బోయి భీమన్న కవిత్వం – వస్తు వైవిధ్యం

బోయి భీమన్న ప్రధానంగా కవి. అందులోనూ పద్యకవి. ఆయన నాటకాలు రాసాడు, గేయ కవిత్వం వ్రాసాడు. వచన కవిత్వం వ్రాసాడు. అయితే ‘ప్రక్రియలన్నింటిలోనూ తనకు పద్యమంటేనే ఎక్కువ ప్రీతి’ అని చెప్పుకొన్నాడు. ఆయన దృష్టిలో పద్యం ఒక సుందర శిల్పం. ప్రాచీనకాలం నుంచీ వస్తున్నకళ. పద్యకళ క్షీణించి పోతున్నది అన్న బాధ కూడా భీమన్నకు ఉంది.(అంబేడ్కర్ సుప్రభాతం, ముందుమాట 1984) ఆయన సాహిత్య సృజన ప్రారంభ మైంది పద్యంతోనే. ఆందుకనే ఆధునిక వస్తు ప్రధానమైన నాటకాలలోనూ పద్యానికి అంత ప్రాధాన్యత ఇచ్చాడు. ఆ తరువాత భీమన్న గేయాన్ని బాగా ఇష్టపడ్డాడు. పైరుపాట, మానవుని మరొక మజిలీ వంటి గేయ నాటికలు వ్రాయటమే కాదు, బొమ్మ, ఆకాండ తాండవం వంటి గేయకావ్యాలు వ్రాసాడు. ఇక వచన కవిత్వం సరేసరి. ‘గుడిసెలు కాలిపోతున్నాయి’ అందుకు ప్రతినిధి రచన. 1975లో కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డును అందుకొన్న ఖండకావ్య సంపుటి ఇది.

భీమన్న కవిగా కళ్ళు తెరిచింది 1922లో తన పదకొండవ ఏట (భీమన్నఉగాదులు, ముందుమాట 1983). అప్పటినుండి 2005లో మరణించేవరకు ఆయన కవిత్వ సృజన వ్యాసంగం ఎనభై సంవత్సరాల సుదీర్ఘకాలం మీద కొనసాగింది. కావ్యాల పంట బండ్లకెత్తింది. ఇంత విస్తృతి గల భీమన్న కవిత్వాన్ని కాలక్రమ వరుసలోనో, ప్రక్రియను బట్టి పద్యకావ్యాలు, గేయకావ్యాలు, వచన కావ్యాలు అని విభాగించో కాక వస్తు దృక్పథాలను బట్టి వర్గీకరించి పరిశీలించటమే సమంజసం. ఆవిధంగా చూసినప్పుడు భీమన్న కవిత్వాన్నిస్థూలంగా 1) పౌరాణికం 2) ప్రేమ 3) జాతీయో ద్యమం 4)జన జీవితం 5) దళిత చేతనం అని వర్గీకరించవచ్చు.

