మణిపూర్ మళ్లీ ఉద్రిక్తత

పదిహేడు నెలలుగా నివురు గప్పిన నిప్పులా ఉన్న మణిపూర్ మళ్లీ రాజుకుంది. మణిపూర్లో
జాతుల మధ్య ఘర్షణ హఠాత్తుగా మొదలైంది కాకపోయినా, గత సంవత్సరం మే 3 నుంచి అడపా దడప
పరస్పరం దాడులు జరుపుకుంటూనే ఉన్నారు. ఎప్పుడు ఎక్కడ ఏం జరుగుతుందో తెలియని
భయాందోళనలు ఆ రాష్ట్ర ప్రజలను వెన్నాడుతున్నాయి. జిరిబాయ్ జిల్లా కేంద్రంలో జరిగిన సమావేశంలో
సిఆర్పిఎఫ్, అస్సాం రైఫిల్స్, హ్మార్, మెయితీ, థాడ్, మిజోరామ్ కమ్యూనిటీల ప్రతినిధులు ఆగష్టు 2న
కాల్పులు విరమించుకోవడానికి అంగీకరించాయి. అయితే జిరిబాయ్ జిల్లా వెలుపల ఉన్న అనేక హెచ్మార్
గిరిజన సంస్థలు ఈ ఒప్పందాన్ని ఖండించాయి. దీని గురించి తమకు ఎటువంటి సమాచారం లేదని
పేర్కొన్నాయి. సెప్టెంబర్ 1న కొన్ని గ్రామాలపై డ్రోన్లతో దాడులు జరగటంతో మళ్లీ ఉద్రిక్త వాతావరణం
నెలకొంది. అనుమానిత మిలిటెంట్లు జరిపిన కాల్పుల్లో ఒక మహిళతో సహా ఇద్దరు వ్యక్తులు
మరణించారు. 9 మంది గాయపడ్డారు.

కుకీ, మెయితీ తెగల పోటాపోటీ ప్రదర్శనలు, తమ తమ డిమాండ్ల పునరుద్ఘాటన మళ్లీ తెర మీదికి
వచ్చి, పరిస్థితిని ఉద్రిక్తం చేస్తున్నాయి. హింసాత్మక జాతి ఘర్షణలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న
మణిపూర్ ఇండియన్ యూనియన్లో చేరినప్పటి నుంచి పలు జాతుల ఘర్షణలు చూసింది. మణిపూర్లో
వివిధ భౌగోళిక ప్రాంతాల్లో జనాభా పంపిణీ విలక్షణమైనది. మెయితీలు మణిపూర్ జనాభాలో 53 శాతం
ఉంటారు. వారంతా హిందువులు, మరొకవైపు కుకీలు, జో, నాగాలు మణిపూర్ జనాభాలో 47 శాతం
ఉంటారు. వారిలో చాలామంది క్రైస్తవులు. ఈశాన్య భారతంలో అసమ్మతికి ప్రధాన కారణాలు భాష,
సాంస్కృతిక లొంగుబాటు భయం, ఆర్థికపరమైన అలక్షం, రాజకీయ శక్తుల వైఫల్యాలు, ఈశాన్యంలో
అస్తిత్వ రాజకీయాలకు ప్రధాన కారణం జాతి ప్రజల విలక్షణ మనస్తత్వం. ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక
భావన కోల్పోతామేమోనన్న ఉద్దేశంతో ప్రత్యేక హక్కులు పొందాలనే మనస్తత్వం వారిది.
కేంద్ర, రాష్ట్ర పాలకులు మణిపూర్కి ఏ మేలూ చేయకపోగా, తెగల మధ్య ఉన్న విబేధాలను విద్వేష
విధ్వంస స్థాయికి తీసుకెళ్లారు. కొండల్లో నివాసం ఉంటూ అభివృద్ధికి దూరంగా ఉన్న కుకీల
ప్రయోజనాలకు భంగం కలిగించే విధానాలకు, నినాదాలకు పార్టీ బహిరంగంగానే కొమ్ము కాచింది. రాష్ట్రం
మొత్తానికి ముఖ్యమంత్రిగా వ్యవహరించాల్సిన బీరెన్ సింగ్ మెయితీల ప్రతినిధిగానే అనేక సందర్భాల్లోనూ
వ్యాఖ్యానించి, కుకీల్లో అభద్రతను పెంచాడు. మెయితీలకు గిరిజన గుర్తింపు ఇవ్వొదన్న డిమాండుతో
ప్రదర్శనలు జరిపిన కుకీలపై రాష్ట్ర ప్రభుత్వం కర్కశంగా వ్యవహరించింది. సరిగ్గా 17 నెలల క్రితం కుకీ
గ్రామాలపైనా, కుకీ తెగ మహిళల పైనా అల్లరిమూకలు సభ్యసమాజం తలదించుకునేంత అమానవీయంగా హత్యలకు, అత్యాచారాలకు, మూకుమ్మడి దాడులకు, దహనాలకు పాల్పడినా, బిజెపి ప్రభుత్వం పట్టించుకోలేదు. బాధిత మహిళలు, పురుషులూ పోలీసుల శరణు కోరినా రక్షణ దొరకలేదు. ముష్కర మూకల దాడులూ, దౌర్జన్యాలను రాష్ట్ర ప్రభుత్వం తనకు తానుగా నివారించే ప్రయత్నం చేయలేదు.

