1.
అది బువ్వకుండ
ఆకాశంలోని శూన్యాన్ని
ముక్కలు ముక్కలుగా కత్తిరించి
సుట్టువార మట్టిగోడలు కట్టి
సృష్టించిన గుండెకాయ
ఆహార తయారీకి ఆయువు
జీవన వికాసానికి తొలి పనిముట్టు
మానవ యానానికి అడుగు
ఎప్పటికి అస్తమించని సూర్య మడుగు
అన్నం వండే బువ్వకుండ
అందరికీ ఆదిమతల్లి
కూర అటికనే ఆదిశక్తి
మంచిల్ల పట్వ దూప తీర్చే సల్వ
మన్నులో మట్టిని కనిపెట్టి
కసపిస మెత్తంగ తొక్కి
సారె మీద కుంభాకృతిగ చేయడం
నాగరికతకే తొలి ఇత్తనం
తొలి వంటకూ అంకురార్పణం
ఇది మానవ జాతికే సమర్పణం
పచ్చి కుండను వాముల కాల్చి
బువ్వకుండను పుట్టించిన
ఆ శాస్త్రజ్ఞుడే కుమ్మరి బ్రహ్మ
మూడువేల సంవత్సరాల కింద
సింధూ, మెసపొటేమియా సందుల
నేల తవ్వకాల కిందనే
ఈ కుండ ఆనవాలు దొరికింది.
మట్టిపాత్రలు మట్టి బొమ్మల కట్టడాలు
అందమైన ఆకృతుల కళలు
కండ్లు చెదిరే కళాత్మకత
రెండు నయనాలూ సాలని
ఘటాలు, ఘట్టాలు
అగో కుండలను దర్శిస్తే
బ్రహ్మాండం దొరుకుతుంది.
2.
కుండ అలా గాల్లోంచి
ఎగిరి వచ్చింది కాదు
అతని మస్తిష్కంలోని
చీకటి తపస్సులోంచి
మొలిచిన వెలుగు రేఖ
మన్నును పాత్రలుగ మలుసుడు
ఒక ఆహార అవసర చైతన్యమే కావచ్చు
ఆ పాత్రల్లో వండుక తినడం
ఆకలి తీర్చే చైత్యం
మన్నులోనే ఇత్తనం మొలక
మన్ను నుంచే ధాన్యపు పంట
మట్టి కుండల్లోనే బువ్వా కూర
రెండింటికీ నీళ్ళూ నిప్పే మూలాధారం
ఈ మూడే నాగరికతకు మూలకాలు
మట్టిని పెకిలిచ్చి తెచ్చి
కుండగ, కూరటికగ ఆకారం తెచ్చుట
గిర గిర తిరిగే సారే మూలం
సారె చక్రం యంత్ర సాంకేతికతకు కేంద్రం
ప్రపంచ గమనాన్నీ, పనితనాన్ని
వేగిర పరిచిన మహాసాధనం
చక్రం, ఇరుసు, లోహం
కనిపెట్టిన శాస్త్రజ్ఞులారా!
మీకెన్ని సలాములైనా సరిపోవు
రాతియుగం, లోహయుగం నుంచి
ఆధునిక రోబో తరం దాకా
అస్తిత్వం కోసం మహాతపన
సమాజ సాంకేతిక వ్యవస్థాపనే సంవేదన
ఆహారం విహారం పరికరాలూ సౌకర్యాలు
తరతరాలుగ వికసించిన విప్లవాలు
బండ మీద కాల్చిన వేట మాంసం నుంచే
కుండను సృష్టించడం ఆహా!
ఏమి ఆనాటి ఆధునికత!
మట్టికుండ నుంచి లోహపాత్రలు
ప్రెజర్ కుక్కర్ల నుంచి ఇండక్షన్ స్టౌల దాకా
ఎదగటం ఒక వర్తమాన సౌకర్యం
కులవృత్తి కూలిపోవటం ఒక విషాదం
3.
