బతుకు సేద్యం-2

2.

కాలం తన పని తాను చేసుకుపోతున్నది.
ఆకాశంలో మెరుపులు మెరిశాయి. దట్టమైన మబ్బులు అల్లుకున్నాయి .
తొలకరి జల్లులు పలకరించాయి. నేలతల్లి పులకరించింది. తడిసిన మట్టి పరిమళాలు గుప్పుమన్నాయి.
వానజల్లులతో పుడమి తల్లి దాహం తీరింది.
మట్టి చీల్చుకుని గడ్డి మొలకలు తలెత్తి నీలాకాశంకేసి చూస్తున్నాయి
చెట్లు పచ్చదనం అద్దుకున్నాయి.

పచ్చటి గడ్డిపై ఆరుద్రపురుగులు గుంపులు గుంపులుగా దర్శనమిస్తున్నాయి. పిల్లల చేతుల్లో ఒదిగి అత్తిపత్తిలాగా ముడుచుకుపోతున్నాయి.
కాలమవుతుందని రైతులు సంతోషంతో భూమి దున్ని వానాకాలం పంటలకు సిద్ధం చేస్తున్నారు.


అక్కడక్కడా విత్తనం వేయడం, నాట్లు, మెట్టచేన్లలో కలుపు పనులు మొదలయ్యాయి. ఏదో ఒక కూలీ పని దొరుకుతున్నది.
రోజుకు రూపాయి కూలీ. ఇక కొంతకాలం దిగులు లేకుండా ఎట్లాగో బతికెయ్యొచ్చని ఊపిరి పీల్చుకున్నది మొగులమ్మ.

పని దొరుకుతుందన్న ధైర్యంతో సంఘంలో చేరాలన్న తన ఆలోచనకు రూపం ఇచ్చింది.
దాదాపు రెండు నెలలుగా సంఘం తరపున వచ్చే పెద్దమనుషులు అంటే ఉన్న గౌరవం, ఆత్మీయతా భావం ఆమెను కట్టిపడేసింది. సంఘం సభ్యురాలవ్వమని పురికొల్పింది. స్వతంత్రించి తీసుకున్న నిర్ణయంతో ఆశల మొక్కను నాటింది .

మీకు పనిలేనప్పుడు ఎట్లా డబ్బు జమెయ్యాలని భయపడక్కరలేదు. సంఘంలో సభ్యులయిన వారికి పని చూపించే పూచీ మాది అంటూ సంఘం పెద్దలు హామీ ఇవ్వడంతో పేద మహిళల్లో మరింత ధైర్యం వచ్చింది. సంఘం చెప్పినట్లుగా కూలీ పనుల్లో వచ్చిన కూలీ నుండి వారానికి రూపాయి పొదుపు చేయడానికి సిద్ధమయ్యారు. అట్లా పొదుపు చేయని వారికి సంఘంలో సభ్యత్వం ఉండదు. పని ఉండదు అని స్పష్టంగా చెప్పారు సంఘం పెద్దలు .

పని దొరికితే సమస్యే లేదని సంతోషంగా ఒప్పుకొని ముందడుగు వేసింది మొగులమ్మ. సంఘంలో చేరిన మొదటి సభ్యురాలిగా నమోదైంది.
మొగులమ్మ వెనకే మరికొందరు ఒక్కరొక్కరుగా సభ్యులవడం మొదలుపెట్టారు. బాలాపూర్ మహిళలను చూసి బర్డిపూర్ , న్యాలకల్ , జరాసంగం ఇలా ఒక్కో ఊరు అదేబాటన నడిచారు.

సంఘం సభ్యురాలయిన తర్వాత ఆమెలో నిన్నటి నిర్లిప్తత లేదు. నిస్తేజం లేదు. జీవితం పట్ల ఒక ఉత్సాహం వచ్చింది. ఎప్పటికప్పుడు కొత్త విషయాలు తెలుసుకోవడంలో, నేర్చుకోవడంలో ఉన్న ఉత్తేజం అది.

బాలాపూర్లో మొగులమ్మతో మొదలయిన సంఘం గ్రూపులో సభ్యులుగా క్రమంగా బాగానే పెరిగారు.
ఊరవతల విసిరేసినట్లుగా ఉన్న ఆవాడలోని మహిళలు మాత్రమే సంఘంలో సభ్యులుగా ఉన్నారు. సంఘం గురించి అర్ధం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. గుంపుగా కూర్చొని ఒకరి తిప్పలు ఒకరు ముచ్చటించుకుంటున్నారు. ఎవరి బాధలు ఎట్లా ఉన్నాయో తెలుసుకుంటూ వాటిని ఎట్లా తీర్చుకోవాలో ఆలోచిస్తూ సంఘంలో తమ గుంపును పెంచుకుంటున్నారు. నడిపించుకుంటున్నారు.

అట్లా నెమ్మదిగా దళితవాడల్లోని వాళ్ళతో పాటు ఉత్పత్తి కులాల్లో ఆర్ధికంగా వెసులుబాటు , ఎల్లుబాటు లేని కుటుంబాల్లో ఆడవాళ్లు ఒకరిద్దరు వీళ్ళతో జత కలిశారు.

వారం వారం సంఘంలో రూపాయి రూపాయి జమ చేస్తూనే ఉన్నారు. పని దొరుకుతున్నది కాబట్టి జమ చేసుకోవడం కష్టం అనిపించడం లేదు వారికి. పనులు దొరకక పోతేనో అనే ఆలోచనే లేదు వాళ్లకి.

ఊళ్ళో రైతులు పనిచేయించుకుని పైసలకు రేపు మాపంటూ కాళ్లరిగేలా తిప్పించుకునేవారు. కొంతమంది పంట మీద ఇస్తామనేవారు. అటువంటి వాళ్ళదగ్గరకి పనికిపోవడం వీలయినంత వరకు తగ్గించ్చుకుంది మొగులమ్మ బృందం.

ఉష్ .. ఉష్ .. అంటూ మట్టి తవ్వుతున్న కోళ్లను అదిలిస్తూ చింతచెట్టుకింద ఉన్న రోట్లో లేతచింతాకు వేసి చింతాకుకారం నూరుతూ ఆలోచిస్తున్నది మొగులమ్మ. కోడిపిల్లను పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు మల్లేశం.

అరే బేటా .. దాన్ని పట్టకు .. తల్లి నీ మీదకు ఎగబడ్తది. సంతోషమ్మ ఆయి కోపానికయితది అని కొడుక్కి చెప్పి తిరిగి ఆలోచనలో పడింది మొగులమ్మ.
ఒక పూట తిండికైతే డోకా లేకుండా నడుస్తున్నది. కానీ పండుగ .. బతుకమ్మ పండుగ, దసరా పండుగ దగ్గరపడుతున్నది . పండుగ చేసుకుంటే బాగుంటుందని ఆమె మనసు ఉబలాటపడుతున్నది. కానీ ఎట్లా చెయ్యాలో తెలియక చింతపడుతున్నది.

నేలమీద గదులుగా గీసుకుని కుండపెంకు వేసి తొక్కుడు బిచ్చ ఒక్కటే ఆడుకుంటున్నది పూలమ్మ. ఆమె వెనకే పోయి ఆ బిచ్చ తీసుకుంటున్నది మల్లమ్మ. చెల్లిని బెదిరించి ఆమె చేతిలోని కుండపెంకు ముక్కను లాక్కున్నది పూలమ్మ.

అంతలో “మొగులా.. అస్తున్నవాయే ..” కేకేసింది సంతోషమ్మ. ఆ గొంతు వినగానే మల్లేశం లోపలికి తుర్రుమన్నాడు.
“అస్తున్ననే చిన్నీ .. జర్రాగు అస్తున్న .. “అంటూ బరబరా కారం నూరి తీసి గిన్నెలో వేసింది. ఆ గిన్నె లోపల పెడుతూ పూలమ్మను పిలిచి
“బిడ్డా బువ్వ తినుంరి ..” అని చెప్పి తాను తినకుండానే వెళ్ళిపోయింది.
“అవ్వా నువ్వు తినవాయె ” పూలమ్మ గొంతు గాలిలో కలిసిపోయింది .

