బతుకు సేద్యం – 5

మొగులమ్మ ఇల్లు చాలా పాతది. చిన్నయ్య తాత ముత్తాతలనాటి కూనపెంకుటిల్లు. మట్టిగోడల ఇల్లు. అందులో సగం ఎప్పుడో కూలిపోయింది. మిగతాది ఎప్పుడైనా కూలిపోవడానికి సిద్ధం అంటున్నది.
ఇంటిమీద కూనపెంకులు చాలా వరకు పగిలిపోయాయి. బయటి వర్షమంతా ఇంట్లోనే ఉంటున్నది. అందుకే కురుస్తున్న కూనపెంకులపై గడ్డి కప్పాలని యోచిస్తున్నది మొగులమ్మ.

పటేల్ ను అడుగుతా ఏమంటాడో.. అతను ఇవ్వకపోతే ప్రతాపరెడ్డి దొర పొలం చేస్తున్న కాపు బాలరాజును అడుగుదాం అన్నాడు చిన్నయ్య పనికిపోతూ.
రేపో మాపో గడ్డి తెస్తాడు. ఇల్లు కప్పుకోవచ్చనే ఆలోచనలో ఉన్నది మొగులమ్మ.

గోధుమ చేన్లలో తిరిగి పరిగె ఏరుకొచ్చిన గోధుమ కంకులు కొట్టి గోధుమలు చేసింది. దాదాపు రెండు కిలోలకు పైనే వచ్చాయి.
వాటిని బాగుచేసి నాలుగు రోజులు వాకిట్లో ఎండబెట్టి పిండి విసిరింది.
త్వరలో వచ్చే దీపావళి పండుగకు పిల్లలకు సేమ్యా చేసి పెట్టొచ్చు అనుకున్నది.
ఆ రోజు వాతావరణం పొడిగానే ఉన్నది. చేత్తో సేమ్యా తయారు చేసింది.

చేసిన సేమ్యాని గొనె సంచి మీద వేసి రోజూ ఇంటి మీద ఎండకు పెడుతున్నది. సాయంత్రం అవగానే ఇంట్లోకి తెస్తున్నది. అట్లా రెండురోజులు గడిచాయి.

మూడో రోజు సాయంత్రం అయేసరికి ఆకాశంలో మబ్బులు కమ్మాయి. సేమ్యా ఎక్కడ తడిచిపోతుందోనని తీసి ఇంట్లో ఓ పక్కకు పెట్టింది.

వర్షం అప్పుడు పడలేదు. కానీ, మొగులమ్మ వాళ్ళు తిని పడుకున్న తర్వాత అర్ధరాత్రి చిన్నగా మొదలైన వాన రానురానూ ఉరుములు మెరుపులతో బాగా పెరిగిపోయింది. చాలా పెద్ద వాన వచ్చింది.
ఆ వర్షానికి ఆమె ఇల్లంతా నానిపోయింది. మూలకు పెట్టిన సేమ్యా తడిసిపోయింది. దాదాపు రెండు కిలోల సేమ్యా తడిసి ముద్దయింది. నోటికాడికొచ్చిన కూడు ఎందుకూ పనికిరాకుండా పోయిందని మొగులమ్మ ప్రాణం విలవిలలాడింది.

అట్లా వారం రోజులు గడిచిపోయాయి. గడ్డి రాలేదు. ప్రతి రోజు భర్త తెచ్చే గడ్డికోసం ఆశగా ఎదురుచూస్తూనే తన ప్రయత్నం తాను చేస్తూన్నది.
అతనేమో పటేల్ ని ఎప్పుడు గడ్డి అడుగుదామా అని అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు. అట్లా రోజులు , వారాలు మారిపోతున్నాయి.

అప్పుడు మొగులమ్మ మినుముల కోత పనుల్లో ఉంది. కూలికి పోయిన చోటునుండి వచ్చేటప్పుడు మినపకాయల్ని కొట్టి చెరిగినప్పుడు వచ్చే పొట్టుని, మినప కంపని తెచ్చుకుంది. పొయ్యి ముట్టించడానికి బాగా పనికొస్తుందని.

అంతలో ఆ రోజు చాలా పెద్ద వర్షం వచ్చింది. ఆమె ఇంటి లోపలంతా తడిచిపోయింది. ఇల్లంతా ఏ మూలకు చూసినా నానిపోయి కనిపిస్తున్నది.
పిల్లలని ఎట్లా ఎక్కడ పడుకో బెట్టాలో అర్ధం కాలేదు.
కాసేపటికి ఏదో గుర్తొచ్చినట్టుగా లేచివెళ్లి మినపకాయ పొట్టు దగ్గరకెళ్ళింది. లోపలికి చెయ్యి పెట్టి చూసింది. వెచ్చగా ఉన్నది. పైన తడిగా అయిన మినపకాయల పొట్టును ఓ పక్కకు జరిపి పొడిగా ఉన్నదాన్ని తీసుకొచ్చి ఆ పదును పోవడానికి మినపకాయల పొట్టు పరిసింది. దానిమీద పాత గోతాం సంచి కప్పింది.

ఆ సంచులపై పిల్లలను పడుకోబెట్టింది. వాళ్ళను నిద్రపుచ్చుదామని ప్రయత్నం చేస్తున్నది. పై నుండి కారే నీటివల్ల పొట్టు నెమ్మదిగా నీటిపై తేలడం మొదలు పెట్టింది.


శరీరానికి తడి తగలడంతో పిల్లలు ఏడుస్తూ లేచి కూర్చున్నారు. ఆ చిమ్మ చీకట్లో, విసిరికొట్టే గాలుల్లో పక్కనుకున్న సంతోషమ్మ ఇంటికి పోయి తలదాచుకునే పరిస్థితి కూడా కనిపించడం లేదు. వర్షానికి ఏ మూలకో చేరిన కప్పలు బెక బెకమంటున్నాయి. బయట గాలి ఈలలు వేసుకుంటూ సాగుతున్న శబ్దం. ఒక్కోసారి అది భీకరంగా మారిపోతూ..
ఎక్కడో ఫెళ ఫెళ మంటూ చెట్టు విరిగిన చప్పుడు..
వాన మొదలవ్వగానే నిద్రలేచి వెలిగించిన గ్యాసు నూనె దీపం బుడ్డిలో నూనె అయిపోయిందేమో కొడిగట్టి ఆరిపోయింది.

