(బెర్తోల్ట్ బ్రెహ్ట్ (1898-1956) ప్రసిద్ధ జర్మన్ నాటక రచయితా, కవీ. నాటక రచనలతో పాటు, ప్రదర్శనల విషయంలో ప్రాచుర్యంలోకి తెచ్చిన తన ప్రతిపాదనల మూలంగా తనని ఎక్కువమంది ఆ కోణంలోనే చూశారు. బహుముఖమైన బ్రెహ్ట్ సాహిత్య సృజనలో విస్తారమైన కవిత్వం చాలా రోజులపాటు మరుగున పడిపోయింది కూడా.
జర్మనీలో నాజీలు అధికారాన్ని హస్తగతం చేసుకొన్న వెంటనే బ్రెహ్ట్ రచనల పైన పెద్ద ఎత్తున దాడి జరిగింది. తన పుస్తకాలని దగ్ధం చేశారు, నాటకాల ప్రదర్శనాలని నిషేధించారు, చివరికి జర్మన్ పౌరసత్వాన్ని కూడా రద్దు చేశారు. బ్రెహ్ట్ తన ప్రవాస జీవితంలో ఫాసిస్టు వ్యతిరేక ఉద్యమంలో క్రియాశీలమైన సృజనాత్మక కృషిని కొనసాగించాడు. స్థిరమైన శ్రామిక పక్షపాతం, సున్నితమైన అనుభూతులు, ప్రవాస జీవితపు విషాదం, యుద్ధ విధ్వంసం పట్ల ఆగ్రహం వంటి వాటిని బ్రెహ్ట్ కవిత్వంలో చూడవచ్చు.
1938 ప్రాంతంలో బ్రెహ్ట్ రాసిన ‘కొత్త ముసుగులో పాత వూరేగింపు’ కవిత మన ముందు జరుగుతున్న సంఘటనలకు అడ్డం పడుతున్నట్లుండడం ఒక విషాదం…
ఇది ‘ఐదు ప్రకటనలు’ (ఫైవ్ విజన్స్ / రివిలేషన్స్) పేరుతో బ్రెహ్ట్ రాసిన ఐదు వచనాలలో మొదటిది. ఇవి హిట్లర్ ఫాసిజాన్ని వర్ణించేవి. వీటిలో క్రైస్తవ సంప్రదాయంలోని ‘ప్రకటన గ్రంథం’ (బుక్ అఫ్ రివిలేషన్స్) ప్రతీకలని శక్తివంతంగా ఉపయోగించుకున్నాడు.)
కొండమీద నిలబడి పాతదనం నా వైపు రావడం చూసాను. అయితే ఇప్పుడది కొత్తదనపు వేషంలో వుంది.
మునుపు ఎవరూ చూసి ఎరగని కొత్త ఊతకర్రలతో దుర్భరంగా కుంటుతూ, ఎవ్వరూ ఎన్నడూ ఎరగనంతటి కొత్త కుళ్ళు కంపుతో నడుస్తూ వస్తుందది.
దొర్లుకుంటూ పోయే రాళ్లే దాని నూతన ఆవిష్కరణలు. గుండెలు బాదుకునే నరవానరాల పెడబొబ్బలే దాని వినూత్న సంగీత సృజన.
రాజధాని వైపు అది అడుగులు వేస్తుంటే దారిపొడవునా బారులు తీరి తెరుచుకున్న ఖాళీ సమాధులే కనిపిస్తున్నాయి.
పక్కనే నిలబడ్డ బీభత్సపు గొంతు ఉత్సాహంగా అరుస్తోంది: ‘ఇదిగిదిగో నూతనత్వం మీ ముందుకొస్తోంది, అంతా కొత్తదనమే, ఈ కొత్తదనానికి అభివాదం చేయండి, మాలాగే వినూత్నంగా వుండండి.’ వింటే విన్నవాళ్లకి వట్టి అరుపులే వినిపించాయి. కానీచూసే వాళ్ళకి మాత్రం అలాంటిదేమీ కనిపించలేదు.
అలా పాతదనమే కొత్తదనం వేషంలో వూరేగింది. అయితే, తన విజయయాత్రలో అది కొత్తదనాన్ని తనతో తీసుకొచ్చి, ఆ కొత్తదనాన్నే పాతదిగా చూపించింది.
సంకెళ్లలో బందీయైన కొత్తదనం చింకిపాత దుస్తుల్లో తిరుగాడింది. నూతనత్వపు అవయవ సౌష్టవాన్ని అవి దాచివుంచలేకపోయాయి.
ఊరేగింపు రాత్రివేళ కొనసాగింది. వాళ్ళు వేకువ వెలుతురుగా భ్రమపడింది నిజానికి తగలబడే ఆకాశంలో ఎగసే జ్వాలలు. వెనక తుపాకుల మోతే గనక లేకపోతే, ‘ ఇదిగిదిగో నూతనత్వం మీ ముందుకొస్తోంది, అంతా కొత్తదనమే, కొత్తదనానికి అభివాదం చేయండి, మాలాగే వినూత్నంగా వుండండి’ అన్న మాటలు తేలికగా వినపడి ఉండేవి.
-బెర్తోల్ట్ బ్రెక్ట్
అనువాదం: సుధా కిరణ్
బాగున్నది కిరణ్. మిగిలిన నాలుగు విజన్స్ కూడా అనువదిస్తే బాగుంటుందేమో ఆలోచించండి. మన పరిస్థితులకు అన్వయం కుదిరే ప్రపంచ సాహిత్యం
పరిచయం చాలా అవసరం ఇప్పుడు
Very nice to read this. Very good translation. I like it. – Suresh