ప్రేమకు రాజకీయ రూపమే సంఘీభావం: బినూమాథ్యు

‘కౌంటర్ కరెంట్స్’ ఎడిటర్ బినూమాథ్యు

ఇంటర్వ్యూ చేసినవారు: అమిత్ సేన్ గుప్తా

తెలుగు అనువాదం: రమా సుందరి

కౌంటర్ కరెంట్స్ ఎప్పడు ప్రారంభం అయింది? దాని పుట్టుక వెనుకాల ఉన్న ఉద్దేశ్యం ఏమిటి?

సర్వస్వతంత్ర ప్రత్యామ్నాయ పత్రికను మొదలు పెట్టాలన్నది నా స్వప్నం. మలయాళ భాషలో వార్త పత్రికను కానీ, మాస పత్రికను కానీ మొదలు పెట్టాలని నేనూ, కొంతమంది క్లాస్మెట్లు అనుకొనేవాళ్లం. కానీ ఆర్ధిక వ్యయం చాలా ఎక్కువగా ఉండి, మాకు అందుబాటులో ఉండేది కాదు.
నేనప్పుడు ఒక మలయాళ పత్రికలో సబ్ ఎడిటర్ గా పనిచేసేవాడిని. ఆ ఉద్యోగం నాకు కొద్దిగా ఆర్ధిక వెసులుబాటును ఇచ్చేది. కానీ నా మేధో ఆసక్తి, సమాజం కోసం ఏదైనా చేయాలనే నా కోరిక -నన్ను వేధించేవి. లోకల్ వార్తలను అందిస్తూ, స్థానిక పేజీలను తయారు చేసే నా ఉద్యోగం కూడా యాంత్రికంగా అనిపించేది.

2000 నాటికి ఇంటర్ నెట్ మన ఇళ్లలోకి వచ్చేసింది. అప్పుడే Znet, Electronic Intifada లాంటి ఎన్నో ఆసక్తికర వెబ్ సైట్లను చూడటం తటస్థించింది. ఆ వెబ్ సైట్లు నా కళ్లు తెరిపించాయి. వామపక్ష మేధో సాహిత్యానికి Znet ఒక గొప్ప వనరుగా వుండేది. మేధావి వర్గంలో రాక్ స్టార్ అయిన నోమ్ చోమ్స్కీ పుస్తకాలను ఎలాంటి ఖర్చు లేకుండా చదవాలంటే మౌస్ మీద ఒక చిన్న క్లిక్ ఇస్తే చాలు. పాలస్తీనా గురించి, ఇతర సంఘర్షణ ప్రాంతాల గురించి జర్నలిస్టుల ప్రమేయం లేకుండా వ్యక్తులు స్వంతంగా రాసే కథనాలు కొన్ని వెబ్ సైట్లలో వస్తున్నాయని నేను గమనించాను. అవి నన్ను బాగా ఆకర్షించాయి. అప్పటికింకా సామాజిక మాధ్యమాలు రాలేదని గుర్తు పెట్టుకోవాలి. బ్లాగ్స్ కూడా రాలేదు.

అప్పుడే డేవిడ్ కార్టెన్ రాసిన ‘When Corporations Rule The World’ అనే పుస్తకాన్ని చదివాను. ఆ పుస్తకం నా కళ్లు తెరిపించింది. లోకల్ బీట్స్, స్థానిక పేజీల కంటే ఎక్కువగా పని చేయాలని నేను ఆలోచించాను. ఆ పని చేయటానికి ఇంటర్ నెట్ నాకు అవకాశం ఇచ్చింది. Znet లాంటి వెబ్ సైట్ ప్రారంభించాలని నిర్ణయించుకున్నాను.

భాషను కంప్యూటరీకరించటంలో నా జ్ఞానం సున్న. దాని కోసం ప్రాథమిక html కోర్సులో చేరాను. నేనూ, నా స్నేహితులు ఒక పూటంతా మథనపడి ‘కౌంటర్ కరెంట్స్’ పేరును నిర్ణయించాము.  

