“What made women’s labor particularly attractive to the capitalists was not only its lower price but also the greater submissiveness of women”- Clara Jetkin
2025 అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి ఐక్యరాజ్యసమితి నిర్దేశించిన థీమ్ : 2025 వ సంవత్సరానికి అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవానికి “లింగ సమానత్వాన్ని సాధించడానికి వేగంగా చర్యలను చేపట్టండి” (Accelerate Action) అని ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలకు సమిష్టిగా పనిచేయమని ఐక్యరాజ్యసమితి నిర్దేశించింది.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం ప్రతి సంవత్సరం మార్చి 8న జరుపుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా మహిళలు సాధించిన సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక విజయాలను గౌరవించడానికి దీనిని విస్తృతంగా జరుపుకుంటారు. లింగ అసమానత, పునరుత్పత్తి హక్కులు, మహిళలపై హింస, మహిళలపై వేధింపులు మహిళలు ప్రతిరోజూ ఎదుర్కొంటున్న సంబంధిత సమస్యల గురించి అవగాహన కల్పించడం అంతర్జాతీయ మహిళా దినోత్సవం 2025 ప్రధాన లక్ష్యం.
ఐక్యరాజ్యసమితి వెబ్‌సైట్ ప్రకారం అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి ఊదా, ఆకుపచ్చ, తెలుపు రంగులను అధికారికంగా నిర్ణయించారు. 1908లో బ్రిటన్ లోని “ఉమెన్స్ సోషల్ అండ్ పొలిటికల్ యూనియన్” నుండి మహిళల సమానత్వానికి ప్రతీకగా ఊదా, ఆకుపచ్చ, తెలుపుల కలయికను ఎంపిక చేశారు. ఆకుపచ్చ ఆశను, తెలుపు స్వచ్ఛతను సూచిస్తాయి. ఈ 2025 సంవత్సరానికి మహిళలకు సమ న్యాయం, గౌరవాలను సూచించేలా ఎరుపు, నీలం కలిసిన మిశ్రమ వర్ణాన్ని ఎంపిక చేశారు.
ఈ 2025 సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహిళలకు చాలా కీలకమైనది. ఎందుకంటే 1995 లో బీజింగ్‌లో జరిగిన నాల్గవ ప్రపంచ మహిళల సమావేశంలో 189 ప్రభుత్వాలు అంగీకరించిన “బీజింగ్ డిక్లరేషన్ అండ్ యాక్షన్ ప్లాట్‌ఫామ్” (Beijing Declaration and Platform for Action) 30వ వార్షికోత్సవాన్ని ఇది సూచిస్తుంది.
బీజింగ్ సదస్సు లక్ష్యాలు:
ఈ వేదిక ప్రపంచవ్యాప్తంగా బాలికల, మహిళల హక్కులకోసం అత్యంత ప్రగతిశీలమైనదిగా, విస్తృతంగా ఆమోదించబడినదిగా ఒక గొప్ప బ్లూప్రింట్‌గా మిగిలిపోయింది. విద్య, ఆరోగ్యం, శాంతి, మీడియా, రాజకీయ భాగస్వామ్యం, ఆర్థిక సాధికారతలను సాధించడమే గాక బాలికలు, మహిళలపై లైంగిక హింసను తొలగించడం వంటి స్త్రీల జీవితాల్లోని కీలకమైన రంగాలను ప్రభావితంచేసే విధానాలు, కార్యక్రమాలు, పెట్టుబడులను ఈ వేదిక మార్గనిర్దేశం చేస్తుంది.
బాలికలు మహిళల హక్కులను ముందుకు తీసుకెళ్ళండి: బాలికలు మహిళలు అనుభవిస్తున్న హింస, వివక్షత, దోపిడీలను సవాలు చేస్తూ పూర్తి స్థాయిలో మానవ హక్కులు సాధించడం కోసం అవిశ్రాంతంగా పోరాడండి.
లింగ సమానత్వాన్ని ప్రోత్సహించండి: వ్యవస్థాగత అడ్డంకులను తొలగించండి, పితృస్వామ్యాన్ని నిర్మూలించండి, పాతుకుపోయిన అసమానతలను బద్దలు కొట్టండి. అంచులకు నెట్టబడిన బాలికలు, యువతులు మహిళలతో సహా, సమ్మిళితత్వం, సాధికారతను నిర్ధారించడానికి గొంతెత్తి మాట్లాడడానికి వారి చైతన్యాన్నిపెంచండి.
సాధికారతను పెంపొందించండి: విద్య, ఉపాధి, నాయకత్వం, స్వంత నిర్ణయాలు తీసుకునే ప్రదేశాలకు పంపి సమ్మిళితంగా ప్రాప్తి కలిగించడం ద్వారా అధికార నిర్మాణాలను పునర్నిర్వచించండి. బాలికలు, యువతులు నాయకత్వం వహించే, ఆవిష్కరణలు చేసే అవకాశాలకు ప్రాధాన్యత ఇవ్వండి.
ఈ బీజింగ్ సదస్సు 30వ వార్షికోత్సవం పెరుగుతున్న అభద్రత, సంక్లిష్ట సంక్షోభాలు, ప్రజాస్వామ్యంపై నమ్మకం తగ్గడం, పౌరస్థలం కుంచించుకుపోతున్న నేపథ్యంలో వస్తుంది. 2024 లో మాత్రమే 612 మిలియన్ల బాలికలు, మహిళలు క్రూరమైన సాయుధ పోరాటాల కాలంలో జీవించారు. కేవలం ఒక దశాబ్దం లోనే కలవరపరిచే గడ్డుకాలం 50 శాతం పెరిగింది.
బీజింగ్ డిక్లరేషన్, కార్యాచరణల వేదికలు మహిళల హక్కుల ఎజెండాను కొంతవరకు సానుకూలంగా మార్చాయి.
