్టర్ గారికి అతనేదో గలాటా చేస్తుండనీ అర్థమై పట్టించుకొనట్లు ముందుకు వెళ్తున్నరు.

నెక్స్ట్ ఒక నాయక్ పోడు వాళ్ళ ఇల్లు వచ్చింది. అది కేవలం చెట్టు కొమ్మలతో ఏర్పర్చిన దడికి మట్టి రాస్తే నిలిచినా గోడలా అడ్డుగా ఉన్న అర్ధ పారధర్శక గోడ. పైన బెంగళూరు గూన పరిచిన గుడిసెలాంటి ఇల్లు. ఆ ఇంటి ముందు అంతా లొందలా ఉండి బురద నీరు నిల్చి ఉంది. వీయార్యే వెళ్ళి లోపాలెవరున్నారు అని పిలుస్తుండూ.

లోపల ఆ ఇంట్లో మంచము లేక నడుము ఆ మట్టి నెలకి సమాన౦గా ఆనక అవస్థ పడుతున్న ఎనిమిది నెలల గర్భిణీ బైర్నేని చిన్నూ ఉంది. తీవ్ర అవస్థతో మూలుగుతూ అటు ఇటు కదులుతుంది. వీయార్యే బయటకి వచ్చి ఆల్లెవాలు లేరు అని చెప్పిండు.

వెంటనే ఆకుల సత్తయ్య అందుకున్నాడు “ఓయ్ మధూకర్! లోపల ఎవరు లేరా? లోపల చిన్నూ లేదా! దాని గోశ ఎవనికి ముట్టాలే. పరిశుభ్రత గురించి చెప్తార్రు కానీ దానికో మంచము ఇప్పిత్తేoది ఈ ప్రభుత్వం, ఈ సార్లందరు కలిసి. పుణ్యానికెవడివ్వమంటుండు కాని బుర్క పిట్టంతా ఊల్లెకి కరోన రోగమచ్చినంకా అందరూ ఊల్లెనే వచ్చి పడ్తిరి. ఎవ్వనికి పని లేదాయే. కడుపుకు తిండి లేక, పోరగాళ్ళకి సదువు లేక ఎక్కడలేని రోగాలొచ్చి సత్తార్రు జనo. కడ్పుకు గంజి లేకుంటేమాయెగని మొఖానికేమో పౌడర్ వేయమన్నట్లున్నది మీ కథ. సచ్చిపోతే కాలెయ్యడానికి వైకుంఠధామము కడుతార్రు. అట్టిగా కూసోడానికి చెట్లు పెడుతార్రు గాని పని సంగతేంది? తిండి సంగతేంది?“

సత్తయ్య కొంచెం కూల్ అయిండు కాని వెంబడే రావడం వాళ్ళకి ఇబ్బందిగా ఉంది.

నాలుగైదు ఇండ్లూ దాటగానే ఆ ఊరి కచ్చీరు కాడికి చేరిండ్రు.

కలెక్టర్ గారు ఇగ బండి ఎక్కి వెల్ధామనేంతలో గ్రామ పంచాయితీ ఆఫీసు కి పక్కనే సందిలో ఆ వాడ చెత్త అంతా వచ్చి చేరడం చూసి కోపముతో ఆగిపోయిండ్రు.

మళ్ళీ మొదటికి వచ్చింది కథ. అందరూ కలిసి దానిని తీయించడానికి పూనుకున్నారు. కలెక్టర్ గారు అప్పుడే వచ్చిన ప్రెస్ వాళ్ళ కోరిక మేరకు మళ్ళీ ఒకసారి ఒక పెద్ద చీపురు కర్రతో రోడ్ పక్కనున్న చెత్తని తీస్తూ ఫోటో దిగిండ్రు. అందరూ అధికారులు తలో చేయి వేసినట్లు చేసిండ్రు.

ప్రెస్ వాళ్ళు ఏవో ప్రశ్నలు అడుగుతుంటే – సఫాయీ మైసులు మరియు ఈ మద్యనే వాటర్ ట్యాంక్ కోసము జాగ ఇచ్చినందుకు నెలకి మూడు వేల చొప్పున ఊరి పంప్ ఆపరేటర్ గా గ్రామ పంచాయితీ నియమించుకున్న పెట్టెం సంపత్ లు కలిసి ఆ గ్రామ పంచాయితీ పక్కనున్న చెత్తని తీస్తుండ్రు. మేడమ్ పోయే లోపు కావాలని ఆ సర్పంచ్,అధికారులు అందరూ తొందరాగా పూర్తి చేయమని వాళ్ళిద్దరిని తొందరపెడుతుండ్రు.

