ప్రొఫెసర్ సార్ జిలానీ చెదరని మానవత్వం

(ప్రొఫెసర్ సార్ జిలానీపై ‘ద కారవాన్ ’ పత్రికలో మార్తాండ్ కౌశిక్ ( సీనియర్ అసిస్టెంట్ ఎడిటర్ ) రాసిన వ్యాసానికి రమాసుందరి తెలుగు అనువాదం)

దాదాపు 11 సంవత్సరాల క్రితం, 2008లో ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థులు ‘మత విద్వేషం, ఫాసిజం- అలంకారప్రాయమైన ప్రజాస్వామ్యం, వాస్తవం’ అనే పేరుతో ఒక సెమినార్ నిర్వహించారు. యూనివర్సిటీలోని ఆర్ట్స్ ఉద్యోగుల భవనంలోని రూమ్ నంబర్ 22లో ఆ సెమినార్ జరిగింది. ఆనాటి స్పీకర్ సయ్యద్ అబ్దుల్ రెహ్మాన్ జిలానీ. (SAR Geelani) ఆయన ఒక కశ్మీరీ ముస్లిం ప్రొఫెసర్. ఢిల్లీ యూనివర్సిటీలో అరబిక్ భాషను బోధిస్తాడు.

అలాంటి విషయం మాట్లాడటానికి తగిన వారు దేశంలో చాలా తక్కువ మంది ఉన్నారు. అంతకు ముందు సంవత్సరం డిసంబర్ 22, 2002న జిలానీకి మరణ శిక్ష పడింది. భారత పార్లమెంట్ మీద జరిగినట్లుగా చెప్పిన దాడిలో అతనికి పాత్ర ఉందని చెబుతూ ఈ శిక్ష పడింది. కోర్టు తీర్పు ఇవ్వక ముందే నీచమైన మీడియా, దాని విచారణలో అతన్ని టెర్రరిస్టుగా ప్రకటించింది. కానీ తరువాత జరిగిన మూడు సంవత్సరాల కాలంలో ఢిల్లీ హై కోర్టు, సుప్రీం కోర్టులు అతన్ని అన్ని ఆరోపణల నుండి విముక్తి చేశాయి. ఆ సదస్సు సందర్భంగా జిలానీ- అణచివేత స్వభావం కలిగిన రాజ్య యంత్రాంగం, దాని మతద్వేషపూరిత నైపుణ్యపు చేతుల్లో తనపై వేధింపులు ఎలా జరిగాయో చెప్పబోతున్నాడు.

కొద్దిగా ఎత్తైన వేదిక మీద, ఒక పెద్ద డెస్క్ వెనకాల ఉపన్యాసకులు కూర్చోని ఉన్నారు. జిలానీ పక్కన 21 సంవత్సరాల ఉమర్ ఖలీడ్ కూర్చొని ఉన్నాడు. తరువాత కాలంలో – 2016లో జవహర్ లాల్ యూనివర్సిటీ వివాదంలో ఆయన మీద దేశద్రోహ కేసు పెట్టిన తరువాత, ఉమర్ ఖలీడ్ అందరి దృష్టిలోకి వచ్చాడు. ఇంకా ఆ వేదిక మీద ‘ద ట్రిబ్యూన్’ ఇప్పటి సంపాదకులు రామచంద్రన్ కూడా ఉన్నారు.

జిలానీ వేదిక మీద కూర్చున్న కొద్ది నిమిషాల్లో ఒక విద్యార్థి అతని డెస్కు దగ్గరకు వెళ్లి, అతనితో ఏదో మాట్లాడాలి అన్నట్లు అతని వైపు వంగాడు. జిలానీ కూడా వంగగానే ఆ విద్యార్థి- ఆర్ ఎస్ ఎస్ యువసంఘమైన ఏబీవీపీ సభ్యుడు- అతని మీద రెండు సార్లు ఉమ్మాడు. ప్రొఫెసర్ కొద్దిగా జంకాడు. కానీ మెల్లిగా కుర్చీలో వెనక్కి జరిగాడు.

ఇది ప్రణాళిక ప్రకారం జరిపిన అంతరాయమే. ఏబీవీపీ సభ్యులు ప్రేక్షకుల నుండి లేచి నిలబడి జిలానీనీ, ఇతర ఉపన్యాసకులనూ పెద్దగా దుర్భాషలాడటం మొదలు పెట్టారు. ఆ గొడవకు చెదరకుండా జిలానీ తన ఉపన్యాసం మొదలుపెట్టాడు. ఏబీవీపీ సభ్యులు తరువాత ఆ గదిని ధ్వంసం చేయటం మొదలు పెట్టారు. కొంతమంది ఉపన్యాసకుల మీద భౌతికంగా దాడి చేశారు. అప్పటి ఏబీవీపీ అధ్యక్షురాలు నూపుర్ శర్మ (ఈమె అప్పటికి భారతీయ జనతా పార్టీ తరుఫున, డిల్లీ ముఖ్య మంత్రి అరవింద్ కేజ్రివాల్ మీద పోటీ చేయబోతుంది) ప్రవేశించి, జిలానీ మాట్లాడరాదని ప్రకటించింది.

ఈ సంఘటన వీడియో ప్రెస్ కి చేరింది. ‘టైమ్స్ నౌ’ ద న్యూస్ అవర్ ను నిర్వహించే అర్నాబ్ గోస్వామి జిలానీని, నూపుర్ శర్మను తన షోకి ఆహ్వానించాడు. అప్పటికి గోస్వామి ఇంకా హిందూ జాతీయవాదిగా ప్రకటించుకోలేదు. ఆ పని 2014లో బీజేపీ మళ్లీ అధికారంలోకి వచ్చాకే జరిగింది.

