బతుకు తీపి

(మూలం – జాక్ లండన్
తెలుగు అనువాదం – కాత్యాయని)

రాతి గుట్టలతో నిండిన గట్టుపై పడుతూ లేస్తూ నడుస్తున్నారు వాళ్ళిద్దరూ. ఇద్దరూ బాగా అలిసిపోయి బలహీనంగా, జబ్బుపడ్డ వాళ్ళలా ఉన్నారు. భుజాల మీద దుప్పట్లలో చుట్టిన బరువైన మూటలూ, తుపాకులూ వేలాడుతున్నాయి. భుజాలు, తలా బాగా ముందుకు వంచుకుని, చూపుల్ని నేలకు అతికించి వంగిపోయి నడుస్తున్నారు.

“మన వస్తువులు దాచుకున్న చోట, ఇద్దరికీ సరిపడేన్ని తూటాలు ఉన్నాయిగా!” అన్నాడు వెనకాల నడుస్తున్న వ్యక్తి. రాళ్ల మీదుగా పారుతున్న పాల లాంటి నీళ్ళలోంచి నడుస్తున్న ఆ రెండో మనిషి జవాబు చెప్పలేదు. వెనకాల వ్యక్తి, కాలి మడమలు గట్టిగా నేలకు ఆనించిపెట్టి నడుస్తున్నాడు. బూట్లు వేసుకునే ఉన్నా, నీళ్ళు అతి చల్లగా ఉండటంతో పాదాలు మొడ్డుబారాయి.

లోతు ఎక్కువగా ఉన్న చోట నీళ్ళ వేగానికి పడిపోకుండా నిలదొక్కుకోడానికి కష్టంగా ఉంది. వెనక నడుస్తున్న వ్యక్తి ఓ నున్నటి రాతి మీద కాలుజారి పడబోయాడు. కష్టం మీద అపుకున్నాడు కానీ, బాధగా కేక పెట్టాడు. ఒక చేతిని ముందుకు చాపి, బాలెన్స్ చేసుకుంటూ నడవసాగాడు. ఐనా మళ్లీ కాలు జారింది.

ఇక అక్కడే నిలబడిపోయి, తిరిగి చూడకుండా వెళ్ళిపోతున్న ఆ రెండో వ్యక్తి వైపు చూస్తుండి పోయాడు.
కాసేపు ఆగి, “బిల్! నా కాలికి దెబ్బ తగిలింది!” అని చెప్పాడు. ఒకే ధ్యాసగా నీళ్ళలోంచి ముందుకు నడుస్తున్న బిల్, తిరిగి చూడనైనా లేదు. రెండో మనిషి ముఖంలో భావాలు మారుతున్నాయి. అతని కళ్ళలో గాయపడిన జంతువు చూపు లాంటిది చోటుచేసుకుంది.

బిల్ వెనక్కి చూడకుండా ప్రవాహాన్ని దాటి అవతలి గట్టు మీదికి చేరాడు. ఇంకా నీళ్ళలోనే ఉన్న రెండో వ్యక్తి మళ్లీ “బిల్!” అని పిలిచాడు. అతని పెదవులు వణుకుతూ వున్నాయి. దీనమైన ఆ పిలుపు బిల్ ను ఏ మాత్రం కదిలించలేదు. అతడు అలా కొండల పైకి ఎక్కి వెళ్లిపోతూ ఉంటే చూస్తూ నిలిచిపోయాడు రెండో మనిషి. కొండ వెనక్కి బిల్ అదృశ్యమయిందాకా అతడు అలాగే నిలబడి పోయాడు.

కాసేపయ్యాక చుట్టూ పరికించి చూసాడు. సూర్యుడు మెల్లిగా మబ్బుల మాటుకు కుంగి పోతున్నాడు. దెబ్బ తగిలిన కాలు మీదినుంచి శరీరం బరువును రెండో కాలి మీదికి మార్చుకుని నిలబడుతూ గడియారం చూసుకున్నాడు. సాయంత్రం నాలుగైంది. అవి జూలై నెల చివరి రోజులో, ఆగస్ట్ ప్రారంభ దినాలో అయ్యుండాలి. సూర్యుడి ఉదయాస్తమయాలు తెలుస్తున్నాయి తప్ప, దాదాపు రెండు వారాలుగా అతడికి తారీకులు గుర్తు లేవు.

దక్షిణం దిశగా చూస్తుంటే, ఆ వైపున్న కొండల దగ్గరే బేర్ సరస్సు ఉండాలనే సంగతి గుర్తొచ్చింది. ఆ కొండల వెనగ్గా విస్తరించిన ఉత్తర ధృవ ప్రాంతం, ఉత్తర కెనడా మైదానాల గుండా సాగుతూ బారెన్స్ అనే ప్రదేశాన్ని చేరుతుందని కూడా గుర్తొచ్చింది. ఇప్పుడు తను నిలబడి ఉన్న ఈ ప్రవాహం కాపర్ మైన్ అనే నదిలో కలిసి ఉత్తరంగా సాగి, ఆర్కిటిక్ సముద్రంలో కలుస్తుంది. ఇదంతా అతడు కళ్ళతో చూసిందేమీ కాదుగానీ, మాప్ ద్వారా తెలుసుకున్నాడు.

వాతావరణం ఆహ్లాదకరంగా లేదు. చాలా దిగువకు తొంగిచూస్తే, పర్వతాల వరుస కనబడుతోంది. చుట్టూ భయానకమైన శూన్యమే తప్ప, ఒక్క చెట్టు కానీ, కాస్త పచ్చికగానీ కనుచూపు మేరలో కనబడటం లేదు.

“బిల్” అంటూ గొణుక్కున్నాడు ఆ వ్యక్తి. చుట్టూ ఆవరించిన శూన్యం అంతకంతకూ విస్తరించి తనను చుట్టుకుంటూ ఉన్నట్టు తోచి ఒళ్లు జలదరించింది. చేతిలోని తుపాకి జారి నీళ్లలో పడటంతో అతడు ఈ లోకంలోకి వచ్చాడు. ధైర్యాన్ని కూడగట్టుకుంటూ తుపాకిని చేతులోకి తీసుకున్నాడు. గాయపడ్డ కాలిపై బరువు పడకుండా ఉండేందుకు వీపు మీది బరువును ఎడమవైపుకు జరుపుకున్నాడు. మెల్లిగా జాగ్రత్తగా ప్రవాహాన్ని దాటి అవతలికి చేరాడు.