ఇల్లు మొత్తంలో ఒకే ఒక మూల కొంచెం పొడిగా ఉన్నది. ఆ చీకట్లోనే పిల్లల్ని తీసుకుని నెమ్మదిగా ఆ మూలకు చేరింది మొగులమ్మ. చిన్న కొడుకుని పొట్టకు కరిచి పట్టుకుంది. చిన్న కూతురు మల్లమ్మ, పెద్దకొడుకు మల్లేశం చెరోవైపు ఆమె రెక్కపట్టుకుని అతుక్కుపోయి కూర్చున్నారు. పెద్ద కూతురు పూలమ్మ ఆమెతోపాటే వాళ్ళను అతుక్కుంటూ.. భయం భయంగా..

ప్రకృతి చేస్తున్న భీకర గర్జనకు భయపడిపోతున్నారు పిల్లలు. తల్లిని మరింత గట్టిగా హత్తుకుపోయారు. తెల్లవారు ఝామునెప్పుడో ప్రకృతి శాంతించడం మొదలుపెట్టింది.
తెల్లవారెవరకూ గుండె దిటవు చేస్కొని అట్లాగే కూర్చున్న మొగులమ్మకి భర్త చిన్నయ్య గురించి దిగులు ఎక్కువైంది. పొద్దున్న పనికి పోయిన భర్త సాయంత్రం వచ్చి ఇంత తిని రాత్రి అడవిపందుల కావలికి పటేల్ చేనుకు పోతున్నట్టు చెప్పాడు. అక్కడ తలదాచుకోవడానికి ఏమీ లేదు. ఎట్లా ఉన్నాడోనని అతని గురించి బెంగ పడుతున్నది ఆమె.

గోతం సంచులు కప్పుకుని పడుతున్న చిన్నయ్య పైన కప్పు ఏమీ లేకపోవడంతో పూర్తిగా నానిపోతూనే ఉన్నాడు. ఇంటిమీద గడ్డి కప్పనేలేదనే విషయం గుర్తొచ్చింది. అకస్మాత్తుగా వచ్చిన పెద్దవానకు పిల్లలతో మొగులమ్మ ఎట్లా ఉన్నదోనని చిన్నయ్య ఆవేదన చెందాడు.

తెల్లవారేసరికి వాన పూర్తిగా తగ్గింది. ఏమీ ఎరగనట్టు సూరీడు పలకరించాడు.
తడిసిన మినప పొట్టంతా జమ చేసి ఎండ పెట్టింది. ఇల్లంతా శుభ్రం చేసుకున్నది. తడిసిపోయిన బట్టలను , గొనె సంచులు , ఈతాకుల చాపను ఎండకు ఆరవేసింది.

కాస్త ఆరిన మినపపొట్టును ఇంట్లోపలి తేమ పీలుస్తుందేమోనన్న ఆశతో మళ్ళీ జల్లింది. దానిపై ఎండకు ఆరేసిన గోనె సంచులు పరిచింది. దానిపై ఈతాకుల చాప వేసింది. పిల్లలను పడుకోబెట్టి తానూ నడుం వాల్చింది మొగులమ్మ.
ముందు రోజు రాత్రి వర్షానికి నాని ఉదయం ఎండకు ఎండిన చిన్నయ్యకు వళ్లంతా పచ్చి పుండులా ఉంది. తొందరగా ఇంటికిపోయి పడుకోవాలనుకున్నాడు. అనుకున్నట్లుగానే వచ్చి కొంచెం తిని ముసుగుపెట్టాడు.
అంతలో బర్రె ఈనింది రమ్మని యజమాని కబురు పంపడంతో అటు పరుగెత్తాడు చిన్నయ్య. అతను ఇంకా రాలేదు. బయట వాతావరణం నిన్నటి రాత్రిని తలపిస్తూ భయంకరంగా తయారవుతున్నది.

మళ్ళీ వర్షం మొదలయింది. ఉరుములతో , మెరుపులతో లేచి దీపం ముట్టించేటట్లు కూడా లేదు. పెద్ద గాలి విసిరి విసిరి కొడుతున్నది. దీపం వెలిగించినా ఆ గాలికి నిలవదు. ఆరిపోతుంది అనుకున్నదామె.
వర్షంతో పాటు దుమ్ము కూడా ఇంటి తలుపుగా కట్టిన తడికను తోసుకుంటూ లోపలికి పరిగెత్తుకొచ్చింది. ఆమెకు ఏమి చేయాలో తోచడం లేదు. చంకనేసుకొన్న చిన్న కొడుకుని ఒళ్ళో పడుకోబెట్టుకుంది. తన చీర కుచ్చెళ్ల వెచ్చదనం కింద ఉంచి పైన చెంగు తీసి కప్పింది. మూలకు పడుకున్న మిగతా పిల్లలకింద తడి తగిలిందేమో వాళ్ళు లేచి ఏడవడం మొదలుపెట్టారు.

పిల్లలను దగ్గరకు తీసుకుని కోడి రెక్కలకింద పిల్లల్ని కప్పుకున్నట్టు కూర్చుంది. వర్షానికి తడవడం కంటే ముందు వర్షానికి నానిన మట్టి గోడలు ఎప్ప్పుడు ఏ క్షణాన కూలతాయో.. ఎవరిమీద పడతాయోనని అరచేతుల్లో ప్రాణం పెట్టుకుని రాత్రంతా జాగారం చేసింది మొగులమ్మ.
బయట ప్రకృతి భీభత్సం కంటే ఎక్కువగా తన ఇంట్లో జరగబోయే భీభత్సం తల్చుకుంటే ఆమె హృదయం భీతిల్లుతున్నది. బాధపడుతున్నది. కకావికలైన మనసును సర్ది చెప్పుకుంటూ వెలుగురేఖలకోసం కళ్లప్పగించి చూస్తున్నది.

