బి.సి. సాహిత్య పరిశోధనకు దిక్సూచి

సుమారు వెయ్యేండ్ల తెలుగు సాహిత్యంలో అనేక ప్రక్రియలు వెలువడి సాహిత్యాన్ని సుసంపన్నం చేశాయి. ప్రాచీన సాహిత్యంలో ఇతిహాసం, పురాణం, శతకం, కావ్యం, ప్రబంధం, యక్షగానం, ఉదాహరణ, రగడ, అష్టకం మొదలగు ప్రక్రియలుంటే, ఆధునిక సాహిత్యంలో నవల, నాటకం, కథ, వ్యాసం, విమర్శ, జీవిత చరిత్ర, ఆత్మకథ మొదలగు ప్రక్రియలు వెలువడ్డాయి. ఆధునిక కవిత్వంలో భావ, అభ్యుదయ, దిగంబర, విప్లవ కవిత్వాలతోపాటు దళిత వాద, స్త్రీవాద, బి.సి.వాద, ముస్లిం మైనార్టీ వాద కవిత్వం కూడా వచ్చింది. ప్రపంచీకరణ ప్రభావం వల్ల తమ తమ అస్తిత్వాలు కోల్పోతున్న సందర్భంలో ఆయా కులాలవారు తమ అస్తిత్వాన్ని కాపాడుకోవడం కోసం ప్రయత్నం చేయడం ప్రారంభించారు. అందువల్లనే ఆధునిక కవిత్వంలో అస్తిత్వవాదాలకు ఎక్కువ ప్రాధాన్యత సంతరించుకుంది. అందులో భాగంగానే కవులు, రచయితలు తమ రచనల ద్వారా విధ్వంసానికి గురవుతున్న తమ సంస్కృతిని తమ రచనల ద్వారా స్పష్టపరిచారు. ఈ సందర్భంలో భాగంగా బి.సి. కులాలకు సంబంధించిన సాహిత్యం పద్యం, పాట, వచన కవిత్వం, కథ, నవల, విమర్శ- ఇలా బహురూపాలుగా విస్తరించింది. ముఖ్యంగా తెలంగాణలో వచ్చిన బి.సి.వాద సాహిత్యాన్ని పరిశోధిస్తూ అట్టెం దత్తయ్య రూపొందించిన గ్రంథమే ‘తెలంగాణ బి.సి.వాద సాహిత్యం’. మొత్తం ఏడు అధ్యాయాలుగా విభజిస్తూ రాయబడిన ఈ గ్రంథాన్ని పరిశీలిద్దాం.

మొదటి అధ్యాయంలో తెలంగాణ బి.సి. వాద సాహిత్యాన్ని రేఖామాత్రంగా పరిచయం చేశాడు. ‘ కొన్ని గాయాలు మానవు, కొన్ని గాయాలు మానినట్టుగా ఉంటాయి, కొన్ని అస్తిత్వ ఉద్యమాలు కూడా గాయాల్లాంటివే. ఒక్కసారి ఉవ్వెత్తున ఎగసిన ఉద్యమం అదే స్థాయిలో నిలబడలేకపోతుంది. నిశ్శబ్దంగా మొదలైన ఉద్యమాలు ఒక్కసారిగా ఉప్పెనలా ఎగసిపడతాయి. తమ ఆశలు, ఆశయాలు సాధించడానికి ఉరకలేసే ప్రయత్నం చేస్తాయి .అంతర్గత రక్తస్రావాలు జరుగుతూనే ఉంటాయి. గుండె ఆరిపోని కుంపటిలా రాజుకుంటూనే ఉంటుంది ‘ అని డాక్టర్ ఎస్. రఘు అన్నట్లుగా తెలుగు కవిత్వంలో బి.సి. వాద ఉద్యమానికి చారిత్రక నేపథ్యం ఉందన్న విషయాన్ని మనం తెలుసుకోవచ్చు. ఇతర అస్తిత్వ ఉద్యమాల వలె బి.సి. వాద సాహిత్యం కూడా వచ్చిందన్న విషయాన్ని దత్తయ్య ఈ అధ్యాయంలో చెప్పాడు. తెలంగాణ బి.సి.వాద సాహిత్యాన్ని పరిచయం చేస్తూ బి.సి.వాద సాహిత్యానికి ఒక నిర్వచనాన్ని, లక్షణాలను, సిద్ధాంత భూమికను స్థిరపరచడంలో సఫలీకృతుడయ్యాడు. పూర్తిస్థాయి బి.సి. కవిత్వంగా ‘వెంటాడే కలాలు- వెనకబడ్డ కులాలు’ సంకలన గ్రంథం రావడానికంటె ముందురోజుల్లో కొన్ని సంస్థలు ఒక అడుగు ముందుకు వేసి ‘దళిత బహుజనవాద కవిత్వం’అను ఉప శీర్షికలతో సంకలనాలు తెచ్చాయి. వాటిలో’ నీలిసాహితి’ సంస్థ ‘మేమే’, ‘మొగి’, నీలగిరి సాహితీ సంస్థ ‘ బహువచనం’ అను పేర్లతో సంకలనాలుగా వెలువరించాయన్న విషయాన్ని ప్రస్తావించాడు.

