ప్రవాహం

ఈ గడ్డ మీద తెగిపడిన శిరస్సులు
ఏ నెత్తుటి పూలై పుష్పించాయో
మాతృభాషలో ఏ మనుషుల మంచిని ఘోషించాయో

ఈనాడు తెలుగు నాడు లో
అడుగడుగునా ఏ అడుగులు
ముందడుగు వేస్తున్నాయో

ఈ మట్టిలోని పుట్టెడు మాణిక్యాలు
ఏ కాంతి కరదీపికలై
ఆత్మార్పణ చేస్తున్నాయో

శ్రమ జీవుల సౌభాగ్యానికి
ఏ గుండెలు జలపాతాలై
ఎగిరి ఎగిరి పడుతున్నాయో

ఆ గుండెలు స్పందించని సంస్కృతి
ఏ దోపిడీ
ఏ గారడి జేబు బొమ్మ
వారు లేని సాహిత్యం
ఏ దొంగల
ఏ వ్యాపారుల ఖాతా గ్రంథం
వారు లేని కళలు
ఏ ద్రోహుల
ఏ హంతకుల అంతరంగాలు

ఉదయం కేసి తుపాకులు పేల్చి
ఉసూరు మంటున్నారు
అయ్యో పాపం వెర్రివాళ్లు
సూర్యుణ్ణి ఉరితియ్యాలని చూస్తున్నారు

సాంస్కృతిక రంగం మీద చెయ్యేసి
ఎరుపు చెరిపెయ్యాలని
ఉత్సవాలు జరిపి ఊరేగుతున్నారు.

వెన్నుపూసలో వారి కళ్ళు
శవం వారి పతాకం
గతం వారి ఆయుధం
సహజీవనం వారి నినాదం
సన్మానాలతో ముగుస్తుంది తతంగం

చరిత్ర మా చేతుల్లో వికసిస్తుంది.
మనసారా మేం సంఘర్షణలు ఆహ్వానిస్తాం
శ్రమజీవికి పట్టం గడతాం

సంస్కృతి మాకు మత్తుమందు కాదు
మందుగుండు
పండుగ కాదు
ప్రవాహం

పైపూత ప్రదర్శన కాదు
కూడు గుడ్డ నీడ
తల మీద కిరీటం కాదు
మా ప్రాణం

అస‌లు పేరు బ‌ద్ధం భాస్క‌ర్‌రెడ్డి. పేద రైతు కుటుంబంలో పుట్టాడు. హైద‌రాబాద్‌లో ఉపాధ్యాయుడిగా ప‌నిచేశాడు. ఆరుగురు దిగంబ‌ర క‌వుల్లో ఒక‌రు. 'న‌న్నెక్క‌నివ్వండి బోను'తో క‌వితాకాశంలో సూర్యుడిలా పొడుచుకొచ్చాడు. విర‌సం వ్య‌వ‌స్థాప‌క కార్య‌వ‌ర్గ స‌భ్యుడు. 1971-72లో విర‌సం కార్య‌ద‌ర్శిగా ప‌నిచేశాడు. శ్ర‌మ‌జీవుల జీవితాల‌పై ఎన్నెన్నో పాట‌లు రాశాడు. విర‌సం మీద ప్ర‌భుత్వం బ‌నాయించిన సికింద్రాబాద్ కుట్ర‌కేసులో ముద్దాయి. క‌వితా సంపుటాలు: 'దిక్సూచి', 'ముట్ట‌డి', 'గ‌మ్యం', 'జ‌న్మ‌హక్కు'. న‌వ‌ల‌లు: ప్ర‌స్థానం, మా పల్లె. గంజినీళ్లు(నాటిక‌), చిరంజీవి, మ‌రికొన్ని క‌థ‌లు రాశారు. . ప్ర‌భుత్వం చెర‌బండ‌రాజుని నిరుద్యోగానికీ, అనారోగ్యానికీ గురిచేసి బ‌లితీసుకుంది. మెద‌డు క్యాన్స‌ర్‌తో మ‌ర‌ణించాడు.

 

Leave a Reply