బెంగేల బాగుండ తండ్రీ!!

అనువుగాని చోటే
అయినా
అక్కున చేర్చుకోవడానికి
బాహువులు విప్పార్చి
ఆకాశమెప్పుడూ
పిలుస్తూనే ఉంటది.

పొదలు పొదలుగా
ముసురుకుని
హొయలు హొయలుగా
కదలి తేలియాడే
దూదిపింజల పానుపులు
కౌగిట్ల పొదుక్కుని
నీలి నీలి తళుకుల
గోరుముద్దల నింగితనాన్ని
గోముగా వొలికిస్తూ..

పరాయి దైన్యపు
గిటారు గానపు
బతుకు వెతుకులాటలో
తిరిగి అలసిన
మనసు దేహాన్ని
అలా అలా తిప్పుతూ
తరించి పోతుంది..

అయినా..
అమ్మవడిని
అందివ్వలేని
అసహాయతను
మన్నించమని
మబ్బు చాటుకు
ముఖం తిప్పుకుని
పొగిలి పొగిలి ఏడుస్తుంది
పసి పిల్లై గుండె బరువై ..

ఆడిపాడిన ఊరి
పొలిమెరలు తిప్పి
పూటగడవని దినాల
గతమంత విప్పి
దూపదీర్చని నదుల
పడవాట్లు సూపి
సంకెళ్లు బాసేటి
చిగురాశ నాటిన
ఆ నాన్న వేలైన
కాలేక పోతంటు
ఎగపోసి ఎగపోసి
ఎక్కిళ్ళు పట్టింది..

పెలేటి ఉరుములూ
మెరిసేటి మెరుపులూ
మేలైన పిలుపులై
నాజాడ గురుతులై
నేనీడ క్షేమమే తల్లీ
నా ప్రాణమంతా చెల్లి
బెంగేల బాగుండ తండ్రీ

[హృదయాలకు దూరమై
తపించు దేహాలను గుర్తుచేసుకుంటూ…]

పుట్టిన ఊరు కొల్లాపూర్ - వరిదేలవీధి(1960లో), ఇప్పటి నాగర్ కర్నూల్ జిల్లా. నేపథ్యం: దోయబడ్డ బాల్యం, కష్టాలు కన్నీళ్లు, ఆకలి అవమానాలే తోబుట్టువులు. చెమట సౌరభాల మడి అమ్మవడే బడిగా... తలాపున నల్లమల అడవే ఆట మైదానంగా... ఎలుగెత్తి పారే కృష్ణా నది చేతికందే దూరంలో ఉండీ గొంతు తడవని దాహంతో ఏళ్లకేళ్లు కురవని మేఘాలతో పరుగు తీసే మేకలతో, చెట్టు పుట్టలతోచెట్టా పట్టాలేసుకు సాగిన సాహచర్యం. వృత్తి: న్యాయవాదం. ప్రవృత్తి : సాహిత్య అధ్యయనం. 1978 నుండి కవిత్వం, పాట, వ్యాసం, కథా, చిత్ర, నాటిక రచన, నటన. రచనలు : 1. 'స్పందన'( కవితా సంకలనం) 1985 గద్వాల్ విరసం రాష్ట్ర సభల్లో ఆవిష్కరణ. 2. 'సేద్యం' (కవితా సంకలనం), 3. 'కఫన్' (కథా సంకలనం), 4. సాంగ్ ఆఫ్ ఫర్రోస్ (కవిత్వం) ( ఆంగ్లానువాదం: అర్విణి రాజేంద్రబాబు గారిచే), 5. 'రాహేc', 6. 'జాబిలి ఖైదు', 7. 'దగ్ధ స్వప్నం' (కవితా సంకలనాలు ప్రచురించారు.)

4 thoughts on “బెంగేల బాగుండ తండ్రీ!!

  1. ఒంటరి బాల్యపు తిప్పల కుప్పలు తెప్పలు తెప్పలుగా ఒలికాయి..బాగుంది సర్ కవిత

  2. మా సత్యం
    ఇక్బాల్ గారు రాసిన ‘ బెంగేల’ కవిత వాక్యాలను పేర్కొంటూ
    “అయినా..
    అమ్మవడిని
    అందివ్వలేని
    అసహాయతను
    మన్నించమని
    మబ్బు చాటుకు
    ముఖం తిప్పుకుని
    పొగిలి పొగిలి ఏడుస్తుంది
    పసి పిల్లై గుండె బరువై .. ”
    పద ప్రయోగం, కవిత లోని భావుకత
    అద్భుతం.

  3. మా సత్యం
    ఇక్బాల్ గారు రాసిన ‘ బెంగేల బాగుండ తండ్రి ‘ కవిత వాక్యాలను పేర్కొంటూ
    “అయినా..
    అమ్మవడిని
    అందివ్వలేని
    అసహాయతను
    మన్నించమని
    మబ్బు చాటుకు
    ముఖం తిప్పుకుని
    పొగిలి పొగిలి ఏడుస్తుంది
    పసి పిల్లై గుండె బరువై .. ”
    పద ప్రయోగంలోని కవిత లోని భావుకత
    అద్భుతం.

Leave a Reply