సత్తయ్య అక్కడివరకు వచ్చిండు.

మేడమ్ వెహికిల్ దగ్గరకు వస్తుంటే సత్తయ్య “మేడమ్ గిదేనా పద్దతి?” అని ప్రశ్నించిండు

కలెక్టర్ గారు ప్రెస్ వాళ్ళ ముందు ఇతనికి మంచి సమాధానమే చెప్పాలని గ్రామ పంచాయితీ ముంది వేసిన కుర్చీలో కూర్చుంది. నిజానికి ఆమె అలిసిపోయింది కూడా.

“మీరు చెప్పండి ఏంటి మీ సమస్య“ అని అడిగింది.

సర్పంచ్ ఉండి “మీరు బయల్దేరండి మేడమ్, ఆ సత్తన్న అట్టిగానే అంటాడు అట్లా. మాకలవాటే ఇవి“ అని చెప్పబోయిండు.

“లేదు అతనిని చెప్పనివ్వండి“ అని కలెక్టర్ గారు సత్తయ్యతో అన్నారు.

“ఇగో మేడమ్ మీరు పెద్దోల్లు.పెద్ద చదువులు సదివినోల్లు.

కానీ ఇదేమీ సోధ్యమో నాకైతే అర్థం అయితలేదు. మీరందరూ అట్టిగా వచ్చి పోజిచ్చిపోయేటోల్లే. ఈ సార్లు, మా సర్పంచు, వార్డ్ నెంబర్లందరు డిళ్ళకి కొట్టుకుంటా అటిటూ సింగులు లేపుకుంటా లాగులు ఊపుకుంటా తిరిగెటోల్లే కానీ ఒక్కలు గట్టిగా పార అందుకొని పని చేసేటోల్లు కాదు. అవ్వ తోడు మీరు మీ గడియారం పట్టుకొని నిల్సోని సూడు౦డ్రీ ఒక్క ఐదు నిమిషాల కంటే ఎక్కువ పని చేయరు. ఆ సార్ల గురించేమో గాని మా వార్డ్ నెంబర్లైతే నిన్నటి దాకా వంగబడి ఎవ్సము పని జేసుకున్నోల్లే. ఇయ్యాల్లేదో నెంబర్లైండ్రని ఆళ్లకి పని మోటుదైపోయింది. మీరందరూ కలిసి ఒక అరగంటా సేపు పని చేయుండ్రి. అగర్సే మీరు గనక చేస్తే నేను ఏడాదంతా ఈ ఊరికి ఉత్తగానే ఊడిగం చేస్తా. ఎక్కడైనా ఎవ్వరైనా సరే ఏదైనా పని గురించి చెప్తే ఆ పని గురించి తెలిసినోడు,చేసినోడు చెప్పాలే. అట్లా సెప్తే దానికో అర్థం ఉంటాది. మీ సార్లకు,మేడములకేవ్వలకి ఈ పని గురించి తెల్వదు. కానీ మీకు తెల్వని ఆ కట్టం పని గురించి మీరు చెప్పుడెట్లా? అదెట్లా అయితది ఇగ పని?

ఆ పని గురించి తెలిసినోడు,దాని లోతుపాతులు తెలిసినోడు ఐతే ఆ పనిని ఇంత కట్టంగా కాక ఇష్టంగా చేస్తడు. చేయించుతడు. ఆ పని తెలిసినోన్ని, చేసేటోల్లని – ఏం తెల్వని మీరు తిట్టుడెట్లా?

నీ అక్క ఇదేదో కథకే ఉంది.“

సర్పంచ్ అందరూ వార్డ్ మెంబర్స్ ఒకేసారి సత్త్యయ్య మీదికి – నీకేమి పని లేకున్నావని గొడవకి లేవడముతో కొంత అల్లరి వాతావరణము ఏర్పడింది.

కలెక్టర్ కి కోపం వస్తుంది. కానీ ఇటువంటి పరిస్థితిని ఎట్లా డీల్ చేయాలో తెలిసిన తెలివైనవారు ఐ ఏ ఎస్ లు.

అందరూ గాబరాగా ఉన్న ఆ టైములో కలెక్టర్ గారు అన్నరు.