దిగులుగొలిపే ఒంటరితనాన్నీ, నొప్పి పుడుతున్న కాలినీ పట్టించుకోకుండా నిదానంగా కొండ అంచుకు చేరుకున్నాడు. బిల్ వెళ్ళిపోయింది అటు వైపే. ఇప్పుడు అక్కడ ఎవరూ లేరు, నిర్జనమైన లోయ తప్ప. తనను ఆక్రమించుకుంటున్న భయంతో పోరాడుతూనే కొండ దిగటం మొదలెట్టాడు. లోయ కింది భాగమంతా చిక్కగా మొలిచిన మొక్కలతో చిత్తడిగా ఉంది. కాలు పెట్టిన చోటనల్లా నీళ్ళు ఊరుతున్నాయి. బిల్ అడుగు జాడలను గమనించుకుంటూ మొక్కల మధ్యనున్న రాళ్ళమీదుగా అడుగులు వేశాడు.
తను ఒంటరి అయిపోయాడు. ఐనా దారి తప్పి పోలేదు.

కాసేపట్లో చేరాల్సిన చోటుకు – అంటే, ఎండిపోయిన పైన్ చెట్ల నడుమ ఉండే ఆ చెరువు గట్టుకు చేరుతాడు. ఆ ప్రాంతపు జనం, ఆ చోటును “ల్యాండ్ ఆఫ్ లిటిల్ స్టిక్స్” అంటారట. అక్కడి నీళ్ళు ఇందాకటి ఏటిలో లాగా పాల రంగులో ఉండవు. ఆ గట్టు నిండా గడ్డి ఉండటం తనకు గుర్తుంది. ఆ ప్రవాహం రెండు పాయలుగా చీలిపోయే చోటు దాకా నడిచి, అక్కడినుంచి పడమటి దిశగా సాగే పాయ వెంట నడిచి, అది డియాజ్ నదిలో కలిసే చోటికి చేరుతాడు. అక్కడ బోర్లించిన ఒక పడవ ఉంటుంది.

దానికింద రాళ్ల మాటున దాచిన పెట్టె ఉంటుంది. అందులో తన తుపాకిలో నింపుకునేందుకు తూటాలు, చేపలు పట్టే కొక్కెం, గాలమూ ఉంటాయి. పిండీ, మాంసం, చిక్కుళ్లూ కూడా అందులోనే ఉంటాయి. బిల్ అక్కడే ఉంటాడు, తనకోసం ఎదురుచూస్తూ. ఇద్దరూ కలిసి పడవలో డియాజ్ నదికి దక్షిణంగా ప్రయాణించి బేర్ సరస్సు చేరుకుంటారు. అటునుంచి దక్షిణంగా వెళ్లి మళ్లీ దక్షిణానికి తిరిగాక మెకంజీ నది వస్తుంది.

తరుముకొస్తున్న చలికాలానికి చిక్కకుండా వెళ్లి, ఎత్తుగా దట్టంగా పెరిగిన చెట్లతో వెచ్చగా ఉండే దక్షిణ ప్రాంతానికి చేరుకుంటారు. అక్కడ ఎప్పుడూ ఆహారానికి కొదవన్నది ఉండదు. ఇలా సాగుతున్నాయి అతడి ఊహలు!

నిజంగా ఇవన్నీ ఉత్తి ఊహలే!

ఈ ప్రయాణాన్ని సాగించటానికి తన మనసుతోనూ, శరీరంతోనూ కూడా ఘర్షణ పడుతున్నాడతడు. బిల్ తనను ఒంటరిగా వదిలేసి వెళ్ళటం నిజం కాదనీ, అతడు తనకోసం ఎదురుచూస్తూ ఆ సరస్సు దగ్గరే ఉంటాడని తనను తాను నమ్మించుకోటానికి విశ్వ ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఆ నమ్మకం అంతరిస్తే అతడు అక్కడికక్కడే ప్రాణాలు వదిలెయ్యటం ఖాయం.

సూర్యాస్తమయం అవుతోంది. అతడు మరోసారి తానూ, బిల్ కలిసి చలికాలం రాకముందే దక్షిణానికి వెళ్ళటాన్ని గురించీ, ఆ రహస్య స్థలంలో దాచిన ఆహారాన్ని గురించీ తలుచుకుని ధైర్యం కూడగట్టుకునే ప్రయత్నం చేశాడు. అతడు తిండి తిని అప్పటికే రెండు రోజులయింది. అక్కడక్కడా దొరికే చిన్ని నీటి బెర్రీ పళ్ళు కోసి నోట్లో వేసుకుంటూ ఉన్నాడు. ఆ పండ్లలో నడుమ ఓ చిన్న గింజ, దాని చుట్టూ ఓ నీటిచుక్కా తప్ప తినటానికి ఏమీ ఉండదు. నోట్లో వేసుకోగానే ఆ నీరు కరిగిపోయి, గింజ చేదుగా నాలుకకి తగులుతుంది. ఐనా ఓపిగ్గా వాటినే తింటూ భవిష్యత్ మీద ఆశను నిలుపుకుంటూనే వున్నాడు.

*

రాత్రి తొమ్మిదయింది. అలసటతో బలహీనమైపోయిన అతడు, బొటన వేలికి రాయి కొట్టుకుని గట్టి దెబ్బ తగలటంతో కూలబడి పోయాడు. కాసేపటికి తేరుకుని వీపు మీది సామాన్లు దించుకున్నాడు. అక్కడ మరీ అంత చీకటిగా లేదు. ఓ చెకుముకి రాయి దొరికితే, రాళ్ల మధ్యనున్న ఎండు గడ్డిని పోగుచేసి అంటించాడు. సంచి లోని గిన్నెను తీసి, నీళ్ళు పోసి మరగబెట్టాడు. మూట లోంచి సామాన్లన్నీ తీసి ముందు పెట్టుకుని,
ముందుగా అగ్గిపుల్లలు ఎన్ని ఉన్నాయో లెక్క పెట్టటం ప్రారంభించాడు. మూడుసార్లు లెక్కపెట్టి, అరవయ్యేడు పుల్లలున్నాయని కచ్చితంగా తేల్చుకున్నాడు. వాటిని వేర్వేరు భాగాలు చేసి ఒక్కోదాన్ని ఒక్కో కాగితంలో చుట్టాడు. ఖాళీ అయిన పొగాకు సంచిలో ఒక పొట్లాన్నీ, టోపీ కింద మరొకదాన్ని, చొక్కా కింద వంటికి తగులుతూ ఉండేట్లుగా ఇంకోదాన్ని అమర్చుకున్నాడు. అంతా పూర్తయ్యాక, తానసలు సరిగ్గా లెక్క పెట్టాడో లేదో అని అనుమానం మొదలయింది. ఆ పొట్లాలన్నీ మళ్లీ విప్పి మరోసారి లెక్క పెట్టాకగానీ అవి కచ్చితంగా అరవై ఏడేనని నమ్మకం కలగలేదు.

