ప్రేమకు ఎన్నో కారణాలు, అన్ని అడ్డంకులు

ప్రేమ అనేది రెండు అక్షరాల పదమే కావచ్చు, కానీ అది రెండు మనసులకు సంబంధించినది. ప్రేమ ఎప్పుడు పుడుతుందో, ఎలా పుడుతుందో చెప్పలేము. కానీ క్షణ కాలాల్లో, వ్యవధిలో పుట్టవచ్చు. ఇలా ఎప్పుడు అని నిర్దిష్టంగా ఎవరు చెప్పలేరు. ప్రేమకు సమయం అంటూ ఏమీ ఉండదు. ప్రేమకు హెచ్చు తగ్గులు, కులం, రంగు, ప్రాంతం అంటూ బేధం లేదు. రెండు మనసులు మూగ భాష ప్రేమ అని కొందరు అంటుంటారు. అలా ప్రేమను మనం అర్థం చేసుకోవాలంటే ప్రేమలో పడిన వాళ్ళకే ఎక్కువ తెలుస్తుంది. మనం నిత్యం మన చుట్టున్న సమాజంలో ఎన్నో రకాల ప్రేమలను మనం చూస్తూనే ఉన్నాం. అలాంటి ప్రేమలను మనం ఒక్కదగ్గరగా చూడవచ్చు. అదే రచయిత సతీష్ చందర్ రాసిన “లవ్ ఎట్ డస్ట్ సైట్” పుస్తకంలో నూటొక్క ప్రేమ కథల పుస్తకం ఇది. ఈ పుస్తకంలో నేటి సమాజంలోని మనుషులతత్వంలో ఉన్న ప్రేమలను రచయిత మనకు తెలియజేస్తాడు.

మనం ముందుగా “లవ్ ఎట్ డస్ట్ సైట్” పుస్తకం గూర్చి మాట్లాడాలనుకున్నప్పుడు రచయిత సతీష్ చందర్ గూర్చి మనం మాట్లాడాలి. రచయిత ఒక సీనియర్ జర్నలిస్టు. సుదీర్ఘ కాలంగా తాను విశ్వసిస్తున్న భావజాలంతో పనిచేస్తున్నారు. జర్నలిజం అంటే ప్రజలకు సత్యాలను తెలియజేయాలని ఈ సమాజంలోని లోతుపాతుల్ని తన కలంతో కడిగేస్తున్నాడు. అంతే కాకుండా సామాజిక చైతన్యంతో సామాజిక బాధ్యతను తలకు ఎత్తుకుని రచన రంగాన్ని ఆవాహనం చేసుకున్నాడు. తాను పనిచేసే రంగంలో ఉన్న పరిమితిలో ప్రశ్నించిన గానీ, తన రచనల ద్వారా ఈ సమాజానికి ఒక చైతన్య ధారను అందిస్తున్నాడు. ఈ వ్యవస్థ నాలుగు పాదాల మీద నడుస్తున్నదనేది నగ్న సత్యం. ఆ నాలుగు పాదాల్లో ఒక్కటైన జర్నలిజం కూడా ఒకరి అజమాయిషీలో ఉంటే ఇంకెక్కడి న్యాయం.? ఈ సమాజంలో ప్రజలకు అందుతుంది.!? జర్నలిజం అంటే జనాలను మెల్కోల్పాలి. వారికి ఒక తొవ్వను చూపే విధంగా ఉండాలి. అలా అని పరితపించిన రచయిత సతీష్ చందర్ జర్నలిజం కాలేజీని స్థాపించారు. ఈ సమాజంలో తన వంతు పాత్రగా నిరంతరం కృషి చేస్తున్నారు. “డా||బి. ఆర్. అంబేడ్కర్ అన్నట్లుగా పేబ్యాక్ టూ సొసైటీ ” వాక్యాన్ని రచయిత తన పద్దతుల్లో తాను ఈ సమాజం కోసం పాటుపడుతున్నారు. తెలుగు నేలకు రచయిత సతీష్ చందర్ తెలియని వారు కాదు.

