మనకు మనమే ప్రతిధ్వనులుగా ఉండిపోవద్దు

“నువ్వు BLM ను సమర్థిస్తావు కదా. మరి రామ మందిరాన్ని ఎందుకు సమర్థించవు?” వాట్సాప్ గ్రూప్ లో సౌమ్యంగా అడిగింది ఇరవై ఐదేళ్ల క్రితం కాలేజిలో పరిచయమైన స్నేహితురాలు. తల తిరిగిపోయే ఇలాంటి ఉపమానాలు ఈమధ్య దాదాపు ప్రతిరోజూ వింటూనే ఉన్నా, విన్న ప్రతిసారీ కోసుకుపోతున్నట్లుండే నొప్పి గుండెలో. హేతుబద్ధంగా ఆలోచిస్తున్నారని ఇన్నాళ్లూ అనుకున్న స్నేహితుల నుంచి ఇలాంటి ప్రశ్నలు వినిపించినప్పుడు ఆ నొప్పి మరీ తీవ్రంగా ఉంటుంది.

నల్లజాతీయులపై పోలీసుల దౌర్జన్యాన్ని వ్యతిరేకిస్తూ దేశమంతటా లక్షల మందిని అర్గనైజ్ చేసి రోజుల తరబడి నిరసన ప్రదర్శనలు చేసిన “బ్లాక్ లైవ్స్ మాటర్ ” (BLM) గురించి ప్రస్తావిస్తోంది నా స్నేహితురాలు. ఏ కారణంతో రామ మందిరాన్ని వ్యతిరేకిస్తున్నానో సరిగ్గా అదే కారణంతోనే ‘బ్లాక్ లైవ్స్ మాటర్ ‘ ఉద్యమాన్ని సమర్థిస్తున్నానని ఆమెకు చెప్పడానికి ప్రయత్నించాను. కానీ, చిటికెడు దేశాభిమానం గుండె నిండా హిందూ గర్వమూ కలగలిపి, ఆమె చదువుకుంటున్నది వికిపీడియా విశ్వవిద్యాలయంలో. ఆ సంభాషణంతా శాంతంగా, మర్యాదపూర్వకంగానే ఉన్నా, ఆ చర్చలోంచి ఎలా బయటపడాలా అని ఆలోచించాను. నా ఆలోచనలను అర్థం చేసుకునేందుకే ప్రశ్నలు అడుగుతోందని నాకు తెలుస్తూనే ఉంది. కానీ వేరు వేరు అంశాల మధ్య ఆమె కలుపుతున్న సంబంధాలతో నా తల తిరిగిపోతోంది. ఒక అప్రకటిత ఎమర్జెన్సీలో దేశం ఊపిరాడని స్థితిలోకి వెళ్లిపోతున్న ఈ కాలంలో, ప్రత్యామ్నాయ వాస్తవాలతో కళ్లకు గంతలు కట్టేసుకున్న లక్షలమందిలో ఆమె కూడా ఉందని తెలియరావడంతో నాకు అగాధంలో మునిగిపోతున్నట్లనిపించింది.

పొద్దున్న లేవగానే ఫోన్ లో వచ్చే నోటిఫికేషన్లను చూడాలంటే భయమేస్తోంది – నేను నిద్రపోయిన సమయంలో ఎవర్ని అరెస్టు చేశారు? ఎంతమంది రేపులకూ, ఉరితీతలకూ, హత్యలకూ గురయ్యారు? ఫోన్ చేతిలోకి తీసుకోకముందే గుండె భయంతో, కోపంతో వణికిపోతుంది.

పాముల్లాంటి చేతులు దేశం నలుదిశలా సాచి NIA ఎంతోమంది మానవ హక్కుల కార్యకర్తలను భీమా-కోరేగావ్ కేసులో ఇరికిస్తోంది. పోయిన నెల ప్రొఫెసర్ సత్యనారాయణను, జర్నలిస్టు కూర్మనాథ్ ను భీమ-కోరేగావ్ కేసులొ ఇంటరాగేషన్ కు పిలిచింది. వరవరరావు అల్లుళ్లయినందుకే వాళ్లిద్దరినీ పిలిచింది. వీళ్లు జనానికి తెలిసిన పేర్లు. జనానికి తెలీకుండా ఇంకా ఎంతమందిని ఇంటరాగేట్ చేస్తోందో, ఎంతమందిని అరెస్టు చేసిందో.

పోలీసులు చాన్నాళ్లుగా ఉమర్ ఖలీద్ ను అరెస్టు చెయ్యాలని చూస్తున్నారు. ఆఖరికి తప్పుడు సమాచారంతో ఢిల్లీ అల్లర్ల కేసులో ఇరికించి ఉపా (UAPA) చట్టం కింద అరెస్టు చేశారు. అల్లర్ల బాధితులతో సహా ఇంకా వందలమందిని అరెస్టు చేశారు. మరోవైపు అల్లర్లు చేసిన అసలైన నిందితులు స్వేచ్ఛగా తిరుగుతూ, మరింత హింసను ప్రేరేపిస్తున్నారు.