‘ఇప్పుడు మనం ఢిల్లీ యూనివర్సిటీలో ఏమైతే జరిగిందో, ఆ అనాకారి ఫోటోలను చూద్దాం’ అని అర్నాబ్ గోస్వామి అన్నాడు. ‘ఒక విద్యార్ధి వచ్చి సార్ జిలానీ మీద ఉమ్మాడు. దేశం మొత్తం ఇక్కడ జరిగిన విషయానికి దిగ్భ్రమ చెందింది’ అని కూడా అన్నాడు.

జిలానీ అతని మీద వచ్చిన అన్ని ఆరోపణల నుండి బయటపడ్డాడు అని అర్నాబ్ గోస్వామి చాలా సార్లు ప్రస్తావించాడు. ‘మాజీ ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థిగా, ఈ రోజు ఉపయోగించిన ఈ భావ ప్రకటన పద్దతితో నేను భయోన్మాదానికి, దిగ్భ్రమకు గురి అయ్యాను’ అని అన్నాడు. ‘ఉమ్మిన పద్దతి ఎంత నీచంగా ఉందంటే, దాని గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది’ అని కూడా అన్నాడు. నూపుర్ శర్మను క్షమాపణ చెప్పమని అడిగాడు. అందుకు ఆమె ‘ఎందుకు చెప్పాలి’ అని ప్రతిస్పందించింది.

జిలానీకి మాట్లాడే అవకాశం చివరకు వచ్చినపుడు, నూపుర్ శర్మ న్యాయశాస్త్ర విద్యార్ధిని అన్న విషయాన్ని ఆశ్చర్యంతో గమనించాడు.

శర్మ ఎదురు తిరగటం మానలేదు. ‘నేను మీకు ఒక విషయం చెప్పనా! దేశమంతా అతని మీద ఉమ్మాలి. దేశమంతా అతని మీద ఉమ్మాలి’ అని అరిచింది.

ఆమె చదివి వచ్చిన యూనివర్సిటీ ప్రొఫెసర్ మీద, దేశమంతా ఉమ్ము వేయాలి అనే శర్మ నేరారోపణకు కావాల్సిన వాతావరణం కొంత కాలం నుండే సృష్టించబడి ఉంది. అమెరికాలో 9/11 దాడుల తరువాత, టెర్రరిజం పేరు మీద ఇస్లామోఫోబియాకు ప్రపంచ అనుమతి ఉంది. ఇది హిందూ జాతీయవాదులకు వేరే పదజాలాన్ని ఇచ్చింది. టెర్రరిష్టు అనే ఆరోపణ ఒక్కటి చేస్తే, మనుషుల్ని అనాగరికులుగా పరిగణించటానికి కావాల్సిన భూమికకు సరిపోయే పరిస్థితులు ఉన్నాయి. ఆ వంకతో రుజువులు లేకుండా అరెష్టు చేయవచ్చు, కొట్ట వచ్చు, హింసించవచ్చు, కాల్చి పారవేయనూ వచ్చు. 2001 నుండి మొన్న అక్టోబర్ లో ఆయన గుండె పోటులో చనిపోయే వరకూ జిలానీ, తన మీద ఒక్క ఆరోపణ కూడా రుజువు కాకుండా ఈ దాడులన్నింటినీ ఎదుర్కొన్నాడు. అతను బయటికి వచ్చాక మానవ హక్కుల కార్యకర్తగా మారి రాజకీయ ఖైదీల విడుదల కోసం పని చేశాడు.

‘నాకు తెలిసిన వ్యక్తుల్లో జిలానీ ఎంతో ధైర్యవంతుడు, గౌరవప్రదమైన వాడు’ అరుంధతీ రాయ్ నాకు ఫోన్ లో చెప్పింది. ఆమె, జిలానీ అరెష్టు అయ్యాక ఆయనను రక్షించటానికి జరిగిన ప్రచార కార్యక్రమంలో భాగం పంచుకొన్నది. ‘తనలాగా బాధపడిన ప్రజల కోసం ఆయన సమయాన్ని అంతా వెచ్చించాడు’ ఆమె చెప్పింది.

సమకాలీన భారతదేశంలో అందరికీ బాగా తెలిసిన రాజకీయ ఖైదీగా, భారత రాజ్యపు అతి చర్యలకు బహుశా జిలానీ సజీవమైన మరణ శాసనంగా బతికాడు. ఒక సామాన్య వ్యక్తి దేశ భద్రతకు బెదిరింపు అని ఎలా ముద్ర వేయవచ్చో, అతని జీవితపు కథ బయటపెడుతుంది. రాజ్యపు భాష్యాన్ని లొంగిపోయిన మీడియా ఎలా ముందుకు తెస్తుందో కూడా చెబుతుంది. కోర్టులు కూడా ఒక్కోసారి నికార్సైన అన్యాయానికి ఎలా దారి తీస్తాయో కూడా చెబుతుంది.

జిలానీ 1969లో కశ్మీర్ లోని ఒక పేరుగల కుటుంబంలో పుట్టాడు. ఆయన తండ్రి, ‘సయ్యద్ అబ్దుల్ వాలి ఉల్లా షా జిలానీ’ మత సంస్కరణవాది. కశ్మీరీ ముస్లిములు మూఢ నమ్మకాల నుండి బయటపడటానికి ప్రయత్నించినవాడు. నూపుర్ శర్మ బృందం ఏమి నమ్మినప్పటికీ, జిలానీ ఇస్లామిక్ మత మూఢత్వానికి విరుద్ధమైన విలువలతో పెరిగాడు.

