బొగ్గులు

బొగ్గులు – అల్లం రాజయ్య

సూర్యుడు తూరుపు ఆకాశంమీద రగరగలాడుతున్నాడు…దూరంగా కనిపిస్తున్న ఫెర్టిలైజర్ ఫ్యాక్టరీ గొట్టాల్లోంచి పొగ నీర్సంగా లేస్తోంది. రోడ్డు చచ్చి పడున్న కూకేటి పాములాగున్నాది. రోడ్డుమీద డొక్కు సర్వీసొకటి డబడబలాడుతూ వెళ్లింది. రోడ్డు కవతలి బొగ్గు బాయిలు నిశ్శబ్దంగా ఉన్నాయి. మరో రోజయితే చెవులు చిల్లులుపడే విధంగా బొగ్గు గనుల్లో హాలర్లు తిరిగేవి…

రోడ్డు కీవలివేపు వందగజాల దూరంలో తంగేడు చెట్ల మధ్య ఒక పట్నం తుమ్మచెట్టు. ఆ చెట్టుకింద పదిమంది కార్మికులు దుమ్ములో కూర్చున్నారు. వాళ్ళ ముఖాలు వాడిపోయి ఉన్నాయి….ఎవరికివారే ఇంకొకరి మాటవినకుండా మాట్లాడుతున్నారు…..ఆ మాటలకు కొసా మొదలు లేవు…. ఒకరిద్దరు ఊరు పేరు లేకుండా కుక్క మొరిగినట్టు తిడుతున్నారు. ఆ తిట్లు, మాటలువింటూ ఇనుప బొగ్గుల పొయ్యి మీద చాయ్ కెటిల్ బెట్టుకొని ఒక స్త్రీ చాయ్ కాస్తోంది. చెట్టు మొదలు దగ్గర కాళ్ళ మీద కూర్చుని పాతబకెట్లో గ్లాసులు కడుగుతున్న పిల్లవాడు ఆ పని ఆతురతగా వేగంగా చేస్తున్నాడు. ఆ చెట్టు కావలివేపు అట్టముక్కల గుడిసె, గుడిసెమీదకంటా పారిన కాకరతీగ ఆకులు ఎండిపోయున్నవి. గుడిసె ముందు పాతసంచి బొంతమీద ఒక పిల్లకూర్చొని అగ్గిపెట్టె నొకదాన్ని ముందు పెట్టుకున్నది. ఆ అగ్గి పెట్టెలో ఒక అరగంట క్రితం బందీయైపోయిన బంగారు పురుగొకటి ‘జుమ్మ’ని మోత పెడుతోంది. కాళ్లతో అగ్గి పెట్టి అంచులు గీరుతోంది.

“సావు ముండ! ఎట్లెగురుతవ్…నాకు కాల్లులేవనే గదా!” పిల్ల…

“వీనమ్మల కుక్కల్…..” అన్నాడు తుంపిర్లు రాలుతుండగా మెల్లెకన్ను కార్మికుడు గడ్డాన్ని బరబర గోక్కుంటూ….

ఆ మాటెవరూ పట్టించుకోలేదు.

“పట్నంబోయి పండ్లూడగొట్టుకున్నట్టున్నది పని వరుస – నీ తల్లి…..” చెక్కుకు పోయిన చెంపల కార్మికుడు అదుపు అడ్డూ లేకుండ వదరసాగిండు.

“ఆ నవ్వల-ఉన్నూల్లె బూమిని దిగమింగి ఆళ్ళు కూసుంటె-ద్దుత్తెరిగీ ఊరచ్చి రాలేదని ఆఖరి సెలుక సెక్క అమ్ముకొని ఆనిసుట్టీనిసుట్టు తిరిగి సత్తెమానె
మల్లగీడ దొరలుండరనుకుంటే గీడ దొరలు తయారు. ఏమన్నం?…మనకేం గావాలన్నం? దొంగ లంజ కొడుకులాలా ఏడంతరాల మేడలు గందట్ల పాయ
ఖాన్లకో నల్ల-బాతురుంల నల్ల-కారులు, బూరులు బరండి కీసలుగాదు మనం కోరింది…మనం గోరిందేమిటి?” అని లేచి నిలబడి “ఒసే లంజెకాన చాయ్ జెప్పనపంపు….” అన్నాడు గుండ్రటి మొఖం కల్గిన కార్మికుడు.

“నీనోరు పడిపోను-మాట్లాడై నోట్లైనుంచి పురుగులు రాలయిగదా! ఏందిరా బాడ్ కావ్…..” చాయ్ కాస్తున్న స్త్రీ కోపంగా కాకుండ యాదాలాపంగానే అన్నది.

“అబ్బో పత్తిత్తు…..” గూని ముసలోడు కిసకిస నవ్విండు.