చట్టపరమైన రక్షణ: 1995 కి ముందు, కేవలం 12 దేశాలకు మాత్రమే గృహ హింసకు వ్యతిరేకంగా చట్టపరమైన ఆంక్షలు ఉన్నాయి. నేడు, 193 దేశాలలో 1,583 శాసన చర్యలు అమలులో ఉన్నాయి, వాటిలో 354 గృహ హింసను ప్రత్యేకంగా లక్ష్యంగా చేసుకున్నాయి. ఈ చట్టాలు చాలా దేశాలలో దుర్వినియోగం అవుతున్నాయి.
అందుతున్న సేవలు: బీజింగ్ కార్యాచరణ వేదిక హింస నుండి బయటపడిన వారికి ఆశ్రయాలు, చట్టపరమైన సహాయం, కౌన్సెలింగ్, ఆరోగ్య సంరక్షణ వంటి ముఖ్యమైన సేవలను డిమాండ్ చేసింది. ఈ సేవలు ప్రపంచవ్యాప్తంగా విస్తరించాయి, లెక్కలేనంతమంది మహిళలు బాలికలకు కీలకమైన జీవనాధారాలను అందిస్తున్నాయి.
యువతను ఒప్పించడం: బీజింగ్ ఎజెండా యువ స్త్రీవాదుల కొత్త తరంగాన్ని ప్రేరేపించింది, వారు ఇప్పుడు స్త్రీ-పురుష సమానత్వం కోసం ఉద్యమాలను రూపొందిస్తున్నారు, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లను ఉపయోగించుకుంటున్నారు, సమానత్వం కోసం క్రియాశీలంగా పనిచేస్తున్నారు.
సామాజిక నిబంధనలను మార్చడం: బీజింగ్ మహిళా సమావేశంలో ఆమోదించబడిన ఒప్పందం ప్రకారం ప్రపంచవ్యాప్తంగా మహిళల హక్కుల ఉద్యమాలను రగిలించింది, హానికరమైన పితృస్వామ్య భావనలు, ఆలోచనలు, ఆచారాలను, సవాలు చేసింది. సమానత్వ విధానాలకు, చట్టాలు, సంస్థలకు మార్గం సుగమం చేసింది.
శాంతిలో మహిళల భాగస్వామ్యం: నిర్ణయం తీసుకునే స్థాయిలతో సహా సంఘర్షణ పరిష్కారం – నివారణ కోసం అన్ని స్థాయిలలో మహిళల పూర్తి, సమాన భాగస్వామ్యాన్ని పెంచాల్సిన అవసరాన్ని బీజింగ్ కార్యాచరణ వేదిక నొక్కి చెప్పింది. నేడు, మహిళలు, శాంతి, భద్రతపై జాతీయ కార్యాచరణ ప్రణాళికలు 112 దేశాలలో ఉన్నాయి – 2010లో ఇవి కేవలం 19 మాత్రమే ఉన్నాయి. ఈ జాతీయ కార్యాచరణ ప్రణాళికలు శాంతి నిర్మాణంలో, సంఘర్షణానంతర పునరుద్ధరణలో మహిళల భాగస్వామ్యాన్ని సులభతరం చేయడంలో, నిర్ణయం తీసుకునే స్థానాలకు వారి ప్రాప్తిని సాధ్యం చేయడంలో, సంఘర్షణలో లైంగిక హింసను పరిష్కరించడానికి కొత్త చట్టాలకు మార్గం సుగమం చేయడంలో కీలకమైనవి.
1995లో బీజింగ్ కార్యాచరణ మొదలైనప్పటి నుంచి మహిళల హక్కుల విషయంలో గణనీయమైన పురోగతి ఉన్నప్పటికీ, ప్రపంచం కొత్తగా, అతిగా వ్యాప్తి చెందుతున్న సంక్షోభాలను, హక్కుల కోతను ఎదుర్కొంటోంది. ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవంనాడు, మహిళల హక్కుల కోసం ముందుకు సాగడానికి “ఐక్యరాజ్యసమితి మహిళలతో చేరండి. ప్రపంచం ఒక్క అడుగు కూడా వెనక్కి తగ్గదు” అని బీజింగ్ కార్యాచరణ వేదిక చెప్పింది.
పర్యావరణం, డిజిటల్ టెక్నాలజీల శక్తి చుట్టూ ఆవిర్భభవిస్తున్న ప్రాధాన్యతలతో పాటు ఈ సమస్యలను పరిష్కరించడం అత్యవసరం.
ఐక్యరాజ్యసమితి మహిళల సుస్థిరాభివృద్ధి కోసం 2030 నాటికి సాధించి తీరవలసిన 17 స్థిరమైన లక్ష్యాలను (Sustainable Development Goals) నిర్దేశించుకుంది. అందుకు ఆచరించవలసిన కొన్ని కార్యక్రమాలను, చర్చించవలసిన అంశాల జాబితాను ప్రపంచనాయకులు 2015 లోనే ఆమోదించారు. 2030 నాటికి ప్రపంచదేశాలన్నీ పాటించి, ఖచ్చితంగా సాధించవలసిన లక్ష్యాల ఆదేశాలతో రోడ్ మ్యాప్ ను కూడా రూపొందించారు! ఐక్యరాజ్యసమితి లక్ష్యాలను, అవి ఎంతవరకు అమలయ్యాయో తెలుసుకుందాం.
