బతుకు సేద్యం – 4

వూళ్ళో రెండు మంచినీటి బావులున్నాయి. ఒకబావిలో నీళ్లు పెద్దకులం వాళ్ళైన కరణం కుటుంబం, జంగం పటేళ్ల కుటుంబాలు, కోమట్లు చేదుకుంటారు. రెండోబావి ఊరందరిది. నిచ్చెనమెట్ల కుల వ్యవస్థలో మాల మాదిగలకు పైన ఉన్న శూద్ర కులాలవాళ్ళు నీళ్లు చేది పోస్తేనే మాల మాదిగలకు తాగు నీళ్లు. లేకుంటే లేదు. వీరికంటే పైనున్న కులాలవాళ్లెవరైనా వచ్చే వరకూ ఎంతసేపైనా పడిగాపులు పడుతూ బావికి అంత దూరాన కుండలతో ఎదురు చూడాల్సిందే. ఇంతకు ముందెప్పుడూ ఎంత అవసరం ఉన్నప్పటికీ బావి అంచులు కూడా తాకలేదు. ఇప్పటిలా బావిలో చేద వేసే ధైర్యం ఎన్నడూ చెయ్యలేదు.

హనుమాండ్లు పెడబొబ్బలు పెడుతూ పరుగెత్తుకెళ్లే సరికి వార్త ఊరంతా దావానలంలా వ్యాపించింది. ఎప్పుడు ఏమవుతుందోనని అంతటా ఉత్కంఠ. ఎవరినోట విన్నా అదేమాట. ఏదో అపచారం జరిగిపోయిందని, ఇంకా కీడు ఎటునుంచి పొంచి ఉన్నదోనని రకరకాలుగా వ్యాఖ్యానాలు సాగుతున్నాయి. అణువణువునా జీర్ణించుకుపోయిన కన్నూ మిన్నూ కానని కుల అహంతో పళ్ళు పటపటలాడించారు పెద్దలు. తోక తొక్కిన తాచులా బుసలు కొట్టడం మొదలుపెట్టారు. వాళ్ళ ఆవేశానికి ఆజ్యం పోస్తూ.. ఎవడ్రా మన బావిలో చేద వేసింది… వాళ్ళ అంతు చూడాల్సిందే అంటూ రెచ్చగొట్టారు కొందరు. కోపంతో ఊగిపోతూ అమ్మనాబూతులు తిడుతూ కర్రలతో బావి దగ్గరకు పరిగెత్తారు కొందరు ఆవేశపరులు.

ఎప్పుడూ ఊళ్ళో ఇటువంటివి కనీవినీ ఎరుగని పరిస్థితి. ఊరవతల ఉండే బక్కచిక్కినోళ్లు ఈ పని చేయగలిగారంటే వాళ్ళ వెనక ఉన్న బలం సంఘం. అది చూసుకునే వీళ్ళ బలుపు అనుకున్నారు ఆలోచనాపరులు. సంఘం పెద్దలంటే వాళ్ళకీ దడుపే. వాళ్లంతా చదువుకున్న వాళ్ళు. పట్నం వాళ్ళు. వాళ్ళకి చాలా విషయాలు తెలుసు అని అనుకుంటారు కాని తమ బావి మైల పడడాన్ని తట్టుకోవడం కష్టంగా ఉంది. తరతరాలుగా కొనసాగుతూ వస్తున్న ఆచారానికి గండిపడుతున్నందుకు తమ నెత్తి మీద పిడుగులు పడుతున్నట్టు బాధపడిపోయారు. తమని ధిక్కరిస్తున్న స్వరాలను ఎదుర్కోకపోతే మరింత పెట్రేగిపోతారని అనుకున్నారు. అప్పటికప్పుడు ఏదైనా చేయమని మనసు తొందర పెడుతున్నా తప్పదు సంయమనం పాటించాలి. అచ్చిరానికాలానికి అడుక్కుతినడానికి బోతే ఉన్న చిప్ప పోయినట్లవుతుందని అతనికి బాగా తెలుసు. అందుకే కొన్ని సార్లు పట్టు విడుపులతో వ్యవహరించాలని ఎగిరెగిరిపడుతున్న వారికి చెప్పాడు లౌక్యం తెలిసిన సర్పంచ్.

మా నీళ్లు మేము చేదుకుంటున్నాం. ఎవరి దయాదాక్షిణ్యాలమీద ఆధారపడిలేము. వివక్షల నుండి, అసమానతల నుండి, అవమానాల నుండి విముక్తమవుతున్న ఉత్సాహం కట్టలు తెంపుకొచ్చి వెలివాడల జనంలో కొత్త శక్తినింపుతున్నది. పెద్దల మాటలు వింటూ తచ్చాడుతున్న పిల్లలు అబ్బ.. ఇకనుండి ఎన్ని కావాలంటే అన్ని నీళ్లు తాగొచ్చని సంబరపడుతున్నారు. చెంబో, ముంతో, చిన్న మట్టి కుండో పట్టుకుని ఉత్సాహంతో బావికి బయలు దేరారు కొందరు పిల్లలు.

సంతోషమ్మ కోడలు నవనీత రెండో బిందె కోసం మళ్ళీ బావి దగ్గరకు వెళ్తున్నది. అది చూసి ఆవేశంతోవచ్చిన వాళ్ళలోంచి ఓ యువకుడు అసభ్యకరమైన పదజాలంతో ఆమెను దుర్భాషలాడాడు. అందుకామె ఊరుకోలేదు. కుంచించుకుపోలేదు. ఆధిపత్యపు చీకటి సరిహద్దులను దాటే ప్రయత్నం చేస్తూ అదే భాషలో జవాబిచ్చింది. ఆవేశపరుల ఆవేశం కట్ట తెగిన చెరువులా ఉంది. నవనీత పై దాడి చేశారు. ఆమె చేతిలోని కుండను లాగి అవతలికి గిరాటేశారు. అది కిందపడి భళ్ళున పగిలి ముక్కలైంది. ఆమెను కింద పడేసి గుడ్డలు లాగుతూ కాళ్లతో తన్నడం మొదలు పెట్టారు. నవనీతను దుర్భాషలాడం చూసిన పిల్లవాడొకడు పరుగు పరుగున వెళ్లి వాడలోని యువకులకు చెప్పాడు. యువకులంతా బావికేసి పరుగుపెట్టారు. అప్పటివరకూ అక్కడుండి వెళ్లిన సంఘం మహిళలు మళ్ళీ పరుగు పరుగున బావి దగ్గరకు చేరారు.

ఈ బావి తవ్వింది మా తాత ముత్తాతలే. మీ తాత ముత్తాతలు కాదు. మా చేతులతో తవ్వినప్పుడు ఈ బాయి మైలపడలేదా.. ఇప్పుడదే చేతులతో చేద బావిలోవేస్తే మైలపడిందా అంటూ ఆవేశంతో ఊగిపోతున్న శూద్ర యువకుల మీదకురికాడు హాస్టల్ లో ఉండి చదువుకునే పదిహేనేళ్ల కుర్రాడు చంద్రయ్య. కర్రలేసుకొచ్చిన వాళ్ళు అతని మీదకు కొట్టొచ్చిన సమయంలో దుమ్ములేపుకుంటూ పోలీసు జీప్ వచ్చి ఆగింది. కొద్దిగా వెనక్కి తగ్గారు శూద్ర యువకులు. లేదంటే ఆ క్షణంలో తలలు పగిలేవే. రక్త తర్పణం జరిగేదే. అప్పటివరకూ గుండెలుగ్గబట్టుకుని భయం భయంగా ఉన్న ఊరవతలి జనంలో ధైర్యం వచ్చింది. సంఘం ఆఫీసువాళ్ళు ఆ రోజు ఉదయమే పోలీసు స్టేషనుకు వెళ్లి ఏఏ గ్రామాల్లో మంచినీళ్ల బావిలో చేద వేసే కార్యక్రమం పెట్టుకున్నారో చెప్పి ఆ గ్రామాల జాబితా ఇచ్చారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉంది కాబట్టి తమకు సహకరించమని కోరుతూ ఒక విన్నపం రాసి పోలీసు స్టేషన్లో ఇచ్చి వాళ్ళతో సంతకం చేయించుకొని ఒక కాపీ తమతో పెట్టుకున్నారు. పరిస్థితి చూద్దామని వచ్చిన పోలీసులు సరైన సమయానికే చేరుకున్నారు. వాళ్ళ రాకతో పెద్ద యుద్ధమే తప్పిందనుకున్నారు జనం. పోలీసులు వచ్చి వెళ్లినా రెండు వర్గాల ఆవేశకావేశాలేం తగ్గలేదు. మాటల కత్తులు దూసుకుంటున్నారు. బావిని మైల పడేసిన వాళ్ళ అంతు చూస్తామని ఒకరు గర్జిస్తే… మా ఆడవాళ్ళమీద చేసిన దౌర్జన్యానికి తగిన ఫలితం అనుభవిస్తారని మరొకరు ఘింకరించారు.

బావి ఊరందరిదీ కాబట్టి ఊరంతా ఎప్పుడు ఎవరికి అవసరం అయితే అప్పుడు నీళ్లు పట్టుకుపోవచ్చని, ఎవరు ఎవరిని దూరం పెట్టినా చర్య తీసుకోవాల్సొస్తుందని పోలీసులు ప్రకటించారు. గ్రామంలో పది రోజుల పాటు 144 సెక్షన్ విధించారు.

