బీసీవాద కవిత్వం – ఒక పరిశీలన (2009 వరకు)

వ్యక్తి, వ్యవస్థ, సంస్థ ఏదైనా తన ఉనికిని కాపాడుకునే ప్రయత్నం చేస్తాయి. సామాజికంగా ఉనికి సంఘర్షణను, ఆ సంఘర్షణ మూలాన్ని విశ్లేషించడానికి మనిషి చేసే ప్రయత్నం అస్తిత్వ ఉద్యమాలకు బీజావాపనం చేస్తుంది. ఈ అస్తిత్వ ఉద్యమాలు 1980 – 90 దశాబ్ది కాలంలో స్ఫుటంగా మొదలై, తీవ్రంగా వెల్లువెత్తాయి. అందులో భాగంగానే భావ ప్రసారానికి అనువైన అనేక సాహిత్యోద్యమాలుగా రూపుదాల్చాయి. వాటిలో బీసీవాద సాహిత్యం ఒకటి.

బహుజనుల చైతన్యం కోసం కొన్ని తరాలనుండి కొంతమంది పోరాటం చేస్తూనే ఉన్నారు. వారిలో స్మరించుకోదగినవారు జ్యోతిరావుపూలే వంటివారు. అంబేద్కర్‌ ఒక పుస్తకాన్ని పూలేకి అంకితం ఇస్తూ రాసిన ‘‘విదేశీ పాలకుల నుండి విముక్తి సంపాదించడంకంటె, సాంఘిక ప్రజాస్వామ్యాన్ని సాధించడం ముఖ్యమని మహత్తరమైన సందేశాన్ని అందించినవారు…’’ అంటూ పూలేను ఉద్దేశించి చెప్పటం గమనించదగిన ప్రధానాంశం. ఈ మాటల ద్వారా పూలే బహుజనుల బానిసత్వపు విముక్తి కోసం, చైతన్య పోరాటం కోసం చేసిన కృషి ఎంతగొప్పదో ఊహించుకోవచ్చు. ఇక్కడ బహుజనులు అంటే దళితులు, బీసీలు అని అర్థం. ఈ విషయాన్ని కాలువ మల్లయ్య ఇలా స్పష్టపరచినారు.‘‘బహుజనులు దళితులు ఒక్కరే. అందు వల్ల బహుజనులు, దళితులు సమానార్థక పదాలు. ఈ విషయాన్ని గుర్తించకుండా ఎస్సీలను దళితులుగా, బీసీలను బహుజనులుగా పేర్కొంటూ వీరి మధ్య దూరాన్ని పెంచడం సరైంది కాదు’’ (బహుజనరాజ్యం.2019). ఈ ఉద్దేశ్యంతోనే జి. క్ష్మీనర్సయ్య ‘చిక్కనవుతున్నపాట’ ముందుమాటలో ‘‘ఈ కవులు తమ సొంత అనుభవాల మాలల్ని కూర్చుకుంటూ, సొంత కన్నీటి పాళీలను సానబెడుతూ రాసిన కవిత్వమే దళిత కవిత్వం’’ అని రాసారు. ఇక్కడ ‘ఈ కవులు’ అంటే వారి దృష్టిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం కవులని అర్థం. ఇందుకు భిన్నంగా ఈ విషయాన్ని పట్టుకుని సతీష్‌చందర్‌ ‘పాట’కు పరాయి పల్లవి’ (ఆంధ్రప్రభ, 8 మే 1995) అనే వ్యాసంలో ‘‘ఇక ‘వాడ’లోని అంటరానివాళ్ళ అనుభవాల విషయానికొస్తే అవి అగ్రహారానికి ఎంత దూరమో బీసీలపేటకీ అంతేదూరం. వెన్నుతట్టే వెనకటి కాపు ‘హరిజనోద్ధరణ కవిత్వం’ మళ్ళీ పులుపు చావని బీసీ కవులు రాయనవసరం లేదు’’ అని నిర్మొహమాటంగా చెప్పారు. అంతేకాదు అదే వ్యాసంలో ‘‘బీసీ కవులూ, విమర్శకులూ తమలోని ‘పులుపు’ను చంపుకోవాలి. గాయాలను ధైర్యంగా బయటపెట్టగలగాలి. ‘ఎస్సీల కన్నా తాము ఒక మెట్టుపైన’ అనే నడమంతరపు అగ్రవర్ణత్వపు ముసుగును చించి అవత పారెయ్యాలి…’’ అని సవాలు విసిరారు. ఈ మాటలను ఛాలెంజ్‌గా తీసుకొని అప్పటి వరకు దళితవాద సాహిత్యంలో అంతర్భాగంగానే ఉన్న బీసీవాద సాహితీ కారులు వేరుగా కవిత్వం రాయడం మొదలు పెట్టారు. కొంతమంది ప్రతివిమర్శ చేసారు. ఏదిఏమైనా దళితలు మాత్రం ‘బీసీలు వేరు’ అనే ఆలోచనతోనే వారి సంబంధిత సాహిత్యాన్ని విస్తృతంగా సృజించడం, విశ్లేషించడం ప్రారంభించారు. బీసీలు అంతవేగంగా ప్రయత్నం చేయడం లేదనేది చెప్పక తప్పదు. కొన్ని సంస్థలు ఒక అడుగు ముందుకు వేసి ‘దళిత బహుజనవాద కవిత్వం’ అనే పేర్లతో సంకనాలు తెచ్చాయి. వాటిలో ‘నీలిసాహితి’ సంస్థనుండి ‘మేమే’, ‘మొగి’ అనే సంకలనాలు రాగా, ‘నీలగిరి సాహితీ’ సంస్థ నుండి ‘బహువచనం’ (1996) సంకలనం మొదలైనవి ‘దళిత బహుజనవాద’ వచన కవితా సంకనాలుగా వచ్చాయి.