మణిపూర్ మెయితీలు అధిక సంఖ్యాకులు అయినందున శాసనసభలో అధిక శాతం ప్రాతినిధ్యం
ఉన్నది. అది మెయితీ ఆధిపత్య తత్వాన్ని ప్రోత్సహిస్తోంది. మెజారిటీ సమాజం చేతుల్లో అధికారం
కేంద్రీకృతం కావడం, ప్రాంతీయ, పాలకవర్గ సమగ్రతకు ముప్పు భావన, జాతుల గ్రూపుల్లో వేర్వేరు
మతపర ఆస్తిత్వం నమ్మకం లోటును సృష్టించింది. మెయితీ ఆధిపత్యవాద తత్వం మణిపూర్లో
రాజకీయాలను, సామాజిక సంబంధాలను ప్రభావితం చేసింది. మెయితీ ముఖ్యమంత్రులు గడచిన 34
సంవత్సరాలుగా రాష్ట్రాన్ని పాలిస్తున్నారు. కుకీలు, నాగాల్లో పెరుగుతున్న అసమ్మతికి అది ఒక
కారణంగా ఉన్నది. రాష్ట్ర బడ్జెట్, అభివృద్ధి పథకాల్లో అత్యధిక భాగం మెయితీ ఆధిక్యం గల ఇంఫాల్
లోయపైనే కేంద్రీకృతం అవుతున్నాయని మణిపూర్ మైనారిటీలు ఆరోపిస్తున్నారు. అధికారం, అభివృద్ధి
పంపిణీలో అసమతుల్యం, జీవన ప్రదేశాల కోసం పోటీ మణిపూర్ వివాదానికి ప్రధాన కారణం.
తమ అస్తిత్వాన్ని చాటిచెప్పడానికి దశాబ్దాలుగా ఈశాన్యంలో పలు జాతి ఉద్యమాలు
చోటుచేసుకున్నాయి. జాతుల మధ్య అశాంతి దేశానికి నేరుగా ఒక సవాల్. అందువల్ల కేంద్ర, రాష్ట్ర
ప్రభుత్వాలు వివిధ జాతుల, సాంస్కృతిక, మతపర, భాషాపర వర్గాల సర్వతోముఖాభివృద్ధికి ప్రాధాన్యం
ఇవ్వాలి. వివిధ ప్రభుత్వాలు ఈశాన్యంలో తిరుగుబాటు సమస్య పరిష్కారానికి విభిన్న విధానం
అనుసరిస్తూ వచ్చాయి. మరొక గ్రూపును తుడిచిపెట్టేందుకు ఒక గ్రూపును ప్రోత్సహించడం, ప్రధాన
స్రవంతిలోకి తిరిగి వచ్చేందుకు ప్యాకేజీలు అందజేయడం, ఒప్పందం కుదుర్చుకునేందుకు సంభాషణ
కర్తలను నియోగించడం, ప్రధాన స్రవంతిలోకి తిరిగి వచ్చేందుకు ప్యాకేజీలు అందజేయడం, ఒప్పందం
కుదుర్చుకునేందుకు సంభాషణ కర్తలను నియోగించడం, తిరుగుబాటు నిరోధక సైనిక కార్యకలాపాలు
మొదలైనవి ప్రభుత్వం తిరుగుబాటు సమస్య పరిష్కారానికి అనుసరించిన వ్యూహాలు.
మణిపూర్ 17 మాసాలుగా జరిగిన హింసాకాండకు ఇంత వరకు 230 మందికి పైగా బలయ్యారు.
1000 మందికి పైగా గాయపడ్డారు. 67 వేల మంది సర్వస్వం కోల్పోయి నిరాశ్రయులయ్యారు. 32 మంది
ఆచూకీ తెలియడం లేదు. 4786 ఇండ్లు దగ్ధమయ్యాయి. 386 మతపరమైన నిర్మాణాలు
ధ్వంసమయ్యాయి. జాతుల మధ్య ఘర్షణల కారణంగా పదిహేడ నెలలుగా మణిపూర్ అగ్నిగుండం లాగా
రగులుతోంది. మహిళలపై లైంగిక దాడులకైతే లెక్కేలేదు. సర్వం కోల్పోయిన వేలాదిమంది ఇప్పటికీ
సహాయక శిబిరాల్లోనే తలదాచుకుంటున్నారు. చాలామంది రాష్ట్రాన్ని విడిచిపెట్టి. ఎక్కడెక్కడికో

