మతతత్వం – మహిళల జీవితం

[మతం, దానికి సంబంధించిన విశ్వాసాలు, ఆచారాలు , భగవంతుడి రూపాలు,ఆరాధనలు మనుషుల సంబంధాలను ఇంతకుముందెన్నడూ లేనంతగా సంక్లిష్టం, సంఘర్షణాత్మకం చేస్తున్నవర్తమానంలో మనం ఉన్నాం. వ్యక్తిగతం, కౌటుంబికం అయిన మతం సామూహిక సామాజిక సందర్భాలలోకి చొచ్చుకొని రావటం వలన సంభవించిన పరిణామం ఇది. వ్యక్తులుగా నిస్సహాయస్థితికి లోనైనప్పుడు నైతిక ధైర్యాన్ని పుంజుకొనటానికి ఆలంబన అయిన మతం, భగవంతుడు సామూహిక సామాజిక సందర్భాలలో  వ్యవస్థీకృతం అవుతూ , ఆర్ధిక రాజకీయ అధికార శక్తిగా బలపడటం 1990 నాటికి పూర్తయింది. 1990 లో రామరధయాత్ర మతానికి అధికార రాజకీయాలతో  బంధాన్నిస్పష్టంగా ముందుకుతెచ్చింది.మత సంబంధమైన భావోద్వేగాలను రెచ్చగొడుతూ ఆ ప్రాతిపదిక పై మనుషులను ఏకంచేసే ప్రక్రియ ఊపందుకున్నది. ‘ఇందుగలడందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు’ అని చెప్పిన పోతన మహాకవి తాత్వికతను అపహాస్యం చేస్తూ రాముడిని అయోధ్య కు పరిమితం చేసి భూమి మీద అధికార  స్థాపనకు కరసేవ నుండి న్యాయ స్థానాలవరకు అన్నిటినీ సాధనాలుగా చేసుకొన్న యుద్ధచరిత్ర మన కళ్ళముందరిదే . అన్యమత ద్వేషం, అపరిమితమైనహింస దాని ఫలితం. మొత్తం మీద ఇది మనుషుల ఆలోచన, ఆచరణ మరేవిషయం మీదకు మళ్లకుండా చేసే  కట్టుకొయ్య అయింది. 

1991లో అమలులోకి వచ్చిన నూతన ఆర్ధిక సంస్కరణలతో చెట్టాపట్టాలేసుకొని ‘త్రేతాయుగ’ దైవ మత సంస్కృతి అమలుచేయవలసిన ఏకైక కార్యక్రమంగా ముందుకువచ్చింది. ఆ క్రమంలో స్వామీజీలకు, ప్రవచనకారులకు భౌతిక అంతర్జాల వేదికలు అనేకం అందివచ్చాయి. సామాజిక జీవితాన్ని, సంబంధాలను శాశించగల మత సంస్కృతీ పరివ్యాప్తి చాపకింద నీరులా విస్తరించింది.ఆధునిక రాజకీయార్థిక ప్రయోజనాలు అన్నిటినీ అనుభవంలోకి తెచ్చుకొనాలన్న  ఆశ ఒకవైపు రోజురోజుకు పెరిగిపోతుండగా అదే సమయంలో   అపార్ట్మెంట్స్ , గేటెడ్ కమ్యూనిటీస్  భారతీయ మత సంస్కృతి పరిరక్షణ కేంద్రాలుగా కొత్తగా అందుబాటులోకి వచ్చాయి. వినాయకచవితి, దసరా, శ్రీరామనవమి నవరాత్రులు సమూహాల సమ్మేళనాలకు  సందర్భాలైనాయి.స్త్రీల జీవితాన్నివెనక్కు వెనక్కు తీసుకువెళ్లే  సమిష్టి  పూజలు, వ్రతాలు, సత్సంగాలు, సహస్రనామ పారాయణాలు మొదలైన కార్యక్రమాలు ప్రోత్సహించబడుతూ వచ్చాయి.సంస్కృతీ సంప్రదాయాల పరిరక్షణ బాధ్యత స్త్రీల భుజానికి ఎత్తబడింది.   అదే సమయంలో  ఆధునిక మవుతున్న  స్త్రీల కట్టూబొట్టూ జుట్టూ  విమర్శకు లోనైయ్యాయి.స్త్రీల ఆహార్యం ఎలా ఉంటే కుటుంబానికి, సమాజానికి శ్రేయోదాయకమో బోధించటం ఎక్కువైంది. ఈ నాడు స్త్రీజీవితాన్ని ఇంతగా పాలిస్తున్న మతం వాళ్లకు తెలియకుండానే వాళ్ళను స్వీయ మతం గురించిన అహంభావులుగాను  , అన్యమతాల పట్ల అసహన పరులుగాను  మారుస్తున్నది. ఇది ఫాసిజానికి లోపలి నుండి సమ్మతిని కూడగట్టే కుట్ర.

 మతసంస్కృతీ పరిరక్షణ బాధ్యత స్త్రీలకు ఆదర్శం.అసలు మత చట్రం చివరి అంచులకు నెట్టివేయబడటం   స్త్రీల జీవిత వాస్తవం. ఈ వైరుధ్యాన్ని అర్ధం చేసుకొనటానికి , లైంగిక మత రాజకీయాల మర్మం  ఎరిగి మసలుకొనే అవగాహన ను పెంచుకొనటానికి  వర్తమాన సందర్భంలో మళ్ళీ చదవదగిన వ్యాసం ‘మతతత్వం – మహిళల జీవితం’.  ముప్ఫయ్ మూడేళ్ళక్రితం  ప్రచురించబడిన( 1990, ప్రజాసాహితి )   ఈ వ్యాసం   కాత్యాయనీ విద్మహే,  తోట జ్యోతిరాణి, వి.శోభ కలిసి వ్రాసారు. ముగ్గురూ   కాకతీయవిశ్వవిద్యాలయంలో తెలుగు , ఎకనామిక్స్ ,  పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ విభాగాలలో ప్రొఫెసర్లుగా చేసి రిటైర్ అయ్యారు. 1982 లో స్త్రీజనాభ్యుదయ అధ్యయనసంస్థను ఏర్పరచినప్పటి నుండి  మహిళాజనజీవన సమస్యలకు సంబంధించి ఆ ముగ్గురూ చేసిన రచనలలో ఇది ఒకటి. 1994 లో దీనితో పాటు మరొక 14 వ్యాసాలతో “ మహిళాజనజీవన సమస్యలు- మూలాల అన్వేషణ” అనే సంకలనాన్ని ప్రచురించారు. సాహిత్య సామాజిక శాస్త్ర విభాగాలకు సంబంధించిన ముగ్గురి సమిష్టి అధ్యయనం, అంతర్గత విషయ దృక్పథం ఈ రచనలో కీలకం.]

మానవ జీవన విధానంలో మతం ఒక సామాజిక చైతన్య రూపం. ఆహారాన్వేషణ దశలలో వేటాడి సంపాదించుకొన్న ఆహారాన్ని గుంపుజనం మధ్య పంపకం చేసే కర్మకాండ రూపంలో ‘మతం’ ప్రారంభమైంది. ప్రకృతి శక్తులతో సంఘర్షిస్తూ సంపాదించిన ఆహారాన్ని భయంతోనో, భక్తితోనో ఆ ప్రకృతికి సమర్పించికాని తాను తినకూడదన్న మానవుడి ఒకనాటి విశ్వాసం మత భావానికి మూలం. ప్రకృతిముందు మనిషి అనుభవించిన నిస్సహాయత  ప్రకృతి తమకంటే శక్తివంతమైందన్న గ్రహింపుకు దారితీసింది. అతీత శక్తిగా గౌరవించి  దాని దయను కోరి  ప్రార్థించేక్రమంలో  మతం అభివృద్ధి చెందింది. నిత్య జీవితంలో మనిషి అనుభవంలోకి వస్తున్న ఉదయాస్తమయాలు, గాలీ వానలు, నిప్పూ నీరు ,  ప్రకృతి బీభత్సాలు, చావు పుట్టుకలు ఇవేవీ కూడా ఎప్పుడు ఎట్లా సంభవిస్తున్నాయో అర్థంకాని ఆయోమయ పరిస్థితి నుండి వాటికి మూలాలను అన్వేషించే జిజ్ఞాసా దృష్టి ప్రబలింది. నిరంతరం పరిశీలనలో భౌతిక ఫలితాలను బట్టి భూమి, ఆకాశం, సూర్యుడు, చంద్రుడు, అగ్ని, వాయువు తమ జీవిత విధానాన్ని నిర్దేశిస్తున్నాయని గ్రహించి ప్రాచీన మానవులు వాటిని గొప్ప శక్తులుగా భావించి ఆరాధించటం మొదలుపెట్టారు.

సామాజిక పరిణామంలో ఉత్పత్తి శక్తులు, ఉత్పత్తి సంబంధాలు మారుతున్న క్రమంలో ఉపరితలాంశమైన మతం కూడా వాటికనుగుణంగా మార్పు చెందుతూ కొత్త రూపాలను సంతరించుకొంటూ వచ్చింది. ఆహారాన్వేషణ దశలో ఆటవిక సమాజపు ఉత్పత్తి శక్తులలో వచ్చే మొట్టమొదటి మార్పు ఆహారాన్ని నిలవవుంచే పరికరాలను తయారుచేసుకోవటం. ప్రసవం కారణంగా ఏ కొద్ది కాలమైనా ఒక దగ్గర స్థిరంగా వుండాల్సిన స్త్రీలే ఆహారాన్ని నిలవ వుంచేందుకు కుండలు, బుట్టలు తయారు చేయటం నేర్చుకొన్నారు. కుండ ఆహారాన్ని నిలవచేయటానికి ఉపకరించటమే కాక ఆహార సేకరణలోని ఆటుపోట్ల దుష్ప్రభావాన్ని తగ్గించి జీవితాన్ని గుణాత్మకంగా మెరుగుపరుస్తుంది. కనుక అది ఆరాధనీయమపుతుంది. ఆహారాన్ని మెత్తగా నలగగొట్టటం కోసం ఒక రాతిమీద మరొక రాతిని ఉపయోగించటం నేర్చుకొన్న మానవులకు రోలు, రోకలి, రుబ్బుడుపత్రం పూజనీయం కావటం కూడా ఆ క్రమంలోనే జరిగింది. ప్రకృతి శక్తుల ఆరాధన నుండి జీవన విధానాన్ని మెరుగుపరుచుకోవటానికి నిర్మించుకొన్న ఉత్పత్తి శక్తులను ఆరాధించే దశకు జరిగిన పరివర్తనం మత భావ పరిణామంలో గమనించదగిన మలుపు.

ఆహారాన్వేషణ దశ దాటి వ్యవసాయం కనుక్కొనే నాటికి భూమికివున్న ఆపారమైన ఉత్పత్తి శ క్తిని గురించిన గుర్తింపు కలిగింది. దీనిని స్త్రీకి వున్న పునరుత్పత్తి శ క్తితో పోల్చుకోవటం జరిగింది. ఫలితంగా వ్యవసాయాభివృద్ధిని కాంక్షిస్తున్న సమాజంలో మతానికి దేవతారూపం లభించటం, సహజంగానే ఆది స్త్రీ రూపం కావటం జరిగింది. స్త్రీ సంతానాన్ని కని తల్లి అవుతుండగా పంటలను ఉత్పత్తిచేసే భూమి కూడా ‘పుడమితల్లి’గా పూజనీయమైంది. వ్యవ సాయాన్ని కనుక్కొన్నది స్త్రీయే కనుక పునరుత్పత్తి శక్తివల్ల స్త్రీకి వ్యవసాయాన్ని అభివృద్ధిచేసే మహత్తు వుంటుందన్న విశ్వాసం నుండి పురాతనమతాలకు మూలమైన వ్యవసాయ క్రతువులు వ్యవసాయాన్ని చేసే స్త్రీల ప్రత్యక్ష అధీనంలోనే వుండేవి. మాతృస్వామ్య వ్యవస్థలో స్త్రీలు ఉత్పత్తి కార్యక్రమంలో చురుకైన పాత్ర నిర్వహించటంవల్ల వాళ్ళే పూజా కార్యకలాపాలు నిర్వహించే వాళ్ళయ్యారు. క్రమంగా పితృస్వామ్య కుటుంబ వ్యవస్థ ఏర్పడి, స్త్రీల మీద పురుషుల పెత్తనం స్థిరపడుతూ ఉత్పత్తి శక్తులు, సాధనాలు, మహత్తులు, క్రతు కార్యనిర్వహణ స్త్రీల నుండి పురుషులకు సంక్రమిస్తూ వచ్చిన సంధికాలంలో మగవాళ్ళయినా ఈ పూజా విధులు నిర్వర్తించే సందర్భాలలో స్త్రీ  రూపాన్ని వేషాన్ని ఆపాదించుకొని ‘స్త్రీలు’గా ఆ కార్యక్రమాలను నిర్వర్తించాల్సివచ్చింది.