తమకంటే పై కులాల వాళ్ళ దగ్గరకు పోయి మొర పెట్టుకున్నారు ఇతర శూద్ర కులాల వాళ్ళు. సెగ తమకు తగలలేదు కాబట్టి ఆ సంఘటనతో దూరంగానే ఉన్నారు పై కులాల వాళ్ళు. లేకపోతే తమ వేలితో తమ కన్ను పొడుచుకోవాల్సిన పరిస్థితి రావచ్చన్న భయం వాళ్ళది. అది ఉత్పత్తి కులాల మనసుల్ని బాగా నొప్పించింది. ఇట్లాగయితే ఊరవతలవాళ్ళు పెట్రేగిపోతారు. కానీ తప్పదు. ఇప్పటికి మౌనంగా ఉండడమే మంచిదని లోపల్నుంచి తన్నుకొస్తున్న ఆవేశాన్ని జోకొట్టారు.


సంఘంలో చేరాక నాలుగు వానాకాలాలు వచ్చి పోయాయి. ఈ ఏడు ఎన్నడూ లేనివిధంగా జహీరాబాద్ ప్రాంతంలో భారీ వర్షాలు నమోదయ్యాయి. గ్రామాలు నీట మునిగిపోయాయి. ఎగువ ప్రాంతం నుంచి వచ్చేనీటితో ఊరవతల పల్లంలో ఉన్న దళిత వాడ చెరువును తలపిస్తున్నది. ఉన్న బర్రెలు, గొర్రెలు, కోళ్లు కట్లు తెంచారు. నీళ్లలో కొట్టుకుపోకుండా ఏదో ఒడ్డుకు చేరి ప్రాణాలు నిలుపుకుంటాయన్న ఆలోచనతో. జనం పిల్లాపాపలనేసుకుని, ముసలీ ముతకను వెంటబెట్టుకుని కట్టుబట్టలతో గుబ్బడి మీదకు చేరి ప్రాణాలు నిలుపుకున్నారు. తినడానికి తిండి, తాగడానికి నీళ్లు కరువయ్యాయి. వచ్చిన వర్షాన్ని గురించి కథలు కథలుగా చెప్పుకుంటూ మూడురోజులు రాత్రి పగలు అక్కడే గడిపారు.

ఎడతెరిపి లేని వాన కొద్ద్దిగా విశ్రాంతి నిచ్చింది. సంఘం మహిళలు వర్షాల గురించిన సమాచారం సంఘంలో చెప్పడానికి బయలుదేరదామని అనుకుంటూండగా మళ్ళీ భోరున వర్షం మొదలైంది. ఆ ఎత్తైన ప్రదేశం నుండి ఊళ్ళోకి కదలలేని పరిస్థితి. ఇళ్లకు పోలేని స్థితి. మొత్తానికి ఆ సాయంత్రానికి వర్షం తగ్గుముఖం పట్టింది. ఊరు వాడ ముంచెత్తిన నీళ్లు పూర్తిగా పోలేదు. తాము పుట్టి బుద్దెరిగాక ఎప్పుడూ ఇటువంటి వానలు చూడలేదని అన్నారు పెద్ద తరం వాళ్ళు. ఈ ఆపద నుండి గట్టెక్కడం ఎట్లాగో అర్ధం కావడం లేదు మొగులమ్మ వాళ్ళకి. తమ ఇళ్ళు వాకిళ్లు ఎట్లా ఉన్నాయోనని జనం తల్లడిల్లిపోతున్నారు. అలాంటి ఆపద సమయంలో ప్రాణాలకు తెగించి మొగులమ్మ, సంతోషమ్మలు సంఘం ఆఫీసుకు వెళ్లి తమ పరిస్థితి వివరించారు. సంఘం పనిచేస్తున్న గ్రామాల్లోంచి మరి కొందరు కూడా తమ కష్టం చెప్పుకోవడానికి వచ్చారు.

మీకు మేమున్నాం అంటూ భరోసా ఇచ్చారు సంఘం ఆఫీసు వాళ్ళు. ఆ భరోసా వాళ్లలో వెయ్యేనుగుల బలాన్నిచ్చింది. వెంటనే సహాయ కార్యక్రమాలు మొదలుపెట్టారు. సంఘం తో కలసి తాము కూడా సహాయ కార్యక్రమాల్లో ముందువరసలో నిలబడి పనిచేశారు మొగులమ్మ బృందం. వరద నీటిలో మునిగిన భూములకు నష్టపరిహారం ఇస్తామని, కూలిపోయిన ఇళ్లకు ఇళ్ళు కట్టిచ్చి ఇస్తానని వాగ్దానం చేసింది ప్రభుత్వం. ఆ సమయంలో పని దొరకక, తిండి గింజలు పుట్టక జీవం నిలుపుకోవడానికి ఏదైనా పనిదొరుకుతుందేమొనని కొందరు గ్రామస్తులు పట్నం బాట పట్టారు. ఏమీ చేయలేని నిరుపేదలు ఉన్నచోటనే ఉండి ఆకలితో అల్లాడిపోయారు. పరిమిత వనరులతో పనిచేస్తున్న సంఘం సహకారం ఉన్న గ్రామాల దళితవాడల్లోని ప్రజలు ముందడుగువేశారు.

ఆ రోజు బాలాపూర్ లో సంఘం సభ్యులంతా కలసి మీటింగ్ పెట్టుకున్నారు. ఆరోగ్యకార్యకర్తగా పనిచేస్తున్న సంతోషమ్మ ఆరోగ్య కమిటీల ఆధ్వర్యంలో గ్రామంలోని బంజరు భూమిలో మందు మొక్కలు నాటితే బాగుంటుందేమో ఆలోచించమని సభ్యులకు సూచించింది. తాము మందులివ్వాలంటే కొన్ని మొక్కలు అందుబాటులో లేకపోవడం వల్ల ఇబ్బంది అవుతున్నదని, మందులు తాయారు చేసుకోలేకపోతున్నామని చెప్పింది. మందు మొక్కలతో పాటు పండ్లమొక్కలు, నారనిచ్చే మొక్కలు, చెట్లు పెంచుదాం అన్నారు ఇంకొకరు. ఊరి పటేళ్ల, కాపోళ్ల గొడ్డు గోదా, మేకలు తిరిగే బంజరు భూములవి. వాళ్ళూరుకుంటారా… రాళ్లు రప్పలతో, ఎగుడుదిగుడుగా ఉన్న గుట్టల్లో మొక్కలు పెడితే బతుకుతాయా సందేహం వెళ్లబుచ్చింది మొగులమ్మ. పనికి రాని నేల కాబట్టే ఆ నేలను ఉపయోగంలోకి తేవాలన్నది సంతోషమ్మ. బంజరు భూముల్లో మొక్కలు నాటడం ద్వారా ఉపాధి పొందొచ్చు, అడవులను పెంచొచ్చు అని అర్ధం చేసుకున్నతర్వాత తమ గ్రామంలో మొక్కలు నాటే బాధ్యత అక్కడ ఉన్న సంఘం సభ్యుల గుంపు తీసుకుంది. అనుకున్నదే తడవు మరుసటిరోజే కార్యాచరణకు ఒక కార్యక్రమం రూపొందించుకున్నారు వాళ్ళు.

తమ పుట్టింటి వాళ్ళకంటే ఎక్కువైన సంఘం ఆఫీసుకు వెళ్లారు మొగులమ్మ, సంతోషమ్మలు. తమ ఆలోచన వారితో పంచుకున్నారు. బాలాపూర్ గ్రామ సంఘం సభ్యుల ఆసక్తి సంఘం ఆఫీసువాళ్ళ దృష్టిని ఆకర్షించింది. అందుకు తమ వంతు సహకారం అందిస్తామని చెప్పారు. పొరుగూరులో ఉండే గ్రామ సర్పంచ్, కారోబార్ లను రావలసిందిగా స్వయంగా వెళ్లి ఆహ్వానించారు సంతోషమ్మ, మొగులమ్మలు. మరుసటి రోజు ఉదయం గ్రామస్థులందరినీ కచేరి దగ్గరకు రావలసిందిగా ఊళ్ళో టముకు వేయించారు. అదే విధంగా గ్రామంలో వ్యవసాయం గురించి, మొక్కల గురించి తెలిసిన పెద్దలను కలిశారు. వాళ్ళను కూడా మరుసటి రోజు కచేరి దగ్గరకు రమ్మని కోరారు.

తమకు గౌరవం ఇచ్చి రమ్మన్నందుకు కొందరు, విషయం ఏమిటో తెలుసుకుందామని కొందరు కచేరీ దగ్గర చేరారు. ఈ మాలమాదిగ ఆడోళ్ళు పిలిస్తే పోయేదేంటి వాళ్ళు తైతక్కలాడుతుంటే తాము తైతక్కలాడాలా అని ఆ వైపే చూడలేదు ఇంకొందరు. వాళ్ళు కూడా వచ్చి మీటింగులో కూర్చున్నారు. గ్రామ సర్పంచ్, కారోబార్, సంఘం బాధ్యులు వచ్చారు. వచ్చిన వాళ్లందరినీ కచేరి దగ్గరున్న చెట్టుకింద సమావేశపరిచారు. అందరికీ నమస్కరించి విషయం వివరిస్తున్నది సంతోషమ్మ. ఆ.. ఏదో చెప్తున్నారన్నట్టుగా కొందరు అనాసక్తిగా లేచి వెళ్లిపోయారు.