ఇద్దరూ కల్సి గుంపు మీటింగ్ కి వెళ్లారు. అవీ ఇవీ మాటలయ్యాక “25 కిలోల బియ్యం వాపసు పోతుంటే పానం కలకల అయితాంది ” గుంపులోంచి సుశీలమ్మ బాధగా అన్నది. నోటి ముందు దాకా వచ్చిన కూడు నోట్లోకి పొవట్లేదని ఆమెకు చాలా బాధగా ఉన్నది.
ప్రభుత్వం కిలో రూపాయి బియ్యం ఇచ్చినప్పటికీ తెచ్చుకోలేని పరిస్థితి చాలా కుటుంబాలది.

“అవ్.. నాకు సుత పానం కలకల ఉన్నది . అట్ల కాకుంట మన పేర బియ్యం మనం తెచ్చుకుంటే ఎంత మంచిగుంటది.. కడుపాకలికి ఆ దిక్కు ఈ దిక్కు చూసేదే ఉండది.. ప్చ్ .. ఏం జేత్తం ..? మన గాచారం ఇట్ల కాలవడే .. ” కడుపులో ఆకలి మెలిపెడుతుంటే అశక్తతతో అన్నది రూతమ్మ.
“నసీబు .. గాచారం అనుకుంట సతికిల బడేకంటే సంఘం సార్లకు అర్సుకుంటే ఏదన్న ఎలుగు తొవ్వ సూపి బియ్యం తెచ్చుకునేతట్టు సేత్తరేమో .. ” చిన్ని ఆశ ఊపిరిపోసుకుంటుండగా మొగులమ్మ “ఆవ్ .. మంచిగన్నవే .. ఆల్లే ఏదన్న ఉపాయం జేత్తే జెయ్యాలె. మనకు గట్టుకెయ్యాలె .. ” వత్తాసు పలికింది సుశీలమ్మ.

అందరిదీ అదే బాధ. మెలిపెడుతున్న ఆకలి బాధ. అందరూ కలసి ఆకలితీర్చుకునే మార్గాలను అన్వేషించారు. ఆలోచించారు.
“సంగంల మనం జమేసిన పైసలున్నయి గద. అండ్లకెల్లి కొంత పైస తీసి కూపన్ బియ్యం తెస్తే.. పండుగకైన పోరగాల్లకింతంత సరైన బువ్వ దొరుకుతది ” తనకొచ్చిన ఆలోచన అందరి ముందూ పరిచింది ఓ రూతమ్మ.
అట్లా అందరూ కలసి తర్జన భర్జన పడి, సమాలోచన చేసి చివరికి ఆ విషయం కార్యకర్త ద్వారా సంఘం ఆఫీసు దృష్టి తీసుకెళ్లారు.

సంఘం ఆఫీసు వాళ్ళు మహిళల చొరవని అభినందించారు. ఇదివరకటిలా స్తబ్దంగా ఉండడంలేదు ఈ మహిళలు. ఆలోచిస్తున్నారు. అందరూ కలసి చర్చలు చేస్తున్నారు . ఒక నిర్ణయానికి వస్తున్నారు. అదే విధంగా, ఈ విషయంలో ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చారు.

అసలు లోంచి కొంత ఇచ్చేస్తే ఇట్లాగే వచ్చే అవసరాలకు ఎప్పటికప్పుడు తీసుకుంటుంటే పొదుపు మొత్తం ఎప్పటికప్పుడు ఖాళీ అయిపోతుంది . చివరికి చిల్లుకుండ వ్యవహారంలా మిగిలిపోతుంది. మళ్ళీ పరిస్థితి మొదటికే వస్తుంది.

అప్పులకోసం, వడ్డీలకు తేవడం, ఆ వడ్డీ కట్టలేక నడ్డి విరగడం లేవలేక బొక్కబోర్లా పడడం తెలిసిందే కనుక అటువంటి పరిస్థితులు భవిష్యత్తులో తలెత్తకుండా జాగ్రత్తపడాలని అభిలషించారు.

అసలు లోంచి తీసుకునే సొమ్ము అప్పు కింద ఇస్తామని, జమ చేసే సొమ్ముతో పాటే అప్పు తీసుకున్న సొమ్ము కూడా వాయిదా పద్దతిలో తీర్చాలన్న కండిషన్ పెట్టారు. అందుకు అంగీకరించిన సభ్యులు ఆ ఒప్పందంపై సంతకం చేసి డబ్బులు తీసుకున్నారు.

మా డబ్బులు మాకివ్వడానికి మేమెందుకు సంతకం చెయ్యాలని కొందరు గొడవ చేసారు.
‘సంగపోల్లు మీ తో నిశానీ ఏపిచ్చుకుని ఏమిజేత్తరో ఏమో .. ఊరోళ్లు కాకపోయిరి . పొరుగూరోళ్ళు కాకపోయిరి. పోయి పోయి పట్నపు కిలాడీలను నమ్ముకున్నరు. మిమ్ముల ఏ గంగల ముంచ్తరో, యాడ బొందబెడతరో ‘ అవసరాల నిమిత్తం ఊళ్ళోకి పోయినప్పుడు షావుకారు, పటేళ్లు, రెడ్డిలు, కాపోల్లు అన్న మాటలు తొంగిచూసి లోపల్లోపల భయకంపితుల్ని చేశాయి వాళ్ళని.

అందుకే, తమ పొదుపు సొమ్ము మొత్తం తీసేసుకుని సంఘం నుండి బయటికి పోతామన్నారు.
మిగతా సభ్యులు కూడా అటువంటి బెదరగొట్టే మాటలు ఇప్పటికి ఎన్నో మార్లు విన్నప్పటికీ లక్ష్య పెట్టలేదు .
సంఘం ఆఫీసు పెద్దలు చెప్పిన విషయపు లోతు అర్ధమయిన మొగులమ్మ, అనసూయమ్మ, లచ్చుమమ్మలు అర్ధం కాని వారికి అర్ధమయ్యే విధంగా వివరించారు.

మన దగ్గర ఏమున్నాయని వాళ్ళు మనలను ముంచుతారు.
మన ఆస్తిపాస్తులు ఏమన్నా ఉంటే అది మనూరోళ్లే మనం దినాం కాల్మొక్కే వాళ్ళకే తాకట్టు పెట్టినం. మన మొగుళ్ళు వాళ్ళ కాళ్ళ దగ్గరే ఉన్నారు. ఇక దగ్గరేమున్నది. అట్లనే ఉంటే మన పిల్లలు వాళ్ళకే ఉడిగం చెయ్యాలి . మనమనేది లేకుండా చేసారు. ఇంకా మన దగ్గర ఏమి మిగిలి ఉన్నది మన్ను మశానం.. ఇంకే గంగుల మునుగుతాం .. అంటూ తోటి మహిళలకు నచ్చచెప్పారు.

మొగులమ్మ, అనసూయమ్మ, లచ్చుమమ్మలు భరోసా ఇచ్చిన తర్వాత కొందరు సరేనని తమ ఆలోచన మార్చుకున్నారు. ఎంత ప్రయత్నించినా మొత్తం మీద ఇద్దరు సభ్యులు బయటికి వెళ్లిపోయారు. మంచి చెబుతాం. వినకపోతే ఏంచేస్తాం. వాళ్ళిష్టం. అనుకున్నారు.

ప్రతినెలా వాళ్లకు వచ్చిన కూపన్ తీసుకోవడం మొదలైంది. కడుపులోకి ఇంత తిండి పడుతున్నది. చింతనీళ్లో, పచ్చి కారమో, ఎండుకారమో వేసుకుని తినే ఆ తిండి వాళ్ళకి తృప్తినివ్వడం లేదు. ఆకలి తీరడం లేదు. వెలితిగానే అనిపిస్తున్నది .

చిన్నప్పుడు కొర్రబియ్యం, సామలు, అరికెలు ఆ తర్వాత జొన్నరొట్టె , సజ్జరొట్టె , తైద అంబలి వంటి వాటితో కడుపు నింపుకున్న ఆ తరం వాళ్ళకి బియ్యం అన్నం తిన్నట్టుగా అనిపించడం లేదు . కడుపునిండినట్లుగా ఉండడంలేదు లేదు. పిల్లలు మాత్రం అన్నం ఇష్టంగానే తింటున్నారు.