వ్యవసాయం, పశుపోషణవల్ల ఏర్పడిన మిగులు ఉత్పత్తులు వ్యక్తి స్వంతమయ్యే క్రమంలో వర్గ సమాజము, ఆ మిగులు ఉత్పత్తులవల్ల పోగుపడిన స్వంత ఆస్తిని తన సంతానానికి వారసత్వంగా సంక్రమింపచేయాలన్న పురుషుడి సంకల్పం నుండి పితృస్వామ్యము ఏర్పడ్డాయి. పురుషాధిక్య స్వభావం గల వర్గసమాజ ప్రయోజనాలను పరిరక్షించటానికి రాజ్యం మొదలైన వ్యవస్థలు ఏర్పడుతూ వాటిలో భాగంగా మతం కూడా వ్యవస్థీకృత రూపాన్ని తీసుకొన్నది. ఆదిమ సమాజాలలో సేకరించిన ఆహారం నుండి కొంత భాగాన్ని ప్రకృతి శక్తుల సంప్రీతికోసం సమర్పించటం ఒక విశ్వాసంగా ప్రారంభమై, అలవాటుగా బలపడి, వ్యవసాయ సమాజాలలోకికూడా కొనసాగి వచ్చి, ఉత్పత్తి అయిన పంట నుండి కొంత భాగాన్ని దైవానికి కేటాయించే ఆచారంగా పరిణమించింది.

ప్రకృతి శక్తులను గురించిన అజ్ఞాత భయం దేవుని రూపాన్ని తీసుకొంటే ఆ దేవునికి ప్రతినిధులుగా వూజారులు బలమైన వర్గంగా స్థిరపడ్డారు. పితృస్వామ్య సమాజ లక్షణానికి అనుగుణంగా దైవానికి రూపురేఖలు మార్చటంలో ఈ పూజారి వ్యవస్థ ప్రముఖ పాత్ర వహించింది. అంతకుముందు ఆరాధనీయ స్థానంలోవున్న స్త్రీని తొలగించి పురుషాకృతిని ప్రవేశ పెట్టటం, క్రమంగా కొత్తగా ఏర్పడిన పురుష దేవతలకు అంతకుముందున్న స్త్రీ దేవతలను భార్యలుగా చేసి నూతన వ్యాఖ్యాన్నివ్వటం జరిగింది. ఈ దశలోనే మతానికి కేంద్ర స్థానాలుగా దేవాలయాలు అభివృద్ధి చెందాయి. దైవం పట్ల కృతజ్ఞతాసూచకంగా దేవాలయాలకు భూములను కేటాయించే ఆచారం మొదలైంది. ఆ విధంగా పంటమీద, భూమిమీద పెత్తనం కలిగిన పూజారివర్గం ప్రజల జీవితవిధానాన్ని నిర్దేశించే స్థాయికి చేరుకొంది.

క్రీ॥పూ॥ నాలుగువేల సంవత్సరాల నాటికే ఒక స్థిర రూపాన్ని తీసుకొన్న ఈ మతవ్యవస్థ క్రమంగా వర్గవ్యవస్థను పరిరక్షించటానికి ఏర్పడిన రాజ్యానికి ప్రధాన సహాయభూత అంగమైంది. వర్గ వ్యవస్థను, పితృస్వామ్య వ్యవస్థను పరిరక్షించటం లక్షణంగా ఇది బానిసలను, శ్రామికులను రాజ్యానికి ఎట్లా అధీనులను చేసిందో స్త్రీలను పురుషులకు అట్లా అధీనులుగా చేసింది. ప్రజల లౌకిక పారలౌకిక జీవితాలను క్రమబద్ధీకరించి సూత్రీకరణలు చేసి నిర్దేశించటం ద్వారా మతం ఒక జీవన విధానంగా ప్రత్యేక ప్రతిపత్తిని సంతరించుకొంది. అందులో భాగంగానే మతం పురుషుడి అస్తికి వారసులు కాగలిగిన పవిత్ర సంతానాన్నివ్వటం స్త్రీకి ప్రధాన ధర్మంగా నిర్దేశించింది. ఆ విధంగా మతం వర్గ స్వభావంతో, పితృస్వామ్యవ్యవస్థా స్వభావం తో పటిష్టమైన నిర్మాణ రూపాన్ని తీసుకొంది. ఏ మతానికైనా ఈ ప్రాధమిక లక్షణమే అనివార్యంగా వుంటుంది. 

భారతదేశంలో వున్నది ఒక మతం కాదు. అనేక మతాలు, ప్రాచీన కాలంలో వాటిని ఆస్తికమతాలనీ, నాస్తిక మతాలనీ అనేవారు. ఆస్తిక మతాలు వేద ధర్మాన్ని ప్రమాణంగా శిరసా వహించేవి. వేద ధర్మాన్ని అంగీకరించనివి నాస్తిక మతాలు. వైదిక మతం నాలుగువేల సంవత్సరాలకు పైగా చరిత్ర వున్న మతం. క్రీ.పూ. రెండువేల సంవత్సరాల నాటికే వేదాలు వైదిక మతానికి సంబంధించిన మొదటి సాహిత్యంగా వున్నాయి. క్రీ.పూ. ఐదవ శతాబ్దం నాటికి ఉపనిషత్తులు వచ్చి వైదిక సాహిత్యాన్ని విస్తృతపరిచాయి. క్రీస్తు శకారంభ కాలానికి స్మృతులు, భగవద్గీత హిందూ మత తాత్త్విక విషయాలను చెప్పే గ్రంథాలుగా ప్రాచుర్యంలోకి వచ్చాయి.

వైదిక మతంలో మీమాంస, వేదాంతం అని రెండు భాగాలున్నాయి. యజ్ఞయాగాది లౌకిక కర్మకాండ గురించి చర్చించేది మీమాంస కాగా, ప్రపంచ స్వరూప స్వభావాల గురించి, బ్రహ్మ పదార్థం గురించి చర్చించేది వేదాంతం. వీటిని పూర్వ మీమాంస, ఉత్తర మీమాంస అని కూడా వ్యవహరిస్తారు. నాస్తిక మతాల్లో లోకాయత, చార్వాక, జైన, బౌద్ధమతాలు ముఖ్యమైనవి. కాగా ఆస్తిక మతమైన వైదికమతం శైవం, వైష్ణవం అని రెండుగా పరిణమించింది. మధ్య యుగాలనాటి ముస్లిం దండయాత్రలతో సామ్రాజ్య నిర్మాణంతో భారతీయ సమాజంలోకి ప్రవేశించిన ఇస్లాం మతంకంటే భిన్నంగా విస్పష్టంగా కనబడటం లక్షణంగా అంతకుముందు నుండి వస్తున్న అస్తికమతాలైన శైవ వైష్ణవాలు వైదికమత తాత్విక భావజాలంతో  కలిసి హిందూమతం అనే పేరుతో వ్యవస్థిత మయ్యాయి.

హిందూమతం ప్రధానంగా మత తాత్విక సంస్కృతిగా వుంటుంది. అంటే, ఇందులో మతం, తత్వశాస్త్రం, సంస్కృతి అన్నీ కలగా పులగంగా కలిసి వుంటాయి. వేదం  నుండి ప్రారంభించి, ఉపనిషత్తులు, అరణ్యకాలు, బ్రాహ్మణాలు, ధర్మసూత్రాలు, పురాణాలు మొదలైన అనేక రూపాలలో హిందూ మత సంస్కృతి పరివ్యాప్తమై జీవన విధానం నుండి విడదీయరాని భాగమైంది. ఈ వైదికమత సంస్కృతిలోని యజ్ఞయాగాది కర్మకాండను, విగ్రహారాధనను వ్యతిరేకిస్తూ క్రీ. పూ. ఏడవ శతాబ్దం నాటి కొత్త మతాలు జైన, బౌద్ధాలు ప్రచారంలోకి వచ్చాయి. ఆనాటి ఉపనిషత్ తత్త్వశాస్త్రానికి ప్రతిగా జరిగిన సిద్ధాంత ఘర్షణ నుండి బౌద్ధ తత్త్వశాస్త్రం ఆవిర్భవించింది. నిరంతర పరిణామం ప్రకృతి లక్షణమనే గతితార్కిక సూత్రాన్ని కేంద్రంగా చేసుకొని బౌద్ధం వికసించింద.  ఉపనిషత్ తత్త్వశాస్త్రంపట్ల అసంతృప్తి వున్నప్పటికీ దానికి ప్రత్యామ్నాయ సిద్ధాంత పరికల్పన చేయటం కాక జైనం ఏదీ ఇదమిత్థంగా తేల్చక స్వాదు  వాదాన్ని అవలంబించింది. అనేక మతాల నుండి ఏదో ఒక మంచిని స్వీకరించి అన్నింటినీ కలుపుకుపోయింది.

భౌతికవాద దృక్పథం కలిగిన మానవ సామాజిక లౌకిక జీవితం గురించి ఆలోచిస్తూ జైన బౌద్ధమతాలు ఒకవైపు ప్రజల దృష్టిని ఆకర్షిస్తుండగా మరొక వైపు దానికి ప్రతిగా వైదికమత దృక్పథాన్ని జనంలో గట్టిగా నిలబెట్టటం కోసం ప్రయత్నాలు ప్రారంభమై అందులో భాగంగా నామరూపగుణ పూజా విధానం అభివృద్ధిచెందింది. యజ్ఞయాగాది కర్మకాండవల్ల లభించే కైవల్యం ఇప్పుడిక ప్రత్యేక దైవాలను ఆరాధించటంవల్ల లభిస్తుంది. బ్రాహ్మలతో పాటు మిగిలిన వర్ణాల వారందరూ కూడా దైవ సంబంధ కార్యకలాపాలలో ప్రత్యక్ష భాగస్వామ్యం ద్వారా కైవల్యం పొందటానికి హక్కును పొందారు. ఈ క్రమంలోనే వైదిక దేవతలైన శివుణ్ణి, విష్ణువును కేంద్రంగా చేసుకొని భక్తి ఉద్యమాలు ప్రాబల్యంలోకి వచ్చాయి.

ఈ వేదిక అవైదిక భక్తి మతాలు కాక భారతదేశంలోకి వచ్చిన మరొక రెండు మతాలు కూడా వున్నాయి. క్రీ.శ. ఏడవ శతాబ్దంలో ఏర్పడిన ఇస్లాం మతం తొమ్మిదవ శతాబ్దం నుండి భారతదేశం మీద ప్రారంభమైన ముస్లిం దండయాత్రల కారణంగా భారతదేశంలోకి ప్రవేశించింది. ముస్లింలు పాలకులు కావటంవల్ల, వివిధ స్థాయిలలో ముస్లిం జనం భారతీయ సమాజంలో స్థిరపడటంవల్ల ఇస్లాం జన జీవితంలో భాగం కావటం జరిగింది. ఇస్లాం మతం కంటే ఏడువందల సంవత్సరాలకు ముందే ఏర్పడిన క్రైస్తవ మతం వ్యాపారం కోసం వచ్చిన పోర్చుగీసువారి అండతో భారతదేశంలో ప్రాబల్యానికి వచ్చింది. బ్రిటిష్ వలస పరిపాలనలో బాగా స్థిరబడింది. విద్యా, వుద్యోగ, ఉత్పత్తి సంబంధాల ద్వారా, సంస్కృతి ద్వారా భారతీయ జనజీవితాన్ని రకరకాలుగా ప్రభావితం చేయటంలో ప్రముఖపాత్ర వహించింది.