విశ్వమానవుల ఆకలి తీర్చ
బువ్వకుండ అందించే వారసత్వం
ఒక పరపరాగ ధర్మ సందర్భం
సృష్టి రహస్యం ఎంతటి మార్మికతో
కుండ సృష్టి అంతటి క్రియాత్మకత
మట్టి చేతుల నుంచే మహా పాత్రలకు
మట్టితోనే జీవం పొయ్యడం ఒక ఆవశ్యకత
ఆకలి కోసం బువ్వ కుండ వానుడు
కూర కోసం కూరెస్ల సరుసుడు
దూప కోసం కూజను చేసుడు
రొట్టెపెంక రూపు పొద్దుపొడుపే
కళ శ్రమ కలెగలిపిన పరిశ్రమ
వేల ఏళ్ళుగ జీవుల కోసం పరితపన
ఏ నేలలో పాత్రౌచిత్యం దాగుందో
పరిశోధనతోనే పని సురువు
కుంట నుంచి మట్టిని తెచ్చి
రెండు రోజులు వాకిట్ల ఎండబెట్టి
పెల్లలు పెల్లలుగా దంచి నాన్చుడు
తగినన్ని నీళ్ళు తడుపుతూ
నాన్చి నాన్చి రొట్టెపిండి లెక్క చేసుడు
ఒగ తొక్కుడు కాదు, ఒగ పిస్కుడు గాదు
పెద్దెగెలివారంగ నుంచి పొద్దుపొడిచే దాక
కాళ్ళు గుంజంగ, మన్ను ముద్ద కాటుక కావాలె
గుబ్బిగడ్డ మీద సారెను నిదానంగ నిలిపి
సారెకోల కట్టెతోని నెమ్మదిగ తింపుడు
బొడ్డు సమరుతోనే సునాయసమైన వేగం
సారె పీఠం మీద ముద్దలు ముద్దలుగా మన్ను
బలంకల్ల చేతుల్ల సింగారంగ వానుడు
నున్నటి గుండ్రని ఆకారం వచ్చేట్టుగ
మనుసులనే కలగని ఊహించి
కొత్త మట్టి పువ్వులను పూయించుడు
మన్ను పండ్లనూ పండించుడు
మన్ను మహత్యం మందికి చూపించుడు
అదొక సుతారమైన చేతివేళ్ళ పనితనం
అదొక సున్నితమైన సృష్టి కార్యం
అతని చేతులకు చెయ్యెత్తి నమస్కారం
4.
కుండ రూపుదాల్చడం అంటే
మన్నులో ప్రాణవాయువు నింపడం
ఇదంతా పాత్ర చమత్కారం
సారె మీద కుండాకార పిండం పొందినంక
పుట్టిన పసిగుడ్డు లెక్క మురుసుడు
దించి కైనీడకు ఎండబెట్టి
ఇచ్చుకపోని గట్టితనం దాకా ఆరనియ్యాలె
పూర్ణకుంభం కోసం
పైకి మలిచిన ఒక కాలు
సకిలం ముకులంతో
గొర్రతోలు మీద కూకున్న దృశ్యం
శ్రమ తపస్విలా కన్పిస్తది.
కుండ పిండంకు ప్రాణం పోయడం కోసం
ఉపరితలం మీద సలపతో సరుస్తూ
లోపల మసి సల్లుకుంట
రౌతుతో నమోనగ అదిమి పట్టాలె
అప్పుడు సృష్టికారుని ఓర్పరితనం ధనిస్తది.
అనుకున్న తీరుగ వచ్చేదాకా సరుస్తుండాలె
నడుమ నడుమ తడిపిడుగ తేమ
నున్నగంటు సలప చిన్ననున్న రాయి
సమన్వయ సవ్వడితోనే అందమైన ఆకారం నవ్వుతది
ఎండిన కుండలన్నీ ఒకే దగ్గర చేర్చి
వాములో పేర్చుడు కాల్చుడు మహానైపుణ్యత
కుండ మీద కుండలు బ్రహ్మాండంగ బోర్లించాలే
పల్గద్దు కూలద్దు బహు నేర్పు నిర్మాణం
వాము లోపల పొరుక కట్టెలు పెట్టి
వాము మీద మన్ను అసలు నేర్పాలె
నిప్పు అంటు పెట్టి నిగురానుగ ఉండాలె
పంగల కట్టెతో నిప్కలకు అగ్గి రాజేయాలె
తెల్లందాక వాము అగ్గి గుండమైద్ది
తెల్లారే వరకు వాము నిండా కుండలు
ఎర్రని పువ్వులై ధగ ధగ మెరుస్తయి
నిగనిగ మెరుస్తూ కణ కణ ధనిస్తయి
సృష్టికారుడు మాత్రం ఎల్లవేలలా
పగిలిన కుండ వలెనే బొక్కు బొక్కుమంటాడు
నొసటి చెమటను తల రుమాలుతో
తూడ్చుకుంట బీరిపోతాడు
5.