ఆ తర్వాత తడిసిపోయిన బూట్లు, సాక్సూ మంట దగ్గర ఆరబెట్టాడు. కాళ్ళకు వేసుకున్న లెదర్ సాక్స్ అయితే పూర్తిగా చిరిగి పీలికలయ్యాయి. పాదాలు రక్తాలోడుతున్నాయి. చీలమండ వాచిపోయి మోకాలంత లావున తయారయింది. తన దగ్గరున్న రెండు దుప్పట్లలో ఒకదాన్నుంచి పొడవాటి ముక్కను చింపి నొప్పి పెడుతున్న చీలమండ పై గట్టిగా కట్టాడు. మరి కొన్ని పీలికలను సాక్సు బదులుగా పాదాలకు చుట్టుకున్నాడు. మంటపై కాగిన నీళ్ళు తాగేసి, గడియారానికి కీ యిచ్చి, దుప్పటి ముసుగు పెట్టి పడుకున్నాడు. అతడట్లా మృత శరీరం వలె పడి ఉండగానే రాత్రి గడిచి, తెల్లారింది. బూడిద వర్ణపు మబ్బులు ఆకాశమంతా కప్పేసి మసగ్గా ఉంది.

ఉదయం ఆరు గంటలకు కళ్ళు తెరిచిన అతడు ఆ రాళ్లపై వెల్లికిలా పడుకుని ఆకాశంకేసి చూస్తుండగా తనకు బాగా ఆకలిగా ఉందన్న సంగతి గుర్తొచ్చింది.

పైకి లేవటానికి ప్రయత్నం చేస్తున్న అతడు హఠాత్తుగా వినబడ్డ అరుపుతో ఉలిక్కి పడి ఆగిపోయాడు.
యాభై అడుగుల దూరంలో నిలబడి, అతన్ని ఆసక్తిగా చూస్తోంది ఓ కారిబూ (ఉత్తర అమెరికా ప్రాంతాల్లోని ఓ జాతి జింక). కారిబూ మాంసం ఉడుకుతున్న దృశ్యం అతడి ఊహల్లో అప్రయత్నంగా కదలాడింది. తుపాకిలో బుల్లెట్లు లేవనే సంగతి మర్చిపోయి, దాన్ని కారిబూ వైపు గురిపెట్టాడు. ఆ జంతువు చటుక్కున రాళ్ల మధ్యకు దూకి చూస్తుండగానే మాయమైంది.

తనని తాను తిట్టుకుంటూ తూపాకిని విసిరి కొట్టాడు. లేచి నిలబడే శక్తి కూడా లేదు. మెల్లిగా ఓపిక కూడగట్టుకుని అడుగులు వెయ్యసాగాడు. ఓ చిన్న గుట్టమీదికి చేరి, చుట్టూ చూస్తే బూడిదరంగు గడ్డి, రాళ్ళు, పారుతున్న సెలయేరూ తప్ప ఎక్కడా చెట్టూ చేమా కనబడటం లేదు.

బూడిద రంగు కప్పుకున్న ఆకాశం వరస చూస్తోంటే సూర్యుడు వస్తాడనే నమ్మకం కలగడం లేదు. నిన్నరాత్రి తను ఎటువైపు నుండి ఇక్కడికి చేరాడో, తూర్పు దిక్కు ఎటువైపు ఉందో ఏదీ దిక్కు తోచలేదు. ఐనా తను దారి తప్పి పోలేదని, ఆ “ల్యాండ్ ఆఫ్ లిటిల్ స్టిక్స్” అనే ప్రదేశానికి దగ్గర్లోనే ఉన్నాననీ అతడికి నమ్మకంగానే ఉంది. బహుశా, ఆ కనబడే కొండల వెనగ్గా ఎడమ వైపుకు వెళ్తే అక్కడికి చేరుకుంటాడనే అనిపిస్తోంది.

సామాన్లు సర్దుకుని ప్రయాణానికి బయల్దేరబోతూ అగ్గిపుల్లల పొట్లాలను ఓసారి తడిమి చూసుకున్నాడు.
ముందుకు అడుగు వెయ్యబోతుండగా, తన భుజానున్న సంచిని మోయగలనా అని అనుమానం వేసి ఆగాడు. ఆ సంచి మరీ అంత పెద్దదేమీ కాదుగానీ, బరువు మాత్రం పదిహేను పౌండ్లున్నది. అంటే- అతడి మిగిలిన సామాను మొత్తం కలిపి ఉన్నంత బరువు! దాన్ని చేతుల్లోకి తీసుకుని, చుట్టూ పరికించి చూసాడు- ఆ సంచిని ఎవరన్నా దోచుకుంటారాన్నంత భయం అతడి కళ్ళలో! అతడి ఆలోచనలు తెగి, బయల్దేరే సమయానికి ఆ సంచి మళ్లీ అతడి భుజం మీదికే చేరింది.

*

తను మకాం చేసిన చోటుకు ఎడమ దిక్కుగా ప్రయాణం మొదలెట్టాడు అతడు. దారిలో దొరికిన ఆ చేదు బెర్రీలే ఆహారం. చీలమండ కట్టె లాగా బిగుసుకుపోయి బాధగా ఉంది నడుస్తుంటే. ఐనా, కడుపులోని ఆకలి బాధ ముందు ఈ బాధ చిన్నదే అయింది. ఆ బెర్రీలు నోరు పాడుచెయ్యటానికి తప్ప ఎందుకూ పనికి రావు. ఆకలితో మెదడు పనిచేయడం లేదు. దారి గమనించే ఓపిక కూడా చచ్చిపోయింది.

అలాగే నడుచుకుంటూ ఓ లోయ ప్రాంతానికి చేరేసరికి ఏవో పక్షులు కిర్రు కిర్రుమంటూ తిరుగుతున్నాయి. రాళ్ళను ఏరి వాటిమీదికి విసిరాడుగానీ ఒక్కటీ పడనే లేదు. అడుగులు వేసే శక్తి లేక, పక్షుల్ని వేటాడే పిల్లిలాగా వాటి వెనకే పాకసాగాడు. పదునైన రాళ్ల తాకిడికి మోకాళ్ల దగ్గర ప్యాంట్ చిరిగిపోయి రక్తం కారుతున్నా లెక్క చెయ్యనివ్వని ఆకలి అతడిని ముందుకు నడుపుతోంది.