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే Countercurrents.org అనే డొమైన్ 2001, సెప్టెంబర్ 11న రిజిస్టర్ అయింది. వరల్డ్ ట్రేడ్ సెంటర్ లో రెండో టవర్ కూలిపోతుండగా, నేను నా ఆఫీస్ కంప్యూటర్ నుండి ఆ డొమైన్ ను రిజిస్టర్ చేసుకొంటున్నాను.

ఒక కంప్యూటర్ కొనుక్కోవడానికి బ్యాంకు నుండి అప్పు తీసుకొన్నాను. అది 20 జీబీ హార్డ్ డిస్క్, 256 ఎంబీ రామ్ ఉన్న కంప్యూటర్. 18 శాతం వడ్డీతో ఆ కంప్యూటర్ నాకు 40000 రూపాయలకు వచ్చింది. నా జీతంతో ఆ అప్పును నెలవారీ ఇన్స్టాల్ మెంట్లతో కట్టేసాను. 2002, గుజరాత్ మారణకాండ జరిగే సమయమది. మేము ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా సంచికను వెలువరించాలని నిర్ణయించుకున్నాం. వెబ్ సైట్ ను ఆర్టిస్టు రజీ డిజైన్ చేశాడు. బి. అజిత్ కుమార్ దాన్ని html లోకి మార్చాడు. ప్రముఖ రచయిత్రి సారా జోసెఫ్ రాసిన ‘The Womb and the Sword’ అనే వ్యాసాన్ని మలయాళం నుండి నేను అనువాదం చేశాను. గుజరాత్ మారణకాండలో గర్భిణి స్త్రీల మీద జరిగిన దాడి, కొన్ని సందర్భాల్లో వాళ్ల గర్భాన్ని ఛేదించి పిండాలను మంటలలో వేసిన సందర్భాల గురించిన వ్యాసం అది.

అలా నేను countercurrents.org కి ఎడిటర్ ను అయ్యాను. 2002, మార్చ్ 27న మొదటి ఆర్టికల్ ప్రచురితం అయింది. అప్పటి నుండి దాదాపు ఒక లక్ష వ్యాసాలు పబ్లిష్ అయ్యాయి. వేలాది ప్రముఖ వ్యక్తులు, యువకులు సీసీ కోసం రాశారు. వాళ్లలో కొంతమంది తరువాత కాలంలో పెద్ద జర్నలిస్టులుగా, యాక్టివిస్టులుగా మారారు.

పేరున్న ప్రత్యామ్నాయ/ప్రధాన స్రవంతి మీడియా ఎడిటర్ గా మీరు చలామణిలో ఉన్న ఎలాంటి పద్ధతులను కానీ, ప్రధానస్రవంతి ధోరణులను కానీ అనుసరించలేదు. మీకు ప్రేరణనిచ్చిన విషయాలు ఏమిటి? మొదట్లో కానీ, తరువాత కానీ కష్టంగా వుండిందా? మిగతా సర్వ స్వతంత్ర జర్నలిస్టులకు దీని నుండి ఏమీ నేర్చుకోబోతున్నారు?

మొదట నుండి నేను వాస్తవ, ప్రత్యామ్నాయ దారిలో పోవాలని నిర్ణయించుకున్నాను. మీడియా, వాటిల్లోని విషయాలన్నీ పెట్టుబడి అనే తర్కంతో నిర్ణయించబడుతుండగా, నేను ఒక్క పైసా కూడా కార్పోరేట్స్ నుండి తీసుకోకూడదని నిర్ణయించుకున్నాను. నా సైట్ లో ఒక్క ప్రకటనను కూడా ప్రచురించలేదు.

ఎలాంటి కార్పొరేట్ లింకులు లేకుండా సర్వ స్వతంత్ర మీడియాను నడిపించటానికి మీకు ఆర్థిక వెసులుబాటు ఎలా వచ్చింది?  