శూన్యానికి రూపం లేకపోవచ్చు
అదొక రకరకాల ఆకృతుల మాయావి
కుంభకారుడు మన్నుకు జీవం పోసి
వంటింటి పాత్రల్ల ప్రాణమై నిలుస్తడు
ఇంటి మీద గూన కప్పుగ చల్లని నీడై నిలుస్తడు
రకరకాల పేర్పులు దొంతులు
కందులు పెసల్లు మక్కలు నువ్వులు
దాసపెట్ట తావు సూపెడుతడు
గరిగబుడ్డి అయిదేండ్లు కురాడి కుండలు
లగ్గం నాగెల్లి ఇండ్లల్ల దీవెనార్తుల ఆనవాల్లు
బోనాల పండుగంటే కుండల కుంభమేళ
పులకరించిన పట్నం పల్లెల గౌరాంతం
అదంతా ఆడబిడ్డల భక్తి ప్రతిపత్తి
ముంతలు కడుముంతలు చిప్పలు కాగులు
గాజబొత్తలు దీపంతలు, గోలాలు
లొట్లు బింకులు పూలకుండీలు ఒక్కటేమిటి
మంటి పొయ్యిల నుంచి మంగులం దాకా
నీళ్ళ ఒత్తు నుంచి, దాలిల పాలకుండ
కుమ్మరి సృష్టి లేని ఇల్లులేదు వాడ లేదు
పచ్చడ పట్వ లక్ష్మీదేవి కుండ కూరాటి కుండ
గల్ల గురిగి బొడ్డు గురిగి తాబేలు బుర్ర
ఏ గురిగి, గూనపెంకైనా నేలలోనే పుట్టుక
మట్టి మనిషి చేతిల పోసుకున్న దాని ప్రాణం
చావు పుట్టుకా కుండ లేనిదే పూర్తి కాదు
పుట్టంగనే మాయతీసి ఏసేది ముంతలనే
మాయ ముంతను దాసేది కొలిగుంటలనే
మన్నులోకి మన్ను ద్వారనే
మనుజుని మాయ పయణం
చావగానే అగ్గిపట్టేదీ మన్ను కుండలనే
అంతిమయాత్ర ముందే అగ్గికుండ నడక
మన్నులోంచి మంట్లే కలిసేదాకా
మట్టి పాత్రల మహత్యమే ఇదే
కుమ్మరి మన్ను ఒక చరిత్ర పరిమళం
కుమ్మరి కుండా ఒక మహత్తర భాండం
మరి బ్రహ్మ పరిస్థితి ఏమిటి
మట్టిలో కుమ్మరి పురుగై తిరిగిన ఆయన
బూడిదలో బూడిదై మెదిలిన ఆయన కాయం
ఇప్పుడు ఇచ్చుకపోతున్న బోనం
6.
ఊరందరికి బువ్వకుండ కూరెస్లలు పంచుట
ఒక సాంస్కృతిక వితరణ శీలత
ఊరూరిలో ఊరికొసకే కుమ్మరిండ్లు
చెరువు కట్ట పొంటే పొందిచ్చినట్టు
పెత్తందార్లకు అసంత దూరంగానే
బహుజనులకు కసంత దగ్గరి సోపతి
కుమ్మరివాడంటేనే చేతివృత్తుల వేదిక
ప్రపంచ నాగరికతకు కర దీపిక
ఒక దగ్గర నీరెండకు ఎండుతున్న కుండలు
మరో వాకిట్ల నానిన కమ్మని మన్ను వాసన
ఇంకో దగ్గర సరుస్తున్న సలపల ధ్వని
మరో ఇంట్ల గిరగిర తిరిగే సారెల సవ్వడి
సారె సారెకూ రూపుకడుతున్న ఆకృతులు
ఆ వాడలోనే జీవగంజికి ఇసిరె దొరికింది.
