బతుకు సేద్యం-8

“వాండ్లు ఒక రకం పంట పెడ్తరు ఒకే రకం పంట పెడ్తరు
వాండ్లు విలువగల పంట పెడ్తరు ఆమ్దాని పంటలు పెడ్తరు
పురుగుమందు కొంటరు మసాలా ఎరువులేస్తరు అవుసరానికి మించి చేన్ల కుమ్మరిస్తరు
పంట చేతికి రాక, వచ్చిన ధర గిట్టుబాటు కాక అప్పులపాల బడ్తున్నరు చేన్లు , పొలాలమ్ముకున్నరు
వాండ్లిప్పుడు మా ఇండ్ల మొకానొస్తున్నరు ” ఆమె మాటలు చాలా స్పష్టంగా వినిపిస్తున్నాయి.

ఓడలు బండ్లు అయినట్లు , బండ్లు ఓడలయినట్లు చెప్తున్నదామె ఎవరి గురించో ..
వాండ్లు అంటే ఎవరో ..అసలు విషయం ఏమిటో. లోపల్నుంచి తన్నుకొస్తున్న ఉత్సుకతతో చక చకా అడుగులేస్తున్నాడు వినోద్ .

” ఒకప్పుడు మాలో మాకు జగడాలయితే వాండ్ల దగ్గరకు పోతుంటిమి అప్పట్లెక్క ఇప్పుడు కయ్యాలు లేవు జగడాలు లేవు
ఏమన్న యడనన్న వచ్చిన మా జగడాలు మేమే తీరుస్తున్నం మా పంచాయితీలు మేమే చేస్తున్నం” ఆ మాటలు వింటూ సభా ప్రాంగణం చేరిన వినోద్ మైక్ ముందున్న వ్యక్తిని చూసి నివ్వెరపోయాడు.

మెట్ట చేన్లలో కనిపించే చిన్న బుడిమె కాయంత లేదు ఈమె ఈమెనేనా ఇప్పటిదాకా మాట్లాడింది ఈమె మాటలేనా తాను విన్నది అనుకుంటూ మళ్ళీ ఆమెను పరిశీలనగా చూశాడు వినోద్.

పొట్టిగా, నల్లగా, సన్నగా, చిన్నగా. జుట్టు ఎక్కడైనా ఒక వెంట్రుక నెరిసిన మహిళ పొందికైన సాంప్రదాయ గోచీ కట్టుతో మిరప పండు రంగు చీరకు మామిడాకుపచ్చ అంచు , అదే రంగు రవికతో కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది.

మైకులో వినిపించిన కంచు కంఠానికి ఈమెకు పోలికా. నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉన్నట్టుందే. అనుకుంటూ చుట్టూ కలియజూశాడు .
ఆమె మాట్లాడుతున్నది సందేహం లేదు అదే గొంతు అప్పటి నుండి మాట్లాడుతున్నది ఆమెనే పిట్టకొంచెం కూత ఘనం అనే సామెత ఇట్లాటి వాళ్ళని చూసే పుట్టిందేమో విస్మయంగా ఆమెనే చూస్తూ అనుకున్నాడు వినోద్ .

“అప్పుడు ఎవరితో ఎట్ల మాట్లాడాల్నో తెల్వకుండే ఇప్పుడు మాట మర్యాద నేర్సుకున్నం ..” ప్రవాహంలా సాగుతున్నదామె ప్రసంగం .
పసుపురంగు పూల చీర కట్టుకున్న నడివయసు మహిళ ట్రై పాడ్ కి పెట్టిన వీడియో కెమెరాతో వీడియో చిత్రీకరణ చేస్తున్నది తన పనిలో తాను నిమగ్నమైపోయి ఉన్నది
నీలి గోరింట రంగు చీరకు గులాబి అంచు చీర గోచికట్టుతో ఉన్న మరో మహిళ చేతిలోనూ వీడియో కెమెరా. ఇద్దరూ చాలా ఏకాగ్రతతో తమ పని తాము చేసుకుపోతున్నారు.

వినోద్ కు కొద్దిగా ముందు నుంచున్న రెండో మహిళ చేస్తున్న వీడియో దృశ్యాలు అతనికి స్పష్టంగా కనిపిస్తున్నాయి
ఆమె చిత్రిస్తున్న దృశ్యాల షాట్స్ క్లోజప్ లోనూ, లాంగ్ షాట్స్ గానూ మాత్రమే కాకుండా హై లెన్త్ షాట్స్ , లో లెవెల్ షాట్స్ ఉండడం ఒక ప్రొఫెషనల్ వీడియో గ్రాఫర్ లాగ చిత్రీకరించడం చూసి విస్మయానికి లోనయ్యాడు వినోద్.
అసలు నేనీ ప్రపంచంలోనే ఉన్నానా . అన్న సందేహం, వింత అనుభూతి అతనిలో తానెన్నడూ కానీ వినీ ఎరుగని మరో ప్రపంచంలో విహరిస్తున్నట్లుగా ఉందతనికి

మోజుపడి కొన్న కెమెరా ఒకటి రెండుసార్లు మినహా తానెన్నడూ వాడలేదు ఇప్పుడు చేతిలో స్మార్ట్ ఫోన్ ఉన్నప్పటికీ కెమెరా ఉపయోగించడు రేఖ కెమెరా వాడినా ఇంత చక్కగా ఫోటోలు తీయలేదేమో.

ఈమె ఎంత అలవోకగా ప్రొఫెషనల్ కెమెరా వాడుతున్నది వంట గదిలో గరిటెలు తిప్పి వంట చేసినంత సులువుగా, పంట పొలంలో కొడవలి వాడినంత సులభంగా ఆ పని చేసుకుపోతున్నది సంభ్రమంగా కొద్ది సేపు వాళ్లనే చూశాడు అది గమనించిందేమో రెండో మహిళ కొద్దిగా ఇబ్బందిగా కదిలింది అప్పుడర్ధమయింది వినోద్ కి తను అలా చూడడం సభ్యత కాదని .
తన దృష్టి మరల్చాడు చుట్టూ చూశాడు .

ఆడిటోరియంలాగా అర్ధ చంద్రాకారంలో మెట్లు మెట్లుగా చెక్కిన నేల దానిపై పరిచిన ఆకుపచ్చని తివాచీ ఆ మెట్లపై కూర్చున్న ఆహుతులు వాళ్లకు ఎదురుగా కింద వైపున ఆరు కుర్చీల్లో నలుగురు మహిళలు , ఇద్దరు పురుషులు వాళ్లలో ఒకరు విదేశీ మహిళ ఒకరు గోచీతో ఉన్న గ్రామీణ మహిళ మిగిలిన వాళ్ళు ఆధునికంగా కనిపిస్తున్న మహిళలు , పురుషులు
వాళ్ళు దర్పంగా ఉన్నట్లనిపించి బహుశా వాళ్ళు అధికారులేమో అనుకున్నాడు వినోద్.

వాళ్లకు ఎదురుగా ఓ పక్కన కుడిచేత మైకు పట్టుకుని మాట్లాడుతున్న మహిళ ఆమెకు ఆవలి వైపు ఓ పక్కగా స్క్రీన్ పెట్టి కనిపిస్తున్నది .
అక్కడున్న వాళ్లలో మూడొంతులు గ్రామీణ మహిళలే శ్రామిక మహిళలే.

మిగతా ఒక వంతులో ఆ మహిళలతో ముచ్చడించడానికో, వారి కార్యక్రమాలు చూడ్డానికో పట్నం నుండి వచ్చిన ఆధునిక స్త్రీలు చదువుకున్న వాళ్ళు అధికారులు . కొద్దీ మంది విదేశీయులు , నిర్వాహక కార్యకర్తలు ఉన్నారు.

