మణిపూర్ మూడు నెలలుగా ఎందుకు మండుతోంది?

సుధా రామచంద్రన్ మణిపూర్ ఎందుకు మంటల్లో ఉంది అనే అంశంపై ఖమ్ ఖాన్ సువాన్ హౌసింగ్ తో జరిపిన ఇంటర్వ్యూ విశేషాలు:

మే 3 నుండి, ఈశాన్య భారతంలో ఒక రాష్ట్రమైన మణిపూర్ లో హింసాత్మకంగా దారుణమైన అగ్గి రాజుకుని ప్రజలు విల విల లాడుతున్నారు. ఇంఫాల్ లోయలో నివసించే మెజారిటీ మెయితీ జాతి సమూహం – ప్రధానంగా కొండలలో నివసించే కుకి-జోమి తెగలకు సంబంధించిన స్థానిక ప్రజల మధ్య ఘర్షణలు తారాస్థాయికి చేరాయి. ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ (బిజెపి) ప్రభుత్వానికి మణిపూర్ హైకోర్టు ఇచ్చిన ఆదేశం వల్ల హఠాత్తుగా హింస చెలరేగింది. హిందువులు ఎక్కువగా ఉన్న మెయితీలకు విద్య, ఉద్యోగాలు, భూమి హక్కులు, ఆర్ధిక, సామాజిక ప్రయోజనాలను అత్యధికంగా కల్పించే విధంగా షెడ్యూల్డ్ తెగల సమూహాలలో చేర్చి ఆదివాసీ హోదా మంజూరు చేయాలని బీరెన్ సింగ్ ప్రభుత్వానికి మణిపూర్ హైకోర్టు డైరెక్షన్ ఇచ్చింది.

హింస అకస్మాత్తుగా చెలరేగింది, దీనికి ముందు స్వల్పకాలిక ఎన్నికల లాభాల కోసం ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ ప్రభుత్వం క్రమబద్ధమైన మెజారిటీ మతస్థుల సమైక్యవాద ప్రచారం ముమ్మరం చేసింది. ది డిప్లొమాట్ (The Diplomat) పత్రికకి సౌత్ ఏషియా ఎడిటర్ గా పని చేస్తున్న సుధా రామచంద్రన్‌, ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు, భారతదేశంలోని హైదరాబాద్ విశ్వవిద్యాలయంలో రాజనీతి శాస్త్ర విభాగం అధిపతి ప్రొఫెసర్ ఖమ్ ఖాన్ సువాన్ హౌసింగ్ ని ఇంటర్వ్యూ చేశారు. ఆ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ఈ హింస “ఏమాత్రమూ అనూహ్యమైనది, ఆకస్మికంగా జరిగినది, నివారించలేనిది కాదు” అని అన్నారు. ఈ హింస “స్పష్టంగా వాళ్ళు ఇంతకుముందే ఏర్పాటు చేసుకున్న ఒక నమూనాను అనుసరించింది.” అని కూడా అన్నారు. రాజ్యం అల్లర్లకు అనుకూలంగా ఒక దుర్మార్గపు వ్యవస్థను సిద్ధం చేసింది. మెజారిటీ అహంకార, ఆధిపత్యపు హింసా స్వభావాలు గల మందలతో కలిసి రాజ్యం గొడవలకు సన్నద్ధం చేయడం, వాటిని అమలు చేస్తూ కొనసాగించడమే కాకుండా, చేస్తున్న హింసకు “వివరణాత్మక సమర్థన” అందిస్తుందని ఆయన వాదించారు.

ప్ర: మీరు మణిపూర్‌లో ఇటీవలి హింసకు సంబంధించిన సంఘర్షణల అవగాహనను మాకు స్థూలంగా వివరిస్తారా?