“సరే మాకేమీ తెలియదు.మరి నువ్వన్న సమస్యకి పరిష్కారం చెప్పు“

“పరిష్కారం అంటే పెద్ద సదువులు సదువుకున్నోళ్ళు,పెద్ద సార్లు మీకు తెల్వాలే“ తప్పించుకోవాలన్నట్లు నాలుక కరుచుకుంటూ నవ్విండు సత్తయ్య.

అందరూ గొల్లున నవ్విండ్రు.

కలెక్టర్ గారు చిరు నవ్వుతో “అదే మాకు ఏమీ తెల్వకనే నిన్ను అడుగుతున్నాము. తప్పులు ఎత్తిచూపడం ముఖ్యం కాదు. ఎవరైనా చెప్పొచ్చు సొసైటీలో. కానీ ఆ సమస్యకి పరిష్కారం చూపాలి కదా.“ సత్తయ్యని భలే ఇరకాటం లో పెట్టినాను అనుకోని ఒక రకమైన రిలాక్సేషన్ లో ఉన్నారు కలెక్టర్ మేడమ్.

అప్పుడు సత్తయ్య “నేనేమీ పెద్దగా సదువుకోలే. మీ లెక్క దేశమంతా తిరిగినోన్ని కాదు గని..,“ సత్తయ్య.

“హా మీకేమి తెలిస్తే అది చెప్పండి.ఇప్పటిదాకా అన్నారు కదా!“ కలెక్టర్.

“నేనేదో నా చిన్నతనముల ఏడు దాకా సదువుకున్న.కానీ నాకు మీలాగా తెలుగు,ఆంగ్లం,హింది మూడు భాషలు వచ్చు. తెల్లారి లేసిందంటే అరొక్క పని చేస్తా. నాకు తెల్వని పని లేదు. రాని పని లేదు. ఇంట్లో కరెంట్ బుగ్గ నుండి నా ఎక్సెల్ బండి దాకా చిన్న చిన్న రిపేర్ చేకుంటా“

నేననేది ఏందంటే – నాలుగు తీర్ల పని చేస్తే నాలుగు రీతులా తెలివత్తది. మీరందరూ వంగవడి ఊడిస్తే కదా ఓ గంటసేపు జిల్లా అంతటా దాని పని వరుస ఏందనేది తెలుస్తాది.”

వెంటనే సఫాయీ మైసులు కల్గచేసుకుంటూ “సత్తయ్య పటేలా! తప్పు తప్పు“ కలెక్టర్ ని అలా అనొద్దనే ఇషార చేస్తూ అని తన చెంపలు తానే కొట్టుకున్నాడు.

కలెక్టర్ కల్పించుకొని “అరే…, తను చెప్పనివ్వండి.ఇప్పుడు మనమందరము అభివృద్ధి గురించే కదా మాట్లాడుకునేది. తను చెప్పనివ్వండి“

సత్తయ్యకి చాలా రోజుల తర్వాత తన మాటలు చెప్పడానికో మంచి అవకాశం వచ్చినట్లైంది. మంచిగనే మాట్లాడాలని నిర్ణయించుకున్నడు.

“మనిషి నాలుగు రకాల పని చేస్తేనే మనసు దిల్ ఖుషీగా ఉంటాది. చేసిన పనే ఊకే చేత్తే ఎవరికైనా బోరు కొడుతడి. యాష్టకస్తది. మీరింత పెద్ద సార్లు అందరూ కలిసి వస్తిరి. ఏదో పెద్ద ప్రోగ్రామే పెట్టుకుంటిరి. కానీ ఏ పేరు మార్చినా,ఏ వేషమేసుకున్నా కొస్సకు ఉన్న పని అంతా మల్ల గా సఫాయీ మైసులు మీదనే పడవట్టే. మీరు వస్తార్రని తెల్సి నాలుగొద్దుల నుండి సెక్రెటరీ సార్ నిద్రే పోకపోవట్టే. ఎన్ని కథలుపడ్డ మళ్ళీ కింద ఉన్నోని నడుములిరిగి సచ్ఛుడు తప్ప ఇండ్లేమన్న కొత్తగా ఐన పని ఉందా? ఎవలకన్నా మంచి జరిగేది ఉందా? అట్టి సోపుటాప్ డాముడీము లెక్కలు తప్ప ఏమన్నా కొత్త ముచ్చట ఉంటే సెప్పుర్రి నాకు“ కిలుక్కున నవ్విండు సత్తయ్య చివరకు.