పూర్తిగా బీసీవాద కవిత్వంగా మొత్తం తెలుగుసాహిత్యంలో ‘వెంటాడె కలాలు – వెనకబడ్డ కులాలు’ (2002) అనే సంకలన గ్రంథం జూలూరు గౌరీశంకర్‌ సంపాదకత్వంలో వెలువడింది. ఈ పుస్తకానికి ప్రసేన్‌, జూలూరు గౌరీశంకర్‌ రాసిన ముందుమాటలో ‘‘దళితోద్యమకారులు బీసీలను తమతో కలుపుకుపోవడానికి నిరాకరించినప్పటికీ సహానుభూతికి, స్వీయానుభూతికీ తేడా వుండదని నిరూపించే క్రమంలో ఉద్యమ జైత్రయాత్ర చేరుకున్న డెడ్‌ఎండ్‌ గోడలను పగలగొట్టే ఊతం ఈ వెంటాడే కలాలు..’’ అని రాసారు. ఈ మాటల ద్వారా బీసీవాద కవులు దళితవాదం వారితో కలిసి ఉండాలని అనుకున్నప్పటికీ దళితవాద కెరీరిస్టుల మాటలతో విసిగిపోయి ప్రత్యేక బీసివాద కవిత్వానికి ప్రయత్నం చేసారని అర్థమౌతుంది. పరోక్షంగా బీసీ కవిత్వం వేరని చెప్పే ప్రయత్నంగా ‘‘దళిత కవిత్వానికి లేని అంతర్జాతీయ చైతన్యం ఈ కవులకు వుంది. దళిత కవిత్వానికి లేని క్రమశిక్షణ ఈ బీసీ కవులకుంది’’ అని అదే పుస్తకం ముందుమాటలో స్పష్టం చేసారు. ఏదేమైనా ఈ వాదోపవాదాలలో వెలువడిన ఈ ప్రత్యేక బీసీవాద కవిత్వానికి తెలంగాణ ప్రాంతీయులే సంపాదకులుగా ఉండడం, అందులో కవిత్వం రాసిన 23 మంది కవులలో తెలంగాణవారే పదిహేను మందికి పైగా ఉండడం తెలంగాణ ప్రాంతం పరంగా చెప్పుకోదగ్గ అంశం.

బీసీలు తెలంగాణలో ఎవరు? ఏం చేస్తారు అనుకున్నప్పడు బి.ఎస్‌.రాములు గారి మాటలు గుర్తుచేసుకోవాలి. ‘‘బీసీలు అంటే ప్రధానంగా చేతివృత్తులు, కులవృత్తులు, సేవావృత్తులు చేస్తూ శతాబ్దాలుగా సమాజంలో, చరిత్రలో కీలక పాత్ర పోషిస్తున్న సమాజ నిర్మాతలు. సంపద సృష్టికర్తలు…’’ (బీసీకథలు ఒక విశ్లేషణ. పుట.19) సాహిత్యంలో చేతివృత్తులు, కులవృత్తులు, సేవావృత్తులు వారిని గురించి తెలిపిన విషయాలను, స్థితిగతుల గురించి బీసీరచయితలు, బీసీయేతర రచయితలు కూడా సాహిత్యాన్ని సృష్టించారు. వారిలో ఎక్కువగా బీసీ రచయితలు వారివారి కులవృత్తుల విధ్వంసాలను, ఆర్థిక పరిస్థితులను, వారిపై ఇతరుల దళారి వ్యవస్థలను, దౌర్జన్యపు ముర్ఖత్వాలను గురించి చెప్పుకున్న విషయాలు కనిపిస్తాయి. దీనితో పాటు బీసీలు సంఘటితం కావాలనే వాక్యాలు కూడా కనిపిస్తాయి. ప్రముఖ రచయిత నందిని సిధారెడ్డిగారు అన్నట్లు ‘‘కాలాను గుణంగా వచ్చిన మార్పులు, వృత్తుల సంక్షోభం, విధ్వంసం, వలసలు, వృత్తుల మార్పుల సాహిత్యరూపం తీసుకున్నాయి. ప్రత్యేకించి ఆ యా వర్గాలనుంచి వచ్చిన సృజనకారులు తామనుభవించిన క్షోభను బలంగా అక్షరాల్లో చిత్రించారు. పాతతరానికి కొత్తతరానికి మధ్య సంధి దశను, ఆ దశలోని అనివార్య సంఘర్షణను రచనలుగా మలిచారు. దేశీయ సాంకేతిక పరిజ్ఞానం మీద ఆధారపడిన తెలంగాణలో సామాజిక వర్గాలు ఆచరించిన పని, స్థితిగతులు సాహిత్యం ద్వారా అధ్యయనం చేయవచ్చు’’ (కులవృత్తులు తెలంగాణ సాహిత్యం.2008 పు.4). పైన పేర్కొన్న సామాజిక వర్గాల క్షోభను అర్థం చేసుకోవడానికి ఉపయోగ పడే సాహిత్యమే ఈ బీసీవాద సాహిత్యం. ఏ రచయిత అయినా ముందుగా సిద్ధాంతాలు ఊహించుకొని, ఆ తర్వాత వాటిని అభివ్యక్తం చేసే మార్గాలకోసం అన్వేషించడు. అంతా దీనికి వ్యతిరేకంగా జరుగుతుంది. ఇటువంటి సాహిత్యం మీద ఇంకా కావల్సినంత అధ్యయనం, జరుగవలసినంత అనుశీలనం జరగలేదు. ఈ వ్యాసం ఒక ప్రయత్నం మాత్రమే.