“ఏందిర దవుడలు బడిపోయినోడ ఇప్పటి మాటేందిరా! ముఖం సూడు మొఖం-చిప్పలునాకే తపాసె మల్లె మొఖం. నేను పతివతనని ఎవరితోనన్న చెప్పిన్నారా!
రాయేశా నీ బొంద మురుగజెప్పన ఉరికిరారా!” అని కేకేసింది. “అత్తన్న ఆగే” గ్లాసులు కడుగుతున్న పిల్లవాడు….

మరి కాసేపటికి గ్లాసులొచ్చినయ్. గ్లాసుల్లో చాయ్ పోసింది. పిల్లవాడు అందరికి అందిచ్చాడు. గుండ్రటి మొఖంవాడు గుడ్లు మిటకరిస్తూ చాయ్ చప్పరించి – ‘ఇంతకూ నువ్వు సతీసావిత్రినంటవ్…’ అన్నాడు.

“ఆ లంజకు నాకు పోలికేమిటి?”

“ఒసిలంజ…..సూడవోతె సీతమ్మోరిని సుత లంజనే తట్టున్నది గదా?” గూనివాడు.

“కాకపోతే?” “ఎందుకుర్ర-కుక్కనోట్లే కట్టెబెడితె కుయ్యి కుయ్యి.

దాని సంగతెరుకుండి దానిజోలికి బోతవు. ఆరుదినాలనించి పనిలేదు. స్ట్రెయికంటె ఎవనికి సిన్నమెత్తు రంధిలేదుగదా! సీతమ్మోరని ఒకడు సావిత్రని మరొకడు.” రాగిమీసాల యువకు డొకడు కసురుకున్నాడు.

“కొత్తాతమ్మీ” అన్నది ఇందాకటి స్త్రీ తనో చాయ్ గుటుక్కునమింగి జవాబు వినకుండానే “ఒరే ఎంకులు బావా కోసంత పొవాకుంటెబెట్టు దవడ తీపునం మెక్కి పోతంది” అని అక్కడినుంచి లేచి గూనివాని వద్ద కొచ్చి నిలబడ్డది. “అరుసలు గలుపుడు బాగనే ఉన్నదిపటు-” రొండినుంచి పొవాకుతుంచి మీదినుంచి వేసిండు. .

“సౌకల్దానితోని సరసమాడ్రే బట్టలుతుకుతావ్ బావా! అన్నదట” తొర్రివాడు.

పిల్లవాడు బాగా చూసి తోలులాగా అయిపోయిన గుండీల్లేని అంగీకి చేతులు తుడుచుకొని తల్లి తాగి పెట్టిన గ్లాసులో చాయ్ పోసుకొని పిల్లదగ్గరికి పోయాడు.
పిల్ల అగ్గిపెట్టెను చెవిదగ్గరినుంచి తీసి కొంచెం తెరిచింది. బంగారు పురుగు తుర్రుమన్నది.

“అక్కా చాయ్ తాగే…..” పిల్లవాడు.

ఆ పిల్ల గాజుకళ్ళల్లో విశాదం. పురుగు లేచిపోయిన వేపే దిగాలుపడి చూడ సాగింది.

“తమ్మీ నా పురుగు పోయిందిరా! అదెక్కడికి పోతదో ఎరికేనా? చూడు. అటు చూడు…అగగో అట్ల కన్పిచ్చే గుట్ట…ఆ గుట్టెనుక మనూరు నీకు ఎరుకలేదులే. గాడ మన గుడిసె ఎంత పెద్ద రేగు చెట్టు! రేగుచెట్టు మీదికి పోయింది.” పిల్లవాడికి ఈ మాటలు కొత్తగాదు. పైగా ఇప్పుడు ఆసక్తేమి లేదు.

పిల్ల తొందరగా చాయ్ తాగితే అదే గ్లాసులో తను చాయ్ తాగాలి. అదే ధ్యాస.

పిల్ల పిచ్చిమాటల్లో పడిపోయింది.

“కుంటి దానా జెప్పనతాగు” పిల్లవాడు కసురుకున్నాడు.

“లంజకొడుక నేను కుంటిదాన్నే ఓరి లంజకొడుక నీకే కాళ్ళుంటె నువ్వె మారాజుగ అన్నీ తిరిగి చూడరాదు! నాకు నీ చాయొద్దుపో-ఇక్క నుంచిపో.” పిల్ల ఏడ్వసాగింది.
పిల్లవాడు ఆ ఏడుపు పట్టించుకోకుండా కాళ్ళమీద కూర్చుండి చాయ్ తాగసాగిండు.

నల్లటి డాంబర్ రోడ్డు మీద నుండి బొగ్గుముక్కలాగా నల్లగా ఉన్న కార్మికుడొకడు పాత సైకిలు కిరకిరలాడుతుండగా హడావిడిగా వచ్చాడు. .