ప్రపంచీకరణ విధానాలు సకల రంగాలను కుదేలు చేశాయి. అందులో మానవ జీవన విధానంలో పెను మార్పులు వచ్చాయి. మనిషిని మనిషిగా గుర్తించే విధానం పూర్తిగా పోయింది. డబ్బే ప్రధాన సాధనంగా మారింది. ఇంకెక్కడి స్వచ్ఛమైన బంధాలు, బాంధవ్యాలు. భువిపై ప్రేమ లేని జీవమంటు లేదు. అలాంటి క్రమంలోనే రచయిత “లవ్ ఎట్ డస్ట్ సైట్ “పుస్తకం మనకు కనబడుతుంది. ఈ పుస్తకంలో కథలను మనం తొమ్మిది భాగాలుగా చూడవచ్చు. మొత్తం 101 ప్రేమ కథల పుస్తకం. రచయిత ఈ కథలను ఎక్కువగా పొడిగించలేదు. కేవలం పేజీ పేజిన్నర లోపే కథలను ముగించాడు.

రచయిత సతీష్ చందర్ మనకు లవ్ ఎట్ డస్ట్ సైట్ కథల పుస్తకం ద్వారా సూటిగా స్పష్టంగా విషయాలను చెప్పదలచుకున్నాడు. ప్రపంచీకరణ ప్రభావం మానవ జీవన ప్రక్రియను ఎంత ధ్వంసం చెయ్యాలో అంత చేసింది. ఆ క్రమంలోనే మానవ జీవన విధానం అనేది చాలా భారంగా సాగుతుందంటాడు. మనిషి జీవితంలో ప్రేమ ఒక భాగంగా ఉంటుంది. అలాంటి ప్రేమకు ఎన్నో కారణాలు ఉంటాయి. అలా అని అన్ని ప్రేమలు సులభంగా ప్రేమించుకొని కథ సుఖాంతం కాలేవు. ఆ ప్రేమలకు అడ్డంకులు ఉంటాయి. ప్రధానమైన అడ్డంకి కులం. నేటి ఈ వ్యవస్థలో కులం దడి గట్టుకొని ఉన్నది. కులం కోరల్లో ఎందరో తమ నూలు వెచ్చటి జీవితాన్ని పరువు హత్యల పేరు మీద ప్రాణాలు కోల్పోయారు(చంపబడ్డారు). ఇక్కడ కులంతో రంగు ముడి వేసుకుంది. ద్రవిడ జాతి సంతతికి నలుపే అకార వర్ణం. ఆర్య జాతి వలస జాతి. మేక తోలు కప్పుకున్న పులిలాగా వర్ణ రంగు పులిమి హత్యలు జేసిన నేలలో ఎందరో తమ జీవితాలను కోల్పోయారు. ఈ సమాజం ప్రేమకు అడ్డు గోడలను కాంక్రీట్ సిమెంట్ తో బలంగా నిర్మించింది. ఎన్ని గోడలు కట్టిన ప్రేమ అనేది ఒక నిత్య సత్యం. అది వసంతమయి చిగురిస్తుంది, సూర్యోదయమై ప్రకాశిస్తుంది. పండు వెన్నెలయి పరవశిస్తుంది. జీవనదిలాగా పారుతుంది.

అయితే మనం లవ్ ఎట్ డస్ట్ సైట్ పుస్తకంలో ఉన్న తొమ్మిది భాగాల కథలు – తొమ్మిది స్టేజీలుగా అనుకోవచ్చు. ఆయా సందర్భాను సారకంగ ప్రేమలు ఆయా స్థల కాలాల్లో జరిగినట్టుగా మనకు అర్థం అవుతుంది. అయితే ప్రధానంగా ఈ పుస్తకంలో రచయిత రాసిన దాంట్లో మార్కెట్ సైట్ లో ప్రపంచీకరణ ప్రభావం వలన ఈ సమాజమంతా మార్కెట్ వలయంలో మునిగి తేలుతుంది. క్రైమ్ సైట్ లో సమాజంలో ప్రేమ పేరుతో జరుగుతున్న దాడులు ఎలా ఉన్నాయో అణు ప్రేమ కథ ద్వారా అర్థం అవుతుంది

క్యాస్ట్ సైట్ అందరిని ఆకట్టకుంటుంది. ఎందుకంటే ఈ సమాజంలో కులం ఎంత ప్రబలంగా ఉందో మనకు తెలుపుతుంది. ప్రేమ పంచాంగం కథ చదివితే ఇట్టే తెలిసిపోతుంది. ప్రేమకు కులాలు అంటగట్టుతు మొగ్గలోనే ప్రేమలను తుంచుతున్న సమాజం మనది.