వెళ్లిపోయారు. విద్వేష మూకల దాడుల కారణంగా చదువులను సగంలోనే వదిలేసి పారిపోయిన
యూనివర్సిటీ విద్యార్థులు తిరిగి చేరలేదు. అల్లర్లలో ఆచూకీ లేకుండా పోయిన అనేకమంది గురించి వారి
కుటుంబ సభ్యులకు ఇంతవరకూ ఏ సమాచారమూ లేదు. “మా బిడ్డ ప్రాణాలతో లేదని మాకు తెలుసు.
కనీసం ఆ విషయాన్ని నిర్ధారించండి. సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు జరుపుకునే అవకాశం
కల్పించండి” అని ఉమన్ అనే ఓ తండ్రి ఇప్పటికీ అధికారుల చుట్టూ తిరుగుతుండడం పాలకుల
నిర్లక్ష్యానికి ఒక నిదర్శనం. యూనిఫైడ్ కమాండ్ను ఏర్పాటుచేసి శాంతిభద్రతల పరిరక్షణ బాధ్యతలను
కేంద్రం తన చేతిలోకి తీసుకున్నప్పటికీ మణిపూర్ ఇంకా నిత్యాగ్నిగుండంగానే మండుతోంది. తాజాగా
మణిపూర్ పరిస్థితి మరోసారి భగ్గుమంది.

మెయితీలు-కుకీ, జో గిరిజనుల మధ్య సుదీర్ఘకాలంగా ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి.
మణిపూర్లో మెయితీలు, కుకీల ఘర్షణలను అదుపు చేయడం ఒక ఎత్తయితే విద్యార్థుల ఆందోళనలను
అదుపు చేయడం భద్రతా బలగాలకు పెద్ద తలనొప్పిగా మారుతోంది. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి
ఇప్పటివరకూ కుకీలపై జరిగిన హింసాత్మక దాడుల్లో పదకొండు మంది చనిపోయారు. సెప్టెంబర్ ఒకటి
నుంచి విద్యార్థుల ఆందోళనలు తీవ్ర రూపం దాల్చడంతో మరో రెండు వేల మంది సిఆర్పి సిబ్బందిని కేంద్రం మణిపూర్కు పంపించింది. వారం రోజులుగా పన్నెండు మంది మరణించగా, కొన్ని వేలమంది
గాయపడ్డారు. కేంద్ర ప్రభుత్వరం ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోడీ మణిపూర్లో సమస్యలను
పరిష్కరించేందుకు ఏమాత్రం కృషి చేయలేదు. హోం మంత్రి అమిల్షా ఒకటి, రెండు సార్లు మణిపూర్ను
సందర్శించినప్పటికీ సమస్యలను చిత్తశుద్ధితో పరిశీలించి పరిష్కారానికి కృషి చేయలేదు.
కుకీ,జో గిరిజనులు ఎక్కువగా కొండ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. మెయితీలు మైదాన ప్రాంతాల్లో
నివసించే సంపన్న వర్గాలు. వీరు విష్ణుమూర్తిని ఆరాధిస్తారు. కుకీ,జో గిరిజనులకు అమలు
జరుపుతున్న రిజర్వేషన్లను తమకు కూడా ఇవ్వాలని మెయితీలు డిమాండ్ చేస్తూ గత ఏడాది రంగంలోకి
దిగారు. ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ మెయితీ జాతికి చెందినవారు. అందువల్ల రాష్ట్ర హైకోర్టులో మెయితీలకు
అనుకూలమైన తీర్పును సాధించారన్న ఆరోపణలున్నాయి. కోర్టు ఇచ్చిన తీర్పు తర్వాతనే రాష్ట్రంలో
మెయితీలకు, కుకీలకు మధ్య అంతర్యుద్ధమే జరిగింది. ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా
శక్తిమంతులైన మెయితీలను ఎస్టీ జాబితాలోకి చేరిస్తే తమ జీవితాలు ఇంకా మర్బరమవుతాయని
కుకీలు, ఇతర ఆదివాసులు కలవరపాటుకు గురవుతున్నారు. ఆ వాదనలూ ప్రతివాదనలు శ్రుతిమించి
భౌతిక దాడుల రూపం తీసుకున్నాయి. పరస్పర విశ్వాసం కోల్పోయిన జాతుల నడుమ సయోధ్య
కుదర్చాల్సిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలేమి చేస్తున్నాయనేది దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైనది. చర్చలు,
రాజకీయ ప్రయత్నాలకు పెద్దగా ప్రాధాన్యమివ్వకుండా సాయుధ బలగాలనే అవి ఎక్కువగా
నమ్ముకుంటున్నాయి. దానివల్ల హింసప్రబలమవుతోందే కానీ, అదుపులోకి రానట్లేదు!