క్రమంగా చీకటిపొరలు విప్పుకుంటున్న రాత్రిని చూస్తూ తప్పదు.. విప్పుకోక తప్పదు.
ఏదయినా వెనుకాముందు అవుతుందేమో కానీ సమయానికి పొద్దు పొడవడం అట్లాగే సమయానికి ఆవలి తీరం దాటడం మాత్రం జరిగిపోతూనే ఉంటుంది. మబ్భుల మాటునుంచయినా సరే లోకానికి వెలుతురు పంచుతూనే ఉంటాడు సూర్యభగవానుడు అనుకుంటూ కూర్చున్న చోటునుంచి లేచింది.

పరిచిన గోనె సంచిపైనే నలుగురు పిల్లలూ మోకాళ్ళమీద ఒకళ్ళకొకళ్ళు కాళ్ళుచేతులేసి ముడుచుకు పడుకున్నారు. కొద్దిసేపటి క్రితం వరకు మొగులమ్మ వొళ్ళోనే ఉన్న చిన్నవాడిని నెమ్మదిగా పెద్దపిల్లల దగ్గరే పడుకోబెట్టింది. చుట్ట చుట్టుకున్నట్టు నిద్రపోతున్న పిల్లల కేసి చూసింది. చిన్నోడు నిద్రలోనే నవ్వుకుంటున్నాడు. వాడి పెదవుల మీద నవ్వు నెమ్మదిగా మొగులమ్మ మొహంలోకి పాకుతుండగా ఒక్కసారిగా శ్రేష్టలుడిగి చూస్తున్నది.

ఆమె గుండె దబదబా కొట్టుకుంటున్నది. కొన్ని క్షణాలు ఏమి చేయాలో తోచలేదు. మెదడు ముద్దుబారిపోయింది. ఆలోచన మసకబారిపోయింది. కట్టెలాగా నిలుచుండిపోయింది.
కొద్దీ క్షణాల క్రితం ఆమె కూర్చున్న చోటులోనే గోనెసంచి పక్కన తానూ చోటు చేసుకుని ముడుచుకుపడుకున్నది కట్లపాము.

అయ్యో దేవుడా.. ఇప్పుడేమి చెయ్యను అని మనసులోనే అనుకున్నది. అంతలోనే.. ఇంకా నయం అది ఎవర్నీ ముట్టుకోలేదని కనిపించని దేవుళ్ళకు చేతులెత్తి దండం పెట్టింది.
పిల్లలను కదపడమా.. దానిని చంపడమా.. ఏమి చెయ్యాలో తోచనితనంలో క కొన్ని క్షణాలు దొర్లిపోయాయి.
అట్లా చూస్తూనే , పిల్లలకు కావలి కాస్తూనే ఉన్నది.

తర్వాత చప్పుడు కాకుండా బయటికిపోయి కర్ర తీసుకొచ్చింది. అది పూర్తిగా నానిపోయి ఉన్నది. మట్టిగొట్టుకుపోయి ఉన్నది. ఆ మట్టిని పాత గొనెసంచితో తుడిచింది. కర్ర చేతినుండి జారకుండా గట్టిగా పట్టుకుని లోపలికెళ్ళింది.

కర్రను పిల్లల వైపు ఉంచి ఒక్కసారిగా పడుకున్న పామును కర్రమీదకు తీసుకోబోయింది. అది భయంతో మరో వేపుకు పరుగు పెట్టబోయింది. బురదగా ఉండడంతోనో , నిద్రమత్తు వీడకపోవడంతోనో గాని అది వేగం అందుకోలేదు. అంతలో చేతిలో ఉన్న కర్రతో రెండు దెబ్బలు వేసింది మొగులమ్మ.
నడ్డివిరిగి ముందుకు కదలలేకపోయింది కట్లపాము.
ఆ చప్పుడుకి పూలమ్మ , మల్లేశం నిద్ర లేచారు.

తాతముత్తాతల నాటి ఆ ఇంట్లోనే ఉంటుంది వానాకాలం. గోడలను నాన్చుతూ.. నెమ్మనెమ్మదిగా వాటిని కిందకు వాలుస్తూ.. పై కప్పును కిందకు జారవిడుస్తూ.. పైన కప్పుకు ఉన్న పెద్ద రంధ్రంలోంచి రాత్రంతా తన ప్రతాపం చూపిస్తూనే ఉంది వర్షం.

ఈ ఇల్లు ఎప్పుడు బాగుచేసుకుంటుందో తెలియని ఆమె, లోలోపలెంతో నలిగిపోతూ కన్నీటితో ఉడుకుతున్నది. పరిష్కారం కోసం పరిపరివిధాల ఆలోచిస్తున్నది.

చివరికి ఒక రోజు తన ఇంటి పరిస్థితి గురించి తమ గుంపు మీటింగ్ లో పెట్టింది మొగులమ్మ. సభ్యులందరూ చర్చ చేశారు. మొగులమ్మ ఇంటితో పాటు ఎర్రోళ్ల గంగక్క ఇంటి పరిస్థితి కూడా అధ్వన్నంగానే ఉన్న విషయం చర్చకు వచ్చింది. నెలనెలా సంఘం ఆఫీసు దగ్గర జరిగే మీటింగులో ఆ విషయం అందరిముందు పెట్టింది మొగులమ్మ. అదే సమయంలో మిగతా గ్రామాల్లోంచి కూడా కొంతమంది ఇంటి సమస్య సంఘం ముందుకొచ్చింది.