” ఆపతికి కూపన్ కారట్ కుదువబెట్టి పైసలు తెచ్చుకుంటి. పైసలు కట్టి బాకీ బేఖాతర్ జేస్కోను సేటు కాడికివోయిన. యాడ .. కారటియ్యకనే పాయె. ఇంక పైసలు త్యాపో అంటున్నడు. ఎప్పుడు వో.. ఇచ్చిన పైసలు తీస్కొని గల్ల పెట్టెల ఏస్కుంటడు. ఇంక పైసలు త్యాపో అంటున్నడు. ఎట్ల ఇడిపిచ్చుకోవాల్నో యావో సమజ్ కాకొచ్చింది.” మొగులమ్మ దగ్గరకొచ్చి తన గోడు వెళ్లబోసుకుంది కొత్త సభ్యురాలు అవతలి వాడలో ఉండే బాయికాడి రామక్క .

గుంపులో కూర్చొని ఆలోచన చేద్దామని చెప్పి, ఆమె పిల్లల ఆకలి తీర్చడంకోసం తన దగ్గర ఉన్న బియ్యం ఇచ్చి రామక్కను పంపింది మొగులమ్మ.

అదే సమయంలో ఆఫీస్ వాళ్లు సంఘం ఆఫీస్ కు పిలిచి కొత్త చీరలు ఇచ్చారు. ఆ తర్వాత నెమ్మదిగా అప్పు తీర్చే ఒప్పందం మీద .
సాలె అతను తెచ్చే బట్టల మూట వైపు చూసి చాలాకాలమైంది. జహీరాబాద్ అంగట్లో ఎప్పుడో తప్ప బట్టలు కొనడమే మరిచారు .
గతంలో ఎప్పుడూ ఇంత సంతోషంగా దసరా గడవలేదు. దసరా వస్తున్నదంటే చేతిలో చిల్లపెంకు లేదని భయపడేవారు. బతుకమ్మ పండుగకు ఆడపిల్లను తీసుకొస్తే రైక ముక్క పెట్టలేకపోతున్నామని లోలోనే కుమిలిపోయేవాళ్లు. అటువంటిది ఆ సంవత్సరం నిజంగా సంఘం సభ్యులందరికీ పండుగే. దసరా పండుగే.

తమని చీల్చి చెండాడుతున్న ఆకలిని, పేదరికాన్ని తరిమికొట్టే పనితో మొట్టమొదటిసారి ఆనందంతో పండుగ జరుపుకున్నారు.
పెసర, మినుము కోతల తర్వాత జొన్న, వరి ఆ తర్వాత కంది పంట అయిందంటే ఇక పనులుండేవి కాదు. ఈ పనులు కూడా మొత్తం మీద ముప్పై నలభై రోజులు పని దొరికిందంటే ఎక్కువే .

ఆ తర్వాతి కాలంలో గుట్టకు పోయి చీపురు కొయ్యలేరుకొచ్చి చీపుర్లు కట్టి అమ్ముదామని ఆశపడేది, ఆరాటపడేది మొగులమ్మ. ఆ విధంగా కొద్దిగా డబ్బులయినా సంపాదించాలని తపనపడేది. కానీ తెచ్చిన చీపురు కొయ్యలన్నీ పటేలమ్మ దగ్గరకే చేరేవి. ఎన్ని ఇచ్చినా ఆమెకు సరిపోయేవి కాదు. ఇక అమ్మడానికి ఉండేవి కాదు.

ఎండలో ఆ చెట్టు ఈ చెట్టు తిరిగి విస్తరాకులు కుడదామని మోదుగాకులు తెచ్చేది. అంతలో పటేల్ భార్య కబురుపెట్టేది మోదుగాకులు తెచ్చి పెట్టమని . ఇంకేముంది అన్నీ పటేల్ ఇంటికి వెళ్లిపోయేవి. చివర్న కొద్దో గొప్పో మిగిలితే వాటినే విస్తర్లు కుట్టి బీదర్ తీసుకు పోయి అమ్మేది. ఐదొందల విస్తర్లు అమ్మితే రెండు రూపాయలిచ్చేవారు.

తెచ్చిన ఆకులూ , చీపురు పుల్లలు అన్నీ అమ్మితే ఎంత సొమ్ము వచ్చేదో .. అనుకుని దిగులు పడేది. పటేల్ ఇంటి పరమవ్వడం లోపల్లోపల బాధ అనిపించినా తప్పేది కాదు.
ఆ ఇంటి వెట్టివాళ్లు కాబట్టి పటేల్ ఇంటి ఆజ్ఞలు పాటించి తీరాలని మనసుకు నచ్చజెప్పుకునేది.

తునికి పండ్లు, మొర్రి పండ్లు ,పరికిపండ్లు, సీతాఫలాలు వంటివన్నీఏకాలంలో అవి తెమ్మని పురమాయించేది పటేల్ భార్య . ఇంట్లో ఉన్న తన పిల్లలకు పెట్టకుండా ఆ ఇంటికి చేర్చేది మొగులమ్మ . అయినా ఇంతేనా .. ఇంట్లో దాచిపెట్టుకున్నావా అని పటేల్ భార్య అనుమానపు మాటలు , చూపులు తప్పేవి కాదు.

మాదిగోళ్లు మాదిగి తనం చెయ్యాలి . అది ఊరి ఆచారం. వతను కొద్దీ పటేల్ ఇంటి మాదిగతనం చేయాలి. వారు ఒప్పజెప్పిన పనులు చేసి తీరాలి. లేదంటే వాళ్ళ ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందన్న భయం నీడలా ఎప్పుడూ వెన్నంటే ఉండేది ఆ వాడలోని వాళ్లకు.
ఆ తర్వాత పిల్లనేసుకుపోయి వేపకాయలు ఏరుకొచ్చి తొక్క కడిగి ఆరేసి అమ్మేది. శేరుకు పావలా , ఆ తర్వాత కాలంలో అర్ధరూపాయి చొప్పున అమ్మేది. అట్లా దాదాపు ఒక నెలరోజులు గడిచిపొయ్యేవి.

గట్టుకు వెళ్లి ఎండుపుల్లలు ఏరుకొని మోపులు కట్టుకొని మోసుకొచ్చేది. వానలు పడితే పొయ్యిలో పుల్లలకు కష్టం అవుతుందని వాటిని తెచ్చి మండిలాగా పేర్చి పెట్టేది.
చీకటి పోకముందే లేసి తునికాకు తెంపుకొచ్చి మధ్యాహ్నం కట్టలు కట్టి ఆకులు కల్లంలో వేసి వచ్చేది. కొంతకాలం క్రితం బీడీ ఆకు కల్లం ఆ ప్రాంతంలో తీసేసారు. కారణం ఊరి చుట్టూ ముట్టు చిన్న చిన్న తుప్పలు తప్ప ఎక్కడా పెద్ద అడవిలేకపోవడం, తునికాకు చెట్లు తగ్గిపోవడంతో బీడీ ఆకుల కళ్లాలు లేకుండా పోయాయి. వేసవిలో పేదలకు దొరికే తునికాకు తెంపుకొచ్చి కట్టలు కట్టి కల్లాలకు ఇచ్చే పని లేకుండా పోయింది.

ఊళ్ళో మగవాళ్ళు బావులు తవ్వే పనులకు పొయ్యేవాళ్ళు. పదిమందో పదిహేనుమందో కలసి దాన్ని గుత్తకు తీసుకుని బావి తవ్వేసరికి ఎండాకాలం పోయి వానాకాలం మొదలయ్యేది. ఆ తర్వాత కాలంలో నీళ్లు లేని బావుల్లో, నీళ్లు తక్కువున్న బావుల్లో గొట్టాలు దింపి బోర్లు వేశారు. మరికొంత కాలానికి బావులు బాగా తగ్గిపోయాయి. నేలమీదే ఎంత లోతైనా ఇనుపగొట్టాలు దింపే బోరుబావులు వచ్చినై. కరెంటు మోటార్లు వచ్చినై

మొగులమ్మ భర్త చిన్నయ్య ఎప్పుడూ బావుల తవ్వకం పనులకు పోలేదు. భీంరావు పటేల్ దగ్గర వెట్టిచేయడం తప్ప మరో లోకం తెలియని మనిషి అతను.
ఆమెకు పిల్లల్ని కనివ్వడం తప్ప వారి బాధ్యతను ఏనాడూ మోయలేదు. రాత్రిపూట అతనికి పొట్టనింపే బాధ్యత కూడా మొగులమ్మ మీదే ఉండేది.