ప్రపంచవ్యాప్తంగా మహిళల సుస్థిరాభివృద్ధి కోసం ఐక్యరాజ్యసమితి నిర్దేశించుకున్న 17 లక్ష్యాలు:
1.పేదరిక నిర్మూలన (No poverty): పేదరిక నిర్మూలన విషయానికొస్తే నానాటికీ దారిద్ర్యం పెరుగుతుందే తప్ప ఇసుమంత కూడా తగ్గడం లేదు. ఇప్పడున్న సామాజిక రక్షణ నిబంధనలు ఏమాత్రం సరిపోవు. 55% నవజాత శిశువులున్న తల్లులకి ఏమాత్రం ప్రసూతి నగదు ప్రయోజనాలు లేవు. ప్రపంచవ్యాప్తంగా, 15 ఏళ్లలోపున్న ప్రతి 5 మంది బాలికల్లో ఒకరు తీవ్ర పేదరికంలో పెరుగుతూ, పోషకాహారలేమితో మరణాలబారిన పడుతున్నారని ఐక్యరాజ్యసమితే చెప్పింది. స్త్రీల పేదరికం, అసమానతలను పరిష్కరించడానికి స్త్రీవాద సంస్థలు కొన్ని నాయకత్వం వహించి పని చేస్తున్నాయి. అయినప్పటికీ, వారు మొత్తం అధికారిక అభివృద్ధి సహాయంలో 0.13 శాతాన్ని పొందుతూ ఎక్కువ ఖాళీగానే ఉంటున్నారు. పేదరికంలో నివసిస్తున్న 1.3 బిలియన్ల జనాభాలో 70% మంది మహిళలే. పేద కుటుంబాలలో 40% మహిళలే నాయకత్వం వహిస్తున్నారు. ప్రపంచ ఆహార ఉత్పత్తిలో మహిళలు 50 నుండి 80% వరకు ఉన్నారు, కానీ వారు ప్రపంచంలోని 10% కంటే తక్కువ భూమిని కలిగి ఉన్నారు
2.సంపూర్ణంగా ఆకలి నిర్మూలన (Zero Hunger): కోవిడ్ మహమ్మారి, భౌగోళిక రాజకీయ వైరుధ్యాలు, వాతావరణ విపత్తులు, ఆర్థిక సంక్షోభం కారణంగా 2020 నుండి అదనంగా 75 మిలియన్ల మంది ప్రజలు తీవ్ర పేదరికంలోకి నెట్టబడ్డారు. ఇది 2030 నాటికి 342 మిలియన్ల మంది మహిళలు, బాలికలు దారిద్య్ర రేఖకు దిగువన ఉండేలా చేస్తుంది. భరించలేని పేదరికం వల్ల ఎన్నో దేశాలలో ప్రజలు ఆకలికి కుంగి, కృశించి మరణాల బారిన పడుతున్నారు. మహిళలు నాయకత్వం వహించే చిన్నతరహా రైతు కుటుంబాలు, పురుషుల నేతృత్వంలోని వారికంటే సగటున 30% తక్కువ సంపాదిస్తారు. వెంటాడి, వేధించే దారిద్ర్యంతో కన్నబిడ్డల ఆకలి తీర్చే దారిలేక తల్లులు ఆత్మహత్యలకు పూనుకుంటున్నారు. యుద్ధ ప్రాతిపదికన తక్షణ చర్యలు తీసుకోవడం చాలా అవసరమని ఐక్యరాజ్యసమితి భావిస్తుంది.
3.మంచి శ్రేయసు, ఆరోగ్యం,సంక్షేమం (Good Health and Well-being): కోవిడ్ మహమ్మారి మొదటి సంవత్సరంలో 1.4 మిలియన్ల మహిళలు గర్భవతులయ్యారని నివేదించింది గానీ ఆడవాళ్ళ ఆరోగ్యం, శ్రేయస్సు, సంక్షేమం గురించి ఐక్యరాజ్యసమితి అయినా పట్టించుకుందో లేదో సమాచారం లేదు. వాళ్ళందరూ ఏమయ్యారన్న సంగతి మనకి తెలియదు.
4.నాణ్యమైన విద్య (Quality Education): కోవిడ్ కి ముందు సెకండరీ స్కూళ్ళలో చేరిన వివిధ దేశాల శరణార్థి శిబిరాల్లోని బాలికల్లో సగంమంది తిరిగి పాఠశాలలకు వెళ్లలేదు. పేదదేశాల ప్రజలు తిండీ, బట్టా, గూడూ లేక అలమటిస్తుంటే బిడ్డల్ని పాఠశాలలకు పంపించే పరిస్థితులెక్కడుంటాయి?
5.లింగ సమానత్వం (Gender Equality): లింగ సమానత్వం అతిపెద్ద మానవ హక్కుల సవాలుగా మిగిలిపోయింది. దాదాపు 50% దేశాల్లో మహిళలకు కొన్ని ఉద్యోగాల్లో, పరిశ్రమల్లో కేవలం మహిళలైనందుకే పని చేయకుండా ఆంక్షలు విధించారు. ఈ లక్ష్యం నెరవేరడం దాదాపు సున్నా అని ఐక్యరాజ్యసమితి నివేదించింది. మహిళలపై పెట్టుబడి పెట్టడం అనేది మానవ హక్కుల ఆవశ్యకతే గాకుండా సమగ్ర సమాజాల నిర్మాణానికి మూలస్తంభంగా నిలుస్తుంది. తాజా గ్లోబల్ అంచనా ప్రకారం సుదీర్ఘమైన గమ్యం చేరవలసే ఉందని చెప్పడం అంతులేని నిరాశకు గురి చేస్తుంది. ఇప్పటికే సమయం మించిపోయింది, అయినప్పటికీ స్త్రీల పురోగతి మనందరికీ మేలు చేస్తుంది కాబట్టి లింగ సమానత్వం సాధించడానికి ప్రతి ఒక్కరూ పని చేయాలని ఐక్యరాజ్యసమితి పిలుపునిస్తుంది.