దళిత ససాహిత్యలోంచి ఒక పాయలాగా మొదలిడి, క్రమంగా దాని నుంచి విడివడి, ఆ తర్వాత ప్రత్యేక వాదంగా, దృక్పథంగా నిలదొక్కుకుంది బి.సి.వాద దృక్పథమంటూ ఖచ్చితమైన అభిప్రాయంతో బి.సి.లందరు ఉండాలన్న విషయాన్ని స్పష్టపరిచాడు. బి.సి. వాదమంటే ‘కులాన్ని పట్టుకొని వేలాడడం కాదు, కులవివక్షకు వ్యతిరేకంగా పోరాడడం’ అన్న విషయాన్ని ప్రతి బిసి గుర్తుంచుకోవాలని సూచించాడు. బి.సి. కవిత్వం ద్వారా తమ తమ కులవృత్తులు ఏ విధంగా విధ్వంసమవుతున్నాయో తెలియజేయడమే కాకుండా బి.సి.ల ఐక్యతను చాటి చెప్పడం కూడా జరిగింది. మరికొందరైతే ఆయా వృత్తులు ఆయా కులాలకు అంటగట్టడం వల్లనే వెనుకబడిపోతున్నామనే భావనతో కవిత్వం రాస్తున్నారన్న విషయాన్ని గుర్తుచేశాడు.

రెండవ అధ్యాయంలో తెలంగాణ ప్రాంత కవులు పద్య కవిత్వం ద్వారా బిసి వాదాన్ని ఏ విధంగా చాటిచెప్పారో తెలియజేశాడు. కులవృత్తులను ఆధారంగా చేసుకొని జీవించేవారు వెనకబడి ఉన్నారే తప్ప అభివృద్ధి చెందలేదని కవులు తమ పద్య కవిత్వం ద్వారా చెప్పిన విషయాల్ని ప్రస్తావించాడు.’ సజ్జన బిసి’శీర్షికతో మమత ఐల రాసిన పద్యాలతో పాటు మారుగొండ సాయిలు రాసిన ‘కులవృత్తులు’ అను పద్య కవితను పేర్కొన్నాడు. అంతేకాకుండా ఆయా కులాల వృత్తి నైపుణ్యాలను తమ పద్యాల ద్వారా చెప్పిన విధానాన్ని చక్కగా విశ్లేషించాడు. ఆయా కులవృత్తుల ప్రస్తావన పాల్కురికి సోమనాథుని వృషాధిప శతకంలో, పండితారాధ్య చరిత్రలో కనబడుతుందన్న విషయాన్ని తెలియజేశాడు. అదేవిధంగా గొల్ల కురుమలు, ఉప్పరులు, మున్నూరు కాపులు, దర్జీలు, విశ్వబ్రాహ్మణులు, పద్మశాలీలు, కుమ్మరులు, పిచ్చుకగుంట్లవారు, గౌండ్లు, నాయీ బ్రాహ్మణులు, మేదరులు, గంగిరెద్దులవారు, రజకులు, గంగపుత్రులు మొదలగువారి కులవృత్తుల ప్రాధాన్యతతో పాటు వాటిని ఆధారంగా చేసుకొని జీవించడం వల్ల కలిగే సమస్యల్ని పద్య కవిత్వం ద్వారా చెప్పిన విషయాల్ని పరిశీలించి చెప్పిన విధానం బాగుంది. వివిధ కులవృత్తుల వారు పెట్టుబడిదారుల చేతుల్లో కూలీలుగా మారే విధానాన్ని తెలిపాడు. అంతేకాకుండా దోపిడీకి గురికాకుండా పెట్టుబడిదారులను ఎదుర్కోవాల్సిన అవసరం ఉందని ఆయా కవులు చేసిన దిశానిర్దేశాన్ని ఎరుకపరిచాడు.