ఐరోపాదేశాలలో పెట్టుబడిదారీ సంబంధాలు ఏర్పడిన క్రమంలో అక్కడి  క్రైస్తవ మతం కూడా మారుతున్న ఉత్పత్తి సంబంధాలకు అనుగుణంగా ఉదార స్వభావాన్ని సంతరించుకొని భారతదేశంలోకి అడుగు పెట్టడంవల్ల భూస్వామ్య సంస్కృతిలో కరుడుకట్టివున్న హిందూ మత భావజాల వ్యవస్థ కంటే అభ్యుదయకరంగా కనిపించటం సహజంగా జరిగింది. దీనిని ఉపయో గించుకొని క్రైస్తవ మిషనరీలు హిందూ వర్ణవ్యవస్థలోని అట్టడుగు వర్గాలను క్రైస్తవంలోకి మార్చటానికి అవకాశం లభించింది. ఇంగ్లీషు విద్య అందించిన నూతన విజ్ఞానం కారణంగా సామాజిక ఆర్థిక జీవన పరిస్థితులలో వస్తున్న మార్పుకు అనుగుణంగా భారతీయ సాంఘిక వ్యవస్థ, హిందూ మత వ్యవస్థ సంస్కరణకు లోనుకావటం చారిత్రక అవసరమైంది. ముఖ్యంగా మత విషయంగా క్రైస్తవ మిషనరీల ప్రాబల్యాన్ని ఎదుర్కోవటానికి వర్ణ వ్యవస్థలోనూ కుటుంబ వ్యవస్థలోనూ కరుడుగట్టిన దురాగతాలను ఖండిస్తూ సంస్కరణలను ఆశిస్తూ బ్రహ్మసమాజం, ఆర్యసమాజం మొదలయిన సంస్థలు ఏర్పడి పనిచేశాయి.

మొదటి నుండి వైదిక మతం ఎన్ని కొత్త మతాలు వస్తున్నా వాటిలోని ప్రత్యేక తాత్త్వికాంశాలను సామరస్య పూర్వకంగా గ్రహించటం ద్వారా ప్రజల్లో తన పట్టును కోల్పోకుండా నిలబడగలిగింది. ఇవన్నీ నూతన మతాల ప్రభావాలను ఎదుర్కోవటం కోసం తాత్కాలికంగా చేసుకొన్న సర్దుబాట్లే తప్ప మౌలికంగా వైదిక మత తాత్త్విక భావజాలంలో అభ్యుదయకరమైన మార్పుకు కారణమైన శక్తులు కాదన్నది వాస్తవం.  క్రైస్తవంగాని ఇస్లాంగాని చారిత్రకంగా తరువాత కాలాలలో వచ్చినవి కావటంవల్ల హిందూమతంలో కంటే కొన్ని అభ్యుదయకరమైన అంశాలను ప్రస్తావించే అవకాశం వుంది. అయినా అవికూడా మౌలికంగా హిందూ మతంకంటే భిన్నమైనవి ఏమీ కావు. ఆస్తిత్వంలో వున్న అసమసమాజాన్ని అంగీకరించి తదనుగుణమైన ఆర్థిక, సాంఘిక సాంస్కృతిక విలువలను ప్రబోధించినవే. ఆక్రమంలో స్త్రీ  పరాధీనతను, పురుషాధిక్యతను క్రమబద్ధీకరించే సూత్రావళిని రూపొందించినవే. ఫలితంగా హిందూ మతం గానీ, ఇస్లాం క్రైస్తవ మతాలుగానీ స్త్రీలకు పురుషులతో సమానమైన సాంఘిక ఆర్థిక స్థాయిని, స్వతంత్ర ప్రతిపత్తిని పూర్తిగా నిరాకరించినవిగానే కనబడతాయి. 

2

అన్ని మత సిద్ధాంతాలూ సూత్రాలూ పురుషులను కేంద్రంగా చేసుకొని పురుషులను వుద్దేశించి రూపొందించబడినవే. పురుషుని జీవితానికి సంబంధించి ప్రమేయం వున్నంత మేరకు మాత్రమే స్త్రీ గురించి అవి చెబుతాయి. పురుషుడి జీవితాన్ని ఐహికాముష్మిక స్థాయిలలో వున్నతంగా నిర్మించుకొనడాన్ని గురించి ప్రధానంగా చెబుతూ స్త్రీ జీవితం ఆ పురుషుడి జీవితం కోసమే అన్నట్లుగా అనుషంగికంగా మాత్రమే చెప్పాయి. మోక్షమూ స్వర్గమూ అన్నీ పురుషుల నుద్దేశించే వివరించబడ్డాయి. పురుషుల కోసం ఈ లోకంలోనే కాదు స్వర్గంలో కూడా స్త్రీలకు అందమైన వాళ్ళను ‘పవిత్రుల’ను ఏర్పరచాయి. మోక్షానికి భార్యా  పుత్రవిత్తాదులయందు మోహం అవరోధంగా వుంటుందని దాదాపు అన్ని మతాలు చెప్పాయి. పితృస్వామ్య సమాజంలో భౌతిక ప్రపంచం పురుష ప్రయోజనాలకోసం తయారు చేయబడ్డట్లుగానే ఆధ్యాత్మిక ప్రపంచంకూడా దానికి అనుగుణంగా పురుష ప్రయోజనాలకోసం పురుషుల దృష్టికోణం నుండి నిర్మించ బడటం గమనించవచ్చు. మతాలు అవలంబించిన ఈ పాక్షిక దృష్టి కోణాన్ని ఖురాన్ గుర్తించింది కూడా. ఇట్లా గుర్తించటం ఆశ్చర్యకరమైన విషయమే. అయితే స్త్రీలు పురుషులకు అనుచరులే కదా అన్న కారణాన్ని చూపి వాళ్ళకోసం ప్రత్యేకించి మత ధర్మాలేవీ చెప్పాల్సిన అవసరం లేదని సమర్థించుకున్నది. (ఖురాన్ తృతీయ భాగం, కాండ 22, పుట 47 )

భగవంతుడనే ఒక అతీతశక్తిని విశ్వసించిన అన్ని మత సిద్ధాంతాలు చరాచర భౌతిక ప్రపంచ సృష్టిని గురించిన ప్రశ్నలు లేవనెత్తి వాటన్నింటికీ సమాధానంగా భగవంతుణ్ణి చూపించాయి. వైదికమతం సృష్టి కారకుడుగా బ్రహ్మను చూపిస్తుంది. బ్రహ్మ తన దేహాన్ని రెండుగా విభజించుకొని ఒక భాగంతో పురుషుడుగానూ మరొక భాగంతో స్త్రీగానూ అయినదని చెబుతుంది. క్రైస్తవం దేవుడు మొదట మగవాణ్ణి సృష్టించాడని,ఆ తరువాత మగవాని పక్కటెముక నుండి స్త్రీని సృష్టించాడని చెబుతుంది. అట్లాగే ఇస్లాం కూడా దేవుడు ముందు ఒక ఆత్మను సృష్టించి దానినుండి దాని జతను పుట్టించాడని చెప్పి ఆదమ్ నుండి హవ్వ పుట్టిందని ప్రతిపాదిస్తుంది. (ఖురాన్ ప్రథమ భాగము కాండము 4, పు. 204.)ఇట్లా పురుషుని నుంచే స్త్రీ జన్మించింది అన్న నమ్మకం నుండే ఆమె పురుషుడి కంటే అన్నింటా తక్కువదన్న భావన ప్రపంచంలోకి వచ్చింది. వైదిక మతం ప్రత్యేకంగా పుట్టుకతోనే స్త్రీలు పురుషుల కంటే తక్కువని ప్రత్యేకంగా చెప్పకపోయినప్పటికీ స్త్రీలు పురుషుల కొరకే సృష్టించ బడ్డారు అన్న భావనను మాత్రం మిగిలిన అన్ని మతాల్లాగానే పెంచి పోషించింది.

అయితే మిగిలిన మతాల్లో లేని వర్ణ వ్యవస్థ వైదిక మతానికే ప్రత్యేక మైంది.అందువల్ల ఈ మతం ప్రబోధించే ధర్మాలన్నీ వర్ణధర్మాలుగా వుంటాయి. కనుకనే బ్రాహ్మణులకు వుద్దేశించబడిన జీవిత ధర్మాలు మిగిలిన వారందరి జీవిత ధర్మాలకంటే భిన్నంగా వుంటాయి. వైదిక మతం బ్రాహ్మణ వర్ణ ఆధిక్యతను స్థిరపరుస్తూ మిగిలిన వర్ణాలవారి జీవిత విధానాన్ని వాళ్ళకు అనుబంధం చేసింది. అందువల్లనే వైదిక మత సాహిత్యంలో ప్రస్తావించబడిన జాతకర్మాదులు బ్రాహ్మణులకు వర్తించినంతగా మిగిలిన వర్ణాలకు వర్తించవు. అదే విధంగా స్త్రీలకు కూడ వర్తించవు. వైదిక మతం ఆడపిల్లలకు జాత కర్మలు మంత్రంతో పని లేకుండా చేయాలని నిర్దేశించింది. మంత్రం అనేది ప్రకృతి శక్తులమీద అదుపుకోసం సృష్టించుకొన్న ఒక కాల్పనిక చర్య. శిశువు పుట్టినప్పటి నుండి పెరిగి పెద్దయ్యే వరకు ప్రకృతి శక్తుల నుండి రక్షణకోసం మంత్రపూరితమైన ఈ చర్యలు వివిధ దశలలో పాటించబడుతుంటాయి. అయితే మగ పిల్లలకు అన్ని మంత్రపూరితంగా చేయాలని చెప్పిన వైదిక మతం ఆడ  పిల్లలను మాత్రం దానినుంచి మినహాయించింది. ఇట్లా మినహాయించడం వలన ఆడపిల్లలు పుట్టుకతోనే మగ పిల్లలకంటే తక్కువ వాళ్ళని, అంత శ్రద్ధ పెట్టి వేడుకగా పెంచవలసిన అవసరం లేదని  చెప్పకనే చెప్పినట్లయింది.

పైగా, స్త్రీలకు జాతకర్మనామకరణాదులు మంత్రపూరితంగా లేకపోవడం వల్ల వాళ్ళు పాపరహితులు కాలేదనీ, పాపాలను పోగొట్టే మంత్ర జపాలు చేసే హక్కు లేనివాళ్ళు కావటం చేత వాళ్ళు ‘ఆశుభ’లు అని శాస్త్రాలు పేర్కొంటున్నాయని చెబుతూ మనుస్మృతి మొత్తంమీద అడపుట్టుకను పాపకర్మ అనీ , అశుభ లక్షణం అనీ  తేల్చింది. క్రైస్తవం మగపిల్లవాణ్ణి కన్న స్త్రీకి ఏడు రోజులు పురుడు వుంటే ఆడపిల్లను కన్న స్త్రీకి రెండు వారాల పురుడు ఉంటుందని చెప్తుంది. (305 3.90.) శిశువు జన్మించినప్పుడు ప్రసవ సమయంలో స్త్రీకి  రక్త స్రావం కావటమనేది సహజాంశమే అయినా అది ఆడపిల్లను కన్నప్పుడైనా  మగపిల్లవాణ్ణి కన్నప్పుడైనా ఒకే తీరుగా వుంటున్నా ఆడపిల్ల విషయంలో పురిటి మైలవుండే కాలం మగపిల్లవాడు పుట్టినప్పటి కాలంకంటే రెట్టింపు వుండటాన్ని బట్టి చూస్తే ఆడపిల్ల పుట్టుకను పాపకర్మగా క్రైస్తవం కూడా భావించినట్లే. అయితే భౌతికవాద దృక్పథం కలిగిన బౌద్ధంలో సృష్టిక ర్తకు చోటులేదు కనుక స్త్రీ పురుషులను భగవంతుడు అసమానులుగా సృష్టించాడన్న వాదనకు అవకాశం లేకుండా పోయింది.