మిగిలి ఉన్నవాళ్ళ ద్వారా ఏ నేలల్లో ఏమి మొక్కలు వేయొచ్చో ఏ మొక్కలు ఆ నేలలో ఆ వాతావరణంలో బతుకుతాయో వారి ద్వారా తెలుసుకున్నారు. వారు ఏవి చెప్పారో ఆ విత్తనాలు గ్రామంలోనూ బయటి గ్రామాల్లోనూ సేకరించారు. ఆసక్తి ఉన్న కొంతమంది మహిళలకి నర్సరీ, మొక్కల పెంపకంలో శిక్షణ ఇచ్చింది సంఘం. ఏ వాతావరణంలో ఏ తరహా మొక్కలు నాటాలి, ఎలా సంరక్షించాలో అవగాహన కల్పించింది. ఆ తర్వాత నర్సరీ పెంచడం మొదలు పెట్టారు. నర్సరీ పెంచినందుకు మొక్కకు రూపాయి ఇస్తామని చెప్పింది సంఘం. ఆ బాధ్యతలో సంతోషమ్మకు తోడుగా సాయమ్మ నిలిచింది. దాంతో పాటు కొందరికి కూలీ దొరికింది.

ఆ ఏడు కానికాలంలో పడిన భారీ వర్షాల వల్ల పంటలు నాశనం అయ్యాయి.. ఆ ఏడాది ఆ చుట్టుపక్కల వేసిన మెట్ట పంటలు, అక్కడక్కడా ఇతర పంటలు దాదాపుగా దెబ్బతిన్నాయి. చేలు ఖాళీగా ఉన్నాయి. పేదలకు కూలీపనులు లేవు. ఉపాధి కావాలి. ఉపాధినిచ్చే పనికావాలి. సంఘం మహిళలు తమకి ఉపాధి పని వాళ్ళే కల్పించుకున్నారు. ఒక వైపు నర్సరీ, మరోవైపు గుంతలు తీయడం మొదలైంది. బంజరు భూముల్లో మొక్కలు నాటడానికి అడుగున్నర లోతు గుంతలు తీశారు. అలా మూడు నెలల్లో అరవై వేలకు పైగా గుంతలు తీసి మొక్కలు నాటడానికి సిద్ధం చేశారు. ఆ విధంగా సభ్యులకు పని దొరికింది. సంఘం కూలీ ఇచ్చింది. తిండికి ఇబ్బంది కాకుండా గడిచింది.

తంగేళ్ళు మొలవని రాళ్లు రప్పల్లో ఏం మొక్కలు నాటతారని సంఘం సభ్యులే కొందరు ప్రశ్న లేవనెత్తారు. వెనక్కిలాగే యత్నం చేశారు. అయినా సంతోషమ్మ కలగనడం ఆపలేదు. తన పని ఆపలేదు. గుబ్బాడి భూముల్లో మందుమొక్కలు, పండ్లమొక్కలతో అడవిని సృష్టించాలి. ఆ అడవి పండ్లు కాయలు ఇస్తూ రకరకాల పిట్టలతో కళకళలాడాలి. మందుమొక్కలతో తమవాళ్ల ఆరోగ్యం బాగుపడాలి అని ఆలోచన చేస్తున్నది సంతోషమ్మ.

వానలు బాగాపడి నేల బాగా మెత్తపడిన తర్వాత సామూహికంగా మొక్కలు నాటే కార్యక్రమం ఒక పండుగ లాగ, ఒక ఉత్సవం లాగ జరిగింది. పిల్లాజెల్లాతో వచ్చి బాలాపూర్ గుంపు సభ్యులు మొక్కలు నాటారు. తమ నర్సరీలో పెంచిన ముప్పై ఐదు రకాల మొక్కలు ఆ గుంతల్లో నాటారు. చింత, వేప, జామ, మామిడి, అల్లనేరేడు, సీతాఫలం, ఉసిరి, టేకు, తంగేడు, తానికాయ, నిద్రగన్నేరు, కరక్కాయ వంటి ఎన్నో రకాల మొక్కలు వారి సామజిక వనంలో చేరాయి.

మిగిలిన మొక్కల్ని గ్రామంలో రోడ్ల పక్కన, తమకు సంబంధించిన వారి పొలాల గట్లకు, గ్రామ సరిహద్దుల్లోనూ నాటివచ్చారు. అదే విధంగా ఇంటి దగ్గర ఉన్న స్థలంలో జామ, ఉసిరి, నేరేడు, దానిమ్మ వంటి కొన్ని పండ్ల మొక్కలు నాటుకున్నారు.

బంజరులో నాటగా మిగిలిన మొక్కల్ని పొరుగూరు సంఘం సభ్యులు అడిగితే వాళ్లకు కొన్ని ఇచ్చారు. సంతోషమ్మ వాళ్ళు పెంచిన నర్సరీలో మొక్కలు తీసుకెళ్లి కొందరు తమ బంజరు భూముల్లో నాటారు. ప్రజల ఆరోగ్యంతో పాటు మొక్కల పెంపకం బాధ్యత కూడా సంతోషమ్మ స్వచ్చందంగా తీసుకుంది.

బాలాపూర్ లో జరుగుతున్న కార్యక్రమాన్ని గమనించిన ఇతర గ్రామస్తులు తమ గ్రామంలోను బంజరు భూములను గుర్తించారు. ఇరవై గ్రామాల్లో తాము కూడా నర్సరీ పెంచి బంజరు భూముల్లో మొక్కలు నాటతామని ముందుకొచ్చారు. ముందుకొచ్చిన ఇరవై గ్రామాలూ తిరిగి మొక్కల పెంపకంలో అవగాహన కలిగించారు సంతోషమ్మ, రాజమ్మ, సాయమ్మల బృందం. ఇతర గ్రామాల్లోనూ ఈ బృందం తిరిగి వాళ్ళలోనూ అవగాహన కల్పించే ప్రయత్నం మొదలు పెట్టారు. నీటి ఎద్దడి ఎక్కువగా ఉందని కొన్ని గ్రామాల్లో సభ్యులు అంత ఆసక్తి చూపలేదు.

సంఘం సహాయంతో మొక్కలు పెట్టిన గుబ్బాడి (బంజరు)ల్లో నేలలో తేమ త్వరగా ఆరిపోతున్నది. మొక్కలకు నీళ్లు పోయడం చాలా ఇబ్బందిగా మారింది. కొద్దో గొప్పో నీళ్లు ఉన్న దగ్గర మోటకట్టి నీళ్లు తోడుతున్నారు. ఆ నీటిని ఒక్కొక్క మొక్కకు బిందెలతో పోస్తున్నారు. అందుకే గుబ్బాడి భూముల్లో, గర్భు నేలల్లో బావులు తవ్వాలని నిర్ణయించుకున్నారు. బావుల తవ్వకం ఒక ఉద్యమంలాగా మొదలైంది. సంఘం కుటుంబాలన్నీ ఆ పనిలో భాగం పంచుకున్నాయి. మగవాళ్ళు దిగి బావులు తవ్వుతుంటే మట్టిని, పెద్ద పెద్ద బండరాళ్లను తమ సామజిక వనానికి గట్టులాగా వేస్తున్నారు మహిళలు. రాతినేలలు కావడంతో భూముల్లో బావులు తవ్వినా నీళ్లు చాలా తక్కువ చోట్ల పడ్డాయి. ఆ నీళ్లను తోడి ఒక్కో మొక్కకు పోయడం చాలా శ్రమతో కూడుకున్న పని. దాంతో నీళ్లు పోయడానికి కూలికి వచ్చే ఆసక్తి చూపలేదు జనం.

మొక్కలు పెట్టి తర్వాత కొన్ని గ్రామాల్లో సభ్యులు వాటికి నీళ్లు తెచ్చి పోయలేక పని వదిలితే, కొన్నిచోట్ల ఊరి వాళ్ళనుండి వస్తున్న వత్తిడిని, సవాళ్ళను తట్టుకోలేక మధ్యలోనే వదిలేశారు. సంతోషమ్మ బృందం చాలా బాధపడింది. అయినా ఆ మొక్కలను చే జారిపోనీయకూడదు. మొక్కల్ని ఎట్లాగైనా బతికించుకోవాలని సర్వ శక్తులు ఒడ్డి బతికించారు. నీటి కటకట ఉన్న చోట్ల ఎడ్ల బండి గట్టి, బండిమీద మీద గోలెం పెట్టి గోలెంతోటి మొక్కలకు నీళ్లు తెచ్చి పోసి బతికించారు. ఆ క్రమంలో ఇంటాబయటా అనేక సవాళ్లు ఎదుర్కొంటూనే ఉన్నారు. ఇతర గ్రామాల్లో తోడేళ్ళలా వేటాడే మనుషుల్ని గుర్తిస్తున్నారు. వాళ్ళను ఎదుర్కొంటూ ముందుకు సాగుతున్నారు. చాలా గ్రామాలకు రవాణా సౌకర్యం లేదు. కాలిబాటనో, బండ్లబాటనో ఎండా వాన లెక్కచేయక మైళ్లకు మైళ్ళు నడిచి వెళ్ళేవాళ్ళు. కాలినడకన వెళ్లి ఆ గ్రామాల్లోని మొక్కలను సాకడం మొదలుపెట్టారు ముగ్గురూ.. ఆ గ్రామస్తులతో పరిచయం పెంచుకొని ముసలి ముతకలకు నీళ్లు పోసి పెంచితే చెట్టుకింత కూలీ ఇస్తామని ఒప్పించారు. వయసుమళ్ళినవాళ్లు జాగ్రత్తగా మొక్కల పెంపకం పై దృష్టి పెట్టారు. వయసుడిగిన మేం కష్టం చేస్తున్నాం. మీరు చేయలేరా అంటూ వయసులో ఉన్న వాళ్ళని ఉత్సాహ పరిచి పనుల్లోకి రప్పించారు అనుభవజ్ఞులు.