ఓ పక్కగా మీడియా ప్రతినిధులు అని అట్టపై రాసి ఉంది బహుశా అక్కడ కూర్చున్న వాళ్ళు మీడియా వాళ్ళయి ఉంటారు డయాస్ ఎదురుగా మధ్యలో ఉన్న ఎలక్ట్రానిక్ మీడియా కెమెరాలు తమ పని అవి చేసుకుపోతున్నాయి
అందరి కంటే వెనుక వరుసల్లో గ్రామీణ పురుషులు కొద్దీ మంది ఉన్నారు .
దాదాపు ఐదారొందల మంది ఉన్నా ఎలాంటి గడబిడ లేకుండా ప్రశాంతంగా కూర్చొని చెప్పేది శ్రద్దగా వింటున్నారు అక్కడక్కడా చిన్న పిల్లలు ఉన్నప్పటికీ వాళ్ళు కూడా నిశ్శబ్దంగానే ఉన్నారు మధ్యలో ఉన్న షామియానా కర్రలకు జొన్న కంకులు , గోధుమ కంకులు , శనగ దుబ్బులు, కుసుమ గుత్తులు అన్నీ కలిపి గుచ్చాలుగా కట్టి అలంకరించి ఉంది.

వాటికి దగ్గరలో ఉన్న పిల్లలు మౌనంగా వింటూ శనగకాయలు ఒలుచుకొని గింజలు నోట్లో వేసుకుంటున్నారు వద్దన్నట్లుగా తల్లులు ఆ పిల్లలకేసి ఉరిమి చూస్తున్నారు.

అంతమంది ఉన్నా మైకు ముందు మాట్లాడేవారి మాటలు తప్ప వేరే మాటలు వేరే శబ్దాలు వినపడడం లేదు
ఉఫ్ మని ఊదితే ఎగిరిపోయే నలుసులా ఉన్నఈమెకు అంత శక్తి ఎక్కడినుంచి వచ్చిందో . చాలా సేపటి నుండి అనర్గళంగా ప్రసంగిస్తున్నదని అనుకోకుండా ఉండలేకపోయాడు వ్యవసాయ శాస్త్రవేత్త వినోద్.

నిజామాబాద్ జిల్లా రుద్రూర్ లోని వరి, చెరుకు వ్యవసాయ పరిశోధనా కేంద్రంలో నూతన వరివంగడాల ఆవిష్కరణకు కృషి చేస్తున్న అతనికి ఈ మహిళల మాటలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.

అతని స్వగ్రామం వికారాబాద్ జిల్లాలోని మంబాపూర్ అదొక కుగ్రామం వినోద్ భార్య రేఖది హైదరాబాదు
ఇద్దరూ సొంత ఊర్లో మిత్రుని ఇంట పెళ్లి చూసుకుని మరో బంధువుల పెళ్ళికి బంధువులతో జహీరాబాద్ సమీపంలోని బాలాపూర్ కు బయలుదేరారు

వినోద్ చెల్లెలు విశాల కుటుంబంతో పాటు, వినోద్ పిల్లలు కూడా వాళ్ళ వెంటే వస్తుండడంతో వాళ్ళ రాకకోసం చూస్తూ చెట్టునీడకు ఆగారు
ఆ క్రమంలోనే అనుకోకుండా సభాప్రాంగణంలోకి చేరిన అతనికి గ్రామీణ జీవితంతో ఉన్న అనుబంధం తక్కువేమీ కాదు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ తిరిగిన అనుభవం ఉంది అదే విధంగా పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక , మహారాష్ట్ర గ్రామీణ జీవితంతోను చిన్ననాటి నుండి సంబంధాలున్నాయి

గ్రామీణ మహిళలు ధైర్యంగా ఉండడం చూశాడు ముక్కుసూటిగా నిర్మొహమాటంగా మాట్లాడడం విని ఉన్నాడు కానీ పబ్లిక్ మీటింగ్ లలో వందలమంది జనం ముందు కాదు.

ఇంతకు ముందెప్పుడూ పల్లె పడుచులు ఇంత ధైర్యంగా , స్పష్టంగా , సూటిగా ఆత్మస్థైర్యంతో నలుగురి ముందూ నిలబడి మాట్లాడుతున్న ఇటువంటి మాటలు వినడం గానీ, అలాంటి వారిని చూడడం గానీ, వారి గురించి విని ఉండడం గానీ జరుగలేదు.
అదే విధంగా ఏ గ్రామీణ మహిళ వీడియో షూటింగ్ చేయడం చూడలేదు అలా చేస్తారని, చేయొచ్చని కూడా ఇంతకు ముందెప్పుడూ అతని ఊహకు రాని విషయం
అటువంటిది, ఇప్పుడిక్కడ, ఆ ఇద్దరు స్త్రీలూ ఎంతో అనుభవం ఉన్నవారిలాగా ఉన్నారు చేస్తున్న పనిపట్ల శ్రద్ధతో , ఏకాగ్రతతో తమ పని తాము చేసుకుపోవడం చూస్తుంటే చాలా ముచ్చటేసింది మళ్ళీ మళ్ళీ వాళ్ళు చేస్తున్న పనినే చూడాలనిపించింది.

కానీ అట్లా చూడడం మర్యాద కాదని వివేకం హెచ్చరించడంతో మైకులో వినవస్తున్న మాటలు ఆలకిస్తూ వెనక్కి తిరిగి చుట్టూ పరికించాడు అంతలో వచ్చి కూర్చో వలసిందిగా కుర్చీ తెచ్చి వేశాడొక యువకుడు.
ఫర్వాలేదు అంటూ కూర్చోకుండా చుట్టూ పరిశీలిస్తూ ఆశ్చర్యపోతున్నాడు వినోద్ అక్కడ ప్రతిదీ విన్నూత్నంగా ఉంది ఎంతో పద్దతిగా ఉంది మనసు పెట్టి చేయకపోతే ఇంత పకడ్బందీగా నిర్వహించడం సాధ్యం కాదు.

మాములుగా ఏ పబ్లిక్ మీటింగ్ లో చూసినా మైకు ముందు నిలబడి మాట్లాడే వాళ్ళు మాట్లాడుకుపోతుంటారు ప్రేక్షకులుగా కూర్చున్న జనం కూడా వాళ్ళ ముచ్చట్లలో వాళ్ళుంటారు ఆ వాతావరణం అంతా గందరగోళంగా ఉంటుంది.
తమ పరిశోధనా కేంద్రం ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో ఒక్కోసారి కొందరు శ్రామిక మహిళలు పాల్గొంటూ ఉంటారు వారెవరూ వేదికపై మాట్లాడరు ఒకవేళ మాట్లాడినా బలవంతంగా ఒప్పించి , ఏం మాట్లాడాలో చెబితే అది వల్లెవేస్తారు అంతే.
కానీ ఇక్కడ , మిగతా ప్రపంచానికి భిన్నమైన వాతావరణంలో. అనర్గళంగా మాట్లాడుతూ.

తన జీవిత అనుభవంలోంచి మాట్లాడుతున్నదామె ఆత్మవిశ్వాసం ఆమె మాటలో, నిలుచున్నా తీరులో హావభావాల్లో ప్రస్ఫటమవుతున్నది
ఇదంతా గమనించకుండానే దాటుకుని ఎలా వచ్చాడు.

గంభీరంగా వినవస్తున్న మాటల మాయలోపడి పరిసరాల్ని గమనించకుండా ట్రాన్స్ లో వచ్చినట్టు వచ్చేశాడు చుట్టూ జరుగుతున్నదేంటో గమనించని తన చర్యకు తానే సిగ్గుపడిపోయాడు వివేక్.