జిరిబమ్ జిల్లాలో సెప్టెంబర్ 7 రాత్రి రెండు సాయుధ గ్రూపుల మధ్య జరిగిన కాల్పుల్లో ఐదుగురు
మృతిచెందగా, ముగ్గురు గాయపడ్డారు. టార్చి లైట్లు పట్టుకుని సెప్టెంబర్ 8 రాత్రి నిరసన ర్యాలీ
జరిపినప్పుడూ పోలీసులు ప్రదర్శకుల పైన లాఠీచార్జీ చేసి భాష్పవాయువు గోళాలను ప్రయోగించారు.
హింసను నియంత్రించడంలో విఫలమైనందుకుగాను ఉన్నత అధికారులు, ఎంఎల్ఎలు రాజీనామాలు
చేసేందుకు సిద్ధమయ్యారు. ముఖ్యమంత్రి బిరేన్ సింగ్ విద్యార్ధి ప్రతినిధులతో మాట్లాడి వారి సమస్యలను
పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. కుకీ, జోలకు ప్రత్యేకంగా పాలనా యంత్రాంగాన్ని ఏర్పాటు చేయకుండా
కేంద్రం మౌనం పాటించినంతకాలం పరిస్థితులు హింసాత్మకంగా ఉంటాయన్నది యదార్థం. ప్రధాని మోదీ
మణిపూర్ భారతదేశంలో భాగం కాదనట్లుగా వ్యవహరిస్తున్నారు. అసోం రైఫిల్స్ బెటాలియన్లను వారి
స్వస్థలాలకు పంపించి వేయాలని వారు ఉన్నప్పటికీ భద్రత క్షీణిస్తున్నదని కంగ్పోక్సిలో మరో గ్రూపు
ఆందోళనలను చేసింది. బిష్ణుపూర్ జిల్లాలో మెయితీలకు చెందిన వృద్ధుడు రాకెట్ దాడి మూలంగా
మరణించాడని పోలీసులు చెబుతున్నారు. అయితే తాము ఇందుకు కారణం కాదని కుకీలు
తిరస్కరించారు.