పురుషునివైపు నుండి ఆస్తిని సంతానానికి వారసత్వంగా సంక్రమింపజేసే పితృస్వామిక సంస్కృతి మగపిల్లవాని పుట్టుకను వాంఛించింది. పితృస్వామ్య సంస్కృతికి అనుగుణంగా రూపొందిన మతం కూడా ఆధ్యాత్మిక అవసరాలను తీర్చే అధికారం పురుషుడి కివ్వటం ద్వారా ఆ భావనను బలపరిచింది. ఋగ్వేదంలో పుత్రులకోసం ప్రార్థనలు జరిపిన సన్నివేశాలు, వీర పుత్రులను కన్న తల్లిని గౌరవించిన సంగతులు వుండటం గమనించవచ్చు. మగపిల్లవాడి పుట్టు కను కోరుతూ జరిపే వుత్సవాలను గురించి, గర్భస్థపిండం ఆడపిల్ల కాకుండా మగపిల్లవాడే కావాలని దేవతలను ప్రార్థించటం గురించి ఆధర్వణవేదం ప్రస్తావిస్తుంది. అంతమాత్రాన ఆడపిల్లల పుట్టుక పూర్తిగా వ్యతిరేకించబడిందని అనుకోనక్కరలేదు.  కాని కాలక్రమంలో సంపదలు కేంద్రీకృతమవుతూ అసమానతలు పెరిగిపోతున్న దశలలో పితృస్వామ్య సాంస్కృతిక విలువలు, ఆచార సంప్ర దాయాలు ఆడపిల్లను కుటుంబానికి భారంగా మార్చాయి. అందువల్లనే తరువాత కాలంలో ఆడపిల్లను పుట్టగానే చంపేసే  దురాచారం ప్రారంభమై, క్రీ. శ. అయిదారు శతాబ్దాలనాటికి తీవ్రమైంది.

 క్రీశ. ఏడవ శతాబ్దంలో వచ్చిన ఇస్లాం మతం ఒక నూతన జీవిత విధానాన్ని ప్రతిపాదించే క్రమంలో అంతకు ముందరి సమాజాలలో వున్న కొన్ని భావనలను ఖండించింది. కొన్నింటిని బలపరిచింది. ముఖ్యంగా అప్పటి సమాజాలలో వున్న ఆడపిల్ల పుట్టుకను నిరసించటాన్ని,   పుట్టిన ఆడపిల్లను చంపెయ్యటాన్ని  తీవ్రంగా విమర్శించింది. కుమార్తెలు కలిగితే అసహ్యపడటం, అవమానపడటం అనిష్టత చూపటం ఆవిశ్వాసుల లక్షణమని అంటుంది. పేదరికం వల్లనైతేనేమీ సిగ్గు వల్లనైతే నేమీ ఆడపిల్లను పాతి పెట్టి చంపే ఆచారాన్ని కూడా ప్రస్తావించి ఖురాన్ అది ఆవిశ్వాసులైన స్త్రీలు చేసే పనిగా పేర్కొని ప్రమాణం చేయటం ద్వారా విశ్వాసులుగా మారవచ్చని చెబుతుంది. (ఖురాన్ మూడవభాగం కాండం 25 28 పే 208, 368.) బీదతనం చేత పోషించలేకనో, పెళ్ళి ఖర్చులు భరించ లేకనో వాళ్ళను ఇతరులు పెళ్ళాడుట తమకు అవమానకరమని అనుకోవటం వల్లనో, కుమార్తెలను ప్రాణాలతోనే పాతిపెట్టేవాళ్ళకు ఘోర నరక శిక్షలను చూపి భయ పెడుతుంది. ఈ మేరకు ఆడశిశు హత్యను వ్యతిరేకించినట్లే. అయితే ఈ ఆలోచనల ప్రాతిపదిక మీద స్త్రీ  జీవితాన్ని అభివృద్ధికరంగా నిలబెట్టే దృష్టి ఖురాన్ పరిధికి ప్రధానం కాదు. అల్లాపట్ల విశ్వాసాన్ని స్థిరపరిచే ఆకాంక్షతో అప్పటివరకు సమాజంలో వస్తున్న అమానవీయ విలువలను తిరస్కరిస్తూ వాటిని అల్లా పట్ల విశ్వాసంలేనివాళ్ళ భావాలుగా ప్రసక్తాను ప్రసక్తంగా చెప్పింది.

వైదిక మతం వేద విజ్ఞానాన్ని, తత్త్వవిషయాలను విద్య అనుకున్నది. ఈ విద్య స్త్రీలకు కూడా అందుబాటులో వున్నట్లు వైదిక వాఙ్మయంలో ఆధారాలున్నాయి. అయినా ఈ విద్య స్త్రీలకు సహజమైన హక్కుగా పరిగణించబడలేదు. అందువల్లనే గార్గి, మైత్రేయి లాంటి బ్రహ్మవాదినులైన స్త్రీలున్నప్పటికీ కాత్యాయనిని కేవలం శ్రీ సహజమైన ప్రజ్ఞలు కలదిగా బృహదారుణ్యకోపనిషత్తు చెప్పిన దానినిబట్టి విద్య స్త్రీ జీవితంలో ప్రధానమైన అంశం కాదని గృహ కృత్య నిర్వహణమే ఆమె సహజ విద్య అని వైదిక మతం భావించినట్లు స్పష్టం మవుతుంది (బృహదారణ్యకోపనిషత్తు పే. 348) చాతుర్వర్ణ వ్యవస్థలో వేద విద్య నాలుగోవంతు ప్రజలకు మాత్రమే చెందింది. ఇందులో కూడా సగ భాగమైన స్త్రీలకు ‘స్త్రీ ప్రజ్ఞ’ అంటే గృహకృత్యాలు చేయటం ప్రధాన ధర్మంగా నిర్దేశించటంవల్ల వాళ్ళు కూడా చాలా వరకు విద్య నుండి మినహాయించబడ్డారు.   ఫలితంగా చదువుకున్న స్త్రీలు వేళ్ళమీద లెక్క పెట్టే విధంగా వున్నారు. వేద విద్య సంగతి ఇట్లావుంటే మిగిలిన లౌకికవిద్యలను గురించిన ప్రస్తావన ఎక్కడా కనబడదు. మిగిలిన మూడు వర్ణాల వాళ్ళ స్త్రీల నిత్యనైమిత్తిక జీవిత వ్యవహార జ్ఞానాన్ని అసలే పట్టించు కోకపోవటం దీనిలో స్పష్టమవుతుంది.

మానవుల దుఃఖానికి కారణాలను అన్వేషిస్తూ ఆ కారణాలను ఆభావం చేయటం అంతిమ లక్ష్యంగా పరిణమించిన బౌద్ధం దుఃఖ కారణాలను తెలుసు కోవటం విద్యవల్ల, తత్త్వశాస్త్రాల అధ్యయనం వల్ల సాధ్యమవుతుందని ప్రతిపాదిస్తుంది. వైదిక మతంలోని చాతుర్వర్ణ వ్యవస్థను నిరాకరిస్తుంది. కనుక బౌద్ధం ఈ రకమైన విద్య సమాజంలోని ఏ ఒక్క భాగానికో చెందినట్లు భావించలేదని స్పష్టమవుతుంది. ఇందులో భాగంగా స్త్రీకి కూడా విద్య అవసరమని చెప్పటం బౌద్ధంలో సహజంగా జరుగుతుంది.

ఇస్లాం స్త్రీలపై పురుషుల ఘనతను ప్రతిపాదిస్తూ, దేవుడు అనేక కార్యములు చేయుటకై పురుషునికి విద్య, బలము మొదలైన యోగ్యతలను ప్రసాదించాడని చెబుతూ, అవి లేనందున స్త్రీలు ఎన్నటికీ పురుషులకు సమానులు కారని చెబుతుంది (ఖురాన్ ఐదవ భాగం కాండము 5. పే, 221). అంటే ఇస్లాం స్త్రీకి విద్యార్హతే లేదని భావించినట్లు స్పష్టమవుతుంది.

మతాలు స్త్రీకి గృహకృత్య నిర్వహణమే ప్రధానమని చెప్పటంవల్ల భూస్వామ్య సంస్కృతి స్థిరపడే కొద్దీ ఆ భావాలు స్త్రీ  విద్యపట్ల వ్యతిరేక దృక్పథానికి వ్యక్తీకరణలు అయ్యాయి. ఫలితంగా స్త్రీ విద్య ఆటు స్త్రీకి ఇటు స్త్రీకి సంబంధించిన పురుషుడికి కూడా హానికరమన్న మూఢవిశ్వాసం ప్రబలింది. ఐరోపా దేశాలలో ఫ్రెంచి విప్లవ ప్రభావ ఫలితంగా విద్యపట్ల అనుకూల దృక్పథం ఏర్పడితే ప్రత్యేకించి భారతదేశంలో వలస పాలనా ప్రభావ ఫలితంగా మతసంస్కరణో ద్యమాలు వచ్చి బ్రహ్మసమాజం, ఆర్యసమాజం లాంటి సంస్థలు చేసిన ప్రచార కృషి ఫలితంగా కాని స్త్రీ విద్యకు తిరిగి అనుకూల దృక్పథం ఏర్పడలేదు. మత సంస్కరణోద్యమాలు స్త్రీ  విద్యను ప్రోత్సహించినప్పటికీ అవి పితృస్వామిక చట్ర పరిధిలోవే కావటం వల్ల ఆ చదువులు స్త్రీల అభివృద్ధికి ఏమాత్రం దోహదం చేయలేదు సరికదా,వారిని ఆధునిక గృహిణులుగా, మంచి తల్లులుగా తయారుచేయటానికి మాత్రమే వుపకరించాయనేది వాస్తవం.          

ఏదిఏమైనా ఇప్పుడు స్త్రీ విద్య ఎంత విస్తృతంగా వున్నదని అనుకున్నా ఆది మతం వేసిన పునాదుల మీదనే నిర్మితమైందనీ, అభివృద్ధి చేయబడిందని మనం విస్మరించ కూడదు. ఇంటి పనులు చేయడమే స్త్రీకి విద్యగా నిర్దేశించిన పితృస్వామ్య సమాజం స్త్రీకి ఆ ఇల్లు పెళ్ళి వల్ల ఏర్పడుతుందని చెబుతుంది. అందువల్ల ఆమె  జీవితంలో పెళ్ళిని ఒక ప్రధానాంశంగా చేసింది. అందుకు అనుగుణంగానే మతధర్మాలుకూడా స్త్రీకి పెళ్ళిని జీవితపరమార్థంగా ప్రతిపా దించాయి.  స్త్రీ పురుష సంబంధాలు దంపతీ సంబంధాలుగా స్థిరపడే క్రమంలో ఋగ్వేదకాలం నాటికి పెళ్ళి ఒక తప్పనిసరయిన మత కర్మకాండగా రూపాందింది. దంపతీ సంబంధాల పరమోద్దేశం సంతానానికి తండ్రి ఎవరో ఖచ్చితంగా గట్టిగా తెలిపే అవకాశాన్ని కల్పించటం. అందుకనుగుణంగానే ఒక స్త్రీకి ఒక్కడే  పురుషుడన్న భావన ప్రాతిపదికగా స్త్రీల పవిత్రతకు ప్రాముఖ్యత వచ్చింది. కనుకనే వివాహ వ్యవస్థలో కన్యాత్వానికి అనితర ప్రాధాన్యత ఏర్పడింది.