రంగు రంగుల చీరలతోను, రకరకాల విత్తనాల పెట్టెలతోనూ , జొన్న సజ్జ, శనగ వంటి పంట కంకులతోను , ధాన్యపు గుత్తులతోను , చెరుకు గడలతోను అలంకరించిన పన్నెండు ఎడ్లబండ్లు ఆగి కనిపించాయి వాటి చక్రాలు ఇంధ్రధనుస్సు రంగుల్లో కన్నులకింపుగా ఉన్నాయి ఎడ్లు మాత్రం కన్పించలేదు ఎండగా ఉండడంతో అవతలెక్కడో నీడకు ఉన్నట్లున్నాయి.

నలుచదరాకారంలో టెంట్లతో వేసిన స్టాల్స్ మొదటి స్టాల్ లో సంఘం మహిళలు చేస్తున్న వివిధ కార్యక్రమాలు తెలుపుతూ ఫోటోలు కొలువుదీరి ఉన్నాయి
దానిదగ్గరలోనే మట్టితో చిన్న చిన్నవిగా చేసిన మూడు మడులు వాటిలో జొన్న , శనగ , కుసుమ , సజ్జ , నువ్వులు , రాగులు , గడ్డి నువ్వులు , పెసలు , మినుములు , కంది , అవిసె ఇలా అంతర పంటలతో అక్కడ కనిపిస్తున్న వాటిలో కొన్నిటి పేర్లు తెలియలేదతనికి.
వాటిముందు గట్టులా ఉన్న ప్రదేశంలో చెక్కతో చేసిన గ్రామదేవతల బొమ్మలు పెట్టి ముగ్గులతో అలంకరించి ఉంది కుడుములతో గ్రామదేవతలకు నైవేద్యం పెట్టిన మట్టి మూకుళ్ళు కన్పిస్తున్నాయి.

“ఈ పండుగ ఇరవై ఏండ్ల కింద షురూ జేసినం ఇది ఊర్ల అన్ని పండుగలసొంటి పండుగ కాదు ఈ పండుగకు కులం లేదు మతం లేదు
మా సంఘంల ఉన్న అన్ని కులాలు , అన్ని మతాలు కల్సి సంబరంగా జేసుకునేటి పండుగిది.

ఒక్కూరు నుంచెల్లి ఇంకొక్కుర్ల జరుపుకునేటి పండుగ పాత తరం పంటల పండుగ
సాంప్రదాయ పంటల పండుగ ఊర్లె జాతరలెక్క ఊరంతా కూడి జేస్కునేటి పండుగ
పసులతోని , విత్తనాలతోని , మా ఆచారాలతోని , మా అలవాట్లతోని , మా పండుగలతోని ఉన్న అనుబంధాన్ని యాదిజేసుకునేటి పండుగ ..” సెలయేటి గలగలల్లా మైకులోంచి వినవస్తున్న ప్రసంగం

ఈ గొంతు ఇప్పటివరకూ మాట్లాడిన ఆమెది కాదు వేరే వాళ్ళు మాట్లాడుతున్నట్లున్నారు అనుకుంటూ వెనక్కి తిరిగి చూశాడు వినోద్.
ఓ మాదిరి ఎత్తులో బక్కపలచని మహిళ మైకు ముందు కనిపించింది.
గాలివానకు వంగిపోయే గడ్డిపరకల్లా కనిపిస్తున్న వీళ్ళు బలంగా వేళ్లూనిన వృక్షాల్లా మాట్లాడుతున్నారు.
వీళ్ళు నడిచే బాట అందరూ నడుస్తున్నది కాదు కొత్త దారి.

భవిష్యత్ తరాల కోసం కొత్త బాటలు వేస్తున్న గొప్ప మనుషులుగా అనిపిస్తున్నారు.
సమాజానికి ఇటువంటి వాళ్ళేగా కావలసింది మనసులో కలిగే భావాల్ని అదుపుచేస్తూ మరో స్టాల్ లోకి అడుగుపెట్టాడు వినోద్.

స్టాల్ అంతా పేడతో అలికి ముగ్గులు పెట్టి శుభ్రంగా ఉంది ముగ్గులతో అందంగా ఉంది స్టాల్ లోపల మూడువైపులా వేసిన బల్లలపై రకరకాల తినుబండారాలు ఉన్నాయి
అవి రాగి లడ్డు , రాగి బాదుషా , కొర్రలతో , రాగులతో , జొన్నలతో చేసిన మురుకులు, కారప్పూస , బూందీ మిక్సర్ , గవ్వలు , బిస్కట్లు , కేకులు వంటి వంటకాలు
అవిసెల కారప్పొడి , గడ్డి నువ్వుల కారప్పొడి వంటి కారప్పొడులు ఉన్నాయి.
స్వచ్ఛమైన నెయ్యి వాసన వస్తుంటే అటు చూశాడు.

ఆ బల్లకు కిందవైపుగా కూర్చొని ఒక మహిళ రాగిసున్నితో లడ్డు చేస్తూ ఉంది ఆమె వెనకగా టెంటు గోడలకు అతికించిన పోస్టర్లు చిరుధాన్యాలు, ఆయా వంటల్లో ఉన్న పోషక విలువల గురించి తెలుపుతున్నాయవి అవే కాకుండా బల్లల ముందు నిల్చొని తమ ఉత్పత్తుల్ని అమ్ముతున్న మహిళలు కూడా తమ వంటకాలు ఎందుకు మంచివో, వాటిలో ఉండే పోషక విలువలు ఏమిటో అడిగిన వాళ్ళకి వివరంగా చెబుతున్నారు.

నెయ్యి వాసన టెంప్ట్ చేస్తుంటే రాగి లడ్డు ఒకటి కొన్నాడు రుచి చూశాడు బెల్లంతో చేయడం వల్లనో , స్వచ్ఛమైన తాజా నెయ్యి కావడం వల్లనో గానీ చాలా రుచిగా అనిపించింది.
రాగిలడ్డులు , కొర్రలతో చేసిన మురుకులు , సామలతో చేసిన కేకులు, చిరుధాన్యాల మిశ్రమంతో చేసిన బిస్కట్లు కొన్నాడు.
రుచి చూడొచ్చని గడ్డి నువ్వుల కారం పొడి , అవిసెల కారంపొడి వంద గ్రాముల పాకెట్లు తీసుకున్నాడు.

అటు నుండి మరో స్టాల్ లోకి అడుగు పెట్టాడు రకరకాల మూలికలు , దినుసులు , పొట్లాలు , ఆకులు , కాయలు , కొమ్మలు , తీగలు వేటికవి టేబుళ్లపై పెట్టి ఉన్నాయి అవి వేటికి ఉపయోగిస్తారో తెలిపే పోస్టర్లు అక్కడక్కడా అతికించి ఉన్నాయి.

స్టాల్ లో ఓ టేబుల్ పై కంది గింజ సైజులో చిన్న చిన్న గోలీల ప్యాకెట్లు ఉన్నాయి కరక్కాయ , ఉసిరి , త్రిఫల వంటి కొన్ని చూర్ణాలు చిన్న చిన్న కవర్లలో పోసి ఉన్నాయి ఆ హెర్బల్ ఉత్పత్తులను ఇద్దరు మహిళలు అమ్ముతున్నారు
అడిగిన వారికి వాటిని ఎట్లా వాడాలో చెబుతున్నారు
అంతలో కొద్దిగా వంగిన కాళ్లతో ఇబ్బందిగా నడుస్తూ వచ్చారొకరు తన మోకాళ్ళ నొప్పుల గురించి వివరించాడు అతని నొప్పులు నెమ్మదించడం కోసం ఏమి చెయ్యాలో చక్కగా వివరిస్తున్నది వారిలో ఓ స్త్రీ .