మే 3 నుండి మనం చూస్తున్న జాతుల రాజకీయ సంఘర్షణల వల్ల చెలరేగిన మంటలకు మూల కారణమైన కోర్ట్ ఆదేశం మణిపూర్‌లోని కీలకమైన ప్రాంతాలను హత్యా క్షేత్రాలుగా మార్చింది. ఆల్ ట్రైబల్ స్టూడెంట్స్ యూనియన్ – మణిపూర్ ((ATSUM), కుకీ, నాగా, హ్మార్, జోమి తెగల సంఘాలు నిర్వహించిన శాంతియుత నిరసన ర్యాలీలకు వ్యతిరేకంగా వివిధ మెయితీ సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్ ((CSOs) నిర్వహించిన హింసాత్మక ప్రతిఘటన ర్యాలీలు దుశ్చర్యలకు పాల్పడ్డాయి. రాష్ట్రంలోని సమైక్యవాద దుందుడుకు విధానాలతోనూ, కలహాలకు కాలుదువ్వే ఆధిపత్య హింసావాదులైన మెజారిటీ మెయితీల సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్ల క్రియాశీల మద్దతుతోనూ పాలకులే ఆదివాసీ హక్కులను పక్కదారి పట్టించాలని, రద్దు చేయాలని చూస్తున్నారు. ఆల్ ట్రైబల్ స్టూడెంట్స్ యూనియన్ ర్యాలీలు ఆ గిరిజనుల భూమి హక్కులను, ప్రస్తుతం అమలవుతున్న ఉప-రాష్ట్ర రాజ్యాంగ అసమాన సంస్థలను (రాజ్యాంగబద్ధంగా ఆర్టికల్ 371C ప్రకారం సంక్రమించిన హక్కులను) పరిరక్షించడానికి నిరసనలు చేపట్టారు.

హింస చెలరేగిన తర్వాత, నాగా సమూహాలు ప్రేక్షక పాత్ర వహించి పెద్దగా ప్రభావితం కానప్పటికీ, వైరుధ్యాలు మెయితీ, కుకీ-జోమి (ఇకపై, ఈ గ్రూప్ ప్రజలందర్నీ జో ప్రజలు అని అందాం) జాతి రాజకీయ వైరుధ్యాలుగా రూపాంతరం చెందాయి. మెయితీల అల్లరిమూకలు, మెయితీ లీపన్ (Meitei Leepun), అరంబాయి తెంగోల్ (Arambam Tenggol) అనే రాడికల్ గ్రూపులు, ప్రభుత్వ సహకారంతో, పోలీసుల క్రియాశీల ప్రమేయంతో జో ప్రజలపై దాడులు చేశారు. ఈ దాడులలో జరిగిన జాతి ప్రక్షాళనలు, మారణహోమ దాడులు స్పష్టంగా ఇంతకుముందు స్థాపించబడిన నమూనాను అనుసరించాయి. మెయితీల మీద జో ప్రజలు కూడా ప్రారంభించిన ప్రతీకార దాడులకు అసమాన ఫలితాలు ఉన్నప్పటికీ, ఆ దాడులు కూడా మెయితీలు జరిపిన జాతి హననాల చిహ్నాలను కలిగి ఉన్నాయి.

ప్ర: ఈ అల్లర్లకు ముందు రాష్ట్రంలో మణిపూర్ ప్రభుత్వ మెజారిటీ-సమైక్యవాద ప్రాజెక్ట్ గురించి చెప్పండి.

ఇటీవలి మే 3న మణిపూర్‌లో మెయితీ – జో ప్రజల మధ్య హింసాకాండ మొదలైంది. బీరెన్ సింగ్ నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వం 2017 మార్చిలో అధికారంలోకి వచ్చినప్పటి నుండి స్వల్పకాలిక ఎన్నికల లాభాల కోసం చేపట్టిన దుందుడుకు మెజారిటీ సమైక్యవాద ప్రాజెక్టుకు ఇది పరాకాష్ట. ఆర్టికల్ 371C ప్రకారం జిల్లా గిరిజన ప్రజలు అనుభవిస్తున్న కౌన్సిల్‌లు, భూమి హక్కులను పక్కదారి పట్టించడానికి, అసలు మొత్తంగా రద్దు చేయడానికి ఈ ప్రాజెక్ట్ రాడికల్ నియో-మెయితీ మతాన్ని (సనామహి) మెజారిటేరియన్ అభివృద్ధి రాజకీయాలతో నైపుణ్యంగా మిళితం చేస్తుంది. ఇది లోయలోని మెజారిటీ మెయితీ ఎన్నికల నియోజకవర్గాన్ని ఆకట్టుకోవడానికి కొండలలో పవిత్రీకరణ ప్రాజెక్టులను వరసగా ప్రారంభం చేస్తుంది, అదే సమయంలో విధేయులైన కొండ గిరిజన నాయకులను అభివృద్ధి కలల ప్రపంచాన్ని చూపిస్తూ లోబరచుకుంటుంది.