పౌరాణికం:
పౌరాణిక ఇతివృత్తాలతో నాటకాలు వ్రాసినట్లుగానే కావ్యాలు కూడా వ్రాసాడు భీమన్న. అశోక వనిలో రాముడు( 1969) మణిమానసం(1972) ఆ కోవలోవి. ఈ కావ్యాలకు మూలం భీమన్న భావుక శక్తి.
అశోకవనిలో రాముడు కావ్యాన్ని ఆయన సాంఘిక సంక్షేమ శాఖామంత్రి దాసరి పెరుమాళ్ళు గారికి అంకితం ఇచ్చాడు. రావణవధ అనంతరం ఆ రాత్రి రాముడు ఎవరికీ తెలియకుండా ఒంటరిగా సీతను రావణుడు చెరలో ఉంచిన అశోకవనానికి వెళ్లినట్లు చేసిన కల్పన దగ్గర ఈ కావ్యం ప్రారంభం అవుతుంది. సీతను అప్పటికే చెరవిడిపించి సుగ్రీవుని సైనికస్థావరానికి చేర్చటం జరిగింది. రాముడు అక్కడకు ఎందుకు వెళ్లినట్లు? ‘సీత చెరబడి కుందిన తావు’ ఎటు వంటిదో చూడకుండా పోవటం ఎట్లా అన్న మానుషత్వ లక్షణం వల్ల కావచ్చు. ఆమెకు నిలువనీడనిచ్చిన అశోక వృక్షాన్ని చూసి తీరాలన్న సున్నిత హృదయ సంస్పందన వల్ల కావచ్చు. వెళ్లి ఏమి చేసాడు? సీతను చూసిన చెట్లూ, వస్తు జాలం అతనిని ఆహ్వానించి ఆమెతో , ఆమెకు తోడుగా తాము ఉన్న సంగతి చెప్పాయి. సీతను గురించి చెప్పాయి. ఆ ప్రకృతిలో ఒక్కడే తిరుగుతూ రకరకాల జ్ఞాపకాలతో భావాలతో, బాధలతో సతమతమై కన్నీరు కారుస్తూ ఆత్మగతమైన తాదాత్మ్యం పొందటం ఇందులో విషయం. 122 పద్యాలలో ఆధునిక భావకావ్యం వలే సాగుతుంది ఈ కావ్యం.
భాగవతంలోని శ్యమంతకమణిని మానవ హృదయంగల ప్రేయసిగా ఊహించి వ్రాసిన కావ్యం మణిమానసం. భాగవత కథ ప్రకారం సత్రాజిత్తు వద్ద ఉన్న విలువైన శ్యమంతకమణి సత్యభామతో పాటు కృష్ణుడి సొమ్మయింది. శ్యమంతకమణి వట్టి పదార్ధం అనుకుంటాం కానీ దానికి మనసు ఉన్నదని, సత్యవలెనే అది కూడా కృష్ణుడి పట్ల మనసు పడ్డదని తన ప్రేమను ఆయన గుర్తించలేదని మూగవేదన పడిందని ఈ కావ్యకథను నడిపాడు భీమన్న. ఇందులో పద్యాలు 123.

ప్రేమ:
ప్రేమ భీమన్నకు చాలా ఇష్టమైన వస్తువు. ప్రేమ ప్రకృతి ప్రేమ, స్త్రీపురుష ప్రేమ రెండూ. స్త్రీపురుష ఆకర్షణ ,అనురాగం ఆయనకు నిరంతర చింతనా విషయం. ఆ ప్రాతిపదిక మీదనే రసాద్వైతం అనే సొంత ఆధ్యాత్మిక సిద్ధాంతం కూడా చేసాడు. అదే ఆనంద మార్గం అని చెప్పాడు. ప్రేమ వివాహానికి దారి తీయవచ్చు, లేక వివాహమే ప్రేమకు దోహదకారి కావచ్చు, సాంఘిక వైరస్యాల వల్ల భౌతికమైనఏ సంబంధానికి వీలులేకపోవచ్చు అయినా ఆత్మానుబంధం మాత్రం తెగిపోకూడదు అన్నది ఆయన కామన. రాసాద్వైతం వలెనే ఆయన తను వ్రాసే ప్రేమగీతాలకు ‘రాభీలు’ అని పేరుపెట్టుకొనటం కూడా గమనించవచ్చు. ప్రకృతిలో రెండు ప్రవృత్తులు ఉన్నాయని, అందులో ఒకటి స్త్రీ సహజమైన రామము (సౌందర్యం ). రెండవది పురుష సహజమైన భీమము (భయానకం)ఈ రెండు శక్తుల సంసార విన్యాసమే పూర్ణప్రకృతి వాటి సంయోగ వియోగాలే సుఖ దుఃఖాలు అని వివరణ కూడా ఇచ్చాడు(రాభీలు ,ముందుమాట 1971). రాగోదయం(1954) తో మొదలుపెట్టి ఆ మార్గంలో మధుగీత(1957),రాగవైశాఖి (1965), రాభీలు (1971),బొమ్మ(1974) మొదలై కావ్యాలు వెలువరించాడు.

రాగోదయం గేయకావ్యం: 1954లో మొదటిసారి దేశి కవితా మండలి ప్రచురణగా వచ్చింది. అప్పుడపుడు వివిధ శీర్షికలతో వ్రాస్తూ వచ్చిన 39 ఖండికల సంపుటి ఇది. ప్రభకు అంకితమీ కావ్యం. స్వయంప్రభ అనే శీర్షికతో వ్రాసిన ఖండిక ఆమె గురించే అయిఉండాలి. ఇందులో ఖండికలన్నీ భావగీతాలు, ప్రేమమగీతాలు. విప్రలంభ శృంగారం – అంటే నాయిక ఎడబాటులో నాయకుని విరహవేదనా గీతాలివి. ప్రత్యూషం అనే శీర్షికతో ముందుమాట వ్రాసిన తిరుమల రామచంద్ర దీనిని ‘ఛాయావాద రహస్యవాదాల సువాసనలు గుబాళించే కావ్యఖండికల కదంబం’ అన్నాడు.’ఏ కవైనా జీవ సహజమైన శృంగార రసరాజాన్ని ఆరాధించటం అసహజమేమీ కాద’ని కూడా అంటాడు.