వైదిక కర్మకాండలో మంత్రం ఒక ప్రధాన అంశం. వివాహంలో ఈ మంత్రాలు కన్యలయందే వుంచబడినవని, కన్యలు కానివారి విషయంలో ఈ మంత్రాలు వర్తించవని చెప్పటం ద్వారా మనుస్మృతి వివాహంలో స్త్రీల కన్యాత్వం తప్పనిసరి అంశంగా చేయటం కనబడుతుంది. మనుస్మృతి కన్యాత్వాన్నింతగా నొక్కి చెప్పటం అనిందితమైన సంతానం కోసం. పితృస్వామ్యం బలపడుతున్న దశలో వచ్చింది కనుక వైదిక మతం సంతానం మీద తండ్రి హక్కును బలపరిచేందుకు వీలుగా కన్యాత్వాన్ని ఇంతగా ప్రధానంచేసి చెప్పాల్సి వచ్చింది. ఈ పితృస్వామిక విలువలు బాగా బలవడిన తరువాత వచ్చిన క్రైస్తవం కూడా కన్యాత్వాన్ని నొక్కి చెప్పింది. యెహోవా మోషేకు చెప్పిన విషయాలలో సంతానాన్ని అపవిత్ర పరచకూడదన్న ఆలోచనలో పురుషుడు వితంతువును కాని భర్తచే వదిలివేయబడిన స్త్రీని కాని, దుష్టురాలిని కాని, జార వనితాను  కాని పెళ్ళి చేసుకోకుండా కన్యనే పెళ్ళిచేసుకోవాలని స్పష్టంగా చెప్పటం గమనార్హం. (బైబిల్ లెవీయ కాండము 21 వ అధ్యాయము, పే. 99.)

  వివాహం మతపరమైన తంతు కనుక తన సహజ లక్షణమైన పురుష ప్రాధాన్యతను స్త్రీల ఆధీనత్వాన్ని బలపరిచేదిగా తయారైంది. కనుకనే స్త్రీని  జీవం లేని వస్తువు కింద జమకట్టి పురుషుడికి సర్వహక్కులతో దానం చేసే  విధానం పెళ్ళి తంతులో భాగంగా ఏర్పడింది. ఈ పెళ్ళివల్ల పురుషుడికి భార్య మీదనే కాకుండా భార్యకనే సంతానం మీద కూడా సర్వహక్కులూ లభిస్తాయి. స్త్రీ  క్షేత్రమూ, పురుషుడు బీజము అన్న భావనను ప్రాతిపదికగా చేసుకొని బీజ ప్రాధాన్యాన్ని అన్ని మతాలూ ప్రతిపాదించాయి. విత్తనాన్నిబట్టి చెట్టు కనుక ఆ మనుష్యులలో కూడ బీజమే ప్రధానమని, అందువల్ల సంతానాన్ని పురుషుడి వైపు నుండే గుర్తించాలని మనుస్మృతి చెబుతుంది. భూముల మీద స్వామ్యం ఏర్పడినట్లుగా క్షేత్ర తుల్యం అయిన స్త్రీ  మీద కూడా పురుషుడికి స్వామ్యం ఏర్పడిన క్రమంలో క్షేత్రాధికారిగా ఆ స్త్రీకి కలిగిన సంతానం మీద పురుషుడికే హక్కని గట్టిగా నొక్కి చెప్పింది మనుస్మృతి (మనుస్మృతి 9.33,40,45,54.) స్త్రీ ని పురుషుడి పొలంగా భావిస్తూ ఇస్లాం, స్త్రీలు పురుషులకు క్షేత్రములని, ఎట్లు పొలములు బీజోత్పత్తికి కారణములో అట్లే స్త్రీలు సంతానానికి కారకులని ఖురాన్ చెబుతోంది. (ఖురాన్ ప్రధమ భాగం పు 93,94.) వైదిక మతంలాగే ఇస్లాం కూడా సంతానంపై హక్కు తండ్రిదే అని చెబుతోంది.

స్త్రీని భూమిలాగా ఒక ప్రధానమైన స్థిరాస్తిగా చేసింది పితృస్వామ్మ వ్యవస్థ. వ్యక్తిగత ఆస్తి ప్రాతిపదికగా గల వర్గ సమాజాలలో భూస్వామి కంచెలు గట్టి భూములను ఆక్రమించుకొని సంరక్షించుకున్నట్లుగానే పురుషుడు క్షేత్ర ప్రాయమైన స్త్రీని నియంత్రణ చేయటం లక్ష్యంగా మతం కొన్ని భ్రాంతి భావనలను కల్పించింది. అది ప్రాతిపదికగా స్త్రీలను అదుపు చేసేందుకు కొన్ని సూత్రాలను రూపొందించింది స్త్రీలకు వ్యభిచార లక్షణం స్వాభావికమనటం అట్లా కల్పించిన ఒక భ్రాంతి. ఆ భ్రాంతి వరికల్పనమీదే పురుషులు జాగరూకులై స్త్రీలను ఎల్లవేళలా రక్షించుకోవాలని చెప్పటం జరిగింది. పురుషులను మోహింపచేసి వారిని చెరచటం స్త్రీల సహజ లక్షణమని కనుక విద్వాంసులు స్త్రీల విషయంలో ఏమరుపాటుగా ఉండాలని మనుస్మృతి హెచ్చరించింది. భర్త మొదలైన పురుషులందరూ నిషిద్ధములైన రూపరసగంధాది విషయములందు స్త్రీల మనస్సును పోనీయక వారిని తమ ఆధీనంలో వుంచుకోవాలని మనుస్మృతి నిర్దేశించింది. అందువల్లనే తల్లితోడు వరస అయిన స్త్రీలతో కూడా పురుషుడు ఒంటరిగా కూర్చోరాదని హెచ్చరిస్తుంది. (మనుస్మృతి. 2. ఆధ్యాయం 213, 214.)

బౌద్ధం కూడా స్త్రీలు మోహకారకులని భావించి. వాళ్ళను చూడకూడదని, వాళ్ళతో మాట్లాడరాదని, వాళ్ళ నుండి దూరంగా వుండాలని బోధించింది.. జైనం కూడా ఈ విషయంలో బౌద్ధాన్నే అనుసరించింది. నాస్తికమతాలైన బౌద్ధ, జైనాలు  వైదికమతం కంటే భిన్నంగా స్త్రీలకు మత విషయకమైన స్వతంత్ర ప్రవృత్తితో ప్రవర్తించటానికి అవకాశమిచ్చినా మౌలికంగా మోహకారకులన్న భావనను ఏమాత్రం వదులుకోలేకపోయాయి.అలాగే వైదికమతంలో భాగమే అయిన శైవ, వైష్ణవ భక్తి ఉద్యమాలు స్త్రీల విషయంలో వుదారంగా ప్రవర్తించినప్పటికీ భక్తుడు భగవంతుణ్ణి చేరడానికి స్త్రీని అవరోధంగానే భావించాయి. మౌలికంగా భక్తి ఉద్యమం స్త్రీ పురుష ఆసమానతను వ్యతిరేకించేది అయినప్పటికీ అద్వైత భావవాద ఫలితంగా భక్తి పుద్యమంలోకి స్త్రీ వ్యతిరేకత ప్రవేశించటం ఒక వైరుధ్యం.

క్రెస్తవం, ఇస్లాం  కూడా స్త్రీని  మోహకారణమని పేర్కొన్నవే .  స్త్రీని ముట్టకుండుట పురుషునికి మేలని, స్త్రీ  సౌందర్యానికి మోహపడవద్దని బైబిలు (కొత్త నిబంధన, కొరింథీయులకు 6, 7 అధ్యాయాలు, పు : 149.) (పాత నిబంధన, సామెతలు, అధ్యా. 4, 5, 7పు : 532 – 535) చెప్పిన విషయాలు ఇక్కడ గమనించదగినవి. స్త్రీల వైపు తలెత్తి సూటిగా చూడటమే మోహమునకు, చెడుతలంపులకు కారణమవుతుందని పురుషుడిని జాగరూకుడై వుండమని ఖురాన్ హెచ్చరిక చేయటం గమనించవచ్చు.  (2వ భాగం, పు : 402).

స్త్రీని  మోహకారణమని చెప్పిన మతాలు స్త్రీ నుండి దూరంగా వుండమని పురుషుణ్ణి హెచ్చరించటమే కాకుండా మోహగుణం స్త్రీకి సహజ స్వభావమని పదే పదే చెప్పటం ద్వారా స్త్రీకి తనను గురించి తాను భయపడి తనను గురించి తాను జాగ్రత్తపడుతూ వుండాలన్న స్పృహను పెంచి పోషించాయి. తన పవిత్రతను కాపాడుకోవాల్సిన ‘గురుతర బాధ్యత’ను ఆమె మీద మోపాయి. అందుకనుగుణంగానే అన్ని మతాలు స్త్రీని ఇతరత్రా ఆలోచించటానికి సమయమే ఇయ్యని ఊపిరి సలపని గృహ కార్యకలాపాలలో నిమగ్నం చేశాయి. పాతివ్రత్యం అనే భావనతో మెదళ్ళను నింపి మరే విషయమూ ఆమె ఊహకు అందకుండా కట్టుదిట్టం చేశాయి. మొత్తం మీద మతం స్త్రీ ని పితృస్వామ సామాజిక విలువల కనుగుణమైన  కీ యిస్తే నడిచే బొమ్మగా తయారుచేయటంలో గొప్ప సాంస్కృతిక పాత్రను నిర్వహించింది.

వైదికమతం భర్తృ శుశ్రూష, వంటా వార్పూ, గృహోపకరణాల సంరక్షణ, గృహ సంబంధ ఆర్థిక కార్యకలాపాలను చక్కబెట్టటం మొదలైన కార్యకలాపాలలో నియమించటం ద్వారా స్త్రీని తీరుబడిలేని పనిలో వుంచిందనటానికి మనుస్మృతి (9.11) నిదర్శనం. . క్రైస్తవం గుణవతి అయిన భార్య చీకటితో లేచి తన ఇంటివారికి సకల సౌకర్యాలు కలుగజేస్తూ, పని మనుషులను ఆజమాయిషీచేస్తూ పొలం పనులు, నేతపనులు, వర్తకపు పనులు కూడా చేస్తూ, తన ఇంట్లో వారందరి నడతలు కనిపెట్టి చూస్తూ వుంటుందని, వుండాలని చెబుతూ, స్త్రీని క్షణం తీరిక లేని పనిలో వుంచింది. నడుము వంచి చేతులకు క్షణం విశ్రాంతి లేకుండా పనిచేయటం, పనిచేయకుండా భోజనం చేయకపోవటం గుణవతి అయిన గృహిణి లక్షణంగా బైబిలు పేర్కొంటుంది. (సామెతలు, 31 ఆధ్యాయం, పు. 555.) ఇంటిచాకిరి స్త్రీల ధర్మంగా ఎలాగూ స్థిరపడిపోయింది కనుక స్త్రీలు చేయాల్సిన ఈ పనులను గురించి ఆదేపనిగా ఏకరువు పెట్టకపోయినా ఖురాన్ పతివ్రతలయిన స్త్రీలకు విధేయతను ఒక మంచి లక్షణంగా ప్రబోధించి భర్తలకు విధేయులుగా వుంటూ భర్త సొమ్మును, మర్యాదను కాపాడటంలో నిమగ్నమై వుండమని చెబుతుంది. (1వ భాగం, కాండము 5, పు: 221.) స్త్రీల శరీరావయవాలు పురుషులకు కనబడకూడదన్న భావాన్ని బలంగా చెప్పిన ఇస్లాం పనిచేసే సమయాలలో ఈ నియమం ఆచరణ సాధ్యం కాదన్న విషయాన్ని గుర్తించింది. ముఖము, అరచేతులు, పాదాలు తరచుగా పనులలో వుండటంబట్టి అవి కనబడకుండా కాపాడటం కష్టమని, విధిలేని సమయాలలో కనబడినా దోషం లేదని మినహాయింపు సూత్రం చెబుతుంది (2వ భాగం, కాండము 18, పుః402).