‘గొల్లడా’ అను శీర్షికతో కేశవపంతుల వేంకట నరసింహ శాస్త్రి రాసిన పద్యాలు, దోరవేటి శ్రమదేవోభవ కావ్యంలో రాసిన కులవృత్తులకు సంబంధించిన పద్యాలు, కాపుల జీవన విధానాన్ని తెలియజేస్తూ గంగుల శాయిరెడ్డి రాసిన ‘కాపుబిడ్డ’ కావ్యం, గోశిక్ నరహరి రచించిన ‘పద్మశాలి శతకం’, అవుసుల భానుప్రకాష్ రాసిన ‘ఘన శతకం’, మామిండ్ల రామాగౌడ్ గౌడ వృత్తిని తెలియజేస్తూ ‘ మధు విక్రేత’ శీర్షికతో రాసిన పద్యాలు, డాక్టర్ పాండాల మహేశ్వర్ రాసిన పద్యాలు, గంగిరెద్దుల వారి జీవితాన్ని చిత్రిస్తూ పల్లా దుర్గయ్య రాసిన ‘ గంగిరెద్దు’ కావ్యం మొదలగునవి ఆయా కులవృత్తుల ప్రాధాన్యతను, అందులోని సమస్యల్ని చక్కగా విపులీకరించాడు.

మూడవ అధ్యాయంలో ‘ తెలంగాణ పాట- బి.సి.వాదం’ గురించి తెలియజేస్తూ పాటకు, మానవుడికి అనాదిగా ఉన్నటువంటి సంబంధాన్ని చక్కగా చెప్పాడు. మనిషి పుట్టింది మొదలు మరణించేంత వరకు పాటతో అల్లుకొని పోయిన మనిషి జీవితాన్ని విడమరిచి చెప్పాడు. సకల మానవాళిని పాట ఏ విదంగా పరవశింపజేస్తుందో, ఆలోచింపజేస్తుందో, చైతన్యపరుస్తుందో, ఉద్యమింపజేస్తుందో అదేవిధంగా ఆయా కులవృత్తుల వారి బాధల్ని పాటల ద్వారా చాలామంది కవులు చెప్పడం జరిగింది. ఒకవైపు కులవృత్తుల ప్రాధాన్యతను వివరిస్తూనే మరోవైపు కులవృత్తులు ప్రపంచీకరణ ప్రభావం వల్ల ఏ విధంగా ధ్వంసమైపోతున్నాయో వివరించడం జరిగింది. బి.సి. కులాల ఆశ్రిత గాయకులు ఆయా కులాలకు సంబంధించిన వీరులు, నాయకులు, దాతల గురించి గానం చేస్తారు. కాని ఇప్పటికీ అన్ని బి.సి. కులాలకు సంబంధించిన ఆశ్రిత గాయకుల గురించి , వారు గానం చేసిన సాహిత్య సేకరణ సంబంధించి పరిశోధన పూర్తిస్థాయిలో జరగలేదన్న విషయాన్ని తెలియజేశాడు.