ఆ తర్వాత ప్రతిగ్రామంలోని మొక్కలను పర్యవేక్షించడం మొదలుపెట్టారు. వీళ్లకు తోడు సంబాపూర్ గ్రామంలోని శివమ్మ కూడా ముందుకొచ్చింది. ఒక గ్రామానికి వెళ్లి మొక్కలను పర్యవేక్షించి వచ్చేప్పటికి రాత్రయితే ఆ పూట అక్కడే సంఘం సభ్యల ఇంట్లో ఆగిపోయి తెల్లారి ప్రయాణమయి మరో గ్రామం వెళ్ళడం మొదలుపెట్టింది సంతోషమ్మ. రాజమ్మ, సాయమ్మ, శివమ్మలు కూడా అదే విధంగా చేయడం మొదలుపెట్టారు.

ఈ క్రమంలో అనేక ఇబ్బందులు ఇటు కుటుంబం నుండి అటు సమాజం నుండీ ఎదుర్కొన్నారు. రవాణా సౌకర్యాలు లేని ఆ గ్రామాల్లో ఒక్కోసారి రాత్రులు ఉండాల్సి రావడంతో వారి శీలాన్ని శంకించారు కొందరు. వారి అనుమానాలకు ఆజ్యం పోశారు కొందరు గ్రామస్తులు. ఆ నలుగురూ ఒంటరి స్త్రీలు కూడా కావడంతో మరిన్ని పుకార్లు షికారు చేస్తున్నాయి. అనుమాన శూలాలు చెవినపడ్డప్పుడు రెక్కలు తెగిన పక్షుల్లా విలవిలలాడుతున్నారు. మనసులో రంపపుకోత అనుభవిస్తూనే ఉన్నప్పటికీ ఆ నలుగురూ వెనక్కి తగ్గలేదు. చీల్చి చెండాడే తోడేళ్ళు అన్నిచోట్లా ఉంటాయని, ఏమి చేసినా వెంటాడడమే వాటిపని అని గుర్తించారు. తమ పని తాము దీక్షతో, ఉద్యమ స్పూర్తితో చేసుకు పోతున్నారు. ప్రతివారం తమగుంపు సభ్యులతో తాము ఎదుర్కొంటున్న సమస్యలను, ఇతర గ్రామాల్లో ఎదురవుతున్న అనుభవాలను పంచేది సంతోషమ్మ. ఈ విశేషాలను సంఘం నెలవారీ గ్రామ లీడర్ల మీటింగులో చర్చించేది మొగులమ్మ.

నాటిన ప్రతిమొక్క బతికించాలన్న తపనతో ఒక యజ్ఞంలా సాగిస్తున్నారు మొక్కల పెంపకం. ఆ నలుగురు తల్లులూ తమ కన్న బిడ్డల్ని అంత శ్రద్దగా ఏనాడూ సాకలేదేమో.. చూడలేదేమో.. కంటిపాపల్లా సాకుతున్నారు తమ సామజిక వనాల్లోని మొక్కలను. ఎక్కడ ఏ మొక్క ఎట్లా ఉన్నది ఎట్లా ఎదుగుతున్నది వాళ్లకు ఎరుకే. రాతి భూమి, తేమ నిలువని భూములు కావడంతో నీళ్ల తడి ఎక్కువ అవసరం అవుతున్నది. మొక్కలకు నీరుపోసి రక్షించుకోవడం చాలా కష్టమవుతున్నది. అయినా సంతోషమ్మ బృందం వెనకడుగు వేయలేదు. నాటిన మొక్క చనిపోతే ఆ స్థానంలో మరో మొక్క నాటి సంరక్షణ చేస్తూనే ఉన్నారు. 20 గ్రామాల్లో కలిపి దాదాపు 1200 ఎకరాల్లో వేలాది మొక్కలు వీరి ఆధ్వర్యంలో పెరుగుతున్నాయి.

ఎడారి భూముల్లో పెట్టిన చిన్న మొక్కలు మారాకులు తొడుగుతూన్నాయి. ఎదుగుతున్న మొక్కలపైకి చుట్టం చూపుగా వచ్చిపోతున్న తూనీగలను, సీతాకోక చిలుకలను పక్షులను చూసి సంబురపడేది సంతోషమ్మ. ఆ మొక్కలను అట్లా చూస్తూ తనను తాను మరచిపోయేది. సేదతీరేది. పెట్టిన మొక్కలు పెరిగి చెట్లై మానైనట్లు కలలు కనేది. ఆ కల పండించుకునేందుకు కష్టపడుతున్నది. తపన పడుతున్నది. ఆమె కలల్ని నీరుగార్చ ఎవరు ఎంత ప్రయత్నించినా ఆమె అధైర్య పడలేదు. నాడు ఏ ఆధారం లేకుండా ఒంటి చేత్తో పిల్లల్ని పెంచి పెద్ద చేసింది. నేడు, ఒంట్లో శక్తి ఇంకా ఉన్నది. వెనుక కొండంత అండ సంఘం ఉన్నది. ఆ ఆలోచన ఆమెలో ధైర్యం,మరింత శక్తిని నింపుతున్నది. సంతోషమ్మతో ఉన్న మిగతా ముగ్గురిలోనూ ఆమె సంకల్పబలం స్ఫూర్తిని నింపుతున్నది.

ఓ వైపు ఇరవై గ్రామాల్లో మొక్కల పెంపకం కార్యక్రమ పర్యవేక్షణ చేస్తూనే ఆరోగ్య కార్యక్రమాల్లోనూ తీరికలేకుండా ఉంది సంతోషమ్మ. సంఘం ఏర్పాటు చేసిన ఆరోగ్య శిక్షణ కార్యక్రమంలో తెలుసుకున్న విషయాలను గ్రామాల్లో తెలియజేయాలి. అందుకోసం ఆరోగ్య జాతరలు నిర్వహించారు. అవగాహనా కార్యక్రమాల్లో ఆయా మొక్కల గుణగణాలను ప్రజలకు తెలియజేస్తున్నారు.

బీడువారిన నేలల్లో, గుబ్బడి భూముల్లో కొద్దికొద్దిగా పచ్చదనం చేరుతున్నది. పశు పక్షాదులు ఆ దిశకు చేరుతున్నాయి. ఇట్లా ఇంకొంత కాలం కాపాడుకోగలిగితే తమ మొక్కలు అవే పెరుగుతాయని అనుకున్నారు సంఘ సభ్యులు. అనుకున్నట్లే జరిగితే ఇంకేముంది. మొక్కలు నాటగానే అయిపోయిందా.. ఈ గుబ్బాడి భూముల్లో ఎర్రరాతిమట్టి నేలల్లో మట్టికరుచుకుపోతాయని తలిచారు గ్రామాల్లో అనేకులు. కానీ, ఆ విధంగా జరగలేదు. మొక్కలు పెరుగుతూ ఆ ప్రాంతానికి కొత్త అందాన్ని తెచ్చాయి. కొత్త సందడినిచ్చాయి. ఇది చూస్తుంటే పెద్ద వనమే తయారయేటట్లుందని ప్రజలలో, ప్రభుత్వం వారి దృష్టిలో ఈ అలగాజనం ప్రభ వెలిగిపోతుందని ఈర్ష్య మొదలైంది.

కొత్త రూపు సంతరించుకుంటున్న ప్రకృతిపై పగబట్టారు. అకారణంగా అసూయపడుతున్నారు. ద్వేషం పెంచుకుంటున్నారు. బాలాపూర్ గ్రామంలోనూ అదే జరుగుతున్నది. వీళ్ళు చేస్తున్న కార్యక్రమం గ్రామంలోని ఆధిపత్య కులాల్లోని కొంతమందికి నచ్చడం లేదు. గిల్లికజ్జాలు పెట్టుకుంటున్నారు. అసూయ పడుతున్నారు. ద్వేషం పెంచుకుంటున్నారు. ఈ ప్రయాణంలో ఆధిపత్యం నెత్తికెక్కిన పెద్దలు అనేక ఆటుపోట్లు, ఘర్షణలు సృష్టిస్తున్నారు. వాటిని సామరస్యంగా ఎదుర్కోవడానికి ప్రయత్నిస్తున్నారు మొగులమ్మ బృందం. ఈ క్రమంలో తమలో తామే ఎంతో సంఘర్షిస్తున్నారు. ముందుకు సాగుతున్నారు.

ఓర్వలేని పెద్దలు బాలాపూర్ సంఘం సభ్యులపై గ్రామ పంచాయితీలో ఫిర్యాదు చేశారు. ఆ విషయంలో తమకు చెప్పే చేస్తుండడం వల్లనో లేక పోరంబోకు భూమిలో మొక్కలు పెంచడం వల్ల తమ గ్రామ పంచాయితీకి మంచి పేరు వస్తుందనో లేక మంచి పని చేస్తున్నారన్న భావనతోనో కానీ పొరుగూరులో ఉండే సర్పంచ్, కారోబార్ ఆ ఫిర్యాదులను పట్టించుకోలేదు. చూసీ చూడనట్లు వదిలేశారు.