ఉదాహరణకు, అక్టోబర్ 2022లో, ఇండో-మయన్మార్ సరిహద్దులో ఉన్న చివులో చంద్రకీర్తి మెమోరియల్ పార్కును ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ ప్రారంభించారు. 1872లో ఇంఫాల్‌లో మెయితీ చక్రవర్తి చంద్రకీర్తి హయాంలో జో తెగల నాయకుడు గో ఖవ్ థాంగ్ ను నిర్బంధంలో ఉంచి హత్య చేయడానికి ముందు “ద్రోహపూరితంగా” బంధించబడిన ప్రదేశం ఇది. జో (కుకి-చిన్-లుషాయ్ తెగలు) ప్రజలలో బలమైన వ్యతిరేకత ఉన్నప్పటికీ, మెయితీ సమూహంలోకి తన ఎన్నికల విజ్ఞప్తిని బలంగా పంపడం కోసం విధేయులైన గిరిజన నాయకులను అనునయపరిచి ఒప్పించి, మెమోరియల్ పార్క్ ను బీరెన్ సింగ్ నెలకొల్పాడు.

తనను తాను “సమిష్టి నాయకుడిగా” ప్రదర్శించుకోవడానికి, బిజెపికి వ్యతిరేకంగా రూపొందుతున్న వర్గ సవాలును ఎదుర్కొని, తన నాయకత్వ స్థానాన్ని సుస్థిరం చేసుకుంటూ వారిని సంతృప్తి పరచడానికి, బీరెన్ సింగ్ తన పెంపుడు రాజకీయ ప్రాజెక్ట్ “గో టు ది హిల్స్” ద్వారా విస్తృత సామాజిక, రాజకీయ సంకీర్ణాన్ని ఏర్పరచుకున్నాడు. బీరెన్ సింగ్ తన రాజకీయ వాక్చాతుర్యంతో కొండలు – లోయల మధ్య ఉన్న విభజనలకు తాను వంతెనను ఏర్పాటు చేస్తానని చెబుతూ వీలయినంత మంది గిరిజన నాయకులను లోబరుచుకున్నాడు. ఈ క్రమంలో, తన కనుకూలమైన అనేక కేంద్ర ప్రాయోజిత అభివృద్ధి ప్రాజెక్టులు ప్రారంభించబడ్డాయి. అంతేగాక కొండలలో క్యాబినెట్ సమావేశాలు జరిగాయి.

అయితే, ఈ ప్రాజెక్ట్ గురించిన అసలు ఉద్దేశ్యం త్వరలో బయటపడడం ప్రారంభించింది.

ఇండో-మయన్మార్ సరిహద్దులోని చివు ఉప్పు సరస్సు చుట్టూ ప్రభుత్వం సేకరించిన గిరిజన భూమిని 1990 లో “రక్షిత” ప్రదేశంగా ప్రభుత్వ ఉత్తర్వును జారీచేయడమే కాకుండా, మెయితీ దేవుడైన థాంగ్జింగ్ అడపా దడపా కనిపించే ప్రదేశంగా ప్రకటించి, ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ తన పవిత్రీకరణ ప్రాజెక్టులో భాగంగా ఆ పార్కులో ఒక రాతి ఏకశిలను నిర్మించాడు. కాంగ్‌పోక్పి జిల్లాలోని కౌబ్రు కొండలలో ఇలాంటి పవిత్రీకరణ ప్రాజెక్టులు చేపట్టారు. కౌబ్రూ కొండలను లైఫామ్ (లైనింగ్‌థో, మెయితీ ప్రధాన దేవుడు) గా పిలుస్తూ, తీవ్రవాద సమూహం అయిన మెయితీ లీపన్ ఆధ్వర్యంలో ఈ ప్రదేశానికి మతపరమైన తీర్థయాత్రలను అతి వేగంగా, దూకుడుగా ప్రచారం చేశారు. గిరిజనుల భూములను లాక్కోవడానికి మెయితీ – ఆధిపత్య వాదులు, రాష్ట్ర ప్రభుత్వం ఒక క్రమమైన ప్రణాళిక ప్రకారం కలిసి చేసిన ప్రయత్నాలుగా ఇవి తర్వాత పరిగణించబడుతున్నాయి.