ఆమె ముందు టేబుల్ మీద కరక్కాయలు కవర్లలో ఉన్నాయి చిన్న చిన్న సీసాల్లో ఏదో తైలం కనిపిస్తున్నది
తెల్ల వావిలి ఆకు , సీతాఫలం గింజలు వంటివి చాలా మూలికలు , ఆకులు , గింజలు, కాయలు , పూవులు చూస్తుంటే బాల్యం గుర్తొచ్చింది .
దగ్గు వస్తే కరక్కాయ బెరడు ఇచ్చి బుగ్గన పెట్టుకొమ్మని చెప్పే నాయనమ్మ వైద్యం కదలాడింది .
మేనత్త డెలివరీ అయినప్పుడు తెల్ల వావిలి ఆకు కోసం అమ్మ వాగులు వంకల వెంట తిప్పిచ్చిన విషయం , సీతాఫలం గింజలు నూరి పేలతో పుచ్చిపోయిన బిడ్డ తలకు పట్టించిన పక్కింటి తులశమ్మ కళ్ళ ముందుకొచ్చారు .

ఆ టెంట్ లోంచి బయటకు రాగానే ఓ పక్కగా ఆగి ఉన్న వ్యాన్ దానిపై సంచార దుకాణం అని రాసి ఉంది
అందులో బెల్లం , కొర్రలు , సామలు, రాగులు , అవిసెలు , నువ్వులు , గడ్డి నువ్వులు , కందులు , పెసలు , మినుములు , శనగలు , జొన్నలు , తెల్ల జొన్నలు , పచ్చ జొన్నలు , అనుములు ఇలా రకరకాల వ్యవసాయ ఉత్పత్తులు శుభ్రం చేసి సూపర్ మార్కెట్లో అమ్మే విధంగానే పాకెట్లలో ప్యాక్ చేసి ఉన్నాయి మరో వైపుగా పెట్టిన పెద్ద పెద్ద బెల్లం ముద్దలు అన్నీ కొత్తబెల్లం ముద్దలు..

బయటి స్టోర్స్ లో ఉన్నట్లుగానే ఉన్నాయి ధరలు ఆ మాటే ఆ వ్యాన్ లో ఉన్న అతనితో అన్నాడు .
బయటివాటికి మా వాటికి పోలిక ఎట్లా సారూ. మా పంటలు సేంద్రియ పంటలు బయట దొరికేవి మందు పంటలు అన్నాడు .
సేంద్రియ పంటలకు మార్కెట్లో ఉన్న ధరలు చాలా ఎక్కువే అట్లా చూసినప్పుడు ఇవి చాలా రీజనబుల్ అనుకున్నాడు

అటునుండి సేంద్రియ ఎరువులు , సహజమైన పురుగుమందులు తయారు చేసే విధానాలు తెలుపుతూ ఉన్న స్టాల్ లోకి అడుగుపెడుతుండగా ఫోన్ రింగ్ అవడం వినిపించింది .
ప్యాంటు జేబులో ఉన్న మొబైల్ తీసి చూశాడు అంతలో రింగ్ ఆగిపోయింది
తాను కాల్ చేద్దామని చూస్తుంటే రేఖనుండి నాలుగు మిస్డ్ కాల్స్ కనిపించాయి రెండు కాల్స్ అరవింద్ దగ్గర నుండి
ఫోన్ మళ్ళీ మోగింది కాల్ తీసుకున్నాడు.

“ముహూర్తం టైం దాటిపోతున్నది ఎక్కడికి పోయావు ” వినోద్ భార్య రేఖ గొంతు విసుగ్గా
“వస్తున్నా ..” అంటూ గబగబా కారుకేసి నడిచాడు .
వినోద్ ని చూడగానే “బాపూ ..” అని అరిచారు వినోద్ పిల్లలు .
వాళ్ళను చూసి పోటీగా “మామయ్యా ..” పిలుస్తూ విశాల పిల్లలు.

వాళ్ళ అల్లరికి నవ్వుకుంటూ వెళ్లి చేతిలో ఉన్న రాగి లడ్డులు, కేకులు వాళ్ళకందించి వచ్చి కారెక్కాడు .
‘మనమే ముందు పోవాలి . పోనియ్ ‘ పిల్లల అరుపుల నవ్వుల మధ్య వినోద్ కారుని దాటి వెనక కారు ముందుకెళ్ళిపోయింది .
కొన్ని నిముషాల మౌనం తర్వాత ” ఊరంతా వదిలి ఆ చెట్ల మధ్య ఫంక్షన్ చేస్తున్నట్లున్నరు ” నిదానంగా అన్నది వెనక సీటులో ఉన్న వినోద్ పిన్ని అంజమ్మ.
“కందూరు చేస్తున్నట్లున్నరు ” తమ దగ్గర అందరూ పెద్దగుట్ట అని పిలిచే బడాపహాడ్ కందూర్లు మదిలో మెదిలిన రేఖ జవాబిచ్చింది.

” మనమొచ్చినప్పటి నుంచి మైకులో మాటలు వినపడుతున్నాయి మనం పోయే పెండ్లి మైక్ కాదు కదా ..” అని సందేహంగా ఆగింది రేఖ కదులుతున్న కారులోంచి బయటికి చూస్తూ అయినా పెండ్లిలో మాటలేం ఉంటాయి బాపనయ్య మంత్రాలు వినిపిస్తాయి కానీ అనుకున్నది

“సాధించాము . మేము సాధించాము
సాధించాము మేము ఈ రోజు
ఓహో మనసులో ఉండే విశ్వాసం
తిండి ఉంటది నలుదిశలా
శాంతి ఉంటది నలుదిక్కులా
ఆకలి ఉండదు ఎక్కడా
ఓహో కలసి పంటలతోని
సాధించాము మేము సాధించాము
సాధించాము మేము ఈ రోజు ” గాలి మోసుకొచ్చిన బృందగీతం కారులో ఉన్న అందరి చెవుల్లో దూరింది .

“ఏమంత సీరియస్ గా ఉన్నావ్ ఏమైంది వినోద్ ” అతనికేసి చూస్తూ ప్రశ్నించింది రేఖ
వినోద్ ఆలోచనల్లో ఆ పాట పాడిన మహిళలే సంచరిస్తుండడంతో రేఖ ఏమందో వినిపించుకోలేదతను .
“అడిగిన దానికి జవాబు లేదు ” గట్టిగా రెట్టించింది ఆమె.

“ఆ. ఏమడిగావ్ ..” గతుకుల రోడ్డు మీద ద్రుష్టి పెట్టిన వినోద్
“ఇగో . చూసారా అత్తమ్మా . ఇట్లుంటది . మీ కొడుకు తీరు . ” నిష్టురంగా అన్నది రేఖ
“అదే బిడ్డా . ఆడ. నువ్వు పోయొచ్చినక్కడ ఏమయితాంది ” నిదానంగా అంజమ్మ
” ఓ అదా . అక్కడ ఏదో మీటింగ్ నడుస్తున్నది అంతా లేడీస్ ఉన్నారు .
అంతా ఊరోళ్ళే వాళ్ళ మాటలు వింటుంటే నా మైండ్ బ్లాంక్ అయింది అట్లనే మైకులో మాటలు వినొస్తున్న దిక్కు పోయిన అరె . ఏమి చదువుకోనోళ్లు . అబ్బబ్బ ఏం మాట్లాడుతున్నరు. ” కారు లేపుతున్న దుమ్ము చూస్తూ మళ్ళీ అతనే
“దుమ్ము లేపుతున్నారు మాటల్తోని దుమ్ములేపుతున్నారు ఇంత చదివిన మేమేం ఎందుకు పనికిరాము వాళ్ళ ముంగట..మైకు అందుకొని పెద్ద పెద్దోళ్ల ముందు ఫికర్ లేకుండా మాట్లాడుతున్నారు .

