మణిపూర్ మర్మయోగి

రాజ్యాంగ ధర్మం దగ్ధమౌతోంది 

క్షమించండి 
మా రాజు గుడ్డోడు 
కేవలం  
భారతమాత నగ్న పరేడు చూస్తాడు 
కేవలం 
నెత్తుటి ప్రవాహాలు కళ్ళార చూస్తాడు 
కేవలం 
దళిత ఆదివాసి ముస్లిం బహుజన 
శవాల్ని కళ్ళు తెరిచి చూస్తాడు 
కేవలం 
డబులింజన్ సర్కార్ ఎగదోస్తున్న 
మంటలు మాత్రమే చూస్తాడు
కేవలం 
ఆకాశానంటుతున్న అదాని అంబాని 
దోపిడి సంపద మాత్రమే మహదానంగా చూస్తాడు

ప్రజాస్వామ్యం విలపిస్తోంది 

క్షమించండి
మా రాజు చెవిటోడు  
కేవలం 
మృత్యుకేకలు ఆర్తనాదాలు 
మాత్రమే ఆనందిస్తాడు 
కేవలం 
బుల్డోజరు నలుపుతున్న ఎముకల 
శబ్దాల్లో సంబరపడ్తాడు 
కేవలం 
నగ్నదేహాల్ని చుట్టుముట్టిన 
వేల పురుషాంగాహంకారాల 
అసభ్య బొబ్బల్ని తృప్తిగా వింటాడు 
కేవలం 
ఆకలికి రాలిపోతున్న 
చెమటచుక్కల ధ్వనుల్ని తనివితీరా వింటాడు 

రాజధర్మం వికటాట్టహాసం చేస్తోంది 

క్షమించండి 
మా రాజు మూగ వాడు 
కేవలం 
మంటలు పెట్టే మన్కీబాత్ మాట్లాడుతాడు 
కేవలం 
దేశం ఉబ్బి తబ్బిబైయ్యె మునగ చెట్టెక్కిస్తాడు 
కేవలం 
దేశం గుండెల్లో చొరబడే మల్టీనేషనల్సు మహాపన్నాగాలు మాట్లాడుతాడు 
కేవలం 
దేశాన్ని బోర్లాబొక్కలపండ బెట్టి 
రెడ్ కార్పెటు పరిచి
సామ్రాజ్యవాదం నడిచి పోయే మాట్లాడుతాడు 
కేవలం 
మనిషిని చీల్చిఛండాడే వెయ్యి కోరల మతాన్ని మాత్రమే మాట్లాడుతాడు  

క్షమించండి 
మా రాజు మహానటుడు 
అమానవీయ విశ్వగురువు 
ఆస్కారుకు సిఫారసు చేయరూ ప్లీజ్ ! 
ఎవరైనా —
అమానవీయులు!

జ‌న‌నం: వ‌రంగ‌ల్ జిల్లా ప‌ర్వ‌త‌గిరి.పెరిగింది నెక్కొండ. వృత్తిరీత్యా ఉపాధ్యాయుడు. విర‌సం స‌భ్యుడు. తెలుగు సాహిత్యంలో తనదైన తెలంగాణ భాష ముద్రతో కవిత్వం, కథలు రాస్తున్న కవి. 'ముఖచిత్రం', 'పడావు', 'జంగ్-ఏ-కాశ్మీర్', 'హిమాలయాలే వడ్ల తాలయిన అమరత్వం', 'వీరవనం', 'హైదరాబాద్ నా అబ్బ సొమ్మె', 'ర్యామాండం' తదితర దీర్ఘ కవితలు, 'పోస్ట్ మార్టం రిపోర్ట్', 'దుఃఖభాష', 'చెమట చుక్కల కళ్లు' కవితా సంపుటాలు ప్రచురించారు. 'పబేటు వల', 'ఆమె తలాఖంది' తదితర 20 కథలు రాశారు.

Leave a Reply