తర్వాత బిజెపి ప్రభుత్వం కొండ ప్రాంతాలలో “భూ సర్వేలను” ప్రారంభించింది. ఇవి గిరిజనులను లక్ష్యంగా చేసుకుని దశలవారీగా “ఆక్రమణదారులు”, “అక్రమ వలసదారులు”, “నల్లమందు సాగుదారులు” గా అసత్య ప్రచారాలు చేస్తూ చివరికి వారిని ఆ ప్రాంతాల నుండి తొలగించే ప్రక్రియతో పరాకాష్టకు చేరుకుంది. స్పష్టంగా, షెడ్యూల్డ్ తెగ ప్రాంతాలకు సంబంధించిన వనరు లను వారినుంచి నిశ్శేషం చేయడానికి, బలవంతంగా లాక్కోవడానికి, రాజ్యాంగబద్ధమైన సంస్థ అయిన హిల్ ఏరియాస్ కమిటీ (Hill Areas Committee) ని రాష్ట్రం పక్కన పెడుతోంది. హిల్ ఏరియాస్ కమిటీలలో గిరిజనేతరులను చేర్చడం ద్వారా వాటిని నీరుగార్చడానికి ప్రయత్నం చేసింది. ఇటువంటి ఎత్తుగడలు ఆదివాసీ ప్రజలను నిస్సహాయ స్థితిలోకి నెట్టివేశాయి. ఆ తర్వాత, ఈ ఏడాది ఏప్రిల్ 11వ తేదీ రాత్రి, చట్టపరమైన పత్రాలు ఉన్నప్పటికీ, ఇంఫాల్‌ లోని మూడు గిరిజన చర్చిలను కూల్చివేశారు. పబ్లిక్ ప్రెమిసెస్ (అనధికార నివాసితుల తొలగింపు) చట్టం 1971, ప్రకారం, సూర్యాస్తమయం తర్వాత సూర్యోదయానికి ముందు, అది కూడా ముందస్తు నోటిఫికేషన్, అప్పీల్‌కు తగిన సమయం ఇవ్వకుండా ఏ భవనాన్ని కూడా కూల్చివేయకూడదు.

స్టేట్ ఆఫ్ గుజరాత్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేస్, 2009లో ప్రభుత్వ భవనాలను సమీక్షించాలని సుప్రీం కోర్టు అన్ని భారతీయ రాష్ట్రాలను ఆదేశించిన తర్వాత క్రమబద్ధీకరించబడిన 188 మెయితీ హిందూ దేవాలయాలతో పోల్చితే ఒక్క గిరిజన చర్చిని కూడా క్రమబద్ధీకరించడానికి నిరాకరించడాన్ని చూస్తే, రాష్ట్ర పక్షపాత వైఖరి స్పష్టమవుతుంది.

ప్ర: అయితే, ఈ హింసకు దారితీసిన దేమిటి?

షెడ్యూల్డ్ తెగ (ఎస్టీ) హోదా కోసం మెయితీ డిమాండ్‌పై నాలుగు వారాల్లోగా తన వైఖరిని స్పష్టం చేయాలని మణిపూర్ హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించడంతో ఒంటె వెన్ను విరిచిన చివరి ఘట్టం వచ్చింది. ఇంఫాల్, న్యూఢిల్లీ ప్రభుత్వాలకు తమ నిరసన తెలిపేందుకు మే 3న మణిపూర్‌లోని ఆల్ ట్రైబల్ స్టూడెంట్స్ యూనియన్ ఆధ్వర్యంలో వివిధ కొండ ప్రాంతాలలో అనేక నిరసన ర్యాలీలు నిర్వహించబడ్డాయి. మెయితీలు ఇప్పటికే ఇతర వర్గీకరణల కింద మూడు రిజర్వేషన్ ప్రయోజనాలను పొందుతున్నారని, ఎస్టీ హోదాను డిమాండ్ చేయడం తమ భూములను లాక్కోవడానికి మరో మార్గంగా భావిస్తున్నట్టు గిరిజనులు నిరసన తెలిపారు.