1980 చివర, 1990లలో ఆయన యువకుడు అయ్యాడు. అదే కాలంలో కశ్మీరీ యువకులు భారత రాజ్యం పట్ల సహనాన్ని కోల్పోయి, ఎక్కువమంది ఆయుధాలు పట్టుకొన్నారు. జిలానీకి చిన్నతనంలోనే పెళ్లి అయ్యింది. కానీ భార్యను కశ్మీర్ లో వదిలిపెట్టి చదువు కోసం లక్నోకీ, తరువాత ఢిల్లీకి వెళ్లాడు. ఏ ఒక్క కశ్మీరీని వదలకుండా, తిరుగుబాటును అణచివేయటానికి రాజ్యం ఉపయోగిస్తున్న అమానుషమైన పద్దతుల గురించి ఇంటికి వచ్చినప్పుడల్లా విన్నాడు.
1990ల మొదటి భాగంలో జిలానీ అన్న బిస్మిల్లాను భద్రతా దళాలు పట్టుకొని పోయాయి. న్యాయవాది, మానవ హక్కుల కార్యకర్త నందితా హస్కర్ తన పుస్తకం ‘Framing Geelani, Hanging Afjal’ లో చెప్పినట్లుగా బిస్మిల్లాను తల్లకిందులుగా వేలాడదీసి ఒక బక్కెట్టు నీళ్లలో ముంచారు. తరువాత బయటకు తీసి ఆయన మింగిన నీళ్లు కక్కేవరకు అతని పొట్ట మీద కొట్టారు. ఆ హింస తరువాత అతన్ని గట్టిపడిన మంచులోకి తోసివేశారు. తరువాత బిస్మిల్లా ఒక పుస్తకం రాశాడు. ‘Manufacturing Terrorism; Kashmiri Encounters with the Media and Law’ ఆ పుస్తకం పేరు. ఎన్ని కష్టాలు అనుభవించినప్పటికీ ఆ అన్నదమ్ములు ఇద్దరూ వారి ప్రజాస్వామిక విలువలను వదులుకోలేదు. ‘నిజానికి ఆయన ఢిల్లీ విద్యార్థిగా ఉన్న కాలమంతా, తన తోటి విద్యార్థులూ ఉపాధ్యాయులకు కశ్మీర్ చరిత్రా, సమకాలీన పరిస్థితుల గురించే చెప్పే ప్రయత్నం చేసాడు’ నందితా హస్కర్ రాసింది. ‘బయటకు ఎక్కువగా మాట్లాడే యువ కశ్మీరీగా, కశ్మీరీ నాయకులను కశ్మీర్ గురించి మాట్లాడటానికి ఢిల్లీ పిలిచేవాడు. అందుకే అతను ఇంటెలిజెన్స్ వర్గాల కళ్లల్లో పడి ఉంటాడు’ అంటూ హస్కర్ గుర్తు చేసుకొన్నది.

జాకీర్ హుస్సైన్ కాలేజ్ లో ఉద్యోగం వచ్చిన కొద్ది కాలానికి, 2000 సంవత్సరంలో ముఖర్జీ నగర్ లోని ఒక భవనం పై భాగాన ఒక చిన్న ఇల్లు అద్దెకు తీసుకొన్నాడు. అక్కడే తన భార్యా, మూడు సంవత్సరాల కొడుకు ఆతిఫ్ తో ఉన్నాడు. అతని ఏడు సంవత్సరాల కూతురు నూర్సాత్ కశ్మీర్ లోనే చదువు కొనసాగించింది.

ఒక సంవత్సరం తరువాత , 2001 డిసంబర్ లో ఐదుగురు వ్యక్తులు విధ్వంస ఆయుధాలతో నిండి ఉన్న ఒక కారును భారత పార్లమెంటు గేట్ల వరకూ తోలుకుంటూ వెళ్లారు. ఐదుగురూ చనిపోయారు. వారితో పాటు ఏడు మంది పోలీసులూ, ఒక భద్రతా దళ వ్యక్తీ, ఒక తోటమాలీ కూడా చనిపోయారు. రెండు రోజుల్లో పోలీసులు కేసును పరిష్కరించామని చెప్పారు. జిలానీ, మహమ్మద్ అఫ్జల్, అతని కజిన్ షౌకత్ హుస్సైన్ గురు, షౌకత్ భార్య అఫ్సాన్ గురు (పెళ్లికి ముందు ఆమె పేరు నవ్ జ్యోత్ సాంధు) ల పేర్లు ఆ కేసులో ఉన్నాయి. పోలీసులు అల్లిన కథలో జిలానీనే మొత్తం ప్రణాళిక రచయిత.

జిలానీని వెంటనే నిర్బంధంలోకి తీసుకొన్నారు. ప్రత్యేక దళం అతన్ని తల్లకిందులుగా వేలాడదీసి అతని కాళ్ల అడుగు భాగాన్ని చితక బాదారు. కొట్టినంత సేపు అవమానకరమైన భాషలో తిడుతూనే ఉన్నారు. తరువాత అతన్ని కిందకు దించి ఒక మంచి దిమ్మె మీద పడుకోబెట్టి అతన్ని సృహ పోయేవరకు కొట్టారు. చేతులకు సంకెళ్లు వేసి, కాళ్లను టేబుల్ కు చైనులతో కట్టి పోలీసు స్టేషన్ చల్లటి నేల మీద పడుకోబెట్టారు. ఆ స్థితిలో అతన్ని అతని పిల్లలు చూసేటట్లు చేశారు. అతను నేరాన్ని ఒప్పుకోక పోతే అతని భార్యను అత్యాచారం చేస్తామని బెదిరించారు. ‘అతను తనపై మోపిన తప్పుడు ఆరోపణను అంగీకరించలేదు. ఆ ఒప్పుకోక పోవటమే అతన్ని అసామాన్యమైన వ్యక్తిగా తయారు చేసింది’ అని అరుంధతి రాయ్ నాతో అన్నారు.