మణిపూర్లో మళ్లీ హింస తలెత్తడానికి ప్రభుత్వ నిర్ణయాలే కారణం. రాష్ట్రంలో అస్సాం రైఫిల్స్
బృందాలను తగ్గించి, వాటి స్థానంలో కొన్ని సిఆర్పిఎఫ్ బృందాలను నియమించాలని నిర్ణయం
తీసుకున్నారు. ఇది ముఖ్యంగా కుకీ జనాభాలో ఆగ్రహం, అసంతృప్తిని రేకెత్తించింది. సెప్టెంబర్ మొదటి
వారంలో మణిపూర్ హింసాత్మక ఘటనలు కొత్తపుంతలు తొక్కాయి. జాతుల మధ్య పోరాటంలో డ్రోన్లు,
క్షిపణులను వినియోగించారు. రాకెట్. డ్రోన్ బాంబు దాడులతో ఈసారి మరింత హైటెన్షన్ నెలకొంది. ఈ
నేపథ్యంలో ఆ రాష్ట్రంలో పలు జిల్లాల్లో కర్ప్యూ విధించారు. మణిపూర్లో హింస, అశాంతి పెరుగుతున్న
నేపథ్యంలో సెప్టెంబర్ 9,10 తేదీలలో పాఠశాలలు మూసి వేశారు. దీన్ని విద్యార్థులు వ్యతిరేకించారు.
తాజాగా విద్యార్థులు, యువకులు ప్రత్యేకించి కుకీలకు చెందినవారు తమకు ప్రత్యేక పాలనా
యంత్రాంగాన్ని ఏర్పాటుచేసి పాలనను తమకు అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు. అయినప్పటికీ
కేంద్రం విషయాన్ని తేల్చకుండా మణిపూర్ను అగ్నిజ్వాలలకు వదిలిపెట్టింది. మణిపూర్ రాజధాని
ఇంఫాల్ తో సహా లోయలోని ఐదు జిల్లాల్లో కర్ఫ్యూ విధించారు. ఇంఫాల్లో ఫ్రీ (ప్రెస్, ఇంటర్నెట్, బ్రాడ్
బాండ్ పై సెప్టెంబర్ 11 నుంచి 15 వరకు నిషేధం విధించారు. ఇంఫాల్లో విధించిన కర్ఫ్యూను
ధిక్కరించడంతో విద్యార్థులకు పోలీసులకు మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. సెప్టెంబర్ 8 మధ్య రాత్రి కుకీ-జో
ప్రదర్శకులను మెయితీలు అధికంగా ఉండే ప్రాంతంలో పోలీసులు విచ్చలవిడిగా బాదారు. లారీఛార్జి చేసి
ప్రదర్శకులను చెల్లాచెదురు చేశారు. కంగ్బోక్సి జిల్లాలోమాజీ హవల్దార్ లింకోలాయ్ మేట్ సెక· శవమై పడి
ఉన్నాడని టెలిగ్రాఫ్ వార్తా పత్రిక తెలియజేసింది. ఆయన తన స్నేహితుడిని విడిచిపెట్టేందుకు బైటకు