బీసి సాహిత్య ఉద్యమం ప్రారంభంనాటికంటే పూర్వం కూడా బీసిలకు సంబంధించిన సాహిత్యం ప్రాచీనకాలం నుండి కనిపిస్తుంది. తెలంగాణ సాహిత్యంలో పాల్కూరికి సోమనాథుని ‘పండితారాధ్య చరిత్ర’ నుండి బీసీ కులాల ప్రస్తావన అక్కడక్కడ కనిపిస్తుంది. కావ్యాలు, కథలు, నాటకాలు, ఒకటిరెండు నవలలు వచ్చాయి. ప్రత్యేకంగా పల్లా దుర్గయ్య ‘గంగిరెద్దు’ (1956) పద్య కావ్యం పూర్తిగా గంగిరెద్దుల కులంవారి కష్టాలను, బిక్షాటన స్థితిని, ఒక ఎద్దుమీద ఆధారపడి బ్రతుకుతున్న కుటుంబాన్ని చిత్రించారు. బిచ్చంకోసం గంగిరెద్దులవారు ఆ ఎద్దుతో చేసే సాహస కృత్యాలను హృద్యంగా వివరించాడు. ఆ సమయంలోనే గూడూరి సీతారాం ‘నారిగాడి బ్రతుకు’ లో గౌడజీవితాను చిత్రించారు. పి.వి.నరసింహారావు ‘గొల్లరామవ్వ’ (1949) కథలో యాదవ జీవన స్పృహ కనిపిస్తుంది. అల్లం రాజయ్య ‘శివ సత్తి శక్తి’ (1973) కథలో యాదవులపై వివిధ అధికారులు చేస్తున్న దోపిడి, వారిపై జరిగిన తిరుగుబాటును చిత్రించారు. బీసీల ఇతివృత్తంతో ప్రారంభంలో కొన్ని నాటకాలు కూడా తెంగాణలో వచ్చాయి. సుంకర సత్యనారాయణ, వాసిరెడ్డి సత్యనారాయణలు రాసిన ‘మా భూమి’ (1947) నాటకంలో యాదవ కులానికి చెందిన యల్లమంద పాత్రతో యాదవులకు జరుగుతున్న అన్యాయాలను చిత్రించారు. లోక మలహరి ‘సంఘము’ (1955) నవలలో పద్మశాలీలపై గ్రామాధికార్ల దౌర్జన్యాలు, నేత మిల్లులు పుట్టుకచే చేనేత పనికి దెబ్బతగిలి పారిశ్రామికులు బట్టా – పొట్టకు నానా బాధలు పడటం, బొంబాయి బట్టల మిల్లుల ఉద్యోగాలు, పద్మశాలీల సహకార సంఘాలు ఇత్యాదులన్నింటిని సమగ్రంగా పరిశీలించి నేత జీవితాలను చిత్రించిన నవల సంఘము. ‘‘పద్మశాలీల గతి మిక్కిలి అధ్వాన్నంగ వున్నది దొరా! ఒంటిపూటకైన సరిగ్గా కూడు దొరుకుతలేదు. గిరాకులు లేవు. ఏదో కొంత వున్నా లాభము లేక! నానా పాట్లు బడుతున్నారు. అన్నమో రామచంద్రా అన్నట్లున్నది గతి…’’(పు.87) అనడం ద్వారా అప్పటి వారి పరిస్థితులు అర్థంచేసుకోవచ్చు. ప్రత్యేకంగా తెలంగాణ కవులనుండి వెలువడిన ‘గోలకొండ కవుల సంచిక’లో పదిమందికి పైగా బీసీ రచయితలు రాయడమే కాకుండా బీసిలకు సంబంధించిన సాహిత్యం కూడా పొందుపర్చారు. ఉదాహరణకు ‘గొల్లడా…!’ అనే శీర్షికతో కేశవపంతుల వేంకట నరసింహశాస్త్రి గారి 5 పద్యాలు కనిపిస్తాయి.

తెంగాణలో వారి పద్యాల ద్వారా ప్రసిద్ధి చెందిన సిద్దప్ప వరకవి వారికుల వృత్తిని గురించి రాసుకున్న మంచి పద్యం.
కుమ్మరాతడు జేయు కుండలు నవికొన్ని
చేయుచుండగ బోవు చేతిలోన
కొన్ని సానముమీద కొన్ని చాటునబోవు
కాలి నావము కొన్ని కూలిపోవు
కొన్ని క్షేమము బొంది కొన్నాళ్లకును బోవు
కొన్ని బిన్నములయ్యి కొంతబోవు
కొన్ని యుర్విలో బోవు కొన్ని వనమున బోవు
కొన్ని మృతికిబోవు కొరివి నుండి
మానవులు మంచిపాత్ర మరియాద రీతి
ఐక్యమయ్యెదరు నిటుల అవని విడిచి
వినుడి మాయప్ప సిద్దప్ప విహితుడప్ప
కనుడి కరమొప్ప కవికుప్ప కనకమప్ప’’ ఇలాంటివి అస్తిత్వ ఉద్యమాలకంటే ముందే తెలంగాణ ప్రాచీన సాహిత్యంలో బీసీవాద కవిత్వం వచ్చిందని చెప్పుకోవచ్చు.

ప్రారంభం నుండి ఇప్పటివరకు బీసి సాహిత్యం ఎక్కువగా వచనకవిత రూపంలో వచ్చినట్లు కనిపిస్తుంది. 2000 సం॥నుండి ఒక దశకంలో అనేక కవితా సంకలనాలు వచ్చాయి. వాటిలో తెలంగాణ ఉద్యమంతో పాటు బీసి వృత్తులు, వారి స్థితి గతుల కవితలు కనిపిస్తాయి. అటువంటి వచన కవితా సంకలనాలు ‘బహువచనం’ (1996), ‘వెంటాడే కలాలు – వెనుకబడిన కులాలు’ (2001), ‘ఎడపాయలు’ (2001), ‘పొక్కిలి’ (2002) ‘చెమ్మస్‌’ (2005), ‘కలాలు – గళాలు’ (2006), ‘తెలంగాణ కవిత’ (మూడు సంపుటాలు 2007, 2008, 2009) ‘అనేక’ (పదేళ్ళ కవిత్వం 20002009), దశాబ్ది కవిత (20012010) వంటి సంపుటాలు. ఇవిమాత్రమే కాకుండా వ్యక్తిగత కవితా సంకనాలు ఎన్నో ఎన్నెన్నో వచ్చాయి. వాటిల్లో నుండి ఉదాహరణు కొన్నింటిని తీసుకుని ఈ వ్యాసంలో పొందుపర్చే ప్రయత్నం చేసాను.