వాళ్ళ మాటలు వింటే ఎవ్వరయినా పరేషాన్ అవుతారు నేనూ పరేషాన్ అయిన ” అని గుంటలోకి పోబోతున్న కారును జాగ్రత్తగా దాటించాడు
ఆ తర్వాత తాను విన్న మాటలసారం , అక్కడ చూసిన విషయాలు క్లుప్తంగా చెప్పాడు మధ్య మధ్యలో భార్యకేసి తిరిగి చూస్తూ
“నిజమా . అయితే నేను వచ్చేదాన్ని కద వినోద్ . నాకు చెప్పకుండానే వెళ్ళావ్ ” తన ఆసక్తిని గొంతులో నింపుకుని కినుకగా అన్నది రేఖ
” అక్కడేం జరుగుతుందో నాకుమాత్రం తెలుసా ఏంటి ..?

మైకులో వినిపించిన మాటలు రేపిన ఆసక్తితో అట్లా వెళ్ళిపోయా . ” మూతిపై మొలిసిన సన్నని నవ్వుతో అన్నాడు
” నువ్వట్లా పోతుంటే ఫ్రెష్ అవడానికి పోతున్నావేమో అనుకున్న “
ముందు వెళ్లిన కారు రేపిన దుమ్ము , ఎర్రటి దుమ్ము గాలిలో గిరికీలు కొడుతున్నది వినోద్ మౌనంగా చుట్టూ పరికిస్తూనే కారు జాగ్రత్తగా నడుపుతున్నాడు .
ఎటు చూసినా రాళ్ళూ రప్పలతో నిండిన ఎర్రటి నేలలు ఇసుక నేలలు వర్షాధారం తప్ప నీటి వనరులు ఏమాత్రం లేని భూములు అక్కడక్కడా దున్ని వదిలేసిన చెల్కలు ఎడారిలాగా కనిపిస్తున్న ఈ దుబ్బల్లోనా వీళ్ళు పంటలు పండించేది
ఈ మట్టిమీదా వాళ్ళకంత మమకారం కనీసం పశువుల మేత కూడా దొరకని నిస్సారమైన మట్టిలోనా వ్యవసాయం అనుకున్నాడు

“ఫిబ్రవరి నెలలోనే ఎండలు మండిపోతున్నాయి ” అంటూ కారులో ఏసీ మరింత పెంచింది రేఖ .
వెనుక సీటులో కూర్చున్న ముగ్గురూ చిన్నగా కునుకు తీస్తున్నట్లుగా ఉన్నారు కళ్ళు మూసుకొని ఉన్నాయి
“ఎంత డ్రై ఏరియా ..
ఎట్లా బతుకుతారో వీళ్ళు

జహీరాబాద్ వైపు అల్లం , ఆలుగడ్డలు , చెరుకు బాగా పండుతాయంటారు
కానీ . ఇదేంటి. ఇక్కడ చూస్తే ఇట్లా . ఎడారి లాగా ఉంది ” భర్తకేసి చూస్తూ అడిగింది రేఖ
“అవును రేఖా . జహీరాబాద్ కు ఒక వైపు భూములకు ఎంతో కొంత నీటి వసతి ఉన్నట్లుంది
ఇటు నీటి వనరులు ఉన్నట్లే అగుపించడం లేదు

ఇట్లాటి భూముల్లో ఆకలి జయించే పంటలు , ఆరోగ్యాన్నిచ్చే పంటలు ఎట్లా పండిచ్చారని ఆలోచిస్తున్నా ..
వాళ్ళ మాటలు వింటేనేమో . వాళ్ళెంతో నిజాయితీగానే మాట్లాడినట్లు అనిపించింది
ఇక్కడ పరిస్థితి చూస్తే ఇట్లా కనిపిస్తున్నది ఈ తిరకాసు ఏమిటో అర్ధం కావడంలేదు ” భార్యకేసి చూస్తూ అన్నాడు వినోద్
అప్పటివరకు మవునంగా కళ్ళు ముసుకు కూర్చున్న వినోద్ మేనత్త బాలమణి నోరు విప్పింది .

“వాళ్ళు ఆడవాళ్లు కద. ముందు కడుపు చూస్తరు ఇంటిల్లిపాది కడుపు నింపాలని ఆరాటపడ్తరు
అది జెయ్యాల్నంటె తిండి కావాల యాల్లకింత తిండి పెట్టాల గందుకే తిండి పంటలు పండిస్తున్నరు కావచ్చు.” సాలోచనగా అన్నది బాలమణి
ఏమాత్రం చదువు లేని బాలమణి ఇచ్చిన జవాబు వినోద్ , రేఖలకు ఆశ్చర్యం కలిగించింది .

“ఏం జెప్పినవ్ అత్తా . ఆలోచిస్తుంటే నువ్వన్నది రైటేనేమో అనిపిస్తున్నది ” అత్తకేసి తిరిగి ప్రశంసాపూర్వకంగా చూస్తూ అన్నాడు వినోద్
“అవును, ఆడవాళ్ళకి జన్మనివ్వడం తెలుసు జన్మనిచ్చిన వాళ్ళని పెంచడం తెలుసు పిల్లలతో , ప్రకృతితో ఆడవాళ్లకే దగ్గరితనం ఎక్కువ ” అన్నది రేఖ
స్నేహితుల్లాగా కబుర్లు చెప్పుకునే వినోద్ రేఖలను చూస్తే బాలామణికి ముచ్చటగా ఉంటుంది.

తనకు, తన మాటకు ఏమాత్రం విలువనివ్వని భర్తని తలచుకుంటూ ” ఆడవాళ్లకు కుటుంబపు పగ్గం ఇయ్యరు గాని . ఇస్తెనా . మొగోల్ల కంటే మంచిగనే నడుపుతరు ” అన్నది బాలమణి .

“బుగ్గ చేతుల రైకలు , పొడావు చేతుల రైకలు మల్లెల్లినయిగద. అట్లనే ఎన్కటి పంటలు ఎల్లినయి గావచ్చు ” అన్నది అంజమ్మ
అంతా ఒక్కసారి నవ్వేశారు తానూ వాళ్ళతో కలిపి నవ్విందామె

పెళ్లి భాజాభజంత్రీలు దగ్గరవుతూ వినిపిస్తున్నాయి కూర్చున్నచోటే కొద్దిగా కదులుతూ జుట్టు సవరించుకొని చీరలు సర్దుకుంటున్నారు ఆడవాళ్లు
ప్రయాణం పడదని అప్పటివరకూ కళ్ళు ముసుకు కూర్చున్న అంజమ్మ అక్క అమృతమ్మ కూడా కళ్ళు తెరిచింది
ప్రయాణంలో ఉండే కదలికలకు ఆమెకు వాంతులవుతాయి అందుకే మాట్లాడకుండా కారులో ఓ మూలకు ఒదిగి, మూతికి ముక్కుకి చీర చెంగు అడ్డుపెట్టుకుని కళ్ళుమూసుకు కూర్చుంది .