“చీ మీకు సిగ్గుల్లేవు – గీడచ్చి కాళ్ళు బారజాపి కూకున్నరు. అక్కడ టూ యింకు లైనుదగ్గర మన వాళ్ళంత కూడి ఊరేగింపు తీయాల్నని రెడీగున్నరు. జెప్పనరాండ్లి” అన్నాడు వేగిరపరుస్తూ.

“ఆనవ్వల కుక్కల్…..” అనేసి మెల్లెకన్ను కార్మికుడు “వొరే! మనం కోరిన యేందిర లీడ్ పుష్ ను సరిదిద్దాలన్నాం. బదిలీ పిల్లర్లకు సిక్ గట్టియ్యలన్నం. మంచి
గాలి, మంచినీల్లు, తిండి తినటానికి, సైకిల్లు బెట్టుకోవటానికి వసతులు గావా లన్నం. వీనమ్మల పని ఇసిరెలు సక్రమంగ యియ్యలన్నం, టబ్బులు ఎక్కువ సరపరా జేయాలన్నం”…..ఇట్లా అరవసాగిండు.

“ఉపన్యాసం ఈడగాదు ఆడ-” అన్నాడు బొగ్గుముక్కలాంటి కార్మికుడు రవులుకొంటూ.

“మరి చాయ్ పైసలో…… స్త్రీ కాల్లు నిలబొడిచి నిట్టనిలువుగా నిలబడి చేయి చాపింది.

“లంజకాన పైసలు జీతాలనాడే….” గూనివాడు.

“గూనోడా! గీడ బతికేటోల్లంత లంజలు-లంజె కొడుకులే-మన నెత్తురు, మొస, సుఖం, కట్టం అన్నీ పైసల కమ్ముకునేటోల్లమే. మీకు కుక్కకు పారేసినట్టుగ పైసలు పారేత్రే – ఏది – ఇండ్లకాడ పందుల గుడిసెల్ల పెండ్లం పోరగండ్ల ఇడిసి పెట్టి నాలె బొయ్యారంలకు సాచ్చుకపొయ్యి, నాత్రి పగలు బొగ్గు తవ్వి ఆళ్ళ కొమ్మున బెడ్తలేరా! బతకటం కోసం గీడ ఏదుంటె అదమ్ముకున్నోల్లె బతుకుతరు. లేనోళ్లు…..” ఆ స్త్రీ కంఠంలో ఆవేశం లేదు-కోపం లేదు – సన్నగా ఎక్కడో వొనుకు మాత్రం ఉంది.

తంగేడు చెట్ల మధ్య నుంచి అట్టముక్కల గుడి సేవేపు నిక్కి నిక్కి ఒక పొట్టివాడు చూస్తున్నాడు….పొట్టివాడు కాళ్లులేని పిల్లను చూపులతో వెతుకుతున్నాడు – పిల్ల కనిపించింది. పొట్టివాడు ముఖం రుద్దుకొని కాండ్రకిచ్చి ఊంచి, “కుక్క బతుకు లంజది’ కుక్క బతుకూ” అని గొనుక్కుంటూ తలవంచుకొని తంగేడు చెట్ల మధ్యనుండే వెళ్ళిపోయాడు. అందరు వెళ్లిపోయారు. స్త్రీ బొగ్గుల పొయ్యి ముందు కూలబడి పోయింది. ఆమె కళ్ళల్లో నెత్తురు పేరుకున్నది…. బొగ్గు ముక్క తీరుగా నల్లగా ఉన్న ఆమె ఒంట్లో నెత్తురెక్కడో కదులుతోంది. కంపలాంటి నెత్తి లోనికి వేళ్లు చొప్పించి పళ్ళు గిలకరించి కాసేపు గోక్కున్నది. పొయ్యిలో రగరగలాడుతున్న నిప్పుల మీద బూడిద పేరు కొంటోంది. తాగి పారేసిన గ్లాసులు అక్కడొకటి ఇక్కడొకటి పడి ఉన్నాయి. గ్లాసుల చుట్టూ ఈగలు చేరుకున్నాయి.

‘అయిపోతది’ మనుసులో అనుకొని తలవంచుకొని వెళ్లిపోతున్న పొట్టివాడు తిరిగి చూడడం చూసింది.

“తూ నీ పుటుకుగాల – నిన్ను గత్త రెత్తుకపోను” కాండ్రకిచ్చి ఉమ్మేసింది.

“ఆగట్లెనుక మా వూళ్ళో – ” పిల్ల వెల్లకిలా పడిపోయి గట్టిగా ఏదో – అంటోంది.