కౌంటర్ కరెంట్స్ పూర్తిగా క్రౌడ్ ఫండింగ్ తో నడుస్తుంది. 2002-2015 వరకు నేను వెబ్ సైట్ ను నా మామూలు ఉద్యోగంతో బాటు నడిపాను. ఆ ఉద్యోగం నాకు కొంత ఆర్థిక స్థిరత్వాన్ని ఇచ్చింది. ఫండింగ్ కోసం నేను నా పాఠకుల మీద ఆధారపడకుండా సరిపోయింది. 2015లో నేను పని చేస్తున్న పత్రిక నన్ను ఉద్యోగం వదిలివేయమని అడిగింది. అప్పటి నుండి కౌంటర్ కరెంట్స్ ను నిలబెట్టటానికి నేను చందా కార్యక్రమాన్ని, క్రౌడ్ ఫండింగ్ పద్దతిని అమలు చేశాను. కౌంటర్ కరెంట్స్ కు అందరూ డబ్బు కట్టాలనే నిబంధన ఏమీ లేదు. చందా విలువ 1000 రూపాయలు మాత్రమే. కట్టవలసిన వాళ్లు కట్టవచ్చు. మిగతావాళ్లు ఉచితంగా చదవవచ్చు.
పాఠకులను వ్యాసాల నుండి దూరంగా ఉంచే పే వాల్స్ అంటే నాకు ఇష్టం ఉండదు. ఎక్కువ డబ్బు కట్టగలిగిన వాళ్లు కట్టలేని వారికి సబ్సిడీగా కడతారు. ఈ పద్ధతి కౌంటర్ కరెంట్స్ కు బాగా పని చేసింది.

మీ అద్భుతమైన పోర్టల్ లో వచ్చిన మంచి ఆర్టికల్స్ గురించి, రచయితల గురించి చెప్పండి. మీ పోర్టల్ చాలా సింపుల్ గా ఉంటుంది. కానీ భారతదేశంలోనూ, ప్రపంచవ్యాప్తంగా కూడా వేలాది పాఠకుల దృష్టిని ఆకర్షిస్తోంది.

మొదట్లో వార్తలు దొరకబుచ్చుకోవటానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. నేను మలయాళం నుండి వ్యాసాలను అనువదించేవాడిని. కొన్ని నేనే రాసేవాడిని. నా స్నేహితులను రాయమని ప్రోత్సహించేవాడిని. అయినా అదో పెద్ద యుద్ధం. Znet, Electronic ఇంటిఫాదా లాంటి ఎన్నో వెబ్ సైట్లు తమ వెబ్ సైట్లలో వచ్చినవాటిని తమకు క్రెడిట్ ఇస్తూ మళ్లీ పోస్ట్ చేసుకోవటాన్ని ప్రోత్సహించాయి. మంచి క్వాలిటీ ఉన్న ప్రపంచ వార్తలతో ప్రతి రోజూ అప్డేట్ అయ్యేటట్లు చూడటం కౌంటర్ కరెంట్స్ విజయానికి కారణం అయింది.

కౌంటర్ కరెంట్స్ లో మేము తెచ్చే వార్తలు పరిశీలాత్మకమైనవి. ప్రగతిశీల దృష్టి ఉన్న ప్రతి ఒక్కరికి అవసరం అయినది ఏదో ఒకటి అందులో ఉంటుంది. అలా ఉండటం కొంతమంది నమ్మకమైన పాఠకులను ఆకర్షించింది. బహుశా ఇది భారతదేశంలోనే మొదటి వాస్తవ ప్రత్యామ్నాయ వెబ్ సైట్ అనుకొంటాను. మిగతా వెబ్ సైట్లు అన్నీ వారసత్వ భారత మీడియాకు కొనసాగింపే.

మీరు అడుగుతున్న మంచి రచయితలు, మంచి వ్యాసాల విషయానికొస్తే, కౌంటర్ కరెంట్స్ లో వచ్చే ప్రతిదీ తప్పక చదవాల్సినదే. నాకు ఒక దృష్టికోణాన్ని ఇవ్వని ఏ వ్యాసాన్ని నేను ప్రచురించను. కౌంటర్ కరెంట్స్ రచయితలందరూ గొప్ప రచయితలే.

