యుద్ధ విధ్వంసాన్ని చిత్రించిన పాలస్తీనా చిత్రం “ఫర్హా”

మనిషిలోని స్వార్ధం సృష్టించిన భీభత్సం యుద్ధం. అది మానవ జీవితాలను కబళించి వేస్తుంది. చాలా మందికి అకాల మరణాన్ని అందిస్తే ఆ మరణాన్నితప్పించుకున్న వ్యక్తుల మనసులపై మానవ నైజం, మానవత్వం గురించి ఎన్నో అనుమానాలను రేకెత్తిస్తుంది. అయినా సృష్టిలో ప్రతి ప్రాణి జీవించడం కోసం పోరాడుతుంది. అందులో మనిషి మినహాయింపు కాదు. యుద్ధ కాల పరిస్థితులు, వాటిని ఎదుర్కున్న జీవితాల గురించి ఎన్నో కథలు చదివాం. ఎన్నో సినిమాలను చూసాం. కాని యుద్ధానికి బలయిన ప్రతి జీవిత కథ ఓ కొత్త విషాద వీచిక లాగే అనిపిస్తూ ఉంటుంది. ఇప్పటికీ ఎన్నో దేశాల మధ్య ఎందరో మానవులు యుద్ధ వాతావరణంలో తల్లడిల్లుతూ మానవ విలువలు, మనవత్వం గురించి ఆశపడుతూ జీవిస్తూ కనిపిస్తారు. అలాంటి సంక్షోభ స్థితిని ఓ చిన్న అమ్మాయి అనుభవించి, దాటిన ఓ కథతో వచ్చిన సినిమా ‘ఫర్హా’. పాలస్థీనియన్ అరబిక్ భాషలో 2021లో వచ్చిన సినిమా ఇది.

1948లో పాలస్తీనాలోని యుద్దభీభత్సాన్ని‘నక్బా’గా చరిత్రకారులు చెబుతారు. ఆ సమయంలో పెద్ద సంఖ్యలో పాలస్తీనా అరబ్బులు తమ ఇళ్ళను, దేశాన్ని వదిలి వెళ్ళిపోవలసి వచ్చింది. ఆ నాటి క్రూరత్వాన్ని ప్రపంచం తెలియని ఓ చిన్న అమ్మాయి కళ్ళతో చూపిస్తూ విధ్వంసానికి గురయిన పాలస్తీనా జాతి కష్టాన్ని, వారిపై జరిగిన ఘోరాలను ఈ చిత్రం తెలియజేస్తుంది. ముఖ్యంగా పిల్లల దృష్టికోణంతో యుద్ధ వాతావరణాన్ని చూపించిన విధానం ఆకట్టుకుంటుంది.

ఇటువంటి నేపథ్యంలోనే “అనీ ప్రాంక్” కథ నిలుస్తుంది. “పర్హా” కూడా నిజ జీవిత గాధ ఆధారంగా నిర్మించుకున్న కథే. నిజ జీవితంలో రాదియా అనే పాలస్తానీ అమ్మాయి కథ ఇది. తన జీవిత కథను ఆమె ఈ చిత్ర దర్శకురాలైన దారిన్.జే.సల్లాం అమ్మకు చెప్పిందట. 1948లో పాలిస్తాన్ నుండి సల్లాం కుటుంబం జార్డన్ కు తరలి వెళ్ళారు. సిరియా కాంపులో రిఫ్యూజీగా అప్పుడు ఉంటున్న రాదియా తన కథను సల్లాం తల్లికి వినిపించిందట. చిన్నప్పటి నుండి మనసును అంటి పెట్టుకుని ఉన్న ఆమె కథనే సల్లాం ఈ సినిమాకు తీసుకున్నారు. పాలస్తీనా నుండి జార్డన్ పారిపోయి వచ్చిన ఎందరినో ఈ కథ కదిలించి, వారి కుటుంబాల చరిత్రను, విషాద గాధలను వెలికితీసుకువచ్చింది.