అయితే అప్పటికే మొగులమ్మకు బర్రెకు తీసుకున్న బాకీ ఉంది. ఇంటి కోసం మరో బాకీ అంటే కట్టడం కష్టమవుతదేమోనని ఆలోచన చేశారు. ఎర్రోళ్ల గంగమ్మకి ఎటువంటి అప్పు లేదు. కాబట్టి కొంతకాలానికి ఆమెకు ఇల్లు మంజూరీ అయింది.

మరో రెండు మూడు చిన్న చిన్న వర్షాల తర్వాత వర్షాలు తగ్గుముఖం పట్టాయి. ఇంటి గురించి ఆలోచన మొగులమ్మలోనూ దూరమయింది.
ఎండాకాలం ఇంకొక నెలలో ముగిసే సమయంలో ఇల్లు కోసం అప్పు మంజూరయినట్లు కార్యకర్త చెప్పింది. అప్పటికి బర్రెకోసం తీసుకున్న అప్పు తీరిపోయింది.

మొగులమ్మ ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బయింది. ఈ సారి వానాకాలపు బెంగ ఉండదని సంతోషపడింది.
కానీ లెక్కలేసుకుంటే ఉన్న సమయం సరిపోదని అర్ధమయింది. ఇల్లు పూర్తవుతుందని ఆశించిన మొగులమ్మకు నిరాశ తప్పలేదు.

ఇటుక , సిమెంటు , ఇసుక , రేకులు , మేస్త్రి , కూలీల ఖర్చు లెక్కవేసి విడతలవారీగా లోను మంజూరు చేసింది సంఘం. సుతారి మేస్త్రిని మాట్లాడుకుంది.
ఇటుక , ఇసుక తోలుకుంది. సిమెంటు బస్తాలు తెచ్చిపెట్టుకుంది.

కానీ అనుకున్న సమయానికి మేస్త్రి పని మొదలు పెట్టలేదు. అంతలో పైన ఢమఢమలు మొదలయ్యాయి.
వర్షాకాలం వచ్చేసింది. పురుగూ పుట్రా తిరిగేకాలం మళ్ళీ వచ్చేసింది. ఎట్లా.. పందిరేసుకుని పందిట్లో ఉండలేదు నలుగురు పిల్లలతో..
అందరివీ అన్తంత మాత్రపు ఇళ్లే. తాము తలదాచుకునేది ఎట్లా.. ఈ వానాకాలం ఎట్లా వెళ్లదీయాలని ఆలోచన చేసింది.
అప్పటికే పటేల్ పశువుల చావిడిలో వాటితో పాటు ఓ మూలన కొద్దిరోజుల కోసం చోటివ్వమని కాళ్లావేళ్లా పడి బతిమాలాడాడు చిన్నయ్య.
అగ్గిమీద గుగ్గిలంలా ఎగిరిపడ్డాడు పటేల్.

పటేల్ చావిట్లోకి వెళ్లాలన్న ఆలోచనే మొగులమ్మకు లేదు. అతని నైజం అర్ధమయిన మొగులమ్మ ఆ ఇంటికేసి పోవడమే మానుకుంది.
చీపుళ్లు , విస్తర్లు , పరికి పండ్లు , తునికి పండ్లు, మొర్రి పండ్లు అంటూ కబురు పెట్టేది పటేల్ భార్య. సంఘం కార్యక్రమాలు మొదలైన కొత్తలో తెచ్చి ఇచ్చేది. కానీ రాను రాను సమయం దొరకక తేవడం మానేసింది. అది పటేల్ భార్యకు కినుకగా ఉంది. మాములుగా అయితే గొడ్ల కొట్టంలో ఉండడానికి ఆమె మాట సాయం చేసి పటేల్ ని ఒప్పించేదే. కానీ ఇప్పుడు మొగులమ్మపై పీకలదాకా కోపం ఉండడంతో ఆమె కూడా నాలుగు మాటలు అన్నది పటేల్ భార్య.

అప్పటికి ఒకటి రెండు నెలల ముందు బాలాపూర్ దళిత వాడలోకి సి ఎస్ ఐ చర్చి మొదలైంది. చర్చి కోసం రెండు నిట్టాడులతో పెద్ద గుడిసె వేశారు. అది
అవతలి వాడలో మాల ఇళ్లలో ఉంది.

చర్చ్ ఫాదర్ దగ్గరకు వెళ్లి అడిగితే ఇస్తాడేమో ప్రయత్నించి చూడమని రూతమ్మ సలహా ఇచ్చింది. ఆమె సలహా ప్రకారం పిల్లలతో వెళ్లి ఫాదర్ ని కలిసి విషయం వివరించింది మొగులమ్మ.
మొగులమ్మతో ఫాదర్ కి ప్రత్యక్షంగా పరిచయం లేదు కానీ సంఘం కార్యక్రమాల్లో చురుకైన కార్యకర్త అని అతనికి తెల్సు. అందువల్ల చర్చి కోసం వేసిన గుడిసెలో ఓ పక్కన ఉండడానికి అనుమతిచ్చాడు.
మొత్తానికి తల దాచుకునేందుకు నీడ దొరికిందని సంబరపడింది. వెంటనే అక్కడికి మారిపోయింది. పాత ఇల్లు తీసేసింది. కొత్త ఇల్లు కట్టుకోవడం మొదలు పెట్టింది మొగులమ్మ.

ఆమె భర్త చిన్నయ్య మసక వెళ్తుతురులో పనికి బయలుదేరి వెళ్ళేవాడు. మళ్ళీ చీకటి పడిన తర్వాతే వచ్చేవాడు. వచ్చిన తర్వాత తీసిన గోడల మట్టి ఎత్తి పక్కకు పోసేవాడు. చాలా వరకు మొగులమ్మ పెద్ద పిల్ల పూలమ్మ సహాయంతో చేసుకుంటున్నది. ఒక్కోసారి సంతోషమ్మ , బాలమ్మ తోడువచ్చి తలో చెయ్యి వేసేవారు. మీరు పొద్దంతా పనిచేసొచ్చారు వద్దనేది మొగులమ్మ.