ఆ స్త్రీ దిగ్గున లేచి పిల్ల దగ్గరికొచ్చి “ఆగట్లనెక – మనిల్లు – మనూరు అనెప్పుడో బగ్గునమండి బొగైపోయినయ్ నరుసూ – ఉత్త బొగ్గయిపోయినయ్” ఆ స్త్రీ కంఠంలో వొనుకు…..

                * * * 

చిమ్మంజీకటి-చిమ్మెట్లు తెగ అరుస్తున్నాయి. ఏదో పిట్ట ఉండీ ఉండీ అరుస్తోంది. రోడ్డు పక్కనున్న స్ట్రీటులైటు వెలుతురును పట్నం తుమ్మచెట్టు మింగేసి ఆ గుడిసెను చీకట్లో ఉంచేసింది. ఫెర్టిలైజర్ ఫ్యాక్టరీ వెలుతురు కాంతివంతంగా ఆకాశంలోకి చిమ్ముతోంది.

పిల్లవాడు ఆదుర్దాగా గుడిసె బయట కొచ్చి రోడ్డుకేసి చూశాడు. ఏమి కనిపించక పట్నం తుమ్మచెట్టు దగ్గరికొచ్చాడు. చూపు అందినంత వరకు రోడ్డువేపు చూపు సారించాడు. రోడ్డు మెత్తటి పాములాగా పడున్నది. నెత్తి గోక్కొని ‘నీ యవ్వ ఏడ సచ్చిందో గదా’ గొనుగుతూ గుడిసెల కొచ్చాడు.

పిల్ల గుడ్లు తేలేసి చూస్తోంది, చీకట్లో కనిపించక పిల్లకాలు తొక్కేసిండు. “సంపుతివిర తమ్మీ” పిల్ల –

“సూల్లేదక్కా” పునుక్కుంటూ అక్కపక్కలో చేరిపోయాడు. ముక్క వాసనవేసే పాతగుడ్డ కప్పింది పిల్ల.

“తమ్మీ నీకు శాత్రం జెప్పానా!” “నాకు శాత్రమద్దు గీత్ర మద్దుపో

“గట్లనే అంటవ్-నా సెక్కరి కొండ తమ్మీ. ఊరంటే ఊరుగాదు నీ బాంచే నాతె అంత పెద్దూరు. ఊరు సుట్టూ తాళ్ళు, తాళ్ళపక్క పెద్దగుట్ట-గుట్ట పక్క మాంచి ఆగు.”
పిల్లవాడు తనకు తెలియకుండానే ఊకొడుతున్నాడు. “గ ఊళ్లే మనవ్వ అయ్య అసొంటి ఇద్దరుండేటోల్లట.” “ఉన్నరనుకోరా!”

“గ ఎద్దు మొఖపోన్ని అయ్యంటే నేనొప్పుకోను” పిల్లవాడు అసహనంగా కదిలిండు.

“తప్పు తమ్మీ తప్పు – ఆళ్ళకు ఎడ్లు, భూమి ఉండెనట. ఎవుసాయం జేసి వడ్లు, జొన్నలు పండించుకునేటోల్లట. ఆళ్ళు సుకంగ ఉండెటోల్లట. అయ్య
తండ్రి కోమటోని బాకి తీసుకొని సచ్చిండట…గ బాకన్నా గట్టు – లేదా బూమన్న ఇడువు మన్నడట కోమటోడు….”

‘…..నేనైతే ఆని బొండిగ పిసికేద్దును.”

“అయ్యగట్లనే అని కొట్లాట బెట్టుకున్నడట – ఊళ్ళె పెద్దమనుషులంత జమై పంచాతు బెట్టిండ్లట – కోమటోన్ని దిట్టినందుకు తప్పు దండుగ కింద ఎడ్లు గుంజుకున్న రట – కోమటోడు బూమి గుంజుకున్నడట – పూలమ్మిన సోట కట్టెలమ్మనని అయ్య దేశాలు దెగిచ్చుక పోయిండట – అవ్వ అలపోసి అలపోసి – అయ్యత్తడేమొనని కొండకెదురు సూసినట్టు సూసిందట-మరింక అయ్యరాక పోయేటాల్లకు అయ్యజాడ బట్టుకొని అవ్వ ఊరిడిసి బయిలెల్లిందట.”

“అంతా ఉత్తది – నాకాకలయితంది.” “అత్తన్న ఆడికే అత్తన్న.,

పిల్ల కంఠం మారిపోయింది. అనమిడిసిన కోతి ఊరిడిసిన మనిషి బొగ్గు బాయిల కాడికచ్చి తిప్పలు పడ్డదట. ఆఖరుకు అయ్య దొరుకుతడు – అవ్వ సత్తది – పాతదే శాత్రం.”
పిల్లవాడు మళ్లీ లేవబోయాడు.