అట్లా గడిపిన ఆ వాడ జనం వాళ్లకు తెలీకుండానే సంఘం ఆఫీసు నుండి వస్తున్న వాళ్ళని తమ ఆత్మీయులుగా భావించడం మొదలుపెట్టారు. మొదట్లో సందేహపడిన వాళ్ళు కూడా ఇప్పుడు సంఘం తమదేనని అనుకుంటున్నారు.

సంఘం ఆఫీసునుండి కబురు వచ్చిందంటే సమయం సందర్భం ఏదైనా దూరాభారం ఎండావానా లెక్కజేయకుండా పిల్లలను చంకనేసుకుని పోతున్నారు.
చెప్పిన మాటల మూటలు అటకెక్కించిన వాళ్ళు తెలుసు కానీ వీళ్ళట్లాకాదు అడగకుండానే మనదగ్గరకొచ్చారు. మన మేలుకోరి ఆలోచన చేస్తున్నారు . మంచి చెడు చూస్తున్నారని నమ్మకం పెరిగింది.

పెద్ద పెద్ద చదువులు చదువుకుని పట్నం వదిలి వచ్చిన సంఘం ఆఫీసు వాళ్ళకి, మారుమూల ప్రాంతంలో నిత్యదరిద్రంలో మగ్గుతున్న ఏమీతెలియని సభ్యులకి మధ్య అనుబంధం రోజురోజుకీ పెరుగుతున్నది. ఒకరినొకరు అర్ధం చేసుకునే క్రమంలో ఉన్నారు.

వ్యవసాయ కూలీ పనులయిపోయాయి. చేతిలో పనిలేదు.. కానీ చేయడానికి పని కావాలి. ఎట్లా ..
సమస్యలకు సాగిలపడితే చీకట్లు పోవని ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నారు సంఘం సభ్యులు. వెలుగురేఖలు రావాలంటే ఏదో చెయ్యాలి అనుకుంటున్నారు. కానీ ఏమి చెయ్యాలో తెలియక తికమక పడుతున్న సందర్భంలో సంఘం వాళ్ళు సభ్యులందరినీ పిలిచి మీటింగ్ పెట్టారు. ఏమి పనులు చేయొచ్చో చర్చలు చేశారు.

ఆ పనుల్లో ఎవరు పాల్గొనాలో చర్చించారు.
సంఘం సభ్యులైన ప్రతి ఒక్కరికీ ఇనాం భూముల్లో వంద రోజుల పని చేయాలన్న నిర్ణయం జరిగింది. అప్పటి వరకు రెండు రూపాయలుగా ఉన్న కూలీ ఐదు రూపాయలకు పెంచించుకున్నారు.

బాలాపూర్ మహిళలు ఎత్తైన మట్టి దిబ్బలున్న గట్టు చుట్టూ కందకాలు తవ్వడం వంటి పనులు చేసుకుంటూ ఉండగా ఎన్నికలు దగ్గర పడుతున్నాయి.

అదే సమయంలో బర్డిపూర్ గ్రామ శివారులో సంఘం పనిచేసే వేలాది ఎకరాల్లోంచి భూమిలేని పేదలకు ఒక్కొక్కరికి ఎకరం రెండెకరాలు ఇవ్వాలని కోరిన గ్రామస్తుల మొర విన్నది ప్రభుత్వం.
పేదల పేరున బీడు భూముల్ని పంచింది. అది ఏనాడూ పంటలు పండించిన భూమి కాదు. రాళ్ళూ రప్పలతో నిండి దున్నడానికి పనికిరాని గట్టి భూమి. పంటనిచ్చే శక్తి , సారం ఏ మాత్రం లేని నేల.

అయినా సెంటు భూమి లేని ఆ పేదల్లో అనిర్వచనీయమైన ఆనందం. మాటల్లో చెప్పలేని వారి ఆనందానుభూతుల్ని తర్జుమా చేయడానికి భాష లేదేమో..
వేసవిలో ఆడ , మగ , పిల్లా జెల్లా కలిసి రాళ్ళూ రప్పలూ ఏరేశారు. గండ్లు కాలువలు తవ్వారు. రాళ్లు తప్ప నేల కనిపించని భూమిని దున్ని సాగుకు అనువుగా మలుచుకున్నారు బర్డిపూర్ దళితవాడలోని సంఘం సభ్యులు .

వాళ్ళు చేస్తున్న పనిని, పడుతున్న శ్రమని చూసి కొందరు ఎద్దేవా చేశారు. ఆ తర్వాత రూపు మారిన నేలని చూసి ఔరా అనుకున్నారు . బర్డిపూర్ చుట్టుపట్ల గ్రామాల సంఘం మహిళలు వీలయినప్పుడు వెళ్లి జరుగుతున్న పనిని చూస్తున్నారు. సంఘం ఆఫీసులోనూ , గుంపుల్లోనూ చర్చ చేస్తున్నారు.
విచ్చుకున్న మట్టిలోంచి తలెత్తి చూస్తున్న జొన్న మొలకలను సంబరంగా చూశారు . బర్డిపూర్ మహిళల అదృష్టానికి బాలాపూర్ పేద మహిళల్లో కొంచెం అసూయ మొదలైంది. తామూ ఏదో ఒకటి చేయాలని తపన, కసి లోపల్లోపల ఆరంభమైంది.

** **

“అక్క చెల్లెళ్ళం కూడి పోదాము
మన సంఘంల మాటలాడ
అక్క చెల్లెళ్ళోలె కూడి పోదాము
మన సంఘంల మాటలాడ “

పాడుకుంటూ సంఘం మీటింగ్ కి బయలుదేరింది మొగులమ్మ.
సంఘంలో చేరే సభ్యుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నది. సంఘంలో చేరిన మహిళల్ని చిన్న చూపు చూసినవారు కూడా తమ అభిప్రాయం మార్చుకున్నారు. తాముకూడా సంఘంలో చేరడానికి ఉవ్విళ్ళూరుతున్నారు.
కడుపు నింపే మార్గం అక్కడివారికి కనిపించడం ఒక కారణమేమో ..
దళితులతో పాటు నిచ్చెన మెట్ల కులవ్యవస్థ అంచుల్లో ఉన్న మరికొందరు సంఘంలో చేరే ఆలోచన చేస్తున్నారు.

సంఘం లీడర్ల మీటింగ్ కోసం మొగులమ్మ వెళ్లేసరికి అన్ని ఊళ్ళ నుండి వచ్చిన లీడర్లు గుండ్రంగా కూర్చొని ఉన్నారు. సభ్యుల ఆహారభద్రత గురించి లీడర్ల మధ్య చర్చ జరుగుతున్నది. అందరు చెప్పేది శ్రద్దగా వింటున్నది మొగులమ్మ. ఆమెలో కొత్తగా ఎగిసిపడుతున్న ఆలోచనల తరంగాలు ..
“బయటి తిండి కోసం ఆశపడుడు ఎన్నొద్దులు ..? మన తిండి మనమే పండిచ్చుకోవాలె. మన తిండి మనమే తినాలె. బయటి తిండి ఎల్లగొట్టాలె.” కొంచెం ఆవేశంగా అన్నది బాలాపూర్ మహిళల తరపున వచ్చిన మొగులమ్మ.

“అగ్గో .. గట్లెట్లయితది ?” ప్రశ్నించింది హుమ్నాపూర్ నుండి వచ్చిన నాగమ్మ
“మనకాడ ఏమున్నదని మన తిండి మనం పండిచ్చుకుంటం ” ప్రశ్నించింది మొగుళ్ళపల్లె మణెమ్మ
“తోడెం తోడెం బీగెడు అర్ధ బీగెడు ఎవల్ల కాడనన్న మిగిలి ఉన్న అది గర్రు బూవి, బండల బూవి. ” అన్నది న్యాల్కల్ నర్సమ్మ
“గా బర్డీపురోళ్ల నసీబు సక్కగున్నది. జొన్నలు ఇత్తుకున్నరట . మన గాచారమెట్లున్నదో .. ” అన్నది పర్వమ్మ
“ఏమో .. నాకట్ల అనిపిచ్చింది. నేన్జెప్పిన .. గంతే .. ” అన్నది మొగులమ్మ అందరి వైపు చూస్తూ ..