“అయ్యో.. అట్నావడ్తివేమే.. ఒకళ్ళకొకళ్ళం చెయ్యి సాయం చేస్కోకుంటే ఎట్లా..
నాకు నువ్వు సాయం , నీకు నేను సాయం” అన్నది సంతోషమ్మ ఒక రోజు

మొత్తానికి కూలీలను పెట్టుకోకుండా నెట్టుకొచ్చింది ఆమె. ఉమ్మడి వ్యవసాయానికి మాత్రం వెళ్లి వస్తున్నది. ఇంటిపని చేసుకుంటూ కూలిపని చేయడం తగ్గింది. చేతిలో పైసలు ఆడడంలేదు. కష్టంగానే ఉన్నది . తిప్పలు పడుతూ అట్లాగే నెట్టుకొచ్చింది.

సంఘం పేరుతో మొగులమ్మ మతం మార్పిడులు చేస్తున్నదని ఊర్లో పుకారు పుట్టించారు. చర్చిలో ఉండబట్టే కదా ఈ పుకారు అని మొదట బాధపడింది. ఆ తర్వాత ఎవరి ఇష్టం వాళ్ళది. వాళ్ళకి మతం మారాలనుకుంటే మారతారు. ఎవరైనా మతం మారితే మారారేమో.. దానికి తాను బాధ్యురాలు కాదని తనకు తెలుసు.

ఎదలో కత్తి పెట్టుకొని నోట్లో బెల్లం మాటల వాళ్లెవరో అవగతమవుతున్నది. అలాంటి వారిని , వారి మాటలను పట్టిచ్చుకోవలసిన అవసరం లేదని తనపని తాను చేసుకుపోతున్నది. ఇల్లు పూర్తి కాగానే తన ఇంట్లోకి వచ్చేసింది.

** **

“అచ్చేసింరా..” అప్పుడే బయటినుండి ఇంటికొచ్చిన సంతోషమ్మ తలుపుతీస్తూ కనిపించిన మొగులమ్మని పలుకరించింది.
“ఆ.. వచ్చినమే సిన్నీ..
నా ఇంట్లకు నేజొచ్చిన. ఇగ ఇప్పటిసంది గడ్డికోసం , కట్టెలకోసం ఊకే అందర్నీ అడుక్కునే పని తప్పింది ” తన ఆనందం పంచుకుంది మొగులమ్మ
“అవునే.. మొగులా.. ఎంత మంచి పనిజేసినవ్.

నువ్వాపొద్దు సంగంలకు జొర్రకుంటే ఎవళ్ళమన్న పోకుంటిమో లేదో గాని నీ ఎన్కనే నేను సుతమొస్తి.
లేకుంటే యాడున్నోల్లం ఆడనే ఉంటుంటిమి.
పొయ్యిమీన కాళీ కుండలకు, బొత్తల ఆకలిచేసే అరుపులకు తక్కువలేకుండే. మకిలిబారిన అవుతారలతోటి ఆవురావురంటుంటివి
ఇప్పటిలెక్క దైర్నం ఉండెనా..

ఉన్న ఒక్కగానొక్క బిడ్డకు పండుగకు చీరలుసారెలు ల్యాకపోతే మానె.. ఇంతంత రైకన్న బెట్టిన్నా.. ల్యాకపాయె. పండుగలు దగ్గరవడ్తున్నయంటే దిగులు బుగులు ముంచుకొస్తుండే.. అసొంటిదాన్ని ఇప్పుడు నేనే ఐదు రూపాయల రైక తొడగవట్టితి.
కూడుకు, బట్టకు ఎల్తి లేకుంట నడుపుకుంటాన్న.

బర్రె కోసం చేసిన బాకీ తెంపుతాన్న. సంగం లేకుంటే ఎట్లుంటుండెనో.. ” అన్నది సంతోషమ్మ
అట్లా ఇద్దరూ ముచ్చట్లాడుకుంటూ ఉండగా సంతోషమ్మ కొడుకు గోలెంలో నీళ్లు నింపుతున్నాడు. కోడలు నవనీత వంటపనిలో ఉన్నది.
“నీ కొడుకు కోడలు నిమ్ములముంటరు. వెన్నెలోలె గొడతరు. ముచ్చటయితదే సిన్నీ..
ఆలుమొగలిద్దరూ కూడి పనులు జేస్కుంటరు. డబ్బ సదురుకొని పన్లకు పోతరు. ” అన్నది మొగులమ్మ.
అవునన్నట్లుగా తలాడించింది సంతోషమ్మ.

అంతలో “సంతోషక్కా.. ఉన్నవాయే.. నీ చేతివాసి మంచిదని ఊర్ల అందరు అనబట్టిన్రు. ” పెద్ద గొంతుకతో అంటూ వచ్చాడు అర్జున్.
అతని భార్యకి బాగా తెలుపు అవుతున్నదని, గర్భసంచి బయటకు వచ్చేస్తున్నదని చెప్పాడు. ఒక్కసారి చూడమని కోరాడు.
“అయ్యో.. గట్లనా.. బిడ్డా.. కానీ , అది నాతోటి అయ్యెడిదిగాదు. చానా పెద్ద కష్టం. ఆపరేషన్ అవుసరం పడుతుండొచ్చు ” వాళ్ళకొచ్చిన కష్టానికి నొచ్చుకుంటూ సంతోషమ్మ.

“నువ్వు సంఘంల మాలెస్స మందికి దవాఖానకు కొంటబోతవు గదనే. నన్ను సుతం నువ్వే కొండబో.. “అన్నది అతని భార్య
“మీరు సంగపోల్లు కాదు గద. మా సంగంల ఉన్నోళ్లకే సాయమయితది. అట్ల నిన్ను కొంటబోవుడు గాదు.
దవాఖాన కర్సు మీది మీరే బెట్టుకోవాలె. పరేషాన్ కాకూంరి. తోడు రమ్మంటే నా ఇష్టపూర్తి మీతోటోస్త. బాలమ్మ కాడికి కొంటబోయి చూపెడత ” వివరించింది ఆమె.