ఇంతలో గుడిసెకు కొంచెం దూరంలో ఎవరిదో కంఠం. నేలను గుద్దుతూ పాదాల సప్పుడు. “అంతా లంజెలు లోకం సెడిపోయింది. బాడ్ కావ్ నాకు సారా పోపిచ్చింది నిజమే! నిచ్ఛమేనోంట….ఎందుకు పోపిచ్చినవ్ – కుతిరా… గాడ్ఢికొడుకా కుతిరా…బొగ్గు సెత్తమీద కుతీ – ఈ బొగ్గురవులుకునే నెత్తురు మీనకుతిరా!” మాటలు ముద్దగా అస్పష్టంగా వినపడుతున్నాయి.

“అంతేగదా గీలోకంల సచ్చెవంతుడెవడోంట, అంతా దొంగ లంజ కొడుకులు… నేను సుత – మా అండర్ మేనేజర్ గాడో పెద్ద దొంగ! ఆరందినాల నుంచి పనిలేదు. పనుంటె సారాగావాలె – లేకున్న సారాగావాలె – సిలుకా! మాకర్రె దానిమీని కమ్మలు గుంజుకపోయి అమ్మిన – కుక్కలతీర్గ సారా డిపో కాడ కుయి కుయి మనుకుంట తిరిగే టోల్లందరికి పోపిచ్చిన నువ్వచ్చినవ్…బస్” బొంగురు మొగగొంతు.

పిల్లవాడు ఉండేలురాయిలాగా బయట కొచ్చాడు. పట్నం తుమ్మ మొదట్లో నిలుచున్నాడు. తుమ్మల కావల వెలుతురు పడుతున్న స్థలంలో తన తల్లి అర్ధనగ్నంగా – చీకటిలా నల్లగా ఉన్నవాడు తన తల్లిమీది కెగబాకుతున్నాడు.

“వొదులురా కుక్కా……” “కుక్కనే సిలుకా! కుక్కన్నవ్ గద సెంప కొరుకుత…..”

పిల్లవాడు పరుగెత్తాడు. మరో నిమిషంలో ఆ తాగుబోతును దుమ్ములో పడేసి గొంతుమీద గుద్దుతున్నాడు.

తల్లి చూసింది. బట్టలన్నా సవరించుకోకుండా లేచి తూలుతూ పిల్లవాని వీపుమీద గుద్దింది.

పిల్లవాడు ఒక పక్క పడిపోయాడు. తాగుబోతు తూలుతూ లేవడానికి ప్రయత్నిస్తూ “నా కొడుకా! ఒరే నీ యవ్వల్ కుక్కల్…..” లేచి దుమ్ము దులుపుకున్నాడు.
తల్లి కసిదీరక కొడుకు వేపు ఉరికింది. అది ఎవరిమీది కసో చెప్పలేం.

పిల్లవాడు మట్టిలోనుండి రివ్వున లేచి రెండు పిడికిళ్ళ దుమ్ము తల్లికేసి విసిరికొట్టి ఆ చీకట్లో, తంగేడు చెట్ల మధ్యనుంచి తిరిగి చూడకుండా పరుగెత్త సాగిండు.
ఆ తరువాత తాగుబోతు స్త్రీ మీద పడ్డాడు. స్త్రీ గింజుకుంది. వాడు బూతులు తిడుతూ ఆక్రమించుకుంటున్నాడు.

ఆ తిట్లు, శబ్దాలు గుడిసెలోని పిల్లకు వినిపిస్తూనే ఉన్నాయి. ఆ పిల్ల కళ్ళల్లో నెత్తురు చిమ్ముకొచ్చింది…మరి కాసేపటికి పిల్ల చప్పుడు కాకుండా ఏడ్వసాగింది.
పడమటి దిక్కు – సూర్యుడు జబ్బు పడ్డ మనిషిలాగా డీలాపడిపోయాడు. పడమటి ఆకాశం మీద పరుచుకున్న ఎర్రడౌలును కమ్మేస్తూ వంటపొయ్యిలో నుంచి బొగ్గు పొగలేస్తోంది. అట్టల గుడిసె నీడ తూరుపుకంటా, పెరిగిపోతోంది. గుడిసె ముందు తప్ప కాళ్ళ పిల్ల గోనెసంచిమీద పడి మూలుగుతోంది. కుక్కొకటి పట్నం తుమ్మ మొదట్లో ముడుచుక పన్నది. తంగేడు చెట్లల్లో నుంచి పొట్టివాడు నిక్కినిక్కి గుడిసె వేపు చూశాడు. పట్నం తుమ్మ చెట్టుకింద బూరుగు చెక్క బోసిగా ఉన్నది. ‘ఏడిపోయినట్టున్నది’ అనుకొని గబగబా అట్టల గుడి సెకేసి నడిచాడు.

“నర్సవ్వా….నరుసూ….” పిలిచిండు.