6.పరిశుభ్రమైన నీరు, పారిశుధ్యం (Clean water and Sanitation): పరిశుభ్రమైన నీటి నిర్వహణ, పారిశుధ్యం విషయాలలో కేవలం 26% దేశాలు మాత్రమే చురుకుగా పనిచేస్తున్నాయి.
7. సరసమైన ధరలు-స్వఛ్చమైన శక్తి (Affordable and clean Energy): స్వచ్ఛమైన శక్తిని చౌకగా లభించేలా చూడాలనే లక్ష్యం ప్రపంచంలోని మూడు వంతుల దేశాలలో ఇంకా నెరవేర్చవలసే ఉంది.
8. ఆర్ధిక అభివృద్ధిని పెంచగల మంచి ఉత్పత్తులు (Decent work and Economic growth): 2020లో ఉపాధి పొందిన 54 మిలియన్ల మహిళలు తమ పనులనుండి తొలగించబడ్డారు. అతి తక్కువ వేతనాలిచ్చే శ్రామికశక్తికి ఇప్పుడు 45 మిలియన్లమంది మహిళలు పెరిగారు. పేదరికం, అసమానతలు, పర్యావరణ క్షీణతను ప్రస్తుత ఆర్థిక వ్యవస్థ మరింత తీవ్రతరం చేస్తుంది. మహిళలు, అట్టడుగు వర్గాలను అసమానంగా ప్రభావితం చేస్తుంది. ప్రత్యామ్నాయ ఆర్థిక నమూనాల కోసం గ్రీన్ ఎకానమీ వైపు దృష్టి పెట్టాలని మహిళల శక్తియుక్తులను విస్తరించే సంరక్షణ సమాజాన్ని అభివృద్ధిచేసే దిశగా మళ్లాలని ప్రతిపాదించింది.
9. పరిశ్రమలు, ఆవిష్కరణలు మౌలిక సదుపాయాలు ( Industry, Innovation and infrastructure): ప్రపంచవ్యాప్తంగా కేవలం 4% మహిళలు మాత్రమే కోవిడ్ 19 చికిత్సలు పొందారని క్లినికల్ అధ్యయనాల వారి పరిశోధనలో వెల్లడించారు.
10. అసమానతలను తగ్గించె చర్యలు చేపట్టడం (Reduced inequalities): కోవిడ్ వలసల సమయంలో శ్రామిక ప్రజలు వారి వారి సొంత ఊళ్ళకు ప్రయాణించేటప్పుడు మధ్య దారుల్లో 19% మంది పురుషులతో పోల్చి చూస్తే, 53% మంది మహిళలు అత్యంత భయానకమైన హింసను ఎదుర్కొన్నారని ఐక్యరాజ్యసమితి నివేదించింది. వారి రక్షణ కోసం ప్రభుత్వాలు చేపట్టిన చర్యలు ఏమాత్రం సరిపోవుని ఐక్యరాజ్యసమితి చెప్పింది.
11. స్థిరమైన నగరాలు, కమ్యూనిటీ నివాసాలు (Sustainable cities and communities): సుస్థిరమైన అభివృద్ధిని సాధించగల నగరాలను, కమ్యూనిటీ సంఘాలను ఇంకా స్థాపించే ప్రయత్నాలలోనే ఉన్నారు.
12. బాధ్యతాయుతమైన వినియొగాలు, ఉత్పత్తులు (Responsible consumption and production)
13. వాతావరణ చర్యలు(climate action)
14. నీటికింద జీవితం (Life below water)
15. భూమి మీద జీవితం (Life on land): ఈ 12,13,14,15 నాలుగు సమస్యలకు పరిష్కారాలుగా అంతర్జాతీయ మహాసముద్ర, విజ్ఞాన సమావేశాలలో స్పీకర్లలో కేవలం 29% మంది మహిళలు మాత్రమే వివిధ విషయాల గురించి మాట్లాడగలుగుతున్నారని ఐక్యరాజ్యసమితి చెప్పింది.
16. శాంతి, న్యాయం, బలమైన సంస్థలు (Peace, Justice and strong Institutions)
17. లక్ష్యాలకోసం భాగస్వామ్యాలు (Partnerships for the Goals): మహిళలు ప్రతిస్థాయిలో అభివృద్ధిని పెంచేలా నిర్ణయాలు తీసుకోగలరు. విదేశీ వ్యవహారాలు, రక్షణ, ఆర్థిక, మానవ హక్కులకు సంబంధించిన ప్రభుత్వ కమిటీలలో కేవలం 18% మంది మహిళలు మాత్రమే అధ్యక్షత వహిస్తున్నారు. వారు లేని ప్రతిరంగంలో అభివృద్ధి దెబ్బతీస్తుంది.
ఆ యా దేశాధినేతలు వాస్తవాలను వెలుగులోకి రానివ్వరు కాబట్టి ప్రతి లక్ష్యానికి సంబంధించిన నిజాలు వేరుగా ఉంటాయి!
లింగ సమానత్వం, మహిళా సాధికారత సాధించడం అనే ప్రధానమైన లక్ష్యాలలో మిగిలిన 17 లక్ష్యాలూ ఒకదానితో ఒకటి అంతర్భాగంగా ఉంటాయి. బాలికల, మహిళల హక్కులను నిర్ధారించి, అన్ని లక్ష్యాలలో చేర్చడంద్వారా న్యాయం చేయగలుగుతాం అన్నారు. అందరికీ పని కల్పించడంద్వారా మాత్రమే ఆర్థిక వ్యవస్థలను బలోపేతంచేసి భవిష్యత్తు తరాలకు మన భాగస్వామ్య వాతావరణాన్ని నిలబెట్ట గలుగుతామని ఐక్యరాజ్యసమితి తేల్చి చెప్పింది.