వాళ్ళ మాటలు సాగుతుండగా సంఘం కార్యకర్త రావడంతో మొగులమ్మ ఆమె దగ్గరకు నడిచింది.
ఆ కార్యకర్త మొగులమ్మ ఇల్లు తిరిగి చూసింది. రెండురూములు , వరండాతో ఉన్న ఇల్లు చూసి ఇంత చిన్న చిన్న కిటికీలు పేట్టావేం. కొంచెం పెద్దవి పెట్టుకోవాల్సింది అన్నది.

మొత్తానికి కొత్త ఇల్లు కట్టుకొని ఇంట్లోకి వచ్చేసావు. ఇక నీకు దిగులు లేదులే.. మరి దావత్ ఏది.. ? అడిగిందామె.
” లేదక్క.. దావత్ చేయకొచ్చిన. పైసలు చేతుల ఉంటె దావత్ జేస్కొవాలె.
ఇప్పటికే ఇంటికోసం బాకిజేస్తి. ఇంటి సుట్టుతా ఇంకా సిమెంటు అల్కకనే పోతి.
ఇంటిపనిజేస్కుంట కూలి పనులకు సుతం పోకపోతి. వారం వారం సంగంల జమ చేసెడిది సెయ్యాలే..
ఇగ దావతంటే మల్ల ఇంకో బాకీ లేపాలె సంగంల.
అట్ల జేసుడు మంచిగగొట్టలే..

ఏమన్న పైస జమయితే నా పెనిమిటి బాకీ తెంపి గాయిదితనంల కెల్లి ఆవల పడెయ్యాల్నని దిమాకుల ఉన్నది.
సంగం సార్లకు జెప్పి పటేల్ కాడ ఎంత బాకున్నదో లెక్క తియ్యాలే..
నా పెనిమిటి పటేల్ పన్లకెళ్లి బయటవడ్డడంటే ఇగ మాకంత మంచే..
అప్పటిదాంక అంటే పెద్ద పిల్ల లగ్గానికొత్తది. ” మనసులో మాట కార్యకర్తతో చెప్పుకుంది మొగులమ్మ
“ఓ అవునా.. చాలా మంచి నిర్ణయం మొగులమ్మా.. అప్పుచేసి పప్పుకూడు అనవసరమే..

నువ్వు అనుకున్నది తప్పక అవుతుంది. నువ్వా క్షణం తీరిక లేకుండా కష్టాడుతూనే ఉంటావు. వృధా ఖర్చులు చేయవు.
నువ్వు చేసే శ్రమ, కష్టం వృధా కాదు. చేసే పనిమీద ఉండే నీ నిబద్దత , నీ ఆత్మవిశ్వాసం నాకెంతో నచ్చుతాయి. నువ్వు కష్టాలకు కుంగిపోవడం నేను చూడలేదు ” అంటూ ఆమె చెయ్యి తన చేతిలోకి తీసుకొని అభినందించింది కార్యకర్త అంజమ్మ.

ఆ వెంటనే తాను వచ్చిన పని చెప్పింది.
“మొగులమ్మా.. సంఘం నడుపుతున్న కెవికె (కృషి విజ్ణాన కేంద్రం) గురించి నీకు తెలుసుకదా.. అక్కడ జెర్రల ఎరువు తయారీపై శిక్షణ త్వరలో మొదలవుతుంది.
నువ్వూ నేర్చుకో.. ఇంటికి చేసిన అప్పు త్వరగా తీర్చుకోవచ్చు. నీవనుకుంటున్నట్టు మీ ఆయన బాకీ కూడా తీర్చేయొచ్చు” అని చెప్పింది కార్యకర్త.
ఆమాటలు మొగులమ్మకు చాలా నచ్చాయి.

“ఆ.. అన్నట్టు చెప్పడం మరిచాను. ఈ విషయం మీ గుంపులో అందరికీ చెప్పు. ఆసక్తి ఉన్నవాళ్ళ పేర్లు రేపు సాయంత్రానికల్లా నాకు చెప్పాలి. రేపు కలుస్తా ” అని చెప్పి ఆమె వెళ్ళిపోయింది అంజమ్మ .

ఇంటిపక్కనే ఉన్న సంతోషమ్మకు, ఇంటివెనక వైపున ఉండే బాలమ్మకు విషయం చెప్పింది. ఇంకొంచెం ఆవలకు ఉండే వారికీ వెళ్లి చెప్పొచ్చింది. మిగతావారికి ఇంట్లో పనులయ్యాక చెప్పింది. ఆలోచించుకుని పొద్దున్నే చెప్పమని చెప్పింది.

ఒక సారెప్పుడో సంఘం ఆఫీసుకు వెళ్ళినప్పుడు మణెమ్మ సంఘం నుండి అప్పుగా డబ్బులడిగింది.
‘ఇప్పటికే రెండులోన్లున్నాయి. అవి తెంపకుండా ఇంకా ఎట్లా ఇచ్చేది. ఇచ్చిన పైసలు తినుడే కాదు , పైసలు లేవని బాధపడడం కాదు. నీ మీద నువ్వు నమ్మకం పెట్టుకో. నీ మీద నువ్వు ఆధారపడు’ పెద్ద అక్క చెప్పడం విన్నది. ఆ మాటలు అకస్మాత్తుగా గుర్తొచ్చాయి మొగులమ్మకు. ఇప్పుడేకాదు అప్పుడప్పుడూ అలా గుర్తొస్తూనే ఉంటాయి.

సంఘం అక్కలు చాలా కరెక్టుగా చెప్పారు. ఎవరి మీద ఆధారపడి బతకడం సరైనది కాదు. ఎవరి బతుకు వాళ్ళే బతకాలి. ఎవరి కష్టాన్ని వాళ్లే నమ్ముకోవాలి. నేను కూడా ఎవరిమీదా ఆధారపడకూడదు. నా మీదే నేను ఆధారపడాలి అని ఆనాటి నుండీ ఎన్నోసార్లు మనసులో గట్టిగా అనుకున్నది. మళ్ళీ ఈ రోజు కూడా తనలో తాను చెప్పుకున్నది మొగులమ్మ.