పాలస్తీనాలోని ఓ చిన్న పల్లెటూరిలో పద్నాలుగు పదెహేను ఏళ్ల వయసున్న ఆడపిల్లలు ఆనందంగా ఆడుకుంటూ ఉన్నారు. వారి మధ్య పుస్తకం పట్టుకుని కూర్చుని ఉంటుంది ఫర్హా. ఆమెకు చదువుకోవాలని కోరిక. ఆమె స్నేహితులందరూ పెళ్ళికి సిద్దపడుతున్నా, సిటీకి వెళ్ళి చదువుకోవాలనే కోరికతో ఉంటుంది “పర్హా”. ఫర్హా తండ్రి ఆ ఊరి పెద్ద. వీరి బంధువులు నగరంలో ఉంటారు. పర్హా స్నేహితురాలు ఫరీదా పట్నంలో చదువుకుంటూ ఉంటుంది. మొత్తానికి తండ్రిని ఒప్పించి స్కూలులో అడ్మిషన్ పొందడానికి అనుమతి సంపాదిస్తుంది ఫర్హా. ఆ ఊరి మత పెద్ద అమ్మాయిలకు ఖురాన్ చదవడం వస్తే చాలని చెప్పినా గణీతం ఇంగ్లీషు, సైన్సు ఇలా ఎన్నో విషయలు ఉన్నాయని ఖఉరాన్ ఒక్కటే చదువు కాదని అతన్నీ ఎదిరిస్తుంది ఫర్హా. ఆమెను వివాహం చేసుకోవడానికి సమీప బంధువు కూడా ఇష్టం కనబరుస్తాడు. అయినా కూతురు మనసు తెలుసుకున్న తండ్రి అమెను చదివించడానికి సిటీకి పంపడానికి సిద్దపడతాడు. ఈ లోపే యుద్ధ తీవ్రత పెరుగుతుంది. ఊర్లనుండి ఎందరినో తరిమివేస్తున్నారు ఇజ్రాయిల్ సైనికులు. ఫర్హా తండ్రిని
సైన్యంలో చేరమని పక్క ఊరి వారు కోరతారు. కాని ప్రస్తుతం ఆ అవసరం లేదని, అవసరం వచ్చినప్పుడు ఆయుధం పట్టడానికి తాను వెనుకాడనని బదులిస్తాడు ఫర్హా తండ్రి. అతనికి తమ ఊరి నుండి తమను గెంటి వేసే పరిస్థితులు వస్తాయని అనిపించదు. పర్హా ఆమె స్నేహితురాలు ఫరీదా కలిసి ఊరి బైట తోటలో తమ భవిష్యత్తు గురించి మాట్లాడుకుంటూ ఉన్న సమయంలోనే తుపాకుల శబ్దం వినిపిస్తుంది. పరుగెత్తుకుంటూ ఊరు చేరిన వారికి ప్రాణం అరచేతిలో పెట్టుకుని పరుగెత్తుతున్న ఊరి వాళ్ళు వారి మధ్య ఇజ్రాయిల్ సైనికులు కనిపిస్తారు.