ఈ నిరసన ర్యాలీలు శాంతియుతంగా జరిగాయి. అయినప్పటికీ లోయలోని వివిధ ప్రాంతాలలో వివిధ మెయితీ పౌర సమాజ సంస్థల సభ్యులు ప్రతిఘటనలతో వారిని ఎదుర్కొన్నారు. మెయితీ మూకలు లీసాంగ్ గ్రామంలో ఆంగ్లో-కుకి యుద్ధం స్మారక చిహ్నం (1917-19) సెంటెనరీ మెమోరియల్ గేట్‌ను తగలబెట్టారు, అంతేగాక నిరసన ర్యాలీ నుండి తిరిగి వస్తున్న కుకీ యువకులను చితకబాదారు. ఇలాంటి ఘటనలు మూకుమ్మడి ఘర్షణలకు దారితీశాయి. ఆ తర్వాత మెయితీ మూకలు కాంగ్‌వై గ్రామంలో వైఫే (భాష) మాట్లాడే కొన్ని ఇళ్లను తగలబెట్టడంతో, జాతి విద్వేషాలూ, రాజకీయ వివాదాలూ దావానంలా వ్యాపించి రాష్ట్రంలోని చాలా ప్రాంతాలను హత్యా క్షేత్రాలుగా మార్చేశాయి!

ప్ర: మీ రచనలలో, మణిపూర్‌లో జరిగిన అల్లర్లపై మీరు అమెరికన్ రాజకీయ శాస్త్రవేత్త పాల్ బ్రాస్ చెప్పిన “సంస్థాగతమైన అల్లర్ల వ్యవస్థ” అనే భావనపై దృష్టి పెట్టారు. ఈ భావన మణిపూర్‌కు ఏ రకంగా వర్తిస్తుంది?

మణిపూర్‌లో ఇటీవల జరిగిన హింస అనూహ్యమైనది, ఆకస్మికమైనది, నిరోధించలేనిది కాదు, సరికదా అది స్పష్టంగా నిర్ణయించబడిన నమూనాను అనుసరించింది. దీనిని పాల్ బ్రాస్ “సంస్థాగత అల్లర్ల వ్యవస్థ” గా అభివర్ణించారు, ఇక్కడ రాష్ట్రం పైన వివరించినట్లు ఒక సంకల్పిత ప్రయోగాన్ని, మెజారిటీ మెయితీ హిందువులతో కుమ్మక్కై, కేంద్ర ప్రభుత్వ ఆశీస్సులతోనే దాని ఎజెండాను శీఘ్రంగా అమలు చేయడం ద్వారా దాడులకు పథకం వేసి సంస్థాగత వాతావరణాన్ని సిద్ధం చేసింది.

ఈ ఎజెండా అతివ్యాప్తి చెందడమే కాకుండా, మెయితీ సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్, మెయితీ లీపన్, అరంబాయి తెంగోల్ వంటి రాడికల్ మెయితీ గ్రూపులు చేపట్టిన సారూప్య ఎజెండాల ద్వారా బలపడుతుంది. ఈ మెయితీ గ్రూపులు కాంగ్లీపాక్ (Kangleipak- ఇది మెయితీ దేశీయ పదం), అంటే మణిపూర్ రాజ్యం 1949లో భారతదేశంలో విలీనమయ్యేముందు వైభవాన్ని పునరుద్ధరించడమే లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఈ సమూహాలు వారసత్వంగా పొందిన రాడికల్ ప్రాజెక్ట్, భారతదేశ వ్యతిరేక, హిందీ వ్యతిరేక, హిందూ వ్యతిరేక ఎజెండాలను ప్రోత్సహిస్తూ, మెయితీ సమాజాన్ని హిందువులా మార్చడాన్ని వ్యతిరేకిస్తుంది. బీరెన్ సింగ్, బిజెపి ప్రభుత్వాలు స్వల్పకాలిక ఎన్నికల లాభాల కోసం వారిని ప్రోత్సహిస్తున్నారు . నిప్పుతో చెలగాటం ఆడుతున్నారు.

