భావాలను బంధీ చేసే లక్ష్యంతోనే ప్రజాసంఘాలపై ఎన్ ఐ ఏ దాడులు

భారతదేశంలో ఫాసిజం ఇక ఏ మాత్రం ఒక భావనో, ఊహనో కాదు. అది ఇప్పుడు బరితెగించి తనతో ఏకీభవించని అన్ని భావాలను బంధీ చేసే ఆచరణలోకి దిగింది. ఆ పనే తన ప్రధమ లక్ష్యంగా కొనసాగించడానికి అన్ని రాజ్యాంగ, రాజ్యాంగ వ్యతిరేక వ్యవస్థలను తన చేతి పనిముట్లుగా వాడుకుంటుంది. అటువంటి వ్యవస్థల్లో రాజ్యాంగ స్ఫూర్తికి తూట్లు పొడిచే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ ఐ ఏ) ప్రధానమైనది. ఇప్పుడు దానిని ఉసిగొల్పి తెలుగు రాష్ట్రాలలో ప్రజా సంఘాల సభ్యుల, నాయకుల ఇండ్ల మీద దాడి చేసి సోదాలు, అరెస్టులు చేస్తూ పౌరసమాజంలో భయాందోళనలు కలిగిస్తుంది.  

ఫాసిజం ప్రధమ లక్ష్యం ప్రజల్లో భయం కలిగించడం. ప్రజా భయమే దాని ప్రాణవాయువు. దాని కోసమే ప్రజల తరుపున నిలబడి ప్రశ్నించే, పౌరహక్కుల గొంతుక వినిపించే కవులు, రచయితలు, కళాకారులు, న్యాయవాదులు, ఇతర బుద్ధిజీవులను ముందుగా తన లక్ష్యం చేసుకుంటుంది. ఫాసిస్టు వ్యతిరేక పోరాటాలలో ముందు వరుసలో ఉండే అన్ని పౌర, ప్రజాస్వామిక శక్తులను బెదిరింప చూస్తుంది. వాళ్ళలో కొందరినైనా మౌనం లోకి నెట్టివేయాలని అనుకుంటుంది. లేదా తన వైపుకు తిప్పుకోవాలనుకుంటుంది. ఇవన్నీ అంతిమంగా మొత్తం ప్రజల మీద ఫాసిజం చేయబోయే దాడికి ముందస్తు చర్యలు. చరిత్ర పొడుగునా ఫాసిజం అనుసరించిన క్లాసికల్ ఫార్ములానే ఇప్పుడు హిందుత్వ ఫాసిస్టు శక్తులు వాడుతున్నారు.  

ఇండ్లపై దాడి చేసి ఎన్ ఐ ఏ ఎత్తుకు పోతున్నది బాంబులు, బడిశలు, తుపాకులు కాదు. అవి వాళ్ళు దాడి చేస్తున్న ఏ ప్రజా కార్యకర్త దగ్గరా ఉండవని వాళ్ళకు తెలుసు. ఉండేదల్లా పుస్తకాలు, కంప్యూటర్లు, ఫోన్లు. అంటే వాళ్ళ దగ్గర ఉండేవి భావాలు, ఆ భావాల ఉత్పత్తికి పనికొచ్చే ప్రజా సాహిత్యం, వాటిని ప్రచారం చేయడానికి పనికొచ్చే సాధనాలు (పత్రికలు, కరపత్రాలు, వీడియోలు). ఎవ్వరైనా ఏ భావాలనైనా కలిగి ఉండవచ్చు అని రాజ్యాంగం చెబుతుంది. గాంధీ జీవిత చరిత్రను చదివినంత మాత్రానా గాంధియన్ కాలేరు, విప్లవ సాహిత్యం చదివింత మాత్రాన లేదా తమ బుక్ షెల్ఫ్ లో పెట్టుకున్నంత మాత్రాన మావోయిస్టు సభ్యులు కాలేరని రాజ్యాంగాన్ని అన్వయించి చెప్పే కోర్టులు దేశంలో వివిధ తీర్పులలో ఇప్పటికే చెప్పివున్నాయి. కాని రాజ్యాంగానికి కాని, కోర్టులకు కాని ఎలాంటి విలువనిచ్చే స్థితిలో ఫాసిస్టు పాలకులు లేరు.  విలువ ఇవ్వకపోవడం మాత్రమే కాదు వాటిని విధ్వంసం చేసే పనిలో ఉన్నారు.  