తమకాళ్లకింద పడి ఉండాల్సిన వాళ్ళు నిర్ణయాలు చేయడం, దానికి సర్పంచ్ తందాన అనడం బాలాపూర్ లోని పటేళ్లు, కాపుదనం వాళ్ళకి నచ్చడం లేదు. ఒంటిమీద తేళ్లు జెర్రులూ పాకుతున్నట్టుంది. సంఘం వచ్చి అలగాజనాన్ని చెడగొట్టేస్తున్నదని, తమకి కాకుండా చేస్తున్నదని తిట్టుకుంటున్నారు. ఒకప్పటిలా తమ కాళ్ల మీద పడి బాంచెన్ దొర, నీ బాంచెన్ పటేలా, కాల్మొక్త దొరా అనడం లేదు. సాగిల పడి బిచ్చం అడుక్కోవడం లేదు. మీ దయాదాక్షిణ్యాల మీద లేదు మా బతుకు అన్నట్టుంటున్నారు. కనబడినప్పుడు అణగి మణిగి, ఒదిగి ఒదిగి పక్కనుండి పోయినట్లున్నా ఆ నడకలో ఏదో ధిక్కారం అగుపిస్తున్నది పై కులాల వాళ్ళకి.

వెలివాడల్లో జనం తెలివికి రావడమంటే, ముందుకు పోవడమంటే మనం ఎక్కిన కొమ్మను నరికేస్తున్న భావనలో ఉన్నారు పెద్ద కులాల వాళ్ళు. దళిత వాడల్లోని మహిళల్లో వస్తున్న మార్పు ఏమాత్రం మింగుడు పడడం లేదు. సహించడం చాలా కష్టమైపోతున్నది. తమ అహంకారాన్ని, ఆధిపత్యాన్ని ప్రశ్నిస్తున్నట్టుగా ఆక్రోశం, అసహనం కట్టలు తెంచుకు రావడానికి ప్రయత్నిస్తున్నది. పెద్ద కులాల వాళ్ళకి మాత్రమే ప్రశ్నించడం, దండించడం చేసే హక్కుందనే భావనలో ఉన్న వాళ్లకి ప్రశ్నని ఎదుర్కోవడం చాలా ఇబ్బందిగా ఉంది. చాలా కష్టంగా ఉంది. రంపపు కోతలా ఉంది.

చట్టపరంగా వచ్చిన అవకాశాలను ఉపయోగించుకుని ప్రతి చోటా ఎదురు నిలుస్తున్నారు బక్కచిక్కిన చిన్న మనుషులు. ఈ చిన్న మనుషుల ప్రయోజనాల్ని దెబ్బతీయాలని పెద్ద మనుషులు ప్రయత్నిస్తే మునుపటిలా చూస్తూ ఊరుకోవడం లేదు. అక్కడ ఘర్షణ మొదలవుతున్నది.

బాధితుల్నే ముద్దాయిలుగా చేసే ప్రయత్నం చేస్తున్నారు పెద్ద మనుషులు. గడ్డి పరక లాంటి మనుషులు ఎదుర్కొంటున్నారు. గట్టిగా ఎదుర్కొంటున్నారు. పటేల్, పట్వారి అని లేకుండా పెద్దవాళ్ళని పోలీసు స్టేషన్ కు పిలిపించడం, వాళ్ళ నోటితోనే వారి నేరం ఒప్పించడం, క్షమాపణ చెప్పించడం చేస్తున్నారు. ఆ పెద్ద మనుషులు గొంతులో వెలక్కాయను కక్కా లేక మింగలేక ఉన్న పరిస్థితికి సతమతమవుతున్నారు.

గతంలో జరిగిన సంఘటన అంతా మరచిపోయినట్లు రెండేళ్లు నటించారు. కానీ గొంతులో పచ్చి వెలక్కాయ అడ్డం పడ్డట్టే ఉంది. సమయం ఎప్పుడు దొరుకుతుందా, అవకాశం ఎప్పుడు కలసి వస్తుందా గిల్లి కయ్యం పెట్టుకోవడానికని ఎదురు చూస్తున్నారు. గడ్డి పరకలు వృక్షాలుగా రూపాంతరం చెందుతుంటే తాము మరుగుజ్జులుగా మారిపోతున్నట్టు ఫీలయిపోతూ లోలోన సెగలు పొగలు కక్కుతున్న పెద్దలకి ఓ మంచి అవకాశం దొరికింది.

ఆరోగ్య కమిటీ పెంచుతున్న నర్సరీ మీదకో, బంజరు నేలల్లో పెంచుతున్న మొక్కలపైకో తమ పశువులను వదలడం మొదలు పెట్టారు. పశువుల పైన కులంపేరుతో తిట్టారని కేసులు పెట్టలేరని వాళ్ళ ఆలోచన. అందుకే నోరులేని పశువులను పచ్చగా కన్పిస్తున్న మొక్కల మీదకు, నర్సరీల మీదకు వదులుతున్నారు. అవి వాటిని నాశనం చేయడమే వాళ్ళ లక్ష్యం. సంఘం మహిళలు సహజంగానే వాళ్ళ చర్యల్ని వ్యతిరేకించారు. ఆ పశువులను మొక్కల మీదకు వదలడం కాకుండా పచ్చగడ్డి కోసుకుపోయి వెయ్యమని సూచించారు. అది పెద్దల చెవికెక్కలేదు. కావాలని చేస్తున్నప్పుడు, ఎట్లా వింటారు. ఎందుకు వింటారు. వినలేదు. నర్సరీకి, మొక్కలకు కాపలాగా ఉన్న వాళ్ళు వచ్చే పశువుల్ని రానివ్వడం లేదు. కట్టుదిట్టం చేస్తున్నారు. పై కులాల వారికి వంటికి కారం రాసుకున్నట్టుగా ఉన్నది. సహించలేకపోతున్నారు. వెళ్లి వాళ్ళను తన్ని తగలెయ్యాలన్నంత కోపంతో రగిలిపోతున్నారు.

లేని ఓరిమిని తెచ్చిపెట్టుకుని గుబ్బాడి ఊరందరిదన్నారు. ఎన్నో ఏళ్లుగా తామే ఆ భూముల్లో పశువులను మేపుతున్నామన్నారు. మా పశువులు మేయడానికి జాగా లేకుండా చేస్తున్నారని తిట్టిపోస్తున్నారు. కులం పేరు తిట్టడం వల్ల వచ్చే ఇబ్బందులు దృష్టిలో పెట్టుకొని కులం పేరు పెట్టకుండా నానా రకాలుగా అక్కడ కాపలా ఉన్న కాపరిని వేధించడం, మానసికంగా వేధింపులకు గురి చేస్తున్నారు. చివరికి తమ వద్ద పనిచేస్తున్న, జీతం చేస్తున్న వాళ్లనే తమ వాళ్ళైన సంఘం సభ్యులపై దాడికి ఉసిగొల్పారు. వాళ్లలో వాళ్ళకే కయ్యం పెట్టి సిగపట్లు పట్టుకునే స్థితికి తీసుకొచ్చారు.

ఒక రోజు యజమానికి వీరవిధేయులైన పనివాళ్ళు పశువుల్ని మేపనీయలేదని తమ జాతి వాళ్ళపై దాడికి దిగారు. నర్సరీకి కావలి ఉన్నతన్ని బండమీద పడేసి ఇష్టమొచ్చినట్టు కొట్టారు. అందులో మొగులమ్మ భర్త చిన్నయ్య కూడా ఉన్నాడు.

ఆ రాత్రి ఇంటికి వచ్చేటప్పుడు పటేల్ కల్లుపోయిస్తే బాగా తాగి వచ్చాడు చిన్నయ్య. నిషాలో ఉన్నాడు. ఒంటిమీద స్పృహ లేని స్థితిలో ఉన్నాడు. మొగులమ్మ గుంపు మీటింగు నుండి రావడంతోనే నోటికొచ్చినట్టు తిట్టడం మొదలుపెట్టాడు. పెళ్ళైన ఇన్నేళ్ళలో ఎన్నడూ లేని విధంగా ఉంది చిన్నయ్య ప్రవర్తన. విస్తుపోయి గుడ్లప్పగించి చూస్తున్నది మొగులమ్మ. నీ భర్తగా చెబుతున్నా నువ్వు సంఘం లోకి వెళ్ళడానికి వీల్లేదని శాసించాడు. ఆ మాటతో విషయం అర్ధమయిపోయింది మొగులమ్మకు.

తన యజమానికి వ్యతిరేకంగా నడుచుకుంటున్న భార్యను చూస్తూ ద్వేషంతో, కోపంతో రగిలిపోతున్నాడతను. గతంలో ఎన్నడూ భార్యతో ప్రవర్తించని విధంగా ప్రవర్తిస్తున్నాడు. నోటికొచ్చిన బూతులు తిడుతున్నాడు. భర్త మనసును పటేల్ విషపూరితం చేశాడని మొగులమ్మకు అర్ధమయింది. అతను బానిస బతుకు బతుకుతున్నాడు. నన్నూ అదే బతుకు బతకమని శాసిస్తున్నాడు. నేనెన్నటికీ తిరిగి పాత బతుకులోకి పోయే ప్రసక్తేలేదని మనసులోనే తీర్మానించుకున్నది మొగులమ్మ. నిన్ను వదిలెయ్యమంటే వదిలేస్తా కానీ సంఘం వదిలేది లేదని ఖరాఖండీగా భర్తతో చెప్పిందామె. చిన్నయ్యలో మగవాడినన్న అహంకారం బుసలుకొట్టింది. ఆ కుటుంబానికి తానే యజమాని అన్న విషయం స్ఫురణకు వచ్చింది. తోకతొక్కిన తాచులా బుసలు కొడుతున్నాడు. వళ్లు తెలియకుండా తాగిన మైకానికి తోడు భార్య అన్న ఒకేఒక్క మాట అతన్ని రెచ్చగొట్టింది.