మధుగీత: 1957 లో తొలి ప్రచురణ. సాహితీ పరులు, చిత్రకారులు, ఉదార హృదయులు అయిన శేషు బాలకృష్ణ దంపతులకు అంకితమిచ్చాడు. ప్రకృతి ప్రేమ, స్త్రీ పురుష ప్రేమ, మానవ ప్రేమ ఈ మూడూ కేంద్రంగా వచ్చిన కవిత్వం ఇది. బ్రతుకు అంటే రాజకీయాలు కాదు, ప్రేమ అని భీమన్న భావన. ప్రియుడు ప్రియురాలిని ఉద్దేశించి వ్యక్తంచేసిన భావోద్వేగాల తీవ్రత ఈ కవిత్వంలో ప్రధానం. “ హృదయములు రెండు, మనసులు రెండు, రెండు / కాయములు కూడ అద్దాల కరణి నొకట / నొకటి స్వచ్ఛమై ప్రతిఫలించుకొనవలయు /ఒకటి నొకటి విభిన్నత నొందరాదు” అని అద్వైతాన్ని ప్రతిపాదిస్తాడు. “స్వేచ్ఛ జీవ స్వభావము, స్వేచ్ఛ కొరకు / పెనుగులాడును జీవి దానణచ బడిన” అని స్వేఛ్చను ఒక విలువగా పేర్కొంటాడు. భావుకత్వపు అంచులు తాకిన ఒరవడిలో నిన్న నేడూ లేదు పొమ్మంటాడు భీమన్న. నేడు ఏది సుఖదాయకమో దానిని చేయటమే విధాయకం అంటాడు. రాగోదయం లోనూ “నిన్నతో పని లేదు / నేడు ప్రశ్నే కాదు” అని ఈ భావాన్నే ప్రతిపాదించటం గమనించవచ్చు.

రాగవైశాఖి 1965లో అచ్చయినా రచన 1960 లోనే ప్రారంభమైంది. ఒక అమ్మాయి ఒక అబ్భాయి ఏదో సందర్భంలో కలుసుకున్నారు. ఒకళ్లపట్ల ఒకళ్లకు ఇష్టం ఏర్పడింది. తరచు కలుసుకొనడం, ఇష్టం ప్రణయం గా మారి లేఖలు వ్రాసుకొనటం ఇందులో విషయం. రసభావైక లేఖలు ఇవి. శృంగార లేఖా కావ్యం అని ఈ కావ్యానికి ఉప శీర్షిక. పద్యాలు , గేయాలు అక్కడక్కడ వూన్నా ప్రధానంగా ఇది వచన కావ్యం. పది అధ్యయాలు ఉన్నాయి.
ప్రేయసీ ప్రియులు ఆలంబనగా వ్రాసిన 310 గేయాల సంపుటి రాభీలు. ప్రేయసీ ప్రియులలో ఎవరో ఒకరు మరొకరిని ఉద్దేశించి అంటున్నట్లుగా వుండే ఈ గేయాల సంపుటిని 1971 లోభీమన్న షష్ఠి పూర్తి సందర్భంగా సన్మాన సంఘం వారు ప్రచురించారు.

బొమ్మ గేయకావ్య రచనాకాలం 1952. 1962 నుండి అచ్చువేయటానికి జరిగిన ప్రయత్నాలు 1975 నాటికిగానీ సాకారం కాలేదు.అయినా రచనాకాలం నుండే ఇవి వివిధ సభలలో భీమన్న గానం తో సాహిత్య సమాజానికి సుపరిచితాలే.( బొమ్మ , ముందుమాట, బోయిభీమన్న సమగ్ర సాహిత్యం, గేయకావ్యాలు, 2 వ భాగం,2009) కలిసి మెలిసి తిరిగిన స్త్రీపురుషులు ఒకరిపట్ల ఒకరికి కలిగిన ప్రేమను చెప్పుకోలేరు. అతను ఆమె ఫోటోను సంపాదించి దానితో ప్రేమమా సంభాషణ సాగించే క్రమంలో సౌందర్యారాధకుడిగా ప్రారంభమై కవిగా మారి వేదాంతిగా పరిణితి చెందటం ఇందులో కథ.