ఇప్పుడు మన దగ్గరకు రాలేదు కదా అని నోరు విప్పక పోతే అది చారిత్రక తప్పిదమే అవుతుంది. హిందుత్వ ఫాసిజం వేస్తున్న అడుగులను జాగ్రత్తగా పరిశీలిస్తే అది అన్ని రకాల ప్రజా గొంతుకలను తొక్కుకుంటూ తన అంతిమ లక్ష్య సాధనైన హిందూ రాష్ట్ర నిర్మాణం కోసం ముందుకు పోవాలని ప్రయత్నిస్తుంది. అందు కోసం అనేక అణిచివేత ప్రయోగాలను చేస్తుంది. తన నడకకు అడ్డుపడే అన్ని ప్రజాస్వామిక, విప్లవ శక్తులను టార్గెట్ చేస్తుంది. దాని కోసం అవసరమైన సామాజిక, రాజకీయ, సాంస్కృతిక భూమికను సిద్ధం చేసుకుంటుంది. కాశ్మీర్ ను కాన్‌సెంట్రేషన్ క్యాంప్ చేసింది, సీ ఏ ఏ పేరిట రాజ్యాంగ హక్కులను కొల్లగొట్టింది. వనరుల దోపిడీ కోసం ఆదివాసులపై ఉక్కుపాదం మోపుతుంది. దళితుల, మహిళల, మత మైనార్టీల హక్కులను కాలరాస్తుంది. రాజ్యాంగ పరిధిలో హక్కులడిగే రైతులను సహితం “దేశ ద్రోహులను” చేస్తుంది. తన ఉన్మాద చర్యలను ప్రశ్నించే అన్ని సమూహాలను నేరమయం చేస్తుంది. 

ఫాసిజం చేతిలో “జాతి వ్యతిరేకి”, “దేశ ద్రోహి” అనే ముద్రలు ఆయుధాలుగా మారాయి. వాటికి చట్టబద్దత తీసుకురావడానికి “ఊపా” (Unlawful Activities Prevention Act) చట్టాలను, ఎన్ ఐ ఏ వంటి సంస్థలను వాడు కుంటుంది. ఇప్పుడు ఊపా చట్టమంటేనే రాజ్యం ప్రజల మీద చేస్తున్న కుట్రగా భావించే పరిస్థితి వచ్చింది. దానికి ప్రజలలో ఎటువంటి సాధికారత లేకుండా పోయింది. 

ఎక్కడో ఒక విశాఖపట్నం దగ్గర మారుమూల ప్రాంతంలో “పట్టుబడిన” ఒక పాత్రికేయుడు తనకు తానుగా మావోయిస్టులకు సహకరించే వ్యక్తిగా ఒప్పుకుని, తనతో పాటుగా వాళ్ళకు సహకరించే 84 మంది ప్రజాసంఘాల వారి పేర్లు గుక్కతిప్పుకోకుండా ఘంటాపధంగా చెబితే ఇప్పుడు ఎన్ ఐ ఏ వాళ్ళ ఇండ్ల మీద దాడి చేసి విచారిస్తున్నామని, అరెస్టులు చేసున్నమని చెబుతుంది. ఆ 84 మందిలో అన్ని రకాల సంఘాలు, సరైన జెండర్ బాలన్స్ వచ్చేలా చూసుకొని ఆ సదరు పాత్రికేయుడు, తర్వాత అరెస్ట్ కాబడిన వాళ్ళు చెప్పారనడం కనీస ఇంగిత జ్ఞానం వున్న వాళ్లెవరూ నమ్మగలిగే విషయం కాదు. రెండు నెలల కిందట ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ అదే చెప్పింది.

