కన్నీటితో కలలను కడగాలనుకుంటా-
మసకబారిన వర్తమానం వెక్కిరిస్తుంది.
గొంతెండిన వాళ్లు పాపం-
గోమూత్రానికి బదులు గుక్కెడు నీళ్లడుగుతారు.
నెత్తురు బదులు ఒంట్లో బత్తాయిరసం పారే వాళ్లకు
రోషం పొడుచుకొచ్చి కాళ్లతో తంతారు.
ఎండిన గొంతులెన్నటికీ ఊరుకోవు.
అరిచరిచి ఒకటే గీపెడతాయి.
నోట్లోంచి కారిన నెత్తుటిని
రాజ్యం ముఖాన ఉమ్మేస్తాయి.
కలలు స్వచ్ఛందంగానే
కన్నీటిలో స్నానమాడుతాయి.
మిరుమిట్లు గొలిపే భవితవ్యం
బత్తాయిల్లోని రసాన్నిసమూలంగా పీల్చేస్తుంది.
ఇదంతా ఒక పగటి కల-
మధ్యాహ్నమే బత్తాయిరసం తాగి
బడలికతో నిద్రపోయాను.
పుట్టిందీ, పెరిగిందీ బరంపురంలో. కవి, రచయిత. చదువుకున్నది బీకాం (ఆనర్స్), ఎం.కాం మధ్యలోనే మానేశారు. తర్వాత ఎంఏ తెలుగు. తెలుగులో విరివిగా కవిత్వం రాస్తున్నారు. కాలేజీ రోజుల నుంచే బరంపురం సాహితీ సంస్థలు ఆంధ్ర భాషాభివర్ధనీ సమాజం, ఆంధ్ర సంస్కృతీ సమితి, వికాసం, ఆంధ్ర విజ్ఞాన మిత్రమండలి వంటి వాటితో అనుబంధం. ఆంధ్ర సంస్కృతీ సమితి, వికాసం సంస్థలకు సహ కార్యదర్శిగా పని చేశారు. బరంపురం వార్త పీసీ సెంటర్‌లో పనిచేసే రోజుల్లో `విరసం` స్ఫూర్తితో ప్రారంభించిన `ఒడిశా గొణొముక్తి లేఖొకొ సొమాఖ్యొ`కు, ఏపీసీఎల్‌సీ తరహాలో ప్రారంభించిన `ఒరిస్సా సివిల్ లిబర్టీస్ కమిటీ`కి వ్యవస్థాపక కోశాధికారిగా పనిచేశారు. ప్రస్తుతం `సాక్షి`లో ఆదివారం అనుబంధం `ఫన్‌డే` ఇన్‌చార్జిగా కొనసాగుతున్నారు.
Excellent