జాతీయోద్యమం :
భీమన్న హృదయం ప్రేమ చుట్టూ పరిభ్రమిస్తే బుద్ధి జాతీయోద్యమం వైపు ప్రసరించింది. ఆయనకు ప్రకృతి,ప్రేయసి ఎంత ప్రేమ పాత్రమైనవో దేశంఅంత కన్నా ఎక్కువ ప్రేమ పాత్రమైనది. వ్యక్తి స్వేఛ్చను ఎంత ఆకాంక్షిస్తాడో సమిష్టి స్వాతంత్య్రం కోసం అంత పరితపించాడు. ప్రకృతిలోనూ సాధారణ మానవప్రవృత్తిని అన్వేషిస్తాడు. ఆవిష్కరించి ఆనందిస్తాడు. అందువల్లనే ఆయన కావ్యాలు జాతీయోద్యమం నుండి జాతి జీవనం వరకు అనేకవిషయాలను పరామర్శిస్తాయి.

మధుబాల కావ్యం చూద్దాం. 1952 లో ప్రచురించబడిన ఈ కావ్యం రచనా కాలం 1933. శృంగార కావ్యం గా మొదలై వీరరస కావ్యం గా ముగుస్తుంది. ఉప్పుసత్యాగ్రహ కాలం నేపధ్యంగా కథ ప్రవర్తిస్తుంది. వేకువనే లేచివెళ్లిన మిత్రుడు సూర్యాస్తమయం అయినా రాలేదని అతనిని వెతుకుతూ అడవిలో చెట్లూ చేమల సంబోధిస్తూ తిరిగే ఒక వనకన్య చివరకు అతనిని ఒక మల్లికకల తీగలు అల్లుకున్న మంటపంలో చూడటం, మౌనంగావున్న ఆతనితో ఆమె తన వియోగ వ్యధను వినిపించటం, తాను వెళ్ళవలసిన సమయం వచ్చింది పోనిమ్మని, తనను మరిచిపొమ్మని అతను చెప్పుటం, నేను ఆగిపోలేను, నిన్ను తీసుకుపోలేను అని అతడు నిస్సహాయతను ప్రకటించటం 185 పద్యాల వరకు ఇది విషయం. ప్రకృతి సౌందర్య సంబంధాలు, స్త్రీపురుష హృదయోద్వేగాలు విస్తృతంగా వర్ణించబడ్డాయి.

ఆ తరువాతి కథనం నాయకుడి చరిత్ర. బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి ఎదురొడ్డి తండ్రి మరణించాడు. ఆ వార్త విని తల్లి మరణించింది. ఆమె మీద బెంగతో చెల్లెలు తమ్ముడు కూడా నశించిపోయారు. అతను సేవాగ్రామంలో ఉన్న మహాత్ముని ఆదరాణాభిమానాలు పొంది సత్యాగ్రహ ఉద్యమంలో పాల్గొన్నాడు. నాయకులందరూ జైళ్లపాలయి సత్యాగ్రహం అపజయం పాలయిందని అందరూ బాధపడుతుంటే హింసను హింస తోనే ఎదుర్కొనాలని విప్లవమార్గం పట్టి , ప్రభుత్వానికి పట్టుబడి చెరసాల పాలై అక్కడినుండి తప్పించుకొని అడవులలో తిరుగుతూ వన కన్యను చూసి స్నేహం చేశానని, ఇక తాను ఆ తావు వదిలి వెళ్లకపోతే ఆమెకు కూడా ఆపాయమే అని చెప్పి సెలవు తీసుకొనే ప్రయత్నం చేసాడు. అతని ఆదర్శాన్ని ఆమె ప్రస్తుతించటం ఇలా సాగి సాగి కథ ఆమె “ ఎందుకోయీ సఖా ! ఈ గూఢ జీవి/ తము? మాతృదేవీ పాదార్చనమునకు / కల్పింపు మొక మంచి కార్యక్రమమ్ము / ఇరువురమును నిర్వహింతము దాని” అనటంతో ఒక ఘట్టానికి చేరుతుంది.