ఆర్ధిక సంక్షోభాలు, ఆరోగ్య సంరక్షణ లోపాలు, వాతావరణంలో రోజురోజుకీ చోటు చేసుకుంటున్న మార్పులు, మహిళలపై హింస, ఇంధనం, ఆహార ధరల పెరుగుదలలు, యుద్ధ సంఘర్షణల కాఠిన్యం మొదలైనవన్నీ మహిళలపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. మహిళల విషయంలో మన కాలంలోని కొన్ని ముఖ్యమైన సవాళ్ళను ఎదుర్కోవడానికి లింగ సమానత్వ హక్కును నెరవేర్చాలని, దానినే ఉత్తమలక్ష్యంగా ఎంచుకున్నామని ఐక్యరాజ్యసమితి 2015 లోనే పేర్కొంది.
ఒకచోట మన చలం “దేశాన్ని పరిపాలించగల సామర్ధ్యం ఉన్న వ్యక్తిని తీసుకెళ్ళి చెప్పులు కుట్టే పనిలో పెడితే దేశానికి ఎంత నష్టం, అలాగే జనాభాలో సగభాగంగా ఉన్న మహిళలచేత అంట్లు కడిగిస్తున్నారు. అంటే జనాభాలో సగం మెదళ్ళు సరైన పనిచేయకుండా వృధా అవుతున్నాయ”ని అన్నారు! అలాగే మహిళలకు అనేక సమస్యలను ఒకే సమయంలో పరిష్కరించగల మల్టీ టాస్కింగ్ సామర్ధ్యాలు, నాయకత్వ లక్షణాలను కూడా కలిగి ఉంటారు. లింగవివక్షవల్ల వారు ఎదుర్కొంటున్న వెనుకబాటుతనం మొత్తం ప్రపంచాభివృద్ధిని కూడా గణనీయంగా వెనక్కి నెట్టివేస్తుందని కూడా ఐక్యరాజ్యసమితి కూడా గమనించింది!
బీజింగ్ సదస్సు లక్ష్యాలనుగానీ, ఐక్యరాజ్యసమితి స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలను గానీ సాధించడానికి కేవలం ఐదు సంవత్సరాల సమయం మాత్రమే మిగిలి ఉంది!
మనుషులుగా మహిళలకు రాజ్యాంగం ఇచ్చిన హక్కులు అమలవుతున్నాయా ?
ఇక మన భారత్ సంగతికి వస్తే 1975 లో ఐక్యరాజ్యసమితి మహిళలకు చట్టపరమైన రక్షణ, మహిళాభ్యుదయం, అట్టడుగు మహిళలకు నేరుగా మద్దతు, సహాయ సహకారాలందిస్తానని చేసిన ప్రకటనలో భారత్ సంతకం చేసింది. అందువల్ల మన దేశంలో జాతీయ మహిళా కమీషన్, స్త్రీల హక్కులు, రక్షణకి సంబంధించిన కొన్నిచట్టాలు వచ్చాయి! ఇప్పుడా చట్టాలన్నీ చట్టుబండలవుతూ కాగితాలవరకే పరిమితమవుతున్న విధానాన్ని మనందరం చూస్తున్నాం కదా?
దక్షిణాఫ్రికా, డర్బన్ లో జాతివాదం, జాతి వివక్ష, జాతి వైముఖ్యం, అసహనం వంటి వాటికి వ్యతిరేకంగా జరిగిన ఐక్యరాజ్యసమితి ప్రపంచస్థాయి సదస్సులో, మనదేశంలో ప్రతి సామాజిక సమస్యకూ “హిందూమతం, బ్రాహ్మణులు, ఆర్యుల కుట్రలు” కారణమనే అంశాన్ని కార్యకర్తలు రూపొందించారు. ఇదీ మన వాస్తవపరిస్థితి! కుట్రలన్నీటికీ ఎక్కువగా బలయ్యేది మహిళలే, మరి ముఖ్యంగా పేద, అట్టడుగు, ఆదివాసీ మహిళలే! జాతుల వివక్షలకు ముస్లిం, క్రిస్టియన్ మతాలలోని పేదప్రజలు. పాలకులకు గిట్టని ప్రతిపక్ష నాయకులూ, ప్రజాస్వామ్యంగా రాజ్యాంగాన్ని అమలు చేయమని అడిగే సామాన్య ప్రజలందరూ కమ్యూనిస్టులూ, అర్బన్ నక్సలైట్లే!
సంవత్సరాల తరబడి స్త్రీలను ద్వితీయ శ్రేణి పౌరులుగానే పరిగణిస్తున్నారు. ప్రతీరంగంలోనూ వివక్షకు, హింసకు బలవుతున్నారు. ఉపాధి అవకాశాలలో కూడా స్త్రీ-పురుషుల మధ్య ఉన్న అంతరాలకు లింగపరమైన వివక్షే కారణమని ఆక్స్ ఫామ్ చెప్పింది. 2016 లో లింగసమానత్వ సూచీలో 87 వ ర్యాంకులో ఉన్న భారత్ ఇప్పుడు 146 దేశాలలో 127 వ స్థానానికి పరిమితమయిందని నివేదిక వెల్లడించింది. భారత మహిళా శ్రామిక శక్తి సమ్మతించలేని స్థాయిలో ఉందని ఇటీవల ప్రపంచ బ్యాంకు తప్పు పట్టింది. దేశ శ్రామిక శక్తులు మహిళల వాటా కుంగుతుందని అంతర్జాతీయ కార్మిక సంఘం సహా పలు సంస్థలు ట్రేడ్ యూనియన్లు ఆందోళన చెందుతున్నాయి. పని ప్రదేశాల్లో లైంగిక వేధింపుల చట్టం తెచ్చినప్పటికీ అది క్షేత్రస్థాయిలో చట్టబండలవుతుంది. శ్రామికశక్తిలో భాగమైన స్త్రీలకి సమస్యల పరిష్కారాలు సూచిస్తూ మహిళా సాధికారతకు, వారి ఆర్థిక స్వావలంబనకు ప్రభుత్వం తోడ్పాటునందిస్తే సామాజక అభివృద్ధి సూచిలో మెరుగైన ర్యాంకుల సాధనకు, వృద్ధిరేటుకు ముందడుగు పడుతుంది!