గుంటూరు జిల్లాలో మరో కట్టుకథ కేసులో చేర్చిన వారిని కూడా కలుపుకుంటే ఇప్పుడు 92 మంది ప్రజా సంఘాల కార్యకర్తల వెంట ఎన్ ఐ ఏ అనే మంద పడింది. ఇక ఇప్పుడు కేసుల నడిపేది ఎన్ ఐ ఏ కోర్టు కదా అక్కడ న్యాయాన్ని తలక్రిందులుగా చూస్తారు. కాబట్టి జరగబోయే పరిణామాలు, రాబోయే తీర్పులు ప్రజల ఊహకు అందనివి కాదు.

ఇప్పటి వరకు దాడులకు గురయిన, ఇంకా దాడులకు గురికాకుండా వున్న ప్రజాకార్యకర్తలు గత రెండు, మూడు దశాబ్దాలుగా ప్రజా జీవితంలో వుండి అనేక నిర్బంధాలను అనుభవించి వున్నారు. “మేము అన్నింటికి సిద్ధమయ్యే వున్నాం” అని తమ చైతన్యాన్ని, మొక్కవోని ధైర్యం కనబరుస్తున్నారు. కాని ఇప్పుడు వాళ్ళకు అండగా నిలబడటం, రాజ్యానికి అడ్డంగా నిలబడటం మనందరి బాధ్యత. ఎందుకంటే వాళ్ళ హక్కుల గురించి మాట్లాడటం అంటే, రేపటి మన హక్కులను రక్షించుకోవడం. మన కోసమైనా, మన బిడ్డల భవిష్యత్తు కోసమైనా మనం మాట్లాడుదాం.

చరిత్ర పొడుగునా అత్యంత ధైర్యసాహసాలను, త్యాగపూరిత రాజకీయాలను నడిపిన తెలుగు నేల ఫాసిజానికి అణువంత స్థానమిచ్చినా అది దానికి కొండంత అండ. దేశంలోనే గొప్ప చైతన్యవంతమైన పౌర సమాజం వున్న ఇక్కడ మనం ఫాసిజాన్ని నిలువరించకపోతే ఇక దేశంలో దానిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్న శక్తులు కూడా ఢీలా పడుతాయి. వాడు ఉద్యమాల ప్రయోగశాలకు వచ్చిండు. గుణపాఠం నేర్పి పంపుదాం. ప్రజా ఉద్యమకారులకు అండగా నిలబడుదాం. ఎన్ ఐ ఏ దాడులు హిందుత్వ ఫాసిజంలో భాగమని ప్రజలకు విప్పి చెప్పుదాం. మన రాజకీయ, భావ ప్రకటనా స్వేచ్ఛను కాపాడుకుందాం. భావాలను, ఊహలను బంధీ చేయలేరని నినదిద్దాం! 

2 thoughts on “భావాలను బంధీ చేసే లక్ష్యంతోనే ప్రజాసంఘాలపై ఎన్ ఐ ఏ దాడులు

  1. దాడులు సూర్యోదయాన్ని ఆపలేవు

  2. ఎన్‌ఐ‌ఏ దాడులు అందులు భాగంగా కంప్యూటర్ లు పెన్ డ్రైవ్ వగయిరా స్వాధీనం చేసుకోవడంలో రాజ్యాంగం దౌర్జన్యం దాని ఫాసిస్ట్ లక్షణాలు పూర్తిగా కనిపిస్తున్నాయి. వరవర రావు గారిని తదితరులను ఇదే ఎన్‌ఐ‌ఏ కింద అరెస్ట్ చేసి 3 ఏళ్ల పైనే జరిగింది.విచారణ ఎంతవరకూ వచ్చిందో తెలియదు.

    ఈ దాడులను మనం ఒక సమూహం గానే వ్యతిరేకించాలి

Leave a Reply