బుసగొట్టే బుల్డోజర్స్..!!

లెఫ్ట్ రైటుల్లో
ఫరకు ఎంతున్నా..
కాలం వొళ్ళో
జీవిత విలువలెరిగి
నెనరుతో బతికిన వాళ్ళానాడు..

ఇప్పుడేమో
ఎటు జూసినా..
సర్వ పక్షాలూ
పక్షవాతాలొచ్చి
కనకం కౌగిట్లో
ఓలలాడుతూ..

ఘడియ ఘడియా
నరహంతక
పాలక కనుసన్నల్లో
జవురుకొనే జంఝాటంలో
మునిగి తేలుతూ…

అంతే..
ఇదొక వినాశక వింతే..

ఇప్పుడిక్కడ..
రోల్ మాడల్స్ ఉండరు..!
ఎటుజూసినా
విస్థాపన దాహంతో
బుసగొట్టే బుల్డోజర్సే..!!

పుట్టిన ఊరు కొల్లాపూర్ - వరిదేలవీధి(1960లో), ఇప్పటి నాగర్ కర్నూల్ జిల్లా. నేపథ్యం: దోయబడ్డ బాల్యం, కష్టాలు కన్నీళ్లు, ఆకలి అవమానాలే తోబుట్టువులు. చెమట సౌరభాల మడి అమ్మవడే బడిగా... తలాపున నల్లమల అడవే ఆట మైదానంగా... ఎలుగెత్తి పారే కృష్ణా నది చేతికందే దూరంలో ఉండీ గొంతు తడవని దాహంతో ఏళ్లకేళ్లు కురవని మేఘాలతో పరుగు తీసే మేకలతో, చెట్టు పుట్టలతోచెట్టా పట్టాలేసుకు సాగిన సాహచర్యం. వృత్తి: న్యాయవాదం. ప్రవృత్తి : సాహిత్య అధ్యయనం. 1978 నుండి కవిత్వం, పాట, వ్యాసం, కథా, చిత్ర, నాటిక రచన, నటన. రచనలు : 1. 'స్పందన'( కవితా సంకలనం) 1985 గద్వాల్ విరసం రాష్ట్ర సభల్లో ఆవిష్కరణ. 2. 'సేద్యం' (కవితా సంకలనం), 3. 'కఫన్' (కథా సంకలనం), 4. సాంగ్ ఆఫ్ ఫర్రోస్ (కవిత్వం) ( ఆంగ్లానువాదం: అర్విణి రాజేంద్రబాబు గారిచే), 5. 'రాహేc', 6. 'జాబిలి ఖైదు', 7. 'దగ్ధ స్వప్నం' (కవితా సంకలనాలు ప్రచురించారు.)

One thought on “బుసగొట్టే బుల్డోజర్స్..!!

  1. No role models.. excellent poem on present politics

Leave a Reply