బి.సి. కులాల అస్తిత్వాన్ని తెలియజేస్తూ చాలామంది కవులు రాసిన పాటల్ని ఈ అధ్యాయంలో ప్రస్తావించడం జరిగింది. అయితే ఆయా వృత్తులకు సంబంధించిన పాటలన్నింటిని ఇక్కడ ప్రస్తావించకపోవడం గమనార్హం. రచయిత దృష్టికి రానటువంటి పాటలు కూడా చాలా ఉన్నాయని చెప్పవచ్చు. చెరబండరాజు, గూడ అంజయ్య, గోరటి వెంకన్న, జయరాజు, మిత్ర, దరువు ఎల్లన్న, కందికొండ, బండి సత్తెన్న, ననుమాస స్వామి, వయ్యా సామేలు, గుండేటి రమేష్ ,వడ్డేపల్లి కృష్ణ, స్ఫూర్తి,రాచ భూమయ్య, శమశ్రీ , నకిరేకంటి సీనయ్య మొదలగు కవులు రాసిన పాటలు ఆయా కులవృత్తుల విశిష్టతను, క్రమంగా కనుమరుగైపోతున్న కులవృత్తుల విధ్వంసాన్ని ఎరుక పరుస్తూ, బి.సి.ల ఐక్యతను చాటి చెప్పడం జరిగిందన్న విషయాన్ని తెలియజేశాడు. కేవలం పాటల్లోని భావాలను విశ్లేషించడమే కాకుండా బి.సి.లను చైతన్యపరిచే ఆవేశాన్ని రగిలిస్తూ దత్తయ్య వ్యాఖ్యానించిన విధానం బాగుంది.

నాలుగవ అధ్యాయంలో ‘ తెలంగాణ వచన కవిత్వం- బి.సి. వాదం’ గురించి తెలియజేశాడు. ఆధునిక కవిత్వంలో వచ్చిన పరిణామాల్లో భాగంగా పాట, పద్యం తర్వాత ప్రాధాన్యతను సంతరించుకుంది వచన కవిత్వమే. అస్తిత్వ ఉద్యమాలకు ఒక విస్తృతిని కలిగించింది వచన కవిత్వం. ఇవ్వాళ అన్ని ప్రక్రియల కన్నా వచన కవిత్వమే ముందంజలో ఉందని చెప్పవచ్చు. బి.సి.ల కుల వృత్తులు, వారి స్థితిగతులను తెలియజేస్తూ అనేక వచన కవితా సంకలనాలు వెలువడ్డాయి. జూలూరు గౌరీశంకర్ సంపాదకత్వంలో ‘వెంటాడే కలాలు- వెనుకబడిన కులాలు’,’ పొక్కిలి’,’ ఎడపాయలు’, ‘చెమ్మస్’, సుంకర రమేష్ సంపాదకత్వంలో’ తెలంగాణ కవిత’ మూడు సంపుటాలు, అఫ్సర్, వంశీకృష్ణ సంపాదకత్వంలో ‘అనేక’, ఎస్వీ సత్యనారాయణ, పెన్నా శివరామకృష్ణ సంపాదకత్వంలో ‘ దశాబ్ది కవిత’,చింతం ప్రవీణ్ సంపాదకత్వంలో ‘ సమూహం’, వి.జయప్రకాష్ సంపాదకత్వంలో’ బి.సి. కవితాసంకలనం’, ‘రుంజ’ మొదలగువాటిలోని కవితలన్నీ బి.సి.ల సబ్బండ కులాల అస్తిత్వానికి నిదర్శనంగా నిలిచిన విధానాన్ని రచయిత ఈ అధ్యాయంలో వివరించాడు.