2023, ఏప్రిల్ 28 నాటి ఫేస్‌బుక్ పోస్ట్‌ లో, మెయితీ లీపన్ ప్రముఖ నాయకుడు ప్రమోద్ సింగ్, “కొండలపై ఉన్న మన సాంప్రదాయ ప్రత్యర్థిని” అంటే కుకీ-జోమి ప్రజలను నిర్మూలించమని తన అనుచరులను ప్రేరేపించడమే కాదు, బాగా ఉసిగొల్పి రెచ్చగొట్టాడు. కుకీలను “విదేశీయులు,” “అక్రమ వలసదారులు,” “ఆక్రమణదారులు,” “నల్లమందు సాగుదారులు” గా అభియోగాలు మోపుతూ, వారిపై మతపరమైన దూషణలు చేస్తున్న ఈ సంస్థల పోస్టులను ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ సోషల్ మీడియా పోస్ట్‌ లతో పోల్చితే వాటి సారూప్యత అర్థమవుతుంది. వివిధ గిరిజన సంస్థల సోషల్ మీడియా పోస్ట్‌ లలో కూడా ఇలాంటి మతపరమైన దూషణలు పుష్కలంగా ఉన్నాయి. స్పష్టంగా, ఇద్దరూ కాలక్రమేణా ఒకరితో ఒకరు దూషణ తిరస్కారాల సంభాషణ సంబంధాలలో ఉన్నారు!

లైసెన్సుల “రీ-వెరిఫికేషన్” సాకుతో సింగ్ ప్రభుత్వం 2023 ఫిబ్రవరి నుండి మార్చి వరకు కొండల్లోని ప్రజల నుండి లైసెన్స్ పొందిన తుపాకులను సేకరించడం ద్వారా హింసకు వేదికను సిద్ధం చేసింది. హింసాకాండ రెండవ రోజు చివరి భాగంలో మాత్రమే అల్లర్లకు పాల్పడే గుంపులను కాల్చివేయమనే ఉత్తర్వులు విధించదాన్ని చూస్తే క్రియాశీల రాష్ట్ర సహకారంతో ఈ అల్లర్లు ప్రారంభమయ్యాయని స్పష్టమైంది. తత్ఫలితంగా, ఇంఫాల్ లోయలోని ప్రాంతాలలో జో ప్రజలపై జాతి నిర్మూలన మారణహోమ దాడులను పూర్తి చేయడానికి మెయితీ మూకలకు ఒక పూర్తి రాత్రి, మరొక రోజు సమయం ఇవ్వబడింది. చాలా కాలంగా క్రూరమైన సాయుధ దళాల (ప్రత్యేక అధికారాలు) చట్టం (1958) అమలులో ఉన్నప్పటికీ, కొండ ప్రాంతాలలో కూడా మూకలు మెయితీలపై ప్రతిదాడులు చేశారు. ఆసక్తికరమైన విషయమేమిటంటే, కొండల్లో మెయితీలకు భూమి యాజమాన్య హక్కులు లేవనే అపోహను ఇది ఛేదించింది.

ఇప్పుడు ప్రభుత్వం, ఆధిపత్య భావాలు కలిగిన మెయితీ మేధావులు, సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్ల నాయకులు హింసకు వివరణాత్మక సమర్థనలను అందిస్తున్నారు. తాము సాగు చేసుకుంటున్న నల్లమందు తోటలను కప్పిపుచ్చడానికి కొండల్లోని సాయుధ జాతివాద ఉద్యమాల, వ్యవస్థీకృత రాజకీయ ప్రాజెక్ట్ ఫలితమే ఈ సంఘర్షణ అని వారు పేర్కొంటున్నారు. ఇటువంటి ఆరోపణలు పైకి వినడానికి న్యాయసమ్మతం గానే తోస్తాయి. అయితే చాలా మంది మాదకద్రవ్యాల యజమానులు లోయ ప్రాంతాలకు చెందినవారేనని, వాళ్ళు రాష్ట్ర ప్రభత్వమూ, లోయ ఆధారిత నిషేధిత సాయుధ తిరుగుబాటు గ్రూపులూ అందిస్తున్న సహకారంతో పనిచేస్తున్నారనే వాస్తవాన్ని వారు సౌకర్యవంతంగా విస్మరిస్తారు. దీనికి విరుద్ధంగా, జో గిరిజన సమూహాలు ఈ సంఘర్షణలకు ప్రభుత్వ పక్షపాత ఆమోదముద్రలు ఉన్నాయని వాదిస్తున్నాయి. ఆధిపత్య మెయితీలు, సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్లు, లోయ-ఆధారిత సాయుధ సమూహాలతో కలిసి రాష్ట్ర ప్రభుత్వం తన ఏకీకరణ, మెజారిటేరియన్ ఎజెండాను మరింత బలపరచడానికి అల్లర్లను తయారు చేసి, క్రియాశీలం చేసి కొనసాగించింది. స్పష్టంగా, మణిపూర్‌లో ప్రస్తుత అల్లర్లను “సంస్థాగతమైన అల్లర్ల వ్యవస్థ” కు ఉత్తమ ఉదాహరణగా చెప్పవచ్చు.