నేలమీది మంచు తడితో బట్టలు తడిసి పోతున్నాయనీ, శరీరం చల్లబడి పోతోందని అతడికి పట్టటమే లేదు. తనను వెక్కిరిస్తున్నట్టుగా అరుచుకుంటూ పోతున్న పక్షులను కోపం పట్టలేక బిగ్గరగా తిట్టాడు. ఒక పక్షి నిద్ర పోతున్నట్టుగా పడి ఉండటం చూసి, ఆశతో చెయ్యి చాచాడు పట్టుకుందామని. అది ఒక్కసారిగా లేచి అతడి ముఖాన్ని రాచుకుంటూ ఎగిరిపోయింది. మూడు ఈకలు మాత్రం గుప్పిట్లోకి ఊడి వచ్చాయి. తనను తానే తిట్టుకుంటూ వెనక్కొచ్చాడు. సామాన్లు సర్దుకుని మళ్లీ బయల్దేరాడు.

అతడి ముందునుంచే పరిగెత్తుతున్న కారిబూలను పట్టుకుంటే బాగుండునని అనిపిస్తోంది. ఇంతలో నల్లటి చిన్న జంతువేదో ఓ పక్షిని నోట కరుచుకుని పారిపోతుంటే దాన్ని భయపెడదామని గొంతు చించుకుని కేకలు పెట్టాడు. ఆ కేకలకు అది మరింత వేగంగా పారిపోయిందే తప్ప పక్షిని మాత్రం వదల్లేదు.

మధ్యాహ్నం దాటే వేళకు, నది గట్టున నడుస్తుంటే ఒత్తుగా పెరిగిన పచ్చిక కనబడింది. ఆ గడ్డి మొక్కల్ని పీకి వేళ్ళ దగ్గరున్న తెల్లటి, గుండ్రటి దుంపలను ఆత్రంగా నోట్లో వేసుకున్నాడు. అవి చూట్టానికి నున్నగా, మృదువుగా కనబడుతున్నాయి కానీ లోపలంతా గట్టి పీచు తప్ప తినటానికి పనికొచ్చేది కాదు.
అతడి శక్తి పూర్తిగా నశించి పోయింది. భుజం మీది సామాన్లను కిందపడేసి, మోకాళ్ల మీద పాకుతూ పశువులా ఆ గడ్డిని నోటితో తింటున్నాడు. అలసటతో కళ్ళు మూతలు పడుతున్నాయి. ఐనా, ఆహారం దాచిన ఆ మైదానానికి చేరాలనే బలమైన కోరిక, మళ్లీ లేచి నడిచే శక్తినిచ్చింది అతడికి. దారిలో ఎదురైన ప్రతి నీటి గుంటలోనూ వెతుక్కుంటున్నాడు – ఏ జీవి అయినా దొరక్క పోతుందా అనే ఆశతో.

చీకటి పడబోతుండగా ఓ నీటి గుంటలో చిన్న చేపపిల్ల కనబడింది. పట్టుకుందామని ఎంత ప్రయత్నం చేసినా గుప్పిట్లో చిక్కటమే లేదది. ఈ వెతుకులాటలో మడుగు బురద బురదగా తయారయింది. నీళ్ళు తేటబారేదాకా ఆగి, మళ్లీ వేట సాగించాడు. మళ్లీ నీళ్ళు బురదమయమై చేప కనబడకుండా పోయింది.
సహనాన్ని కూడగట్టుకుని తన దగ్గరున్న గిన్నెతో గుంటలోని నీళ్లను తోడి పొయ్యటం మొదలు పెట్టాడు.
ఉద్వేగంతో,అలసటతో గుండె దడ దడలాడుతోంది. చివరికి గుంట ఖాళీ అయింది. కానీ చేప జాడ లేదు. అప్పుడు కనబడింది – ఈ గుంటకూ, పక్కనున్న చెరువుకూ మధ్యనున్న బండల నడుమనున్న చిన్న సందు! అదేదో ముందే చూసి ఉండుంటే నీళ్ళు తోడే ముందే దాన్ని రాయితో మూసేసి ఉండేవాడు. ఇప్పుడిక ఆ చెరువును తోడి పొయ్యటం జరిగే పని కాదు.

నేలమీద కుప్పకూలి పోయాడతడు. గుండెల్లోంచి నెమ్మదిగా మొదలైన దుఃఖం బిగ్గరగా పైకి ఎగదన్నుకుని వచ్చింది. ఎవరూ లేని ఆ శూన్యంలో అలా ఒంటరిగా గొంతెత్తి ఏడుస్తూ ఉండి పోయాడు.
కాసేపటికి లేచి, నిప్పు రాజేసి నీళ్ళు కాచుకుని తాగాడు.

తడిసిన అగ్గిపుల్లలను ఆరబెట్టుకుని, గడియారానికి కీ ఇచ్చాడు. దుప్పట్లు బాగా తడిసి పోయాయి. చీలమండ నొప్పి ఎక్కువయింది. వీటన్నిటినీ మించిన సమస్య ఆకలి! ఆ రాత్రి కలత నిద్రలో అతడి కలల నిండా రకరకాల వంటకాలే!

*

నిద్ర లేచేసరికి ఒంట్లో నలతగా అనిపించింది. భూమ్యాకాశాలను ఆవరించుకుని గాఢమైన బూడిద రంగు. సూర్యుడి జాడ కనిపించలేదు. పర్వత శిఖరాలు మంచులో మునిగి పోయాయి. నిప్పు రాజేసి నీళ్ళు కాచుకుందామని ఎంత ప్రయత్నించినా ఆ చలిగాలికి సాధ్యం కానేలేదు. కురిసే మంచుకు, నిప్పు వెలగడం లేదు.

ఇక తానక్కడినుంచి బయల్దేరాలి. ఎటు వెళ్ళాలో దిక్కు తోచలేదు. అతడికి ఇప్పుడు ఆ మైదానం గురించిగానీ అక్కడ దాచిన వస్తువుల గురించి గానీ గుర్తు రావడం లేదు. ఆకలి తప్ప మనసులో ఇంకే ఆలోచనా నిలవటం లేదు. ఆ రాత్రికి వేడినీళ్లు కూడా లేవు. నిరంతరాయంగా కురుస్తున్న మంచులో నిద్రలేని రాత్రిని గడిపాడు.

మర్నాడు కూడా ఎండ రానేలేదు. కడుపులో ఆకలి మంట తగ్గినట్టయి, సన్నగా నొప్పి మొదలైంది. డియాజ్ నది దగ్గర దాచిన వస్తువులను గుర్తు తెచ్చుకుంటూ తనకు తాను ధైర్యం చెప్పుకున్నాడు. మిగిలిన ఒక్క దుప్పటిలోంచి కొన్ని పీలికలు చింపి చీల మండలకూ, నెత్తుటి ముద్దలైన పాదాలకూ చుట్టుకున్నాడు. బరువైన ఆ తోలు సంచిని పారేద్దామని ఎన్నిసార్లు అనుకున్నా, తీరా బయల్దేరే సమయానికి అది అతడి భుజం మీదికి చేరుతూనే ఉంటోంది.