ఫరిదా తల్లీ తండ్రీ కారులో సిటీవైపుకు వెళుతూ ఫర్హాని తమ కారులో ఎక్కించుకుంటారు. ఆమె తండ్రి కూడా వారితో వెళ్ళిపొమ్మని కూతురికి చెబుతాడు. కాని అంతటి అల్లకల్లోలం మధ్య అయోమయంగా ఒంటరిగా నిలబడిన తండ్రిని వదిలి వెళ్ళాలని ఫర్హాకి అనిపించదు. ఆమె కారు దిగి తండ్రి దగ్గరకు పరుగెడుతుంది. ఆమె మొండితనం తెలిసిన తండ్రి ఆమెను దగ్గరకు తీసుకుంటూనే ఫరీదా కుటుంబంతో ఆమె వెళ్లిపోతే బావుండేదని చెబుతాడు. ఇంటికి వచ్చాక ఆమె తండ్రి ఆమెను మూలకున్న ఓ స్టోరు రూంలో పెట్టి బైటి నుండి చెక్క కొట్టేస్తాడు. పైగా తాను వస్తానని అప్పటి దాకా ఆ గది దాటి రావద్దని చెప్పి తుపాకి పట్టుకుని ఊరిలోకి వెళ్ళిపోతాడు. నువ్వు కూడా నాతో ఇక్కడే ఉండు అన్న ఫర్హాతో ఇప్పుడు ఊరివారికి తన అవసరం ఉంది అని వెళ్ళిపోతాడు ఊరి జనం పట్ల భాద్యత తెలిసిన ఆ ఊరి పెద్ద. ఆ గదిలో ఎన్నో రోజులు ఒంటరిగా ఉండిపోతుంది ఫర్హా. ఓ చిన్నరంద్రం నుండి ఆమెకు బైటి ప్రపంచం కనిపిస్తూ ఉంటుంది. పక్క ఊరి నుండి ఓ కుటుంబం ఆ ఇంటిలోకి తలదాచుకోవడానికి వస్తుంది. ఆ ఇంట్లో ఫర్హా చూస్తూ ఉండగానే ఆ కుటుంబంలోని స్త్రీ మగ బిడ్డను కంటుంది. ఆమెకు భర్తే తోడుగా ఉంటాడు. ఇద్దరు చిన్న ఆడపిల్లలతో వచ్చిన ఆ భార్యా భర్తలు ఇప్పుడు మరో కొత్త ప్రాణితో ఆ ఇల్లు దాటి వెల్లలేకపోతారు. అక్కడే విశ్రాంతి తీసుకుందాం అనుకుంటారు. వారిని చూసి ఫర్హా ఆ మగవ్యక్తిని పిలిచి తనను బైటికి తీయమని అడుగుతుంది. అతను ప్రయత్నించేలోపే సైనికులు ఆ ఇంటిలోకి వస్తారు. ఆ ఉరి వ్యక్తిని బెదిరించి తమతో తీసుకుని వస్తారు. అతను ఆ కుటుంబన్ని రక్షించాలనుకున్నా ఆ సైనికులు భార్యను, పిల్లలను, భర్తను తుపాకితో కాల్చి చంపేస్తారు. పైగా ఓ సైనికుడితో పుట్టిన చిన్న బిడ్డను కాలితో నలిపి చంపివేయమని, బుల్లెట్ ఖర్చు చేయవద్దని చెప్పి వెళ్ళిపోతాడు ఆ దళ పెద్ద. ఇదంతా తలుపు రంధ్రం గుండా చూస్తుంది ఫర్హా. ఆ ఊరి వ్యక్తి తలుపు అవతల ఫర్హా ఉందని కనిపెట్టినా గమ్మున వెళ్లిపోతాడు. అమె ఉనికి తెలిస్తే ఆమెనూ సైనికులు చంపేస్తారని అతనికి తెలుసు. ఆ చంటి బిడ్డను కాలితో తొక్కి చంపలేక ఓ రుమాలు ఆ బిడ్డ మొహం పై కప్పి వెళ్ళిపోతాడు ఆ సైనికుడు. బిడ్డ ఏడుపు వింటూ ఫర్హా ఆ గది దాటి రావాలని ఎన్నో విధాల ప్రయత్నిస్తుంది. కాని కుదరదు. బిడ్డ గొంతు ఆగిపోతుంది. తెల్లారు జామున పప్పుదినుసులున్న గోతాంలో ఓ చిన్న తుపాకి దొరుకుతుంది ఫర్హాకి. బుల్లెట్లు కూడా అక్కడే ఉంటాయి. అవసరం అన్నీ నేర్పిస్తుంది అన్నట్లుగానే ఆమె కొద్ది సేపు ప్రయత్నించి తుపాకిని లోడ్ చేస్తుంది. తలుపును కాల్చి ఆ గదిలోనుండి బైటకు వస్తుంది. కాని అప్పటికి ఆ చిన్న బిడ్డ చనిపోయి ఉంటాడు. ఆ భయంకర అనుభవాలతో ఒంటరిగా నడుచుకుంటూ సిటీ వైపుకు వెళ్ళిపోతుంది ఫర్హా. ఆ గదిలో ఉండగానే ఆమెకు మొదటి నెలసరి వస్తుంది. బాల్యం నుండి కౌమార దశలోకి ప్రవేశిస్తూ ఆ గదిలో ఆమె పొందిన అనుభవాలు ఆమెను మానసికంగా పూర్తిగా మార్చివేస్తాయి.