కానీ ఆమె మదిలో పక్కూరి బర్డిపూర్ మహిళలు నాటిన జొన్న మొలకలు మెదులుతున్నాయి. అవి తలెత్తి ఆకాశం కేసి చూస్తున్న దృశ్యం మెదులుతున్నది. భవిష్యత్తులో అవి ఇచ్చే తిండిగింజలు కళ్ళముందు కదలాడుతున్నది .
“ఆలోచన మంచిదే .. మెచ్చదగిందే, మన తిండి మనమే పండిచ్చుకోవాలన్న ఆలోచనను మేడంలతోని , సార్లతోని మాట్లాడదాం ..” మాటిచ్చింది సంఘం కార్యకర్త.

తమ తిండి తామే పండించుకోవాలన్న ఆలోచనా బీజాన్ని గుంపు లీడర్లు వెళ్లి తమ తమ గ్రామ సభ్యులతో పంచుకున్నారు.
ప్రతి గ్రామంలోనూ ఉన్న సభ్యుల్లో కొద్ది మందికి కొద్దో గొప్పో వారసత్వ భూమి ఉన్నది. ఒకప్పుడు జొన్నలో , కొర్రలో , సజ్జలో , అరిగెలో , మినుములో పెసలో మెట్టపంటలు వేసేవారు. కానీ గత కొన్ని ఏళ్లుగా పంటలు లేక బీడు పడివున్నాయి. కొందరి భూములు ఆ ఊరి పెద్దల చేతుల్లో చిక్కిపోయాయి . తమ వాళ్ళ చేతుల్లో ఉన్న బీడు భూముల్లో జొన్నలేస్తే అనే ఆలోచన చేశారు. కానీ భూములు ఒక దగ్గర లేవు. అక్కడక్కడ అర ఎకరం , ముప్పావు ఎకరం చిన్న చిన్న ముక్కలుగా చెల్లాచెదురుగా విసిరేసినట్లుగా ఉన్నాయి. అయినా వాటిని ఉపయోగంలోకి తేవాలనుకున్నారు. ఎంతో కొంత గాసం దొరుకుతుందనుకున్నారు.
వారి ఆలోచనలకు మిగతా సంఘం సభ్యులు అభినందించారు. మద్దతు పలికారు.

విత్తనాలు, ఎరువులు వంటి వాటికోసం పెట్టుబడి పెట్టడానికి సంఘం ముందుకొచ్చింది. పంట వచ్చిన తర్వాత తీర్చే ఒప్పందం చేసుకున్నారు .

ఒకప్పుడు బండ్లు , నాగండ్లు, గొర్రు వంటి వ్యవసాయ పనిముట్లతోను, ఎడ్లు , దున్నలు , బర్రెలతో కళకళలాడిన దొడ్లు ఇప్పుడు ఏమీ లేక వెలవెల పోతున్నాయి.
గత వైభవానికి చిహ్నాలుగా అక్కడక్కడా కొందరి దగ్గర పాడుబడిన బండ్లు , బండి చక్రాలు , నాగండ్లు ఓ మూలన పడి ఉన్నాయి. ఇప్పుడు భూమి దున్నాలంటే వ్యవసాయ పనిముట్లు కావాలి ఎట్లా అనుకుంటున్న తరుణంలో వాటికి కూడా సహాయం చేయడానికి సంఘం ముందుకొచ్చింది. ఏ సహాయం చేసినా దాన్ని వాయిదాల పద్దతిలో తీర్చాలన్న షరతు మీద.

గతంలో బయట అప్పు తెచ్చుకుంటే వడ్డీ కట్టాలి. తమ వద్దనున్న భూమి , ఇల్లు , ఎడ్లు , బండ్లు , బర్రెలు, మెడలో ఉండే బంగారు గుండ్లు , పుస్తెలు , దండ కడియాలు , కాళ్ళ కడియాలు ఇట్లా ఏదైనా విలువైన వస్తువు తాకట్టు పెట్టాలి. ఆఖరికి ఇంట్లో ఉండే ఇత్తడి బిందెలతో సహా అన్నీ తాకట్టు వస్తువులై ఇళ్ళు వదిలి ఎప్పుడో వెళ్లిపోయాయి. ఆ ఇళ్ళు ఖాళీ కుండల్లా బోసిపోతున్నాయి.

ఇటువంటి సమయంలో సంఘం వ్యవసాయ పనులకి పెట్టుబడి పెట్టడానికి ముందుకొచ్చింది.
ఆ ఇచ్చే అప్పుకి అట్లా ఏదీ తాకట్టు పెట్టడంగాని, వడ్డీ కానీ లేదు. కాబట్టి ఆ మహిళలకి కొండెక్కినంత సంబరమైంది. పని దొరుకుతున్నది . కాబట్టి వచ్చిన తమ కూలీలలోంచి అప్పు తీర్చడం ఏమంత కష్టం కాదనుకున్నారు.

వ్యవసాయ కూలీల నుండి చిన్న రైతులుగా మారుతున్న సభ్యులకు శిక్షణా కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది సంఘం.
ప్రతి పని , ప్రతి రోజు కొత్తదనంతో ముందుకు వస్తున్నది . కొత్త ఊహలు చిగురు తొడుగుతుండగా ఉత్సాహభరితంగా జీవితాన్ని మార్చుకుంటూ బాలాపూర్లోని సంఘం సభ్యులు వ్యవసాయం చేయడం మొదలు పెట్టారు . రైతుల అవతారం ఎత్తారు.

తమ సభ్యుల దగ్గర పడితు పడి ఉన్న మెట్ట భూముల్లో పెరిగిపోయిన గడ్డీగాదం తీసేసి దున్నారు. నాగేటి చాళ్ళలో జొన్నలు వేశారు. ఒక జల్లు పడింది .
మట్టిపెడ్డల మధ్యలోంచి దారి చేసుకుంటూన్నది మొలక . తలెత్తి ఆకాశం కేసి చూస్తున్న మొలక మారాకులు తొడిగి ఎదుగుతున్నది . జొన్న మధ్యలో రకరకాల మొక్కలు మొలుచుకొచ్చాయి . పెరుగుతున్న ఆ జొన్న పంటతో పాటే చేలో వచ్చిన దొగ్గలికూర , గునుకకూర , తుమ్మికూర , తెల్లగరిజే కూర , ఎర్రగరిజే కూర , పాయల కూర, పిట్టతలకాయ కూర , కొయ్యగూర వంటి రకరకాల ఆకుకూరలు, బుడిమెకాయ మొక్కలు ఉంచి కలుపు అంతా గుంపులు గుంపులుగా ఏరేశారు.

చేలో వచ్చిన దొగ్గలికూర, గునుకకూర, తుమ్మికూర, తెల్లగరిజే కూర, ఎర్రగరిజే కూర, పాయల కూర, పిట్టతలకాయ కూర, కొయ్యగూర వంటి రకరకాల ఆకుకూరలు తెచ్చి వండుకోవడం మొదలు పెట్టారు. కూరకు వెతుక్కోవడం తగ్గింది. కారం మెతుకుల తిండి తగ్గింది.
ఎదిగిన జొన్న పొట్టకొచ్చింది. కంకులేసింది. జొన్నకంకుల్లో ముత్యాలను మరిపిస్తూ జొన్నలు తయారవుతున్నాయి. పండిన పంటకు చేన్లలోనే మంచెలు వేసుకొని పిట్టలనుండి, అడవి పందుల నుండి కాపలా కాసుకున్నారు. అక్కడక్కడా కాటుక తెగులు తగిలి పంట కొంత పోయింది.
తయారయిన జొన్న కోతకోశారు. సభ్యులు ఐకమత్యంతో పంటను పండించారు. పండిన జొన్నల్లో ఒక వంతు చేను యజమానికిచ్చి మిగతా రెండొంతులు అందరూ కలసి సమంగా పంచుకున్నారు.

అట్లా మొగులమ్మ ఇంట్లో ఉన్నఖాళీ మట్టి బానల్లోకి కొన్ని జొన్నలు వచ్చి చేరాయి. తాము పండించుకున్న పంట అని తృప్తి ఉన్నా అది తమకు పూర్తిగా సరిపోదు కాబట్టి ఇంకా ఏదో చేయాలన్న తపన వాళ్లలో.

మరుసటి ఏడాదికి అన్ని కుటుంబాలు ఈ కొద్ధి భూమిలో బతకడం కష్టం కాబట్టి కొంత కౌలు భూమి చేయాలనుకున్నారు. ఊర్లో కౌలు ఇచ్చే రైతుల గురించి ఆరా తీశారు.
మొదట ఐదెకరాలు తీసుకున్నారు. నీటి వనరులు లేని ఎత్తుపల్లాల నేల అది. వాననీటితో పండే పంటలేమిటో వాళ్లకు తెలుసు.