బాలాపూర్ గుంపునుండి ఒక్కరు కూడా జెర్రల ఎరువు శిక్షణకు ముందుకు రాలేదు. తనతో పాటు ఇంకా ఒక్కరయినా వస్తే బాగుండునని అనుకున్న మొగులమ్మ ప్రయత్నించింది. కానీ లాభంలేకపోయింది.
‘ఇంటికి చేసిన అప్పు త్వరగా తీర్చుకోవచ్చు. నీవనుకుంటున్నట్టు మీ ఆయన బాకీ కూడా తీర్చేయొచ్చు’ అని కార్యకర్త చెప్పిన మాటలు ఆమె మనసులో బలంగా నాటుకుపోయాయి.

తానొక్కటే అయినా కృషి విజ్ణాన కేంద్రానికి పోయి జెర్రల ఎరువు తయారు చెయ్యడం నేర్చుకోవాలని నిర్ణయం చేసుకున్నది మొగులమ్మ.

మూడురోజులు అక్కడ శిక్షణ పొందిన తర్వాత తనమీద తనకు నమ్మకం వచ్చింది. తాను సొంతంగా ఎరువు తయారు చేసుకోగలనని.
ఇసుక , ఇటుకలు , మెష్ , బొంగులు వేసి బెడ్ తయారీ తెలుసుకున్నది.

మేస్త్రి ఖర్చులకు ఆఫీసునుంచి రెండువేల రూపాయలు అప్పుగా ఇచ్చారు. వాయిదాల పద్దతిలో ఆ అప్పు తీర్చాలి.
కృషి విజ్ణాన కేంద్రం వాళ్ళే వానపాములు ఇచ్చారు. వాటిని మొగులమ్మ దగ్గర ఎక్కువ వున్నప్పుడు ఏడాదిలోగా ఎప్పుడైనా వెనక్కి తిరిగి ఇచ్చే పద్ధతి మీద. మొగులమ్మ ఇంటి దగ్గరే చింత చెట్టు నీడలో వానపాముల ఎరువు తయారీకి కావలసిన బెడ్ వేసింది. వానపాముల ఎరువు తయారీ ప్రారంభించింది.

పనిలో మొగులమ్మకు చేదోడు వాదోడయింది పూలమ్మ. మల్లమ్మ ఇంటిపనులకు కొంచెం కొంచెం సాయం అవుతున్నది.

మొదటినెలలో రెండు క్వింటాళ్లు ఎరువు వచ్చింది.

సామూహికంగా వాళ్ళు చేసే వ్యవసాయ క్షేత్రంలో వేయడానికి ఒక క్వింటా ఇచ్చింది. మిగిలిన క్వింటాల్ ని కిలో రెండు రూపాయల చొప్పున అమ్మింది. రెండువందల రూపాయలు వచ్చాయి. మొగులమ్మ ఆనందానికి అవదులేకుండా పోయింది. ఆమె మీద ఆమెకు ఆత్మవిశ్వాసం మరింత పెరిగింది.

అట్లా మొగులమ్మ భవిష్యత్ పై ఆశను మొలకెత్తించే విత్తును నాటి కుటుంబపు ఆకలి బాధకు తూట్లు పొడిచేసింది.

** **
మరో ఉగాది గడిచింది.

కొన్నాళ్ళకి, నలభై కిలోమీటర్ల దూరంలో ఉండే మొగులమ్మ చిన్న చెల్లెలు అక్కను చూసి పోదామని వచ్చింది. మారిన అక్క కుటుంబ పరిస్థితి ఆమెకు చాలా ఆశ్చర్యం కలిగించింది.
సంఘంలో ఉన్న వాళ్ళ ఆకలిపోయిందని ఆనోటా ఈనోటా తన ఊరికి చేరిన ముచ్చట్లు విన్నది కానీ తన అక్క పరిస్థితిని ప్రత్యక్షంగా చూసింది.
జెర్రల ఎరువు చేయడం మొదలుపెట్టాక అక్క చేతిలో పైసలు బాగా తిరుగుతున్నాయని అర్ధం చేసుకున్నది ఆమె. అయితే ఆ ఎరువు ఎందుకు వేస్తారో తెలియదు.

అందుకే “అక్కా జెర్రల ఎరువెందుకెయ్యాల్నే ” అని అడిగింది సందేహంగా
” ఈ ఎరువు భూమికి సలువజేస్తది. ఎండకు మొక్కలు జల్ది ఎండిపోవు , మాడిపోవు. మంచిగ ఏపుగ పెరుగుతయ్. చీడపీడలు తక్కువొస్తయట. సహజంగా వచ్చే పంట రుచి ఎక్కువట. మనకి ఆరోగ్యాన్నిస్తదట.

మసాలా ఎరువులు నేలకు మంచిది కాదట. పంట వస్తది కానీ అది మన ఆరోగ్యానికి చేటు చేస్తదట. ముఖ్యంగా ఇక్కడున్న గారాబు భూములకు అస్సలే మంచిది కాదట. ” తనకు సంఘం కార్యకర్తలు చెప్పిన విషయాలు చెల్లెలికి చెప్పింది మొగులమ్మ
“నీకా.. సేను సెల్క ల్యాకనే పాయె.. ఏంజేత్తవే గీ జెర్రల ఎరువంతా.. ” ఆమె చెల్లి నుండి మరో ప్రశ్న

“ఈ యాడాది లాగోటి (కౌలు) జేసిన. ఇరవై తీర్ల పంటలేసిన. రోహిణి భరణి నాటికి ఎదకు పెట్టిన. పచ్చ జొన్నలు , సాయి జొన్నలు, రెండు తీర్ల పెసర్లు , రెండు తీర్ల తొగర్లు, మినుములు, అనుములు, రెండు తీర్ల బొబ్బర్లు, నువ్వులు , గడ్డి నువ్వులు, అవిసెలు , సజ్జలు, కొర్రలు , సామలు, శనగలు, పూండి, వంకాయలు , టమాటలు పెట్టిన.