పిల్ల మాట్లాడలేదు. వంగి ఒళ్ళు తాకి చూశాడు. ఒళ్ళు కాలిపోతోంది. లేపి చాతీకి ఆనించుకొని కూర్చున్నాడు.

పిల్ల కళ్ళు తెరిచి చూసింది. గడ్డం పెరిగిన ముఖంలోని పొట్టవాని ముఖంలో గుంటల్లాంటి కళ్ళల్లో నీళ్ళు, ‘అవ్వచ్చిందా? తమ్ముడేడి?’ పిల్ల అడుగుతోంది.
‘పిల్లకేమన్నా తెత్తామన్నా! సీబతకవ్వ – కుక్కలు సింపిన ఇత్తారై పోయింది గదా! పోయింది పీడా పోయింది, మళ్ళా గొంతు వనికింది. “నర్సవ్వా మీ అయ్యను
కొలువుల నుంచి పీకేసిండ్లు. ఇగో సూడవ్వ కాయిదం.” నెక్కరు జేబులోనుంచి కాయిదం ముక్కొకటి తీసి పిడికిట్లో పట్టుకున్నాడు.

పిల్లకివేమి పట్టినట్టులేదు.

“ఎక్కన్నుండి ఎక్కడికచ్చింది. దీనికి బయపడ్డనో నర్సు అదే నన్ను కరకర నమిలేత్తంది. బిడ్డా మనూల్లె బూమిబోయిన్నాడు – గీ పట్నం పారొచ్చి ఏదన్నచేసి మల్ల బూమి దక్కించుకుంట ననుకున్న. అయిపాయె మించిపాయె. బూమినీ నక్కలు మింగి కూసున్నయి…… పెండ్లాన్ని కుక్కలు పీక్కతిన్నయి. ముసలితనానికి దసిలి రయికన్నట్టు పరిమినెంటయిన ఆర్నెల్లకు స్ట్రయికచ్చింది. పోతది పోతదనుకున్న కొలువు పోనే పోయింది…. దీనికి జనికిన్నో గదేమింగేసింది. మరింక నేను బయపడ ఎవ్వలకు బయపడ బిడ్డా! నేను తెగిచ్చిన పాబిడ్డ నిన్ను దీసుక పోత-” పొట్టి వాని కళ్ళు మండుతున్నాయి. పెదిమలు వనుకుతున్నాయి.

పిల్లను భుజం మీద వేసుకోబోతుండగానే –

“నా బిడ్డ నిడువు” పిడుగులాంటి అరుపు. స్త్రీ పరుగెత్తుకొచ్చింది. ఆమె కాళ్ళు దుమ్ము కొట్టుకపోయున్నాయి. తిరిగి తిరిగి ముఖం వాడి పోయున్నది.

“లేదు నా బిడ్డ.”

“పాముల మజ్జెన – పులుల మజ్జెన నట్టనడడివిల ఇడిసి పెట్టచ్చినప్పుడేడ బోయింది బిడ్డ…నీ పెండ్లాం జానెడు కడుపుకోసం – నీ బిడ్డ జానెడు పొట్టకోసం మానమమ్ముకున్నప్పు డేడబోయింది నీ తెలివి.”

స్త్రీ అతనిమీది కురికింది.

అతను పిల్లను విడిచి ఆ స్త్రీ వెంట్రుకలు ఎడంచేతికి చుట్టుకొని గుస్కీ గుప్కిన గుద్దిండు. ఆ స్త్రీ ఏడవలేదు – తను పోట్లాడింది. కాసేపటికి స్త్రీ కింద పడిపోయింది. పొట్టివాని మూతి పగిలింది. వాడు ఆ స్త్రీ ముఖం మీద నెత్తురుమిసి కాలుతో తన్ని పెద్ద పెద్ద అంగలేస్తూ తిడుతూ వెళ్లిపోయాడు.

పిల్ల అంతా చూసింది. కాని ఏమనలేదు. ఆ పిల్ల కళ్ళల్లో తమ్ముడు కదులు తున్నాడు. బహుశా ఆ పిల్లకిది కొత్త కాదేమో?

రెండవనాడు కూడా పిల్లవాడిజాడ దొరుకలేదు. ఆ స్త్రీ చిత్తుగా తాగేసి తూలుతూ గుడిసె చేరుకున్నది.

పిల్లకు కొంత నయమయ్యింది. జ్వరమైతే తగ్గింది కాని నిద్రపోదు. జీవంలేని కళ్ళు వికృతంగా తెరిచి తమ్ముడికి కథలు చెపుతుంటది. తమ్ముడడిగే ప్రశ్నలు తనే వేసుకుంటుంది. అట్లా కళ్లు తెరిచే తనకు కాళ్లు వచ్చినట్టూ పరుగెత్తుతూ తన తమ్మున్ని వెదుకుతూ చెట్లు పుట్టలూ, పెద్ద పెద్ద బంగళాల వీధులు, హోటల్లు వెతుకుతున్నట్లు కలకంటుంది…. మరికొంత సేపటికి చప్పుడు కాకుండా ఏడుస్తుంటుంది.