కలెక్టర్ గారు తలకాయ ఊపిండ్రు ఇంకా చెప్పమన్నట్లు. నిజానికి అతని ముచ్చట్లకు కౌంటర్ ఇవ్వాలన్పించట్లేదు.

మళ్ళీ సత్తయ్యనే మొదలువెట్టిoడు.అతనికి ఇలా చెప్పే అవకాశం ఎవ్వరూ ఇవ్వరు.

“ఇప్పుడు నన్నే సూడుర్రి. నేను ఎవ్సము చేస్తా. ఎదురైన పని చేస్తా. ఈ ఊళ్ళోని బడిలో నన్ను ఐదో తరగతి దాకా చెప్పుమనుర్రి చదువు అన్నీ సబ్జెకులు మీ సార్ల కంటే బేతిరిన్ గా చెప్పుతా. బతుకు ముచ్చట్లు చెప్పమంటే ఎంత పెద్ద సదువులకైన సెప్తా. మీ వీయార్వో పనెందో నాకు ఒక రోజు చెప్పుర్రి అవ్వల్దర్జాగా చేస్తా. ఇప్పటికీ అడుగుర్రి ఈ ఊల్లే మీ పట్వారే కాదు మీ సర్వేయర్ కంటే ముందే ఒక్క పది నిమిషాలల్లో భూమి కొలతలు చేస్తా నేను. మీకెవలకన్నాబాయి కొలత లెక్కలు వస్తాయ? నేను ఇట్లా వేళ్ళ మీద చెప్తా. మీరు చెప్పే ముచ్చట ఉంటది ఇగా ముక్కేది అంటే తల్కాయ చుట్టూ తింపి చూయిస్తారు. నేనేదో సెప్తున్నానని కాదు. మీరు కూడా నాలుగొద్దులు ఎవ్సము చేస్తే నాకంటే మంచిగా చేస్తారు. ఎందుకంటే నాకు ఈ పని పుట్టుకతోని చేసి చేసి యాష్టకచ్చింది. వేరే పనేదన్న చెప్పుర్రి ఇట్లా నేర్చుకొని చేసి పడేత్తా. అట్లా అందరం అన్నీ పనులు కలిసి చేస్తే చిన్న పెద్ద లేకుండా పండుగా లెక్క ఉంటాది బతుకు ముచ్చట. పెయ్యి వంగాలే ఎవరికైనా. ఆరోగ్యానికి కూడా మంచిది. మీరు అందరూ పొద్దుగాలా లేచి ఎవ్వలకు వాళ్ళు పిచ్చి లేసినోళ్ళ లెక్కా వాకింగులు, ఎక్సర్సైజులు ఏం దండుగ పని అది? అదేదో ఇయ్యాల ఇక్కడ అని కాదు మీ బార్యలతో సమానంగా ఇంటి పనిలో కాడనుండి మొదలు పెడితే ఆఫీసుల బయట ఎక్కడ పను౦టే అక్కడ చేయుండ్రి. కలెక్టర్ రూములల్లా కూసు౦డే మీటింగ్ పెట్టాలని ఉన్నదా? ఇక్కడికే అందరినీ పిల్చుకొని అందరూ మనిషికి కోసేపు పని చేసి ఈ చెట్ల కిందనే మీటింగ్ పెట్టుకోరాదా? ఈ ఊరంతా తిరుగుకుంటా పనులేందో సమీక్ష చేసుకోరాదా? అరే ఏమీ పని చేయనోళ్ళకి తెలివెట్లా ఉంటాది నాకు తెల్వక అడుగుతా?

చిన్నప్పటి సంది సఫాయీ పని చేస్తున్న మైసులు కి చీపురు పలుగు పార పట్టనోల్లు మీరు చెప్పుడెట్లా,అతడు వినుడెట్లా ?

హా…, మీకెట్లుందో గాని నాకైతే సిత్రంగా ఉంది. ఇదంతా ఉళ్టాసీదా లేదా మేడమ్?“

కలెక్టర్ తలూపుతుంది. అందరూ సత్తయ్య ఇంకేమి మాట్లాడుతాడోనని భయంగా చూస్తార్రు.