వ్యవసాయానికి దున్నే నాగలి నుండి కోసె కొడవలి వరకు, మనిషి అలంకారానికి కాలిమట్టె నుండి తాళిబొట్టు వరకు, దేవునిగా కొలవడానికి కట్టెబొమ్మ నుండి కంచు విగ్రహం వరకు సకల కళలకు ప్రాణంపోసి అందించే వారు విశ్వబ్రహ్మణులు. వీరి జీవితాలకు దర్పణం పట్టే ‘కుంపటి’, ‘బహుజనం’ అనే కవితలో బాణాల శ్రీనివాసరావు కుంపటిని వారి ఇంటికి వెలుగుగా, వారి బతుకులకు దిక్సూచిగా, వారి తండ్రికి, తాతకు, కులవృత్తికి నిశానీగా చెప్పుకుంటాడు. గ్రామ స్త్రీలు ధరించిన నగను చూసినప్పుడల్లా వారి తండ్రితో మాట్లాడినట్లుంటుందంటారు. ఈ రచనలలో కులవృత్తికి సంబంధించిన కష్టసుఖాలను కళ్ళకు కట్టినట్లు చిత్రించాడు. ‘తుదిశ్వాసలు’ కవితలో ఎస్‌.రఘు ‘‘ఊపిరి తిత్తుల్లోని శక్తినంతా కూడదీసుకుని / కుంపటి ఊదావు / బతుకును రాజేసుకోలేక / తుదిశ్వాస ఊదేసావు…’’ అంటూ ఎందరికో మంగళ సూత్రాలు, తయారు చేసి ఇచ్చిన వాడు తన భార్యమెడలో మంగళసూత్రం అమ్ముకోవాల్సి వచ్చిన తీరును చెప్తాడు. ఉంగరాల మీద లక్ష్మీదేవి బొమ్మలు చెక్కినా ఆ లక్ష్మిమాత్రం ఆ వృత్తివారి మీద కరుణచూపట్లేదంటూ వారి కష్టాలను వర్ణించి తీరు హృదయాలను కదిలిస్తుంది. దాసోజు కృష్ణమూర్తి ‘స్వర్ణకారుడు’ కవిత ‘‘కుంపట్ల నిప్పుజేసి మట్టి మూసబెట్టి / ఆండ్ల పన్నెండోవన్నె బంగారంబోసి / ఊపిరి తిత్తుల సరం గాలి జేసి…’’ అంటూ సాగుతుంది. ‘యాడీ, మనెమార్నాక్‌’ కవిత దెంచనా శ్రీనివాస్‌ విశ్వకర్మలు వారి వృత్తిలో భాగంగా ఇతర కులాలవారితో కలిసి మెలిసి ఉండే తీరును తెలుపుతుంది. ఆడెపు లక్ష్మణ్‌ ‘కొలిమి’ లో వారి కుల వృత్తి దూరమైన తీరును చిత్రించారు. జూలూరు గౌరీశంకర్‌ ‘కల్జలు’ కవితలో ‘‘నే కొలిమి తిత్తి గొంతుకనై / వూదీవూదీ / మంటకు మాటలు నేర్పాకేగా / చరిత్ర ప్రసవం…’’ అంటూ సమాజ జీవన నిర్మాణ వికాసంలో వారి వృత్తి ప్రాధాన్యతను తెలుపుతాడు. అన్నవరం దేవేందర్‌ రాసిన ‘మావూరు’ కవితలో ఇప్పటి ప్రపంచీకరణలో వడ్లకమ్మర్ల వృత్తులు ధ్వంసమైన విధానాన్ని ‘‘ఎలుగటి నాగలి చెక్కే పెద్ద బాడిస అటకెక్కింది / పెద్ద కచ్రం నొగలు చేసే పెద్దేగి కర్ర ఏదీ?…’’ అంటూ వాపోతాడు.

పొద్దస్తమానం ప్రకృతితో అతి ఎక్కువగా మమేకమై శ్రమిస్తూ సమాజానికి పాలు, పెరుగు, మాంసం, ఉన్ని అందిస్తున్నవారు యాదవులు. వీరిని గురించి బెల్లియాదయ్య ‘నేను గొర్రెల్ని కాస్తుంటాను’ కవితలో పూర్తిస్థాయి జీవితాన్ని తెలిపే ప్రయత్నం చేస్తాడు. ‘‘నేను గొర్రెల్ని కాస్తుంటాను / మంద నా గురుకులం / తాత తండ్రులు నా ఉపాధ్యాయులు / కొండకోన నా తరగతి గది…’’ గొర్రెల, మేకల మందతోనే జీవితాన్ని కరిగించుకునే కులంవారు యాదవులంటారు. టి. కృష్ణమూర్తి యాదవ్‌ ‘యదువంశ పుత్రులం’ (శబ్నం.2000) లో ‘‘ఎడమ చేతికి పొంచి కట్టి / తలరుమాలు చుట్టుకుని / గొడ్డలి చిప్పచేత పట్టి…’’ అంటూ ప్రారంభమైన కవిత యాదవుల జీవిత విధానాన్ని, కష్టాలను, సంస్కృతిని, ఉత్పత్తిని గురించి వివరించింది. ‘బహుజనం’ కవితలో బాణాల శ్రీనివాస్‌ ‘‘ఆరుగాలం ఎండలో దుబ్బలో / జీవాల్ని మేపిమేపి / ఆదివారం నోళ్ళకు అమృతం అందించిన / మస్తుగా తినేది మీరాయే / పస్తులుండేది మేమాయే…’అనే కవితద్వారా యాదవులు తినకుండా ఆర్థిక సౌలభ్యంకోసం మాంసాహారుల సుష్టుభోజనం కోసం గెర్రెలు, మేకలు అమ్ముకుంటున్న తీరును చెప్పారు. అట్టెం దత్తయ్య ‘కాపరి’ కవితలో ‘‘ఆకాశం తను కొప్పెరగా మలచి / కప్పుకున్న గొంగడి / తొవ్వలు తన పాదాలు / తొడిగిన చెప్పులు/ కాలం తన కళ్ళముందు మేస్తూ నడుస్తున్న గొర్రొలు…’’అంటూ యాదవుడు ఒక కాపరిగా అనుభవించే బాధను కవిత్వీకరించాడు. ‘గొంగడి గోస’ కవితలో భైతి దుర్గయ్య యాదవుల బ్రతుకును వ్యక్తీకరించాడు.