ప్ర: మణిపూర్‌లోని మెజారిటీ ప్రజలు మెయితీ హిందువులు అయితే, క్రైస్తవులైన కుకీలు తీవ్రమైన మూక దాడులకు బలయ్యారు, హింసలో మతతత్వవాదం ఎలాంటి పాత్ర పోషించింది? హిందుత్వ గ్రూపులు మెయితీలను సమీకరించాయా?

నిస్సందేహంగా, అల్లర్లు జరిగిన మొదటి రాత్రి ఇంఫాల్‌లోని డజనుకు పైగా గిరిజన చర్చిలను దహనం చేయడం, హిందూ – క్రిస్టియన్ మతాల మధ్య కార్చిచ్చును దావానలంలా వ్యాపింపజేశామని మెయితీ మూకలు న్యూఢిల్లీ బిజెపికి అనుకూలమైన సంకేతం పంపడానికి ఉద్దేశపూర్వకంగా పన్నిన వ్యూహమే. కానీ క్షుణ్ణంగా పరిశీలించినప్పుడు, మెయితీ లీపన్ తీవ్రవాద సంస్థ, ఇతర సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్లు, అధికారంలో ఉన్న వ్యక్తుల క్రియాశీల మద్దతుతో రాష్ట్ర సమైక్య మెజారిటీ ఎజెండాకు రంగం సిద్ధం చేసి అమలు చేయడానికి క్రమక్రమంగా సమీకరించబడ్డాయని స్పష్టమైంది. మెయితీ లీపన్ కౌబ్రూ హిల్స్‌ లో అహంకారపూరితంగా నిర్వహించిన మతపరమైన తీర్థయాత్ర థాంగ్జింగ్ కొండలను కొండ ప్రాంతాల్లోని ఇతర ప్రాంతాలను పవిత్రంగా మార్చడానికి ఈ సంస్థలు ప్రారంభించిన వివిధ చింగ్ కాబా కొండ లెక్కడం (పర్వతారోహణం) వంటి కార్యక్రమాలు ఈ ఎజెండాను ప్రోత్సహించే విధంగా జాగ్రత్తగా ఒక క్రమపద్ధతిలో పథక రచన చేశారు. అరంబాయి తెంగోల్ ను జాగ్రత్తగా రూపొందించిన ఆయుధ శిక్షణ ద్వారా ఇదే విధమైన దాడులకు అనుకూలంగా మార్చారు. రాష్ట్రం లోని ప్రస్తుత రాజ్యసభ ఎంపీ సనాజయోబా ఆధ్వర్యంలో ఆయుధ శిక్షణ జరిగింది. ఆయన పదవి ఈ రాష్ట్ర ఘర్షణలలో ప్రత్యేకంగా ఉపయోగపడింది. రాష్ట్రంలో ఈ సమయంలో సంఘ్ పరివార్ నెట్‌వర్క్‌ లు కూడా విస్తరించాయి, అయితే ఎన్నికల్లో మెయితీ లను సమీకరించడంలో వాటి ప్రభావం ఎలా ఉంటుందో చూడవలసి ఉంది.

ప్ర: ఆశుతోష్ వర్ష్నీ(Asutosh Varshney), “ఎత్నిక్ కాన్ఫ్లిక్ట్ అండ్ సివిల్ సొసైటీ” (Ethnic Conflict and Civil Society), అనే తన పుస్తకంలో ఇంటర్ కమ్యూనల్ నెట్ వర్క్ లు జాతి హింసను నిరోధిస్తాయని వాదించారు. మణిపూర్ లో బలమైన పౌరసమాజం ఉంది. జాతి హింసను నిరోధించడంలో అవి ఎటువంటి పాత్ర పొషించాయి?