నిజంగా, ప్రేమే ద్వేషంగా, అహింసే హింసగా భావింపబడుతున్న కాలం ఇది!

సెప్టెంబరు చివరి రోజుల్లో మనీషా వాల్మీకి మీద జరిగిన రేప్ హత్య, దానిని కప్పిపెట్టడంకోసం పోలీసులు ఆమె కుటుంబాన్ని వాళ్ల ఇంట్లోనే బంధీల్ని చేసి, ఆమెను చివరిసారి చూసి చివరి కర్మలు నిర్వహించేందుకు కుటుంబీకులకు అవకాశం ఇవ్వకుండా చీకటిమాటున ఆమె మీద పెట్రోల్ పోసి కాల్చేయడం మానవ క్రూరత్వానికి పరాకాష్ట. నిందితులను అరెస్టు చెయ్యకపోగా, వాళ్లకు భద్రత కల్పిస్తున్నారు. ఈ కేసు గురించి వివరాలు సేకరించడానికి వెళ్లిన ఒక కేరళ జర్నలిస్టునూ, అతనితోపాటు ఉన్న మరో ఇద్దరిని ఉపా (UAPA) చట్టం కింద అరెస్టు చేశారు.

నేనింకా నిద్రపోతూనే ఉన్నాననీ, గడిచిపోయిన ప్రతి ఒక్కరోజు తెరలు తెరలుగా కమ్ముకుంటున్న పీడ కలల మడతల్లో ఇది మరో పీడకల మాత్రమే కావాలని కోరుకుంటాను.

ఓహ్! ఇదంతా ఒట్టి కల మాత్రమే అనేసుకోగల ప్రివిలేజ్ ఉంది నాకు.

దాదాపు ప్రతి రాత్రి నడిజామున, కుదురుగా ఉండనివ్వకుండ సలుపుతున్న ఒక ప్రశ్నతో నిద్ర లేస్తాను: ఈ ప్రివిలెజ్ తో నేనేం చెయ్యగలను?

సుమారు మూడేళ్ల క్రితం ఒక యాక్టివిస్టు స్నేహితుల మీటింగు నుంచి ఇంటికి వస్తుండగా, తొమ్నిదేళ్ల మా అమ్మాయి అడిగింది, “ఇలా స్నేహితులను కలుసుకోడం, ఇవాళ మాట్లాడుకున్నట్టు మాట్లాడుకోడం బాగుంది. కాని, ఊరక ఒకరితో ఒకరు మాట్లడుకుంటున్నామని నీకెన్నడూ అనిపించలేదా అమ్మా? ఈ సంగతులను ఇవి తెలీని వాళ్ల దగ్గరికి తీసుకుపోవాలి కదా?!” ” అని తన ప్రశ్న. తను అంత మంచి ప్రశ్న వేసినందుకూ, తనను తాను ‘మన ‘తో కలిపేసుకుంటున్నందుకూ ఒక తల్లిగా గర్వపడ్డాను. “ఏదో చేయాలి.. మనం షెహ్లా (రషీద్) వంటి వాళ్లలా వుండాలి. వాళ్లు వీధుల్లో పోరాడుతున్నారు…” అంది మళ్ళీ తనే. ఆ రోజుల్లో తను షెహ్లా, కన్హయ్య, ఉమర్, జిగ్నేష్ లాంటి వాళ్ల గురించి తరచూ మాట్లాడేది. రోహిత్ వేములకు కార్ల్ సేగన్ ఇష్టమని తెలిసి తనూ సేగన్ ను ఇష్టపడడం మొదలెట్టింది. ఈ మూడేళ్లలో వీధి పోరాటాల్ని… షహీన్ బాగ్ నుంచి రైతుల లాంగ్ మార్చ్ వరకు పోరాటాల్ని బాగా ఇష్టపడుతోంది. మా చిన్న గ్రూప్ లో చర్చలను కూడా తను ఇష్టపడింది. చిరిగిన కలల ముక్కలు ఏరుకుని కుట్టుకోడంలో, ప్రతిఘటించి పోరాడుతున్న వారికి సంఘీభావంగా నిలబడడంలో మనం ఒంటరిగా ఏమీ లేము. నిరసనలతో, ప్రకటనలతో, చిన్న చిన్న సమావేశాలతో, వెబినార్ లతో అలసిపోతున్నా కాని; నయా ఉదారవాద, హిందూత్వ దుర్మార్గాల్ని అరికట్టడానికి మనం చేయాల్సిది ఇంకా చాలా ఉంది. మన ఈ చిన్న ప్రయత్నాలు… దుర్మార్గం మీద మన ప్రతిఘటనలో భాగమే.