సమాజంలో సకల జనులకు వస్త్రాలను అందిస్తున్న వారు చేనేత కులంవారు. వారిని గురించి ఎన్‌.గోపి ‘ఓ రాజయ్య కథ’ అనే కవితలో ‘‘లోకాన్ని జలతారు ముసుగులో కప్పిన వాడికి / పిర్రలమీద ధోతి చిరుగులెందుకున్నయో కూడా మనకు తెలుసు…’’ అంటూ నేతవృత్తి వారి బ్రతుకు ఛిద్రమౌతున్న విధానాన్ని తెలుపుతాడు. ఆడెపు లక్ష్మణ్‌ ‘బెంగపెట్టుకోకు’ కవితలో ‘‘ఇవ్వాళ్ళ / నీ పుట్టిన రోజని బెంగపెట్టుకోకురా కన్నా / చేనేత సమ్మెట పోటు డొక్కలో / ఈడిసి కొడుతున్న బాధ భరించలేనపుడు…’’ అంటూ కొడుకు పుట్టినరోజును కూడా జరుపుకోలేని లేమిని, వారి పూర్వ తరాలనుండి వస్తున్న పరిస్థితులను వ్యక్తపరుస్తాడు. ‘‘తెల్లారె పొద్దూకె / వయసంతా మగ్గం గుంటల ఇంకిపోయె / నరాలు తెలిపాయె…’’అను ‘పోగుల గూడు’ కవితలో పులిపాటి గురుస్వామి, ‘‘కండల్ని కండొచుట్టి / నరాల పోగుకు రక్తాన్ని రంగుపూసి / చచ్చీ చెడి నిలబడితే …’’ అంటూ ‘తెగిన పోగు’ కవితలో పత్తిపాక మోహన్‌ నేతల జీవితాలను చిత్రీకరించారు. బాణాల శ్రీనివాస్‌ ‘బహుజనం’లో ‘‘మా పెయ్యి మగ్గాలతో / బట్టల్ని నేసినేసి / నవనాగరిక లోకం / నగ్నత్వాన్ని కప్పేసినా…’’ అనే కవితలో నేతవారికి మంచి దుస్తువులు వేసుకునే స్తోమతలేని విధానాన్ని వివరించారు. ప్రసాదమూర్తి ‘తాతకో నూలుపోగు’ లో ‘‘తాతా తాతా / వెండి వెన్నెల జరీచీర నేతగాడా / బతుకంతా బాధల బస్తా మోతగాడా…’’ అంటూ ఆ వృత్తిని నమ్ముకున్నవారు ఎంతటి కష్టాలను మోస్తున్నారో చిత్రించాడు. బళ్ళా సుందరయ్య ‘చేనేత బాల్యం’, బోగా బాలసుబ్రహ్మణ్యం ‘ఐదు ఋక్కులు’, నందిని సిధారెడ్డి ‘పుట్టి తెగినవాళ్ళు’ వంటి కవితలో వారి జీవితాలు దర్శనమిస్తాయి. భగ్వాన్‌ ‘విరిగిన మగ్గం’లో ‘‘ఎవరికోసమో / చిగురుమెత్తని పట్టుచీర నేస్తూ / అతను కళగానే ఉంటాడు..’’ అంటూ ఆత్మహత్యలపాలైన నేత కుటుంబాలను గురించి రాసారు. ‘‘మార్కండేయు / కుల కశ్పిని నమ్ముకున్నందుకు / ఇల్లిల్లూ అడుక్కు కళ్ళ నీళ్ళు కమ్ముకుంటున్నాడు…’’అంటూ జూకంటి జగన్నాథం ‘సైబర్‌ ప్రయాణం!’లో పద్మశాలీల జీవితాల తీరును చిత్రీకరించాడు. డింగరి రామాచార్య ‘సిరిసిల్లా – ఉరిఖిల్లా’ కవితలో ‘‘మానవతా వస్త్రాన్ని అగ్గిపెట్టెలో నిమిడ్చిన / నేతన్నకు అదొక బ్రహ్మాస్త్రం / బతుకు పోరులో విసుగు / ముతక హోరులో ముసుగు …’’ అంటూ నేతన్న జీవిత కష్టాలను తెలిపే కవిత.

అప్పుడే జన్మనిచ్చిన తల్లి బట్టలనుండి మనిషి మరణానంతరం వరకు గల అన్ని రకాల మైల బట్టలను నెత్తిమీద మోసుకెళ్ళి ఉతికే కులవృత్తి వారిని గురించి కొంతమంది కవులు రాసిన కవితల విరివిగా కనిపిస్తాయి. సీతారాం ‘రెజ్యూమ్‌’ కవితలో ‘‘మేమెవరం? / చాకళ్ళం మంగళ్ళం / మేమెవరం (అధికారంబు) చౌడు సున్నాలం సన్నాసులం / గాడిద బరువులం ముట్టు మూటలం…’’ అంటూ రజకుల జీవితాలను ఆవిష్కరిస్తాడు. రజకుల జీవితాలలో రేవులు మారినా బతుకుల తీరులు మారలేవు. వారి వీపులు మోసే సహించలేని వాసనతో కూడిన బరువు గుర్తుకు వస్తే ఒళ్ళు జదరిస్తుంది. ‘బహుజనం’ కవితలో బాణాల శ్రీనివాస్‌ ‘‘మా కండ బండపై / ఊరి మురికినంత ఉతికి ఉతికి/ మాసిన బట్టల్ని తొడుక్కునే / ఆకలి కేకల చాకల్లోలత…’’ కండలు బండలుగా మలిచి మురికినంతా ఉతికేసేవారిని పాతబట్టలలో కాలం గడిపేవారనడం వారి వృత్తివల్ల వారికి మిగిలేది ఏమిలేదని తెలుపుతుంది. ‘నీలిబాల్యం’ అనే కవితలో ననుమాసస్వామి ‘‘నన్ను పెంచిన చాకిరేవంటేనే నాకు ప్రేమ / మురికి బట్టల్ని బండకేసి బాదుతూ / వేసే ఈ నా పాటకు దరువయ్యేది…’’ అంటూ వారి పనితీరును వెలిబుచ్చాడు. కె. మల్లారెడ్డి ‘మసకబారుతున్న మల్లెలు’ అనే కవిత ద్వారా రజకుల అస్తిత్వాన్ని తెలుపుతాడు. అన్నవరం దేవేందర్‌ ‘మంకమ్మతోట లేబర్‌ అడ్డా’ లో ‘‘సున్నం వేసే కుంచెలు / తట్టా పార, గడ్డపారతో / పల్లె తరుముతే / పక్షులన్నీ అడ్డామీద వాల్తాయ్‌..’’ అంటూ కులవృత్తులతో బ్రతకలేక నిత్య కూలీలుగా మారిన జీవితాలు ఈ కవిత్వంలో కనిపిస్తాయి.