బ్యాగ్ కున్న చిన్న అద్దంలో మొహం ఎలా ఉందోనని చూసుకుంది రేఖ
తర్వాత హ్యాండ్బాగ్ లోంచి దువ్వెన తీసి దువ్వింది రాళ్లు పొదిగిన క్లిప్ బాగ్ లోంచి తీసి జుట్టుకు పెట్టింది మొహాన్ని దస్తీతో సున్నితంగా అద్దుకుంది
అది చూసి చిన్నగా నవ్వుకున్నాడు వినోద్

అతని నవ్వు గమనించిన రేఖ, నీకూ కావాలా అన్నట్లు దస్తీ చూపింది చిలిపిగా
వెనక్కి చూశాడు వినోద్ వెనక కూర్చున్నవాళ్ళు తమని గమనిస్తున్నారేమోనని
అప్పటివరకు అతని మదిలో ఎన్నడూ లేని కొత్త కొత్త ఆలోచనలు రెక్కలిప్పుతుండగా వాటికి అడ్డుకట్ట వేసి పెళ్లివారింటికి చేరారు .
సరిగ్గా జీలుకర బెల్లం పెట్టే సమయానికి వచ్చారంటూ ఆడపెళ్ళివారు ఎదురొచ్చి సాదరంగా ఆహ్వానించారు .
పెళ్ళికొడుకు బృందం ఉదయం తొమ్మిది గంటలకే అక్కడకు చేరింది

కారు దిగిన ఆడవాళ్ళూ వెళ్లి మగపిల్లాడి తరపు ఆడవాళ్లు కూర్చున్న దగ్గరకు చేరారు
వినోద్ , అరవింద్ ఒకసారి వెళ్లి పెళ్లి పందిరి సమీపంలో ఉన్న బంధువుల్ని పలకరించారు
పెళ్ళికొడుకును కళ్ళతోనే పలుకరించి వెనక్కి తిరగబోతుంటే, కుర్చీలు ఖాళీ లేక వెనక్కి పోతున్నారనుకున్నారేమో. ఎవరో కుర్చీలు తెమ్మని పురమాయించారు ఫరవాలేదని వాళ్ళని వారించి ఇద్దరూ బయట వేసిన షామియానాలోకి చేరారు

“అబ్బబ్బ . ఆ పందిట్లో ఎట్లా కూర్చున్నారో ఏమో . ఒక్కటే ఉక్కపోత .” జేబులోంచి ఖర్చీఫ్ తీసి కారుతున్న చెమట తుడుచుకుంటూ అన్నాడు అరవింద్ .
“ఏసీ కారు దిగిన తర్వాత మరీ ఎక్కువ వేడి అనిపిస్తుందిలే. ” చుట్టూ కలియజూస్తూ చిరునవ్వుతో అన్నాడు వినోద్
” అవును , నిజమే బావా ..
ఎక్కువ సేపు ఉండలేం త్వరగా వెళ్ళిపోదాం” చెమటతో తడిసిన ఖర్చీఫ్ ప్యాంటు జేబులోకి తోస్తూ అన్నాడు అరవింద్
సరేనన్నట్లు తలాడించాడు వినోద్

ఖాళీగా ఉన్న కుర్చీలు తీసుకుని గాలివచ్చే దిశగా వేసుకు కుర్చున్నారిద్దరూ .
ఓ పక్కన మంగళ వాయిద్యాల మధ్య జరుగుతున్న పెళ్లి సందడి వినిపిస్తున్నది.
తెలిసిన వాళ్ళ పలకరింపులు సాగుతున్నప్పటికీ. ఏవో ముచ్చట్లాడుతున్నప్పటికీ వినోద్ కళ్ళకు కొద్దిసేపటి క్రితం చూసిన దృశ్యాలే కనిపిస్తున్నాయి విన్న మాటలే చెవిలో గింగురుమంటున్నాయి.

ఇక్కడ వీళ్లెవరికైనా ఆ విషయాలు తెలిసే అవకాశం ఉండొచ్చేమో …అతనిలో చిన్న ఆలోచన తొంగిచూసింది.
ఇవన్నీ చిన్న చిన్న పల్లెలు ఏదైనా కొత్త సంఘటన జరిగినా , కొత్త విషయం ఉన్నా ఆ గ్రామంతో పాటు చుట్టూ పక్కల గ్రామాలన్నిటికీ తెలుస్తూనే ఉంటుంది ఆ ఎరుక చిన్నప్పుడే అనుభవం అయింది వినోద్ కి.

సర్వేల్ స్కూల్ లో సీటు తెచ్చుకున్నప్పుడు, తమ గ్రామంతో పాటు చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు కూడా ఎంత గర్వంగా చెప్పుకున్నారో ఇప్పటికీ జ్ఞాపకమే అతనికి అందుకే పాతపంటల గురించి ఈ గ్రామస్తులకు తెలిసే అవకాశం ఉండొచ్చని అతని అనుభవం చెబుతున్నది

అక్కడ కూర్చున్న వాళ్ళతో పిచ్చాపాటి సంభాషణలో నెమ్మదిగా పాత పంటల ప్రస్తావన తెచ్చాడు వినోద్.

ఆ విషయంపై మాట్లాడడానికి అంత ఆసక్తి చూపలేదు వాళ్ళు .
ఒకరు మాత్రం ఆ ఆ సంఘం వాళ్ళు పండిస్తున్నారు అవేమీ కొత్తవి కావు తాత ముత్తాతల కాలంలో పండించినవే నిన్న మొన్నటిదాకా అందరూ పండించినవే అంటూ తేలిగ్గా చెప్పారు .
“కొత్త దినాలెల్లినయ్. నయా పంటలెల్లినయ్ .
గా పాత పంటలు కానరాకొచ్చినయ్ .
ఇయ్యాల రేపు దునియా ఆం..త పైసాతోటే నడవబట్టే .
గట్లనే పైస పంటలెల్లినాయ్ ..
అవ్వే పంటలేస్తున్నరు .

పురాగ గా పైసలే తింటరో . ” కర్రాడించుకుంటూ వచ్చి కూర్చున్న వృద్ధుడు గొణిగాడు
మళ్ళీ అతనే “జొన్నలు సజ్జాలంటే రొట్టె తింటం ఎన్నడన్న తైదల అంబలి జేస్కుంటాన్నం
గా కొర్రలు , అరికెలు , సామలు ఎవడు తింటున్నడు ఎన్నడో మరిస్తిరి
అయిన ఇప్పటోళ్లకు అయ్యి జేసుడొస్తదా. తినుడొస్తదా. ఎనకటిలెక్క
అంత ఓపిక ఇప్పటోల్లెవరికి పాడుబడ్డది ..

అప్పట్లెక్క జీతగాళ్లు ఉన్నరా . ఏంది . గిప్పుడా పంటలు ఎవరు తీత్తరు. ఎవరు తింటరు గా సంగపోల్లుదప్ప. ?” తలపాగా తీసి మళ్ళీ చుట్టుకున్న వృద్ధుడు తనలో తాను చెప్పుకుంటున్నట్టుగా …ఆ గొంతులో ఒకలాటి విసురు ఆ మాటలో విరుపు ఉన్నట్లనిపించింది వింటున్నవాళ్ళకి.
అతని మాటల్లో ఉన్నది సంఘం వాళ్ళ పట్ల చులకన భావమా . లేక ఆ తరం పంటల్ని పండించని వాళ్ళ పట్ల , ఆ తిండి తినని వాళ్ళ పట్ల కోపమా అర్ధం కాలేదు వినోద్ కి .