దురదృష్టవశాత్తూ, మణిపూర్ లోని పౌర సమాజ సమూహాలన్నీ కూడా మతతత్వానికి ఎక్కువగానే లోనవుతున్నాయి. ఆశుతోష్ వర్ష్నీ తన పుస్తకంలో వివరించిన విధంగా ఈ సంఘర్షణలు – ఏ విధంగానైనా నిరోధక పాత్రను పోషించలేవు.

ప్ర: మణిపూర్ లో డజన్ల కొద్దీ మిలిటెంట్ గ్రూపులు ఉన్నాయి కదా, వారు ప్రస్తుతం జరుగుతున్న హింసలో పాల్గొంటున్నారా?

మణిపూర్లో కొండలూ-లోయప్రాంతాలు రెండింటి లోనూ సాయుధ గ్రూపులు హింసలో చురుకైన పాత్ర పోషిస్తున్నాయని విశ్వసనీయ నివేదికల ద్వారా సమాచారం అందుతూ ఉంది. అయితే ఇరువైపుల ఉన్న ఈ రెండు గ్రూపులకు పోలీసుల మందుగుండు సామాగ్రి అందుబాటులో చాలా అసమానతలున్నాయి. అంటే మొదట్లోనే లోయప్రాంతాలకు ఆయుధ సామాగ్రి ఎక్కువ అందుబాటులో ఉండడవల్ల ఈ అల్లర్లు ఎక్కువ ప్రాణాంతకంగా పరిణమించాయి.

ప్ర: మణిపూర్ విదేశీ సరిహద్దుల వల్ల చాలా సున్నితమైన ప్రాంతంలో ఉంది. ఇటీవలి హింస ఇతర రాష్ట్రాలకు వ్యాపించే అవకాశాలున్నాయా?

మణిపూర్ లో అల్లర్లూ, హింసలూ చెలరేగిన ఒకరోజు తర్వాత మే 4వ తేదీన షిల్లాంగ్, మేఘాలయ రాష్ట్రాలలోని మెయితీ-జో గ్రూపుల మధ్య వాగ్వివాదాలు జరిగాయని నివేదికలు బయటికి వచ్చినప్పుడు, అసలే అత్యంత పెళుసుగా, సున్నితంగా ఉన్న ఈ అంతర్గత-వర్గ సంబంధాల వివాదాలు, కొట్లాటలు వత్తులు వేసి మండించే టిండర్ బాక్స్ లాగా మరింత ఉద్రిక్తంగా స్పష్టంగా తగలబడే అవకాశముంది. ఈ రెండు గ్రూపులూ భారతదేశం లోని ఈశాన్యరాష్ట్రాలు, అనేక ఇతర మెట్రోపాలిటన్ నగరాల్లోకి విస్తరించి ఉన్నాయి. మరీ ముఖ్యంగా పరస్పర ద్వేషాలు, అనుమానాలు నరనరానా పాతుకుపోయి ఉన్నందువల్ల ఇలాంటి ఘర్షణలు, మంటలు హద్దూ, అదుపూ లేకుండా పెట్రేగిపోయే ప్రమాదముంది.

జననం: గుంటూరు జిల్లా భట్టిప్రోలు. రేపల్లె, తెనాలి, హైదరాబాద్ లో విద్యాభ్యాసం. హైదరాబాద్ టెలికాం (ఇప్పటి బీఎస్ఎన్ఎల్)లో ఉద్యోగం చేశారు. మహిళల సమస్యలపై పనిచేశారు. ఉస్మానియా యూనివర్సిటీలో ఎం.ఏ(ఇంగ్లిష్ లిటరేచర్), ఎం.ఏ(తెలుగు సాహిత్యం), హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో శ్రీ శ్రీ రేడియో నాటికల మీద ఎం.ఫిల్ చేశారు. S.M Synge(Ireland writer ) రాసిన “Riders to the Sea” ఏకాంకికకి తెలుగు అనువాదం. శాస్త్రీయ దృక్పథం, ప్రత్యామ్నాయ సినిమా, సినిమా అక్షరాస్యతను పెంపొందించుకోవడం ఇష్టమైన విషయాలు.

Leave a Reply