దేహంపై మొలిచిన వెంట్రుకలను తీసేస్తూ, కత్తిరిస్తూ దుర్భర జీవితాన్ని గడుపుతున్న మంగలి వృత్తి వారిని గురించి వివిధ కవు కొన్ని కవితలో వ్యక్తపరిచారు. సీతారాం ‘ఓట్లు ఓట్లో’ కవితలో ‘‘మే మెవరం ? / మిషిన్‌ కత్తులం కాదు, బ్లేడు కత్తులం కాదు / దువ్వెనలం కాదు, లోషన్లం కాదు / నా గుండె మంగలి కత్తినూరే రాయై పోయింది…’’ అని ముందు ముందు వారిలో కలుగబోయె చైతన్య పరిణామ క్రమాన్ని తెలిపారు. ‘బహుజనం’ కవితలో బాణా శ్రీనివాస్‌ ‘‘మా వేళ్ళ కత్తులతో / మొద్దుబారిన చేతులకు / సాన పెట్టిపెట్టి / అడ్డంగా పెరిగిన / మీ గడ్డాల అడవుల్ని నరికేసే / ఎండిన పేగుల మంగలోళ్ళం…’’ వనపట్ల సుబ్బయ్య ‘కుర్చి’ కవితలో ‘‘నా కుర్చిలో నూరురాయి / ఆకురాయి కత్తి కత్తె ఇత్తడి గిన్నే / గోరుగాలు అద్దం తోలుబొట్టె దువ్వెన / నా బిడ్డెల బతుకు / నీ కుర్చీలో నీ వొక్కడివే రాజు / నా కుర్చిలో / జనమంతా రాజులే…’’ అని రాస్తూ క్షౌరవృత్తి జీవితాను గురించి, వారు అణచబడుతున్న విధానాన్ని గురించి చిత్రించారు.

బెస్తవారి జీవితాను, జీవన సాహస పోరాటాలను, ఆర్థిక పరిస్థితులను, వారిమీద పెత్తనం చెలాయించే దళారీ వ్యవస్థను వివరిస్తూ అంబటి వెంకన్న ‘వల ఏరియ్యక ముందే’ అనే కవితలో ‘‘జగ్గలో చెయ్యేసి / చాపతు తీసే ఒడుపున్నోడు / ఎక్కడున్నాడని, ఏమయ్యాడని…’’ ప్రశ్నించిన విధానం, ‘జిల్లేడు పువ్వు’ ‘‘మనకై తీరిగ్గా వూపిరి తీసిన రోజేది / కచ్చొత మేకునై నేను ఒండు లోకి / చాప గంపెత్తుకొని నువ్వూళ్ళోకి…’’ అనడంలో వారి జీవన పోరాటంలో తీరికలేని తనాన్ని చెప్పటంతోపాటు తాను పట్టిన చేప కూరను తాను తృప్తిగా తినలేని లేమిని చూపిస్తుంది. ఎం. వెకట్‌ రాసిన ‘జాల’ కవిత ‘‘బతుకువేటలో / సముద్రం మీద బెండై తేలుతున్నా / అర్థం కాని జీవితంలో పూసలా మునుగుతున్నా…’’ అనేది వారు చేపలు పట్టడానికి నీటిమీద తేలుతూపోయే విధానాన్ని చిత్రించింది. చేపలు అమ్మడానికి గంపలుమోసే బెస్త ఆడవాళ్ళ గురించి తెలిపే మరో కవిత ‘గంగమ్మ’లో ‘‘చేపల తట్ట మోస్తూ అమ్మ / వంటి నిండా నీసు నింపుకుని / ఉప్పుచారతో మెరుస్తూ…’’ మొదలైన భావ చిత్రీకరణ కనిపిస్తాయి.

మట్టిలో మునిగి, మమేకమై, మట్టిని పొట్టకూటికి ఉపయోగపడే వస్తువులుగా మార్చి కాలం వెల్లదీసిన కులం వారు కుమ్మర్లు. తాగే నీటి కుండు, అన్నం వండుకునే పాత్రలు, పెండ్లి ఐరేండ్లు మొదలగునవి అందిస్తూ సమాజంలో అన్నిరకాలవారికి ఊపయోగ పడే వృత్తియిది. వీరిని గురించి నందిని సిధారెడ్డి ‘మృత్కళలు’ కవితలో ‘‘అతని చేతుల్తో / ఎన్ని ఇళ్లల్లో దీపాలు వెలిగించిండు / ఇప్పుడు తన దీపంతలో నూనె ఇంకిపోయింది …’’ అనే కవితలో ఎందరి గొంతులనో వారిచ్చిన కుండలతో, కూజాలతో తడిపినారు కాని వారి గొంతులు, కడుపులు ఎండుతున్నాయని ఈ ప్రపంచీకరణ ద్వారా జీవితం గడవని కష్టాన్ని హృదయం కదిలించేలా ఆవిష్కరించారు. ‘ధర్మచక్రం’లో వనపట్ల సుబ్బయ్య ‘‘నల్లటి వొండు మట్టిని / వెన్న రావ ముద్దలు చేసి / కళాఖండాలకు పురుడు పోస్తే / కండ్లు తెరిచిన కుండలన్ని / ఐరేణి కుందలై మురిసేవి !’’ కుమ్మర్ల కుండ నిర్మాణ కౌశలముతోపాటు, వారి కష్టాలను, కడగండ్లను వ్యక్తపరిచాడు. మరో కవి బాణాల శ్రీనివాస్‌ ‘బహుజన’ కవితలో ‘‘బంకమట్టికి ప్రాణంపోసి / అద్భుతమైన ఆకారాల్నిచ్చి / కల్యాణాలకు కర్మకాండలకు / కుండలమై మీ చేతుల్లో చేరే / చిట్లిన కుండల కుమ్మరోల్లం…’’ అంటూ కుమ్మరివాళ్ల కళాత్మకతను సంప్రదాయా ఆచారాల నేపథ్యంలో చిత్రీకరిస్తూనే వాళ్ళ చాలీచాలని బ్రతుకుల కడుపుమంటను చిత్రించాడు.