ఆరునెలల్లో Prevention of Terrorism Act కింద ఒక ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేశారు. దానికి జడ్జిగా ఎస్ ఎన్ ఢింగ్రా నాయకత్వం వహించి ఈ నలుగురు ఆరోపితుల్ని విచారణ చేసి శిక్ష వేశాడు. రాజ్యానికి వ్యతిరేకంగా యుద్ధాన్ని ప్రకటించి, కుట్ర పన్నారన్న గట్టి ఆరోపణతో జిలానీ, అఫ్జల్, షౌకత్ లకు మరణ శిక్ష విధించాడు. అఫ్సాన్ కు ఐదు సంవత్సరాలు జైలు శిక్ష వేశాడు.

2001లో జిలానీ అరెస్టు అవగానే కోపోద్రిక్తులు అయిన ఢిల్లీ యూనివర్సిటీలోని అతని సహ ఉద్యోగులు, స్నేహితులు కేసు కోసం పోరాడటానికి నందితా హస్కర్ తో కలగలిశారు. హస్కర్, ఆమె బృందం దేశవ్యాప్తంగా ఒక ప్రచార కార్యక్రమం మొదలుపెట్టింది. జిలానీ కోసం 12 మంది సభ్యుల ఒక రక్షణ కమిటీని వేసింది. అందులో రజనీ కొఠారి, సోషలిస్టు నాయకుడు సురేంద్ర మోహన్, రచయిత్రి అరుంధతి రాయ్, ఆక్టివిష్టు అరుణా రాయ్, సినీ నిర్మాత సంజయ్ కక్, సంపాదకుడు ప్రభాష్ జోషి లాంటి ప్రముఖ వ్యక్తులు ఉన్నారు. జిలానీకీ వ్యతిరేకంగా రుజువులు చెప్పుకోదగ్గ లేకపోవటాన్ని అందరి దృష్టికీ తీసుకొని రావటానికి పేరుగల పౌరులు వారి గొంతుకలను ఇచ్చారు.

విచారణ కోర్టులో ఓడిపోయినప్పటికీ ఈ బృందం వారి ప్రచారాన్ని ఉదృతం చేసి ఒక తీవ్రమైన న్యాయ యుద్ధానికి తెర తీసింది. ఢిల్లీ హైకోర్టులో అప్పీల్ చేసుకొన్న తరువాత, ఈ బృందం రామ్ జెఠ్మలానీని న్యాయవాదిగా నియమించుకొన్నది. ఆయన అంతకు కొన్ని నెలల ముందు వరకూ అటల్ బిహారీ వాజ్ పాయ్ నాయకత్వంలోని ప్రభుత్వంలో న్యాయశాఖా మంత్రిగా పని చేసేవాడు. పిటీషన్ల తోటి, పోస్టర్ల ప్రదర్శనలతోటి, బహిరంగా సభలతోటి వారు ప్రచారాన్ని కొనసాగించారు. ప్రధాన స్రవంతి మీడియా పోలీసు భాష్యాన్ని ముందుకు తీసుకొని వెళ్లినప్పటికీ, ఈ ప్రచారం వారి సృష్టించిన కథలోని జిగేల్ మని కనిపించే అవాస్తవాలను బయటకు తీసింది. ఈ కేసు గురించి మాత్రమే కాకుండా; పార్లమెంటుపై దాడి జరిగాక మూడు నెలల్లో పాస్ అయి, జిలానీ తదితరులు శిక్షకు గురి చేసిన ఉగ్రవాద నిరోధక చట్టం ద్వారా జరుగుతున్న పౌర హక్కుల మీద దాడి గురించి కూడా ప్రజల్లో ఎరుక కలిగించింది ఈ ప్రచారం. జిలానీ కోసం జరిగిన ప్రచార కార్యక్రమం, పోటా చట్టానికి వ్యతిరేకంగా తయారైన ఒక వేదిక అయ్యింది.

జెఠ్మలానీ నాయకత్వంలో జరిగిన న్యాయ పోరాటం, దానికి సహాయపడిన రక్షణ కమిటీ చేస్తున్న ప్రజలను ఎరుక పరిచే కార్యక్రమం- ఢిల్లీ హై కోర్టును జిలానీ మరణ శిక్షను వెనక్కి తీసుకొనేటట్లు చేశాయి. అఫ్సాన్ కూడా జిలానీ లాగానే అన్ని ఆరోపణల నుండి బయటపడింది. రాజ్యం మీద యుద్ధం ప్రకటించారని ఆరోపిస్తూ మరణ శిక్ష పడి, బయట పడటం చాలా అరుదైన విషయం.