పర్హా తండ్రి ఆచూకి ఆమెకు ఎప్పటికీ దొరకలేదు. అతను మరణించి ఉండవచ్చని అంటూ ఆమె కథను ముగిస్తారు దర్శకులు. సమాజంలోని ఎన్నో అంక్షలతో యుద్ధం చేస్తూ విద్యను అభ్యసించాలనే ఓ చిన్న కోరికతో జీవిస్తున్న ఫర్హా జీవితాన్ని యుద్ధం అతలాకుతలం చేస్తుంది. పెద్దయిన తరువాత టీచర్ అయి అదే ఊరిలో ఆడపిల్లలకు స్కూలు నిర్మించాలని కలలు కనే ఓ అమ్మాయి జీవితాన్ని చిందర వందర చేస్తుంది యుద్ధం. ఆమెను అనాధను చేస్తూ మనుష్యుల పట్ల, మానవత్వం పట్ల విశ్వాసం నశింపజేసే దశకు చేరుస్తుంది. ఇలాంటి ఫర్హాలు ఎంతమంది యుద్ధ మతోన్మాదానికి మానసికంగా బలయ్యారో తలచుకుంటే ప్రపంచంలోని కీర్తి దాహాం, మనిషి స్వార్థం పట్ల అసహ్యం వేస్తుంది.

ఈ సినిమాకు దర్శకత్వం, స్క్రీన్ ప్లే దారిన్. జె. సాల్లెం నిర్వహిస్తే, ప్రధాన పాత్రలో కరమ్ తాహెర్ నటించింది. ఇది ఆమెకు మొదటి సినిమా అయినా ఏ మాత్రం తడబాటు లేకుండా పరిణితి గల నటనను ప్రదర్శించింది ఆమె. జార్డన్ లో చిత్రించబడిన ఈ చిత్రం ఇస్రాయిల్ లో కొంత ప్రతిఘటనను ఎదుర్కుంది. కాని ఎన్నో ఫిలిం ఫెస్టివెల్స్ లో ప్రదర్శనకు ఎంపికయ్యింది. యుద్ధం అనే ఇతివృత్తంపై ఎన్నో చిత్రాలు వచ్చినా ప్రపంచం తెలియని ఓ బాలిక కళ్ళతో యుద్ధ భీభత్సాన్ని చూపించడంలో చిత్ర యూనిట్ విజయం సాధించింది. మనసును కదిలించే ఈ సినిమా ప్రపంచ సినిమాను ఇష్టపడేవారు తప్పక చూడవలసిన చిత్రం.

పుట్టిన ఊరు సికింద్రాబాద్. రచయిత్రి, అధ్యాపకురాలు. హిందీ సాహిత్యంలో పీహెచ్డీ చేశారు. ఆసక్తి: పుస్తకాలు, సినిమాలు. తార్నాకలోని Spreading light అనే బుక్ క్లబ్ లో ఎనిమిదేళ్లుగా  ప్రతి శనివారం పుస్తక పరిచయాలు నిర్వహిస్తున్నారు. ఫేస్‌బుక్‌లో 'నచ్చిన పుస్తకం', 'నచ్చిన సినిమా' గ్రూపుల్లో 1000 పుస్తకాలు, 1500 పైగా సినిమాలను పరిచయం చేశారు. రైల్వే జూనియర్ కాలేజీ(తార్నాక)లో హిందీ లెక్చరర్ గా పనిచేస్తున్నారు.

 

 

 

Leave a Reply