ఆ తరువాత ఇద్దరూ కలిసి సమీపంలోని కోయగూడానికి పోవటం, అక్కడ మహాత్ముని తేజస్సు మూర్తి గొన్న ఒక యోగి ఎదురుపడి వాళ్ళను ఒక గుహలోకి తీసుకొనివెళ్ళి పరపీడన, పారతంత్య్రం, దారిద్య్రం లోకంలోని సమస్యలని చెప్పి దానికి మందు సర్వోదయ సమాజ స్థాపనం అని చెప్పి మహాత్ముడు కన్న ఆ కలను సార్ధకం చేయమని వాళ్లకు ప్రబోధించాడు. పల్లె పల్లెకు బోయి ప్రజలకు స్వాతంత్ర్య దీక్ష ఇయ్యటానికి వాళ్ళు బద్ధకంకణులు కావటంతో ఈ కావ్యం ముగుస్తుంది. “ ఎవ్వరొ సంగుదురెవ్వరు కొందు/ రే బాల? స్వాతంత్ర్యమెవ్వరి సొమ్ము?/తనుదాన గుర్తించుకొనుట స్వాతంత్య్ర/ మాత్మ విశ్వాసమే అభ్యుదయమ్ము” అన్న తాత్విక సందేశం ఇస్తుంది ఈ కావ్యం. ప్రేమకథా చట్రంలో జాతీయోద్యమ ఘట్టాల చిత్రణ ఇందులో విశేషం.


ప్రకృతిలో మానవ ప్రకృతి కావ్యంలో దానితో పాటు ప్రణయపారమ్యం, ఆగస్టు విప్లవము అనే మరో రెండు దీర్ఘ కావ్యఖండికలు ఉన్నాయి. 1963 లో ప్రచురించబడిన ఈ ఖండకావ్య సంపుటిని భీమన్న నిడదవోలు వెంకటరావు కు అంకితం ఇచ్చాడు. రెండవ ప్రపంచ యుద్ధకాలంలో ఆకాశాన తిరిగే విమానం సముద్రంలోని నౌకపై బాంబు వేయటం, సబ్మెరైన్ విడిచిన శతఘ్నికి విమానం సముద్రంలో కూలటం దగ్గర ప్రణయ పారమ్యం లో కథ మొదలవుతుంది. మునిగిన విమానపు రెక్క మీద గాయపడిన వైమానికుడిని చూసిన జలాంతర్గామి నావికుడు చికిత్స చేస్తాననటం అతను నిరాకరించటం, ఈ లోగా నౌక మీద మరొక బాంబు పడటం, నౌక చిల్లుపడి మునిగి పోతుండగా నావికుడు వైమానికుడిని కాపాడటానికి ప్రయత్నించటం ఈ క్రమంలో వారిద్దరి మధ్య జరిగిన సంభాషణే ఈ కావ్యా కథా విషయం. ఇద్దరూ ప్రేమలో భంగపడి సైన్యంలో చేరిన వాళ్ళే.

వాళ్లలో ఒక యువకుడు ఆగస్టు విప్లవం – క్విట్ ఇండియా ఉద్యమం- తరువాత కాంగ్రెస్ వాళ్ళందరూ జైలుపాలు కాగా ‘సైన్యమ్ముతో దాని సాధింప బూని జపాను వారితో చేరిన నేతాజీ’ ఫౌజులో చేరి ఆంధ్రసముద్రం లో అగుపించే ప్రతిపక్ష నౌకలను ముంచే పని మీద నావికాదళంలో పనిచేస్తున్నవాడు. ‘ప్రణయ హృత్పద్మమ్ము గనిపెట్టలేక / పద్మమందలి హంస బట్టుకోలేక / మానసమ్ము కలంచి మాయమై పోయిన స్నేహితుడి వియోగాన్ని భరించలేక ఆత్మహత్య చేసుకొందామనుకొని దేశం కోసం యుద్ధంలో చావటం ఉత్తమ మార్గం కదా అని ఆ పని మానుకొని మిలటరీ శిక్షణాలయంలో చేరి పైలెట్ వృత్తిలో ప్రావీణ్యం పొందినవాడు మరొక యువకుడు. నావికుడిని తనను తాను కాపాడుకొనమని కోరుతూ వాలిపోతున్న వైమానికుడిని ఒడిలోకి తీసుకొని దుస్తులు వదులుచేసేసరికి మగవేషంలో ఉన్న స్త్రీ అని, తన పూర్వ ప్రేయసి అని అతనికి అర్ధం అవుతుంది. ఇద్దరూ మరణించటం కావ్యం ముగింపు.