నందితా హస్కర్ రాసిన దాని ప్రకారం, జిలానీ తాను విడుదల అయ్యాక, ఇంకా విచారణ మొదలు పెట్టక ముందే జాకీర్ హుస్సైన్ కాలేజీ ఉపాధ్యాయ సంఘం ఆయనకు కఠిన శిక్ష పడాలని డిమాండ్ చేసిందని విని దిగ్భ్రమకు గురి అయ్యాడు. అప్పటి ఢిల్లీ యూనివర్సిటీ ఉపాధ్యాయ సంఘం అధ్యక్షుడు సస్వతి ముజుందార్ కూడా అలాంటి డిమాండే చేశాడు. ఈ వైనం జిలానీని బాధ పెట్టింది. ఎందుకంటే ఆయన తనని తాను ప్రజాస్వామ్య లౌకిక పరిధిలో భాగంగా భావించుకొంటాడు. ఆయన ఆ రెండూ యూనియన్లలో సభ్యుడు కూడా.

మీడియా తన మీద పెట్టిన దృష్టిని పోటా చట్టానికి వ్యతిరేకంగా ఉపయోగించుకోవటానికి జిలానీ వాడుకొన్నాడు. విడుదల అయిన తరువాత జరిగిన మొదటి ప్రెస్ కాన్ఫెరెన్స్ లోనే అతను ఇలాంటి పిశాచ చట్టానికి ప్రజాస్వామ్యంలో చోటు లేదని ప్రకటించాడు. ‘ఒక అమాయక వ్యక్తిని రెండు సంవత్సరాలు చావు చర్చలో పెట్టి, దాన్ని న్యాయమని అంటారా?’ అని ప్రశ్నించాడు. ఆ ప్రెస్ కాన్ఫెరెన్స్ గురించి The Hindu లో వచ్చిన రిపోర్ట్ ‘పోటా కేసును పోలీసులు ఎంత సులభంగా దుర్వినియోగ పరుస్తారో అతని విడుదల అందరి దృష్టికీ తీసుకొని వచ్చింది’ అని రాసింది. అప్పటికి అనేక మంది దళితులు, ఆదివాసీలు, మతపరమైన మైనారిటీ సభ్యులు, పర్యావరణ పౌరహక్కుల సభ్యులు – వీరంతా ఈ చట్ట ప్రకారం బాధితులు అయ్యారు. 2004 ఎన్నికలకు ముందు మల్ల గుల్లాలు పడుతున్న ప్రతిపక్షం; జిలానీ విడుదల కోసం జరుగుతున్న ప్రచార కార్యక్రమం చేస్తున్న పోటా వ్యతిరేక ప్రచారం యొక్క ప్రజాకర్షణ అభిప్రాయాన్ని అంది పుచ్చుకొన్నది. దాని ఎన్నికల ఎత్తుగడగా ఈ చట్టాన్ని ఎత్తివేస్తామని వాగ్దానం చేసింది.

ఢిల్లీ పోలీసులు, పార్లమెంటు దాడి విషయంలో జిలానీ, అఫ్సాన్ లను బయటపడవేసిన హైకోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ సుప్రీం కోర్టుకు వెళ్లారు. సుప్రీం కోర్టు కింది కోర్టు తీర్పును కొనసాగించటమే కాకుండా, షౌకత్ కి ఢిల్లీ కోర్టులో పడిన పది సంవత్సరాల శిక్షను కూడా తీసివేసింది. అఫ్జల్ గురు ఒక్కని విషయంలోనే మొదట పడిన శిక్షను హై కోర్టు ఎత్తిపట్టింది. జిలానీ విడుదల, పార్లమెంటు దాడి మీద పోలీసుల భాష్యం విషయంలో అనేక అనుమానాలను రేకెత్తించినప్పటికీ అఫ్జల్ కి శిక్ష కొనసాగింది. అఫ్జల్ కు వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన పనికిమాలిన రుజువుల స్వభావాన్ని అనేక గొంతుల సమూహం బయటకు తీసుకొని వచ్చినప్పటికీ, కోర్టు తను వేసిన శిక్షను సమర్ధించుకొన్నది. ‘దోషికి మరణ శిక్ష విధిస్తే సమాజపు సామూహిక స్పృహ సంతృప్తి పడుతుంది’ అనే అత్యంత హేయమైన పదబంధాన్ని సుప్రీం కోర్టు వాడింది. ఇలాంటి పదాలను బహుశా ఏ సుప్రీం కోర్టు జడ్జిమెంటు ఇంతవరకు వాడలేదు. 2013లో జరిగిన అఫ్జల్ ఉరితీత కశ్మీర్ లో పెద్ద ఎత్తున నిరసనలకు దారి తీసింది. అక్కడ ఇప్పటికీ అఫ్జల్ ను మరణించిన అమాయకుడైన యోధుడిగా చూస్తారు.

పార్లమెంటు దాడిలో ఏమి జరిగింది, దాని వెనుక ఎవరు ఉన్నారు అనే విషయంలో ఇప్పటికీ విశ్వసనీయమైన భాష్యం లేదని చాలా మంది యాక్టివిశ్టులు నమ్ముతారు. ‘రాజ్యం ఎందుకు ఒక సరికొత్త విచారణను జరపటానికి ఆసక్తి చూపించటం లేదని’ నేను అరుంధతి రాయ్ ను అడిగాను. ‘అలా చేస్తే ఒకవైపు చాలా అసౌకర్యమైన విషయాలు బయటకు వస్తాయి. ఇంకో వైపు వారి రక్త దాహం తీరింది. అఫ్జల్ గురు పిశాచం ఇక మనల్ని వెంటాడుతుంది. చారిత్రాత్మకంగా ఇలాంటి ప్రభుత్వాలు, వారి అజెండాను ఇలాంటి మర్మగర్భమైన సంఘటనల ద్వారా ముందుకు తీసుకొని వెళతాయి’ అన్నదామె.