వచ్చినప్పుడు మెయితీలు నివసించే ప్రాంతాల నుంచి తిరిగివస్తున్న సందర్భంలో అతనిని పోలీసులు
తీవ్రంగా కొట్టి గాయపరచారు. చివరకు అతను చనిపోయాడు. మేట్ చనిపోవడంపై కుకీ, మెయితీల మధ్య ఘర్షణలు రేగాయి. కుకీలు నివసించే ప్రాంతానికి మెయితీలు. మెయితీలు నివసించే ప్రాంతానికి కుకీలు రావడానికి వీలులేకుండా ఆంక్షలు విధించుకున్నారు. చనిపోయిన మేట్ కుమారుడు కంగ్పోక్సి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. తన తండ్రిని గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి అపహరించుకుపోయారని మేట్ కుమారుడు చెప్పారు. ఈ ఘటనపై దర్యాప్తు చేసి తగిన చర్య తీసుకనేందుకు ఇంఫాల్ పశ్చిము ప్రాంత పోలీసులకు కేసు అప్పగించారు. సెప్టెంబర్ 10న మణిపూర్ సచివాలయం, రాజ్భవన్ ముందు నేలాదిమంది విద్యార్థులు నిరసన ప్రదర్శన చేశారు. ఇటీవల డ్రోన్లు, మిసైల్అ ద్వారా దాడులు జరిపిన వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని రాష్ట్రాన్ని భద్రంగా కాపాడేందుకు కఠినమైన ముమ్మరమైన చర్యలు తీసుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. డ్రోన్, క్షిపణి దాడులకు వ్యతిరేకంగా విద్యార్థులు భారీ నిరసన చేపట్టారు. సెప్టెంబర్ 10న ఇంఫాల్లోని రాజభవన్ ఎదుట పెద్ద సంఖ్యలో బైఠాయించారు. రాజ్భవన్ ఎదుట నిరసన ర్యాలీ జరుపుతుండగా ఇంఫాల్లో పోలీసులకు, విద్యార్థులకు మధ్య ఘర్షణలు జరిగాయి. ఆ హింసాకాండలో 50 మంది విద్యార్థులు గాయపడ్డారు. గాయపడిన వారిలో ఒక యువతి ఉన్నారు. ఆమె పరిస్థితి సరిగాలేదని మెరుగైన వైద్య చికిత్స కోసం ప్రాంతీయ మెడికల్ సైన్సెస్ సంస్థలో (ఇంఫాల్) చేర్చారు. మణిపూర్ వర్సిటీ విద్యార్థులు ప్రత్యేకంగా వీధుల్లో ప్రదర్శన చేశారు. రాష్ట్ర భద్రతా సలహాదారు, పోలీసు డీజీపీ భద్రతను కాపాడటంలో విఫలమైనందున ఆయనను పదవి నుంచి తప్పించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. పరిస్థితి దిగజారుతున్న దృష్ట్యా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ 2000 మంది సీఆర్ ప్పీఎఫ్ దళాలను అదనంగా రంగా రాష్ట్రానికి పంపించింది. మణిపూర్లో నెలకొన్న అగ్ని జ్వాలలకు ప్రజలు ఎంతో ఇబ్బందులు పడుతున్నపటికీ కేంద్రంలోని బీజేపి ప్రభుత్వం మౌనం వహిస్తూనే ఉంది. మహిళలను నగ్నంగా ఊరేగించినప్పటికీ ప్రధాని మోడీ స్పందించనేలేదు, బహిరంగ సభల్లో మాత్రం మహిళలకు తాము ఎంతగానో గౌరవం ఇస్తామని చెప్పడం ఒట్టి బూటకం. మణిపూర్ ఇంతవరకు కంటితుడుపు చర్యలు మినహా సమస్య శాశ్వత పరిష్కారానికి పాలకులు చేపట్టిన చర్యలు శూన్యం. బిజెపి పాలిత మణిపూర్లో శాంతిభద్రతల పరిరక్షణ వ్యవహారాలను కేంద్ర హోం శాఖ ఆధ్వర్యంలో యూనిఫైడ్ మాండ్ పర్యవేక్షిస్తోంది. దీనివల్ల తన చేతులు కట్టేసినట్లు అవుతోందని భావిస్తున్న ముఖ్యమంత్రి, తాజాగా జిల్లర్లు చెలరేగిన నేపథ్యంలో గవర్నర్ను కలసి యూనిఫైడ్ కమాండ్ను తనకు అప్పగించాలంటూ విన్నవించుకున్నారు. అయితే కేంద్ర హోం మంత్రి అందుకు తాము సుముఖంగా లేమని ప్రకటించాడు. మణిపూర్లో కేంద్ర బలగాలను భారీగా మోహరించినా ఉపయోగమేమీ లేదంటూ స్థానిక ఎమ్మెల్యే రాజ్కుమార్ ఇమో సింగ్ ఇటీవల కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. ఆయన భాజపా నేతే కాదు, ఆ రాష్ట్ర సీఎం బీరెన్ సింగ్ అల్లుడు కూడా! సీఎం పై తమకు నమ్మకం లేదని కుకీలు తెగేసి చెబుతున్నారు.

ప్రపంచమంతా చుట్టివచ్చే ప్రధాని మణిపూర్ను సందర్శించి ఘర్షణ పడుతున్న జాతులవారికి
సాంత్వన చేకూర్చటానికి సిద్ధపడలేదు. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ రెండుసార్లు మణిపూర్
సందర్శించి శిబిరాల్లోని అభాగ్యుల్లో భరోసానింపే ప్రయత్నం చేశారు. సంవత్సరం పైగా చదువులకు
నోచుకోని విద్యార్థులు యూనిఫారం ధరించి మరీ వీధుల్లోకి రావటంలో వారి ఉద్దేశం మణిపూర్
శాంతిస్థాపనలో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల వైఫల్యాన్ని నిరసించటం. వారు డిజిపిని, మణిపూర్ ప్రభుత్వ
భద్రతా సలహాదారును తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. వారు నిరసన ప్రదర్శన జరిపి కేంద్ర
హోంమంత్రి అమిత్ దిష్టి బొమ్మ తగులబెట్టారు. మణిపూర్ నుండి పారామిబటరీ దళాలను
ఉపసంహరించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇంఫాల్లో ఉంటున్న 50 మంది ఎమ్ ఎల్ ఏలు, రాష్ట్రం
వెలుపల ఉన్న 10మంది కురీ-జో ఎమ్ ఎల్ ఏలను “నైతిక కారణాలతో” రాజీనామా చేయాలని
విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.