గాఢమైన ఆకర్షణ, ప్రేమను వ్యక్తంచేయలేని మొహమాటం, తదితర అనేక అవాంతరాల మధ్య విడిపోయిన యువతీయువకులు శత్రువులుగా కలుసుకొనడం, స్నేహితులుగా సంభాషించు కొనటం, ఒకరి ఒడిలో ఒకరు మరణించటం అసలు కథాసూత్రం. ఈ సూత్రాన్ని రెండవ ప్రపంచయుద్ధ సందర్భంలో స్వాతంత్ర్య సముపార్జనకు ఎన్నుకొనబడిన రెండు మార్గాలతో కలిపి చెప్పటం విశేషం.ఒకటి కాంగ్రెస్ మార్గం. రెండవది నేతాజీ మార్గం.


భారతదేశానికి స్వాతంత్య్రం ఇచ్చే షరతు మీద రెండవప్రపంచయుద్ధంలో బ్రిటన్ కు మద్దతు ఇయ్యవచ్చని కాంగ్రెస్ తొలుత భావించింది. కానీ అందుకు అవకాశాలు కలిసి రాక యుద్ధానికి మద్దతును ఇయ్యము అని ప్రకటించింది. యుద్ధవ్యతిరేక ప్రచార కార్యక్రమం కూడా తీసుకున్నది. అయితే అది వ్యక్తి సత్యాగ్రహ రూపంలో అతి బలహీన కార్యక్రమంగా మారిందని విమర్శ వుంది. అయినా ఆ సమయంలో భారతదేశ యువత సైన్యంలోకి విస్తృతంగానే చేరింది. యువతి ఆ రకంగా చేరిన వాళ్లకు ప్రతినిధి అనుకోవచ్చు.

సుభాష్ చంద్రబోస్ రెండవ ప్రపంచయుద్ధంలో రెండు పక్షాలు సామ్రాజ్యవాద స్వభావంతోనే యుద్ధం చేస్తున్నాయి కనుక బ్రిటన్ తో కలిసి యుద్ధంలో పాల్గొనటం కాక బ్రిటన్ పై యుద్ధప్రకటనకు ఈ సందర్భాన్ని వాడుకోవాలని భావించాడు. జర్మనీ, జపాన్ లతో చేతులు కలిపి బ్రిటిష్ ఇండియా పై దాడిచేయడం బ్రిటిష్ సైన్యంలోని భారతీయ సైనికులను కూడా ఆకర్షించి తనవైపు తిప్పుకొని అంతర్గత యుద్ధాన్ని ముమ్మరంచేయటం అతని లక్ష్యాలు. అందుకోసమే అతను భారత జాతీయ సైన్యాన్ని ఏర్పరచి నడిపించాడు. ఆ సైనికులకు ప్రతినిధి యువకుడు. ఆంగ్ల ప్రభుత్వాన్ని కొలుస్తూ వాళ్లకు విజయాన్ని సాధించి పెడితే ఫలితమేమున్నదని అతను ప్రశ్నించగలిగింది అందువల్లనే. బ్రిటిష్ వాళ్ళను భారత దేశం నుండి వెళ్ళగొట్టాలి, దేశాన్ని గాంధీకి సమర్పించాలి అన్న ఆకాంక్ష అతని ముఖంగా వ్యక్తమైంది. మధుబాల వలెనె ఇందులో కూడా జాతీ యోద్యమ చారిత్రక ఘట్టాల చిత్రణ ప్రేమ కథా చట్రంలోనే జరిగింది.

ఇందులో మరొక అంశం కరుణ అనే భావం గురించిన చర్చ. ఇతర కావ్యాలలో కూడా అక్కడక్కడా దీని ప్రస్తావన వస్తుంటుంది. వైమానికుడు తనను రక్షించాలని తహతహ చూపిస్తుంటే “ శరణార్థి ననుకొని కరుణింతువేమొ ! కరుణ కన్నవిషమ్ము కలదె లోకమున” అని వారిస్తుంది. కరుణింపబడుట వీరోచితము కాదు , బ్రతుకు బిచ్చము కారాదు అన్నది భీమన్న దృష్టి. కరుణ హృదయార్ధలక్షణం కదా అది విషం ఎట్లా అవుతుంది అన్న తర్కాన్ని యువకుడి ముఖంగా లేవనెత్తుతాడు. దానికి ఆమె జవాబుగా ఉన్న పద్యాలు రెండు గమనించదగినవి.