సంప్రదాయ భిక్షాటన జీవనం సాగించే వారిని గురించి నాళేశ్వరం శంకరం ‘శవం ముందు శంఖం’లో ‘‘మా ఊళ్ళో ఎవరు చనిపోయినా శవం ముందు శంఖం ఊదటానికి మా నాన్న నన్నే పంపేవాడు…’’ ఆ భయానక సందర్భంలో వీరి వృత్తిని నిర్వర్తించడానికి మనసును ఎంత రాయిగా చేసుకోవల్సి వస్తుందో అనే విషయాలను కళ్ళముందు బొమ్మ కట్టిస్తారు. శంకరంగారు ‘నన్ను గూర్చేనా’ కవితలో ‘‘దు:ఖంలో దహనమవుతున్న / నా తరతరాల చరిత్రను బహుకరించగదు…’’ అంటూ వారు చెప్పే కులపురాణాల వంటి విషయాలు వ్యక్తమౌతున్నాయి. ఇలాంటి అంశాన్ని తైదల అంజయ్య ‘కాటిపాపలోడు’ కవితలో ‘‘చావంటే భయమో, దు:ఖమో నీకైనా నాకైనా / కానీ వాడు మరణాన్ని గానం చేస్తాడు / నా వూరి ఒరిగిన ప్రాణాలకు / శోకపు అభిశేకం చేసే మాటల మంత్రగాడు…’’అని వారి వృత్తిలో భాగంగా వివిధ విన్యాసాలతో మృతదేహాలను స్మశానం వరకు తీసుకువేళ్ళే తీరును చిత్రిస్తాడు. ‘జంగమం’ కవితలో అఫ్సర్‌ ‘‘ఇల్లు ఇల్లనియేవు అని పాడుకుంటూ పోతూనే వున్నాడతను/ అతను మరెవ్వరో / ఆమెనో / వీధి ఆ చివరి నుంచి ఈ చివరిదాకా…’’అని ప్రారంభమైన కవితలో జంగమ భిక్షులైన వారి జీవిన విధానాన్ని గురించి తెలిపే ప్రయత్నం చేస్తాడు.

‘మొద్దుమీద కత్తి’ కవితలో ఎస్వీ సత్యనారాయణ సమాజం కటికలను చూస్తున్న తీరును, వారి కష్టాలను ‘‘వెండితెరకు నా కులాన్ని హేళనగా వేలాడదీసినప్పుడు / ఎక్కడో ఓ మూల నా మూలాన్ని నన్ను తొలుస్తున్నట్లు బాధ…’’ అంటూ వ్యక్త పరుస్తాడు.

కళావంతుల జీవితాలను గురించి ప్రశ్నిస్తూ, ఆవేతదనను వ్యక్త పరుస్తూ ప్రసేన్‌ ‘కన్నీటినది దోచుకెళ్ళిన నావ నా పద్యం’ అనే కవితలో ‘‘ఒక్క బాల్యంలోనే శతకోటి వృద్ధ్యాప్యాల భారం / వైఫల్యం వెన్నెముకైనపుడు జీవితం గండశిలే…’’అంటూ వారి పరిస్థితులను చిత్రించారు. పగడాల నాగేందర్‌ ‘సుద్ది’ కవితలో ‘‘మీ అవమానాల చూపుల్లో / తరాల అవమానాల పుండును మోస్తున్న / ఎనకబడ్డ కులాల…’’ అంటూ జోగిని వారిపై ఆవేదనను వ్యక్తపరిచారు. ‘కొల్పులోల్లం’ కవితలో మోతుకూరి ఆశోక్‌కుమార్‌ ‘‘ఏం జేస్తం నాయినా పయిసకోసం గడియకోగండమోలె దినాల్లెదీస్తం / లగ్గాలొచ్చినా సావులొచ్చినా ఆళ్లముంగటాడాలె / ఆల్ల పీనుగుల ముంగటాడాలె…’’అనే వాక్యాలు హృదయాలను కదిలిస్తాయి. అమ్మంగి వేణుగోపాల్‌ ‘ఉరి పోసుకున్న శవం’ ‘‘ప్రతిరోజు రంపపు కోత సహించిన నీ శరీరాన్ని / చచ్చిన తర్వాత కూడా కోసి చూశారు / చూసి కాల్చారు’’ అంటూ వేశ్యవృత్తులుగా మారిన జీవితాలను గురించి రాసిన కవిత.

రాళ్ళుముక్కలు చేస్తూ జీవితం గడిపే వారి గురించి నందిని సిధారెడ్డి గారి ‘‘బండమీద మంట పెట్టి రాయిచీరాలె / రాళ్ళు చీరేటప్పుడు ముఖం మాడిపోతది / కంకర గొట్టెటప్పుడు కళ్ళు చితికి పోతయమ్మా…’’ అనే కవితా పాదాలు వారి వృత్తిపనిలోని సాహసపు కష్టాన్ని గుర్తుచేస్తాయి.