రెచ్చి పోయిన చిన్నయ్య పోవే పో… నా ఇంట్లోంచి పో… అంటూ బూతులు తిడుతూ ఆమె జుట్టు పట్టి లాగి గోడకేసి బాదాడు. ఆ తర్వాత ములకున్న కర్రతో చితక బాదుతూ బయటకు ఈడుస్తున్నాడు. ఆ అరుపులకు, తల్లి ఏడుపుకు పిల్లలు నిద్రలోంచి ఉలిక్కిపడి లేచారు. భయపడిపోయారు. తండ్రికేసి బెదురుగా చూస్తూ తల్లిని చుట్టుకుపోయారు. అందరికి మంచి చెడు చెప్పే మొగులమ్మ తన పరిస్థితికి లోలోన కుమిలి పోయింది. వాడలో అందరు భార్యలూ తమ భర్తలతో పడుతున్న వేదనే ఇది. కానీ భర్త అలాంటి వాడు కాదని మురిసిపోయేది ఇన్నాళ్లూ.. ఈ విధమైన ప్రవర్తన ఆమె ఎన్నడూ ఊహించనిది. అవకాశం వస్తే మిగతావాళ్ళ భర్తలకు తన భర్త ఏమీ తీసిపోడని అర్ధమయిన మరుక్షణంలోనాలుగ్గోడల మధ్య ఉండదలుచుకోలేదామె.

తలుపు గొళ్ళెం తీసే ధైర్యం ఆమెలో.. కొద్ది కొద్దిగా తలుపు తెరుచుకున్నట్లుగా.. విప్పారిన ఆలోచనలు. ఈ ఇంటికి, ఈ సంసారానికి ఏం చేశావని నన్ను పొమ్మంటున్నావ్.. నేను ఒక్క రోజు లేకపోతే నీ పిల్లలకు ఒక్కపూట కూడు తెచ్చి పెట్టగలవా.. నిలదీసింది. అదేమీ పట్టించుకోని అతను ఆమె మీదకు ఎగబడి మళ్ళీ కొట్టబోయాడు. పెద్ద పిల్ల పూలమ్మ అమ్మను కొట్టొద్దని తండ్రికి అడ్డుపడింది. మొగులమ్మ ఒడుపుగా తప్పించుకొని బయటికొచ్చింది. మొగులమ్మకు తగలాల్సిన దెబ్బ పూలమ్మ మీద పడింది. అది ఏడుపు అందుకున్నది. తండ్రికేసి కోపంగా, అసహ్యంగా చూస్తూ, తిడుతూ తల్లికేసి పరిగెత్తింది. తండ్రి పట్ల ఉన్న గౌరవం సడలింది ఆ చిన్న బుర్రలో. బెంబేలు పడిపోయిన మిగతా పిల్లలు ఏడుపు రాగం పెంచారు. పిల్లలతో ఇంటిబయటే చింతచెట్టు కింద మొద్దుపై చింతపడుతూ కూలబడిపోయింది మొగులమ్మ. ఆమెనంటి పెట్టుకున్న పిల్లలు.

ఆ నిశి రాత్రి ఆమె తీవ్రంగా ఆలోచిస్తున్నది. పరిపరివిధాల యోచిస్తున్నది. ఆమెలో అంతర్గత యుద్ధం జరుగుతున్నది. ఆధిపత్య రాజకీయాలు అర్ధం అవుతున్నాయి. అతను తన యజమానిని సంతోష పెట్టడం కోసం భార్యని హింసిస్తున్నాడు. శిక్షిస్తున్నాడు. అతను చేసే పని మంచిదా.. కాదా.. అన్న ఆలోచనలేని మేకపిల్ల లాంటివాడు. ఎవరు తనవాళ్ళో అర్ధం చేసుకోలేని అమాయకత్వం అతనిది. అతని అమాయకత్వాన్ని రెచ్చగొట్టి తాగించి పంపాడు పటేల్. గుడ్డివాడిలా తెలివి తక్కువగా ప్రవర్తిస్తున్నాడు చిన్నయ్య. వాళ్ళ ఆధిపత్యానికి ఎదురులేకుండా చేసుకోవడం కోసం, వారి సంపద పెంచుకోవడం కోసం, వారి సుఖం కోసం చిన్నయ్య లాంటి వాళ్ళను పావులుగా మార్చుకుని తమ కుటుంబాలపైకే ఉసిగొల్పుతున్నారని బాధపడింది మొగులమ్మ.

సంఘం అంటే పై కులాల్లో ఎంత ద్వేషం ఉందో, వాళ్ళు ఎంత కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారో ప్రత్యక్షంగా చూస్తున్నది. ఏ విధంగానైనా తమను లోబరుచుకుని సంఘంలో లేకుండా చెయ్యాలని పెద్దల పన్నాగమని ఆమె మనసు చెప్పిన మాటలు వింటూ కొంత సమయం అక్కడే గడిపింది. అలసిపోయిన చిన్నయ్య కొద్ధి సేపట్లోనే నిద్రలోకి వెళ్ళిపోయాడు. పిల్లలు ఆమె ఒడిలో నిద్రలోకి జారుకున్నారు.

లోపలంతా విషం నింపుకున్న పెద్దమనుషులు పైకి ఎంత తియ్యగా మాట్లాడుతారు, ఎన్ని నీతులు చెబుతారు. ఎన్ని ఔదార్యపు మాటలు వల్లిస్తారు. ఇదేనా పెద్దరికం… పెద్దరికపు ముసుగులో వెనుక అన్నీ కుట్రలు, కుతంత్రాలేనా ఈ పెద్దలు చేసేది. ఈ నీతి లేని మనుషుల ముందు కింద జాతివాళ్ళు నీ బాంచెన్ కాల్మొక్త అంటూ, వణికిపోతూ వాళ్ళ కాళ్ళ దగ్గరే పడి ఉండాలని కోరుకుంటారు. అట్లాకాక సొంతంగా మా నడక సాగుతున్నది. దానికే వాళ్ళ కళ్ళు కుడుతున్నాయి. కళ్ళల్లో కారం పోసుకుంటున్నారు.

పెద్దోళ్లంతా ఇట్లాగే ఉంటారా.. ఊహూ.. కాదు సంఘం సార్లు, మేడం లు బాగా చదువుకున్నారు. ఊర్లో పటేళ్లు, పట్వారీలు, కాపుదనం వాళ్ళ కంటే గొప్పవాళ్లే. కానీ వాళ్లెప్పుడూ ఇట్లా లేరు. జనం మంచి కోరతారు. మంచి చెబుతారు. చెప్పిందే చేస్తారు. రెండు నాలుకల మాటలు లేవు అనుకున్నది మొగులమ్మ.

ఈ ఊరి మనుషులు ఇట్లా ఎందుకు ప్రవర్తిస్తున్నారు.. వాళ్లకెంత ఉన్నా తృప్తి ఉండదా.. వాళ్ళ జీవితాల్లోకి మేం పోవడం లేదే.. వాళ్ళ సంపాదన మేం కోరడంలేదే.. వాళ్ళ తిండి గుంజుకోవడం లేదే. వాళ్ళ భూమి జాగలు ఎత్తుకుపోవట్లేదే.. మరెందుకు ఇట్లా రాబందుల్లా వేటాడుతున్నారు.. ఇప్పుడు మేం చేసిన తప్పేంటీ.. మా జీవితాల్లో మేమున్నాం. అట్లా మా జీవితాల్లో మేముండొద్దా.. మా జీవితాల్ని మేం చక్కబెట్టుకుంటామంటే వాళ్లకెందుకంత దుగ్ద. పీతిరి గద్దలాగున్నారు. ఆ చీకటి రాత్రి, ఆ నిశ్చబ్దంలో ఆలోచిస్తున్న కొద్దీ ప్రపంచం, మనుషులు కొత్తగా అగుపిస్తున్నట్టుంది మొగులమ్మకు. చీకట్లో మిణుకు మిణుకు మంటూ ఎగురుతున్న మిణుగురు పురుగులను కాసేపు చూసింది. అవి చీకటిని తిడుతూ కూర్చోలేదే. తమ బతుక్కి కావలసిన వెలుతురు అవే ఇచ్చుకుంటున్నాయి. ఏవో పొరలు మాయమవుతున్నట్టుగా ఉంది. అవును, నేను ఏడుస్తూ ఇక్కడ కూర్చోవడం కాదు మనసులో అనుకుంది. పిల్లలను లేపి ఇంట్లో పడుకోబెట్టింది. ఆ తర్వాత లోపలికెళ్ళి తానూ నడుంవాల్చింది. ఇప్పుడామెకి భర్తమీద కోపం లేదు. రేపు ఎలా వ్యవహరించాలి, ఏమిచెయ్యాలి అన్న ఆలోచన మాత్రమే ఉంది.