నిజం చెప్పాలంటే ఈ వెబ్ సైట్ కు సంపాదకత్వం వహించటం నాకు చాలా విజ్ఞానవంతమైన అనుభవాన్ని ఇచ్చింది. సీసీలో ప్రచురితం అయిన వ్యాసాలను చదివి నేను జ్ఞాన సంపదను పొందాను. సీసీలో భాగస్వాములు అయిన ఇద్దరు వ్యక్తుల గురించి ప్రత్యేకంగా చెప్పాలి. ఒకరు కేపీ శశి. ఆయన నాకు మంచి స్నేహితుడు, గొప్ప రచయిత, ఫిల్మ్ మేకర్, కార్టూనిస్టు, ఇంకా చాలా చాలా. ఆయన 2022లో చనిపోయారు. ఇంకొకరు జాన్ స్కేల్స్ యావేరీ. నాకు గొప్ప మిత్రుడు, గొప్ప రచయిత, మేధావి. ఆయన కూడా పోయిన సంవత్సరం వెళ్లిపోయారు. వీళ్లు ఇద్దరిని నేను నిజంగా మిస్ అవుతున్నాను. ప్రతి రోజూ!

గాజాలో జరుగుతున్న మారణహోమం గురించిన సంపూర్ణ సమాచారాన్ని ఎడిటర్ గా మీరందించారు. సామాజిక మాధ్యమాల్లో కార్యశీలకంగా మీరు ప్రచారం చేశారు. గత 15 నెలలుగా అవిరామంగా అక్కడ పడుతున్న బాంబుల గురించి, పాలస్తీనా ధీర ప్రజల అంతులేని బాధల గురించి మీ ఆలోచనలు ఏమిటి?

ఈ పని కష్టంగా ఉండింది. గాజాలో జరుగుతున్న మారణకాండకు సంబంధించిన వార్తలను, ఫోటోలను, వీడియోలను చూడటం అంతులేని బాధను కలిగించింది. నేను సీసీలోనూ, సామాజిక మాధ్యమాల్లోనూ చూడదగ్గ ఫోటోలనే షేర్ చేసాను. గాజన్ల ప్రతిఘటనను, ఆశావాదాన్ని ప్రదర్శించిన ఫోటోలు మాత్రమే అవి. రోజువారి నేను చూసిన ఫోటోలలో, వీడియోలలో ఉన్న మరణాలు, ఛిద్రమైన మృత దేహాలు, ప్రియతముల బాధాకర తుది వీడ్కోళ్లు, మారణకాండలు వర్ణించనలవి కాకుండా ఉంటాయి.

యుద్ధ విరమణ ప్రకటించినపుడు, గాజన్లు ఎంత ఊపిరి పీల్చుకున్నారో నేను కూడా అంతే. సుదూర మైళ్ల దూరంలో సురక్షిత గృహంలో సౌకర్యవంతంగా కూర్చొని ఉన్న నాలాంటి వాళ్లమే గాజా మారణకాండ గురించి అత్యంత బాధను అనుభవిస్తుంటే -గాజా ప్రజల పరిస్థితి గురించి ఊహించవచ్చు. ముఖ్యంగా పిల్లల గురించి చెప్పనవసరం లేదు. World Child Alliance and Dutch relief Alliance సహకారంతో Training Center for Crisis Management (CTCCM) చేసిన అధ్యయనం ప్రకారం 96 శాతం పిల్లలు తమకు మరణం తథ్యమని భావించారు. సగం మంది పిల్లలు చనిపోవాలని కోరుకున్నారు.

ఈ యుద్ధవిరమణ కొనసాగుతుందని మీరు భావిస్తున్నారా?
చెప్పటం కష్టం. వేచి చూడాల్సిందే. యుద్ధవిరమణ షరతులు పాటించకపోతే మళ్లీ గాజా మీద బాంబులు వేయటానికి వెళతానని బెంజిమిన్ నెతన్యాహు అన్నాడు. కానీ గత 15 నెలల యుద్ధం తరువాత ఇజ్రాయిల్ వియత్నాంగా గాజా మారిందని రుజువు అయింది. ఇంకా చెప్పాలంటే అది నెతన్యాహు వియత్నాం అయిపోయింది.