“ఇప్పుడు బడులే లేవాయే దిక్కుమాలిన కరోన చేయబట్టి. మా ఊరి అంగనువాడీ మేడములు, టీచర్లందరు వచ్చి ఏదన్న పని చేస్తేంది? సదువే చెప్పాలని ఏముంది? మాకేన్నో సమస్యలు ఉన్నాయి. ఎన్నో పనులు ఉన్నాయి. మాకుదిక్కెవరు? సదువుకున్నోళ్ళు,ఉద్యోగస్తులు మునుపటి రోజుల లెక్క లేరు. నేననే దాండ్ల తప్పేముంది సెప్పుర్రి? ఎక్కడోల్లక్కడ ఏం పని లేక మనుషులు కలుసుకోక మురిగి సత్తార్రు. వీయార్వో, పంచాయతీ సెక్రెటరీ, ఏ ఈ ఓ సారు, మేడములు కలిసి ఊల్లే గ్రామ పంచాయితీ ట్రాక్టర్ పట్టి ఊల్లే భూములన్నీ దున్నుతేంది నాట్ల మీద ఒక పది రోజులు వంతుల కొద్ది. ఊకే వాళ్ళ పనే ఉంటదా? ఉంటే ఆ పనే౦దో చెప్తే నా అసంటోల్లము చేయమా? సేద్దామనుకున్నాంకా, నేర్సుకున్నాంకా రాని పని అంటూ ఉంటదా? ఏవో కొన్ని తప్పా డెబ్బై శాతం పనులు చదువుకున్నోళ్ళు,సదువుకోనొల్లు అన్ని పనులు కలిసి పంచుకొని చేయవచ్చు. ఊకే ఇరాము లేకుంటా బాధకి ఒకటే పని చేసే బదులు.

బస్…, గింతే ముచ్చట నేను చెప్పేది. నువ్వు పెద్దేంది, నేను చిన్నేంది? మీ జీతాలు తక్కువనీ లొల్లే౦ది ? నేను అర్వ కట్టం చేసినా మునుపటితో పోలిస్తే ఎకరాన నాలుగు వంతుల పంట ఎక్కువ తీసినా గాని మా బ్రతుకెందుకు ఇబ్బంది అవుతుంది? మా ఊరగల్ల కష్టమంతా ఎటు పోతుంది? ఏ పని దొరుకక మనుషులెందుకు మిగులుతార్రు? కంప్యూటర్లు,మిషన్లే అన్ని పనులు చేస్తే ఆకలైనోడు,కడుపు మసిలినోడు వాటిని తగలబెట్టక ఊకుంటడా? ఆ రోజు తప్పకుండా వస్తది అవ్వ తోడు.

చలో అందరము కలిసి అన్నీ పనులు చేస్కోవాలే. మంచిగుండాలే. సర్కార్ బడులల్లనే అందరి పిల్లల్ని సదివిపిద్ధాము. సర్కార్ దవాఖానలకే అందరము పోవాలే. అన్నీ సర్కారే సూడనీ. బంగారమోలే అందరం కలిసి మంచిగా బతుకక. అట్లా ఉంటే మంచిగా ఊరోళ్లందరం,దేశమంతా కలిసి పని జెప్పన ఓడగొట్టుకొని మంచిగా సాయంత్రం పూట, పండుగ పూటలు ఆటపాటలతోని గడుపరాదా? అరే…, అట్లనే ఉండేనయ్యా రాములా, కొన్ని రోజుల కిందటిదాకా! గి నడుమనే పురాత నాశనమైంది దేశం“

కలెక్టర్ గారికి సత్తయ్య చెప్పిన మాటలు మంచిగా అనిపించినయి. ఆమెకి మాత్రమే కాదు వాళ్లందరికి కూడా సత్తయ్య చెప్పిన మాటలు అన్నీ కరెక్ట్ అని తెలుసు. కానీ అవి సాధ్యం అయ్యే ముచ్చట్లు అన్పిస్తాలేవు అక్కడున్నోళ్లందరికి.

చెట్ల కిందా వాతావరణము మంచిగుంది.

కలెక్టర్ గారు లేచిండ్రు. ఆమె వెనుక గన్ మెన్ అనుసరించిండ్రు.

అకస్మాత్తుగా పెరిగిన గాలికి చెట్లు బలంగా ఊగుతున్నాయి.