ఇంటిపనిని గానీ, ఇంట్లోవాళ్ళకు సేవలు చేయటంగానీ, దైవకార్యాల యందు నిమగ్నమై వుండటం కానీ ఈ మూడింటిలో ఏది స్త్రీ  ధర్మమని మతం చెప్పినా అంతిమంగా అవి అన్నీ స్త్రీ ని అనుత్పాదకమైన నిరంతర శ్రమలో నిమగ్నంచేసి మేధస్సు వికసించకుండా అడ్డుపడేవే. మేధ ఎదగక పోవటంవలన స్త్రీలు చాలా సహజంగా, సులభంగా తాము అనుభవించేదే జీవితమని అనుకొంటూ పురుషాధిక్యతను ఏమాత్రం ప్రశ్నించలేకపోతారు. పితృస్వామ్య సామా జిక సంస్కృతికి అనుకూలంగా స్త్రీలని ప్రశ్నించే స్వభావంలేని జీవమున్న జడపదార్థాలుగా తయారు చేయటంలో మతాలు విజయవంతంగా తమ పాత్రను నిర్వహించాయి.

అంతటితో తృప్తిపడక స్త్రీల ఆలోచనలకు పాతివ్రత్య పరధిని నిర్దేశించాయి మతాలు. భర్త ఎటువంటివాడైనా స్త్రీ ఎప్పుడూ అతడిని దేవునివలె పూజించాలని, భర్త శుశ్రూష చేతనే భార్య స్వర్గలోకంలో పూజ్యరాలు అవుతుందని, మనోవాక్కాయ కర్మల చేత భర్తనుకాక వేరొక పురుషుడినికోరని స్త్రీ పతివ్రత అని పెద్దలచేత కొనియాడబడుతుందని (5-154, 155; 9.29) మనుస్మృతి చెప్పింది. భర్త వూళ్ళో లేనప్పుడు అలంకరించుకోవటం; పొరుగిళ్ళకు వెళ్ళటం స్త్రీకి నిషేధించింది వైదికమతం, పరపురుషులతో మాట్లాడకుండా వుండటం, నవ్వకుండా వుండటం స్త్రీలు అనుసరించవలసిన విషయాలని క్రైస్తవం చెప్పింది. (క్రైస్తవ గృహము, వివేకపతి, జనవరి 1958.) ఇస్లాం కూడా మిగిలిన మతాలవలెనే స్త్రీలు పరపురుషులను చూడకూడదని, తమ చూపులను కిందగా చూచుకోవాలని, తమ అలంకారాలను పరపురుషుల కంట పడకుండా చూసుకోవాలని, ఘోషా పద్దతిని పాటించాలని, ఘోషా లేకుంటే అనేక ఉపద్రవాలు కలుగుతాయని (ఖురాన్ వాల్యూం 2, పు 402) నొక్కి చెబుతుంది. అడుగుల సవ్వడి ద్వారా గానీ, అలంకారాల సవ్వడి ద్వారా గానీ ఇతరులకు తమ ఉనికే తెలియకుండా జాగ్రత్తపడాలని స్త్రీలను హెచ్చరిస్తుంది ఇస్లాం మతం.

పవిత్రమైన సంతానం కోసం పవిత్ర కుటుంబాన్ని ఏర్పరచిన మతం స్త్రీ కంటే పురుషుడు అన్నింటా అధికుడని ప్రతిపాదించింది. భార్య మీద భర్త అధికారి అని, పిల్లలను, నౌకర్లను, శిష్యులను శిక్షించిన విధంగా భార్యను శిక్షించే అధికారం భర్తకు ఇచ్చింది మనుస్మృతి. ‘వాంఛ’ ప్రధానలక్షణంగాగల స్త్రీలకు ఏలికలు భర్తలని, యజమానులన్న భావంతో స్త్రీలు భర్తలకు లోబడి విధేయులుగా వుండాలని, క్రీస్తు సంఘమునకు శిరస్సై వున్నట్లుగా పురుషుడు భార్యకు శిరస్సై వున్నాడని, సంఘం క్రీస్తునకు లోబడి వున్నట్లుగా భార్యలు కూడా ప్రతి విషయంలో తమ భర్తలకు లోబడి వుండాలని క్రైస్తవం  పేర్కొంది. (బైబిలు, ఆది కాండం, అధ్యాయం 3, పు. 3, కొత్త నిబంధన గ్రంథం పేతురు 1 ఆధ్యాయం 3 పు 215, ఎఫెసీయులకు, ఆధ్యాయం 5 పు 176) స్త్రీ పైన పురుషుడికి ఘనతను ప్రసాదించింది దేవుడేనని, బహు ప్రయాసపడి కుటుంబాన్ని నిర్వహిస్తారు కనుక, ధనాన్ని సంసారంకోసం ఖర్చు చేస్తారు కనుక పురుషులు స్త్రీల మీద అధికారులని ఇస్లాం ప్రకటించింది. ఒక రాజ్యానికి రాజు ఎట్లాగో గృహ పరిపాలనలో పురుషుడట్లా అధికారి అని చెప్పిన ఇస్లాం (ఖురాన్, 1వ భాగం, కాండము 2, పు 97) అవిధేయులైన పాలకులను దండన ద్వారా రాజు అదుపు చేసినట్లుగా భర్తలు అవిధేయులైన భార్యలను నోటిమాటద్వారాగానీ, దెబ్బలతోగానీ అదుపులో పెట్టుకోవచ్చంటుంది.

స్త్రీని పురుషుడికి అధీనురాలిగా, ఇంటికి, భర్తకు నిబద్ధురాలిగా ప్రవర్తించేటట్లు చేసి ఆమె ప్రజ్ఞాపాటవాలను, అభివృద్ధిని నిరోధించిన మతాలు ఆమెకు ప్రజ్ఞా పాటవాలు లేవని పదే పదే చెప్తూ ఎందుకు పనికిరాని వ్యర్థ జీవి అన్న భావనను ప్రచారం చేశాయి. అంతేకాక, స్త్రీలలో తమ గురించి తమకే తక్కువ వాళ్ళమన్న భావన బలపడటానికి దోహదం చేశాయి. స్త్రీలు చపల చిత్తులని, రహస్యాన్ని కాపాడటానికి ఆశక్తులని చెప్తూ మొత్తం మీద స్త్రీలను శక్తి హీనలుగా నిరూపించే ప్రయత్నం చేశాయి, చేస్తున్నాయి. ఇది ఎంతవరకు పోయిందంటే. ఏదైనా నేరం జరిగినప్పుడు విచారణలో ఇద్దరు స్త్రీలు ఇచ్చే సాక్ష్యం ఒక పురుషుడు ఇచ్చే సాక్ష్యానికి సమానమవుతుందని చెప్పటం వరుకు పోయిన ఇస్లాం న్యాయ వ్యవస్థ మగసాక్షి దొరకని పక్షంలో ఇద్దరు స్త్రీలను సాక్షులుగా తీసుకోవచ్చని చెబుతూ సాక్ష్యమిచ్చేటప్పుడు ఒక స్త్రీ  మరిచిపోయిన విషయాన్ని మరొక స్త్రీ గుర్తు చేయవచ్చని, అందుకోసమే ఈ రకమైన ఏర్పాటని చెబుతుంది. త ద్వారా స్త్రీ తెలివి తేటలను జ్ఞాపకశక్తిని పురుషుడితో పోల్చి, తక్కువని స్థిరీ కరించింది. నిజానికి ఆనాటి సమాజంలో స్త్రీలు ఇట్లా బయటకువచ్చి నేర నిరూపణ విషయంలో సాక్ష్యమియ్యటానికి సిద్దపడ్డారంటేనే వాళ్ళకు చాలా ధైర్యం వున్నట్లు లెక్క. అట్లా ధైర్యవంతులైన స్త్రీలు ఇద్దరైతే గానీ ఒక మామూలు మగవాడికి సమానం కారన్న అభిప్రాయాన్ని వెలిబుచ్చిన మతం స్త్రీలపట్ల వివక్ష ను ప్రదర్శించినట్లే అయింది.

స్త్రీని ఇంతగా మోహకారకురాలని, పురుషుడిని చెడుదారులకు ఈడ్చేదని, మోక్ష మార్గానికి ఆటంకంగా నిలిచేదని, ఏ రకమైన శక్తిసామర్థ్యాలు లేనిదని మత సాంస్కృతిక ఉపరితల భావజాల వ్యవస్థల ద్వారా అదే పనిగా ఊదర గొడుతూ వచ్చిన పితృస్వామ్య ఆర్థిక వ్యవస్థ స్త్రీని ఎట్లా వాడుకొంది అంటే సంతానోత్పత్తి పరికరంగా మాత్రమే. ప్రజాతంతువును అవిచ్ఛిన్నంగా కొనసాగించాలన్న ప్రయోజన దృష్టితో బ్రహ్మ స్త్రీలను గర్భధారణ నిమిత్తం, పురుషులను గర్భమునుంచు నిమిత్తం సృష్టించాడని చెప్పిన మనుస్మృతి చివరకు పురుషులకు ఆ ప్రకృతి సహజ లక్షణాన్ని మించి చైతన్యంతో నిర్వహించే సృజన కార్యకలాపాలు- సామాజిక భౌతిక జీవితానికి సంబంధించినవి ఎన్నో ఉన్నాయని చెబుతుంది. కానీ స్త్రీలకు ఆ ప్రకృతి సహజ లక్షణమొక్కటే జీవిత లక్ష్యమన్నట్లు ప్రవచిస్తుంది. బిడ్డను కనటం, పోషించటం ప్రత్యక్షంగా స్త్రీకి  సంబంధించినవని చెబుతుంది మనుస్మృతి (9.27). స్త్రీ సంతానాన్ని కనటానికి అనువైన ఋతు కాలాన్ని వృధా చేయకూడదని రజస్వలా పూర్వ వివాహాలను ప్రతిపాదించింది. పెళ్లయిన తరువాత తొలి ఋతు కాలంనుండి  ఎనిమిదేళ్ల వరకు సంతానవతి కాని స్త్రీని   ఒదిలేసి పురుషుడు మరొక స్త్రీని వివాహం చేసుకోవచ్చునని మనుస్మృతి చెబుతుంది (9.81). బీజ ప్రాధాన్యాన్ని అంగీకరించి సంతానం మీద తండ్రి హక్కును స్థిరపరచిన పితృస్వామ్యం పిల్లలు కలగని స్త్రీ విషయంలో బీజ ప్రాధాన్యం దృష్ట్యా తీర్పునియ్యకుండా ఏక పక్షంగా క్షేత్ర లోపాన్ని ఆపాదించి పురుషుడికి మరొక వివాహం చేసుకోవటానికి హక్కు నివ్వటం ఆ వ్యవస్థ యొక్క ద్వంద్వ విలువలను స్పష్టం చేస్తుంది.

అంతేకాదు, సంతానంలో కూడా మగ సంతానాన్ని కోరుకోవటం, మగ పిల్లలను కన్నతల్లికి అధిక హోదా గౌరవాలను కల్పించటం చూస్తుంటే పితృస్వామిక లోకంలోకి ఆడపిల్లలరాక అనవసరంగా భావించినట్లు స్పష్టమవుతుంది. అసలు పిల్లలులేని స్త్రీకి ఈ సమాజంలో ఎంత భద్రత లేదో మగపిల్లలు లేని తల్లికి కూడా అంతే. వరుసగా ఆడపిల్లలనే కనే స్త్రీని పదకొండేళ్ళ తరువాత వదిలేసి మళ్ళీ పురుషుడు వివాహం చేసుకోవచ్చని మనుస్మృతి తీర్మానించింది. మానవజాతి మనుగడకు అవసరమైన ప్రధాన లక్షణం పునరుత్పత్తి సంబంధాలలో వుంది. పునరుత్పత్తితో ప్రత్యక్ష సంబంధం వల్ల స్త్రీకి,  మాతృత్వానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉండటం సహజం. అయితే ఆ వాస్తవం  అభావం చేయబడింది.  పురుషుడి ఆస్తికి, వంశానికి వారసులు కాగలిగిన సంతానంకోసమే వివాహం అయినప్పుడు , కుటుంబంలో స్త్రీల భద్రత సంతానాన్ని , ప్రత్యేకించి పురుష సంతానాన్ని కనటం మీదనే ఆధారపడి ఉన్నప్పుడు స్త్రీ సంతానాన్ని కనే యంత్రం తప్ప మరొకటి కాదు. దానిని  కనబడకుండా చేసే  మాయతో మాతృత్వాన్ని కమ్మేసింది మతం. 