“ కరుణ ఇచ్చెడువానికగు నమృతమ్ము
అందుకొనెడు వానికది విషమౌను
కరుణకు కేల్చాచు నిరుపేద కెపుడు
నీటిధారలె గాని నిచ్చెనెల్ లేవు”
పర సహాయముతోడ బ్రతికెడి బ్రతుకు
మృతకళేబరపు టూరేగింపె యౌను :
మానమే ధనమైన మానవజాతి
పృధు హస్తమేనాడు క్రిందు కారాదు” ఆత్మాభిమానం కలచోట కరుణకు పాత్రులు కావటం అనేది దుర్భరంగా ఉంటుంది. కరుణ చూపే వాళ్ళ ఔన్నత్యం కరుణ పొందేవాళ్ళ దైన్యం సాపేక్ష సంబంధంలో అసమానతలను సూచిస్తాయి. మనుషులను ఆధిపత్య అధీన స్థానాలలో ఎదురెదురుగా నిలుపుతాయి. భీమన్న అవగాహన అది. ఈ కోణం నుండి సంక్షేమ పథకాల నుండి సహాయ చర్యల వరకు అవి మనుషులను మానవత్వం నుండి ఎంత పరాకరిస్తాయో అర్ధం చేసుకోవచ్చు.

ఆగస్టు విప్లవము ఏదైతే ప్రణయ పారమ్యం లో ప్రస్తావనకు వచ్చిందో అది ఒక్కటే వస్తువుగా వచ్చిన 24 పద్యాల ఖండిక ఆగస్టు విప్లవము. క్విట్ ఇండియా పోరాటానికి గాంధీ ఇచ్చిన పిలుపుకు ప్రతిస్పనందించి ఉద్యమంలోకి రమ్మని ఒక యువతి తన ప్రియుడికి చేసిన ప్రబోధం ఈ కావ్యం. “బాపూజీ పిలు పాలకించి మురళీ వాదమ్మునన్ బోవు గో గోప వ్రాతము వోలె సాగుడిక” అని అందరినీ ఉత్సాహపరచిన యువతి ఆమె. ఆంధ్రకేసరి, బి. ఎస్. మూర్తి, కల్లూరి సుబ్బారావు, సంజీవరెడ్డి, పల్లమరాజు, సాంబమూర్తి గిరి, ఆచార్య రంగా, ముట్నూరి, సర్దారు లచ్చన్న, మద్దూరు, అయ్యదేవర కాళేశ్వరరావు, చంద్రమౌళి, పుసులూర్వర్యుడు, రవీంద్రుడు, గోపాలరెడ్డి, పట్టాభి, కూర్మయ్య, చెరుకువాడ, కోటిరెడ్డి, మాగంటి, దువ్వూరు సుబ్బమ్మ మొదలైన స్త్రీలు, కళావెంకటరావు, మొదలైన జాతీయోద్యమ చరిత్ర నిర్మాతలైన మానవులను, వారి కార్యకలాపాలను, నిబద్ధతను ప్రస్తావిస్తూ ప్రియుడిని ఆగస్టువిప్లవంలోకి ఆహ్వానిస్తుంది ఆమె. తనను వదిలి వెళ్ళటానికి అతను బాధపడ తాడని ఆమెకు తెలుసు. అతనిని వదిలి ఉండటానికి తాను అంతకుమించి బాధపడుతున్నానని అంటుంది. అయితే ఈ బాధాలేవీ ‘దేశ జననీపరతంత్ర బాధకన్నా ఎక్కువవి కావు’ అన్నది ఆమె అభిప్రాయం. ‘తదార్తి తొలగించుటకంటెను ధర్మముండునా’ అన్నది ఆమె ప్రశ్న. ఉండదు అన్న నిశ్చితాభిప్రాయం ఆ ప్రశ్నలోనే ఉంది. స్వాతంత్ర్య సమరంలో ముందు నిలబడే సంసిద్దత లక్షణం అది. ఇందులో యువతిముఖంగా బోయి భీమన్న ప్రస్తావించిన అంతమంది వ్యక్తులు జాతీయోద్యమ చరిత్రలో స్ఫూర్తిదాయకమైన పాత్ర నిర్వహించారనేది నిస్సందేహం. వాళ్ళ అనుభవాలు ఎంతవరకు నమోదు అయ్యాయి అన్నది ప్రశ్న.