అండ్లనే ఎప్పటికీ ఇంత పాయలకూర, దొగ్గలి కూర , తుమ్మికూర , గునకకూర , తెల్లగరిజే కూర , ఎర్రగరిజే కూర ఏదోటి దొరుకుతనే ఉంటది.
గణపతి పండుగెల్లంగనే పెసర్లు , మినుములు కోతకొచ్చినయ్. అటెనుక నువ్వులు , అటెనుక జొన్నలు , సజ్జలు , అటెనుక శనిగెలు ఆఖరుకు తొగర్లు ఒక్కదానేనుక ఒక్కటొచ్చినయ్

నాకు కింటా తొగర్లు , కింటా పైన జొన్నలు , సజ్జలు , ఏసిన పంటలన్నీ అయిన్ని ఇవిన్నొచ్చినయ్. ఇత్తునంకు తీసి పెట్టిన. నేను ఇత్తునం తెచుకున్న కాడ ఒకింతకు రెండింతలిచ్చిన. ఇంటి తిండికి కరువు లేదు. జొన్నలిన్ని , తొగర్లిన్ని నువ్వు కొంటవోతవని ముల్లెగట్టి ఓరకు పెట్టిన ” చెల్లెలితో చెప్పింది మొగులమ్మ.

“అంతగనం పంట ఎట్లదీసినవే..” అక్కకు తనమీద ఉన్న ప్రేమకు మురిసిపోతూ ఆశ్చర్యంగా అన్నది ఎల్లమ్మ
” ఏం లే.. ఇంటెనుక పెంట ఎరువు తొల్తము గద. అట్లనే జెర్రల ఎరువు వేసిన గద.గంతే.. ” అన్నది మొగులమ్మ
అట్లనా ” ఆశ్చర్యంగా చూస్తున్నది మొగులమ్మ చిన్న చెల్లెలు ఎల్లమ్మ.

“నేను చేసిన చేను పక్కాయన తొగర్లు , జొన్నలు ఏసిండు. మసాలా ఎరువులేసిండు. తొగర్లకు పురుగుపట్టిందని పురుగుమందు కొట్టిండు. అయిన ఇత్తునం ఏసినంత మందమన్న పంట రాలేదట. పరేషనయితాండు “
“అట్లెట్ల ” అర్ధం కాలేదు చెల్లెలుకు.

“మేం కలిపి పంటలేసినం కద. కలిపి పంటలల్ల ఒక పంట భూమిల బలం తీసుకుంటది. ఇంకొక పంట భూమికి బలాన్నిస్తది. ఒక పంట కొంచెమే బలం తీసుకుంటది. ఒకదానికొకటి తోడయితయి. ఆకు రాలుత్తయి. భూమి మెత్తబడతది. సారం పెరుగుతది. ఒక పంటకు చీడ పడ్తే మరో పంట అది రాకుంట కాచుకుంటది. కాపాడుతది “‘ వివరించింది కలసి కట్టుగా ఉంటె మనుషులకే కాదు మొక్కలకి కూడా బలమేనని గ్రహించిన మొగులమ్మ.

ఒకప్పుడు బిచ్చమడుక్కు తినే స్థితిలో ఉన్న అక్క ఇప్పుడు ఒకరికి తిండి పెట్టే స్థితిలో.. మనస్ఫూర్తిగా అక్కను మనసులోనే అభినందించింది ఎల్లమ్మ.

(ఇంకా వుంది…)

పుట్టింది వరంగల్, పెరిగింది ఆదిలాబాద్, మెట్టింది నిజామాబాద్ జిల్లా. ప్రస్తుతం ఉంటున్నది హైదరాబాద్ లో. చదివింది జర్నలిజం అయినా స్థిరపడింది సామాజికసేవా రంగంలో. హేమలతా లవణం, లవణం నిర్వహణలోని సంస్కార్ సంస్థలో వారితో కలసి ఇరవై ఏళ్ళు నడిచారు. ఆ నడకలో నిజామాబాద్ జిల్లాలోని అనేకమంది గ్రామీణ మహిళల, పిల్లల జీవన పరిస్థితులు అవగతం చేసుకున్నారు. ఆ అనుభవాల్లోంచి రాసినవే 'భావవీచికలు', 'జోగిని', 'గడ్డిపువ్వు గుండె సందుక', 'ఆలోచనలో... ఆమె'. 'భావవీచికలు' బాలల హక్కులపై వచ్చిన లేఖాసాహిత్యం. ILO, ఆంధ్ర మహిళాసభ, బాల్య లు సంయుక్తంగా 2003లో ప్రచురించాయి. తరతరాల దురాచారంపై రాసిన నవల 'జోగిని ". వార్త దినపత్రిక 2004లో సీరియల్ గా ప్రచురించింది. 2015లో విహంగ ధారావాహికగా వేసింది. ప్రజాశక్తి 2004లో ప్రచురించింది. గడ్డిపువ్వు గుండె సందుక (2017) బాలల నేపథ్యంలో, ఆలోచనలో ... ఆమె (2018) మహిళల కోణంలో రాసిన కథల సంపుటాలు. 'అమర్ సాహసయాత్ర' బాలల నవల (2019) మంచిపుస్తకం ప్రచురణ.  'ఆడపిల్లను కావడం వల్లనే' శీర్షికతో ప్రజాతంత్ర వీక్లీ లో కొంతకాలం వ్యాసాలు వచ్చాయి. వివిధ పత్రికల్లో కవితలు, వ్యాసాలు ప్రచురితమయ్యాయి. వివిధ అంశాలపై రేడియో ప్రసంగాలు ప్రసారమయ్యాయి.

Leave a Reply