మట్టి పాటలు

1.
ఎంత సుకుమారపు చేతులవి?
సాగరాన్ని సంకనేసుకుని
కెరటాల గర్భాన తొలి పురుడు పోసి
అలలకి జోలపాట పాడి
‘జన్యు’ లతల్ని జతచేసి అల్లి
‘కణ’ సముదాయాన్ని క్రమంగా పేర్చి
గుబురు చెట్టు మీద ఓ గూడు కట్టి
పిట్టల్ని ప్రపంచం చుట్టూ ఎగురవేసిన
ఆ నేలతల్లి పొత్తిళ్ళవి!

ఎవరు నేర్పించారామెకు
భూమి గుమ్మానికి
గువ్వల తోరణాలు కట్టడం!
అడవి పంచ గూట్లో
ఆకుపచ్చని దీపాలు పెట్టడం!
సిగ్గు పడుతూ
ఎగిరిపోయే మ‌బ్బుల చిలిపి బుగ్గలపై
పరవపు పవనమై పరచుకుని
మురిపాలు కురిపించి
చిరు జల్లులు జుర్రుకోవడం!
కొండ కోనలలో, లోయ వాలులలో
కాలి గజ్జెలు కట్టుకుని
సెలయేటి కాలిగట్లపై
చెంగుచెంగున ఎగురుతూ,
గలగలమని ఉరుకుతూ…
నది ఒడ్డుకు చేరి తడి ఇసుకలో ‘పరుగడం’
ఎవరు నేర్పారామెకు!
ఆద్యంతం ఒక ‘సజీవత్వాన్ని’ మోస్తూ
సత్య సంకల్పంతో
నిత్యావిష్కరణమై నడవటం
ఎవరు నేర్పారామెకు!
తూరుపు తలుపు తెరచి
నీటిని, నిప్పును, గాలిని
తన మునివేళ్ల మృదు స్పర్శతో
నీలి మేఘాల కింద
మట్టి బొమ్మగా తీర్చి,
భాషగా మలచి భావించడం!

2.
అనగనగా….
ఒక అడవిలో
ఆమెకు తప్పిపోయిన ఓ పసిబాలుడు దొరికాడు
ఆకలితో అలమటిస్తున్న వాడికి
ఆకాశ జాబిల్లిని చూపి
జోల పాటలు పాడి
గోరుముద్దలు తినిపించింది
గజగజ వణికే వాడి నగ్న దేహం చుట్టూ
ఆమె ఓ నెగడు రగిల్చి
వెచ్చదనంతో పాటు కాగడా వెలిగించి ఇచ్చింది
ఖండాలకు మంచు వారధులేసి
వాడి చెయ్యి పట్టి
సాగర తీరాలను దాటించి
సమున్నత శిఖరాలకు చేర్చింది
నదీ ప్రవాహ పరీవాహకం చుట్టూ
కుటీరాలు వేయించి
కుట్రలు లేని, కుతంత్రాలు లేని
సమతా, సంస్కృతి పాఠాలు నేర్పించింది
వాడికి నాగరిక ఓనమాలు దిద్దించి,
సకల జీవరాశుల
జ్ఞాన సారాన్ని కాచి వడపోసి
సర్వం వాడికి ధారపోసి
వాన్ని మనిషిగా తీర్చిదిద్ది
మళ్లీ మట్టిలో దీపాలు పెట్టే
పనిలో ఆమె మునిగిపోయింది
ఆమె ఎప్పుడూ అంతే!
ఓ ప్రవహించే జీవధార
ఓ నిరంతర ప్రాణదాత.

3.
ఆమె అటుపోగానే
వాడు కుటీరాలు కూలదోసాడు
కపట గోడలు కట్టడం నేర్చాడు
‘సరి సగం’ అన్న సిద్ధాంతాన్ని మట్టుపెట్టి
సరిహద్దుల రాద్ధాంతం మొదలు పెట్టాడు
చనుబాల తీపి మరిచి
ఆ తల్లినే చెరబట్టడం మొదలుపెట్టాడు
అప్పుడు ఒక అమృత స్వప్నం
అర్ధాంతరంగా గాజు ముక్కలా పగిలిపోయింది
ఆమె కలలపై కత్తి గాట్లు కవాతు చేశాయి
నెత్తురంతా వొలికి
గూటిలోని గువ్వలు గాయాల పాలయ్యాయి
ఒక నిశ్శబ్ద దుఃఖ కెరటం
భువిపై ఎగిసి పడ్డది
వాడికివేమీ పట్టవిప్పుడు
వాడిదంతా ఓ యంత్రభాష
మార్కెట్ అనో
మారకమనో
ఎకానమీ అనో
ఏదో ఒక పేరిట
ధ్వంస రచనకు శ్రీకారం చుట్టి
ఒక అమానుష క్రీడకు తెరలేపాడు
ఒక అసమ అసహ్యకర ‘నాగరిక’
వంచక కవచం తగిలించుకుని
కూలుతున్న నేల పునాదుల పై
చితిమంటలతో చలికాచుకోవడం
మొదలు పెట్టాడు
వాడెప్పుడైతే పెట్టుబడి పిపాసై
పెట్రోలుకు బానిసై
యుద్ధగాథలు వల్లెవేస్తూ
నెలవంకల పసిబుగ్గలపై నెత్తురు చిమ్మే
కిరాతకానికి ఒడిగట్టాడో
అప్పడే ఆమె వాడిని ఛీ కొట్టింది
అప్పుడు ఆమె చుట్టూ
ఓ దిగులు మేఘం కమ్ముకున్నది