“సత్తయ్య! నువ్వు చెప్పినవి అన్నీ కరక్టే. కానీ వాటి గురించి ఎట్లా ఫైట్ చేయాలో, అవి ఎట్లా ప్రభుత్వం ధృష్టికి తీసుకుపోవాలో, ఎట్లా చట్టం చట్టం చేయించాలో అది మీ చేతుల్లో ఉంది. మేం చేసేది మేం చేస్తాము“ అని కలెక్టర్ మేడమ్ సుహృధ్భావముతో చెప్పి బయల్దేరింది.

“అందరం కలిసి జేస్తేనే అయితది మేడమ్“ అని రెండు చేతుల దండం పెట్టిండు సత్తయ్య.

ఒక్కసారి ఆ ప్రాంతాన్ని నిశబ్ధం అలుముకుంది ఆ ఖాళీతనములో.

అక్కడ ఉన్న మనుషులందరూ కమిలిపోతున్న కూలిపోతున్న కుళ్లిపోతున్న వృక్షాల వలె ఎటు పోయేటోల్లు అటు సాగిపోతున్నారు.

సూర్యుడిని మబ్బులు కమ్మినయి. నీడలు లేక ఊరంతా తేటతెల్లగా కనిపిస్తుంది.

నేల రాలిన రావి చెట్టు ఆకులు గలగల సవ్వడితో దొర్లుతున్నాయి.

చెట్టు మీది ఊరవిస్కెలు తిరిగి వచ్చి వాలినయి.

గ్రామ పంచాయితీ ముందు తొవ్వ మీద ఉన్న బంతి పూలు ముద్దుగా పద్దతిగా తీర్చినట్లున్నాయి.

ఒక్కడే అక్కడే నిలబడి ఉండి మిగిలిపోయిన సత్తయ్య – అప్పుడే అక్కడికి చేరిన పిల్లలతో ఏదో కథనో ముచ్చటనో సెప్పుకుంటూ నవ్వుతుండూ.

పుట్టిన ఊరు: కనగర్తి. ఓదెల మండలం, పెద్దపల్లి జిల్లా. SRR డిగ్రీ కాలేజీ కరీంనగర్ లో బీ.కామ్ . చదివి కాకతీయ విశ్వవిద్యాలయంలో బీ.ఎడ్ చేసారు.
సాహిత్యం పరిచయం: చిన్నతనంలో కమ్యూనిస్టు పార్టీ పాటలు, పాఠశాల స్థాయిలో ఠాగోర్ జీవిత చరిత్ర(7వ తరగతి తెలుగు ఉపవాచకం), గౌతమ బుద్ధుని జీవిత చరిత్ర(ఇంటర్ లో), డిగ్రీ చదివేటపుడు మాక్సిం గోర్కీ అమ్మ, నేను హిందువునెట్లయిత?, చలం సాహిత్యం.
రచనలు: 'ఒక మూల్నివాసీ గీతం' పేరుతో త్వరలో కవితా సంకలనం రానుంది. 'మహానీయుల జీవిత చరిత్ర'ల వ్యాసాలు (దినపత్రికల్లో). ప్రస్తుతపు కథ ఆరవది . మంచిర్యాల్ జిల్లా జన్నారం తహసీల్దార్ గా పనిచేస్తున్నారు.

 

2 thoughts on “మనుషులు కూలిపోతున్న దృశ్యము

 1. సర్… మీ అనుభవాలే కథగా చెప్పుతున్నారు..చదువుతుంటే మీ వెంట ఉండి పరిశీలిస్తున్నట్టే అనిపించింది.. అనుభవానికి మించిన కథ ఏముంటది సర్.. సూపర్ 👌👌

 2. మనమందరం మన వ్యక్తిగత జీవితాలను..సామాజిక జీవితాలను పునసమీక్షించుకునే సమయం వచ్చింది అని వెన్ను నిమురుతూ చెప్పిండు కిషనన్నోల్ల బాపు …కొన్ని సమస్యలకు పరిష్కారాలు కూడా చూపించిండు సత్తయ్య పటేల్.. మట్టి మనుషుల… కల్మషం లేని మనసుల… ఈ కథ సదువుతుంటే ఎవల్ని వాళ్ళే ఎతుక్కున్నట్ల్లు అనిపిస్తుంది..
  __ నమస్తే ఇటిక్యాల వెంకట కిషన్ శాక్య . కదిలించే కథ(యదార్థం)🙏🙏💐💐💐

  పెద్దపల్లి శ్రీనివాస్.

Leave a Reply