డస్ట్ సైట్: ఇందులో మనకు సమాజంలో చీకటి బతుకుల జీవితాలు ఎలా ఉంటాయో, వారి జీవితాల్లో అల్లుకున్న ప్రేమలు ఏ విధంగా ఉంటాయో మనకు రచయిత తెలియజేస్తాడు.

క్యాంపస్ సైట్:

చదువుతున్న రోజుల్లో చదువుతో పాటు ప్రేమకు దారులు పడతాయి. చదువు ఏ స్థాయిలో ఉంటుందో ప్రేమకు అదే స్థాయి ఉంటుంది. ఇక్కడ హెచ్చుతగ్గులు స్పష్టంగా కనిపిస్తాయి.

వెడ్డింగ్ సైట్:
ప్రేమ పెండ్లి హా..? పెద్దల పెండ్లి నా..? పెండ్లి అయ్యాక ప్రేమ చనిపోతుందనేది మనం ఈ సైట్ లో చూడవచ్చు.

ఆఫీస్ సైట్:

నేడు ప్రపంచమంతా టెక్నాలజీ తో పోటీ పడుతున్న కాలం. ఈ తరుణంలో ప్రేమకు సమయం ఎక్కడ ఉంటుంది. ఆఫీస్ తప్ప.? ఆఫీస్ లో పడ్డ ప్రేమ కంప్యూటర్ తో మాట్లాడుకోవడం లాంటిదే అన్నట్లుగా మారింది. ఈ కొలమానపు కొలబద్దను మనకు రచయిత తెలియజేస్తాడు.

పబ్ సైట్:. వీకెండ్ పార్టీలతో మనసులో బాధలను మాన్పుకోవడాని కోసం కలుస్తున్న చోట క్షణంలో పుట్టిన ప్రేమ క్షణంలో గిట్టిన తీరును మనం గమనించవచ్చు.

బ్రేకప్ సైట్: ప్రేమ ఎప్పుడు పుట్టి ఎప్పుడు గిడుతుందో తెలియదు.ఇద్దరి మధ్యలో ఉన్న ప్రేమ చివరి వరకు ఉండచ్చు , ఉండక పోవచ్చు. అదే మనం ఈ సైట్ లో చూడవచ్చు.

అయితే రచయిత ఇన్ని రకాల ప్రేమ సైట్లను మన ముందు వుంచాడు. అది రచయిత తన నిబద్దతతో ఎక్కడ తొనకకుండా సమాజంలోని అంశాలనే ఆధారం చేసుకొని ఈ కథలను రాశారు. మనం ఎప్పుడు ఒకటే గుర్తు పెట్టుకొలి. ప్రేమ ఎప్పుడయిన ప్రేమనే అది నిన్న – నేడు – రేపు ఎప్పటికీ.

అలాంటి ప్రేమకు కులాలు,జాతి, రంగు, ఇలాంటి బేధాలు అంటగట్టి హత్యలు, దాడులు, హింసలకు ప్రేరేపిస్తున్న చోట ప్రేమ ప్రశ్నించే ఒక కవచం కావాలి. సమాజ మార్పులో ప్రేమ ఒక భాగం అని ఈ సమాజం గుర్తెరగాలి.

పుట్టిన ఊరు సిద్ధిపేట, పూర్వపు మెదక్ జిల్లా.  కవి, రచయిత, విరసం సభ్యుడు. ఎమ్మెస్సీ(భౌతికశాస్త్రం) చదివారు.  విద్యార్థి ఉద్యమ నాయకుడిగా విద్యార్థి సమస్యలపై పోరాటం చేస్తున్నారు. వివిధ పత్రికల్లో కవిత్వం, వ్యాసాలు, పాటలు ప్రచురితమయ్యాయి. రచనలు: వసంత మేఘం(కవిత్వం)

 

 

 

Leave a Reply