భౌ… భౌ…

ఈ దేశం ఒక రహస్యాంగం
సామూహిక ఆరాధన నిత్యకృత్యం
ప్రజలు సుఖరోగంతో తన్మయులై వున్నారు
*
కూలదోసిన పాఠశాల గోడలపై అంటించిన
సంస్కృతంలో లిఖించిన దేశ పటాన్ని
ఆవుగారు తీరిగ్గా నెమరేసుకుంటున్నారు
*
కొత్తగా కట్టిన గోడ వెనుక
గజగజలాడే పేదరికాన్ని గజాల్లెక్కన
విదేశీ షరాబులు ఖరీదు చేస్తున్నారు
*
శృంగార చిత్రానికి ముందేసిన
జాతి గీతం అందరినీ నిలబెట్టిందన్న
స్వయంతృప్తి కొందర్నింకా మైమరపిస్తూనే వుంది
*
హలీమ్ సుహృద్భావపు లొట్టల్లో
మేకపోతు గాంభీర్యం ఒలకబోసిన నెలవంకకు
బట్టీల్లో అలాయ్ బలాయ్ వంకలుతీస్తున్నారు
*
గాయాల గొంతు విప్పిన వాగ్గేయులను
శిలువ మీంచి దించకుండానే
రాజ్యాంగం వాయిదాల సుత్తి కొడుతోంది
*
సేద్యం చేసి స్పూన్లు మొలకెత్తించలేని
రైతులు, ఆరుగాలాలు పంట చేలలో
నాగలి కర్రుకు నాన్-వెజ్ రుచి చూపిస్తున్నారు.
*
పేదరాశి పెద్దమ్మ చెప్పిన
దారి బట్టిన బ్యాంకులోళ్లు
విదేశీ మత్స్య రాజాల కోసం
తూర్పు తిరిగి దండమెట్టేసారు
*
కండబలంతో జెండాను రెపరెపలాడించినవారు
శివధనుర్భంగ సన్నివేశంలో కన్నీళ్లు ఒత్తుకుంటుంటే
మురిసిపోయిన ఫునిస్త్రీలంతా మంగళసూత్రాలను కళ్లకద్దుకుంటూ
నగర సంకీర్తనలో శీలాన్ని వేలం వేస్తున్నారు
*
పుటం పెట్టని పటం ముక్కల్ని
గర్భకుహరంలో గాజు పెంకుల్లా దించిన వాళ్లు
నడిబొడ్డున అతిమూత్ర వ్యాధితో బాధపడుతుంటే
ఈశాన్యం నగ్నంగా హోలీ ఆడుతోంది
*
గాలివానల నుంచి తట్టుకునేందుకు
కొత్త కోట నిర్మించుకున్న రాబందు
ప్రవచించిన సనాతన ధర్మానికి
శాంతి కాముకులు మురిసి ముక్కలవుతూనే వున్నారు
*
జాతీయ జంతువుగా ప్రకటించనందుకు
విశ్వాసం నిశ్వాసమైన కుక్కులను వెంటేసుకుని
హరి నివాసంలో పిడికిలి బిగించిన పౌరులు
భౌ.. భౌమని మొరుగుతూనే వున్నారు.

పుట్టింది పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం. సొంతూరు తూర్పు గోదావరి జిల్లా కపిలేశ్వరపురం. కవి, జర్నలిస్టు. గీతా విద్యాలయం(శ్రీకాకుళం)లో మొదలు పెట్టి ఎస్ఎమ్‌యుపి స్కూల్లో ప్రాథమిక విద్య. ఏడు రోడ్ల జంక్షన్‌లోని ఎం.హెచ్.స్కూల్లో ఉన్నత విద్య. ఆముదాల వలస, మందసల్లో ఇంటర్ తొలి, మలి సంవత్సరాలు. బారువాలో బి.కాం. డిగ్రీ చదివారు. ఉద్యోగ విరమణ అనంతరం తల్లిదండ్రులు స్థిరపడిన విశాఖలో ఉద్యోగ ప్రయత్నాలు ఫలించకపోవడంతో, పొట్ట చేతబట్టుకుని 1995లో హైదరాబాద్ చేరిక. జర్నలిస్ట్‌ గా ప్రింట్, ఎలక్ట్రానిక్, వెబ్, డిజిటల్ మీడియాల్లో పని. రచనలు: ‘ఒకేఒక్క సామూహిక స్వప్నావిష్కరణ’(2000), ‘దుర్గా పురం రోడ్’(2019) కవితా సంకలనాలు వెలువడ్డాయి. ‘దుర్గాపురం రోడ్’ కవితా సంపుటికి ఉమ్మడిశెట్టి సత్యాదేవి సాహితీ అవార్డు, పాతూరి మాణిక్యమ్మ జాతీయ స్థాయి స్మారక సాహిత్య స్ఫూర్తి పురస్కారం ప్రకటించారు. తరచుగా కవిత్వం, అరుదుగా కథలు, అలవోకగా పుస్తక పరిచయాలు, అప్పుడప్పుడు ఇంటర్వ్యూలు, అనువాదాలు, వ్యాసాలు రాస్తుంటారు.

One thought on “భౌ… భౌ…

Leave a Reply