అమ్మంగి వేణుగోపాల్ రాసిన ‘బి.సి. ప్రభంజనం’ కవిత బి.సి. కులాల మూలాలను, ప్రారంభంలో వారి వృత్తులను, చరిత్ర నిర్మాణానికి, సమాజాభివృద్ధికి, సకల మానవులకు బి.సి.ల వృత్తులు ఎంతగా పనిచేశాయో, చేస్తున్నాయో సకల మానవులకు గొంతెత్తి చెప్పింది. డాక్టర్ బెల్లి యాదయ్య రాసిన ‘నేను గొర్రెల్ని కాస్తుంటాను’, టి కృష్ణమూర్తి యాదవ్ రాసిన’ యదువంశ పుత్రులం’ , భైతి దుర్గయ్య రాసిన ‘గొంగడి గోస ‘ ,తగుళ్ళ గోపాల్ రాసిన ‘నాన్న గొడ్డలి’ ,అట్టెం దత్తయ్య రాసిన’ కాపరి’ , అవని శ్రీ రాసిన ‘నేను గొర్రెల కాపరిని’, దెంచనాల శ్రీనివాస్ రాసిన ‘యాడీ’, ‘మనే మార్నాక్’ , ఆడెపు లక్ష్మణ్ రాసిన’ కొలిమి’, సుద్దాల అశోక్ తేజ రాసిన’ శ్రమ కావ్యం’, వెన్నెల సత్యం రాసిన ‘ కొలిమి నా చెలిమి’ , వంగాల సైదాచారి రాసిన’ వడ్రంగి బతుకులు’ , వడ్ల సంగయ్య రాసినవ’ కట్టెపురుగు తొలిసినట్టు’ , బాణాల శ్రీనివాస్ రాసిన’ రుంజ’, దాసోజు జ్ఞానేశ్వర్ రాసిన’ నిక్కాక’, డాక్టర్ కూరెళ్ల విఠలాచార్య రాసిన ‘కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్’, వనపట్ల సుబ్బయ్య రాసిన’ ధర్మచక్రం’,డాక్టర్ నందిని సిద్ధారెడ్డి రాసిన’ మృత్కళలు’ , అన్నవరం దేవేందర్ రాసిన’ బువ్వకుండ’ మొదలగు కవితల్లో ఆయా కవులు తమ తమ కులవృత్తుల విశిష్టతను గూర్చి తెలియజేయడమే కాకుండా అవి విధ్వంసమవుతున్న తీరును తెలియజేసిన విధానాన్ని పేర్కొనడం జరిగింది. తెలంగాణ వచనకవిత్వంలో బహుజన సామాజిక, సాంస్కృతిక కోణాలనన్నింటిని ఈ అధ్యాయంలో దత్తయ్య విశ్లేషించాడు.