బిజెపి కేంద్ర నాయకత్వం… ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ పాక్షిక పాత్ర పూర్తిగా తెలిసి కూడా అతన్నే
ముఖ్యమంత్రి పదవిలో కొనసాగిస్తున్నారు. రాజకీయ స్థాయిలో చూస్తే బిజెపి, ఆర్ఎస్ఎస్లు మెయితీ
జాతిదురభిమానానికి చేయూత్ నిస్తున్నాయి, సంస్థ వ్యవస్థాపకుడైన బెంగోల్ ఎల్ సనజోబాను రాజ్యసభ
సభ్యుడిని చేయటమే ఇందుకు నిదర్శనం. జాతుల మధ్య వైరం, జాతులు ప్రభుత్వం నడువు అంతులేని
అగారం సమస్యను మరించి జటిలం చేస్తునాయి సిఎం బీరెన్ సింగ్ కురీల హెములను పోత్సహించినట్లు
తెలిపే ఆడియోలు బహిర్గతం కావడంతో ఈ అంశం కూడా సంక్షోభాన్ని మరింతగా రగుల్చుతోంది. ఓ
గ్రామంపై డ్రోన్లతో జరిగిన బాంబుదాడుల వెనుక సిఎం మద్దతుదారులున్నారని కూడా వినిపిస్తోంది.
మతపరంగా, జాతులపరంగా ప్రాబల్య వర్గాలను పోలీస్ స్టేషన్ల నుంచి ఆయుధాలను కైవసం
చేసుకోనివ్వడం ముఖ్యమంత్రి బాధ్యతారాహిత్యానికి పరాకాష్ట, కేంద్ర ప్రభుత్వ నిష్క్రియపరత్వం,
మణిపూర్పై ప్రధాని దీర్ఘకాలిక మౌనముద్ర, బిజెపి ప్రభుత్వాల మతతత్వం, పాలనలో అసమర్థతను
ప్రదర్శించాయి. ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ పాక్షిక పాత్ర వహించడం వల్ల సమస్య మరింత తీవ్రతరమైంది.
ఆయన కొన్ని మెయితీ తీవ్రవాద సంస్థల పట్ల సానుకూల సహాయ పాత్ర వహిస్తున్నారు. ఇటీవలనే
బయటకు వచ్చిన ఒక ఆడియో ఫైల్ను అల్లర్లపై దర్యాప్తు జరుపుతున్న విచారణ కమీషను
సమర్పించారు.

ఈశాన్య భారతంలో సంఘర్షణ పరిస్థితిని అర్థం చేసుకోవడం సంక్లిష్టమైన అంశం. ఆ ప్రాంత
సాంఘిక, సాంస్కృతిక, చారిత్రక, జాతుల రూపురేఖల గురించి లోతైన అవగాహన కలిగి ఉండడం అవసరం. నాలుగు దేశాల అంతర్జాతీయ సరిహద్దులలో ఈశాన్య భారతం కీలకమైన, వ్యూహాత్మకంగా
ముఖ్యమైన ప్రాంతం. ఈశాన్య ప్రాంతంలోని రాష్ట్రాలు అన్నీ సాంస్కృతికగా, భాషాపరంగా, మతపరంగా
భిన్నస్వభావం కలవి. భాష సంబంధిత అంతరపరంగా విభిన్నతలు, మంగ్లాయిడ్, ఆస్ట్రలాయిడ్ జాతి
మూలాలు, మతపరమైన బహుత్వం ఆ ప్రాంతాన్ని విలక్షణమైనదిగా చేశాయి. దీనికి పరిష్కారం జాతుల
స్వయం నిర్ణయాధికారాన్ని గుర్తించడం, అయితే భారత పాలక వర్గాలు అప్రజాస్వామికంగా, ఆధిపత్య
ధోరణితో అణచివేతను ఎన్నుకోవడం గిరిజన జాతులకు జీవన్మరణ సమస్యగా పరిణమించింది. నిజానికి
పాలకులు ప్రజాస్వామికంగా అన్ని జాతుల సమస్యలు పరిష్కరించాలి. అయితే పాలకులు ఆ దిశలో
ఆలోచించడం లేదు.