” తాతా . ఎన్నెండ్లు ఉండొచ్చే ..” కూర్చున్న కుర్చీ అతని వైపుకు తిప్పుకుంటూ అడిగాడు అరవింద్.
“ఉండొచ్చు నూరేండ్ల దాంక ” అన్నాడు అప్పుడే అక్కడి కొచ్చిన నడివయస్కుడు.
“ఆ . ఎంత .

నూరేండ్లకు ఐదారు తక్కువుండొచ్చు గంతే . ” ముసిముసిగా నవ్వుతూ బోసిపళ్ళ తాత.
అతనికేసి ఆశ్చర్యంగా చూశారు వినోద్ అరవింద్ లు ఆ తర్వాత ఒకరి మొఖాలు ఒకరు చూసుకున్నారు.
” డెబ్బయి ఉండొచ్చనుకున్న . ” వినోద్ కేసి చూస్తూ అన్నాడు అరవింద్.

“ఎన్కటి తిండే తిండి ..గట్టి తిండి . ఇప్పటిదో తిండా . ” అన్నాడా తాత నెరిసిన మీసాలను సవరదీసుకుంటూ
“సంఘం వాళ్ళు గట్టి తిండి పంటలే పండిస్తారా తాతా ..” నెమ్మదిగా విషయంలోకి దించుతూ అడిగాడు వినోద్

” ఏమి సంఘమో . ఏమో ..
ఊర్ల సంగమొచ్చిన కాడికెల్లి అంత పరేషానయితున్నరు.
ఇట్ల. ఇంట్ల లగ్గమాయితున్నదంటే ఇట్లనే ఉంటుండెనా . చాకిరి జేసే మనుషులు దండిగుంటుండే
కడుపుకింత ముద్ద దొరుకతదని ఆశతోటి ఈడనే పడి చస్తుండే .. ఇయ్యాల్టి దినాలిట్ల కాలవడ్డయ్ ..
ఈ దినాలల్ల పనికి ఒక్క పోరడు దొర్కుత లేదు పోరి దొర్కుత లేదు.

పుక్యానికి సర్కారు తిండి దొరుకుతాంది గద . ఇంకేడ దొర్కుతరు . అంత ఆస్టళ్ళకెగవడ్డరు
కూలికి లేదు , న్యాలికి లేదు . ఆల్లదె రాజ్యం . మాటినేటోడు ఎవడన్న ఉన్నడా . గీ సంగమొచ్చినంక మరింత అన్యాలమయిపాయె . ” అప్పుడే వేడి వేడి అన్నం తిని రావడంతోనో , లేక బయటి వేడికో , లేక లోపలనుండి తన్నుకొస్తున్న కోపమో గాని పట్టిన చెమటని భుజమ్మీది తువ్వాలుతో తుడుచుకుంటూ సంఘం వాళ్లపై ఆక్రోశం వెళ్లగక్కాడు పెళ్లి కూతురు చిన్న తాత రాంరావు .

“రాంరావు పటేల్ వచ్చిండు గద. ఓ సారూ ఆయనకడుగుంరి
ముచ్చటవెట్టుడంటే పానంవెడ్తడు తినొచ్చిండు గద , అరిగేదంక ముచ్చటవెడ్తడు తియింరి” అంటూ తాను భోజనానికి కదిలాడు నడివయస్కుడు .
“పెండ్లి కొడుకు దిక్కా. ” ఎప్పుడు చూసిన మొహాలు కాదని పరికించి చూస్తూ అడిగాడు రాంరావు .
అవునన్నట్లు తలూపారు వినోద్ , అరవింద్ లు
అవడానికి ఫిబ్రవరి నెలే . కానీ ఈ ఎండలేమిటో . వేడి , ఉక్కపోతలకు తల్లడిల్లుతున్న అరవిందు మనసులో అనుకున్నాడు ఖర్చీఫ్ తో మొహం తుడుచుకుంటూ మంచినీటికోసం కదిలాడు.

“మీరు తిన్నరా . ” అడిగాడు రాంరావు.
లేదన్నట్లు తల ఊపిన వినోద్ ని పరీక్షగా చూస్తూ “ముందుగల తినుంరి పోయి తినొచ్చినంక మాస్తు ముచ్చటజేయొచ్చు ” అన్నాడతను.
“దానిదేముంది లెండి . మీతో ముచ్చట పెట్టుకుంటూ కూడా తినొచ్చు ” కూర్చున్నచోటు నుండి కదలకుండా చిన్నగా నవ్వుతూ వినోద్.

ఏమనుకున్నాడో ఏమో గానీ నెమ్మదిగా ముచ్చటలోకి దిగాడు రాంరావు.
“ఒకప్పుడు మా ఇండ్లల్ల , చేన్లల్ల చేతికింద మనుషులు మాలెస్సగుంటుండే.
ఇగ గిట్ల ఏదన్న కార్యమున్నదంటే ఊ అంటే మనిషి . ఆ అంటే మనిషి కాళ్లకడ్డం తగులుకున్నట్టుంటుండే . ఇప్పుడేడ ? గా కాలం గంగల గల్సే .
ఇయ్యాల్ల రేపు . పతోనికి సదువులు గావాలె . కొలువులుగావాలె . కలంపట్టిన పతోడు డాక్టరో కలెక్టరో కావాల్నని, అర్రల గాలిపంక కింద కూసుండాల్నని ఆశపడుడేనాయే ..శిరాపురి తినాల్నని కలలుగనేటోడేనాయె.

ఒక బర్లు కాసేటోడా . గొడ్లు కాసెటోడా . పావుడ పట్టెటోడా . ఒక్కడు దొర్కుతలేరు
పటేలా. పటేలా . అని కాళ్ళు మొక్కుకుంట మొడ్డేనుక తిరిగినోల్లు ఇయ్యల్ల రేపు మారాజులైంరు నెత్తిమీనెక్కి ఆట ఆడవడ్తిరి… ఆట
గతిలేని ఇంట్ల సంసారం జేసినట్టయిపాయె మనసొంటోళ్లకు.
సర్కారు ఆల్లకే జేస్తది సదూకున్నోళ్ళు ఆఫీసుబెట్టి ఆల్లకే జెయ్యవడితిరి.
ఆల్లకే ఇల్లు వాకిండ్లు అయ్యే . భూమి జాగలయ్యే . ఎడ్లు బండ్లు అయ్యే ..గొడ్డుగోద అయ్యే . నడిమింట్లకు టీవీ వచ్చే . చేతుల సెల్లుఫోనొచ్చే . కమ్మగ తినుకుంట, ఎచ్చగ పంటున్నరు.

గతిలేనోడు పన్లకచ్చిన తత్పారం అస్తడు
మాటా ముచ్చట మా శానా నేర్సిన్రు ఇగ ఆల్లు మనసొంటోల్ల మాట ఖాతర్ జేత్తరా. మనతోటి బారాబరనవట్టె
తాతల కాలానికి మర్రిచెట్టు, కొడుకు కాలానికి మొండి మొదలయినట్టున్నది ముచ్చట ” నోట్లో వేసుకున్న పాన్ పరాగ్ తుపుక్కున పక్కకి ఉమ్మి అన్నాడు రాంరావు.
మొదట తాను అడిగిన దానికి అతను చెప్పేదానికి సంబంధం బోధపడక అయోమయపడ్డ వినోద్ కి ఆలోచిస్తుంటే ఏదో లంకె ఉన్నట్లే తోచింది.
అతని అక్కసుకు , ఆవేదనకు అర్ధం ఉందేమో.