కేసుల నుండి బయట పడటంతో జిలానీ సమస్యలు తీరలేదు. 2005 ఫిబ్రవరిలో హక్సర్ ఇంటి వెలుపల కొందరు గుర్తు తెలియని సాయుధులు అతన్ని కాల్చారు. అతన్ని వెంటనే హాస్పటల్ కు తరలించారు. అతని శరీరం నుండి కొన్ని బుల్లెట్లను డాక్టర్లు బయటకు తీయగలిగారు. రెండు బుల్లెట్లు ఇంకా అతని వెన్నెముకలో ఉండిపోయాయి. వాటిని బయటకు తీయలేకపోయారు. ఈ రక్షణ వైఫల్యాన్ని సుప్రీం కోర్టు తీవ్రంగా పరిగణించి, అతనికి సెక్యూరిటీ ఇవ్వాలని ఆదేశించింది. ఇద్దరు కేంద్ర సాయుధ రక్షణ దళాల మనుషులు రాత్రి పగలూ అతనితో ఉంటారు.

జిలానీ విడుదల కోసం పని చేసిన ప్రచార కార్యక్రమం అనేక మంది యాక్టివిశ్టులను ఒక్కటిగా చేసింది. వారు తరువాత కూడ రాజకీయ ఖైదుల హక్కుల రక్షణ పనిని కొనసాగిస్తున్నారు. జిలానీ జైల్లో ఉన్నప్పుడు అనేకమంది ముస్లిములనూ, ఆదివాసీలనూ కలిశాడు. వారంతా ఎలాంటి సాక్షాలు లేకుండా మావోయిస్టులనీ, టెర్రరిష్టులనీ ముద్ర వేయబడి ఉన్నారు. ఈ అనుభవం రాజకీయ ఖైదీల పట్ల అతని నిబద్ధతను గట్టిపరిచింది. అతని విడుదల కోసం పని చేసిన యాక్టివిశ్టులతో పాటు, జిలానీ రాజకీయ ఖైదీల విడుదల కమిటీలో పని చేయటం మొదలుపెట్టాడు.

‘నేను కశ్మీరీల కోసం చేసిన పనులు, జిలానీ నా దృష్టికి తీసుకొని రావటం వలనే జరిగాయి’ అని ప్రముఖ మానవ హక్కుల న్యాయవాది కామిని జైస్వాల్ నాతో అన్నారు. ‘అతను చివరిగా నా దగ్గరకు తెచ్చిన కేసు, 1996లో జరిగిన పేలుడు కేసు. అందులో ఫిరోజ్ బాద్ కు చెందిన ఒక డాక్టర్ కు మరణ శిక్ష విధించారు.’

అరుంధతీ రాయ్ కూడా ఈ రంగంలో జిలానీ పనిని పొగుడుతుంది. ‘అతను జైలు నుండి వచ్చాక, అతనికి దేశంలో జరుగుతున్న ఆదివాసీ పోరాటాలు లాంటి ఇతర పోరాటాల గురించి గొప్ప అవగాహన కలిగి ఉండటం అసామాన్యమైన విషయం’ అన్నదామె. ‘అతని రాజకీయ నడతలో ఒక చమత్కారం ఉంది. తాను ఎవరూ అన్న విషయంలో స్పష్టతతో ఉండే విషయం ఆయన తనకు తాను తెలుసుకొన్నాడు. అయినా ఇతర ప్రాంతాల్లో రాజ్యం చేతుల్లో నలిగి పోతున్న ప్రజల గురించి అతను మాట్లాడతాడు’ అంటారామె.

అతనితో పని చేస్తున్న ప్రముఖ యాక్టివిశ్టులు- మానవహక్కుల యాక్టివిష్టు రోనా విల్సన్, ఇంకా ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ జి ఎన్ సాయిబాబా. వీరిద్దరు జిలానీ విడుదల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు.

జిలానీతో నా కలయిక చాలా యాదృచ్ఛికం. 2014లో, నేను ఢిల్లీ యూనివర్సిటీలో సాహిత్య విద్యార్థిగా ఉన్నప్పుడు, నా ప్రొఫెసర్లలో ఒకరైన సాయిబాబా మావియిష్టులతో లింకులు ఉన్నాయనే నెపంతో అరెష్టు అయ్యాడు. సాయిబాబాకు పోలియో రావటం వలన, ఆయన జీవితంలో ఎక్కువభాగం వీల్ చైర్ కు పరిమితం అయ్యాడు. నాగపూర్ జైల్లో ఉన్న భయంకర పరిస్థితులు అతని మెదడులో, వెన్నెముకలో, కిడ్నీలలో చాలా సమస్యలు కలిగించాయి. 2015లో సాయిబాబా ఆరోగ్య కారాణాల రీత్యా కొద్దికాలం బయట ఉన్నప్పుడు, అతన్ని నేను ఢిల్లీ హాస్పిటల్ లో చూడటానికి వెళ్లాను. అతని గురించి నేను ఇటీవల Times of India లో రాశాను. నేను సాయిబాబాతో మాట్లాడటానికి కూర్చొని ఉండగా, జిలానీ ఇద్దరు సాయుధ గార్డులతో లోపలికి వచ్చాడు. ఆ ఇద్దరు ప్రొఫెసర్లూ మాట్లాడుకొంటుండగా నేనూ, అతని సెక్యూరిటీ గార్డులు విన్నాము.