ముగింపు :

హింసను అంతిమంగా పరిష్కరించగలిగేది చర్చలే. చర్చల ద్వారా శాంతిసాధనపై అధిక దృష్టి
పెట్టటం అవసరం. ప్రజల్లో ఏదైనా తీవ్రమైన భావోద్రేక సమస్య తలెత్తి శాంతి భద్రతలు దిగజారినప్పుడు ఆ
రాష్ట్ర ప్రభుత్వాన్ని సస్పెన్షన్లో ఉంచటం లేదా బర్తరఫ్ చేయటం ఉద్రిక్తోపశమనకు సహాయకారి అవుతుందని
మనకు ఎన్నో ఉదాహరణలున్నాయి. కానీ మోడీ ప్రభుత్వం ఎందువల్లనో భిన్నంగా వ్యవహరిస్తోంది. అది
దాని వైఖరిని పునరాలోచించాలి. తమ రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల గురించి ఇన్నర్ మణిపూర్ ఎంపి,
జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ ప్రొఫెసర్ అయిన బిమోల్ అకోయిజామ్ చేసిన ప్రసంగం వింటే ఎవరికైనా
కళ్లు చెమర్చక మారవు. ‘మీ గుండెల మీద చేయి వేసుకుని, మణిపూర్లో నిరాశ్రయులైన వారి గురించి,
వారి తల్లులు, పిల్లలు, భర్తలను పోగొట్టుకున్న మహిళల గురించి ఆలోచించండి. ఆ తర్వాత చర్యలకు
ఉపక్రమించండి. అక్కడ ఆయుధాలు చేతబట్టి తమ గ్రామాలను కాపాడుకునేందుకు యుద్ధం చేస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వం మాత్రం ఏడాదిగా కొనసాగుతున్న ఈ హింసాకాండపై చేష్టలుడిగి చూస్తోంది’ అంటూ చేసిన
ఆవేదనాభరిత ప్రసంగం పాలకులకు కనువిప్పు కావాలి’.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పనితీరును ఎండగడుతూ, ఆ రాష్ట్ర ప్రజానీకం రెండూ ఎంపి సీట్లలోనూ
కాంగ్రెస్కే పట్టం గట్టారు. కాగా కేంద్ర ప్రభుత్వ గోడీ మీడియా ఎప్పటికప్పుడు మణిపూర్ పరిస్థితిని బాహ్య
ప్రపంచానికి దాచిపెట్టినా, సత్యం, అహింస, ప్రజాస్వామ్య కాంక్షా ప్రియుల వలనే సోషల్ మీడియా ద్వారా
వాస్తవాలు బయటకు వస్తున్నాయి. కేవలం కపటత్వంలో, ఆయుధబలంతో శాంతిని
నెలకొల్పాలనుకోవడం మూర్ఖత్వం, మైనార్టీ మెజార్టీ అనే సంకుచిత ఆలోచనలతో, హిందువులు,
క్రైస్తవులు అనే మత దృక్పథంతో రాజకీయ లబ్ధి కోసం మాత్రమే పాలిస్తే అది దేశ ప్రయోజనాలకు తీవ్రమైన
విఘాతం కలిగిస్తుంది. ఈశాన్యాన సరిహద్దు రాష్ట్రంగా ఉన్న మణిపూర్లో శాంతిభద్రతలు, ప్రజల సమైక్య
జీవనం చాలా అవసరం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రేక్షక పాత్ర వహిస్తే ప్రజలు తమకు అవసరమైన శాంతి
సామరస్యాలను ఉద్యమాల ద్వారా తప్పక సాదించుకుంటారు. ప్రజలే చరిత్ర నిర్మాతలు కదా!

క‌డ‌వెండి, జ‌న‌గామ జిల్లా. ఉపాధ్యాయ ఉద్య‌మ నాయ‌కుడు. సామాజిక‌, రాజ‌కీయార్థిక విశ్లేష‌కుడు.

Leave a Reply