బాల కార్మికులు

-తనుశ్రీ శర్మ
(అనువాదం: హిమజ
)

అనేక ఆశలతో వెలిగే కళ్ళు,
సంతోషకరమైన చిరునవ్వులు
మృదువైన చేతులు, కోటి కమ్మని కలలు
ఇది కాదా పిల్లలను గుర్తించే తీరు

మరి, నాకెందుకిలా కనబడుతున్నారు!
నీళ్ళు నిండిన కళ్ళు, భయంతో నిండిన ముఖాలు
కఠినమైన చేతులు, చెదిరిన కలలు
అవును….
వారు బాల్యాన్ని కోల్పోయారు
పని వారి తలకు మించినదైంది
బాధ్యతలతో బతుకు భారమైంది

ఆడి పాడే ఈ వయసులో
ఎంతో నేర్చుకోవాలి
ఎన్నెన్నో సాధించాలి
కావాల్సిన సమయమే వారికి లేదు

ఆ ఒక్క కారణం కోసం పోరాడండి
మీ గళం విప్పండి
బాల కార్మికులను ఆపండి
వారి మొహాలపై తిరిగి చిరునవ్వుల్ని వెలిగించండి
వారికి మరల బాల్యాన్ని ఇవ్వండి
శ్రమభారం దొంగిలించిన వారి శైశవాన్ని
వారికి తిరిగివ్వండి

ఆ ఒక్క కారణం కోసం పోరాడండి
గళం విప్పండి
బాల కార్మికులను ఆపండి

(Child labour : తనుశ్రీ శర్మ)

*

చిమ్నీలు శుభ్రం చేసే వాళ్ళు

-విలియం బ్లేక్
(అనువాదం: హిమజ
)

మా అమ్మ చనిపోయినప్పుడు
నేను చాలా చిన్నవాడిని,
మా నాన్న నన్ను వీళ్ళకి అమ్మేసాడు
నాకింకా గుర్తుంది
నా నాలుకపై నా గొంతులో ఏడుపే ఏడుపు

నేను ఈ చిమ్నీలను తుడిచి శుభ్రం చేస్తాను
ఈ నల్లని మసిలోనే నేను నిద్రపోతాను.

మాలో ఒకడు చిన్న టామ్ డాక్రే ఉన్నాడు,
అతని తలంతా గొఱ్ఱెపిల్ల బొచ్చులా
వంకర టింకరగా జుట్టు పెరిగిపోయింది
గుండు చేసినప్పుడు ఎంతగా ఏడ్చాడో పాపం

నేనిలా అన్నాను,
హుష్, టామ్! పర్వాలేదు, ఎందుకంటే
నీ తల గుండు అయినప్పుడు,
మసి నీ తెల్లని జుట్టునేమీ పాడుచేయదని
నీకు తెలుసుగా …..”
అతను నిశ్శబ్దంగా మరేం మాట్లాడలేదు

అదే రాత్రి,
టామ్ నిదురిస్తున్నపుడు అతడో కల గన్నాడు
వేలాది మంది చిమ్నీ తుడిచేవాళ్ళు
డిక్, జో, నెడ్ ఇంకా జాక్, అందరూ నల్లటి శవపేటికలలో బంధించబడ్డారట
ఒక ప్రకాశవంతమైన తాళం చెవిని పట్టుకొని
ఒక దేవదూత వచ్చి
ఆ శవపేటికలను తెరిచి అందరినీ విడిపించాడట
అప్పుడందరూ ఒక పచ్చటి మైదానంలో
దూకుతూ, ఎగురుతూ నవ్వుతూ, వాళ్ళంతా పరిగెత్తారట
నదిలో జలకాలాడి సూర్యుని వెలుగులో ప్రకాశించారట

అప్పుడు స్వేచ్చగా , స్వచ్ఛంగా
వారి పని సంచులన్నీ విముక్తమయ్యాయట

వారు మేఘాల మీద లేచి, గాలిలో ఆడుతున్నారు;
దేవదూత టామ్‌తో చెప్పాడు,
తాను మంచి పిల్లవాడు అయినట్టయితే, తన తండ్రిని దేవుడు బాగా చూసుకుంటాడని
ఎప్పుడూ ఆనందాన్ని కోరుకోవద్దని

టామ్ దిగ్గున మేల్కొన్నాడు,
మేమంతా చీకటిలోనే నిదుర లేచాము
పని చేసేందుకు బ్రష్‌లతో మా సంచీలు వచ్చాయి
ఉదయం చల్లగా ఉన్నప్పటికీ
టామ్ సంతోషంగా వెచ్చగా, తన కలను మననం చేసుకుంటూ ఉన్నాడు,

అందరూ తమ కర్తవ్యాన్ని ఖచ్చితంగా నిర్వర్తిస్తే,
వారు హాని జరుగుతుందని భయపడాల్సిన
అవసరమే లేదు.!!

(Chimney Sweeper : William Blake)

*

(“ది చిమ్నీ స్వీపర్” విలియం బ్లేక్ రాసిన కవిత. 1789లో సాంగ్స్ ఆఫ్ ఇన్నోసెన్స్, 1794లో సాంగ్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్‌లో రెండు భాగాలుగా ప్రచురితమైంది. “ది చిమ్నీ స్వీపర్” అనే పద్యం బాల కార్మికుల చీకటి నేపథ్యానికి వ్యతిరేకంగా రాసినది. 18 వ శతాబ్దపు చివరలో ఇంగ్లాండ్‌లో ప్రముఖంగా నిలిచిన కవిత. విలియం బ్లేక్ రాసిన ఈ కవిత విక్టోరియన్-యుగం లండన్ లోని బాల కార్మికుల దుస్థితిని దృశ్యమానం చేస్తుంది. వీరిలో చాలామంది పసిపిల్లలుగానే పనులకు బలవంతంగా పంపించబడ్డారు. పనిభారం, శ్రమ, మసి మనుషులందరూ భరించే బాధలకు ప్రతీకగా మారాయి. బైబిల్ ఇతివృత్తాలతో బ్లేక్ నిరంతర నిశ్చితార్థానికి అనుగుణంగా, బాల చిమ్నీ స్వీపర్లు మోక్షం గురించి కలలు కన్నారు. అప్పటి ఆ భావజాలం బాలకార్మికులను తమంతట తామే పనివైపు మళ్ళేలా చేసిందనిపిస్తుంది.)

Leave a Reply