ఇన్నాళ్ళు పని మనుషులతో పనులన్నీ చేయించుకున్నవాళ్ళకి ఇప్పుడు తామే చేసుకోవాలంటే బాధేగా .
తన చిన్నప్పుడు తమ ఇంటిదగ్గరే కాకుండా అమ్మమ్మ,నాన్నమ్మ ఇలా తన ఎరుకలో ఎవరింటికి పోయినా ఇల్లూవాకిళ్ళు శుభ్రం చేసి , అలుకు పూత చేసే ఆడవాళ్లు , బాసన్లు తోమే ఆడవాళ్లు , వడ్లు దంచి బియ్యం చేసే ఆడవాళ్లు , పప్పులు చేసే ఆడవాళ్ళూ ఇలా పనులు చేసే ఆడవాళ్లు ఎందరో కనిపిస్తుండేవారు.

అట్లాగే బర్లను కాసే పదిపన్నెండేళ్ల పిల్లలనూ చూసేవాడు తమ వూళ్ళో కూడా ఎప్పుడూ చేతినిండా మనుషులుండేవారు పనులు చేస్తుండేవారు .
రాత్రి పగలు పొలాన్నే పడుండి అరకదున్ని, నీళ్లు బెట్టి విత్తనం వేసి పుట్టెడు పండించే జీతగాళ్ళు ఉండే వారెప్పుడూ . ఇప్పుడట్లా దొరకడం లేదు ఈ ఊరని ఏముంది ఎక్కడైనా ఇదే సమస్య అనుకున్నాడు వినోద్.

“బావా మనమూ భోజనం చేసేద్దామా ” తమనెతుక్కుంటూ వచ్చిన పిల్లల్ని తీసుకొస్తూ అడిగాడు అరవింద్.
అందరూ కలసి భోజనాల దగ్గరకొచ్చారు అక్కడ చాలా రద్దీగా ఉంది ఆ రద్దీలో భోజనాలు వడ్డించే టేబుళ్లకు కొద్ది దూరంలో జనం పెద్ద గుంపుగా గుమిగూడి ఉన్నారు ఏమిటని దగ్గరకు వెళ్లి చూశాడు వినోద్.

ఇద్దరు వ్యక్తులు కుర్చీ వేసుకొని కూర్చున్నారు వాళ్ళ చేతిలో పుస్తకం పెన్ను.
భోజనాలకు వెళ్తూ వెళ్తూ అక్కడ కూర్చున్న ఆ ఇద్దరికీ పెళ్లి పిల్లకు అందజేయాల్సిన కట్నాలు రాయించుకుంటున్నారు చాలా మంది
రాస్కోవోయ్ సంజూ . వంద రూపాయలు అంటున్నాడు ఓ యువకుడు.
నీ పేరు రాయాలా మీ నాయన పేరు రాయాలా అడిగాడు కూర్చున్న ఆ ఇద్దరిలోంచి ఒకరు.
నాదే రాస్కో . అలాగయిపోయినం గద . మా నాయిన కట్నం మా నాయిన రాపిచ్చుకుంటడు అంటున్నాడు ఆ యువకుడు అతని మాటలు వింటూనే రాసుకుంటున్నారు వాళ్ళు.

అరే . ఎంతసేపు బై . జల్ది జల్దీ కానీయిరి. గుంపులోంచి తొందరిస్తున్నారెవరో .
తినొచ్చి రాపిచ్చుకుందాం ..తీ . అంటూ ఇద్దరుముగ్గురు వెనక్కి తిరుగుతున్నారక్కడి నుంచి

ముందుకు చూశారు బావ బావమరుదులు భోజనాల దగ్గర చాలా రద్దీగా ఉంది
తోసుకుంటూ పోయి పెట్టిచ్చుకోవడం మనతోటి కాదులే అంటూ వెనకడుగేశాడు అరవింద్ ఆ వెనకే వినోద్ అది చూసి పిల్లలూ ఉసురోమంటూ వెనక్కి తిరిగి పెళ్లిమండపంలో ఉన్న తల్లుల దగ్గరకు వెళ్లిపోయారు.

ఊరందరినీ పిలిచారట అంతా ఒకేసారి లేసినట్టున్నారు అందుకే అంత తొక్కిసలాట అనుకుంటున్నారు వెనక్కి తిరిగిన వాళ్లెవరో .
వినోద్ కళ్ళు టెంటులో పెళ్లికూతురు చిన్నతాత కోసం వెతికాయి అతను ఆ పరిసరాల్లో ఎక్కడా కనిపించలేదు

నుంచొని జనాన్ని చూస్తున్న వాళ్ళ దగ్గరకు ప్లాస్టిక్ కుర్చీలు జరిపి “జరాగితే కొంచెం తీరమయితది కూసోండి సార్ ” అన్నాడో యువకుడు .
మగపెళ్లి వారి మర్యాద చిన్నగా అనుకుంటూ ఒకరిమొహాలొకరు చూసి నవ్వుకుంటూ కూర్చున్నారు బావమరుదులిద్దరూ ..
చెట్లన్నా లేవు. ఉంటే కాస్త గాలి ఉండేది మనసులో అనుకున్నాడు వినోద్.

అంతలో జహీరాబాద్ లో ఉండే వినోద్ కజిన్ సుధాకర్ వాళ్ళ దగ్గరకు వచ్చి “అన్నా . గుర్తు పట్టినవాయే” అంటూ చెయ్యిచాచాడు.
వినోద్ కి ఎక్కడో చేసినట్లుంది కానీ ఎక్కడో గుర్తుకు రావడం లేదు అయినా అతని చెయ్యిలో చెయ్యి కలిపాడు.

పుట్టింది వరంగల్, పెరిగింది ఆదిలాబాద్, మెట్టింది నిజామాబాద్ జిల్లా. ప్రస్తుతం ఉంటున్నది హైదరాబాద్ లో. చదివింది జర్నలిజం అయినా స్థిరపడింది సామాజికసేవా రంగంలో. హేమలతా లవణం, లవణం నిర్వహణలోని సంస్కార్ సంస్థలో వారితో కలసి ఇరవై ఏళ్ళు నడిచారు. ఆ నడకలో నిజామాబాద్ జిల్లాలోని అనేకమంది గ్రామీణ మహిళల, పిల్లల జీవన పరిస్థితులు అవగతం చేసుకున్నారు. ఆ అనుభవాల్లోంచి రాసినవే 'భావవీచికలు', 'జోగిని', 'గడ్డిపువ్వు గుండె సందుక', 'ఆలోచనలో... ఆమె'. 'భావవీచికలు' బాలల హక్కులపై వచ్చిన లేఖాసాహిత్యం. ILO, ఆంధ్ర మహిళాసభ, బాల్య లు సంయుక్తంగా 2003లో ప్రచురించాయి. తరతరాల దురాచారంపై రాసిన నవల 'జోగిని ". వార్త దినపత్రిక 2004లో సీరియల్ గా ప్రచురించింది. 2015లో విహంగ ధారావాహికగా వేసింది. ప్రజాశక్తి 2004లో ప్రచురించింది. గడ్డిపువ్వు గుండె సందుక (2017) బాలల నేపథ్యంలో, ఆలోచనలో ... ఆమె (2018) మహిళల కోణంలో రాసిన కథల సంపుటాలు. 'అమర్ సాహసయాత్ర' బాలల నవల (2019) మంచిపుస్తకం ప్రచురణ.  'ఆడపిల్లను కావడం వల్లనే' శీర్షికతో ప్రజాతంత్ర వీక్లీ లో కొంతకాలం వ్యాసాలు వచ్చాయి. వివిధ పత్రికల్లో కవితలు, వ్యాసాలు ప్రచురితమయ్యాయి. వివిధ అంశాలపై రేడియో ప్రసంగాలు ప్రసారమయ్యాయి.

Leave a Reply