మనిషిప్పుడో నెత్తుటి పాట

ఏది పీడకలో ఏది వాస్తవమో
తెలీనివ్వని రక్త వైచిత్రిలో పడి తన్నుకుంటున్నాం

***

కత్తి ఒక లోహం మాత్రమే
తనని చేబూనిన వాడికి అదో కుక్కని మించిన బానిస
కత్తికి న్యాయాన్యాయాలు పట్టవు
పిడిని పిడికిలిలో బంధించిన వాడే దాని యజమాని

మనుషులు లోహపు ముక్కలైపోతున్న దిక్కుమాలిన కాలమిది
అందరూ ఎవరో ఒకరికి యజమానులో బానిసలో అయిపోతున్నారు
జాగ్రత్తగా చూడండీ – మనిషి గొంతు చుట్టూ ఏవో వేళ్ళు
ట్రిగ్గర్ని అదిమినట్లు నొక్కుతున్నాయి
అందరూ పేలటానికి సిద్ధంగా వున్నట్లున్నారు
ప్రతి వాడూ తానే హంతకుడైనట్లు మరో మనిషిని భయపెడుతున్నాడు
లేదా తానే హతుడైపోతున్నట్లు హడలెత్తి పోతున్నాడు
నడుస్తూ నడుస్తూనే పేవ్మెంట్ల పైన
కుప్పకూలేందుకు సిద్ధంగా వున్నాడు
మనిషిప్పుడు ఏ చౌరస్తాల్లో అయినా చర్మం లోపలి మాంస కండరాలన్నీ ప్రదర్శిస్తూ
మొబైల్లో సాంస్కృతిక ప్రదర్శనగా చిత్రించబడే నెత్తుటి ముద్ద!

పైకి కనిపించే కారణాలు కారణాలు ఏవైతేనేం?
కొన్ని గజాల భూమైతేనేం? వదిలించుకోలేని బంధమైతేనేం?
అశుద్ధంలా పులుముకున్న కులమో మతమో ఏదైతేనేం?
మనిషిప్పుడు పేలిపోటానికి గొయ్యి తీసుకొని సిద్ధంగా వున్న
కోరికల కోపాల ప్రతీకారాల మందుపాతర!
అతగాడు తనవో కావో తెలియని అయోమయపు
కలల కొక్కేనికి పీకని దిగ్గుచ్చి వేలాడుతున్నాడు
రూపాయిని బ్లేడులా మార్చి నాలిక కింద మడత పెట్టి
నెత్తుటి భాష మాట్లాడుతున్నాడు
వినిమయ వాంఛలతో తెరుచుకున్న మొసలి నోట్లో తానే కాలు పెట్టేస్తున్నాడు
పెట్రోల్లో తడిసి ముద్దైనట్లు ఇంధనం వాసన కొడుతున్నాడు
నెత్తురోడుతూనే కత్తులతో కమ్ముకొస్తున్నాడు
మారణాయుధమైపోతున్నాడు

***

వినిపించే హాహాకారాల వెనుక కనిపించని కారణాలుంటాయి
మంచు కొండల నుండి మహా సముద్రాల దాకా
ఒక చేత్తో బుల్లెట్లు విసురుతూ
మరొక చేత్తో డబ్బు గొడ్డళ్ళతో ఊచకోత కోస్తూ
నిన్నూ నన్నూ నేరస్తుడిగా దగాపడినవాడిగా మిగులుస్తూ
సింహసనం చేస్తున్న వికటాట్టహాసం వినిపిస్తున్నదా?

"నెత్తురోడుతున్న పదచిత్రం", "కవిత్వంలో ఉన్నంతసేపూ...." అనే  రెండు కవితా సంపుటల వయసున్న కవి.  సామాజిక వ్యాఖ్యానం, యాత్రా కథనాల్లోనూ వేలు పెట్టే సాహసం చేస్తుంటాడు.

One thought on “మనిషిప్పుడో నెత్తుటి పాట

  1. కవిత చాలా అద్భుతంగా వుంది.. రచయిత అభినందనీయుడు

Leave a Reply