4.
అవును
ఇప్పుడంతా అర్ధాంతరమే
వేర్లు ముక్కలు ముక్కలుగా తెగిపడుతున్నాయి
చిగురుటాకులు ఛిద్రమై పోతున్నాయి
‘ఆమె’ అంతరిస్తుందన్న
ఒక క్రూరమైన వాస్తవం
జీవన వనరు మారకపు సరుకై
మర యంత్రపు రాకాసి ఉక్కు గోర్లు
ఆమె దేహాన్ని చుట్టుముట్టి
ఖండఖండాలుగా చెక్కేస్తున్నాయి
అప్పుడు మట్టి దీపాలు ఆమె చేతుల నుంచి జారిపడి
భూమి అగ్ని కీలల్లో చిక్కుకుని భగ్గున మండుతుంది
ఒకవైపు
అవని ఊపిరితిత్తులు తగలబడుతుంటే
మరోవైపు
వాడు మాత్రం తీరిగ్గా ప్లాస్టిక్ పరిభాషకు
పదును పెట్టే పనిలో తలమునకలై ఉన్నాడు!
కలలను చిదిమేసే వలలు తయారు చేసి
చివరకు మారణహోమాన్ని సైతం
ష‌రా మామూలుగా చిత్రించి
దురాగతాలకి మౌన సమ్మతిని కూడగట్టుకుని
ఎంతటి అమానుషానికైనా
మనిషిని అలవాటు చేస్తున్నాడు

5.
ఆ రోజు రానే వస్తుంది
సంక్షోభం చేయి దాటిన రోజు
పునాదులు కూలుతున్న రోజు
పువ్వులు నవ్వలేని రోజు
వసంతానికి వెలకట్టలేని రోజు
ఆ రోజున
నా అపరాధం తెలుసుకుని
ఆమె పాదాల చెంత మోకరిల్లి
నా నేరం అంగీకరిస్తాను
‘అమ్మా నన్ను క్షమించమ్మా…’ అంటూ
నేను ఆమె పాదాలపై పడి వేడుకున్నప్పుడు
పల్లెత్తు మాట కూడా అనదు ఆ తల్లి
ఇన్నాళ్లుగా నేను అందుకోలేని
అవని ఔన్నత్యం, ‘ప్రేమించడమంటే’ ఇదేనేమో!
ఎప్పటిలాగే ఆమె
నన్ను పసివాడిలాగే చూస్తూ
మాతృక చేతులు సాచి
నా చెక్కిళ్ల‌పై కారుతున్న
నులివెచ్చని కన్నీళ్లు తుడిచి
‘బిడ్డా…
ఇప్పుడు నాకోసం
కొన్ని మట్టి పాటలు పాడవా?
అని అడుగుతుంది.


పనిచేసేది కంప్యూటర్ తెర పైన అయినా పుస్తకాలతో పెనవేసుకున్న అనుబంధం తెంచుకోలేక చదవడం, అప్పుడప్పుడు రాయడం చేస్తుంటాడు. ఇప్పటి వరకు పర్యావరణం మీద యురేనియం మైనింగ్ ప్రభావం, నోట్ల రద్దు, నగదు రహిత సమాజం వెనుక అసలు రహస్యాలు, అమెరికాలో నల్ల జాతీయులపై జాతి వివక్ష ఇలా ఓ పిడికెడు పెద్ద వ్యాసాలు, రెండు పుస్తక సమీక్షలు మొత్తం మీద ఏడెనిమిది వ్యాసాలు వివిధ సామాజిక రాజకీయ మాసపత్రికలలో ప్రచురిచితమైనాయి. కొన్ని కవితలు కూడా ప్రచురితమైనాయి. ప్రస్తుతం ‘పిల్లప్పటి’ పల్లె అనుభవాలను రాయలసీమ యాసలో రాసే ‘కతల సేద్యం’ చేసే పనిలో ఉన్నాడు.

2 thoughts on “మట్టి పాటలు

  1. ఆర్ద్రత గా కొనసాగి బాధ్యత గా ముగిసింది

Leave a Reply