చిన్నప్పటి నుండి చూసిన జొన్నలు రోజూ తినే రొట్టెకు అవసరమైన జొన్నలనే గత ఏడాది మాదిరిగానే వేద్దాం అనుకున్నారు.
అవి మన జొన్నలు కావట . హైబ్రీడ్ జొన్నలట . అందుకే పశువులు ఆ చొప్పను సరిగ్గా తినట్లేదని అనుకోంగ విన్నాఅన్నారొకరు .. .
హైబ్రీడ్ అయితే ఏమయింది, దిగుబడి ఎక్కువ వస్తుందని అవే ఏద్దామని కొందరంటే వద్దు మనమే కాదు పశువులకు కూడా తిండినిచ్చేదే వెయ్యాలని కొందరు వాదించారు. పశువులకు అలవాటయితే హైబ్రీడ్ జొన్న అయినా తింటాయని కొందరు అన్నారు .

మనదగ్గర బండి ఎడ్లు, బర్లు ఆవులు ఎంతమందికి ఉన్నాయ్ .. ఒక్కళ్ళిద్దరికే కదా .. చాలా మందికి లేవు కాబట్టి ఆ విషయం ఆలోచించాల్సిన అవసరం లేదు. మనకు తిండి ఇచ్చే , ఎక్కువ దిగుబడి ఇచ్చే హైబ్రీడ్ రకాల జొన్నలు వేద్దామన్నారు.
సంఘమే విత్తనాలు సరఫరా చేస్తుంది కాబట్టి హైబ్రీడ్ విత్తనాలు వేయడమే మంచిది అని వాదించారు కొందరు.
సంఘం పెద్దలు కూడా ఎక్కువ దిగుబడి ఇచ్చే రకాల విత్తనాల సాగుబడికి మొగ్గుచూపారు.

విత్తనమే పంటకు కీలకం కాబట్టి సంచుల్లో అమ్మే విత్తనం మంచిదని అభిప్రాయం వెళ్లబుచ్చారు కొందరు .
సంచుల్లో కొనుక్కునే విత్తనాలు వద్దే వద్దు . వాటికి రోగాలు ఎక్కువట . సర్కార్ మందులు సంచులకు సంచులు పొయ్యాలట ఖర్చు ఎక్కువ అవుతుందన్నారు కొందరు. మందుల తిండి మనకు వద్దన్నారు మరి కొందరు .

గతంలో ఎప్పుడూ ఏ విషయంలోనూ తమ ఆలోచనని బయటపెట్టని అమ్మలు, ఎదుటివాళ్ళు చెప్పింది చెయ్యడం తప్ప ఆలోచన తెలియని అమ్మలు గొంతు విప్పడం , ఆలోచన పంచడం , తాము నమ్మిన విషయం గురించి గట్టిగా, బలంగా తమ వాణి వినిపించడం జరుగుతున్నది.
చెట్టు నీడకు కూర్చొని వీళ్ళు చేస్తున్న తర్జనభర్జనలు గమనించింది డెబ్భై అయిదేళ్లు పైబడిన వృద్ధురాలు. ఆమె సంఘం సభ్యురాలు కాదు . ఆమె ఇంట్లోనూ ఎవ్వరూ సంఘం సభ్యులు లేరు . కానీ సంఘం మహిళల మాటలంటే ఆమెకు ఆసక్తి . అందుకే వీళ్ళ మీటింగులు జరుగుతున్నప్పుడు కర్ర ఆడిస్తూ వచ్చి దూరంగా కూర్చొని విల్లా మాటలు వినడం ఆమెకెంతో ఆనందాన్నిస్తుంది. ఎప్పట్లానే ఆ రోజుకూడా దూరంగా కూర్చొని వీళ్ళ మాటలు విన్నది .

నెమ్మదిగా కర్ర ఆడించుకుంటూ , కళ్ళు చిట్లించుకుంటూ ఈ బృందం కూర్చున్న చోటికి వచ్చింది . కళ్ళు సరిగ్గా అగుపించని ఆమె నేనో ముచ్చటజెప్పాల్న .. కలిపి పంటలు వేస్తే మంచిగుంటది అంటూ సలహా ఇచ్చింది.
ఒకపంట పోయిన ఒకపంట పండుతుందని ఆ పంటల గురించి వివరించింది. పూర్వపు రోజుల్లో తమ పెద్దలు, తాము అట్లాగే పంటలు పండించేవాళ్లమని తిండి గింజలు, విత్తనం గింజలు ఎప్పుడూ ఇంట్లో ఉండేవని ,గొడ్డు గోదకు మేత ఎప్పుడూ దొరికేదని చెప్పింది .
తిండి గింజలతోపాటు, పప్పు దినుసులు, కాయగూరలు కూడా ఉన్న కొద్ది భూమిలోనే పండించుకుంటే చేనుకు చేవ, మనిషికి సత్తువ అని వివరించింది. ఆమె చేసిన ప్రతిపాదన , ఆ మాటలు సంఘం సభ్యులనే కాకుండా సంఘం పెద్దల ఆలోచనల్లోనూ పెద్ద కుదుపునిచ్చింది .
తీవ్రంగా ఆలోచన చేశారు అందరూ.

రెండు రూపాయలకు బియ్యం ఇవ్వడం మొదలుపెట్టిన తర్వాత తిండి దొరుకుతున్నది. కొర్రలు, సామలు, అరిగెల అన్నం చెయ్యాలంటే వాటిని దంచి నానబెట్టి అవి కొద్దిగా ఉబ్బిన తర్వాత ఆరబెట్టి ఇసుర్రాయిలో పోసి పైపైన ఇసిరితే పొట్టు పొయ్యేది. వాటిని ఒక్కసారి రోట్లో వేసి దంచితే పొట్టు పొయ్యేది . జొన్నలు విసరాలి. పిండి కలిపి రొట్టె చెయ్యాలి. కాల్చాలి.

అదే రేషన్ బియ్యమైతే ఇట్లా ఎసరుపెట్టి బియ్యమేస్తే అట్లా మల్లెపువ్వు విచ్చుకున్నట్టు ఉడికిన అన్నం కళ్లముందుంది. అంత కష్టం చేయడం ఎందుకని కొందరు మానేశారు. ఆ కష్టం చేయలేక కొందరు మానేశారు. నీరు పల్లంకె పారుతుంది.
అట్లనే కష్టం లేకుండా తిండిదొరుకుతున్నదని బాకీలకు పోగా మిగిలిన కొద్దిపాటి భూములు కూడా బీడు పెట్టేశారు.
ఇప్పుడు ఉన్న అరకొర భూములు పనికిరాకుండా బీడుపడి ఉన్నందుకు బాధపడిపోయారు.

అక్షరం ముక్క రాని ఈ నిరక్షరాస్యులు , పేదవాళ్ళు , ఊరవతల ఉండే ఈ మోటుమనుషులకు ఏమి తెలుసు. తమ చదువుతో వచ్చిన జ్ఞానంతో ఈ అభాగ్యులకు ఏదో చేసేద్దాం, వాళ్ళను కరువు కోరల్లోంచి బయటపడేద్దాం అనుకుని వచ్చిన ఆ నలుగురు సంఘం పెద్దలూ స్థానికంగా ఉన్న అపారమైన సాంప్రదాయ జ్ఞానానికి అచ్చెరువొందారు.

ఇప్పుడు, ఆ వృద్ధురాలు చెప్పిన దాంట్లోని లోతుల గురించి ఆలోచించారు సంఘం అధిపతులు. ఆమెకున్న జ్ఞానానికి తలవొంచారు.
తరతరాలుగా వస్తున్న జ్ఞానం వీళ్ళలో నిక్షిప్తమై ఉంది. దాన్ని తిరిగి బయటికి తీయాలి. ప్రస్తుత గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కోవడానికి అదే మంచి మార్గం అని సంఘం నిర్ణయానికి వచ్చింది.

తిండి గింజల కరువు తీర్చుకోవడమే తమ లక్ష్యం అనుకున్న మెజారిటీ మహిళలు కలిపి పంటలే వేయాలని నిర్ణయించుకున్నారు. ఆ నిర్ణయాన్ని సంఘం పెద్దలు గౌరవించారు.
అప్పటినుండి తమ పంథా మార్చుకున్నారు. తాము చెప్పింది వాళ్ళు చెయ్యడం కాదు. వాళ్ళనుంచి తాము నేర్చుకోవాల్సింది చాలా ఉంది. వాళ్ళ భాగస్వామ్యంతోనే వాళ్ళ సంప్రదాయ జ్ఞానంతోనే ముందుకు వెళ్లడం మంచిదనుకున్నారు.