               * * *

తూలుతూ వచ్చిన తల్లి పిల్లను కూర్చుండబెట్టి కావలించుకొని ఏడ్చింది. చీరకొంగు చివరి పకోడి పొట్లం బిడ్డకిచ్చింది….ఏదో మాట్లాడాలని పెదిమలు కదిపి నాలుక పిడుచగట్టుక పోయినట్టుగా కడుపుల పేగులు తెగి పోయినట్టుగా ముఖం పెట్టి మరింక భరించలేనట్టు బయట కొచ్చింది. కాళ్లు బారజాపుకొని వాకిట్లో కాసేపు కూర్చున్నది. తల్లి కడుపు చీరుకొని పుట్టే నెత్తురుముద్ద శిశువులాగా చంద్రుడు ఉదయించాడు. మెదడంతా తిమ్మిరెక్కినట్టుగా మొత్తం కడుపు అవిసి పోయి నట్లుగా… తూలు తూనే బొగ్గు ముక్కలు నలుగొట్టి పాత గుడ్డముక్కలు అంటించి పొయ్యి రాజేసింది. కణకణ మండే నిప్పులను చూస్తూ తలపట్టుక కూర్చున్నది.

ఆ నిప్పులు పిడికిల్లు బిగించి అరుస్తున్నాయి. ఒకటి రెండు మూడు ‘మేనేజుమెంటు అక్రమం నశించాలె….. ‘కార్మికుల న్యాయమైన డిమాండ్లు పూర్తి జెయ్యాలె….’ పొట్టివాడు,
రాగెంటికెలవాడు, మెల్లెకన్నువాడు – చెక్కుక పోయిన దవడలవాడు, దమ్ము రోగపోడు, దగ్గులోడు…అందరు బొగ్గుల్లాంటి ముఖాలతో అరుస్తున్నారు అరుపులు పిట్ మీదినుండి ముందుకు సాగినయ్. పిడికిల్లు హాలర్ మిషన్ను బద్దలు కొట్టినయ్. లాడీసు తీగెలు తెంపినయ్.

ఎద్దు ముఖంవాడు అరుస్తున్నాడు. కోల మొఖంవాడు తిడుతున్నాడు. తిట్లు అరుపులు……అరుపులు…తిట్లు, పిట్ మీద అన్నిటిని విరగ్గొట్టి, తొక్కేసి బొగ్గు ముఖాలు రోడ్డుమీది కొచ్చాయి. అరుపులు – పెడబొబ్బలు…..వచ్చి చేరేటివి ఇంకా వచ్చి చేరుతూనే ఉన్నాయి. రోడ్డు మీద…. రోడ్డును బద్దలుగొట్టే అడుగులు… మట్టికొట్టుక పోయిన చీరుక పోయిన గాయాల, మచ్చల పాదాలు….సినిమాటాకీసు సగం కాలిపోయింది….ముఖాలల్లో మంటలు…మళ్లీ ముందుకు బ్రాందీషాపులో సీసాలు పగిలినయ్. బొగ్గుల ఊరేగింపు సెంటర్ కొచ్చింది….ఎంత మందో స్త్రీలు, పురుషులు, పిల్లలు…

అక్కడికి ముదురుపచ్చ వ్యానొచ్చినయ్. వ్యాన్లల్లో నుంచి మరికొన్ని బొగ్గులు దిగినయ్. కాని ఆ బొగ్గుల చేతుల్లో తుపాకులున్నయి…అరుపులు గజిబిజి తొక్కులాట… కుక్కేడుపులా ఏదో హెచ్చరిక-బొగ్గులాగ ఉన్న జీబుమీదికి పొట్టివాడు ఎక్కుతున్నాడు. తుపాకులు మొరిగినయ్.

బొగ్గులు నెత్తురు కారుస్తున్నాయి. పొట్టివాడు నెత్తురు మడుగులో మెడ గోసిన కోడిపిల్లలాగా తన్నుకుంటున్నాడు.

“లంజకొడుకులు…పచ్చి లంగలు తూ” మండుతున్న నిప్పులమీద ఉమ్మేసింది….

మరి కొంత సేపటికి రవికెలోపల దాచుకున్న పసుపు కొమ్ము కట్టిన దారపుదండ తీసి నిప్పుల్లేసింది. పసుపు కొమ్ము పొగచూరుతోంది.