లేవండోయ్ అంటూ కోడికూత మొదలైంది. ఎప్పటిలాగే తెల్లవారింది. ఆలస్యంగా నిద్రపోయిన మొగులమ్మకు కళ్ళు ఇంకా అంటుకుంటూనే ఉన్నాయి. అంతలో రాత్రి జరిగిన సంఘటన కళ్ళముందు కదలాడింది. లేచి భర్తకేసి చూసింది. లేవలేదు. చుక్క పొద్దుకు పోయే మనిషి కోడికూతకు కూడా పోలేదు. తాగిన మత్తు వదల్లేదేమో.. అనుకున్నది. తాను లేచి చెంబు తీసుకుని బయటికి వెళ్ళింది.

ఆ తర్వాత కాసేపటికి అతను ఏమీ జరగనట్లుగానే లేవబోయాడు. రాత్రి తాగిన మత్తు ఇంకా ఏ మూలనో ఉన్నట్టుంది. బద్దకంగా అనిపిస్తున్నది. కళ్ళు తెరిచి చూస్తే తూరుపు తెల్లవారుతున్నది. ఉలిక్కిపడి లేచాడు. ఎప్పటిలా పక్కన భార్య కనిపించలేదు. చెంబు పట్టుకొని వెళ్ళిందేమో అనుకున్నాడు. రోజులాగే పనిలోకి వెళ్ళబోతుండగా గుర్తొచ్చింది రాత్రి సంఘటన. అయ్యో.. రాత్రంతా బయటే ఉన్నదా.. ఇంటి బయటికొచ్చి చూశాడు. భార్య ఎక్కడా కనబడలేదు. మొగులా మొగులా.. గట్టిగా పిలిచాడు. అవతలినుండి ఎటువంటి సమాధానం లేదు. అతనిలో సన్నని ఒణుకు మొదలైంది. ఏమైపోయిందని.

ఆమె లేకపోతే ఈ సంసారం గతి.. ఆ ఆలోచనే అతన్ని నిలువెల్లా వణికించేసింది. తప్పు చేసాడు. చాలా పెద్ద తప్పు చేసాడు. పచ్చాత్తాపంతో దహించుకుపోతున్నాడతను. భూదేవికి ఉన్నంత ఓపిక ఉన్నది మొగులమ్మకు. ఎంత కష్టమయిన కాడి బరువంతా తానొక్కటే మోస్తున్నది. అయ్యో దేవుడా.. ఇట్లా ప్రవర్తించానేమిటి.. ఇప్పుడెట్లా.. అని తలకిందులవుతున్నాడు. ఇంటిలోపలికి వచ్చి పిల్లలకేసి చూశాడు. అందరూ నిద్రలోనే ఉన్నారు. మళ్ళీ ఇంటిబయటికొచ్చాడు. రాతెండి చెంబు గోలెం దగ్గర ఉన్నదేమోనని కళ్ళతోనే వెతికాడు. అదక్కడ కనిపించలేదు. చెంబు పట్టుకుపోయిందని నిర్ధారించుకున్నాడు.

అంతలో సంతోషమ్మ కొడుకు ఏంటి బావా ప్రాణం బాగుండలేదా అని పలకరించాడు. ఆ వెనకనుంచి వచ్చిన సంతోషమ్మ చిన్నయ్యకేసి చూస్తూ రాత్రి ఏదో లొల్లి ఇనబడ్డది. మీ ఇంట్లకెల్లో.. కలబడిందో.. సమజ్ గాలే అన్నది. చప్పుడు చెయ్యకుండా పనికి బయలుదేరాడు చిన్నయ్య. కానీ అతని మనసు మనసులో లేదు. ఒక్కోసారి కీడు శంకిస్తున్నది. ఒక్కోసారి ఏమీ కాదనిపిస్తున్నది. ఆ వెంటనే నేనేమన్నాను.. మొగుడన్నాక ఆ మాత్రం పెండ్లానికి భయంపెట్టొద్దా అని తన చర్యను తానే సమర్ధించుకున్నాడు. కానీ, ఆమెలేని ఇంటిని ఊహించలేక పోతున్నాడు. అది అతని మనసుకు చాలా కష్టంగా ఉంది. దారిలో కన్పించిన పోచమ్మ ముందు ఆగాడు. పోచమ్మ తల్లీ.. నీ మీద ఒట్టు పెట్టుకుంటున్నా.. ఇంకెన్నడు నా పెండ్లామును కొట్టను, ఇంట్లకెల్లి పొమ్మనను అని తనకు తాను లెంపలేసుకున్నాడు.

పటేల్ ఎక్కిచ్చి పంపిన వ్యవహారమని తెల్సిన మొగులమ్మ ఈ విషయాన్ని తన కుటుంబ వ్యవహారంగా వదిలెయ్యదలుచుకోలేదు. మళ్ళీ మళ్ళీ ఇటువంటి సంఘటనలు జరగకుండా ఉండాలంటే ఏమిచెయ్యాలని ఆలోచించింది. అదే రోజు తన గుంపుతో చర్చించింది. కొందరు తమ కడుపులో దాచుకున్న బాధలు చెప్పుకున్నారు. ఇటువంటి సమస్యలు ముందు ముందు రాకూడదని అందరూ ఏకమయ్యారు.

ఆ విషయాన్ని గ్రామ పంచాయితీ ముందు పెట్టింది సంఘం గుంపు. అదే విధంగా సంఘం పెద్దలకు కూడా తెలియజేసారు. మరుసటి రోజు ఉదయం సంఘం సంస్థ ప్రతినిధులు వచ్చి విషయం కూలంకషంగా తెలుసుకున్నారు. ఘర్షణలు జరగడానికి కారణాలను అర్ధంచేసుకున్నారు. ఆ తర్వాత తమ సభ్యులు బంజరు భూముల్లో నాటిన మొక్కల్ని, పెంచుతున్న నర్సరీని పరిశీలించారు. ఎంత మేర పాడు చేశాయో, జరిగిన నష్టమేంటో, ఇట్లా ఇప్పటికి వదిలేస్తే జరగబోయే నష్టం ఎలా ఉండబోతుందో, పరిస్థితులు ఎటు దారితీస్తాయో ఒక అవగాహనకు వచ్చారు. విషయం అంతా సర్పంచ్ కి తెలిపారు. పంచాయితీ దగ్గరకు గ్రామ పెద్దగా పటేల్ ను పిలిపించారు.

గ్రామచావిడి దగ్గర జరుగుతున్న పంచాయితీ సంఘం సభ్యులకు, పటేల్ మనుషులకు లాగా లేదు. గ్రామంలోని ఆధిపత్య వర్గాలకు, కులాలకు, వాళ్ళకింద పనివాళ్ళైన వారి ఆడవాళ్లకు సంబంధించిన విషయంగా భావించి దాదాపు ఊరంతా కచేరి దగ్గర చేరింది. బాలాపూర్ లోని దళితవాడలోని సంఘం సభ్యులే కాకకుండా ఇతరులు కూడా ఆసక్తిగా అక్కడకొచ్చారు. అందరిలోనూ ఉత్కంఠ. ఏమి జరుగుతుందో, తీర్పు ఏమనిస్తారో ననే ఉత్సుకత. పంచాయితీలో కూర్చున్న సంతోషమ్మ దుఃఖానికి అంతులేకుండా పోయింది. కళ్ళమ్మట ధారాపాతంగా నీళ్లు కారిపోతున్నాయి. గుబ్బడి భూమిని పచ్చగా చేసేందుకు మేము చాలా కష్టపడుతున్నాం. ఊరందరికీ మంచి జరిగే పని చేస్తున్నాం. అది అర్ధం చేసుకోకుండా ఇట్లా చేస్తున్నారేమిటని దుఃఖపడింది. ఆమె కళ్ళలో కమ్ముకున్న మేఘాలను కట్టుదిట్టం చేయడానికి ఎంత ప్రయత్నిస్తున్నప్పటికీ అవి వర్షించడానికి సిద్ధంమైపోతున్నాయి. అట్లాగే తనను తాను సముదాయించుకుంటూ జరిగిన విషయాన్ని పంచాయితీలో ప్రజలందరిముందూ విన్నవించింది సంతోషమ్మ.

మొగులమ్మ తన ఇంట్లో జరిగిన రభస గురించి చెప్తున్నది. అది ఈ పంచాయితీకి సంబంధం లేదనీ, ఆమె వ్యక్తిగత విషయమనీ ఆమె మాటల్ని కొట్టేశాడు పటేల్. అతనికే వత్తాసు పలికాడు సర్పంచ్, గ్రామ ఇతర పెద్దలు తందాన అన్నారు. సంఘం ప్రతినిధులు మౌనంగా విన్నారు. ఎటూ ఏమీ మాట్లాడలేదు. కానీ మొగులమ్మ ఊరుకోలేదు. అది ఎట్లా వేరవుతుంది. పటేల్ దగ్గర బానిసగా పడి ఉన్న తన భర్తని పటేల్ పావుగా వాడుకున్నాడని అన్నది. అందుకే నిన్నటిరోజు అతన్ని నర్సరీ మీదకి, పెంచుకుంటున్న అడవి మీదకి ఎగదోసి పంపాడు. అటు తర్వాత ఎన్నడూ లేనివిధంగా నిండుగా కల్లు తాగిపిచ్చి ఇంటిమీదకు ఉసిగొల్పాడని వాదించింది మొగులమ్మ.