కలిపి పంటలు వేయడం ఒక్కటే కాదు ఇప్పుడొస్తున్న హైబ్రీడ్ విత్తనం కాకుండా స్థానికంగా పండించే రకాలనే విత్తాలని స్థిర నిర్ణయం చేసుకున్నారు.

ఎప్పుడైతే ఒక నిర్ణయానికి వచ్చారో ఆ వెంటనే కార్యరంగంలోకి దిగారు. పాతతరం పంటలు ఎవరైనా పండిస్తున్నారా అని ఆరా తీశారు.

బాలాపూర్ గ్రామస్తులైన మొగులమ్మ బృందానికి తమకు పది మైళ్ళ దూరంలో ఉన్న న్యాల్కల్ గ్రామంలో రెండుకుటుంబాలు ఇప్పటికీ తమ ఇంటి అవసరాలకోసం పాత పంటలనే పండిస్తున్నారని తెలుసుకున్నారు.

వాళ్ళ దగ్గరకు వెళ్లి విత్తనం కోసం అడిగారు. వాళ్ళను బతిమాలి వాళ్ళు వేసుకోగా మిగిలిన విత్తనాలను పంట వచ్చిన తర్వాత ఒకటికి రెండు ఇచ్చే పద్దతిలో అవి కొద్దిగా ఇవి కొద్దిగా పచ్చజొన్న, సాయి జొన్న, ఎర్ర కందులు, మచ్చ కందులు, పెసలు, ఉలవలు, అనుములు, గడ్డి నువ్వులు, కొర్రలు , రాగులు, సామలు సంపాదించుకున్నారు. వాటి కొన్ని ఖరీఫ్ లో వేసేవి. కొన్ని రబీలో వేసేవి.

సంఘం ఆఫీసు వాళ్ళ సహాయంతో ఇతర ప్రాంతాల నుండి కొన్ని సాంప్రదాయ విత్తనాలు సేకరించుకున్నారు బర్డిపూర్, బాలాపూర్ గ్రామస్తులు .
కొద్దో గొప్పో పెంట ఎరువు ఉన్నవాళ్లు అది తమ కౌలు భూమిలోకి తోలారు బాలాపూర్ గ్రామ సంఘం సభ్యులు.

తర్వాత బండరాయి కన్నా గట్టిగా తయారయిన భూమిని దున్నారు. గుంటుక కొట్టారు. రొప్పారు . భూమిని మచ్చిక చేసుకున్నారు . సాళ్లలో పదిరకాల విత్తనాలు వేశారు. అవి అన్ని చక్కగా మొలిసి మారాకువేసి పెరుగుతున్నాయి . వాటిని చూస్తుంటే వారిలో భవిష్యత్తు పట్ల ఆశలు చిగురిస్తున్నాయి .
ఎలా వాసన పట్టాయో , ఏ గాలి కబురు చెప్పిందో కానీ కుందేళ్లు చేనులోకి రాకపోకలు సాగించడం మొదలయింది. మూరెడు పెరిగిన మొక్కల చివర్ల కొరికేస్తున్నాయి . మొదట్లో వాళ్లకు ఏమయిందో అర్ధం కాలేదు . చేనుకి వచ్చిన రూతమ్మ మామ చెప్పేవరకూ.

కుందేళ్లు అలవాటు పడుతున్నాయి . ఇప్పుడే కట్టడి చెయ్యాలి . లేకపోతే పంట చేతికి రాదని అనుకున్నారు. కాస్త పెద్ద పిల్లలనో, పనుల్లేని మగవాళ్ళనో , ముసలివాళ్ళనో చేనుకు పంపాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నట్టుగానే వాళ్ళు వచ్చి ఆ చేనులో వాలిపోతున్నారు . కావలి కాస్తున్నారు.

బయటిపనులకు పోయినట్లే తమ కౌలు చేలకు చంకలో బిడ్డ , చేతిలో సద్ది , బిడ్డలతో పాటు కత్తి , కొంకి పట్టుకొని బయలుదేరి పోయేవారు . వంతుల వారీగా పోయి పని చేసుకుంటున్నారు .
ఆ రోజు మొగులమ్మ గుంపు వంతు . కొంకితో కలుపులు తీసుకుంటూ కబుర్లు చెప్పుకుంటున్నారు.
“ఒక్క పదమందుకోవే రాజక్కా ” అన్నది మొగులమ్మ
అంతలో సుశీలమ్మ అందుకుని

“పంటలు .. పంటలు .. భలే మాంచి పంటలు..
పాత పంటలేయవానే మన భూమిలోన ” రాగయుక్తంగా పాడింది
మిగతా అందరూ అందుకుని
“పంటలు .. పంటలు .. భలే మాంచి పంటలు..
పాత పంటలేయవానే మన భూమిలోన ” గొంతు కలిపి పాడడం మొదలు పెట్టారు

“సామలు సజ్జలు చేతితోని ఏయవానే
మన భూమిలోన
సామలు సజ్జలు ప్రీతితోని ఏయవానే
మన భూమిలోన”

పక్క చేనులో జొన్న మాత్రమే వేసిన సుశీలమ్మ తన వదినను ఉడికిస్తూ పాడింది .

వదిన హావభావాలు స్పష్టంగా తెలియడం లేదు.
ఆమె ఒక్కటే బిడ్డను పక్కన పెట్టుకుని తవ్వటం పెడుతూ కలుపు ఏరుతుండడం గమనించిన సుశీలమ్మ మరో పదం అందుకుంది. మిగతావాళ్ళు ఆమెతో గొంతు కలిపారు

“ధూళి జూడే గాలి జూడే..
దున్నపోతులబారు జూడే
ఊరు ముంగల పడతదంటయ్యో ..
ఓనమ్మలార ఉంగరాల చెయ్యి లేపయ్యో ..
ఊరు ముంగల అరక కట్టయ్యో ..

దున్నినాము రొప్పినాము, పంట ఎరువు వేసినాము
దున్నినాము రొప్పినాము, పంట ఎరువు వేసినాము
కలిపి పంటలు పెట్టినామయ్యో ..ఓనమ్మలాలో ..
కలిపి పంటలు పెట్టినామయ్యో .. ఓనమ్మలాలో ..
సజ్జవెట్టి , సామవేట్టి కోరిపెట్టిన పంటలివి
కలవనీకి మందిలేరమ్మో
కొర్రవెట్టి , జొన్నవెట్టి కోరిపెట్టిన పంటలివి
కలవనీకి మందిలేరమ్మో
ఓలమ్మలాలో .. కలవనీకి మందిలేరమ్మో
నీతా మంది లేకుంటే .. మాతాసంగాలున్నయి
మేము నీకు కలవనీకి వస్తాము
ఓలమ్మలాలో .. మేము కలవనీకి నీకు వస్తాము
మేము కలుపు తీయనీకి వస్తాము

సుశీలమ్మతో పాటే పాట అందుకుంది రాజమ్మ. వాళ్ళిద్దరితో గొంతు కలిపి గట్టిగా పాడుతున్నారు. పోటీ పడి పాడుతున్నారు మిగతావాళ్ళు.
అలా ఒక పాట తర్వాత ఒక పాట పాడుకుంటూ శారీరక శ్రమ మరచిపోతున్నారు. గాలి వారి పాటలను మోసుకుపోయి సుశీలమ్మ వదిన చిన్నమ్మ చెవుల్లో వేస్తున్నది .
ఆ పాటలు వినిపిస్తున్న వైపు చూసింది సుశీలమ్మ మేనకోడలు పదేళ్ల కళావతి . అవతలి గుంపులో కనిపిస్తున్న మేనత్తను చూసింది. ఆమె ఆ వైపు పరుగు పెట్టింది.

“ఓ పోరి యాడికే ఉరుకుతాన్నవ్ ” గద్దించింది చిన్నమ్మ
“అగ్గో .. ఆడ అత్త.. ” పరుగెట్టేదల్లా ఆగి అత్త ఉన్నవైపు చూపింది కళావతి .
“అత్తకాడికే పోతున్ననే ” అంటూ మళ్ళీ పరుగు అందుకున్నది కళావతి .
చేస్తున్న పని ఆపి అటువైపు చూసింది చిన్నమ్మ.