సాయిబాబా ఆరోగ్యం, అతని కేసు గురించి సీరియస్ చర్చ అయిన తరువాత వారి సంభాషణ అండా సెల్ లో అతని అనుభవం గురించి మళ్లింది. నాగపూర్ జైల్లో అండా సెల్లు ఒక ఒంటరి బ్లాక్. వారిద్దరూ సరదాగా అలాంటి స్థితిని అనుభవించినందుకు ఒకర్ని ఒకరు పొగుడుకొన్నారు. తన సెల్ కు కిటికీలు లేనందున, ఆ గది ఎప్పుడూ చీకటిగా ఉంటుందనీ, కాబట్టి సమయం ఎంత అయిందో కూడా చెప్పటం అసాధ్యమని సాయిబాబా చెప్పాడు.
‘నాకు భోజనం వచ్చినపుడే, టైమ్ ను నేను పట్టుకొనే వాడ్ని’ అని సాయిబాబా అన్నాడు.

‘నీకు కనీసం ఆహారం ఉండేది. నన్ను నగ్నంగా ఉంచి చాలా రోజులు అన్నం పెట్టలేదు’ అంటూ నవ్వుతూ జిలానీ, కిటికీలు లేని తీహార్ అత్యంత ప్రమాదకర జైలులో తను గడిపిన జీవితం గురించి చెప్పుకొచ్చాడు. ‘కానీ నేను టైమ్ ను పట్టుకోవాలి. గార్డ్స్ షిఫ్ట్ మారినపుడు, వారి తుపాకీ గుండ్లను ఖాళీ చేసి వెళ్లాలి. అలా ఖాళీ చేస్తున్న తుపాకి గొట్టం టిక్ టాక్ శబ్ధమే నా గడియారం’ అని చెప్పాడు.

2017లో సాయిబాబాకు జీవిత ఖైదు వేశారు. అప్పటి నుండి జైల్లోనే ఉన్నాడు. అతని ఆరోగ్య స్థితి క్షీణిస్తుంది. ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల నిపుణులు అతన్ని విడుదల చేయమని ప్రభుత్వాన్ని కోరారు. కానీ ఎవరూ వినలేదు. అతని అరెష్టూ, శిక్ష తరువాత- రాజకీయ ఖైదీల కోసం పని చేస్తున్న వారి మీద నిరంతరం దాడులు జరుగుతున్నాయి. పోయిన సంవత్సరం కోరేగావ్ హింస తరువాత రోనా విల్సన్, న్యాయవాది మరియూ యాక్టివిష్టు అయిన సురేంద్ర గాడ్లింగ్ సందేహాస్పద ఆరోపణలతో అరెష్టు అయ్యారు. వారిద్దరూ సాయిబాబా విడుదల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. పోయిన సంవత్సరం అరెస్టు అయిన మానవ హక్కుల యాక్టివిష్టులు షోమా సేన్, మహేశ్ రౌత్, సుధీర్ ధవలే, సుధా భరత్వాజ్, అరుణ్ ఫెర్రెయిరా, వెర్నన్ గోన్సల్వేస్, వరవర రావ్, గౌతమ్ నవ్లఖలు. ఇటీవల ఢిల్లీ యూనివర్సిటీలో బోధిస్తున్న హాని బాబు- ఇతడు CRPP మీడియా కార్యదర్శి కూడా- ఇంటి మీద జరిగిన దాడి ఈ హీన స్థితి ఇంకా అయిపోలేదని తెలియచేస్తుంది. CRPP (Committee for Release of Political Prisoners) అధ్యక్షుడు జిలానీ మరణంతో, మానవ హక్కుల కార్యాచరణలో పునాది స్థానంలోనే శూన్యం ఏర్పడినట్లు అనిపిస్తుంది.

‘అందరూ జైల్లో ఉన్నారు’ అరుంధతి రాయ్ నాతో అన్నది. ‘నువ్వు హఠాత్తుగా చుట్టూ చూస్తే అన్ని కుర్చీలు ఖాళీగా ఉన్నాయి’ అందామె.

2016 ఫిబ్రవరి 9న, మహమ్మద్ అఫ్జల్ గురు ఉరి తీసిన మూడవ సంవత్సరంలో, అఫ్జల్ అమాయకూడని ఎప్పుడూ నమ్మే జిలానీ, అతని హత్యకు నిరసనగా జరిగిన కార్యక్రమమలో పాల్గొన్నాడు. అతన్ని దేశద్రోహం కేసు కింద అరెష్టు చేసి, ఇంకో నెల జైలులో ఉండేట్లు చేశారు.

అదే రోజు, అర్నాబ్ గోస్వామి, ఇప్పుడు హిందూ జాతీయవాదిగా పునర్జన్మించి, జిలానీ అరెస్టును సమర్ధిస్తూ ఒక గంటపాటు చర్చ నడిపాడు.

‘ఈ సార్ జిలానీ అనే వ్యక్తి ప్రమాదకరమైనవాడు’ అంటూ అర్నాబ్ గోస్వామి తారస్థాయిలో అరిసాడు. ‘అతన్ని వదిలేస్తే, ఈ దేశంలో స్వేచ్ఛగా ఉండనిస్తే- అది నైతికంగా ULFA (United Liberation Front of Assam) కార్యాచరణను సమర్ధిస్తూ, అస్సాంలో వేర్పాటువాదంకు దారి తీస్తుంది. నేను జిలానీని ఈ దేశంలో స్వేచ్ఛగా ఉండనిస్తే, ఆ చర్య బబ్బర్ ఖల్సా చర్యలను సమర్ధిస్తూ ఖలిస్తాన్ వేర్పాటువాదులకు పచ్చ జండా ఊపుతుంది. అందుకే సార్ జిలానీ ఎప్పుడో జైల్లో ఉండాలని నేను నమ్ముతున్నాను. ఈ జిలానినే ఒక టెర్రరిష్టును అమరుడు అన్నాడు. ఇతనే దేశ వ్యతిరేక, భారత వ్యతిరేక సెంటిమెంట్లను రేకెత్తిస్తున్నాడు’ అని అన్నాడు. 2008లో జిలానీని సమర్ధించ్చినప్పటి నుండి గోస్వామి 180 డిగ్రీల మలుపు తీసుకొన్నాడు.