 దుష్టఫలాన్ని తినటం ద్వారా తప్పు చేసిన హవ్వను ప్రసవ వేదనపడి పిల్లల్ని కనమని దేవుడైన యెహోవా శపించాడని చెప్పింది  క్రైస్తవం.  స్త్రీకి అతి సహజమైన ప్రసవ వేదనను, తద్వారా సంక్రమించే మాతృత్వాన్ని గౌరవకరమైన సామాజిక బాధ్యత స్థాయి నుండి  తప్పుకు అనుభవించే శిక్షస్థాయికి తగ్గించినట్లయింది. పునరుత్పత్తి విధులను నిర్వర్తించే క్రమంలో పడే ప్రసవవేదన ద్వారానే స్త్రీలు పవిత్రులవుతారని కూడా చెప్పింది. అయితే ప్రసవవేదన అనుభవంలోకిరాని సంతాన హీనులైన స్త్రీలు ఈ శిక్షా క్రమానికి లోనుకారు కనుక వాళ్ళు పవిత్రులు కానట్లే. ఆటువంటి స్త్రీలను గొడ్రాళ్ళంటూ దోషారోపణ చేస్తుంది పితృస్వామ్య వ్యవస్థ. అటువంటి దోషులయిన స్త్రీలనుకూడా భగవంతుడు క్షమిస్తాడంటుంది క్రైస్తవం. సామాజిక ఆదరణలేక, పిల్లలు లేకపోవటం వలన గౌరవం, భద్రతలేక అవమానపడుతూ బాధపడుతూ వున్న స్త్రీలను అతి కరుణతో భగవంతుడు చేరదీస్తాడని చెప్పే యెహోవా మాటలనుబట్టి చూస్తే సంతానంలేని స్త్రీకి ప్రత్యామ్నాయంగా భగవదారాధనను, విశ్వాసాన్ని చూపించినట్లు అర్థమవుతుంది. (బైబిలు పాత నిబంధన, యెషయా అధ్యాయం 54, పుట 615) సంతానం పొందటం జీవిత లక్ష్యమైనా ఆ సంతానం కోసం పాతివ్రత్యాన్ని వదులుకోవద్దని, పతివ్రత అయిన స్త్రీ సంతానం లేనిదయినా పరపురుష సంగమాసక్తి లేకపోవటంచేత బ్రహ్మచారులు పొందే పుణ్యలోకాలను పొందుతుందని వైదికమతం నొక్కి చెప్పటం కూడా ఇక్కడ గమనించదగిన విషయం (మనుస్మృతి 5.160). ఈ క్రమంలోనే సంతానంకోసం స్త్రీ పెళ్ళి చేసుకొనటం, సంతానంకోసం పరపురుషులతో సంబంధాన్నేర్పరచుకోవటం తీవ్రమైన వ్యతిరేకతకు గురి అయ్యాయి.

పితృస్వామిక సమాజంలో అసమానతలు. నిర్బంధాలు, కట్టుదిట్టాలే జీవితంగా బ్రతుకు వెళ్ళదీస్తున్న స్త్రీకి  భర్త నుండి వేరైన జీవితం లేనేలేదు. భర్త వదిలేస్తే, వెళ్ళగొడితే బయటకు వెళ్ళాల్సిందే కానీ మరో మార్గం లేదు. అట్లా భర్త పరిత్యక్తలైన స్త్రీలకు సామాజిక గౌరవంకానీ భద్రత కానీ లేవు.  ఇటువంటి పరిస్థితులలో స్త్రీ తనంతట తాను అభిప్రాయాలను ఏర్పరచుకొని అవకాశాలను కల్పించుకొని, భర్తకంటే ఇతరంగా జీవితాన్ని నిర్మించుకోవటం కోసం కుటుం బాన్ని వదిలివెళ్ళే ప్రసక్తేలేదు. అందువల్ల ఈ సమాజంలో ‘విడాకులు’ అనేది పురుషుడికి ఎక్కువ వెసులుబాటు కలిగించినవిధంగా స్త్రీలవైపు నుండి ఉపయోగంలోకి రాలేకపోవచ్చు. ఏమైనా వైదికమత భావజాలం అభివృద్ధి చెందిన కాలానికి అందులో ప్రవేశించని ‘విడాకులు’ అనే భావం క్రైస్తవ మతంలోనూ, ఇస్లాం మతంలోనూ కనబడుతుంది. క్రైస్తవ మత గ్రంథాలు ప్రస్తావించిన విషయాలను, సందర్భాలను బట్టి శీలం మంచిదికాదన్న అనుమానం మీద భార్యను ఎప్పుడుపడితే అప్పుడు అపవాదు మోపి సులభంగా వదిలించు కోవటానికి ‘పరిత్యాగ పత్రం’ ఉపయోగపడినట్లు అర్థమవుతుంది. (బైబిలు, ద్వితీయోపదేశకాండము ఆధ్యాయాలు 22, 24, పు: 164, 165.)

భార్యల బ్రతుకు మీద సంపూర్ణాధికారం గల భర్తలు భార్యలను స్వంత వస్తువులుగా స్వేచ్ఛానుసారం వాడుకొనేందుకు అవకాశమిచ్చిన పితృస్వామిక సమాజంలో ‘సకారణం’గానో, అకారణంగానో భార్యలను వదిలేస్తుంటారు. అట్లా వదిలెయ్యటాన్ని క్రమబద్ధీకరిస్తూ  గడువుకాలం లోపల భర్త తాను చేసిన పనికి సిగ్గుపడి తిరిగి భార్యను తనవద్దనే వుంచుకొనటానికి ఇష్ట పడితే అతనికి అట్లాచేయటానికి హక్కు వుందని ఇస్లాం చెబుతుంది. (ఖురాను, కాండము 2, 1వ భాగం, పు: 95.) ఇటువంటి సందర్భాలను పరిశీలించి చూస్తే విడాకులివ్వటం పురుషుల ఇష్టాఇష్టాలకు చెందినదేకానీ రెండవ పార్టీగావున్న స్త్రీల అభిప్రాయానికి, అనుభవానికి దానిలో ఏమాత్రం ప్రమేయం లేనట్లే కనబడుతుంది. దేవుని శిక్షకు భయపడి పురుషుడు తనకు ఇష్టంలేని స్త్రీతో  ఆమెను కష్ట పెడుతూ కాపురం చేయటంకాక విడాకులిచ్చి వదిలించుకోవటమే మంచిదన్న అభిప్రాయాన్ని ఖురాను సూచిస్తుంది. పితృస్వామిక నిరంకుశాధి కారం క్రింద స్త్రీ, పురుష సంబంధాలు చాలా సులభంగా తెగిపోతూ కుటుంబం విచ్ఛిన్నమవుతున్న దశలో దానిని క్రమబద్దం చేయటానికి విడాకులనేవి సేఫ్టివాల్వ్ గా పనికొచ్చాయి. అందువల్లనే మతాలుకూడా విడాకుల గురించి మాట్లాడక తప్పలేదు. అయితే విడాకులనేవి స్త్రీలు చొరవతో తమంతట తాము తమ  ప్రయోజనాల కోసం, కుటుంబ అధికారం నుండి, అదుపు నుండి విముక్తి కోసం తీసుకొన్న దాఖలాలు లేవు. పైగా విడాకులు పితృస్వామిక సమాజంలో మగవాళ్ళ స్వేచ్ఛా ప్రియత్వాన్ని న్యాయ సమ్మతం  చేసి, మగవాళ్ళు ఎన్ని పెళ్ళిళ్ళయినా చేసుకోవటానికి అవకాశమిచ్చినట్లయింది.

పితృస్వామిక సామాజిక వ్యవస్థ స్త్రీ  వైపు నుండి కుటుంబాన్ని ఎంత పవిత్రంగా వుంచాలన్న తాపత్రయం కనబరచిందో పురుషుడి వైపు నుండి అంతగా స్వేచ్ఛాయుత సంబంధాలను ఏర్చరచుకొనే అవకాశాలను -పూర్వ సమాజాలనుండి వచ్చిన వాటిని- యధాతధంగా కొనసాగింపచేసింది. ఫలితంగా కుటుంబ పరిధిలో వ్యభిచారం, కుటుంబానికి అవతల వేశ్యావ్యవస్థ అభివృద్ధి చెందాయి. వ్యభిచారం అస్తిత్వంలోకి రావటం పవిత్ర కుటుంబ భావనకు అవరోధంగా నిలిచే వైరుధ్యం. మతాలన్నీ ఆనాటికి అమలులో వున్న సామాజిక విలువలను నీతులను క్రమబద్ధీకరించి సూత్రీకరించే క్రమంలో వ్యభిచారాన్ని దోషంగా చెప్పాయి. వ్యభిచరింపకూడదని, పొరుగువాని భార్యను ఆశించవద్దని నీతులు బోధించాయి. (బైబిలు, ద్వితీయోపదేశ కాండము, అధ్యాయము 5, పు: 150.) వ్యభిచారము భక్తులకు, విశ్వాసము కలవారికి తగినది కాదని చెబుతూ దానిని తీవ్రమైన నేరంగా పరిగణించి శిక్షలు కూడా పేర్కొన్నాయి. (ఖురాను, కాండము 18, 2వ భాగం, పు: 393) వర్గ సమాజాన్ని, పితృస్వామిక విలువ లను పరిరక్షించటానికి వచ్చిన మతాలు పితృస్వామిక సమాజపు ఉనికికి భంగకరంగా వున్న వ్యభిచారాన్ని పితృస్వామిక సమాజపు ఉన్నతాదర్శమైన పవిత్ర సంతాన భావనకే దెబ్బగా మారుతున్న వ్యభిచారాన్ని ఇంత తీవ్రంగా వ్యతిరేకించటంలో ఆశ్చర్యపడాల్సిందేమీ లేదు.

అయితే వ్యభిచారాన్ని తీవ్రమైన నేరంగా పరిగణించిన పితృస్వామ్య వ్యవస్థ మతం పేరిట వేశ్యావ్యవస్థను ప్రోత్సహించటం ఒక వైరుధ్యం. కానీ మానవతా భావాన్ని ప్రబోధించిన బౌద్ధం మాత్రం వేశ్యలుగా, వ్యభిచారులుగా తయారు చేయబడిన స్త్రీలను సానుభూతితో చూచి, ఆరామాలలో వాళ్ళకు ఆశ్రయమియ్యటం ద్వారా ఉదార దృక్పథాన్ని ప్రకటించుకొంది. పోతే, మధ్య యుగాలలో భూస్వామ్య వ్యవస్థ బలపడేనాటికి శైవ వైష్ణవ భక్తి ఉద్యమాలకు అనుబంధంగా దేవుని పేరిట వేశ్యా వ్యవస్థ స్థిరపరచబడింది. శివభక్తులకు ఆనందం కలిగించటం శివునికి ఆనందం కలిగించటమేనని చెప్పిన శైవం శివ భక్తుల భోగం కోసం స్త్రీలను ప్రత్యేకంగా సమీకరించేదని, వీరశైవ మత ప్రచారకుడైన బసవయ్య ఆ పని స్వయంగా నిర్వహించాడని పాల్కురికి సోమన బసవపురాణం సాక్ష్యమిస్తున్నది. ఆ రకంగా వీరశైవం దేవుని పేరిట బసివినులను తయారుచేసి ఊరందరి భోగానికి సమర్పించింది. ఈ సంప్రదాయం యొక్క అవశేషంగానే ఇప్పటికీ భారతదేశంలో వివిధ ప్రాంతాలలో బసివినులు, జోగినులు వేలసంఖ్యలో కనబడుతూనే వున్నారు.వర్ణ వ్యవస్థలోఅట్టడుగున ఉన్న దళిత స్త్రీలు  మతం పేరిట ఉఱుమ్మడి అనుభవానికి వస్తువు కావటం ఆధునిక యుగంలోనూ కొనసాగుతున్నదే.      అదే విధంగా వైష్ణవ దేవాల యాలకు అనుబంధంగా దేవదాసీ వ్యవస్థ  అభివృద్ధి చెందింది.  నృత్య గానాలతో దేవుని పేరిట పురుషుణ్ణి రంజింప చేయటానికి దేవదాసీలు ఉపయోగపడ్డారు. విజయనగరం లోనే కృష్ణదేవరాయల కాలంలో కనీసం యాభై వేల మంది దేవదాసీలు వుండి వుంటారని అంచనా. శైవ వైష్ణవాలు రెండూ కూడా ఒకదానితో ఒకటి పోటీ పడి, అంతిమంగా పురుషుడి భోగలాలస జీవితాన్ని సంతృప్తిపరచటం కోసం స్త్రీని ఒక విలాస వస్తువుగా మిగిల్చాయి.