కాసేపటికి ఎండ వచ్చింది. మంచు కరిగి బాట స్పష్టంగా కనబడుతోంది. తను దారి తప్పి పోయానని, వెళ్లాల్సిన వైపు నుంచి చాలా దూరం వచ్చేశాననీ అప్పుడు తెలిసింది అతడికి. మళ్లీ వెనక్కి తిరిగి కుడివైపుకు నడక సాగించాడు. నీరసంతో కాళ్ళు తేలిపోతున్నాయి. చివరికి ఆకలి సంగతి కూడా ఆలోచించ లేనంతగా నీరసం! ఇక స్పృహ తప్పి పోతుందేమో అనిపిస్తోంది. గుండెలో దడగా ఉంది.
మధ్యాహ్నం ఓ మడుగులో చిటికెన వేలంత చేప పిల్లలు రెండు దొరికాయి. నిజానికి అప్పటికి అతడిలో ఆకలి చచ్చి పోయింది. ప్రాణం నిలుపుకోడానికి ఏదో ఒకటి తినాలని వాటిని తినేశాడు. సాయంత్రం మరో మూడు చేపలు కూడా దొరికాయి. రెండు తిని,మరొకదాన్ని మరునాటికి దాచుకున్నాడు. ఆ స్థితిలో కూడా, ఆ రోజు పది మైళ్ళ దూరమూ, మరునాడు మరొక ఐదు మైళ్లు నడిచాడు. తనలాగే తన ఆకలి కూడా అలసి నిద్రపోతోంది కాబోలు నని అనిపించింది అతడికి.

మరునాడు నడక మొదలు పెట్టేముందు తన లెదర్ సంచిని విప్పి, అందులోంచి పసుపు రంగులో ఉన్న బంగారు పొడిని కుమ్మరించాడు. దాన్నిరెండు భాగాలుగా చేసి, ఒకదాన్ని దుప్పటి ముక్కలో కట్టి రాళ్ల మధ్యన దాచాడు. మరొక సగాన్ని మళ్లీ సంచిలో నింపాడు.

దాచిన తూటాలు దొరుకుతాయన్న ఆశతో ఖాళీ తుపాకీని ఇంకా మోస్తూనే ఉన్నాడు. మరునాటికి మళ్లీ ఆకలి నిద్ర లేచింది. కళ్లుతిరిగి కిందపడిపోయిన అతడు, లేచి చూసే సరికి పక్కనే ఒక పక్షి గూడు కనబడింది. నిన్ననే పుట్టిన నాలుగు చిన్న పిల్లలు ఉన్నాయి దానిలో. ఆత్రంగా వాటిని నోట్లో వేసుకుని కరకరా నమిలేసాడు. అది చూసిన తల్లి పక్షి కోపంగా అతడి మీదికి దూసుకొచ్చింది. తుపాకితో, రాళ్లతో దాన్ని తరిమాడు. ఒక రాయి తగిలి దాని రెక్క ఒకటి విరిగింది. అలాగే ఈడ్చుకుంటూ వెళ్లి రాళ్ల మధ్యన దూరి మాయమైంది.

అతడి కళ్ళ మీదికి మగత కమ్ముకుని వస్తోంది. బలవంతాన మెలకువ తెచ్చుకుంటూ పక్షిని వెదుకుతుండగా తడి నేలపై ఎవరివో అడుగు జాడలు కనబడ్డాయి. బిల్ వే అయి ఉండాలని అనిపించింది కానీ, ముందు పక్షిని పట్టుకోవాలి. ఈ అడుగుల సంగతి తర్వాత చూడొచ్చు.

పక్షిని తరమటంలో దాంతోబాటు అతడూ బాగా అలిసిపోయాడు. పది అడుగుల దూరంలో ఉన్న పక్షిని పట్టుకోబోతూ కుప్పకూలి పోయాడు. కాస్త ఓపిక చిక్కి ముందుకు జరుగుతుంటే అది మరింత దూరం పోతోంది. చీకటి చిక్కబడి పక్షి ఎటో మాయం కావడంతో, ఆ వేట కార్యక్రమం ముగిసింది. అలాగే నేలపై పడి, తెల్లారేదాకా నిద్ర పోయాడు.

మరునాడు కూడా ఎండ సరిగ్గా రాలేదు. బిల్ అడుగు జాడలు మళ్లీ ఎక్కడా కనబడ లేదు. తనలాగే అతడు కూడా దారి తప్పాడేమో! ఒక్కొక్క అడుగు వేస్తుంటే భుజం మీది సంచి బరువు మరింత పెరుగుతూ ఉన్నట్టు తోస్తోంది. సంచి విప్పి, ఉన్న బంగారంలో సగం పారేశాడు. సాయంత్రానికి మిగిలిన దాన్ని కూడా పారెయ్యక తప్పలేదు. ఇక, సగం చిరిగిన దుప్పటీ, ఒక గిన్నె, తుపాకీ మాత్రమే మిగిలాయి.

అతడి మెదడును ఏదో భ్రాంతి ఆవరిస్తోంది. అర్థం లేని ఆలోచనలు వస్తున్నాయి. తన తుపాకి లో తూటాలు వున్నాయని పదే పదే అనిపిస్తోంది. ఆ ఊహల వత్తిడిని తట్టుకోలేక తుపాకీని విప్పి చూస్తే, అది ఖాళీగానే ఉంది.

ఇంకాసేపటికి తన ముందొక నల్లటి గుర్రం నిలబడినట్టుగా తోచింది. ఆశ్చర్యంతో కళ్ళు నులుముకుని చూశాడు. గోధుమ రంగులో ఉన్న పెద్ద ఎలుగుబంటి అతడినే చూస్తూ ఉంది. చటుక్కున తుపాకి గురిపెట్టాడు. అది ఖాళీదని గుర్తొచ్చి, ఒరలోంచి వేట కత్తిని తీశాడు. తిండి తప్ప మరొక ధ్యాస లేదు అతడిలో. అమాంతంగా దానిమీద పడి పొడవాలని అతడి ఆలోచన!