మెట్టలు గుంటలు తీసి
పట్టి పట్టి దున్నితేను
పుట్టెడైన పంట పండెనే ఓ రాములమ్మా ..
ఇంటినిండా గింజలాయెనే ఓ రాములమ్మా

పెంట ఎరువు వేసినాము
కలిపి పంటలు పెట్టినాము
ఆకులన్నీ రాలబట్టెనే ఓ రాములమ్మా
భూమికెంతో బలమాయెనే ఓ రాములమ్మా

పంటలు పండి ధాన్యం గింజలు ఇంటికి చేరతాయన్న ఆశతో , నమ్మకంతో అప్పటికప్పుడు అల్లిన పాట పాడుతున్నారు.
రెక్కలు తొడిగిన ఆ ఊహలు తెచ్చిన కొత్త ఉత్సాహం వారి గొంతుల్లోంచి జాలువారుతున్నది.

గొంతెత్తి పదం అందుకొని ప్రకృతి ఒడిలో ఎన్నో రాగాలు పలికిస్తున్నారు వాళ్ళు. వాళ్ళ మాటలే పాటల ఏరులై పారుతున్నాయి. వారి చేతుల్లోని కొంకిలు చకచకా కదులుతుంటే ఆ చేతులకున్న గాజులు చక్కని వాద్యసహకారం అందిస్తున్నాయి.

చెంగు చెంగున పరిగెత్తిన కళావతి రొప్పుతూ వెళ్లి మేనత్త చెయ్యందుకున్నది.
“పూలమ్మ రాలే ..” మొగులమ్మను చూస్తూ అడిగింది.
“చెల్లెను, తమ్ముండ్ల బట్టుకొని ఇంటికాడనే ఉన్నది . ” పనిచేసుకుంటూనే జవాబిచ్చింది మొగులమ్మ.
“ఈడ పోరగాండ్ల కోసం ఓ గుడిసె ఏస్కోవాలె .. పోరగాండ్లు జర నీడకయితరు ” అన్నది తుమ్మ చెట్టు నీడకు కూతుర్ని పడుకోబెట్టి వచ్చిన జలమ్మ .
గుడిసె కంటే మంచె వేస్తే బాగుంటుందని అన్నది రాజమ్మ.

పిల్లలను మంచె మీదకు ఎక్కించడం మంచిది కాదనుకున్నారు. చిన్న చర్చ తర్వాత రెండుమూడు రోజుల్లో ఆకులలములేసి గుడిసె వద్దామని నిర్ణయించుకున్నారు.
జలమ్మ కాస్త దూరంలో ఉన్న పిల్ల కేసి చూసింది . నిద్రపోతూనే ఉంది . ఆమె పాలిండ్లు బరువెక్కుతున్నాయి . బిడ్డలేస్తే వెళ్లి పాలిచ్చిరావాలని ఆలోచిస్తున్నదామె . అంతలో రాజమ్మ పాటందుకుంది.

పది మంది కలసి ఉప్పొంగుతున్న ఉత్సహంతో పాడుతున్న పాటలు అలలు అలలుగా వచ్చి చెవిని తాకుతుంటే ఒంటరిగా పనిచేయలేని చిన్నమ్మ లేచి నిల్చున్నది.

పాట వినిపించే వైపు కొద్ది క్షణాలు తదేకంగా చూస్తూ ఉండిపోయింది.
ఆ తర్వాత అక్కడ నిలవలేకపోయింది . చేతిలోని కొంకి పక్కన పడేసింది. నడుముకు చుట్టిన కొంగు తీసి దులిపి భుజంపై వేసుకుంది . ఆమె అడుగులు తనకు కుడివైపుగా ఉన్న చేనువైపు పడుతున్నాయి. ఆ గొంతుల్లో తానూ గొంతు కలపాలని ఆరాటపడుతున్నది ఆమె మనసు.

“కౌలు సేనుకే సొంత మడి లెక్క పడి పడి చేస్తుంరు .. ? ” అన్నది చిన్నమ్మ
వదిన మాటల్లో ఎకసెక్కం గమనించింది సుశీలమ్మ “ఏకో రామాయనం లెక్క గాదు .. పదుగురం కలుస్తం , పది తీర్ల ఆలోచనజేస్తం , ఒక్క మాట మీద పోతం” భార్యాభర్తలిద్దరూ ఒక మాట మీద నడవలేని అన్నా వదినల్ని గురించి బాగా తెలిసిన సుశీలమ్మ.

“ఒక్కదానివే జేస్కో వడ్తివి ..? ఎవ్వళ్లనన్న తోడు పిల్వనుంటివి ” అన్నది మొగులమ్మ
“యాడ .. కూలోళ్లల్ల మన్నువడ .. దొర్కుతనే ల్యాకపాయె .. “కినుకగా అన్నది చిన్నమ్మ.
” అయ్యో .. గట్లనా .. మాతోని జెప్తె మేమే అస్తుంటిమి గదనే ” నవ్వుతూ అన్నది మొగులమ్మ
” ఊ .. ” ఒక నిట్టూర్పు విడిచి కూతురువైపు చూసింది చిన్నమ్మ.

కళావతి తల్లులతో పాటే వచ్చిన పిల్లల దగ్గర ఉన్నది. ఆమె చంకలో ఏడెనిమిది నెలలున్న పిల్ల. ఆ పిల్ల ఏడుస్తుంటే ఏడవకని సముదాయిస్తూ ఉన్నది.

మట్టిపెడ్డ నోట్లో పెట్టుకోబోతున్న పిల్లవాడి చేతిలో మట్టిపెడ్డ లాక్కుని అవతలికి గిరాటేసింది. నోట్లో పెట్టుకోవద్దని కసిరి చెప్పింది .
ఆ తర్వాత పనుల్లో ఉన్న వాళ్ళ వైపు అడుగేస్తూ చూస్తూ
“ఈమెకు పాలుగావల్నేమొ.. ఏడుపందుకున్నది ” అన్నది కళావతి.

** **

(మిగతాది వచ్చే సంచికలో…)

పుట్టింది వరంగల్, పెరిగింది ఆదిలాబాద్, మెట్టింది నిజామాబాద్ జిల్లా. ప్రస్తుతం ఉంటున్నది హైదరాబాద్ లో. చదివింది జర్నలిజం అయినా స్థిరపడింది సామాజికసేవా రంగంలో. హేమలతా లవణం, లవణం నిర్వహణలోని సంస్కార్ సంస్థలో వారితో కలసి ఇరవై ఏళ్ళు నడిచారు. ఆ నడకలో నిజామాబాద్ జిల్లాలోని అనేకమంది గ్రామీణ మహిళల, పిల్లల జీవన పరిస్థితులు అవగతం చేసుకున్నారు. ఆ అనుభవాల్లోంచి రాసినవే 'భావవీచికలు', 'జోగిని', 'గడ్డిపువ్వు గుండె సందుక', 'ఆలోచనలో... ఆమె'. 'భావవీచికలు' బాలల హక్కులపై వచ్చిన లేఖాసాహిత్యం. ILO, ఆంధ్ర మహిళాసభ, బాల్య లు సంయుక్తంగా 2003లో ప్రచురించాయి. తరతరాల దురాచారంపై రాసిన నవల 'జోగిని ". వార్త దినపత్రిక 2004లో సీరియల్ గా ప్రచురించింది. 2015లో విహంగ ధారావాహికగా వేసింది. ప్రజాశక్తి 2004లో ప్రచురించింది. గడ్డిపువ్వు గుండె సందుక (2017) బాలల నేపథ్యంలో, ఆలోచనలో ... ఆమె (2018) మహిళల కోణంలో రాసిన కథల సంపుటాలు. 'అమర్ సాహసయాత్ర' బాలల నవల (2019) మంచిపుస్తకం ప్రచురణ.  'ఆడపిల్లను కావడం వల్లనే' శీర్షికతో ప్రజాతంత్ర వీక్లీ లో కొంతకాలం వ్యాసాలు వచ్చాయి. వివిధ పత్రికల్లో కవితలు, వ్యాసాలు ప్రచురితమయ్యాయి. వివిధ అంశాలపై రేడియో ప్రసంగాలు ప్రసారమయ్యాయి.

Leave a Reply