ఇదే మతం తన వర్గ స్వభావంవల్ల బానిస స్త్రీలపట్ల మరింత శత్రు పూరితంగా ప్రవర్తించింది. తండ్రి, భర్త మొదలైన పురుషుల ఆధీనంలో లేనటు వంటి దిక్కూ మొక్కూ లేని స్త్రీలను అరక్షిత స్త్రీలుగా పేర్కొని మనుస్మృతి వాళ్ళను ఈ సమాజం స్వేచ్ఛానుసారంగా వాడుకొనటం పెద్దగా శిక్షార్హమైన విషయం కాదన్నట్లుగా చెప్పింది.  ఖురాన్లో తరచూ బానిస స్త్రీల ప్రస్తావన వస్తుంది. మారుతున్న పరిస్థితుల దృష్ట్యా స్త్రీలకు ఇంతకుముందులేని హక్కులను కల్పిస్తున్నానని సగర్వంగా చెప్పుకొన్న ఇస్లాం మతం బానిసస్త్రీల పట్ల మాత్రం మునుపటి సమాజాలలోని వైఖరినే అవలంబిస్తూ వాళ్ళ నేవిధంగానైనా ఉపయోగించుకొనటానికి పురు షులకు సర్వహక్కులూ ఇచ్చింది. అరక్షితస్త్రీతో  వ్యభిచారానికి మనుస్మృతి తక్కువ శిక్షను ఇచ్చినట్లుగానే బానిస స్త్రీతో వ్యభిచరించినందుకు ఖురాన్ కూడా తక్కువ శిక్షనే విధించింది.

పుట్టినప్పటి నుండి వివక్షకు గురి అవుతూ తల్లికి, తండ్రికి కూడా పరాయిదే  అయిన స్త్రీకి  వివాహమే జీవిత పరమావధి. వైవాహిక జీవితంలో కూడా భర్తకు, పిల్లలకు,  ఇంటికి జీవితామంతా  సమస్త చాకిరీ చేసినప్పటికీ ఆ పిల్లలు, ఆ ఇల్లూ భర్తవే  కానీ తనకేమాత్రం చెందవు. తానందరికీ చేస్తూ తానెవరికి కానిదై తన మీద కానీ, తను చేస్తున్న పనిమీద కానీ ఎటువంటి స్వతంత్రాధి కారం లేకుండా కుటుంబం నుండి, భర్తనుండి, పిల్లల నుండి చివరకు తనకు తానే పరాయిదైపోయే స్థితి స్త్రీకి పితృస్వామిక వ్యవస్థ, మతం రెండూ కలిసి కల్పించాయి. ఈ విధంగాస్త్రీని  పరాయీకరణకు లోను చేసిన  పితృస్వామిక భూస్వామ్య ఆర్ధిక నిర్మాణం  వున్నంత వరకు మతం, రాజ్యం, న్యాయం, నీతి అన్నీ కూడా ఆమెను కొత్త కొత్త రూపాలతో వివిధ కోణాల నుండి బంధిస్తుంటాయే తప్ప నిజమైన విముక్తికి అవకాశమియ్యవు. అందువల్లనే ఆధునిక యుగంలో బ్రహ్మ సమాజం, ఆర్య  సమాజం వంటి మత సంస్కరణోద్యమాలు వచ్చి బాల్య వివాహాలు వద్దన్నా, స్త్రీలకు పునర్వివాహాన్ని ప్రోత్సహించినా, స్త్రీ  విద్యను ప్రచారం చేసినా మౌలికంగా స్త్రీ జీవితాన్ని మార్చలేకపోయాయి. అందువల్లనే నేటికి పురుష ప్రయోజన దృక్పథం కలిగిన విద్యా ఉద్యోగ వ్యవస్థలలో, రాజకీయార్థిక సాంస్కృతిక రంగాలలో స్త్రీ పరాయిదిగానే మిగిలిపోతున్నది.

వర్గ సమాజ లక్షణాన్ని ప్రతిఫలించే మతం స్త్రీ, పురుష అసమానతలను మరింత తీవ్రతరం చేస్తుందే తప్ప కష్టాలతోటీ, బాధలతోటి దుఃఖమయమై వున్న స్త్రీ జీవితానికి కలిగించే ఊరట ఏమీలేదు. అన్ని మతాలు కూడా స్త్రీని వివక్షకు గురిచేయటానికి ఆధ్యాత్మిక కారణాలను చూపెడుతూ, భౌతికంగా అణచివేతకే ఉపయోగపడుతున్నాయి. కనుక మతం మొత్తం సమాజానికి ప్రత్యేకించి స్త్రీ జాతికి శత్రువే. అసమానతలకు గల కారణాలను గుర్తించి, వారిని శాస్త్రీయంగా అవగాహన చేసుకోవటానికి అవరోధంగా వున్న భావజాల సంస్కృతిలో స్త్రీలు సంఘర్షించే చైతన్యాన్ని వారు పొందకుండా మతం ‘మత్తు మందు’గా పనిచేస్తున్నది. స్త్రీల చైతన్యానికి, విముక్తికి మత సామరస్యం కాదు కావలిసింది. మత నిర్మూలన, స్త్రీలు, పురుషులు సమానులనే నూతన ధర్మం మతాల ఐక్యత వల్ల ఏర్పడదు గనుక మతం వతనం కావలసిన అవసరాన్ని గురించి ఈనాడు అనుకోవటం జరుగుతున్నది. వర్గరహిత సమాజాలను నిర్మించుకొనే క్రమంలో మత మౌఢ్యం పతనమవుతుందన్న నమ్మకంతో అందుకు దారులు తీసే  ఉద్య మాలతో సంఘీభావం ప్రకటిస్తూ మహిళా విముక్తి ఉద్యమాలు వికసించాలి.

———————————————————————————————-

ఉపయుక్త గ్రంధాలు;

  1. అబ్దుల్ గఫుర్ మౌల్లీ – ఖురానీ మజీద్ , హుస్యాల బుక్ డిపో , హైద్రాబాదు 1948
  2. అబ్దుల్ గఫుర్ మౌల్లీ – ఖురానే షరీఫ్ , రెండవ సంపుటి 
  3. అబ్దుల్ గఫుర్ మౌల్లీ-  ఖురానే షరీఫ్ ,మూడవ సంపుటి 
  4. కొశాంబి డి. డి. భగవద్గీత చారిత్రక పరిణామం , హైదరాబాద్ బుక్ ట్రస్ట్ , హైదరాబాద్ 1985. 
  5. దేవీ ప్రసాద్ చటోపాధ్యాయ – లోకయత తంత్రవాదం,అనువాదం:  హరి పురుషోత్తమరావు  హైదరాబాద్ బుక్ ట్రస్ట్ , హైదరాబాద్ 1987
  6.  మౌలానా సయ్యద్ అబుల్ ఆలా మౌదూదీ – ఇస్లాం మతజీవిత విధానము, జామా అతే ఇస్లాం, పామర్రు 
  7. బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా – పరిశుద్ధగ్రంధము, బెంగుళూరు 
  8. రాహుల్ సాంకృత్యాయన్ – ఋగ్వేద ఆర్యులు , మిక్కిలినేని సుబ్బారావు , విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ , విజయవాడ , జులై 1974
  9. రొమిల్లా థాపర్ , హార్బన్స్ ముఖియా, బిపిన్ చంద్ర – భారతదేశ చరిత్ర రచనలో మాత తత్వం , హైదరాబాద్ బుక్ ట్రస్ట్ , హైదరాబాద్ 1985
  10. లింగన సోమయాజి రాయప్రోలు – ఉపనిషచ్చంద్రిక , ప్రథమ మయూఖము ,గుంటూరు 1953
  11. లింగన సోమయాజి రాయప్రోలు – ఉపనిషచ్చంద్రిక, ద్వితీయ మయూఖము 
  12. లింగన సోమయాజి రాయప్రోలు – ఉపనిషచ్చంద్రిక, తృతీయ మయూఖము 
  13. లింగన సోమయాజి రాయప్రోలు – ఉపనిషచ్చంద్రిక, పంచమ మయూఖము 
  14. లింగన సోమయాజి రాయప్రోలు – ఉపనిషచ్చంద్రిక, షష్ఠమ మయూఖము, బృహదారణ్యకోపనిషత్తు, 1954
  15. వెంకట సుబ్బారావు సరస్వతి – మనుస్మృతి కల్లూకభట్టు వ్యాఖ్య , వావిళ్ళరామశాస్త్రి అండ్ సన్స్ , మద్రాసు 1942
  16. వెంకటేశ్వర్లు కొల్లా – మతం గుప్పిట్లో మహిళ – నాస్తిక సమాజం ప్రచురణలు , నాగులపాలెం, ప్రకాశం జిల్లా , 1981. 
  17. సుబ్బమ్మ – మల్లాది , హైందవం – స్త్రీలు, మల్లాది పబ్లికేషన్స్, హైదరాబాద్ 1986
  18. Holy Bible – Thomas Nelson Publishers , Newyark , 1983. 

                              

కేతవరపు కాత్యాయని. తెలుగులో ఎమ్మే పిహెచ్ డి. కాకతీయ విశ్వవిద్యాలయం తెలుగు విభాగంలో పూర్వ ఆచార్యులు. అప్పుడప్పుడు కవిత్వం, కథలు రాస్తున్నా ప్రధానంగా సాహిత్య విమర్శకురాలు. ప్రక్రియలలో వచ్చిన ప్రాచీన ఆధునిక సాహిత్య రచనలపైన, ప్రత్యేకించి స్త్రీల సాహిత్యం పైన  కాత్యాయనీ విద్మహే అన్న కలం పేరుతో ప్రచురించిన సాహిత్య విమర్శ వ్యాసాలు 300 కి పైగా ఉన్నాయి. 25 పుస్తకాలు ప్రచురించారు. 28  పుస్తకాలకు సంపాదకత్వం వహించారు. మార్క్సిజం, స్త్రీవాదం ఆలోచనకు వెలుగునిచ్చి హృదయానికి దగ్గరైన సిద్థాంతాలు. అనేక సామాజిక సంచలనాల ఉద్వేగ వాతావరణంలో సాహిత్య సామాజిక పరిశోధనలకైనా, ఆచరణ కైనా ఎప్పుడూ ప్రజాపక్షపాత నిబద్ధతే నమ్మిన విలువ. 1980లలో స్త్రీ జనాభ్యుదయ అధ్యయన సంస్థ వ్యవస్థాపక సభ్యరాలై  స్త్రీల సమస్యలపై సామాజిక, సాహిత్య రంగాలలో పనిచేసారు. పుస్తకాలు ప్రచురించారు. దానికి కొనసాగింపుగా 2010లో  ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక ఏర్పాటులో చురుకైన పాత్ర పోషించారు. స్త్రీల సాహిత్యచరిత్ర రచన, తెలంగాణ సాహిత్య సమీక్ష తన ఆకాంక్షలు.

Leave a Reply