తను ఎంతటి దుస్సాహసానికి తలపడుతున్నాడో హఠాత్తుగా గుర్తొచ్చి, భయంతో వణికి పోయాడు! అది ఎదురు తిరిగితే! వెంట తరిమితే! నిశ్చేష్టుడై కళ్ళప్పగించి చూస్తుండి పోయాడు. ఎలుగుబంటి అరిచిన అరుపు కూడా అతణ్ణి కదిలించనంతగా కొయ్యబారి పోయాడు. అది దూరంగా వెళ్లి పోయాక నేలపై కూలి పోయాడు.

అతడికి ఇప్పుడు ఆకలితో చస్తాననే భయంకంటే ఏ జంతువు నోట్లో పడి చచ్చిపోతానో ననే భయం ఎక్కువయింది. మైదానంలో వినబడుతున్న తోడేళ్ళ అరుపులు ఆ భయాన్ని పెంచుతున్నాయి. రెండేసి,
మూడేసి తోడేళ్ళు కలిసి వెళ్తూ కనబడుతున్నాయి. అయితే అవి పెద్ద గుంపులుగా లేనందువల్లనో ,లేక ఈ రెండు కాళ్ళ జంతువేదో తమ మీద పడి కరుస్తుందన్న భయం వల్లనోగానీ… అతన్ని ఏమీ చెయ్యటం లేదు.

ఆ మధ్యాహ్నం ఒకచోట కొన్ని ఎముకలు కనబడ్డాయి. ఏదో జంతువును తోడేళ్ళు అప్పుడే చంపి తిన్నట్టుంది. ఆ ఎముకలు ఇంకా తాజాగా గులాబీ రంగులోనే వున్నాయి. అతడు అక్కడే కూలబడి ఒక ఎముకను నోట్లో పెట్టుకున్నాడు. తియ్యని మాంసపు వాసన మత్తుగా ఉంది. వాటిని కరకరా నమిలాడు. వాటి గట్టిదనానికి అతడి పళ్లు విరిగి పోతున్నాయి. రాయి తీసుకుని వాటిని ముక్కలుగా విరగ్గొట్టి నోట్లో వేసుకుని నములుతున్నాడు. వేళ్ళు నలిగి రక్తం కారుతున్నా అతడికి తెలీటమే లేదు. మరికొన్ని ఎముకలను ఏరుకుని, మళ్లీ నడక సాగించాడు. బతకాలనే కోరిక ఇచ్చిన శక్తితో ముందుకు నడుస్తూ, ఓపిక సన్నగిల్లితే కూలబడుతూ, మంచు కురుస్తున్న ఆ మైదానంలో రాత్రింబవళ్లు నడుస్తూనే ఉన్నాడు.

*

వెచ్చటి సూర్య కిరణాలు స్నేహపూర్వకంగా స్పృశిస్తుంటే ఆ ఉదయం కళ్లు విప్పాడతడు. పడుకున్న రాతి మీదనే పక్కకు తిరిగి చూసేసరికి, ఆ ప్రదేశానికి కింది భాగాన విశాలమైన నది ప్రవహిస్తూ ఉండటం కనబడింది. ఆశ్చర్యాన్ని ఆపుకుని మరింత పరిశీలనగా చూసాడు. ఆ నది కొంత దూరం వెళ్ళాక దూరంగా మెరుస్తున్న సముద్రంలో కలిసి పోతూ ఉండటం కూడా కనబడుతోంది.

అదంతా తన మనసు కల్పిస్తున్న భ్రాంతి, అనుకుంటూ కళ్ళుమూసుకున్నాడు. కాసేపటి తర్వాత కళ్ళు తెరిచి చూస్తే సముద్రమేగాక, అందులో ఒక నావ కూడా కనబడుతోంది. తన కళ్ళను తాను నమ్మలేక పోయాడు.

ఇంతలో ఎవరో దగ్గుతున్న చప్పుడు వినబడింది వెనకనుంచి. పక్కకు తిరిగి చూస్తే అక్కడ ఏమీ లేదు.
కాసేపట్లో మళ్లీ అదే శబ్దంతోబాటు రాళ్ల నడుమన ఒక తోడేలు తల కనబడింది. దాని కళ్ళు నిస్తేజంగా ఉన్నాయ్. తల ముందుకు వేలాడుతూ ఉంది. అది జబ్బు పడినట్టుగా ఉంది. రెండో వైపుకు తిరిగి చూస్తే, అక్కడ సముద్రం, అందులో ఓడా అలాగే ఉన్నాయ్. తను భ్రమ పడటం లేదని ఇప్పుడు నమ్మకం కుదిరింది.

స్థిమితంగా కళ్లు మూసుకుని, ఆ ప్రదేశాన్ని గుర్తుకు తెచ్చుకునే ప్రయత్నం చేశాడు. తను ఉత్తర దిశగా నడుస్తూ – డియాజ్ నది పాయ ఒకటి కాపర్ మైన్ మైదానంలో ప్రవేశించే ప్రదేశం నుండి దూరంగా వచ్చినట్టున్నాడు. ఆ కనబడేది ఆర్కిటిక్ సముద్రం అయ్యుంటుంది. మెకంజీ నది నుండి ఉత్తరానికి చేపలు పట్టే పడవలు వెళ్తూ ఉంటాయి. ఈ నావ అలాంటిదే అయి ఉండాలి.

లేచి కూర్చుని, ఇప్పుడు ఏం చెయ్యాలో ఆలోచన మొదలు పెట్టాడు. కాళ్ళకు చుట్టుకున్న దుప్పటి పీలికలు చిరిగి పోయి, పాదాలు ఏవో ఆకారం లేని మాంసపు ముద్దల్లా తయారయ్యాయి. చొక్కా కింద దాచుకున్న అగ్గి పుల్లలు తప్ప, మిగతా వస్తువులన్నీ ఎక్కడో పోయాయి.

గడియారాన్ని మాత్రం భద్రంగా కాపాడుకుంటూ వస్తున్నాడు. ఇప్పుడు పదకొండు గంటలైంది. వేసుకున్న
ప్యాంట్ ను మోకాళ్ల దాకా చింపి, ఆ ముక్కలను పాదాలకు చుట్టుకున్నాడు. ఆ ఓడ దాకా నడిచేందుకు కాళ్లలో సత్తువ లేదు. మోకాళ్లపై పాకుతూ ముందుకు సాగాడు. అతడి వెనకాలే ఆ రోగిష్టి తోడేలు కూడా శరీరాన్ని ఈడ్చుకుంటూ వస్తోంది. ముఖాన్ని నాలుకతో తడుపుకుంటూ ఉందది. దాని నాలుక సహజంగా లేదు. పసుపు రంగులో ఎండి అట్టకట్టుకు పోయి ఉంది. అతి కష్టం మీద లేచి నిలబడ్డాడు అతడు. కానీ ప్రతి రెండు అడుగులకూ ఆగుతూ నడవాల్సి వస్తోంది. వెనకాల నడుస్తున్న తోడేలు పరిస్థితి కూడా అలాగే ఉంది. రాత్రి చిక్కబడటం వల్ల సముద్రం కనబడటం లేదు.