స్వాతంత్య్ర సిద్ధికై పరితపిస్తూ ‘రాజకీయ ఖైదీ’, పంజరంలో చిలుక వంటి ఖండికలను ( కావ్యకుసుమాలు) వ్రాసాడు. పంజరంలో చిలుక నెపం. చెప్పదలచుకున్నది పారతంత్య్రమ్ము లో బ్రతుకుట బ్రతుకే కాదని .. “ ఎప్పుడీ పంజరము తెగి త్రుప్పు పడునొ / ఎన్నడా కాశ వీథుల కెగిరి పోదు / నో – మదిచ్చకొలంది నవ్యోత్సవమున!/ ఎన్నినాళ్ళు! ఈ దాస్య మింకెన్నినాళ్ళు ! అన్న వేదనామయ నిరీక్ష అతనిది.

జన జీవితం
దీపసభ (1955), కావ్యకుసుమాలు (1957), ప్రకృతిలో మానవపకృతి (1963), పిల్లీ శతకము (1967) రాభీలు(1971), గుడిసెలు కూలిపోతున్నై(1973), భీమన్న ఉగాదులు (1983), భీమన్నపాటల తోట( 1991), అకాండ తాండవం( 1996)వంటి కావ్యాలలో, కవితా సంపుటాలలో భారతజాతి జన జీవితాన్ని భిన్న కోణాలనుండి వ్యాఖ్యానించిన కవితలు కనబడతాయి. మానవ జాతిలో దళితులుగా, అస్పృశ్యులుగా వేరుచేయబడిన వాళ్ళ గురించిన కవితలను మినహాయించి చూస్తే దేశభక్తి, దైవభక్తి, ప్రకృతి ఆరాధనల నుంచి మొదలుపెట్టి సామాన్య మానవుల జీవితాన్ని ప్రభావితం చేస్తున్నఅనేకానేక సామాజిక అంశాలను ఆ కవితలలో ఆయన స్పృశించాడు. మానవజాతి బలాన్ని, బలహీనతలను కూడా ఎత్తి చూపాడు. స్వాతంత్య్రం తరువాత ఆయనను బాగా వేధించిన భారత పార్లమెంటరీ రాజకీయాల స్వభావం, పాలనా వ్యవస్థలోని లంచ గొండితనం ఈ కవితలలో విమర్శకు గురి అయ్యాయి.

(ఇంకా వుంది)

కేతవరపు కాత్యాయని. తెలుగులో ఎమ్మే పిహెచ్ డి. కాకతీయ విశ్వవిద్యాలయం తెలుగు విభాగంలో పూర్వ ఆచార్యులు. అప్పుడప్పుడు కవిత్వం, కథలు రాస్తున్నా ప్రధానంగా సాహిత్య విమర్శకురాలు. ప్రక్రియలలో వచ్చిన ప్రాచీన ఆధునిక సాహిత్య రచనలపైన, ప్రత్యేకించి స్త్రీల సాహిత్యం పైన  కాత్యాయనీ విద్మహే అన్న కలం పేరుతో ప్రచురించిన సాహిత్య విమర్శ వ్యాసాలు 300 కి పైగా ఉన్నాయి. 25 పుస్తకాలు ప్రచురించారు. 28  పుస్తకాలకు సంపాదకత్వం వహించారు. మార్క్సిజం, స్త్రీవాదం ఆలోచనకు వెలుగునిచ్చి హృదయానికి దగ్గరైన సిద్థాంతాలు. అనేక సామాజిక సంచలనాల ఉద్వేగ వాతావరణంలో సాహిత్య సామాజిక పరిశోధనలకైనా, ఆచరణ కైనా ఎప్పుడూ ప్రజాపక్షపాత నిబద్ధతే నమ్మిన విలువ. 1980లలో స్త్రీ జనాభ్యుదయ అధ్యయన సంస్థ వ్యవస్థాపక సభ్యరాలై  స్త్రీల సమస్యలపై సామాజిక, సాహిత్య రంగాలలో పనిచేసారు. పుస్తకాలు ప్రచురించారు. దానికి కొనసాగింపుగా 2010లో  ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక ఏర్పాటులో చురుకైన పాత్ర పోషించారు. స్త్రీల సాహిత్యచరిత్ర రచన, తెలంగాణ సాహిత్య సమీక్ష తన ఆకాంక్షలు.

Leave a Reply