రెండు చేతులతో ముకం పిసుక్కుంటూ పెద్దగా ఏడ్వసాగింది. కుమిలి కుమిలి….ఎన్నేండ్ల దుఃఖమది. ఎంత ఘనీభవించి పేలిందది? ఎవరికోసం కారుస్తున్న కన్నీల్లవి? బొగ్గులు మండడమేకాదు – మాట్లాడుతాయి. మాట్లాడ డమేకాదు…ఏడుస్తాయి… ఏడ్వడమే కాదు….

అట్లా ఎంతసేపున్నదో తెలియదు. ఆమె పక్క నల్లగా బొగ్గు ముక్కలాగున్న యువకుడు తలవంచుకొని నిలుచున్నాడు. అతని ముఖంలో చెప్పరానంత దైన్యం గోచరిస్తోంది.
“అక్కా పెద్దులుబావ శవాన్ని పోలీసోల్ల దగ్గరినుంచి మనవాళ్లు తీసుకున్నరు. దానం చేస్తండ్లు నువు రావా!”

“పో………..బయటకు పో….దొంగలు….. దొంగలంజకొడుకులు…..కుక్కలు… పందులు…ఒరే మీ ఒంట్లో నెత్తురులేదు బూడిద – మీ తలకాయల్ల మెదడు లేదు. మసి-ఆళ్లు ఆ రండకొడుకులు పిరికెడు….మీరో పిడికెడు పిడికెడు మీసాలు బెట్టుకొని ఏలురా ఏలు…కని ఏంబాగ్గెం…” బిగ్గరగా అరిచింది.

నల్లవాడు మౌనంగా కదిలిపోయాడు…మరి కాసేపటికి ఆ స్త్రీ తన తప్పకాళ్ల కూతురును ఎత్తుకొని తంగేడు చెట్లల్లో నుంచి రోడ్డు మీదికొచ్చి నడవసాగింది…. మూడు రోడ్లు కలిసే దగ్గరినుండి ఆ లేత వెన్నెట్లో పాడె!

దాని వెనుకా ముందు జనం. మళ్ళీ అవే నినాదాలు మరింత క్రోధంగా…

ఆ స్త్రీ వాళ్ళను చేరుకొన్నది. తన భర్త శవం వెనుక నడుస్తోంది.

“లంజకొడుకులు నశించాలే!” అరిచింది. ఆగకుండా అరుస్తూనే ఉన్నది. “దొరలు మట్ల గలువాలే”, “బాయి దొరలు గంగల గలువాలె.”
ఊరేగింపు….. ఊరేగింపులో నడుస్తూ ఆ స్త్రీ నినాదాలిస్తోంది. తప్పకాళ్ల పిల్లను ఎవరో తీసుకొని రిక్షాలో వేశారు.

ఊరేగింపు ఒక బంగళాముందు కొచ్చి ఆగింది. నినాదాలు మిన్ను ముట్టాయి.

ఆ స్త్రీ గేటుముందటి గూర్ఖాను తోసుకొని లోపలికి పరుగెత్తింది. “ఒరే లంజకొడుక దమ్ముంటే ఈతలికిరా?” అరుస్తోంది.

రిక్షాలో తప్పకాళ్ళ పిల్ల పిడికిలెత్తి తను ఏదో గొనిగి – అద్దాల కిటికీ తలుపుల వెనుక ఒక స్త్రీ, పక్క పిల్లలు బెదురుముఖాలతో చూస్తుండటం చూసింది.
పిల్ల తండ్రిని తలుచుకొని తలుచుకొని వెక్కి వెక్కి ఏడుస్తోంది.

ఆ స్త్రీ కళ్లు నిప్పుల్లాగా మండుతున్నాయి. ఆ స్త్రీ గొంతు హాల్లర్ మోత లాగున్నది. ఆ స్త్రీ కడుపుల పేగులు తెగేదాక అరుస్తూనే ఉన్నది. తిడుతూనే ఉన్నది.

(అగ్నిపూలు పక్షపత్రిక 25.02.1981)
అల్లం రాజయ్య కథలు)

పుట్టింది గాజుల ప‌ల్లి, మంథ‌ని తాలూకా, క‌రీంన‌గ‌ర్ జిల్లా. న‌వ‌ల‌లు: 'కొలిమంటుకున్నది', 'ఊరు', 'అగ్నికణం', 'కొమురం భీమ్'(సాహుతో కలసి), 'వసంత గీతం', 'టైగర్ జోన్'. కథా సంపుటాలు : 'సృష్టికర్తలు', 'తల్లి చేప', 'అతడు'. 100కు పైగా క‌థ‌లు, కొన్ని క‌విత‌లు, పాట‌లు, వ్యాసాలు, అనువాదాలు, 4 నాట‌కాలు రాశారు. 1979 నుంచి విప్ల‌వ ర‌చ‌యిత‌ల సంఘంలో స‌భ్యుడిగా కొన‌సాగుతున్నారు.

Leave a Reply