ఐదవ అధ్యాయంలో ‘తెలంగాణ కథ- బి.సి.వాదం’ గురించి పరిశీలించాడు . కథాసాహిత్యంలో బి.సి. కులాల స్థితిగతులను తెలియజేసిన కథలు అస్తిత్వ ఉద్యమాల కంటె ముందు నుంచే కనిపిస్తాయి. తెలంగాణ కవులు, రచయితలు ఎక్కువగా గ్రామీణ జీవితాల నుంచి వచ్చినవారు కావడం వల్ల వారి చుట్టూ ఉన్న అన్ని రకాల వ్యక్తుల గురించి, వృత్తుల గురించి కథలు రాశారు . తెలంగాణ నుంచి వచ్చిన కథాసాహిత్యంలో ఎక్కువగా గ్రామీణ జీవితాన్ని, కుల వృత్తి జీవితాన్ని తెలిపినవిగానే కనిపిస్తాయి. ఆవుల పిచ్చయ్య, గూడూరి సీతారాం ,పి.వి. నరసింహారావు, ఆదిరాజు వీరభద్రరావు, అల్లం నారాయణ మొదలగువారు కులవృత్తి ఆధారిత జీవితాలను కథలుగా మలిచి సమాజాన్ని చైతన్యం కలిగించారు. అయితే బి.సి.లు చాలా వరకు తమ కుల బాధల్ని తక్కువగా చెప్పడం జరిగిందన్న విమర్శ కూడా లేకపోలేదు. అగ్రవర్ణాల మెప్పు కోసం తమ సొంత అస్తిత్వాన్ని పక్కకు పెట్టి కథలు రాస్తున్నవారు కూడా లేకపోలేదు. కొన్ని కులాలకు సంబంధించిన కథలు ప్రత్యేక సంపుటాలుగా వెలువడిన విషయాన్ని రచయిత పేర్కొన్నాడు. సంగిశెట్టి శ్రీనివాస్, ఓబులేష్, వెల్దండి శ్రీధర్ ల సంపాదకత్వంలో చేనేత కథలకు సంబంధించిన’ పడుగు పేకలు’, కాలువ మల్లయ్య, ప్రభంజన యాదవ్, భారతిల సంపాదకత్వంలో గొల్ల కురుమలకు సంబంధించిన’ వేపకాయంత నిజం’, నేరెళ్ల శ్రీనివాస్ గౌడ్ వెలువరించిన గౌడ్ లకు సంబంధించిన ‘మా బతుకులు’, నాయిబ్రాహ్మణుల జీవితాలకు సంబంధించి తుమ్మల రామకృష్ణ సంపాదకత్వంలో వెలువడిన ‘అడపం’, ఉప్పల నరసింహం వెలువరించిన’ సబ్బండ వర్ణాల సారస్వతం’ మొదలగునవి బి.సి.ల అస్తిత్వాన్ని తెలియజేసే విధంగా ఉన్నాయంటూ దత్తయ్య విడమరచి చెప్పాడు.

వివిధ కులాల జీవితాలను చిత్రించే కథలు రాసిన పి.వి. నరసింహారావు , ఆవుల పిచ్చయ్య, కాలువ మల్లయ్య, నల్ల భూమయ్య, బి.ఎస్.రాములు, భూపాల్, అల్లం రాజయ్య, పెద్దింటి అశోక్ కుమార్, అట్టెం దత్తయ్య, ప్రభంజన్ యాదవ్, కె వి నరేందర్, బోయ జంగయ్య, జూకంటి జగన్నాథం, గూడ అంజయ్య, బివియన్ స్వామి, నందిని సిధారెడ్డి, దిలావర్, వెంకట రామారావు, రేగులపాటి కిషన్ రావు, మేరెడ్డి యాదగిరిరెడ్డి, దేవేంద్ర, వెల్దండి శ్రీధర్, అంబల్ల జనార్దన్, అనిశెట్టి రజిత, జి. రాములు, శిరంశెట్టి కాంతారావు, కాలువ మల్లయ్య, నేరెళ్ల శ్రీనివాస్ గౌడ్, జాతశ్రీ, టి. సంపత్ కుమార్, ఐతా చంద్రయ్య, గూడూరి సీతారాం మొదలగు వారు రాసిన కథలను ప్రస్తావించడం జరిగింది. చాలా కథలు ప్రపంచీకరణ దుష్పరిణామాలను ఎంత ప్రభావవంతంగా రికార్డు చేశాయో కూడా దత్తయ్య ఈ అధ్యాయంలో చర్చించాడు.