వాళ్లు గాజాలో కూరుకొని పోయారు. గాజాలో వాళ్లు అనుకున్నది ఏదీ చేయలేకపోయారు. ఇజ్రాయిల్ లో ఎక్కువమంది పోరాడటానికి సిద్ధంగా లేక పోవటం ఒక సంగతి అయితే, హమాస్ తన సైన్యాన్ని మూడింతలు పెంచుకున్నదని అంటున్నారు. హమాస్ ఆయుధ సామాగ్రి తరిగిపోతున్నా వాళ్ల పోరాట స్ఫూర్తి మాత్రం పతాక స్థాయిలో వుంది. వాళ్లు ఇజ్రాయిల్ సైనికుల మీద కత్తి దాడుల నుండి  ఆత్మహత్య బాంబుల ప్రయోగం వరకూ చేయటం మొదలు పెట్టారు.

యుద్ధం మొదలు అయ్యాక తక్కువలో తక్కువ 50 లక్షల ఇజ్రాయీలు దేశాన్ని వదిలిపెట్టి వెళ్లిపోయారని, ఇజ్రాయిల్ ఆర్థిక వ్యవస్థ కూలిపోయిందని మనం గుర్తు పెట్టుకోవాలి. గాజా మీద మళ్లీ సైనికులను పంపటం నెతన్యాహుకు అంత సులభం కాదు.

మీరు కేరళలో వుంటున్నారు. మిగతా దేశం నుండి కేరళ దూరంగా ఉంటుంది. ముఖ్యంగా హిందీ భాషా స్థావరం అయిన రాజకీయ భూభాగానికి, ఇంకా ఈశాన్య ప్రాంతానికి మీరు దూరంగా వున్నారు. ఒక విలేకరిగా మీరు మిగతా ప్రాంతానికి ఎలా కనెక్ట్ అవుతారు?
కేరళలో నివసిస్తూ, ఇక్కడ నుండి కౌంటర్ కరెంట్స్ నడపటం చాలా సౌకర్యంగా వుంది. తక్షణ కనెక్టివిటీ ఉన్న కాలంలో మనం నివసిస్తున్న ప్రాంతం అంత ముఖ్యం కాదు. క్షణంలో వెయ్యో వంతు కాలంలో మనం ఎవరినైనా, ప్రపంచంలో ఎక్కడున్నా కలవవచ్చు.


కేరళలో సామాజిక, రాజకీయ పరిస్థితి ఏమిటి? సిపిఎం ప్రభుత్వం, పార్టీ ఇస్లామోఫోబియా కార్డ్ ప్లే చేస్తున్నారని మీరు ఒకసారి ఎత్తి చూపారు. అది నిజమేనా? వివరించగలరు.

నిజమే. ఇస్లామోఫోబియాను రాజకీయ వైఖరిగా సిపిఎం తీసుకోవటం మొదలుపెట్టింది. పోయిన పార్లమెంటరీ ఎన్నికల్లో అవమానకర ఓటమి తరువాత ఇది ప్రారంభం అయింది. బీజేపీ సైతం ఒక పార్లమెంటు సీటును దక్కించుకొని, 15 అసెంబ్లీ సీట్లలో మొదటి స్థానంలో ఉండింది. ఇది సీపీఎం పార్టీని కలత పెట్టింది. ఎప్పటి నుండో సాంప్రదాయకంగా, విధేయులుగా ఉన్న ఎళవ ఓటర్లు తమను దూరం పెడుతున్నారని సిపిఎం పార్టీ భావించింది. ముస్లిమ్స్ ను ఒక సమూహంగా దుష్టులుగా చిత్రీకరించటం ద్వారా వాళ్ల ఓట్లు కూడగట్టుకోవచ్చునని వాళ్లు భావించారు.

ఇలా భావించటం క్షణిక ప్రతిస్పందన అని, దానికి ఎలాంటి గట్టి తర్కం లేదని అనుకొంటాను. తాము నడిపిస్తున్న ఇస్లామోఫోబియా రాజకీయాలు బీజేపీ బలపడటానికి ఉపయోగపడుతున్నాయని వాళ్లు మర్చిపోతున్నారు. సీపీఎం ఈ రాజకీయాలను కొనసాగిస్తే కేరళ రాజకీయాల్లో తాను రెలవెన్స్ ను కోల్పోవడమే కాదు, రాష్ట్రంలో ప్రధాన శక్తిగా బీజేపీ రావడానికి దారి ఇచ్చినట్లు అవుతుంది.   