మద్దెల శాంతయ్య ‘తెలంగాణ’ కవితలో ‘‘గౌండ్లోనికి పలుగురాయే కరవై / అది అలిగి అటకెక్కింది…’’అంటూ యావత్‌ తెలంగాణలో కులవృత్తుకు జరిగిన అన్యాయాలను గురించి వ్యక్తపరుస్తాడు. కొంపెల్లి వెంకట్‌ ‘ముస్తాదులు కదుతున్నాయి’ కవితలో ‘రకం కట్టేది మేమైతే / చెట్టుమీద జులుం వాడిది / కల్లు గీసేది మేమైతే / ముంతమీద ధర ముద్రించేది వాడు / ఆపై ఆబ్కారోడి నిఘా…’’ అంటూ వారి బాధను, శ్రమను, ఫలితం చేతికి అందే విషయంలోని నిష్ఠురతను కవిత్వీకరించాడు. ‘బహుజనం’ కవితలో బాణా శ్రీనివాస్‌ ‘‘ఆకాశ గంగలో / అలసిన మీ శరీరాల్ని ముంచి ముంచి / పిడస కట్టిన మీ గొంతుల్ని తడిపితే / ఆ కల్లునిషా మీకాయే / ఆకలి మంటలు మాకాయే…’’అంటూ గౌడకుల వృత్తిలోగల కష్టాలను చిత్రీకరించాడు.

ముఖ్యంగా సాహిత్యంలో సింహభాగం బీసి గురించి వచ్చిందని చెప్పుకోవచ్చు. ఉత్పత్తి కులాలు, సేవాకులాలు బీసి వర్గంలో వారివి. వీరి కష్టాలను, కన్నీలను ఎందరో కవిత్వీకరించారు. వాటన్నిటిపై ఇంకా పరిశోధన జరగవలసిన అవసరం ఉంది.

పుట్టింది శట్పల్లి గ్రామం కామారెడ్డి జిల్లా. 'కళ్లం' (సాహిత్య వ్యాసరాశి) వ్యాస సంపుటి ప్రచురించారు. ‘తెలంగాణ సాహిత్య గ్రంథసూచి’ ప్రధాన సంపాదకుడిగా, ‘నిత్యాన్వేషణం’, ‘శిలాక్షరం’ గ్రంథాలకు సంపాదకునిగా చేశారు. ‘మహాభారతంలో సంవాదాలు - సమగ్రపరిశీలన' అనే అంశంపై ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పరిశోధన చేస్తున్నారు. 'మూసీ సాహిత్య ధార' సంస్థ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు.

15 thoughts on “బీసీవాద కవిత్వం – ఒక పరిశీలన (2009 వరకు)

 1. పురుషోత్తం మునుగూరి.తెలుగు పీ.జీ.టి.కరీంనగర్. says:

  వ్యాసం చాల లోతైన అవగాహనతో రాశారు అన్న.
  దళితవాద కవిత్వం బీసీవాద కవిత్వం ఒకే తొవ్వలో నడవాల్సిన తీరును వివరించడం బాగుంది.అలాగే సమాజంలోని కులవృత్తుల జీవితాల కష్టాలను చాలామంది కవులు తమ కవిత్వంలో వివరించిన తీరును మాకు తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు అన్న.

 2. అన్ని కులాలు స్వేదాన్ని సమాజనౌకను కదలించడానికి తరాలుగా కృషి చేస్తున్నాయి. శ్రమదోపిడిలో కాలం, కాలాంతకుల దోసిలిలో బానిసలై బతుకు చిద్రమైన చిత్రాలే బహుజనుల చరిత్రలో మైలురాళ్ళైన దుస్థుతిని మీ వ్యాసంలో చక్కగా వివరించారు. కులాలెన్నున్నా బహుజనుల బాహువులెప్పుడూ కలిమి వున్నోడి సుఖానికి గొడుగుచాచాయి. కాని మనం మాత్రం ఆకలి గోసలు తీర్చుకునేందుకు ఆయువునిండా కండలను కరిగించడానికి తలరాత ముసుగులో పూచీకత్తు పెట్టేసాం ం

 3. ఇప్పుడే, దాదాపుగా అన్ని కులాల ప్రస్తావన లను, వారి కష్టాలను కవిత్వం రూపంలో విశ్లేషిస్తూ సమగ్రమైన వివరణ ఇచ్చారు. ధన్యవాదాలు. ఒకవైపు ప్రాచీన సాహిత్యం పైన పరిశోధన చేస్తూ, మన బి.సి. వాద కవిత్వం పైన స్పష్టమైన సందేశం ఇవ్వడం నాకు ఆశ్చర్యకరంగా, ఆనందంగా ఉంది. మీ కృషి ప్రశంసనీయం. అభినందనలు సార్👌💐💐

 4. డా.వీపూరి వేంకటేశ్వర్లు, కర్నూలు says:

  ఈ వ్యాసంలో దత్తయ్య గారి కవిత ‘కాపరి’ ఉండడం ఒక అంశమయితే, బి.సి.వాద కవిత్వం పై ఇంకా పరిశోధన జరగాలని కొసమెరుపు గా అందించడం గమనార్హం

 5. డాక్టర్. బాణాల శ్రీనివాసరావు says:

  ప్రాచీన కాలం నుంచి నేటి ఆధునిక కాలం వరకు అన్ని రకాలుగా సమాజంలో దోపిడీకి గురికావడం, ఆ దోపిడిని కవులు రచయితలు తమ రచనల ద్వారా ఎలా వ్యక్తపరిచారో మీ వ్యాసం ద్వారా సింహవాలోకనం చేశారు. మీ వ్యాసం ముందు ముందు పరిశోధన చేయబోయే పరిశోధకులకు దిక్సూచి అవుతుందనుటలో సందేహం లేదు. అభినందనతో….

  డాక్టర్ బాణాల…

 6. చక్కని పరిశోధనాత్మక విశ్లేషణ వ్యాసం నీ నుంచి ఇటువంటి వ్యాసాలు మరెన్నో రావాలని ఆశిస్తున్నాను అన్నా

 7. దళితవాద కవిత్వం బీసీ వాద కవిత్వం ఒకే తొవ్వలో నడవాల్సిన తీరును వివరించడం బాగుంది అన్న. అలాగే సమాజంలోని కులవృత్తుల జీవితాల కష్టాలను చాలా మంది కవులు తమ కవిత్వం రూపంలో వివరించిన తీరును మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు అన్న…

 8. విస్తృత సమాచారం అందించారు అన్నా..
  పరిశోధకులకు ప్రామాణిక వ్యాసం..

 9. బహుజన అభ్యుదయ దృక్పథంతో మీరు రాసిన వ్యాసం అందరిలో మేదోమధనం సృష్టించింది

Leave a Reply