అవును, అప్పుడప్పుడు ఒకటో రెండో సీసాలు తాగే మా మొగుళ్ళు మొదట్లో సంఘంలోకి పోవద్దన్నారు. కానీ ఇప్పుడు వద్దని అనడంలేదు. సంఘమొచ్చాక కుటుంబాలు కుదుటపడ్డాయని అనుకున్నారు. కానీ ఎన్నడూ వీసమెత్తు మాట అనని నా పెనిమిటి ఇప్పుడు సంఘంలోకి పోవద్దని చితకబాదడమంటే అర్థమేంటి..? ఏమనుకోవాలి? ఇది కుటుంబ తగాదా ఎట్లా అవుతుంది. ఇందులో కుతంత్రం మాకు తెలవడం లేదనుకుంటున్నారా? మాలో మాకే తగాదాలు పెట్టి పబ్బం గడుపుకోవడం కాదా అని ప్రశ్నించింది. లేకుండానే కుత్తుకలు తెగ్గోయడం కాదా అని మొగులమ్మ. మా కన్నీళ్లతో మీరు పంటలు పండించుకుంటున్నారు. ఇకనించి మా కన్నీళ్లు మీకు కనిపించవు. మా కన్నీరు చాలా విలువైనదని ఈ మధ్యనే తెలుసుకున్నాం. అందుకే మా దగ్గరే భద్రపరుచుకుంటాం అందరివైపూ చూస్తూ స్పష్టంగా, సూటిగా చెప్పిందామె.

స్థిరంగా సాగుతున్న ఆమె మాటలు, చూపులు కొందరి మనస్సులో కలవరం రేపుతున్నాయి. ఆమె గొంతు తెగ్గోసి రక్త తర్పణం చేయాలన్నంత కసి, కోపంతో రగిలిపోతున్నారు. గద్దలైన పెద్దల చూపులు మొగులమ్మ దృష్టిని దాటిపోలేదు. అయినా, అదేమీ ఖాతరు చేయని మొగులమ్మ గొంతు సవరించుకున్నది. ఇప్పుడిక్కడ ఈ కచేరీలో ఊరి జనమందరి ముందు చెప్తున్నా.. మేము సంఘం లోంచి బయటికి వచ్చేదేలేదు. సంఘం నుండి బయటకు రావడమంటే మా ఊపిరి మేమే వదిలేసుకున్నట్టు. మేమెక్కిన కొమ్మను మేమే గొడ్డలితో నరుక్కున్నట్టు.. మా బొందిలో ప్రాణం ఉండగా అది జరగదు. నా మొగుడు పటేల్ ఇంటి పనివాడని నేను ఆ ఇంటి వాళ్ళు చెప్పినట్టు ఆడాల్సిన పనిలేదు. వాళ్ళు చెప్పింది నాకు నచ్చితే చేస్త. లేకుంటే లేదు. వాళ్ళ చెప్పు చేతల్లో ఉండాల్సిన పని లేదని తొణుకు బెణుకు లేకుండా స్పష్టం చేసింది. ఆమె మాటల్లో ఆవేశంలేదు. తనమీద, తమ నడతమీద దృఢమైన నమ్మకం కనిపిస్తున్నది. ఆ చూపుల్లో, ఆటల్లో అహంకారం ఏకోశానా కనిపించడంలేదు. ఆత్మవిశ్వాసం నిండుగా ఉన్నది.

మేము సంఘంలో ఏది చేసిన ఒక్కరి గురించి ఆలోచించి చేయం. నలుగురి గురించి ఆలోచన చేస్తాం. పదిమందితో పంచుకుంటాం. సత్యం నిలవాలని కోరుకుంటాం.. వెలుతురు చిమ్ముతున్న మొగులమ్మ మాటలు పూర్తికాకుండానే ఆమెను సమర్ధిస్తూ ఓ వైపు జనం చప్పట్లు చరిచారు. నోరులేని పశువులను మేము తప్పు పట్టడడంలేదు. ఆ పశువుల పేర గడ్డికరుస్తున్న వాళ్ళ మీదనే మా పోరాటమంతా అన్నది మొగులమ్మ. ఆ మాటలకు కొందరు పళ్ళు పటపటా నూరారు. ఒకళ్ళిద్దరు మొగులమ్మ మీదకు దూసుకురాబోతుంటే పక్కనున్న వాళ్ళు ఆపారు.

అవతలి వైపునుండి తమ గొడ్డు గోదా మేపుకునే జాగాలో అక్రమంగా, అన్యాయంగా మొక్కలు నాటింది గాక మమ్ములనే తప్పు పట్టేటంత పెద్దాళ్ళయ్యారా అనే కలవరం లోలోన ఉండగా దాన్ని తొక్కిపెట్టి ఉరిమారు. ఒక మాదిగ స్త్రీ ఊరందరి ముందు నిలబడి ఎదిరించి మాట్లాడుతుందా ఆధిపత్య వర్గాలవారికి ఒళ్ళంతా చిటచిటలాడుతున్నది. కారం రాసుకున్నట్లు మండుతున్నది. గ్రామ సర్పంచ్ కి కూడా బాధగానే ఉన్నది. కర్ర విరగకుండా పాము చావకుండా తీర్పు చెప్పప్రయత్నించాడు. కానీ సంఘం పెద్దలు విషయాన్ని విశదీకరించి న్యాయం చెప్పాలి లేకపోతే విషయం పోలీస్ల ముందు పెట్టాల్సి వస్తుందని అనడంతో ఆరోగ్యకమిటీకి అనుకూలంగా తీర్పు చెప్పింది పంచాయితీ. అప్పటి నుండి ఇద్దరు మనుషులను కాపలా పెట్టారు. ఒకరు సంఘం తరపున. మరొకరు గ్రామ పంచాయితీ తరపున.

బాలారిష్టాలన్నీ దాటుకుని బాలాపూర్ గ్రామంలోని బంజరు భూముల్లోని ఐదు ఎకరాల్లో మొక్కలు ఎదగడానికి మార్గం సుగమం అయింది. ఎండాకాలం వంద రోజుల పనిలో భాగంగా చుట్టూ కందకం తవ్వుకున్నారు. గోరింటాకు, వెదురు, కలబంద వంటి మొక్కలతో చుట్టూ కంచె ఏర్పాటు చేసుకున్నారు. దాదాపు ముప్పై అయిదు రోగాలకు పనికివచ్చే మందుమొక్కలు అక్కడ లభ్యమవుతున్నాయి.

తమవాళ్లతోనే, తమ వాడలోని వాళ్ళతోనే తమపైకి ఉసిగొల్పడాన్ని, దాడి చేయించడాన్ని చాలా తీవ్రంగా తీసుకున్నారు మొగులమ్మ గుంపు. పెద్దల పాచికలు పారడం కోసం తమ వారినే పావులుగా మలుచుకుంటున్న పటేళ్ల ఎత్తులను చిత్తుచేయడం ఎలా అని యోచించడం మొదలు పెట్టాయి గడ్డి పరకలు. తమ మౌనమే వాళ్ళకి అంగీకారంగా మారి ఆధిపత్యం కట్టబెట్టిందని, అహంకారం పెంచిందని వెలుతురులోకి వస్తున్నవారికి అనుభవంలోకి వస్తున్నది. తాము విడిపోతే ఒంటరేనని సమూహమైతే, సంఘటితమైతే విజయం తమదేనని ఎప్పుడో ఎరుకలోకి వచ్చిన గడ్డిపోచలు తాళ్లు పేనడం మొదలుపెట్టాయి.

(ఇంకావుంది)

పుట్టింది వరంగల్, పెరిగింది ఆదిలాబాద్, మెట్టింది నిజామాబాద్ జిల్లా. ప్రస్తుతం ఉంటున్నది హైదరాబాద్ లో. చదివింది జర్నలిజం అయినా స్థిరపడింది సామాజికసేవా రంగంలో. హేమలతా లవణం, లవణం నిర్వహణలోని సంస్కార్ సంస్థలో వారితో కలసి ఇరవై ఏళ్ళు నడిచారు. ఆ నడకలో నిజామాబాద్ జిల్లాలోని అనేకమంది గ్రామీణ మహిళల, పిల్లల జీవన పరిస్థితులు అవగతం చేసుకున్నారు. ఆ అనుభవాల్లోంచి రాసినవే 'భావవీచికలు', 'జోగిని', 'గడ్డిపువ్వు గుండె సందుక', 'ఆలోచనలో... ఆమె'. 'భావవీచికలు' బాలల హక్కులపై వచ్చిన లేఖాసాహిత్యం. ILO, ఆంధ్ర మహిళాసభ, బాల్య లు సంయుక్తంగా 2003లో ప్రచురించాయి. తరతరాల దురాచారంపై రాసిన నవల 'జోగిని ". వార్త దినపత్రిక 2004లో సీరియల్ గా ప్రచురించింది. 2015లో విహంగ ధారావాహికగా వేసింది. ప్రజాశక్తి 2004లో ప్రచురించింది. గడ్డిపువ్వు గుండె సందుక (2017) బాలల నేపథ్యంలో, ఆలోచనలో ... ఆమె (2018) మహిళల కోణంలో రాసిన కథల సంపుటాలు. 'అమర్ సాహసయాత్ర' బాలల నవల (2019) మంచిపుస్తకం ప్రచురణ.  'ఆడపిల్లను కావడం వల్లనే' శీర్షికతో ప్రజాతంత్ర వీక్లీ లో కొంతకాలం వ్యాసాలు వచ్చాయి. వివిధ పత్రికల్లో కవితలు, వ్యాసాలు ప్రచురితమయ్యాయి. వివిధ అంశాలపై రేడియో ప్రసంగాలు ప్రసారమయ్యాయి.

Leave a Reply