ఆ రాత్రంతా రోగిష్టి తోడేలు దగ్గూ, కారిబూల అరుపులు విన్పిస్తూనే వున్నాయి. ఈ మనిషి తనకన్నా ముందు చావక పోతాడా అనే ఆశతో ఆ తోడేలు తన వెంట వస్తోందని అతడికి అర్థమైంది. ఆ రోజు బాగా ఎండ కాసింది. ఆ మధ్యాహ్నం అతనికి, దూరంగా బాటపై మోకాళ్ళతో పాకుతూ వెళ్తున్న ఒక మనిషి స్పష్టంగా కనబడ్డాడు. బిల్ అయ్యుండొచ్చునని అనిపించింది. కానీ అతడు ఇప్పుడు దేన్నీ పట్టించుకునే స్థితిలో లేడు. బతకాలనే ఆశ ఒక్కటే అతణ్ణి నడిపిస్తోంది.

దొరికిన బెర్రీలు, చేపలూ తింటూ పోతూనే ఉన్నాడు. తోడేలును ఒక కంట కనిపెట్టడం మాత్రం మరచిపోవటం లేదు. ముందు వెళ్లిన మనిషి తాలూకు అడుగు జాడలను అనుసరిస్తూ ఆ బాట చివరి దాకా చేరాక, అక్కడ తోడేళ్ళు చంపి తిన్న ఏదో జంతువు ఎముకలు కనిపించాయి.

అక్కడ సరిగ్గా తన లెదర్ సంచి వంటిదే పడి ఉంది. అది బిల్ దేనని గుర్తుపట్టాడు. పైకి ఎత్తుదామని ప్రయత్నం చేసి సాధ్యం కాక వదిలేశాడు. అది చాలా బరువుగా ఉంది. బిల్ చివరి క్షణం వరకూ దాన్ని వెంట తెచ్చుకున్నాడన్నమాట! ఇప్పుడది తనకు దొరికింది!

గట్టిగా నవ్వొచ్చింది అతడికి. ఆ నవ్వు ఏమాత్రం మనిషి నవ్వులాగా లేదు. అతడి నవ్వు ఆగి పోయింది. ఆ ఎముకలు బిల్ వేనా? అతడికి అలా జరిగితే తనెలా నవ్వగలుగుతున్నాడు? బిల్, తనను మోసం చేసి వెళ్దామని అనుకున్నాడు. ఐనా సరే, అతడి బంగారాన్ని తీసుకోవటం కానీ, ఆ ఎముకలు తినటం కానీ చెయ్యకూడదని నిశ్చయించుకొని ముందుకు నడిచాడు.

దారిలోని ఒక నీటి మడుగు దగ్గర చేపల కోసం ఆగినప్పుడు నీళ్లలో తన ముఖం చూసుకుంటే భయం వేసింది. అక్కడ మూడు చేపలు దొరికాయి. ఆ తర్వాత రెండు రోజుల్లో మరొక ఐదు మైళ్లు నడవ గలిగాడు. అలా ఐదు రోజులు నడిచాక, సముద్రానికి ఎంత దూరంలో ఉన్నదీ అంచనా వేసుకున్నాడు. ఇంకా ఏడు మైళ్లు నడిస్తే కానీ అక్కడికి చేరటం సాధ్యం కాదు.

అప్పటికే వేసవి కాలం మొదలైంది. రోజుకు మైలు దూరం కన్నా నడవటం కష్టంగా ఉంది. పాకుతూ పోతుంటే మోకాళ్లు రక్తసిక్తమై, బాటంతా నెత్తుటి మరకలతో ఎర్రగా మారుతోంది. మధ్యలో వెనక్కి తిరిగి చూస్తే గుండె ఆగినంత పనైంది. దారిలో కారిన అతడి రక్తాన్ని నాకుతూ, ఆ తోడేలు వెనకాలే వస్తోంది. దాన్ని ఎలాగైనా చంపకపోతే తన ప్రాణాలు దక్కవు!

చావుబతుకుల్లో ఉన్న ఆ రెండు జీవులూ ఒకదాన్నొకటి వేటాడుకుంటున్న అతి జుగుప్సాకరమైన స్థితి!
ఓడకూ, అతనికీ నడుమ దూరం ఇప్పుడు నాలుగు మైళ్ళకన్నా ఎక్కువేమీ లేదు. తెరచాప కూడా స్పష్టంగా కనబడుతోంది. కానీ, తను ఇంకో అరమైలుకన్నా ఎక్కువ దూరం వెళ్ళలేనని తెలుస్తోంది.
అతడిలోని బతుకుతీపి చావుకు ఎదురు తిరుగుతోంది!

కమ్ముకొస్తున్న మగత నుండి బయట పడేందుకు శక్తికి మించిన పోరాటం చేస్తున్నాడు. అడుగు ముందుకు వేయలేక ఒక రాతిపై పడుకున్నాడు. శక్తిని కూడగట్టుకునేందుకు ప్రయత్నం చేస్తుంటే, చెవి పక్కనే తోడేలు శ్వాస వినబడింది. కళ్ళు తెరిచి చూసిన ఆతడు, దాని నాలుక తన ముఖానికి దగ్గరగా వస్తూంటే భయంతో బిగుసుకు పోయాడు.

నిద్రా, మెలకువా కాని స్థితిలో పడున్న అతడికి, తన చేతిపై తోడేలు నాలుక కదులుతున్న స్పర్శకు పూర్తిగా మెలకువ వచ్చింది. దాని పళ్ళు అతడి అరచేతిలోకి మెల్లిగా దిగబడుతున్నాయి. అరచేతిని అలాగే దాని మూతి చుట్టూ బిగించాడు. అది గిలగిలా కొట్టుకుంది. రెండో చేతిని దాని శరీరం మీదుగా వేసి బిగించి పట్టుకున్నాడు.

ఐదు నిమిషాల తర్వాత అతడి శరీరం మొత్తం దాని మీద పడివుంది. తోడేలు గొంతు నులిమి వేసేంత శక్తి అతడి చేతుల్లో లేదు, కానీ అతడి ముఖం దాన్ని కంఠం దగ్గర బలంగా అదుముతోంది. దాని బొచ్చు అతడి నోటి నిండా నిండిపోయింది. మరొక అరగంట తర్వాత – తన గొంతులోకి వేడిగా, వెగటుగా, కరిగించిన లోహంలా రక్తపు బొట్లు జారుతూ ఉండటం అతడికి తెలిసింది. ఆ తర్వాత ఏమైందో అతడి ఎరుకలో లేదు – పక్కకు దొర్లి పడిన అతడి దేహం మగతలోకి జారుకుంది.