అంతర్జాతీయ మహిళా దినోత్సవం చరిత్ర
పోరాటాల గతంలోకి వెళితే 1820 లో ఇంగ్లండ్ లో “టైలరింగ్ మహిళల పోరాటం” చరిత్రలో మొదటిది. ఈ పోరాటం ఎన్నోదేశాల్లో ఎందరో మహిళలకు స్పూర్తినిచ్చింది.
ఆ రోజుల్లో ఇటలీ, పోలండ్, మెక్సికో, రష్యా మొదలైన చుట్టుపక్కల దేశాల ప్రజలు జీవికకోసం అమెరికాకు వలస వచ్చేవారు. అలా వచ్చినవారిలో మహిళా కార్మికులు నూలు మిల్లులలో పని చేసేవారు. సోషలిస్టు పార్టీ ప్రేరణతో 1900 సంవత్సరంలో చికాగోలో మహిళలు “అంతర్జాతీయ దుస్తుల తయారీ మహిళా శ్రామికుల యూనియన్” స్థాపించుకున్నారు. ఈ యూనియన్ సారధ్యంలో మహిళలు గడ్డ కట్టుకు పోయే చలిలో నెలల తరబడి ఫ్యాక్టరీల ముందు ఆకలే కాదు, అవమానాలే కాదు, ఎన్నో చెప్పరాని నరక యాతనల కోర్చుకుని పికెటింగులు, సమ్మెలు చేశారు. లాఠీ దెబ్బలు తిని జైళ్ళకు వెళ్ళారు. సమాజంనుంచి హీనమైన, అవమానకరమైన, నిందారోపణలను ఎదుర్కొన్నారు. అయినా సరే, పట్టు వదలకుండా దృఢదీక్షతో వీరోచిత పోరాటాల బాటను వేసి ముందు తరాలకు వెలుగు దారులు పరిచారు. కొన్ని అపజయా లెదురైనప్పటికీ ఈ ఉద్యమ స్పూర్తితో 1908 లో 15000 మంది మహిళలు తక్కువ పని గంటల కోసం, ఓటు హక్కు కోసం, మెరుగైన జీతాలకోసం న్యూయార్క్ నగర వీధులలో బ్రహ్మాండమైన కవాతు నిర్వహించారు. 1909లో అమెరికా లోని సోషలిస్ట్ పార్టీ ఆదేశం మేరకు మొట్టమొదటి “నేషనల్ ఉమెన్స్ డే” ను ఫిబ్రవరి 28 న జరుపుకున్నారు.
1910 లో 17 దేశాల ప్రతినిధులు జర్మనీ సోషల్ డెమోక్రటిక్ పార్టీకి చెందిన క్లారా జెట్కిన్ నాయకత్వంలో కోపెన్ హేగన్ లో సమావేశమయ్యరు. ఆ యా దేశాల్లోని మహిళల సమస్యలను చర్చించడానికి – డిమాండ్ల సాధన కోసం ప్రతి దేశంలో, ప్రతి సంవత్సరం ఒకే రోజున ప్రపంచ వ్యాప్తంగా “మహిళా దినం” జరుపుకోవాలని క్లారా ప్రతిపాదించారు. వివిధ యూనియన్స్, సోషలిస్ట్ పార్టీలు, ఉమెన్స్ క్లబ్బులకు చెందిన 17 దేశాలకు చెందిన 100 మంది ప్రతినిధులే కాక ఫిన్నిష్ పార్లమెంట్ కి మొట్టమొదటిగా ఎంపికైన ముగ్గురు ప్రతినిధులు కూడా ఎకగ్రీవంగా క్లారా జెట్కిన్ ప్రతిపాదనను ఆమో దించారు. 1911 లో ఆస్ట్రియా, డెన్మార్క్, స్విట్జర్లాండ్, జర్మనీ లలో మొదటిసారి మార్చ్ 19 న “అంతర్జాతీయ మహిళా దినోత్సవం” జరుపుకున్నారు. ఒక మిలియన్ కి మించి స్త్రీ-పురుషులు పని హక్కుకోసం, ఓటు హక్కుకోసం, పబ్లిక్ మీటింగులు పెట్టుకునే స్వేచ్చకోసం, వివక్షని అంతం చెయ్యాలంటూ నినదిస్తూ, ప్రచారం చేస్తూ ఉద్యమించారు. వారం కూడా గడిచీ గడవక ముందే మార్చ్ 25 న న్యూయార్క్ లోని “ట్రయాంగిల్ స్క్వేర్” వద్ద అంతులేని దోపిడీ, పీడనలకు గురౌతున్న 140 మంది శ్రామిక మహిళలు పని ప్రదేశంలో బందీలైపోయి తప్పించుకునే వీలేలేక సజీవంగా అగ్నికి ఆహుతైపోయారు. ఈ భయంకరమైన సంఘటనలేపిన దుమారం మహిళా కార్మికుల లేబర్ లెజిస్లేషన్ మీదా, స్త్రీల పని పరిస్థితుల మీదా ప్రపంచo తన దృష్టిని పెట్టేలా చేసింది. స్త్రీల పని పరిస్థితుల మీదా ప్రపంచo తన దృష్టిని పెట్టేలా చేసింది.