చింత చెట్ల కింద ఆడబిడ్డలు కూకోని
ముచ్చట్లు పెడుతూ గూన అతుకుతున్న దృశ్యం
ఇంటి పెరట్ల మండుతున్న వాము మంటలు
కాలుతున్న కుండల కమ్మటి వాసన
వాము వేడికి సేద తీర్సుకుంటున్న బ్రహ్మ
చినుకు రాలిన్నాడైతే పచ్చికుండలు
ఇండ్లల్ల మోసే హడావుడి
కులవృత్తి ఇంటిన్ రాజులకు ఇలవర్సె
ఆ కుటుంబాలకు మట్టి మహాప్రసాదం
ఊరంతా కుండానుబంధం వల్ల
మనిషి మనిషికీ ఘట బ్రహ్మ ఆత్మీయుడే
ఎండలు జర ముదురుతే సాలు
రంజను కోసం కాళ్ళన్నీ కుమ్మరివాడకే
నీళ్ళ పట్వ కావాలని పడిగాపులు
దీపావళికి దీపంతల పిలుపు
ఉగాదినాడు వాకిలి నిండా
పచ్చటి పట్వల పంచాంగం
పెండ్లి కుండలకు పట్టిన వొల్లెడ ఒక కీర్తి
ఐరేని కుండలమీద చిత్రకళలు
అజంతా ఎల్లోరాల నుంచి వచ్చిన వారసత్వం
ఆ చేతి వేళ్ళ నుంచి రాలిపడే
జాజురంగు బొమ్మల సింగారమే వేరు
కూరాడు నీరాడు కుండలు ఇంటింటి ఇల
కుండల కలి కలిపితేనే పుల్లలు పుల్లల బువ్వ
కూరాటి కుండ వంటింటి కల్పవల్లి
మట్టి పనంటే ఎల్లవేలలా పర్యావరణ బంధమే
జీవితాలు మాత్రం పలిగిపోయిన పెంకాసులు
కడుపులో అనునిత్యం ఆకలి నకనకలు
7.
చరిత్రకు ఎక్కడైనా పరీక్షలే పరమావధి
నాణాలు శాసనాలు మట్టి ఆకృతులే ఆధారాలు
కోటిలింగాల హరప్పా మొహంజోదారో తవ్వకాలు
ఎక్కడ ఎల్లినవైనా కుమ్మరి పెంకలే
నాగరిక వికాసానికి అవే ఆనవాల్లు
చరిత్ర వయస్సు నిర్ధారణకూ గీటురాళ్ళు
ప్రాచీన చరిత్రలోనూ తొలి పని మట్టిపనే
మన్ను జీవితమే అసలైన జీవితం
ప్రపంచీకరణ మాయకన్న ముందు నుంచే
కులవృత్తి కునారిల్లుడు మొదలైంది
గ్లోబలీకరణ డేగ చూపులకు అన్ని వృత్తుల్లానే
కుండలు వానడం పురాగ ఆగిపోయింది
మట్టి మహిమ స్థానంలో స్టెయిన్లెస్ స్టీల్
కుండల స్థానంలోకి కుక్కర్ విజిల్లు
మట్టిని లోహం పురాగ మింగింది
అయినా మన్ను పరిమళం మిగిలే ఉంది
కళాత్మకతలో ఉత్పాదకత దాగి ఉన్న కులకశ్పి
చేతి వేళ్ళ నుంచే ఆణిముత్యాల్లాంటి
కుండలు గురుగులు గూనలు రాలిపడుతయి
చేతి పనులన్నీ కవిత్వం అల్లినట్లే
అందంగా నులక మంచం నేసుడు
నూలు పోగుల అల్లికలతో రంగు రంగుల చీర
పసురం తోలుతో కిర్రు చెప్పులు ముడుసుడు
తాళ్ళు పగ్గాలు దందెడ్లు వడివడిగా పేనినట్టుగ
బాడిశతో నాగండ్లు అమెరిచ్చుడు
కర్రు, గడ్డపారకు మొన పెట్టినట్లుగనే
వ్యవసాయదారులు తినే దినుసులు పండిచ్చినట్లుగ
సకల కుల వృత్తులు ఊరూరి సూర్యులు
ఊరు పరస్పర సామాజిక సేవల వాకిలి
ఉత్పత్తి సేవలు ఒక సామాజిక సన్నివేశం
సమాజానికి బహుజనులు అందించిన బహుమానం
తరతరాలుగా కొనసాగుతున్న వారసత్వం
మట్టి నుంచే ప్రపంచానికి పట్టెడు ధాన్యం
మట్టే వస్తు సేవలకు మూల్యాంకనం
మట్టి కుండతో మొదలైన మనిషి జీవితం
మట్టి కుండతోనే అగ్గిల మాయం.
ఆయన ఘట బ్రహ్మ అయితే.. మీరు అక్షర బ్రహ్మ..!! మీ రచనా వైదుష్యం గూర్చి ఎంత పొగిడినా తక్కువే
చేతి వృత్తులపై ఆలోచనాత్మక కవితా అభినివేశం.. అభినందనలు.. కృతజ్ఞతలు..!!