*

“బెడ్ ఫోర్ట్” అనే నావలో ప్రయాణిస్తున్న శాస్త్రజ్ఞులు కొందరు డెక్ మీద నిలబడి ఉండగా సముద్రపు ఒడ్డున ఏదో చిత్రమైన ఆకారం వాళ్లకు కనబడింది. అది అలలతో బాటుగా ఇసుకలో అటూ ఇటూ దొర్లుకుంటూ పోతోంది. అది ఏమై ఉంటుందో వాళ్లకు ఎంతకూ అంతుబట్టటం లేదు. వృత్తిపరమైన ఆసక్తితో
ఒక చిన్న పడవ తీసుకుని ఒడ్డుకు బయల్దేరారు.

వాళ్ళు చూసిన ఆ ఆకారానికి ప్రాణమైతే ఉంది. కానీ కళ్ళు కనబడటం లేదు. పరిసరాలను గుర్తించ గలిగే స్థితి కూడా దానికి లేదు. ఆ పరిస్థితిలో సైతం ఆ శరీరం, గంటకు ఇరవై అడుగుల చొప్పున దొర్లుకుంటూ పోతోంది. దాన్నొక మనిషి శరీరంగా గుర్తుపట్టడం వాళ్లకు చాలా కష్టమే అయింది.

*

మూడు వారాల తర్వాత – ఓడలో పడక మీద పడుకుని ఉన్న ఆ మనిషి, కన్నీళ్లు ధారలు కడుతుండగా తన అనుభవాలను వివరించి చెప్పాడు – కాలిఫోర్నియాలో ఉన్న తన తల్లిని గురించీ, చుట్టూ పూల మొక్కలతో ఉండే తన చిన్న ఇంటిని గురించీ కూడా పొంతన లేకుండా ఏవో మాటలు చెప్పాడు.

తర్వాత కొద్ది రోజుల్లోనే అతడి పరిస్థితి చాలా మెరుగు పడింది. అందరితో కలిసి టేబుల్ ముందు కూర్చుని భోజనం చెయ్యగలుగుతున్నాడు. పెద్ద మొత్తంలో ఆహార పదార్థాలను చూస్తే అతడికి ఎక్కడ లేని సంతోషం. అవి మనుషుల నోళ్ళలోకి వెళ్లి పోవటాన్ని జాగ్రత్తగా గమనిస్తూ ఉంటాడు. ఎదుటి వాళ్ళ
నోళ్ళ లోకి ఒక్కొక్క ముద్దా వెళ్లి పోతుంటే అతడి కళ్ళు విచారంగా మారిపోతాయి.

అతడు పిచ్చివాడేమీ కాదు. రోజంతా మామూలుగానే ఉంటాడు. కానీ, భోజనాల సమయంలో మాత్రం చిత్రంగా ప్రవర్తిస్తాడు. అప్పుడు అతడికి అందరిమీదా చాలా కోపంగా ఉంటుంది. ఆహారం మొత్తం అయిపోతోందని కంగారు పడుతూ, వంటాయననూ, కాబిన్ బోయ్ నీ, కెప్టెన్ నూ, భోజన వ్యవహారాలు చూసే సిబ్బంది అందరినీ పదే పదే విచారిస్తూ ఉంటాడు. వాళ్ళు ఎంత చెప్పినా సరే,వంటగది లోకి స్వయంగా వెళ్లి చూసిందాకా అతడికి నమ్మకమే కలగదు.

*

రోజులు ఇలా గడుస్తూ ఉండగా – ఆ మనిషి హఠాత్తుగా బాగా లావెక్కి పోయాడు. అతడి శరీరం నానాటికీ పెరిగిపోతోంది. సైంటిస్ట్ లు అందరూ ఆ వ్యాధి గురించి చర్చించుకుని అతడికి ఇచ్చే ఆహారం పరిమాణాన్ని బాగా తగ్గించి వేశారు. ఐనా, అతడలా లావు పెరుగుతూనే ఉన్నాడు.

అసలు రహస్యం తెలిసింది నావికులకు మాత్రమే! వాళ్ళు ఇదంతా చూసి నవ్వుకుంటూ ఉండేవాళ్ళు. ప్రతి రోజూ ఉదయం అతడు వాళ్ల దగ్గరకు వెళ్లి చెయ్యి చాపి నిలబడతాడు. వాళ్ళు తలొక రొట్టె ముక్కా ఇస్తారు.
అతడు వాటిని ఎంతో అపురూపంగా, బంగారంలా చూసుకుంటూ చొక్కా వెనకాల దాచేసుకుంటాడు.

ఈ రహస్యం మెల్లిగా సైంటిస్టుల చెవిన పడింది. వాళ్ళు అతడిని ఏమీ అడగకుండా రహస్యంగా గమనించ సాగారు. అతడి చొక్కా వెనకాలే కాదు, పడుకునే పరుపులో కూడా అంగుళమైనా సందు లేకుండా రొట్టె ముక్కలు కూరిపెట్టి ఉన్నాయి.

ఇదంతా చూసి, అతడిని పిచ్చివాడని ఎవరైనా అనుకుంటే మాత్రం పొరబాటు పడ్డారన్న మాటే! మళ్లీ కరువు కాలం వస్తుందేమోనని అతడు జాగ్రత్త పడుతున్నాడు – అంతే!

అతడి జబ్బు త్వరలోనే తగ్గి పోతుందని చెప్పారు ఆ శాస్త్రజ్ఞులు. ఓడ, శాన్ ఫ్రాన్సిస్కో నగరానికి చేరే లోగా నిజంగానే తగ్గిపోయింది కూడా!

నెల్లూరు జిల్లాలో పుట్టి పెరిగారు. ప్రస్తుతం హైదరాబాద్ లో నివాసం. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో తెలుగు సాహిత్యంలో పిఎచ్.డి చేశారు. సాహిత్యం, సామాజిక శాస్త్రాల అధ్యయనంలో, ముఖ్యంగా సాహిత్య విమర్శలో ఆసక్తి. మిత్రులతో కలిసి "చూపు" పత్రికను కొంతకాలం నిర్వహించారు. సాహిత్య, సాహిత్యేతర గ్రంథాల అనువాదం, రచన వంటి అంశాల్లో కృషి చేస్తున్నారు.

Leave a Reply