1912 లో ఆర్ధిక దోపిడీ (బ్రెడ్) పైనే కాకుండా మహిళలు ఎదుర్కొంటున్న మానసిక, సామాజిక అణచివేత (రోజెస్) పైన కూడ పోరాడాలని గుర్తించిన స్త్రీలందరూ రొట్టెతో పాటు స్వేచ్చ కూడా కావాలంటూ“బ్రెడ్ అండ్ రోజెస్” (Bread and Roses) ఉద్యమాన్ని నడిపారు. దీనినే లారెన్స్ టెక్స్టైల్ సమ్మె అని కూడా “బ్రెడ్ అండ్ రోజెస్” ఇది 1912లో మసాచుసెట్స్ లోని లారెన్స్ లో ఇండస్ట్రియల్ వర్కర్స్ ఆఫ్ ది వరల్డ్ (Industrial Workers of the World) నేతృత్వంలో ఇటలీ నుంచి వలస వచ్చిన మహిళా శ్రామికులు చేపట్టిన సమ్మె. దీనిని “మూడు రొట్టెల కోసం సమ్మె” అని కూడా అంటారు. “బ్రెడ్ అండ్ రోజెస్” అనే ఒక ప్రసిద్ధ పదబంధాన్ని వాస్తవానికి సమ్మెకు ముందు, డిసెంబర్ 1911లో “ది అమెరికన్ మ్యాగజైన్” లో ప్రచురించబడిన జేమ్స్ ఓపెన్‌హీమ్ (James Oppenheim) రాసిన కవిత నుంచి తీసుకుని ర్యాలీ కోసం వాడుకున్నారు. “శరీరాలతో పాటు హృదయాలు కూడా ఆకలితో ఉంటాయి; మాకు రొట్టె ఇవ్వండి, రొట్టెతో పాటు మాకు గులాబీలు కూడా కావాలి!” అని డిమాండ్ చేస్తూ లారెన్స్ నగర వీధుల్ని హోరెత్తించారు. గురి పెట్టబడిన తుపాకీకొనల్లో పదునైన బాకులు బిగించి నిలబడిన భీకరమైన సైన్యానికి ఎదురుగా బెదరని స్థిరచిత్తంతో నిలిచి శాంతియుతంగా పోరాడారు. 40 దేశాల మహిళలు అతి దారుణమైన గడ్డ కట్టే చలిలో రెండు నెలలు జనవరి నుంచి మార్చ్ వరకూ గొప్ప సంకల్పబలంతో సమ్మె కొనసాగించి 8 గంటల పని హక్కునీ, “అంతర్జాతీయ మహిళా దినోత్సవం” నీ సాధించారు! అప్పటినుంచి 1913 వరకూ ఫిబ్రవరి చివరి ఆదివారాన్ని “నేషనల్ ఉమెన్స్ డే” గా జరుపుకునే సాంప్రదాయాన్ని కొనసాగించారు.
1975లో ఐక్యరాజ్యసమితి ప్రపంచవ్యాప్త స్త్రీల పోరాటాల ఫలితంగా మహిళలకు చట్టపరమైన రక్షణ, మహిళాభ్యుదయం, అట్టడుగు మహిళలకు నేరుగా మద్దతు, సహాయ సహకారాలందిస్తానని చెప్పింది. తన వాగ్ధానాలను ఐక్యరాజ్యసమితి అమలు పరుస్తుందా?
ఈ బీజింగ్ సదస్సు, ఐక్యరాజ్యసమితి లక్ష్యాలన్నీ చాలా ఆశాజనకంగానే ఉన్నాయి. ఇవి తెలుసుకుంటున్నప్పుడు బోలెడు సందేహాలు వస్తాయి. మహిళల హక్కులను మానవహక్కులుగా గుర్తించదలచుకుంటే పాలస్తీనాలో మహిళల్ని, ముఖ్యంగా సంతానోత్పత్తి వయసులో ఉన్న యువతుల్ని, పదేళ్ళకి పైబడిన బాలికల్ని, పసిపిల్లల్ని వేలాదిగా నిర్దాక్షిణ్యంగా చంపుతుంటే ఐక్యరాజ్యసమితి ఎందుకు అడ్డుకోలేకపోయింది? అనే ఆలోచన వెంటనే వస్తుంది. ప్రతి మనిషికీ ఉండే హక్కులు వారికి వర్తించవా? అనే అనుమానాలొస్తాయి. మన అనుమానాలకు సమాధానం ఆక్స్ ఫామ్ నివేదికలో దొరుకుతుంది .
ఈ సంవత్సరం జనవరి 14న దావోస్ లో ప్రపంచ ఆర్ధిక సదస్సు జరిగింది. ఆ సందర్భంలో ఆక్స్ ఫామ్ ఇంటర్నేషనల్ తన నివేదికను విడుదల చేసింది. ప్రపంచంలో అత్యంత ధనవంతులైన ఐదుగురి సంపద 2020 నుంచి రెట్టింపుకి పైగా పెరిగింది. అదే సమయంలో 4.8 బిలియన్ల మంది (480 కోట్లు- అంటే జనాభాలో 60%) కటిక పేదరికంలో కూరుకుపోయారు. ప్రపంచంలోని ప్రతిఒక్కరూ పేదరికం నుంచి విముక్తమవ్వాలంటే 229 సంవత్సరాలు పడుతుందని ఆక్స్ ఫామ్ అంచనా వేసింది. “ఈ అంతరాలను మేము గమనిస్తున్నాం. కోవిడ్, ద్రవ్యోల్బణం, యుద్ధాలు వంటి ప్రతికూల పరిణామాలతో కోట్లాదిమంది ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. మరోవైపు బిలియనీర్ల సంపద అంతులేకుండా ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతుంది. ఈ అసమానతలు యాధృచ్చికం కాదు. కార్పొరేట్ సంస్థలు ప్రజలందరి ప్రయోజనాలను ఫణంగా పెట్టి మరింత సంపదను తమకు అందజేయాలని కోరుకుంటున్నాయి” అని ఆక్స్ ఫామ్ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అమితాబ్ బెహర్ ఒక ప్రకటనలో తెలిపారు. దీనివల్ల ప్రపంచంలోని మూడువంతుల ప్రజల బాధలకు కార్పొరేట్ సంస్థల మితిమీరిన ఆశపోతు, ఆంబోతుతనాలే కారణమని తెలుస్తుంది!