ఆరవ అధ్యాయంలో’ తెలంగాణ నవల- బి.సి. వాదం’ గురించి వివరించాడు. తెలుగు సాహిత్యంలో కవిత్వం తప్ప కథ, నవల ,నాటిక, విమర్శ, వ్యాసం మొదలైన వాటిని సాహిత్యంగా పరిగణించక పోవడం గమనిస్తుంటాం. ఇతర ప్రక్రియల కన్నా కవిత్వానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం కనిపిస్తుంది. మిగతా ప్రక్రియల్లో వచ్చినంతగా బి.సి.వాద సాహిత్యం నవలా ప్రక్రియలో రాలేదనే విషయాన్ని రచయిత స్పష్టపరిచాడు. సమాజంలో ఎక్కువ శాతం వివిధ కుల వృత్తులకు సంబంధించిన నవలలు రావడం చాలా అరుదు. బి.సి.ల స్థితిగతులను తెలిపే నవలలో 1954లో వచ్చిన ‘పెరటి చెట్టు’ నవలిక,1955లో వెలువడిన ‘సంఘము’ నవల ముఖ్యమైనవి. భూపాల్ రాసిన ‘గుడ్డెళ్ళ గుమ్మి మారెమ్మ’, ‘పట్నమొచ్చిన పల్లె’, కాలువ మల్లయ్య రాసిన ‘సాంబయ్య సదువు’, ‘భూమి పుత్రుడు’, ‘బతుకు పుస్తకం’ , ‘గువ్వలచెన్న’, ముదిగంటి సుజాత రెడ్డి రాసిన’ సంకెళ్లు తెగాయి’, దేవులపల్లి కృష్ణమూర్తి రాసిన ‘ఊరు వాడ బ్రతుకు’, ‘బయటి గుడిసెలు’, బి.ఎస్.రాములు రాసిన ‘జీవనయానం’, శిరంశెట్టి కాంతారావు రాసిన ‘పరంపర’ , నేరెళ్ల శ్రీనివాస్ గౌడ్ రాసిన ‘బ్రతుకుతాడు’, ‘దుల్దుమ్మ’, ‘కల్తీ బతుకులు’, కె వి ఎల్ రాసిన’ కల్లు మండువ’ జి. రాములు రాసిన ‘పెరటిచెట్టు’ ననుమాస స్వామి రాసిన ‘మోహిని’, ఎమ్.ఎస్.ప్రాణ్ రావు రాసిన ‘ప్రజా జ్యోతి పాపన్న’, ఎన్ వి తిరుపతయ్య రాసిన’ జీవన సమరం’ మొదలగు నవలల్లో ఆయా కులాల చిత్రీకరణ జరిగిన విధానాన్ని చక్కగా విశ్లేషించాడు. అయితే బహుజనుల జీవితాలను చిత్రీకరిస్తూ తెలంగాణలో పరిమితంగా నవలలు వచ్చాయన్న విషయాన్ని కూడా గుర్తు చేశాడు.