తిరిగి రామ్ మందిర్ చర్చలోకి వెళితే, చర్చ చాల నిరాశ అనిపిస్తున్నప్పుడు, అనుకోని ఒక వైపు నుంచి ఒక ఆశ తళుక్కుమంది. అది మా గ్రూపులోనే మరొక స్నేహితురాలి మాట. ఆమెకు హిందూ దేవుళ్లంటే ఎంత భక్తో నాకు గుర్తుకొచ్చింది తను మాట్లాడే సరికి. అప్పుడు మేము ఇంజనీరింగ్ మూడో ఏడు చదువుతున్నాం. అందరం తిరుపతిలో బాలాజీ దేవాలయానికి వెళ్లాం. నాకైతే అది వినోద పర్యటనే. మిగిలిన స్నేహితులు దేవుణ్ని చూడ వచ్చారు. దేవుణ్ని చూడ్డానికి జరిగే తోపులాట, కుమ్ములాట చూసి ‘నేను ఇక్కడికి మళ్లీ రాన ‘ని నా స్నేహితులతో అంటూనే, నా స్నేహితురాలి కళ్లలో పొంగుతున్న నీళ్లు చూసి ఆశ్చర్యపోయాను. కొన్ని క్షణాలు బాలాజీని చూసిన సంతోషంలో ఆమె కళ్లలో ఉబికిన ఆనంద బాష్పాలవి. అదిగో, ఆ స్నేహితురాలే… బాలాజీ మీద భక్తి పారవశ్యంలో కళ్లలో నీళ్లు ఉబికిన ఆ స్నేహితురాలే… బాబ్రీ విధ్వంసం తప్పు అని వివరించాలని నేను పడుతున్న ప్రయాస చూసి, నాకు వత్తాసుగా, గ్రూపు లోని మిగతా స్నేహితులతో “దేవాలయాల్ని, సంస్కృతిని మనం ప్రేమిస్తాం, కాని వాళ్లు (ప్రభుత్వాలు) మానవ సమస్యలను పట్టించుకోవాలి. అది అన్నిటికన్న ముఖ్యం” అని అంది.

మరే, అసలీ గ్రూపు ఎలా ఏర్పడిందో అది మరొక విచిత్ర కథ. ఇజనీరింగ్ మొదటి సంవత్సరం ‘ఫ్రెషర్స్ డే’ సంబరంలో మేమొక చిన్న స్కిట్ వేశాం. అది రావణుడు సీతను ఎత్తుకుపోయే ఘటన మీద హాస్య నాటిక. ఎవరినీ హేళన చేయడం మా ఉద్దేశం కాదు. అందులో డైలాగ్స్ కు బదులు హిందీ ప్రేమ గీతాల్ని వాడి నవ్వులు పండించామంతే. ఆ స్కిట్ లో నేరేటర్ నేనే. మేము తక్షణం ఫేమస్ అయిపోయాం. సీనియర్లు మాకు ‘టెర్రిఫిక్ టెన్’ అని పేరు పెట్టేశారు. ఇన్నేళ్ల తరువాత ఇప్పటికీ మమ్మల్ని మేము అలాగే పిలుచుకుంటాం. ఆ రోజుల్లో అందరూ మా నాటికను మెచ్చుకున్నారు గాని, ఇవాళైతే, ఆ స్కిట్ వెయ్యడానికి కొంచెమైనా తటపటాయించేవాళ్లమేమో. కాని, ప్రజల మీద ప్రేమతో నా స్నేహితురాలి మాటలు, ఇతరుల అభిప్రాయాలు విడానికి ఆ ఇద్దరు స్నేహితురాళ్లూ కనబరిచిన సంసిద్ధత మాత్రం నాకు చాలా ఆశ ఇస్తున్నది. మనలో మనమే ప్రతిధ్వనించే అరల్లో మిగిలిపోకుండా, చుట్టూరా ఈ నిశ్దబ్దాన్ని బద్ధలు కొట్టగలమనీ అనిపిస్తున్నది.

పర్యావరణ, మానవ హక్కుల కార్యకర్త, అమ్మ. బాల్యం కర్నూలు జిల్లా, నందికొట్కూర్ తాలూకా లోని మండ్లెం గ్రామంలో. హైస్కూల్, ఇంటర్ హైదరాబాదులో. బి.టెక్ కర్నూల్లో. ప్రస్తుత నివాసం పెన్నింగ్టన్, న్యూ జెర్సీ. సామాజిక స్పృహ ఉన్న సాహిత్యం చదవడం, రాయడం ఇష్టం.

Leave a Reply