అనేక మంది జర్నలిష్టులు తమ మొదటి దశలో చేసినట్లుగానే గోస్వామి పాలక వర్గం భాషనూ, పదజాలాన్ని వాడుతున్నాడు. ఎవరికి మానవవతాన్ని తిరస్కరించాలో అనే విషయాన్ని విశాల పరిధిలో- పెరుగుతున్న హిందూ జాతీయవాద ఆధిపత్యం నిర్ణయిస్తుంది. ఇది 2014 నుండి జరుగుతుంది. ఒకప్పుడు టెర్రరిష్టు అనే ముద్ర కావాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ లెవలు తగ్గింది. యాంటీ నేషనల్ అనే తేలిపోయే ముద్ర చాలు అరెష్టు చేయటానికి. జాతీయ గీతం పాడుతున్నప్పుడు నిలబడటానికి చేసే నిరాకరణ అతన్ని కొట్టటానికి సరిపోతుంది. ఒక దళితుడు, ఒక ముస్లిము చిన్న ముక్క మాసం కలిగిఉండటం- అది బీఫ్ అయినా, కాక పోయినా- అతన్ని చంపవచ్చు అని చెప్పటానికి రుజువు అవుతుంది. ఒకప్పుడు టెర్రరిష్టులకు వ్యతిరేకంగా లేచిన ప్రధాన స్రవంతి మీడియా ఇప్పుడు యాంటీ నేషనల్స్ కు వ్యతిరేకంగా లేస్తుంది

మానవ హక్కుల ఉల్లంఘనలు ఇప్పుడిక చట్ట అమలు సంస్థలకూ, భద్రతా దళాలకూ మామూలు అధికారాలు అవుతాయి. ఇందిరా జైస్వాల్ ను లాకప్ హింస గురించి నేను అడిగినపుడు ఆమె ‘ఇప్పుడు వీధుల్లోనే కొట్టి చంపుతున్నారు. ఇక లోపల ఏమవుతుందో ఊహించవచ్చు. ఇంకా అధ్వానంగా ఉంటుంది’ అని అన్నారు.

ఇప్పుడు ఎలాగూ ప్రభుత్వం మానవ హక్కుల సిద్ధాంతానికి వ్యతిరేకంగా యుద్ధానికి తెర తీసింది. ‘భారతదేశంలో మానవ హక్కుల సిద్ధాంతం, పాశ్చాత్య దేశాల్లో సిద్దాంతం కంటే భిన్నమైనది’ అనే హోమ్ మంత్రి అమిత్ షా ఇటీవల ప్రకటన నేపధ్యంలో వందలాది మానవహక్కుల కార్యకర్తల అరెష్టులను చూడాలి. హక్కుల చట్రంలో; హిందూ జాతీయవాద ప్రభుత్వం, అనేక రాడికల్ ఇస్లాం దేశాలతో పాటు ఒకే స్థానంలో ఉందనే విషయాన్ని ఇది సూచిస్తుంది.


మానవహక్కుల నిరాకరణ యుగంలో- అవమానపడటమే కాకుండా హింస పడి ఇంచుమించు హత్యకు గురి అయ్యే ఈ యుగంలో- జిలానీ మానవత్వాన్ని ఎత్తి పట్టాడు. అతన్ని శత్రువుగా చూస్తున్న వారిపైనా, భారత ప్రభుత్వం పైనా ఆయన ఎప్పుడూ ద్వేషం పెంచుకోలేదు. కానీ తాను చూసిన అన్యాయాన్ని ప్రశ్నించిన ఒక మనిషిగా ఆయన ఎప్పుడూ రాజ్యానికీ, దాని బంటు అయిన మీడియాకూ ఒక టార్గెట్ గా బతికినంత కాలం మిగిలిపోయాడు. టెర్రరిష్టు అనే ముద్రలో ఇమడనపుడు, అతన్ని యాంటీ నేషనల్ గా ముద్ర వేశారు. అతన్ని గుర్తు ఉంచుకోవాల్సిన అవసరం చాలా ఉంది. అతని మీద వేసిన దుమ్ము, బురద, ద్రావకం కారణంగా కాకుండా- అతనికి ధర్మం పట్లా, మానవ హక్కుల పట్ల ఉన్న నిర్భయ నిబద్ధత కారణంగా అతన్ని గుర్తు పెట్టుకోవాలి.

మార్తాండ్ కౌశిక్, ( ‘ద కారవాన్ ’ పత్రికలో సీనియర్ అసిస్టెంట్ ఎడిటర్ )
ఆంగ్లం నుండి అనువాదం: రమాసుందరి

స్వస్థలం ఒంగోలు. ప్రస్తుతం గుంటూరు ప్రభుత్వ మహిళా పాలిటిక్నిక్ కాలేజీలో ఎలక్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ బ్రాంచ్ హెడ్ ఆఫ్ సెక్షన్ గా పని చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు. 'మాతృక' బాధ్యతలు చూస్తున్నారు.

Leave a Reply