రాష్ట్ర చరిత్రలో వరుసగా రెండోసారి గెలిచి రికార్డు బ్రేక్ చేసినప్పటికీ, కేరళలో ఉన్నది డెమాక్రటిక్ ప్రభుత్వమేనా? రాష్ట్రంలో సిపిఎం భవిష్యత్ ఏమిటి? బెంగాల్ నుండి, త్రిపుర నుండి వాళ్లు గుణపాఠాలు తీసుకొన్నారా?

కేరళలో ఇంకా ప్రజాస్వామిక ఆవరణ ఉన్న మాట వాస్తవం. ఇక సిపిఎం భవిష్యత్ విషయానికి వస్తే ఈ ప్రశ్నకు నేను గత ప్రశ్నలోనే సమాధానం ఇచ్చాను.

సర్వస్వతంత్ర జర్నలిస్టులకు మీ సందేశం ఏమిటి? ముఖ్యంగా యువతకు?

న్యాయం దృష్టితో నీకు తోచింది నువ్వు చెయ్యి. ఏది ఏమైనా న్యాయం కోసం నిలబడు.

Znet ను కౌంటర్ కరెంట్స్ ఆదర్శంగా తీసుకున్నదని చెప్పాను. అప్పటి Znet సంపాదకుడు మైకల్ ఆల్బర్ట్ ఇప్పుడు కౌంటర్ కరెంట్స్ లో ప్రచురించడానికి వ్యాసాలు పంపుతారు. జీవిత చక్రం పూర్తి అయింది.

ఈ కథ నీతి ఏమిటంటే కాపీ రైట్ అనే పనికిమాలిన సంగతిని పట్టుకొని వేలాడవద్దు. మనం సమాజాన్ని మార్చడానికి ఇక్కడ వున్నాము. నీ వ్యాసాలను, వీడియోలను, ఫోటోలను, ఇంకా ఏవైనా నువ్వు తయారు చేసిన సృజనను -ఎన్ని వేదికలు వీలైతే అన్ని వేదికల ద్వారా అందరికీ పంచు.

భారతీయ ప్రత్యామ్నాయ మీడియా విషయంలో ఇక్కడే నేను నిరుత్సాహపడతాను. కోతి అరటిపండును వదలనట్లు వీళ్లు విషయాన్ని అందరికీ వదలరు. కొంతమంది తమ వ్యాసాలను పే వాల్స్ కింద వుంచుతారు. ఇది సమాజాన్ని మార్చే విధానం కాదు.

ఈ ప్రభుత్వాన్ని మార్చాలి, ఆ ప్రభుత్వాన్ని మార్చాలి అని కాదు – కౌంటర్ కరెంట్స్ మొత్తం వ్యవస్థను మార్చాలని పని చేస్తుంది. వ్యవస్థ మారాలంటే మనకు సంఘీభావం వుండాలి. Melanie Kaye/Kantrowitz అన్నట్లు ‘ప్రేమకు రాజకీయ రూపమే సంఘీభావం’.

(Times Headlines సౌజన్యంతో)

స్వస్థలం ఒంగోలు. ప్రస్తుతం గుంటూరు ప్రభుత్వ మహిళా పాలిటిక్నిక్ కాలేజీలో ఎలక్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ బ్రాంచ్ హెడ్ ఆఫ్ సెక్షన్ గా పని చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు. 'మాతృక' బాధ్యతలు చూస్తున్నారు.

One thought on “ప్రేమకు రాజకీయ రూపమే సంఘీభావం: బినూమాథ్యు

  1. ఇంటర్వ్యూ ఆసక్తి కరంగా ఉంది. కేరళ కేంద్రంగా బిను మాథ్యూ చేస్తున్న విలువైన కృషి గురించి చాలా విశేషాలు తెలిశాయి.

Leave a Reply