సమాజమంతా స్త్రీలమీద పగపట్టినట్లుండి కొన్నిసార్లు నిరాశా, నిస్పృహలు కమ్ముకుంటున్నాయి. పాలస్తీనా, కశ్మీర్, మణిపూర్, హల్ద్వానీ మహిళల పరిస్థితుల్ని తల్చుకుంటుంటే విషాదం భూమ్యాకాశాల్ని కమ్మేసినట్లుటుంది. మనం మినీ మారణకాండల యుగంలో జీవిస్తున్నామని, పేదలలోని అట్టడుగున ఉన్న నిరుపేదలు అత్యంత శక్తివంతమైన కార్పొరేట్‌లను నిలువరిస్తున్నారు. వారిలో భూమి పుత్రికలైన మహిళలు ముందు వరసలో ఉంటున్నారని అరుంధతీ రాయ్ తనకు వారే స్ఫూర్తినిస్తున్నారన్నారు!
దేశమంతా నిండి ఉన్న సాధారణ మహిళలను మనం తక్కువ అంచనా వెయ్యకూడదు. చాలా అల్పమైన విషయాలకు జైళ్ళలోకి తోసేయబడ్డ మనకు తెలియని ఎందరో సామాన్యమైన స్త్రీలు, “అన్యాయాన్ని ఎలా అధిగమించి బతకాలి. ఎలా సదా ఆశావహంగా ఉండాలి… ఇనపచువ్వల వెనక బంధించబడి ఉన్నప్పటికీ ఎలా జీవిస్తూ, ప్రేమిస్తూ , పోరాడుతూ, నవ్వుతూ ఉండాలో వారే నాకు నేర్పించారు” అని అంటారు సుధా భరద్వాజ్ తన “ఉరి వార్డు నుండి” పుస్తకంలో. మనం కూడా వాళ్ళనుంచి ఎంతో నేర్చుకోవాలి.
భారత్ లో 33 మిలియన్ల మంది స్త్రీలు తప్పిపోయారట. వారంతా ఎక్కడికి వెళ్లారు? ఏమైపోయారు? ఈ విషయాలన్నీ విడిచి పెట్టకుండా మనం ప్రత్యక్షంగా తెలుసుకోవలసిన వాస్తవాలు. ఇక మనం మహిళలుగా ఈ దేశంలో ఎడతెగని పోరాటాలే చెయ్యాలి. ఎక్కడ దొపిడీ ఉంటుందో అక్కడ ప్రతిఘటన తప్పదు. కటిక చీకటిలో కూడా ఎక్కడో చిన్న సందునుంచి వెలుగు నేనున్నానంటూ విరజిమ్ముతుంది. గందరగోళాలనుంచి అసలైన వాస్తవాలను గ్రహించి వాటిని మన పోరాటాలకు, మన ప్రయోజనాలకు నిజమైన దినుసుగా వాడుకోవాలి.
“ఒక స్త్రీ తనకోసం నిలబడే ప్రతిసారీ ఆమె అందరు మహిళల కోసం నిలబడుతుంది.” – మాయా ఏంజెలో. ప్రపంచవ్యాప్తంగా మహిళలు అంతర్జాతీయ సమ్మెలు చేస్తున్నారు. ప్రపంచంలో ఎక్కడ ఏ అన్యాయం జరిగినా తెలుసుకుని సహానుభూతితో స్పందించాలి. మనం ఒంటరిగా లేమని తెలుసుకోవాలి. ప్రభుత్వాలు అమలు చేస్తున్న స్త్రీల వ్యతిరేక విధానాలకు ప్రపంచవ్యాప్తంగా మహిళలందరి మద్దత్తు కూడగట్టే ప్రయత్నాలు చెయ్యాలి. ప్రపంచంలో ఎక్కడున్నా సరే ప్రతి స్త్రీ విజయం మరొకరికి ప్రేరణగా ఉండాలి. మనం ఒకరినొకరు ప్రోత్సహించుకున్నప్పుడు చాలా బలంగా ఉంటాం. ఏ స్త్రీకయినా స్వేచ్ఛను నిరాకరించినప్పుడు మనం కూడా సంకెళ్ళలోనే ఉన్నామని గ్రహించాలి. ప్రభుత్వాలు చాలా పిరికిగా, పచ్చి అబద్ధాలతో, పోలీసులు, సైన్యాల అండతో పాలిస్తుంటారు. మనం చెప్పేవన్నీ నిజ జీవిత సత్యాలు!
పాలస్తీనా, కశ్మీర్, మణిపూర్, హల్ద్వానీల లోని సామాన్యమైన స్త్రీలు తమ జీవితాల్లోని గడ్డకట్టిన విషాదం నుంచి ఎలా హాస్యం, సాహిత్యం, సంగీతం, పూల అందాలు అన్నీ చూస్తూ, అనుభవిస్తూ పోరాడుతున్నారో అలాగే మనం కూడా చీకట్ల నుంచి వెలుగుకోసం ఉద్యమిద్దాం. ప్రతి చీకటి అంతమై సూర్యుడు ఉదయించినట్లు, గాలి కూడా ఎప్పుడో ఒకప్పుడు అకస్మాత్తుగా తన దిశను మార్చుకోకతప్పదు కదా? అప్పటివరకూ ప్రతిఘటనలే ప్రధానంగా జీవిద్దాం!
స్నేహితులందరికీ అంతర్జాతీయ శ్రామిక మహిళా పోరాట దినం శుభాకాంక్షలు!