చివరగా ఏడవ అధ్యాయంలో ‘తెలంగాణ బి.సి. వాదం- సాహిత్య విమర్శ’ను పరిశీలించడం జరిగింది. రచయిత తన చుట్టూ ఉన్న సాంఘిక జీవితంలో మానవ సంబంధాల పట్ల ఎలాంటి వైఖరి కలిగి ఉన్నాడు, తన రచనను ఏ సామాజిక ప్రయోజనం కోసం అంకితం చేశాడు, వర్గ జీవితంతో రచయితకున్న సామాజిక తాత్విక సంబంధాలు ఏమిటి, తన రచన సంఘం మీద ఎలాంటి ప్రభావం చూపాలని ఆశిస్తున్నాడు, ఇలాంటి ప్రశ్నలన్నిటికీ శాస్త్రీయమైన సమాధానాలను ప్రశ్న ద్వారా విశ్లేషించడమే విమర్శ. బి.సి. సాహిత్య విమర్శ గురించి ప్రత్యేక పుస్తకాల రూపంలో ప్రస్తావించడం జరిగింది. కథా సాహిత్యం మీద బి.ఎస్.రాములు వెలువరించిన ‘ బి.సి. కథలు- ఒక విశ్లేషణ’ (2000 -2010), జూలూరు గౌరీశంకర్ సంపాదకత్వంలో వచ్చిన వ్యాస సంకలనం ‘ ఒక కవిత 20 కోణాలు’. తెలుగు అకాడమీ వారు ప్రచురించిన తెలుగులో కవిత్వోద్యమాలు గ్రంథంలో జూలూరు గౌరీశంకర్ రాసిన వ్యాసం ‘కవిత్వంలో బి.సి. అస్తిత్వవాదం’. ఇందులో బి.సి.ల అస్తిత్వాలను, వారి రచనల్లో మేళవించిన వేమన, పోతులూరి వీరబ్రహ్మం వంటి వారిని గూర్చి గుర్తు చేయడం కూడా జరిగింది. అదేవిధంగా బాణాల శ్రీనివాస్, సంగిశెట్టి శ్రీనివాస్, పగడాల నాగేందర్, జె.చెన్నయ్య, బివిఎన్ స్వామి, కె.పి.అశోక్ కుమార్, ఆచార్య ననుమాస స్వామి మొదలగు వారి విమర్శ వ్యాసాలు బి.సి.వాదాన్ని మరింత ఇనుమడింపజేసే విధంగా ఉన్నాయి. ఇటీవల కాలంలో విశ్వవిద్యాలయాలలో కూడా బి.సి. కులాల సాహిత్యం మీద పరిశోధనలు జరుగుతున్న విషయాన్ని ప్రస్తావించాడు. అయితే బి.సి. సాహిత్య విమర్శ మీద పక్షపాతం వహిస్తున్నారన్న విషయాన్ని కూడా ప్రస్తావించాడు. బి.సి.యేతర సాహిత్య విమర్శకులు కొంత న్యాయబద్ధంగా ఆలోచించాల్సిన అవసరం ఉందని సూచించడం బాగుంది. బి.సి. విమర్శకులు ఈ మధ్యకాలంలో సాహిత్య విమర్శ పునాది గోడలుగా నిలుస్తున్నారు కాని బి.సి. సాహిత్యాన్ని మాత్రం పట్టించుకోవడంలేదనే విమర్శ ఉంది. బి.సి. కవులకు, రచయితలకు విమర్శకులు ప్రోత్సాహాన్ని అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్న విషయాన్ని తెలియజేయడం ఎంతో సమంజసంగా ఉంది.

ఇలా తెలంగాణ బి.సి వాద సాహిత్యంపై ఒక పరిశోధనా గ్రంథాన్ని తీసుకొని వచ్చిన దత్తయ్య ప్రయత్నం చాలా గొప్పది. ‘ ఒక చిన్న ప్రయత్నం’ అని తాను వినయంగా విన్నవించుకున్నా అది చిన్న ప్రయత్నమేమీ కాదు, పెద్ద సాహసమే. బి.సి. సాహిత్యాన్ని పరిశోధించడమంటే ఆయా కులాల అస్తిత్వాన్ని శోధించడమే. డాక్టర్ సాగి కమలాకర శర్మ అన్నట్లుగా ‘వేరు వేరు కులాల వేదనాక్షరాలను విశ్లేషించే ప్రయత్నం ఈ గ్రంథం’. ఎంతో ఓపికగా బి.సి.వాద సాహిత్యాన్ని సేకరించి ప్రక్రియలవారీగా పరిశీలించడంలో సఫలీకృతుడయ్యాడు దత్తయ్య. మొత్తం బి.సి.వాద సాహిత్యాన్ని మన ముందుంచడమంటే కొండను అద్దంలో చూపే ప్రయత్నమే. ఇది భవిష్యత్తులో బి.సి.వాద సాహిత్యంపై పరిశోధన చేసేవారికి ఒక దిక్సూచిలా ఉపయోగపడుతుంది. విశేషమైన కృషి చేసి బి.సి. సాహిత్య పరిశోధనకు చక్కని బాట వేసిన దత్తయ్యకు హృదయపూర్వక అభినందనలు.

2 thoughts on “బి.సి. సాహిత్య పరిశోధనకు దిక్సూచి

  1. చాలా బాగా చెప్పారు సార్..
    దత్తు అన్న కృషికి తగిన ప్రశంశ….

  2. వ్యాసం బాగుంది, దత్తు గారి కృషి అభినందనీయం. భవిష్యత్ పరిశోధనలకు నాంది కాగలదు ఈ పుస్తకం.

Leave a Reply